ఎం కోటేశ్వరరావు
గురువుగారూ నాకెందుకో భయంగా ఉంది, సెలవిమ్మంటారా ?
భయమెందుకు చెప్పు శిష్యా !
తెల్లవారు ఝామున బెడ్ కాఫీ, ఉదయం ఉపాహారం సమయంలో, ఇప్పుడు మధ్యాహ్నభోజన సమయం. అప్పటి నుంచి చూస్తున్నాను. కాసేపు మీలో మీరే నవ్వుతారు, అంతలోనే విషాదంగా ఉంటారు … నాకెందుకో భయంగా ఉంది…. కొంపదీసి వేయించుకున్న కరోనా వాక్సిన్ వికటించలేదు కదా !
వాక్సిన్ వికటించటమా ! అలాంటిదేమీ ఉండదని నిర్ధారించుకున్న తరువాతే కదా మన ప్రధాని నరేంద్రమోడీ వేయించుకున్నారు…. మనమేమైనా తక్కువ తిన్నామా… మరో ఇరవై రోజులు చూసి కదా వేయించుకున్నాము….. అయినా వాక్సిన్ ఇహలోక భక్తుల కోసం తప్ప మనకెందుకు శిష్యా ! కరోనా కాదు కదా మరే మహమ్మారి మనలను దరిచేరదు. మన మహిమ నీకు తెలియదా !
తెలుసు గురువా తెలుసు రోజూ నేను చేస్తున్న ప్రచారం అదే కదా ! అంత మహిమ ఉన్నవారికి వాక్సినెందుకు అని ఎవరైనా అంటే….. ?
బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులందరూ దేవతలే అయినా అన్నీ తెలిసినా వారు కూడా మానవుల మాదిరి వ్యహరించలేదూ ! ఎందుకంటావ్ ! మానవుల కోసమే. ఇప్పుడు ప్రతివారూ కరోనా గురించి భయపడుతున్నారు. దేవుడే దిగివచ్చినా వాక్సిన్ వేయించుకోకపోయినా అనుమానంగా చూస్తారు. అందువలన మనమెంత ! భక్తుల భయం తీర్చేందుకు ఆ లీలా మానుషుడి విలాసంలో మనం కూడా పాత్రధారులమే గనుక చిన్న స్వాములమైనా పెద్ద స్వాములమైనా వేయించుకుంటున్నాం శిష్యా !
అయితే సరే గురువా ? సందేహం తీరలేదు… మరి ఆ నవ్వు….. దాని వెనుక ఆ విషాదం సంగతి సెలవిచ్చారు కాదు !
ఏం చెప్పమంటావు నాయనా ప్రపంచ సంతోష నివేదిక 2021 వివరాలు చూసిన దగ్గర నుంచి నాకు తెలియకుండానే అలా అవుతోంది శిష్యా ! అదుపు చేసుకుందామంటే కుదరటం లేదు !
ఆ నివేదికలో ఏముంది గురువా ! నవ్వు దేనికి వస్తోంది, విషాదం దేనికి కలుగుతోంది !!
మన దేశ స్ధానం అత్యంత దిగువన ఉన్నందుకు విషాదం….మన పొరుగుదేశాలు మనకంటే మెరుగ్గా ఉన్నందుకు సంతోషం కలుగుతోంది శిష్యా !
అదేంటి గురువా ! ఎదుటి వారు సంతోషంగా ఉంటే ఏడవటం లోకం తీరు, అందునా ఇప్పటి దేశభక్తి కదా !! మీరు దానికి భిన్నంగా ఉండటం ఆశ్చర్యంగా ఉందే ! అసలు విషయం ఏమిటో చెప్పండి గురువు గారూ !
ప్రపంచ సంతోష నివేదిక 2021ప్రకారం 149 దేశాల్లో మనది 139వ స్దానంలో ఉంది. మాననీయ ప్రధాని నరేంద్రమోడీ అధికారానికి రాకముందు 2013లో ప్రకటించిన నివేదిక ప్రకారం 156 దేశాల్లో 111వ స్ధానంలో ఉన్నాం. ఏలినాటి శని పట్టకపోతే ఏడేండ్లలో రాంకు ఇలా దిగజారటం ఏమిటి చెప్పు ! దాన్ని నాకు విషాదం గాక ఎలా వినోదించగలను ? దేన్నయినా వినోదించటానికి నేనేమీ మోడీ భక్తుడిని కాదు కదా ! పోనీ ఏ మనోభావాలు కనపడకుండా నిబ్బరంగా ఉండటానికి మనమేమన్నా ప్రధాని నరేంద్రమోడీనా నాయనా ?
మీరు, నేను సామాన్యులం గనుక మనల్ని మనం చూసుకొని భోరుమంటాం కేరు మంటాం మనిష్టం. మరి సంతోషం సంతోషంతో చిద్విలాసం సంగతేంటి గురూజీ ?
ఈ రోజుల్లో అదీ ఆలోచించాల్సిందే శిష్యా ! మనమా సర్వేజనా సుఖినోభవంతు పరంపరలో ఎదిగిన వారం. దానిలో భాగంగానే మనకు దరిద్రం పట్టుకున్నా చుట్టుపక్కల వారు సంతోషంగా ఉన్నందుకు సంతోషించాను. అంతే తప్ప వేరే దురుద్దేశ్యం లేదు !
నిజమే గురువా నేను ఎప్పటి నుంచో మీ శిష్యరికం చేస్తున్నా ! గత ఏడు సంవత్సరాల నుంచి వసుధైక కుటుంబం-అందరం ఒకటే – సర్వమతాలూ సమానమే అనే పదాలనే మీరు పక్కన పెట్టేశారు !
స్వర్గలోకంలో నరకం గురించి మాట్లాడితే ఫరవాలేదు గాని నాయనా నరకలోకంలో స్వర్గం గురించి మాట్లాడితే కుదురుతుందా చెప్పు ! మనం బాగుపడటం సంగతి పక్కన పెట్టి కాస్త ఖాళీ దొరికితే ఉన్నవాటిని తెగనమ్మటం, మిగతా సమయంలో తరువాత మన కేంద్రీకరణ అంతా ఇరుగుపొరుగు దేశాలను దెబ్బతీయటం మీదనే కదా ఉంది !
అదేమిటి గురువా మన శత్రుదేశాలను నాశనం చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉండేది… మీరేమో విదేశాలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. విదేశాలు పచ్చగా నిప్పులు పోసుకోవాల్సింది పోయి సంతోషం ప్రకటిస్తున్నారు !
శిష్యా నువ్వింకా రాజకుమారి ా అర్ధరాజ్యం కథల్లోనే కాలం గడుపుతున్నట్లున్నావు.మనకు పొరుగు దేశాలు ఎంత దూరమో వాటికీ మనమూ అంతేదూరంలో ఉంటాం. ఇద్దరి దగ్గరా అణ్వాయుధాలటా మన పురాణ బ్రహ్మ అస్త్రాలనైనా వెనక్కు తీసుకోగలంగాని ఒకసారి మీట నొక్కితే అవి అంతేనట ! మన ఇరుగుపొరుగువారి దగ్గర కూడా ఉన్నాయి గనుక వాటిని నాశనం చేస్తాం అనే పిచ్చి కలలు మానుకోవాలి.
వదిలేయండి గురువా గత ఏడు సంవత్సరాలుగా మన ఇరుగుపొరుగు వారిని దెబ్బతీసేందుకు మన జనాలను ఇబ్బంది పెట్టి దేశభక్తిని నవరంధ్రాలద్వారా నింపుతున్నాం. మనం ఇబ్బంది పడటం ఏమిటి వారు సంతోషంగా ఉండటం ఏమిటి ? పొంతన కుదరటం లేదు !
గత ఏడు సంవత్సరాలలో సంతోష సూచికలో చైనా 93 నుంచి 84వ స్దానానికి మెరుగుపరచుకుంది.బంగ్లాదేశ్ దరిద్రం గురించి చెప్పనవసరం లేదు.2013లో 108లో ఉంది. ఇప్పుడు 101కి మెరుగుపరచుకుంది. పాకిస్దాన్కు అమెరికా సాయం ఆపించాం, సర్జికల్ దాడులు చేశాం అయినా వారు సంతోషంగా ఉంటూ మనకంటే మెరుగైన 105వ స్దానంలో ఉన్నారు.అయితే 2013లో ఉన్న 81స్ధానం నుంచి దిగజారినా మనకంటే తక్కువే. శ్రీలంక 137 నుంచి 129కి పెంచుకోగా మయన్మార్ 121 నుంచి 126కు పడిపోయింది. ఎలా చూసినా మనకంటే మెరుగే, అందుకే వాటిని చూసి అభిమానపూర్వకంగా సంతోషం దానికి సూచనగా నవ్వు వస్తున్నది నాయనా !
గురువుగారూ ఒకదాని మీద ఒకటి ఏమిటీ ప్రపంచ సూచికలన్నింటా గత ఏడేండ్లలో ఈ దిగజారుడును అర్ధం చేసుకోలేకపోతున్నాను తలబద్దలౌతోంది. దేశం ఎటుపోతోంది.
అందుకే వచ్చే ఎన్నికల నాటికి మంచి నినాదం తట్టకపోతుందా, ఏదో ఒక ఘటన జరగకపోతుందా అని మన ప్రధాని నరేంద్రమోడీగారు నిమురుకుంటూ మధనం చేసేందుకు గడ్డాన్ని పెంచుతున్నారు కదా త్వరలో ఫలితం వస్తుందేమో చూద్దాం.
అంతేనా ! అంతకంటే మార్గం లేదా !!
ఇదిగో శిష్యా మనం ఏకాంతంలో ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం ! భక్తులు వస్తున్నట్లున్నారు. నోస్ట్రోడోమస్ జోశ్యాల వందవ ప్రింటు, నరేంద్రమోడీ సుభాషితాలు, ఉపన్యాసాల, పొగడ్తల వంటివి దుకాణంలో ఉన్నాయోలేదో చూడు. వెంటనే నమో మోడీ సీడి రికార్డు ఆన్ చేయి. ప్రతి టీవీలోనూ మోడీ బొమ్మ కనపడేట్లు చేయించు. భక్తులకు ఆగ్రహం కలిగితే మనకే నష్టం ! శుభం మధ్యలో అశుభం వినపడకూడదని శాస్త్రాలో ఘోషిస్తున్నాయి. అందుకే మంగళవాద్యాలను పెద్దగా వినిపిస్తారు. ఇప్పుడు మోడీ గారీకి అంతే ! శుభం పక్కనే అశుభం కూడా కాచుకు కూర్చుంటుంది గానీ చెప్పాల్సి వచ్చినపుడు ముందుగా చెప్పాల్సింది శుభాలే, జనానికి అశుభాలు అనుభవంలోకి వచ్చినపుడే మనం వాటి చిట్టా విప్పాలి. అందుకే కొత్తగా ప్రెస్ నుంచి వచ్చిన ఆ పుస్తకాలను పొరపాటున కూడా అప్పుడే బయటపెట్టవద్దు !