• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: INDIA

టిబెట్‌ అరచేయి -ఐదువేళ్లు-అఖండ భారత్‌ పగటి కలలేనా ?

07 Tuesday Jul 2020

Posted by raomk in BJP, CHINA, Congress, COUNTRIES, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

Akhand Bharat, China, Dalai Lama, Five fingers of Tibet, INDIA, Tibet


ఎం కోటేశ్వరరావు
సామాజిక మాధ్యమంలోనూ, సాంప్రదాయ మీడియాలోనూ కొన్ని సమస్యల మీద వెల్లడిస్తున్న అభిప్రాయాలూ, సమాచారమూ జనాలను తప్పుదారి పట్టించేదిగా ఉందా ? ఎందుకు అలా చేస్తున్నారు ? దాని వలన ఒరిగే ప్రయోజనం ఏమిటి ? కొంత మంది భిన్న ఆలోచన లేకుండా ఎందుకు నమ్ముతున్నారు ? జనం మెదళ్ల మీద ప్రచార యుద్ధం జరుగుతోందా ? విజేతలు ఎవరు ? వారికి కలిగే లాభం ఏమిటి ? ఇలా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలు ! అన్నింటినీ తీర్చటం సాధ్యం కాదు. కొన్ని అంశాలను పరిశీలించుదాం.
కమ్యూనిజం గురించి జనంలో భయాలను రేపితే దానివైపు అమెరికన్‌ కార్మికవర్గం చూడదనే అభిప్రాయంతో అక్కడి పాలకవర్గం కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారదాడిని ఒక ఆయుధంగా చేసుకుంది. దాని దెబ్బకు అనేక మంది కోలుకోలేని మానసిక వికలాంగులయ్యారు. అయితే కాలం ఎల్లకాలమూ ఒకే విధంగా ఉండదు. ” కొంత మందిని మీరు వారి జీవితకాలమంతా వెర్రివాళ్లను చేయగలరు, అందరినీ కొంత కాలం చేయగలరు, కానీ అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు” అని అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ చెప్పారు. ప్రస్తుతం మన దేశంలో వివిధ అంశాలపై జరుగుతున్న ప్రచారానికి, పాలకులకు ఇది వర్తిస్తుందా ?
మన దేశ చరిత్ర గురించి చెబుతూ ఎప్పుడైనా పొరుగుదేశం మీద దండెత్తిన చరిత్ర ఉందా అడుగుతారు. మనకు తెలిసినంత వరకు అలాంటి చరిత్ర లేదు. అదే సమయంలో ఇరుగు పొరుగుదేశాలతో స్నేహంగా ఉండటం తప్ప పాలకులు ఇప్పటి మాదిరి విద్వేషం రెచ్చగొట్టిన చరిత్ర కూడా లేదు. మిత్రులుగా ఉండేందుకు అవరోధంగా ఉన్న సమస్యల పరిష్కారం కంటే వాటి మీద నిత్యం ద్వేషాన్ని రెచ్చగొట్టటం, అదే అసలైన దేశభక్తి అని ప్రచారం చేయటం , నరేంద్రమోడీ ఏమి చేసినా సరైనదే, బలపరుస్తాం అనే వెర్రిని జనాల మెదళ్లలోకి ఎక్కించి బిజెపి తాత్కాలికంగా లబ్ది పొందవచ్చు. కమ్యూనిస్టు నేత లెనిన్‌ ” ఏ పదజాలం వెనుక ఏ ప్రయోజనం దాగుందో తెలుసుకోనంత కాలం జనం మోసపోతూనే ఉంటారు ” అని చెప్పారు. అయన కంటే ఎంతో ముందు వాడైన అబ్రహాం లింకన్‌ చెప్పినట్లు అందరినీ అన్ని వేళలా వెర్రివాళ్లను చేయలేరు.
” చైనా కుడి చేతి అరచేయి టిబెట్‌ . లడఖ్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌, అరుణాచల ప్రదేశ్‌ దాని అయిదు వేళ్లు, వాటిని విముక్తి చేయాలని చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్‌ చెప్పారు ” అన్నది ఒక ప్రచారం. వాస్తవం ఏమిటి ? మావో జెడాంగ్‌ ఆ విధంగా చెప్పిన దాఖలాలు గానీ, కమ్యూనిస్టు చైనాలో అధికారిక చర్చ జరిగినట్లుగానీ ఎలాంటి ఆధారాలు లేవు. అయితే ఇది ఎలా ప్రచారం అయింది ?
క్రీస్తు పూర్వం 221లో ప్రారంభమైన చైనా క్విన్‌ రాజరిక పాలన నుంచి 1912వరకు సాగిన పలు రాజరికాలు నేపాల్‌, సిక్కిం,భూటాన్‌ తమ టిబెట్‌లో భాగమే అని భావించాయి. 1908లో టిబెట్‌లోని చైనా రాజప్రతినిధి నేపాల్‌ అధికారులకు పంపిన వర్తమానంలో నేపాల్‌ మరియు టిబెట్‌ చైనా అశీస్సులతో సోదరుల్లా కలసి పోవాలని, పరస్పర ప్రయోజనం కోసం సామరస్యంగామెలగాలని, చైనా, టిబెట్‌, నేపాల్‌, సిక్కిం, భూటాన్‌లు పంచరంగుల మిశ్రితంగా ఉండాలని, బ్రిటీష్‌ వారిని ఎదుర్కోవాలని పేర్కొన్నాడు. ఇది బ్రిటన్‌ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొనేందుకు ముందుకు తెచ్చిన ఒక అంశం, చైనా ప్రభువుల వాంఛకు ప్రతిబింబం అని కూడా అనుకోవచ్చు. దానిని ప్రస్తుతం చైనాకు వర్తింప చేస్తూ ప్రచారం చేయటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అయితే మరి మావో జెడాంగ్‌ రంగంలోకి ఎలా తెచ్చారు ?
ఇక్కడ అఖండ భారత్‌ గురించి చెప్పుకోవటం అవసరం. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా మన జనాన్ని సమీకరించేందుకు నేను సైతం అన్నట్లుగా అనేక మంది తమ భావజాలం, నినాదాలతో ముందుకు వచ్చారు. వాటితో అందరూ ఏకీభవించకపోవచ్చు గానీ అదొక వాస్తవం. దానిలో ఒకటి అఖండ భారత్‌. దీనికి అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిమాలయాల నుంచి హిందూ మహా సముద్ర ప్రాంతంలోని దీవులు, ఆఫ్రికా ఖండం, మధ్య ఆసియా, మధ్య ప్రాచ్యం, అస్త్రాలయ(ఆస్ట్రేలియా) ప్రాంతంలోని అనేక దేశాలలోని భాగాలతో కూడినది అఖండ భారత్‌ అన్నది ఒకటి. ఈ ప్రాంతంలోని ఇప్పటి దేశాల పేర్లు పేర్కొనాల్సి వస్తే భారత్‌, ఆప్ఘనిస్తాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, పాకిస్ధాన్‌, టిబెట్‌, మయన్మార్‌, ఇరాన్‌,యుఏయి, బహరెయిన్‌, తుర్క్‌మెనిస్ధాన్‌, తజికిస్తాన్‌, లావోస్‌, కంపూచియా, వియత్నాం, థాయలాండ్‌, ఇండోనేషియా, బ్రూనె, సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌, మలేషియాలలోని కొన్ని ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. మహాభారతం, మరికొన్ని పురాణాల్లో అందుకు సంబంధించిన కొన్ని ప్రస్తావనల ఆధారంగా అలా చెప్పారు. ఇవన్నీ చరిత్రలో ఒక మహారాజ్యంగా ఉన్నాయటానికి ఆధారం లేదు గానీ మతపరమైన, సాంస్కృతిక అంశాలలో సారూపత్యల కారణంగా అలా పరిగణించారని చెప్పాలి. ఉదాహరణకు ఇండోనేషియా నేడు ముస్లిం దేశం, అయినా అక్కడి వారి పేర్లు ఎలా ఉంటాయో చూడండి. మాజీ దేశాధ్యక్షుడు సుకర్ణో(సుకర్ణుడు) ఆయన కుమార్తె మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణో పుత్రి.
మన స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఎలా ముక్కలు చేశారో చెప్పేందుకు కెఎం మున్షీ తొలిసారిగా అఖండ హిందుస్తాన్‌ అంశాన్ని ముందుకు తెచ్చారు. మన దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్‌ వారిని విమర్శించే సమయంలో మహాత్మాగాంధీ కూడా దాన్ని ఉదహరించారు. ఖాన్‌ సోదరుల్లో ఒకరైన మజహర్‌ అలీఖాన్‌ కూడా అఖండ హిందుస్తాన్‌ గురించి చెబితే ముస్లిం లీగు వ్యతిరేకించింది. స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా, జైలు జీవితాన్ని భరించలేక బ్రిటీష్‌ వారికి విధేయుడిగా మారిన హిందూమహాసభ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సావర్కర్‌ అఖండ భారత్‌తో పాటు హిందూ రాష్ట్ర భావనను కూడా ముందుకు తెచ్చారు. తరువాత సంఘపరివార్‌ ఏర్పాటు చేసిన సంస్ధలన్నీ ఇప్పటికీ ఈ భావనలను ప్రచారం చేస్తూనే ఉన్నాయి, అఖండ భారత్‌ ఏర్పాటు లక్ష్యంగా చెబుతున్నాయి. అది సాధించినపుడే నిజమైన స్వాతంత్య్రం అని ప్రచారం చేస్తాయి.1993లో సంఘపరివార్‌కు చెందిన బిఎంఎస్‌ తన డైరీ మీద ముద్రించిన చిత్రపటంలో పాకిస్ధాన్‌, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌,శ్రీలంక, థాయలాండ్‌, కంబోడియాలతో కూడిన అఖండభారత్‌ ప్రచురించినట్లు వికీ పీడియా పేర్కొన్నది. నరేంద్రమోడీ కూడా సంఘపరివార్‌కు చెందిన వ్యక్తే గనుక 2012లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సింధీల సభలో మాట్లాడుతూ పాకిస్ధాన్‌లో సింధు రాష్ట్రం ఒకనాటికి మన దేశంలో కలుస్తుందని సెలవిచ్చారు.2025 నాటికి పాకిస్ధాన్‌, టిబెట్‌లోని మానస సరోవరం తిరిగి మన దేశంలో కలుస్తుందని, లాహౌర్‌, మానసరోవర ప్రాంతాల్లో భారతీయులు స్ధిర నివాసం ఏర్పరచుకోవచ్చని, బంగ్లాదేశ్‌లో కూడా మనకు అనుకూలమైన ప్రభుత్వమే ఉన్నందున ఐరోపా యూనియన్‌ మాదిరి అఖండ భారత్‌ ఏర్పడుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ చెప్పారు.
1937 జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించారు. దాంతో చైనీయులు రెండో సారి జపాన్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పోరుసల్పారు. చాంగకై షేక్‌ నాయకత్వంలోని చైనా మిలిటరీతో పాటు లాంగ్‌ మార్చ్‌ జరుపుతున్న కమ్యూనిస్టు గెరిల్లాలు కూడా జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడారు. అయితే అనేక మంది యుద్ధ ప్రభువులు జపాన్‌కు లొంగిపోయారు. ఈ నేపధ్యంలో చరిత్రలో చైనా పొందిన అవమానాలను గుర్తుచేస్తూ జపాన్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని కమ్యూనిస్టు పార్టీనేతగా మావో చైనీయులకు చెప్పారు. ఆ సందర్భంగా చరిత్రను ప్రస్తావిస్తూ సామ్రాజ్యవాదులు చైనాను యుద్దాలలో ఓడించి అనేక సామంత రాజ్యాలను బలవంతగా చైనా నుంచి వేరు చేశారని, జపాన్‌ వారు కొరియా, తైవాన్‌,రైకూ దీవులు, పోర్ట్‌ ఆర్ధర్‌, పెస్కాడోర్స్‌ను, బ్రిటీష్‌ వారు బర్మా, నేపాల్‌, భూటాన్‌, హాంకాంగ్‌లను వేరు చేశారని, ఫ్రాన్స్‌ అన్నామ్‌(ఇండోచైనా ప్రాంతం)ను, చివరకు ఒక చిన్న దేశం పోర్చుగల్‌ చైనా నుంచి మకావోను స్వాధీనం చేసుకుందని మావో చెప్పారు. అంతే తప్ప ఎక్కడా ఐదువేళ్ల గురించి మాట్లాడలేదు. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాత వాటిని స్వాధీనం చేసుకుంటామని ఏనాడూ చెప్పలేదు. తైవాన్‌ చైనా అంతర్భాగమని ఐక్యరాజ్యసమితి గుర్తించింది, దాని మీద ఎలాంటి వివాదమూ లేదు. అయితే 1948 నుంచి అది తిరుగుబాటు రాష్ట్రంగా ఉంటూ అమెరికా అండచూసుకొని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా సామరస్య పూర్వకంగా విలీనం కావాలని చైనా కోరుతోంది తప్ప సైనిక చర్యకు పూనుకోలేదు.
అయితే నిప్పులేనిదే పొగ వస్తుందా ? రాదు.1954లో టిబెట్‌లోని చైనా అధికారులు మాట్లాడుతూ భారత సామ్రాజ్యవాదులు అక్రమంగా పట్టుకున్న సిక్కిం, భూటాన్‌, లడఖ్‌,నీఫా(నార్త్‌ ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ ఏజన్సీ-అరుణాచల్‌ ప్రదేశ్‌)ను విముక్తి చేయాలని చెప్పినట్లు, అదే ఏడాది 1840-1919 మధ్య సామ్రాజ్యవాదులు చైనా ప్రాంతాలను కొన్నింటినీ ఆక్రమించారంటూ రాసిన ఒక స్కూలు పాఠంలో లడఖ్‌, నేపాల్‌,భూటాన్‌, సిక్కిం, ఈశాన్య భారతాన్ని విముక్తి చేయాలని దానిలో రాసినట్లుగా చెబుతారు.1959లో చైనా జనరల్‌ ఝాంగ్‌ గుహువా టిబెట్‌ రాష్ట్ర రాజధాని లాసాలో మాట్లాడుతూ భూటానీలు, సిక్కిమీయులు, లఢకీలు టిబెట్‌ ఉమ్మడి కుటుంబంలో ఐక్యం కావాలని అన్నట్లు వార్తలు ఉన్నాయి. వీటిని ఎలా చూడాలి. అధికారికంగా అఖండ భారత్‌ గురించి ఎవరైనా మాట్లాడితే దాన్ని తీవ్రంగా పరిగణించుతారు. అందుకే ఆయా దేశాలు ఎన్నడూ మన దేశంతో దాన్నొక సమస్యగా చూడలేదు. మన మీద ద్వేషాన్ని రెచ్చగొట్టలేదు. చైనా నుంచి వేరు పడి స్వాతంత్య్రం కావాలని 1912కు ముందుగానీ తరువాత కమ్యూనిస్టులు అధికారానికి వచ్చేంత వరకు గానీ ఎన్నడూ టిబెట్‌లో ఉద్యమించిన ఉదంతాలు లేవు. అమెరికా జరిపిన కుట్రలో భాగంగా చైనాకు వ్యతిరేకంగా తిరుగుబాటును రెచ్చగొట్టిన నాటి నుంచి దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించి, ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తిరుగుబాట్లకు మద్దతు ఇచ్చిన గత కాంగ్రెస్‌ పాలకులు, ఇప్పటికీ టిబెట్‌ తురుపుముక్కను ఉపయోగించాలనే సంఘపరివార్‌ ఎత్తుగడలు కొనసాగుతున్నంత కాలం అటూ ఇటూ అలాంటి రెచ్చగొట్టే, వివాదాస్పద మాటలు వెలువడుతూనే ఉంటాయి. అధికారికంగా పాలకుల వైఖరి ఏమిటనేదే గీటురాయిగా ఉండాలి. అలా చూసినపుడు అఖండ భారత్‌ను ఎలా విస్మరించాలలో, టిబెట్‌ ఐదు వేళ్ల ప్రచారాన్ని కూడా అదేపని చేయాలి. కానీ సంఘపరివారం తన అజెండాలో భాగంగా ఐదువేళ్ల వార్తలను అధికారికమైనవిగా చిత్రించి చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకుంది. ఆ ప్రచారానికి కొట్టుకపోతే బుర్రలను ఖరాబు చేసుకోవటం తప్ప మరొక ప్రయోజనం లేదు.
చైనా ఆక్రమించుకుంటుంది అని చేస్తున్న ప్రచారంలో ఒకటైన సిక్కింను 1975లో మన దేశం విలీనం చేసుకుందని, తరువాత మన దేశ చర్యను చైనా అధికారికంగా గుర్తించిందని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి తెలియదా? తెలిసీ ఇంకా ఎందుకు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నట్లు ? దలైలామాను రెచ్చగొట్టి తిరుగుబాటు చేయించి మన దేశానికి రప్పించింది అమెరికా. తీరా చైనాతో సర్దుబాటు కుదరగానే ఆ పెద్దమనిషిని, టిటెటన్‌ తిరుగుబాటుదార్లను తాను వదలించుకొని మనకు అంటగట్టింది. తమ దేశానికి రావటానికి కూడా ఆంక్షలు పెట్టింది. టిబెట్‌ చైనాలో అంతర్భాగం కాదని మన దేశం ఎన్నడూ అధికారికంగా చెప్పలేదు. ఆ వైఖరిని తీసుకోలేదు. గత ఆరు దశాబ్దాలుగా వేలాది మంది టిబెటన్లు మన దేశంలో విదేశీయులుగా నమోదై ఉన్నారు తప్ప వారికి పౌరసత్వం ఇచ్చేందుకు గానీ, శరణార్ధులుగా గుర్తింపుగానీ ఇవ్వలేదు. అక్రమంగా టిబెట్‌ నుంచి తరలిస్తున్నవారిని అనుమతిస్తున్నది. అనేక చోట్ల వారికి నివాసాలను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించారు. సంఘపరివార్‌ కమ్యూనిస్టు వ్యతిరేకతను సంతుష్టీకరించటానికి తప్ప దలైలామాను నెత్తికి ఎక్కించుకొని మనం ఎందుకు వీరంగం వేస్తున్నామో, దాని వలన ప్రయోజనం ఏమిటో ఎప్పుడైనా, ఎవరైనా ఆలోచించారా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

” దేశభక్తి ” ట్రంప్‌ ఆకాశంలో…. మోడీ పాతాళంలోనా ! హతవిధీ !!

27 Saturday Jun 2020

Posted by raomk in BJP, CHINA, Congress, CPI(M), Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

#India-China border, China, Donald trump, INDIA, Narendra Modi, Trade Protectionism


ఎం కోటేశ్వరరావు
అవును ! శీర్షికను చూసి కొంత మందికి ఆగ్రహం కలగటాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడైనా వ్యక్తి పూజ ముదిరితే వారి మీద ఏ చిన్న వ్యాఖ్యను కూడా సహించలేరు. ఉద్రేకాలను తగ్గించుకొని ఆలోచించాలని మనవి. ఎవడు కొడితే దిమ్మదిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందో వాడే పండుగాడు. ఇక్కడ ఎవరు, ఎవరిని కొట్టారు ? ఎవరి మైండ్‌ బ్లాంక్‌ అయింది? పండుగాడు ఎవడో తెలియదు గానీ సంఘపరివారం మొత్తానికి మైండ్‌ బ్లాక్‌ అయినట్లుగా వారి మాటలను బట్టి కనిపిస్తోంది. ఎవరేమి మాట్లాడుతారో తెలియని స్ధితి. అఖిలపక్ష సమావేశం ప్రధాని మాట్లాడిన అంశాలు టీవీలలో ప్రసారం అయ్యాయి.” ఎవరూ చొరబడలేదు లేదా ఎవరూ చొరబడటం లేదు, కొంత మంది ఏ పోస్టునూ పట్టుకోలేదు ” అన్నారు. అంతకు ముందు వరకు మాట్లాడిన ప్రతి కేంద్ర మంత్రి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న బిజెపి మరికొన్ని పార్టీల నేతలందరూ, మీడియా కూడా మన ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది, మన మిలిటరీ పోస్టులను కూల్చివేసింది అని ఊదరగొట్టిన వారందరి మైండ్లు నరేంద్రమోడీ మాటలతో బ్లాంక్‌ అయ్యాయి. పోనీ ఆయన ఆంగ్లంలో మాట్లాడారా అంటే అదేమీ కాదు, ఆయనకు బాగా తెలిసిన హిందీలోనే కదా చెప్పారు. ఈ మాటల ప్రభావం, పర్యవసానాలేమిటో గ్రహించిన తరువాత కేంద్ర ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మోడీ గారి మాటల అర్ధం ఇది తిరుమలేశా అన్నట్లుగా ఒక వివరణ ఇచ్చింది.
వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసి) మన ప్రాంతంలో చైనీయులెవరూ లేరు, గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఆతిక్రమణకు పాల్పడేందుకు చేసిన మన ప్రయత్నాన్ని భారత సైనికులు విఫలం చేశారు అన్నది ప్రధాని అభిప్రాయం అన్నది వివరణ. దానికి ముందు విదేశాంగ మంత్రి జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ ఇ ఇతరులతో మాట్లాడిన తరువాత జూన్‌ 17న రాతపూర్వక పత్రికా ప్రకటన విడుదల చేశారు. యథాతధ స్ధితిని మార్చేందుకు ఎవరూ ప్రయత్నించరాదన్న ఒప్పందాలను అతిక్రమించి వాస్తవ పరిస్ధితిని మార్చేందుకు చేసిన యత్నం కారణంగానే హింస, మరణాలు సంభవించాయని దానిలో పేర్కొన్నారు. దీని అర్ధం ఏమిటి ? మన సైనికులు ఎందుకు మరణించారు అన్న ప్రశ్నకు చెప్పిందేమిటి ? సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడిన చైనా మన ప్రాంతంలో పోస్టులను ఏర్పాటు చేసిందని, వాటిని తొలగించాలని ఉభయ దేశాల మిలిటరీ అధికారులు చేసిన నిర్ణయాన్ని చైనా అమలు జరపలేదని, ఆ కారణంగానే చైనా పోస్టును తొలగించేందుకు మన సైనికులు ప్రయత్నించినపుడు చైనీయులు పధకం ప్రకారం దాడి చేసి మన వారిని చంపారని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ఉదంతం మన ప్రాంతంలో జరిగినట్లా మరొక చోట జరిగినట్లా ? ఇదే నిజమా లేక చైనా వారు చెబుతున్నట్లు తమ ప్రాంతంలోకి మన సైనికులు వెళ్లి దాడికి పాల్పడ్డారన్నది వాస్తవమా ? మన ప్రధాని మరి అలా ఎందుకు మాట్లాడినట్లు, విదేశాంగ, రక్షణ శాఖల నుంచి సమాచారం తీసుకోరా ? అసలేం జరిగింది ? ఇప్పటికీ మైండ్‌ బ్లాంక్‌ అయ్యే రహస్యమే కదా ! ఇంత జరిగిన తరువాత అయినా మోడీ ప్రత్యక్షంగా విలేకర్లతో మాట్లాడి వివరణ ఎందుకు ఇవ్వరు ?
లడఖ్‌ లడాయితో మోడీ గణానికి ఏదో జరిగింది. జనంలో తలెత్తిన మనోభావాల నేపధ్యంలో ఎవరేం మాట్లాడుతున్నారో, అసలు వారి మధ్య సమన్వయం ఉందో లేదో కూడా తెలియటం లేదు. ఒక నోటితో చైనా వస్తువులను బహిష్కరించాలంటారు. అదే నోటితో ప్రపంచ వాణిజ్య సంస్ధలో మన దేశం భాగస్వామి గనుక అధికారయుతంగా చైనా వస్తువులను నిషేధించలేము, ప్రజలే ఆ పని చేయాలంటారు. వారు చెప్పే ఈ మాటల్లో నిజాయితీ ఉందా ?
బిజెపి, విశ్వహిందూపరిషత్‌, ఎబివిపి, బిఎంఎస్‌, భజరంగదళ్‌, ఎస్‌జెఎం వంటి అనేక సంస్దలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పాటు చేసింది అనే విషయం తెలిసిందే. అంటే ఈ సంస్ధలన్నీ తెరమీది తోలుబొమ్మలైతే వాటిని తెరవెనుక నుంచి ఆడించేది, మాట్లాడించేది ఆర్‌ఎస్‌ఎస్‌.1991లో సంస్కరణల పేరుతో మన మార్కెట్‌ను విదేశాలకు తెరిచారు. ఆ విధానాలను వ్యతిరేకిస్తున్నట్లు ఫోజు పెట్టేందుకు స్వదేశీ జాగరణ మంచ్‌(ఎస్‌జెఎం)ను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ పాలనలో మాత్రమే అవసరమైనపుడు నాటకాలాడుతుంది. నాటి నుంచి నేటి వరకు వాజ్‌పేయి, నరేంద్రమోడీ ఎవరు అధికారంలో ఉన్నా మార్కెట్లను మరింతగా తెరిచారు తప్ప స్వదేశీ వస్తువులకు రక్షణ లేదా దేశంలో చౌకగా వస్తువుల తయారీకి వారు చేసిందేమీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వాణిజ్య ఒప్పందం కారణంగా చైనా వస్తువుల మీద అధికారికంగా చర్యలు తీసుకోలేము అని చెబుతారు. ఇది జనం చెవుల్లో పూలు పెట్టే యత్నమే. ప్రపంచ వాణిజ్య సంస్ధలోని దేశాలన్నీ అలాగే ఉన్నాయా ?
స్వదేశీ జాగరణ మంచ్‌ సహ కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) మాట్లాడుతూ మన దేశం గత రెండు సంవత్సరాలలో అనేక చర్యలు తీసుకున్నా చైనా మీద కేవలం 350 పన్నేతర ఆంక్షలను మాత్రమే విధిస్తే అమెరికా 6,500 విధించిందని, మనం ఇంకా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. అమెరికాకు అగ్రతాంబూలం అని ట్రంప్‌ పదే పదే చెబుతాడు, దానికి అనుగుణ్యంగానే ప్రపంచ దేశాల మీద దాడులకు దిగుతాడు. మనం మరో దేశం మీద దాడికి దిగకపోయినా మనల్ని మనం రక్షించుకోవాలి కదా! అదే దేశభక్తి అని అనుకుంటే ట్రంప్‌కు ఉన్న అమెరికా భక్తితో పోలిస్తే మన నరేంద్రమోడీ భారత్‌ భక్తి ఎక్కడ ఉన్నట్లు ? 2016లో పేటియంకు అనుమతి ఇచ్చినపుడు తాము వ్యతిరేకించామని, అనుమతి ఇచ్చి ఉండాల్సింది కాదని, జనం దాన్ని వినియోగించకూడదని కూడా ఆ పెద్దమనిషి చెప్పారు. అమెరికాకు లేని ప్రపంచ వాణిజ్య అభ్యంతరాలు మనకేనా ? చేతగాని తనాన్ని కప్పి పుచ్చుకొనేందుకు చెప్పే సొల్లు కబుర్లు తప్ప మరేమైనా ఉందా ? 2014 నుంచి మన దేశం చైనాతో సహా వివిధ దేశాలకు చెందిన 3,600 వస్తువులపై దిగుమతి పన్నుల పెంపు లేదా ఇతర ఆంక్షలను విధించింది (ఎకనమిక్‌ టైమ్స్‌ జూన్‌ 19). పోనీ దేశమంతా తమకే మద్దతు ఇచ్చిందని, రెండోసారి పెద్ద మెజారిటీతో గెలిపించారని చెప్పుకుంటున్న పెద్దలు మరి తమ జనం చేత అయినా పేటిఎం లేదా చైనా వస్తువులను ఎందుకు బహిష్కరించేట్లు చేయలేకపోయారు ? వినియోగం కనీసం ఆగలేదు, రోజు రోజుకూ ఎందుకు పెరుగుతున్నట్లు ? అంటే కబుర్లు తప్ప వాటిని చెప్పేవారు కార్యాచరణకు పూనుకోవటం లేదు. మరో వైపు కమ్యూనిస్టుల మీద పడి ఏడుస్తారు. ఎన్నడైనా, ఎక్కడైనా కమ్యూనిస్టులు చైనా వస్తువులనే వాడమని గానీ, రక్షణాత్మక చర్యలు తీసుకోవద్దని చెప్పారా ?
ప్రపంచ దేశాలన్నీ ఇటీవలి కాలంలో రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుతున్నాయి. ప్రపంచ ఎగుమతుల్లో అగ్రస్ధానంలో ఉన్న చైనా సైతం అలాంటి చర్యలకు పాల్పడుతున్నపుడు మన దేశం ఎందుకు తీసుకోకూడదు ? ఏ కమ్యూనిస్టులు వద్దన్నారు ? 2020 జనవరి ఆరవ తేదీ ఫైనాన్సియల్‌ ఎక్స్‌ప్రెస్‌ విశ్లేషకుడు బనికర్‌ పట్నాయక్‌ అందచేసిన వివరాల ప్రకారం ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య (ఆర్‌సిఇపి) స్వేచ్చా వాణిజ్య ఒప్పందంలో దేశాలు భారత్‌తో సహా 5,909 సాంకేతిక పరమైన ఆటంకాలను (టిబిటి) విధించినట్లు పేర్కొన్నారు. ఆ ఒప్పందం నుంచి మన దేశం ఉపసంహరణకు ముందు మన వాణిజ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన అంతర్గత విశ్లేషణలో ఈ వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం పన్నేతర ఆటంకాలు (ఎన్‌టిబి) ఇతర ఆటంకాలు ఉన్నాయి. వివిధ దేశాలు విధించిన సాంకేతిక పరమైన ఆటంకాలలో చైనా 1,516, దక్షిణ కొరియా 1,036, జపాన్‌ 917, థాయలాండ్‌ 809 విధించగా మన దేశం కేవలం 172 మాత్రమే విధించింది. ఈ బృంద దేశాలలో సగటు పన్ను విధింపులో మన దేశం 17.1శాతంతో అగ్రస్ధానంలో ఉండగా దక్షిణ కొరియా 13.7, చైనా 9.8, జపాన్‌ 4.4శాతం విధించాయి. శానిటరీ మరియు ఫైటోశానిటరీ(ఎస్‌పిఎస్‌) ఆంక్షలను చైనా 1,332ప్రకటించగా దక్షిణ కొరియా 777, జపాన్‌ 754 విధించగా మన దేశం కేవలం 261 మాత్రమే ప్రకటించింది. ఇలా ప్రతి దేశంలో అనేక ఆంక్షలను విధిస్తూనే ఉండగా మనం ప్రపంచ వాణిజ్య సంస్ద ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం కనుక విధించటం లేదు అని చెప్పటాన్ని వంచన అనాలా మరొకటని చెప్పాలా ? పన్నేతర ఆంక్షలకు చెప్పే రక్షణ, పర్యావరణం, నాణ్యత వంటివన్నీ ఎక్కువ భాగం దిగుమతుల నిరోధానికి పరోక్షంగా చెప్పే సాకులే అన్నది అందరికీ తెలిసిందే. కొన్ని వాస్తవాలు కూడా ఉండవచ్చు. రాజకీయ పరమైన వివాదాలు తలెత్తినపుడు ఇలాంటి పరోక్ష దాడులకు దిగటం మరింత ఎక్కువగా ఉంటుంది.
చైనా వస్తువుల నాణ్యత గురించి అనేక మంది చెబుతారు, చైనా పేరుతో వచ్చే వస్తువులన్నీ అక్కడివి కాదు, ఆ పేరుతో మన దేశంలో తయారైన వాటిని కూడా విక్రయిస్తున్నారు. ఏ వస్తువైనా మన నాణ్యతా ప్రమాణాలకు కట్టుబడి ఉండాల్సిందే. రోజు రోజుకూ చైనాతో విదేశీ వస్తువులు కుప్పలు తెప్పలుగా వస్తున్నపుడు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. పోనీ అత్యవసరం గాని వస్తువుల దిగుమతులను అయినా నిరోధించిందా అంటే అదీ లేదు.
” చైనాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను చేసుకొనేందుకు రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌ అనేక అధ్యయనాలు చేసింది. ఒప్పందాలు చైనా కంటే భారత్‌కే ఎక్కువ అవసరమని పేర్కొన్నది. చైనా నుంచి మూడులక్షల డాలర్లు లేదా నాటి విలువలో 90లక్షల రూపాయలను విరాళంగా పొందింది.” కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్‌, బిజెపి తాజాగా ముందుకు తెచ్చిన ఆరోపణ ఇది. నిజమనే అంగీకరిద్దాం, చైనా నుంచి వచ్చిన విరాళం సంగతి ఫౌండేషన్‌ తన వార్షిక నివేదికలో స్పష్టంగా పేర్కొన్నది.
పదిహేను సంవత్సరాల క్రితం తీసుకున్న విరాళం గురించి, రాజీవ్‌ ఫౌండేషన్‌ చేసిన అధ్యయనాలు, సిఫార్సుల గురించి ఇంతకాలం తరువాత బిజెపికి ఎందుకు గుర్తుకు వచ్చినట్లు ? వాటిలో తప్పుంటే ఇంతకాలం ఎందుకు మాట్లాడలేదు. అంటే, ” నా గురించి నువ్వు మూసుకుంటే నీ గురించి నేను మూసుకుంటా, నన్ను లడక్‌ విషయంలో వేలెత్తి చూపుతున్నావ్‌ గనుక నీ పాత బాగోతాలన్నీ బయటకు తీస్తా ! ఇది బిజెపి తీరు.” బయటకు తీయండి, పోయిన సూదికోసం సోదికి పోతే పాత రంకులన్నీ బయటపడ్డాయన్నది ఒక సామెత. బిజెపి -కాంగ్రెస్‌ వారు ఇలా వివాదపడుతుంటేనే కదా వారిద్దరి బండారం జనానికి తెలిసేది.
బిజెపి వారు ఎదుటి వారి మీద ఎదురు దాడికి దిగితే ఇంకేమాత్రం కుదరదు. ఆ రోజులు గతించాయి. ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లు, కొద్ది క్షణం క్రితమే అధికారాన్ని స్వీకరించినట్లు కబుర్లు చెబితే చెల్లవు. గురివింద గింజ మాదిరి వ్యవహరిస్తే రాజకీయాల్లో కుదరదు.రాహుల్‌ గాంధీ చైనా నేతలతో జరిపిన భేటీలో ఏమి చర్చించారో చెప్పాలని కూడా బిజెపి వారు సవాళ్లు విసురుఉన్నారు. సూదులు దూరే కంతల గురించి గుండెలు బాదుకుంటూ పదిహేనేండ్ల క్రితం చైనానుంచి తీసుకున్న 90లక్షల రూపాయలను ఏమి చేశారో చెప్పమని కాంగ్రెస్‌ వారిని ఇప్పుడు సవాల్‌ చేస్తున్నారు. దాన్ని వెల్లడించిన వార్షిక నివేదికలోనే ఖర్చుల గురించి కూడా చెప్పి ఉంటారు కదా ! ప్రపంచంలో ఏ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత పెద్ద కార్యాలయాన్ని ఏడువందల కోట్ల రూపాయలు పెట్టి బిజెపి ఢిల్లీలో కట్టింది. దానికి అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్‌తో సహా అనేక మంది అడిగారు, ఇంతవరకు ఎవరైనా చెప్పారా ?
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ నాలుగుసార్లు, ప్రధానిగా ఐదుసార్లు చైనా వెళ్లారని, చైనా అధ్యక్షు గ్జీ జింపింగ్‌ను మూడుసార్లు మన దేశం ఆహ్వానించారని, గత ఆరు సంవత్సరాలలో వివిధ సందర్భాలలో జింపింగ్‌తో మోడీ 18సార్లు కలిశారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా చెప్పారు.2009లో బిజెపి అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్‌ చైనా కమ్యూ నిస్టు పార్టీతో సంప్రదింపులు జరిపిందని,2011లో నాటి బిజెపి అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ నాయకత్వంలో బిజెపి ప్రతినిధి బృందం చైనా పర్యటన జరిపిందని అక్కడ భారత వ్యతిరేక చర్చలు జరిపారా అని కూడా సూర్జేవాలా ప్రశ్నించారు. చైనా రాజకీయ వ్యవస్ధను అధ్యయనం చేసేందుకు 2014లో బిజెపి 13 మంది ఎంపీలు, ఎంఎల్‌ఏల బృందాన్ని చైనా పంపిందని ఇవన్నీ భారత వ్యతిరేక కార్యకలాపాలా అని కాంగ్రెస్‌ వేస్తున్న ప్రశ్నలకు బిజెపికి మైండ్‌ బ్లాంక్‌ కావటం తప్ప సమాధానం ఏమి చెబుతుంది ?
ప్రపంచంలోనే చైనా అత్యంత విశ్వాస ఘాతుక దేశమని విశ్వహిందూ పరిషత్‌ నేత సురేంద్ర జైన్‌ (2020 జూన్‌ 19వ తేదీ ఎకనమిక్‌ టైమ్స్‌) ఎకనమిక్‌ టైమ్స్‌తో చెప్పారు. అలాంటి దేశంతో అంటీముట్టనట్లుగా ఉండాల్సింది పోయి ఎందుకు రాసుకుపూసుకు తిరుగుతున్నారని తమ సహచరుడు నరేంద్రమోడీని ఎందుకు అడగరు? చైనాతో వ్యవహరించేటపుడు చైనాది హంతక భావజాలమని, దాని ఆధారంగా పని చేసే ఆ దేశ నాయకత్వంతో వ్యవహరించేటపుడు ఆ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని 2020 జూన్‌ నాలుగవ తేదీ ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక ఆర్గనైజర్‌ వెలిబుచ్చిన అభిప్రాయం ఈ రోజు కొత్తది కాదు, ఎప్పటి నుంచో చెబుతున్నదే మరి బిజెపి నాయకత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది ? వెనుక నుంచి ఆడించే ఆర్‌ఎస్‌ఎస్‌ ఎందుకు అనుమతించినట్లు ? ప్రశ్నించకుండా అనుసరించే జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయాలని గాకపోతే ఏమిటీ నాటకాలు ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

అమెరికా వత్తిడికి లొంగిన అపర జాతీయవాది నరేంద్రమోడీ !

25 Thursday Apr 2019

Posted by raomk in BJP, CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Political Parties, USA

≈ Leave a comment

Tags

China, Donald Trump diktats, INDIA, iran, Iran Oil, Narendra Modi, US SANCTIONS

Image result for narendra modi surrendered to donald trump diktats

ఎం కోటేశ్వరరావు

ఇరాన్‌, అమెరికా మధ్య రెండు ఖండాలు, పన్నెండు వేల కిలోమీటర్ల దూరం వుంది. అమెరికాతో పోల్చితే ఇరాన్‌ సైనిక శక్తి లేదా ఆయుధాలు ఒక రోజు యుద్ధానికి కూడా సరిపోవు. అలాంటి దేశం తమకు, పశ్చిమాసియాకు ముప్పుగా పరిణమిస్తోందని, అందువలన మేనెల రెండవ తేదీ తరువాత దాని దగ్గర వున్న ముడి చమురును కొన్నవారి తాట తీస్తా అంటూ అమెరికా హెచ్చరించింది. ఆ మాత్రానికే మన దేశ పాలకులకు బట్టలు తడుస్తున్నాయి. అంతవరకు ఎందుకు లెండి, కొనుగోళ్లను బాగా తగ్గించాం, ఇక ముందు పూర్తిగా నిలిపివేస్తాం, ఇప్పటికే ప్రత్యామ్నాయం చూసుకొన్నాం అని చేతులేత్తేశాం. అంతమాట అన్నావు కదా ఇప్పుడు చెబుతున్నాం ఇంతకు ముందు కొన్నదాని కంటే ఎక్కువ కొనుగోలు చేస్తాం, ఏమి చేస్తావో చేసుకో చూస్తాం అని చైనా తాపీగా జవాబు చెప్పింది. హెచ్చరికలు అందుకున్న దేశాలలో జపాన్‌, దక్షిణ కొరియా ఎలాగూ అమెరికా అడుగులకు మడుగులత్తుతాయి, అటూ ఇటూ తేల్చుకోలేక టర్కీ మల్లగుల్లాలు పడుతోంది. అమెరికా ప్రకటన కొత్తదేమీ కాదు గతంలోనే చేసినప్పటికీ ఏదో మీరు మిత్రదేశాలు కనుక కొద్ది నెలలు ఆంక్షలను సడలిస్తున్నాం, ఆలోగా తేల్చుకోండి అని గతేడాది చివరిలో చెప్పింది. ఇప్పుడు తాజాగా మే రెండవ తేదీతో గడువు ముగుస్తుంది అని ప్రకటించేసింది.

రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అది గల్లీ, ఢిల్లీ, వాషింగ్టన్‌ ఏదైనా కావచ్చు. అమెరికా చివరి క్షణంలో మరోసారి గడువు పెంచుతుందా? ఎందుకంటే మన దేశంతో సహా ప్రభావితమయ్యే దేశాలన్నీ బహిరంగంగానో, తడిక రాయబారాలో చేస్తున్నాయి. వారం రోజుల గడువుంది. అమెరికా అంటే డాలర్లు. ప్రతిదానిలో తనకెన్ని డాలర్ల లాభమా అని చూసుకుంటుంది. అందుకే ఏది జరిగినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజులుగా అమెరికన్ల ప్రకటనలను బట్టి ఇరాన్‌తో రానున్న రోజుల్లో మరింత కఠినంగా వ్యవహరించనున్నదనే భావం కలుగుతోంది కనుక, దాని పూర్వరంగం, పర్యవసానాల గురించి చూద్దాం.

ఇరాన్‌ మీద ఎందుకీ ఆంక్షలు ?

ప్రపంచంలో ఏకీభావం లేని అంశాలలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధ ఒప్పందం(ఎన్‌పిటి) ఒకటి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు ఈ ఒప్పందం వర్తించదు, మిగతా దేశాలు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేయకూడదనేది అప్రజాస్వామిక, అవి లేని దేశాలను బెదిరించే వైఖరి తప్ప మరొకటి కాదు. అందుకే మన దేశం వంటివి ఆ ఒప్పందం మీద సంతకాలు చేయకుండా ఆత్మ రక్షణకు అణ్వాయుధాలను తయారు చేసుకొనే హక్కును అట్టిపెట్టుకున్నాయి. ఇరాన్‌ 1970లోనే ఆ ఒప్పందంపై సంతకం చేసింది. అలాంటి దేశాల అణుకార్యక్రమం శాంతియుత ప్రయోజనాలకు అనువైనదిగా వుండాలి తప్ప ఆయుధాలు తయారు చేయకూడదు. ఇరాన్‌ ఆ నిబంధనలను వుల్లంఘిస్తున్నదనే ఆరోపణల పూర్వరంగంలో చాలా సంవత్సరాల సంప్రదింపుల తరువాత 2015లో ఇరాన్‌-భద్రతా మండలిలోని శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌,ఫ్రాన్స్‌ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దాని ప్రకారం ఇరాన్‌ అణుకేంద్రాలు, కార్యక్రమం అంతర్జాతీయ అణు ఇంధన సంస్ధ(ఐఏఇఏ) పర్యవేక్షణలోకి తేవాలి. దానికి ప్రతిగా అంతకు ముందు అమెరికన్లు స్దంభింపచేసిన ఇరాన్‌ ఆస్ధులను విడుదల చేయాలి, ఆంక్షలను ఎత్తివేయాలి. అయితే ఒప్పందంలోని మిగతా దేశాలతో నిమిత్తం లేకుండా కుంటి సాకులతో 2018లో అమెరికా ఏకపక్షంగా వైదొలిగింది. అప్పటి నుంచి ఆంక్షలను మరింత కఠినతరం గావించేందుకు, అందుకు ఇతర దేశాలను కూడా తనకు మద్దతు ఇచ్చేందుకు వాటి మీద చమురు ఆయుధంతో వత్తిళ్లు, బెదిరింపులకు పూనుకుంది. ఇరాన్‌ చమురు సొమ్ముతో పశ్చిమాసియాలో గత నాలుగు దశాబ్దాలుగా అస్ధిర పరిస్ధితులకు కారణం అవుతోందని, అందువలన ఆ సొమ్ముదానికి అందకుండా చేయాలని అమెరికా చెబుతోంది. అదే సరైనది అనుకుంటే ప్రపంచవ్యాపితంగా అనేక ప్రాంతాలలో అస్ధిర పరిస్ధితులకు కారణం అమెరికా, మరి దాని మీద ప్రపంచమంతా ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదా ?

కమ్యూనిస్టు అంటే ప్రతిఘటన, ప్రజాస్వామ్యం అంటే లొంగిపోవటమా !

కొంత మంది దృష్టిలో చైనా కమ్యూనిస్టు నియంతృత్వదేశం. అమెరికా అపర ప్రజాస్వామిక దేశం. అయితే సదరు దేశ పాలకులు కమ్యూనిస్టు చైనాతో పాటు తోటి ప్రజాస్వామిక, మిత్ర దేశాలుగా పరిగణించే భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, టర్కీ మీద బెదిరింపులకు పాల్పడుతున్నారు. కమ్యూనిస్టు చైనా మాత్రమే అవి మాదగ్గర పనిచేయవు అని చెప్పింది. వీర జాతీయవాదులమని చెప్పుకొనే బిజెపి నాయకత్వంలోని మన ప్రభుత్వం మాత్రం అమెరికా గుడ్లురుమగానే సలాం కొట్టి వేరే దేశాల నుంచి అధిక ధరలకు చమురు కొనుగోలుకు పూనుకుంది. ఎంతకు కొంటే అంత వసూలు చేయాలనే విధానం అమలవుతోంది గనుక డోనాల్డ్‌ ట్రంప్‌-నరేంద్రమోడీ కౌగిలింతలు, కలయికలకు ఎలాంటి అంతరాయం వుండదు, జేబుల్లో డబ్బులు పోగొట్టుకొనేది వినియోగదారులే. పెట్రోలు, డీజిలు ధరలు పెరిగినా, వాటి ప్రభావం పరోక్షంగా పడినా అనుభవించేంది జనాభాలో నూటికి 80శాతంగా వున్న బడుగు, బలహీనవర్గాలే అన్నది తెలిసిందే. ట్రంప్‌ సంతోషం లేదా అమెరికా రాజకీయ, ఆర్ధిక ప్రయోజనాలకోసం పేద, మధ్యతరగతి వారిని బలిపెడతారా ? దీన్ని దేశభక్తి అనాలా లేక మరొకటని వర్ణించాలా?

ప్రపంచంలో మన దేశంతో సహా అనేక దేశాలలో అణ్వాయుధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక వాదన ప్రకారం ఏ దేశంలో అణువిద్యుత్‌ కేంద్రం వుంటే ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు తయారు చేసేందుకు అవసరమైన పరిజ్ఞానం, అణుశక్తి వున్నట్లే లెక్క. అణ్వాయుధాలున్న మిగతా దేశాలన్నీ తాముగా ముందుగా ప్రయోగించబోమని ప్రకటించాయి, మరోసారి ప్రయోగించబోమని అమెరికా ఇంతవరకు చెప్పలేదు. అందువలన దాని బెదిరింపులకు లేదా ఇతరత్రా ప్రమాదాలు వున్న ప్రతి దేశం అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నిస్తోంది. మనం ఆపని చేసినపుడు మన మిత్ర దేశం అదే పని చేస్తే తప్పేమిటి అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ తాను అణ్వాయుధాలు తయారు చేయనని ఇరాన్‌ ఒప్పందాన్ని అంగీకరించినా వుల్లంఘిస్తోందని ఆధారాలు లేని ఆరోపణలతో అమెరికా పేచీలకు దిగుతోంది. మనం ఎందుకు సమర్ధించాలి? ఒప్పందంలో భాగస్వాములైన మిగతా దేశాలకు లేని అభ్యంతరాలు అమెరికాకు ఎందుకు ?

ఇరాన్‌ మీద ఆంక్షలు అమలు జరిగితే పర్యవసానాలు ఏమిటి ?

ఒక దేశం మీద ఆంక్షలు అమలు జరిపినంత మాత్రాన అది అణ్యాయుధ కార్యక్రమాన్ని వదలివేస్తుందన్న గ్యారంటీ లేదు. ఇరాన్‌తో పోలిస్తే పాకిస్ధాన్‌ చాలా పేద దేశం. అదే అణ్వాయుధాలు,క్షిపణులు తయారు చేయగలిగినపడు ఇరాన్‌కు ఎందుకు సాధ్యం కాదు? గతంలో అణు పరీక్షలు జరిపినపుడు మన దేశం మీద కూడా అమెరికా ఆంక్షలు అమలు జరిపింది. అయినా ఖాతరు చేయకుండా ముందుకు పోయాము.క్షిపణులు తయారు చేశాము, వాటిని జయప్రదంగా ప్రయోగించాము. తాజాగా ఐదున్నరవేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఆయుధాన్ని కూడా జయప్రదంగా ప్రయోగించాము. అయితే దాన్నింకా ఎంతో మెరుగుపరచాల్సి వుందనుకోండి. అదేమీ పెద్ద సమస్య కాదు. ఇలాంటి మన దేశం మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కించపరిచే విధంగా అమెరికా ఆంక్షలకు లంగిపోయి వేరే దేశాల నుంచి చమురు కొనుగోలు చేయటం ఏమిటి? మనం వెనిజులా నుంచి కూడా చమురు కొంటున్నాం. ఆదేశం మీద కూడా అమెరికా ఆంక్షలు పెట్టింది. దాన్నుంచి కూడా కొనుగోలు ఆపేయాల్సిందే అంటే ఆపటమేనా, రేపు సౌదీ అరేబియాతో తగదా వచ్చి దాన్నుంచి కూడా కొనుగోలు చేయవద్దంటే మన పరిస్ధితి ఏమిటి ? మన అవసరాలకు 80శాతం విదేశాల మీద ఆధారపడుతున్న స్ధితిలో చమురు దేశాలతో మిత్రత్వం నెరపాలి తప్ప అమెరికా కోసం శతృత్వాన్ని కొని తెచ్చుకోవటం ఎందుకు? అమెరికాకు లంగిపోవటమే మన విధానమా, దానితో సాధించేదేమిటి? మన యువతీ యువకులకు వీసాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇప్పటి వరకు మన ఎగుమతులకు ఇచ్చిన దిగుమతి పన్ను మినహాయింపులను రద్దు చేశారు.

వినియోగదారుల మీద పడే భారం ఎంత !

అమెరికా ఆడుతున్న రాజకీయాల కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్‌ ప్రభావితం అవుతోంది. ధరలు పెరుగుతున్నాయి, 2018 నవంబరు రెండవ తేదీన భారత్‌ాఇరాన్‌ ప్రభుత్వాలు కుదుర్చుకున్న అవగాహన ప్రకారం అంతకు ముందున్న ఏర్పాట్ల ప్రకారం నలభై అయిదు శాతం రూపాయల్లో, 55శాతం యూరోల్లో ఇరాన్‌ చమురుకు చెల్లించాలన్న ఒప్పందాన్ని సవరించి సగం మొత్తం రూపాయల్లో చెల్లించేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ అవగానకు వచ్చిందని రాయిటర్స్‌ సంస్ధ తెలిపింది. గతంలో అమెరికా ఆంక్షలున్నప్పటికీ ఇరాన్‌కు మన దేశం వ్యవసాయ వుత్పత్తులు, ఆహారం, ఔషధాలు, వైద్యపరికరాలను ఎగుమతులు చేయవచ్చు. ఇప్పుడు రూపాయల్లో చెల్లించే అవకాశం లేదు. ఇరాన్‌కు వెళ్లే ఎగుమతులూ నిలిచిపోతాయి. మరోవైపు మార్కెట్లో డాలర్లను కొనుగోలు చేసి మొత్తం చమురు కొనుగోలు చేయాలి. ఇది మన విదేశీమారక నిల్వలు, రూపాయి విలువ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది. అన్నింటికీ మించి అమెరికా చర్యల వలన చమురు ధరలు పెరుగుతాయి. ఇరాన్‌ పట్ల కఠిన వైఖరి అవలంభించనుందనే అంచనాల పూర్వరంగంలో గత రెండు నెలలుగా చమురు ధరలు పెరుగుతున్నాయి. నవంబరు తరువాత అమెరికాలో ఒక గ్యాలన్‌ (3.78 లీటర్లు)కు మూడు డాలర్ల మేర ఇప్పుడే ధరలు పెరిగాయి. తొమ్మిది వారాలుగా గ్యాస్‌ ధరలు కూడా పెరుగుతూనే వున్నాయి.అక్కడి జనానికి ఆదాయం వుంది కనుక వారికి ఒక లెక్కకాదు. మనం దిగుమతి చేసుకొనే చమురు డిసెంబరు నెలలో సగటున ఒక పీపా ధర 57.77 డాలర్లు వుండగా మార్చినెలలో అది 66.74డాలర్లకు పెరిగింది. మార్చి ఎనిమిదవ తేదీన మన రూపాయల్లో 3,922 వుండగా ఇప్పుడు 4,620కి అటూఇటూగా వుంది. ఇంకా పెరగవచ్చని వార్తలు వస్తున్నాయి. పీపా ధర ఒక డాలరు పెరిగితే మన వినియోగదారుల మీద మనం దిగుమతి చేసుకొనే చమురు ఖర్చు పదకొండువేల కోట్ల రూపాయలు పెరుగుతుందని అంచనా.

మన ప్రత్యామ్నాయ వనరులంటే ఏమిటి ?

మే నెల రెండు నుంచి ఆంక్షల మీద మినహాయింపులు రద్దు చేస్తామని, వుల్లంఘించిన వారి మీద చర్యలు తీసుకుంటామని అమెరికా ప్రకటించగానే మన అధికారులు దాని వలన మనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగాయని ప్రకటించారు. అమెరికా సంగతి తెలిసిన మన అధికారులు చమురు ధరలు తక్కువగా వున్నపుడు సాధారణంగా ఇరాన్‌ నుంచి దిగుమతి చేసుకున్నదానికంటే ఎక్కువగా దిగుమతులు చేసుకొని మంగళూరు తదితర చోట్ల పెద్ద ఎత్తున నిలవ చేశారు. అది కొద్ది రోజులు లేదా వారాలు వినియోగదారుల మీద భారం మోపకుండా చూడవచ్చు. అయితే ఇదంతా ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఆ సమయంలో ధరలు పెరగకుండా చూసేందుకు చేసిన ఏర్పాటన్నది కొందరి అభిప్రాయం. అందుకే మే 19వ తేదీ చివరి దశ పోలింగ్‌ ముగిసిన తరువాత పెద్ద మొత్తంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచుతారని, అప్పటి వరకు పెంచవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీచేసినట్లు చెబుతున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇదేమాదిరి జరిగింది. ఇదొక అంశమైతే ఇటీవలి వరకు అమెరికా తన అవసరాల కోసం చమురు దిగుమతి చేసుకొనేది. ఇప్పుడు తన భూభాగం మీద వున్న షేల్‌ ఆయిల్‌ను తీయటం ప్రారంభించిన తరువాత అది ఎగుమతి దేశంగా మారింది. దానిలో భాగంగానే అది మన దేశానికి గత రెండు సంవత్సరాలుగా చమురు ఎగుమతి చేస్తోంది. పశ్చిమాసియా చమురు నిల్వలు, వాణిజ్యం మీద పట్టుపెంచుకోవటం, క్రమంగా తన షేల్‌ అయిల్‌ వుత్పత్తి పెంచుతూ ఆమేరకు ప్రపంచ మార్కెట్‌ను ఆక్రమించుకోవాలన్నది దాని తాజా ఆలోచన. ఇరాన్‌పై ఆంక్షలు, ఇతర దేశాలను బెదిరించటం దీనిలో భాగమేనా అన్నది ఆలోచించాలి.తన చమురుకు మార్కెట్‌ను పెంచుకోవటంతో పాటు ధరలు ధరలు పెరగటం కూడా దానికి అవసరమే.ఇదే జరిగితే అన్నిదేశాలూ దానికి దాసోహం అనాల్సిందేనా ?

Related image

ఇరాన్‌ నిజంగా ఒప్పందాన్ని వుల్లంఘిస్తోందా ?

అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకే వుపయోగించాలన్న షరతులను ఇరాన్‌ వుల్లంఘిస్తోందా అన్న ప్రశ్నకు లేదని అంతర్జాతీయ అణుఇంధన సంస్ధ(ఐఎఇఏ) అధిపతి యుకియా అమానో చెప్పారు.అణు ఒప్పందానికి భిన్నంగా కార్యకలాపాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, అయితే తాము జాగ్రత్తగా పర్యవేక్షించాలని అన్నారు. ఇరాక్‌ అధిపతి సద్దాం హుస్సేన్‌ మానవాళిని అంతం చేసేందుకు అవసరమైన పెద్ద మొత్తంలో మారణాయుధాలను గుట్టలుగా పేర్చాడని అమెరికా ప్రచారం చేయటమే కాదు, ఇరాక్‌పై దాడి చేసి సద్దాంను హత్య చేసిన విషయం కూడా తెలిసిందే. లిబియాలో కల్నల్‌ గడాఫీ మీద కూడా అలాంటి ఆరోపణలే చేసి హతమార్చిన విషయమూ తెలిసిందే. ఇప్పటికే ఆంక్షల కారణంగా 2018 మేనెల నుంచి పదిబిలియన్‌ డాలర్ల మేరకు ఇరాన్‌ నష్టపోయింది. దాని కరెన్సీ రియాల్‌ మూడింట రెండువంతుల విలువను కోల్పోయింది.అనేక బహుళజాతి గుత్త సంస్ధలు తమ పెట్టుబడులను వుపసంహరించుకున్నాయి. ఫిబ్రవరిలో వరదలు వచ్చినపుడు అవసరమైన ఔషధాలను కూడా సరఫరా చేయకుండా అమెరికన్లు ఆంక్షలు విధించారని ట్రంప్‌ తమ మీద జరుపుతున్నది ఆర్ధిక యుద్ధం కాదు, వుగ్రవాదం అని ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావేద్‌ జరీఫ్‌ విమర్శించారు.

మన దేశం అమెరికాతో మరొక దేశం దేనితో స్నేహాన్ని వదులు కోవాల్సిన అవసరం లేదు. అలాగే అమెరికా కోసం ఇతర దేశాలతో తగాదా తెచ్చుకోవనవసరమూ లేదు. ఒక దేశ వత్తిడికి లంగిపోవటమంటే అప్రదిష్టను మూటగట్టుకోవటమే. చివరికి అది స్వాతంత్య్రానికి ముప్పుతెచ్చినా ఆశ్చర్యం లేదు.అందుకే తస్మాత్‌ జాగ్రత్త !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

నరేంద్రమోడీ మరో వింత పేరే నాలుగో పారిశ్రామిక విప్లవం !

26 Friday Oct 2018

Posted by raomk in Communalism, Current Affairs, Economics, History, INDIA, NATIONAL NEWS, Opinion

≈ Leave a comment

Tags

4th industrial revolution, INDIA, Naredra Modi, WEF, WEF 4th industrial revolution

Image result for narendra modi, 4th industrial revolution

ఎం కోటేశ్వరరావు

భాయియోం, బహెనోం దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం 4.0 వైపు నడిపిస్తున్నానంటూ మన ఘనత వహించిన ప్రధాని నరేంద్రమోడీ అక్టోబరు పదకొండవ తేదీన ఒక మహోపన్యాసం చేశారు. ప్రపంచ ఆర్ధిక వేదిక న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. గతంలో రాజీవ్‌ గాంధీ ప్రధానిగా వున్న సమయంలో మాట్లాడితే దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోతానని చెప్పేవారు.ప్రధాని నరేంద్రమోడీ కంటే పక్షం రోజుల ముందే నాలుగున్నరేండ్లయినా రాజధాని శాశ్వత భవనాలను కట్టలేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనకు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించి వచ్చారు. అంతేకాదు ఐక్యరాజ్యసమితిలో చేసిన ఒక వుపన్యాసంలో ఒక రూపాయి పెట్టుబడి అవసరం లేని ‘ఆవు’ వ్యవసాయం గురించి కూడా ప్రపంచానికి వివరించి వచ్చారు. నాలుగోపారిశ్రామిక విప్లవంలోని ప్రధాన అంశాలలోని ఐటి, బయోటెక్నాలజీ నిపుణులు కూడా వాటిని పక్కన పడేసి ఆవు వ్యవసాయానికి పూనుకొని అంతకంటే ఎక్కువ ఆదాయం సంపాదించాలని సలహా కూడా ఇచ్చివచ్చినట్లు మనం వార్తలు చదువుకున్నాం. ఒకే నోటితో పరస్పర విరుద్ధ అంశాలు మాట్లాగల నేర్పరులు కొందరు రాజకీయవేత్తలు. అసలు నాలుగో పారిశ్రామిక విప్లవం అంటే ఏమిటి? అందుకు మన దేశంలో పరిస్ధితులు అనువుగా వున్నాయా?

నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి తెలుసుకొనే ముందు మన దేశంలో మొదటి మూడు విప్లవాలు జరిగాయా, ఎంతవరకు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. వుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా- వుట్టి కొట్టలేనయ్య ఆకాశాన్ని అందుకుంటాడా ! మొదటి విషయం ఏ విప్లవం అయినా ఒక రోజులో లేదా ఒక తేదీనో ప్రారంభం కాదు, ముగియదు. ప్రధమ సోషలిస్టు విప్లవం రష్యాలో 1917 అక్టోబరు ఏడున జరిగింది అని చెబుతాం. దానర్ధం ఆ రోజు విప్లవపరిణామలు ఒక మలుపు తిరిగి మరోపరిణామానికి నాంది పలికింది అని తప్ప విప్లవం జయప్రదమైందని కాదు. అలాగే పాఠాల్లో మనం చదువుకొనే పారిశ్రామిక విప్లవం కూడా అలాంటిదే. ఒక తేదీ ఏమీ లేదు.1760 నుంచి 1820-40సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న వుత్పాదకపద్దతులు అంటే చేతితో తయారు చేసే ప్రక్రియలో యంత్రాలను ప్రవేశపెట్టటం, వాటిని నడిపేందుకు ఆవిరిని వుపయోగించటం, రసాయనాల తయారీ వంటి పరిణామాలన్నీ ఆ 80సంవత్సరాల కాలంలో బాగా అభివృద్ధి చెందాయి. రెండవ పారిశ్రామిక విప్లవకాలంలో అంటే 1870-1914 సంవత్సరాల మధ్య కాలంలో అంతకు ముందున్న పరిశ్రమలను కొనసాగించటం, కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఆవిరి స్ధానంలో యంత్రాలను నడిపేందుకు విద్యుత్‌ వినియోగం, చమురును కనుగొనటం, వాటితో వుత్పత్తిని ఇబ్బడి ముబ్బడి చేయటం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తరువాత నుంచి 1980, నేటి వరకు జరిగిన సాంకేతిక అభివృద్ధిని మూడవ పారిశ్రామిక విప్లవంగా పిలుస్తున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం ఎప్పుడు ప్రారంభమైందో చెప్పుకొనే ముందు దీని ప్రధాన లక్షణాలను చెప్పుకోవాల్సి వుంది.రోబోలు, కృత్రిమ మేథ, డిజిటల్‌, నానో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, బయోటెక్నాలజీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌,3డి ప్రింటింగ్‌, డ్రైవర్‌తో పని లేకుండా నడిచే వాహనాల వంటివి దీనిలో వున్నాయి. ప్రపంచ ఆర్ధిక వేదిక(అదే మన చంద్రబాబు నాయుడు సిఎంగా వున్నపుడు ప్రతి సంవత్సరం దవోస్‌ వెళ్లి వస్తుంటారు. ఎందుకు వెళతారో, దాని వలన రాష్ట్ర ప్రజలకు చేతి చమురువదలటం తప్ప సాధించిందేమిటో ఇంతవరకు మనకు తెలియదు)ను ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్కవాబ్‌ నాలుగో పారిశ్రామిక విప్లవం అనే ఒక పుస్తకాన్ని రాశారు. మిగతా మూడు విప్లవాలం కంటే ఆధునాత సాంకేతిక పరిజ్ఞానమే నాలుగోదాని ప్రత్యేకత అంటారు. ఈ పరిజ్ఞానంతో వందల కోట్ల జనం ఇంటర్నెట్‌ వెబ్‌తో అనుసంధానం అవుతారని, వాణిజ్య, ఇతర సంస్ధల సామర్ధ్యం గణనీయంగా పెరుగుతుందని, మెరుగైన సంపదల యాజమాన్య పద్దతులతో సహజపర్యావరణాన్ని తిరిగి సృష్టించేందుకు తోడ్పడవచ్చునని చెప్పారు.2016లో జరిగిన ప్రపంచ ఆర్ధిక వేదిక వార్షిక సమావేశ ఇతివృత్తానికి ‘నాలుగవ పారిశ్రామిక విప్లవంలో సంపూర్ణత సాధన’ అని నామకరణం చేశారు. ఈ పద ప్రయోగం ఇదే మొదటి సారి. అదే ఏడాది అక్టోబరు పదిన శాన్‌ ఫ్రాన్సిస్‌కో నగరంలో నాలుగవ పారిశ్రామిక విప్లవ కేంద్రం పేరుతో విప్లవ పరిణామాలను అధ్యయనం చేయటానికి, సలహాలు ఇవ్వటానికి ఒక సంస్ధను ఏర్పాటు చేశారు. రెండు సంవత్సరాల తరువాత మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రపంచ ఆర్ధిక వేదిక ఆధ్వర్యాన ఏర్పాటుచేసి అలాంటి కేంద్రానికే అక్టోబరు 11వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభోత్సవం చేశారు.

Image result for narendra modi, 4th industrial revolution cartoons

ఆ రోజు మోడీగారు చెప్పిందాని సారాంశం ఇలా వుంది. మొదటి, రెండవ పారిశ్రామిక విప్లవాలు జరిగే నాటికి భారత దేశం స్వతంత్రంగా లేదు. మూడవది జరిగిన సమయంలో అపుడే వచ్చిన స్వాతంత్య్రంతో ఎదురైన సవాళ్లను ఎదుర్కొనేందుకు కుస్తీలు పడుతోంది. ఇప్పుడు నాలుగవ పారిశ్రామిక విప్లవానికి పెద్ద ఎత్తున దోహదపడుతుంది. సాంకేతిక పురోగతితో వుపాధి నష్టం జరుగుతుందని భయపడనవసరం లేదు, వుద్యోగాల స్వభాన్నే మార్చివేస్తుంది, మరిన్ని అవకాశాలను పెంచుతుంది.దీని ఫలితాలను పొందేందుకు అవసరమైన విధానపరమైన మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా వుంది. ప్రపంచ పరిశోధన మరియు అమలు కేంద్రంగా మారేందుకు అవసరమైన అవకాశాలు భారత్‌లో వున్నాయి. ఇంతకు ముందు వచ్చిన విప్లవాలు భారత్‌ను ఏమార్చాయి, నాలుగో విప్లవానికి భారత్‌ వంతు విస్మయకారిగా వుంటుంది.

ఇలా సాగిన వుపన్యాసంతో పాటు పనిలో పనిగా తన ప్రభుత్వం సాధించిన ఘనత గురించి కూడా చెప్పుకున్నారనుకోండి. తమ కారణంగానే టెలిఫోన్‌ సాంద్రత 93శాతానికి పెరిగిందని, 50కోట్ల మంది మొబైల్‌ ఫోన్లు వాడుతున్నారని, ప్రపంచంలో అత్యధికంగా మొబైల్‌ డాటా వాడుతున్నారని తక్కువ రేట్లకు దొరుకుతోందని, వినియోగం నాలుగు సంవత్సరాలలో 30రెట్లు పెరిగిందని, 120 కోట్ల మందికి ఆధార కార్డులు ఇచ్చామని, తాను అధికారంలోకి వచ్చిన 2014నాటికి కేవలం 59 గ్రామాలకు ఆప్టిక్‌ ఫైబర్‌ లైన్లు వుంటే త్వరలో రెండున్నర లక్షలకు చేరనున్నాయని చెప్పుకున్నారు. ఇది కూడా మరొక అర్ధ. అసత్యం. నేషనల్‌ ఆప్టికల్‌ ఫైబర్‌నెట్‌ వర్క్‌(నోఫెన్‌) అనే కేంద్ర ప్రభుత్వ పధకానికి 2011లో అనుమతి ఇచ్చారు.దీన్నే డిజిటల్‌ ఇండియా పేరుతో ఏదో తానే ప్రారంభించినట్లు మోడీ గొప్పలు చెప్పుకుంటారు. ఆ పధక కార్యాచరణ ప్రణాలిక ప్రకారం 2012 అక్టోబరు నాటికి రాజస్ధాన్‌,ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర రాష్ట్రాలలోని 59గ్రామాలలో పైలట్‌ పధకాన్ని అమలు చేయాలి. 2014 మార్చి, 2015 మార్చి నాటికి ఏటా లక్ష చొప్పున రెండులక్షల గ్రామాలకు, 2015సెప్టెంబరు నాటికి 50వేల గ్రామాలకు ఆ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. అయితే ఆ లక్ష్యాన్ని 2016 డిసెంబరు వరకు పొడిగించారు. మోడీగారు చెప్పినట్లే గడువు తీరి రెండు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికి లక్ష గ్రామాలకే విస్తరించింది. తన అసమర్ధపాలనలో ఎప్పటికి పూర్తవుతాయో మోడీగారు చెబితే నిజాయితీగా వుండేది. నాలుగున్నర సంవత్సరాలలో లక్షగ్రామాలకు కూడా నెట్‌ వర్క్‌ విస్తరించలేదు, ఏర్పాటు చేసింది కూడా ఎంత వేగంతో పని చేస్తుందో తెలియని స్ధితిలో మోడీగారు మనకు డిజిటల్‌ విప్లవం గురించి చెబుతారు, నాలుగవ పారిశ్రామికవిప్లవంలో భాగస్వాములను చేస్తామంటున్నారు.

డిజిటల్‌ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకారి అన్నది వాస్తవం. అన్న ప్రాసన నాడే ఆవకాయ అన్నట్లుగా, మెట్లు ఎ్క కుండానే మేడ ఎ్కవచ్చు అన్నట్లు అభివృద్ధిలో మిగతాదేశాలు అధిగమించిన దశలను మనం దాటకుండానే ఒక గెంతువేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందుబాటులోకి తెచ్చుకోవచ్చని, అభివృద్ధి చెందిన దేశాలలో అందుబాటులోకి వచ్చినవన్నీ మన కోసం కూడా సిద్దంగా వున్నాయని, అసలు ఇప్పటికే మనం ఆ దశలో ప్రవేశించిన విషయాన్ని అనేక మంది గుర్తించటం లేదని కొందరు చెబుతునాారు. వుపాధిని ఫణంగా పెట్టి ప్రవేశపెట్టే యాంత్రీకరణ సామాన్యులకు మేలు చేస్తుందా? ఎలా చేస్తుంది అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే పెట్టుబడిదారులు లేరు. అమెరికా, ఇతర అనేక దేశాలలో యాంత్రీకరణ ఎంతో ఎక్కువ, దాని వలన కార్పొరేట్లకు లాభాలు పెరిగాయి తప్ప అదనంగా వుత్పత్తి అయిన సంపదలో జనానికి దక్కిన వాటా ఎంత? అక్కడ ఆర్ధిక అసమానతలు భరించరాని విధంగా పెరిగాయని పెట్టుబడిదారీ మేథావి అయిన థామస్‌ పికెటీ చెప్పిన విషయాన్ని ఎలా మరచిపోగలం.ఇప్పటికే వుపాధిరహిత అభివృద్ధి జరుగుతోంది. పని చేసే జనం తక్కువగా వున్న దేశాలకు ఆటోమేషన్‌ లేదా రోబోలు అవసరం గావచ్చు. ఏటా కోటీ ఇరవై నుంచి కోటీ 30లక్షల మంది వరకు యువత తమకు వుపాధికావాలని వస్తున్న మన దేశంలో మన పరిశ్రమలలో వాటిని ప్రవేశపెడితే జరిగేదేమిటి? బెంగలూరులోని కెనరా బ్యాంకులో కన్నడం మాట్లాడే ఒక రోబో ఏ కౌంటర్‌కు వెళ్లాలో కస్టమర్లకు చెబుతుందట. సదరు బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు ఏ కౌంటర్‌ ఎక్కడుందో తెలిపే సూచనలు ప్రదర్శిస్తే సరిపోయేదానికి గొప్పలు చెప్పుకోవటానికి గాకపోతే ఎంతో ఖర్చు పెట్టి రోబోను పెట్టాల్సిన అవసరం ఏముంది? కన్నడేతరులు వస్తే ఏ భాష రోబో దగ్గరకు వెళ్లాలి.

మన దేశంలో ఆటోమేషన్‌ జరిగితే ఇప్పుడున్న ప్రతి నాలుగు వుద్యోగాలకు ఒకటి పోతుందని ఒక అంచనా. శ్రమశక్తి మీద ఆధారపడిన పరిశ్రమలు,వ్యవసాయం, వృత్తులు మిగతా దేశాలతో పోల్చితే చాలా ఎక్కువ వున్న మన దేశంలో ఇంకా అంతకంటే ఎక్కువే పోయినా ఆశ్చర్యం లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన ఒక నివేదిక ప్రకారం నాలుగో పారిశ్రామిక విప్లవం ప్రపంచవ్యాపితంగా వుపాధిని దెబ్బతీస్తుందన్నది నిరాకరించజాలని అంశమని తేలింది. ఆఫీసు,అడ్మినిస్ట్రేషన్‌, వుత్పాదకత, తయారీ, నిర్మాణ రంగాల మీద ప్రభావం చాలా ఎక్కువగా వుంటుంది. కొన్ని పరిశ్రమలను మూతవేయాలి, అనేకాన్ని అవసరాలకు అనుగుణ్యంగా మార్చుకోవాలి. అధునాత వుత్పాదకయంత్రాలు, పద్దతుల వలన వుత్పత్తి ఇబ్బడి ముబ్బడి అవుతుంది, ఆ మేరకు వుపాధిపెరగదు, అంతకు ముందుకంటే తగ్గినా ఆశ్చర్యం లేదు. అందువలన వుపాధి చర్చను పక్కన పెట్టి ముందుకు పోవాలని పెట్టుబడిదారులు సహజంగానే కోరుకుంటారు.ప్రతి పారిశ్రామిక విప్లవం సమాజంలో అసమానతలను పెంచింది తప్ప సంపదల పంపిణీని సమంగా పంచలేదు. సాంకేతిక ప్రగతి పెరిగిన కొద్దీ కొద్ది మంది చేతుల్లో పోగుపడుతున్న సంపదల వాటా కూడా పెరిగిపోతోంది.

Image result for BJP, 4th industrial revolution cartoons

ఎవరు కాదన్నా అవునన్నా మన దగ్గర వున్న కొనుగోలు శక్తి కలిగిన మధ్యతరగతి మార్కెట్‌ను ఎలా సొమ్ము చేసుకుందామా అని చూడటం తప్ప ప్రయివేటు రంగానికి మరొకటి పట్టదు. అదే చైనాలో మధ్యతరగతి మార్కెట్‌ను పెంచటంతో పాటు దిగువన వున్నవారిని కూడా మధ్యతరగతిగా మార్చే విధంగా సంపదల పంపిణీ జరగటమే దాని విజయానికి మూలం. మన జనానికి స్మార్ట్‌ ఫోన్‌ ఇస్తే దానిని ఎంత మంది వినియోగించగలరు అన్నది ప్రశ్నార్ధకంగా వున్న తరుణంలో అంతకు మించిన పరిజ్ఞానంతో ప్రమేయం వుండే నాలుగోపారిశ్రామిక విప్లవం గురించి మాట్లాడుకుంటున్నాం. దేశంలోని గ్రామాలన్నింటినీ విద్యుదీకరించామని నరేంద్రమోడీ ఘనంగా ప్రకటించిన వారం తిరగక ముందే 125కోట్ల మంది జనాభా వున్న భారత్‌లో 15శాతం మందికి(అంటే21కోట్ల మందికి) విద్యుత్‌ అందుబాటులో లేదని ప్రకటించింది. వారికి సెల్‌ఫోన్లు ఇచ్చినా ఛార్జింగ్‌ చేసుకోలేరు. ఈ ఏడాది జనవరి నాటికి మన దేశంలో ఇంటర్నెట్‌ను వినియోగించేవారు నూటికి 26శాతం మందే వున్నారట. ప్రస్తుతం మన దేశానికి ఏటా వచ్చే ఆదాయం ఒక రూపాయి అనుకుందాం. దానిలో వ్యవసాయరంగంలో వున్న 51శాతం కార్మికుల నుంచి 12పైసలు, 22శాతం మంది పని చేస్తున్న పారిశ్రామిక రంగం నుంచి 28, సేవారంగాలలో పని చేస్తున్న 27శాతం మంది నుంచి 60పైసల ఆదాయం వస్తోందని లెక్కలు చెబుతున్నాయి. మన జిడిపిలో 60శాతం సేవారంగం నుంచి వుండటం ఒక అస్ధిరతకు సూచిక. పశ్చిమ దేశాల ఆర్ధిక స్ధితిపై ఆధారపడి ఐటి, పొరుగుసేవల ఆదాయం వుంటుంది. అవి సజావుగా వున్నంత వరకు ఇబ్బంది లేదు, దెబ్బతింటే మనమూ నష్టపోతాం. చైనా విషయానికి వస్తే వ్యవసాయం నుంచి 2017లో 7.9శాతం, పరిశ్రమల నుంచి 40.5, సేవారంగం వాటా 51.6శాతం వుంది. ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా పేరుపొందిన చైనా మాదిరి మనం కూడా పారిశ్రామిక రంగాన్ని పటిష్టపరుచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.కృత్రిమ మేధస్సు అంటే ఆటోమేషన్‌ యంత్రాలు, రోబోలు రానున్న దశాబ్దంలో 20శాతం వుద్యోగాలను హరించనున్నాయని అంచనా. టాక్సీ డ్రయివర్లు, చేపలు పట్టటం, బేకరీ, ఫాస్ట్‌ఫుడ్‌ కేంద్రాలలో అయితే 80-90శాతం వుద్యోగాలు పోతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆటోమేషన్‌, రోబోలతో పనులు చేయించేందుకు అవసరమైన అత్యున్నత నైపుణ్యం కలిగిన కొద్ది మందికి డిమాండ్‌ వుంటుంది.గతంలో దేశం నీకేమిచ్చిందనే కంటే దేశానికి నీవేమిచ్చావనేది దేశభక్తి అని నూరిపోశారు. ఇప్పుడు పెద్ద మొత్తంలో వుద్యోగాలు హరించే అవకాశాన్ని ముందుగానే తెలిసిన పెట్టుబడిదారీ మేథావులు మనకు వుద్యోగభద్రత కంటే నైపుణ్యం ముఖ్యమని చెబుతున్నారు.

మన నరేంద్రమోడీగారు 2022 నాటికి(చాలా మంది ఈ సంవత్సరం ఎందుకు అని అడుగుతున్నారు అప్పటికి మన స్వాతంత్య్రానికి 75ఏండ్లు నిండుతాయి) రైతాంగ ఆదాయాలు రెట్టింపు చేస్తామని వూదరగొడుతున్నారు. అదే సంవత్సరానికి మన పరిశ్రమల్లో సాంకేతిక పరిజ్ఞానం వుపయోగించటం గురించి కూడా లక్ష్యాలను నిర్ణయించింది.మనలో చాలా మందిమి కార్లు,బస్సులను గడిగేందుకు మనుషుల బదులు యంత్రాలను వాడటం చూసి వుంటాము. పరిశ్రమల్లో పని చేసే ప్రతి వేల మంది కార్మికులకు ఎన్ని పారిశ్రామిక రోబోలు వున్నాయనే అంశాన్ని రోబో సాంద్రత అని పిలుస్తున్నారు. 2016లెక్కల ప్రకారం ప్రపంచ రోబో సాంద్రత సగటు 74. మన దేశంలో మూడు, అత్యధికంగా దక్షిణ కొరియాలో 631. సింగపూర్‌ 488,జర్మనీ 309, జపాన్‌ 303, అమెరికా 198,బ్రిటన్‌ 71, చైనా 68, బ్రెజిల్‌ 10, రష్యా 3తో వుంది. మన దేశంలో ఏటా 24శాతం పెంచుకుంటూ పారిశ్రామిక రోబోలను మన పారిశ్రామికవేత్తలు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో మొత్తంగా రోబో సాంద్రత మూడే అయినప్పటికీ ఆటోమొబైల్‌ రంగంలో అది 58గా వుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు పోటీబడి రాయితీలు ఇచ్చేది రోబోల ఏర్పాటుకు తప్ప కార్మికులకు వుపాధి కల్పించేందుకు కాదు.

ఆధునిక యంత్రాలు, కంప్యూటర్లు, రోబోల మీద పని చేసే నిపుణులైన మానవశ్రమ శక్తి తప్ప కండలను కరగించే శారీరక శ్రమ చేసే వారు కాదని పెట్టుబడిదారీ ప్రతినిధులైన ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌ ఎప్పుడో గుర్తించాయి. అలాంటి వారిని తయారు చేయాలంటే ధనిక దేశాలలో ఎంతో ఖర్చు అవుతుంది. కనుక మన వంటి దేశాలలో ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీలను ఇబ్బడి ముబ్బడిగా పెట్టాలని సలహాయిచ్చి చౌకగా దొరికే ఇంజనీర్లను తయారు చేయాలని కోరింది. దాని ఫలితమే చెట్టుకొకటి పుట్టకొకటిగా వెలిసిన ఇంజనీరింగ్‌ కాలేజీలు. మన విద్యావ్యాపారులు కొన్ని చోట్ల కొందరు నిపుణులను తయారు చేస్తున్నప్పటికీ అత్యధికులకు నైపుణ్యం తప్ప సర్టిఫికెట్‌లు ఇచ్చి జనాన్ని మార్కెట్లోకి తోలుతున్నాయి. వారి ప్రతిభా, ప్రావిణ్యాల గురించి 2017లో యాస్పరింగ్‌ మైండ్స్‌ అనే సంస్ధ ఒక సర్వే చేసి నమ్మలేని నిజాలను వెల్లడించింది. విద్యావ్యాపారులు దాన్ని తోసిపుచ్చగా ఐటి కంపెనీల యజమానులు నిర్ధారించారు.తొంభై అయిదు శాతం ఇంజనీరింగు పట్టభద్రులు సాప్ట్‌వేర్‌ అభివృద్ధి వుద్యోగాలకు పనికి రారన్నది సర్వేసారం. పోనీ అది అతిశయోక్తితో కూడింది అనుకుందాం. పది సంవత్సరాల క్రితం మెకెన్సీ సంస్ధ పాతికశాతం మంది మాత్రమే వుద్యోగాలకు పనికి వస్తారు అన్నది. ఇలాంటి పరిస్ధితికి కారకులు ఎవరు? అన్నింటినీ మాకు వదలి పెట్టండి దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోతామో చూడండి అనే ప్రయివేటు రంగం కాదా ! విద్యావ్యాపారంలో లేని పారిశ్రామిక సంస్ధను ఒక్కదానిని చూపమనండి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచంలో అదే లాభసాటి వ్యాపారం. ఈరోజు ఇంజనీరింగ్‌ చదివి వుద్యోగం పేరుతో పనిచేస్తున్న అనేక మందికి చాలా మంది అడ్డామీది రోజువారీ కూలీకి వస్తున్న మొత్తాలకంటే తక్కువే అన్నది చేదు నిజం. గతంలో విదేశీ తెల్లజాతి మెకాలే తమకు అవసరమైన గుమస్తాలను తయారు చేసే విద్యావిధానం, వ్యవస్ధలను ఏర్పాటు చేస్తే నేటి మన నల్లజాతి మెకాలేలు కారుచౌక ఇంజనీరింగ్‌ గుమస్తాలను సరఫరా చేస్తున్నారు.’ఈ రోజు ఢిల్లీలో 60శాతం మార్కులు తెచ్చుకున్నవారు కూడా బిఏ ఇంగ్లీష్‌ కోర్సు సీటు తెచ్చుకోలేరుగాని ఇంజనీరింగ్‌కాలేజిలో సులభంగా చేరిపోతున్నారని’ టెక్‌ మహీంద్రా సిఇఓ సిపి గుర్నానీ వ్యాఖ్యానించారు. నాలుగో పారిశ్రామిక విప్లవం గురించి చెబుతున్న మన రాజకీయవేత్తలు, విధాన నిర్ణేతలకు ఏ నిపుణులు ఎందరు కావాలో, అందుకు అనుసరించాల్సిన ప్రణాళికలేమిటో ఎవరైనా చెప్పగలరా ? ఇంజనీరింగ్‌,మెడికల్‌ కాలేజీల్లో సంపూర్ణ అర్హతలు కలిగిన బోధకులు వున్నారా, అవసరమైన ప్రయోగశాలలు వున్నాయా లేదా అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? వీరు దేశాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవంలోకి దేశాన్ని తీసుకుపోతారా? మనం నమ్మేయాలా ?

ఇటీవలి కాలంలో నైపుణ్య అభివృద్ధి గురించి ప్రధాని మోడీ, మాట్లాడని ముఖ్యమంత్రి లేరు. అందుకోసం వందల కోట్లరూపాయలు తగలేస్తున్నారు.నివేదికల్లో అసంఖ్యాకంగా నిపుణులను సృష్టిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ చర్యల వలన ఇప్పటికే తన ఆదాయం రెట్టింపైందని చత్తీస్‌ఘర్‌కు చెందిన గిరిజన మహిళా రైతు చెప్పిన అంశాన్ని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకుంది. తీరా చూస్తే అధికారులు తనను అలా చెప్పమన్నారని ఆమె ఒకటీవి బృందానికి చెప్పింది. ఆ వార్తను ప్రసారం చేసిన సదరు ఎడిటర్‌, యాంకర్‌ను వుద్యోగాల నుంచి ఇంటికి పంపే విధంగా మోడీ సర్కార్‌ టీవీ ఛానల్‌ యాజమాన్యంపై వత్తిడి తెచ్చిన వుదంతం తెలిసిందే. అలాంటి వారందరినీ లెక్కలోకి తీసుకున్నా మన దగ్గర వున్న నిపుణులైన పనివారలెందరో చూస్తే దిమ్మదిరుగుతుంది. మన దగ్గర నిపుణులైన పనివారలే తక్కువ, అవసరమైన వృత్తి శిక్షణ ఇచ్చే సామర్ధ్యం కూడా మన దగ్గర లేదని నివేదికలు చెబుతున్నాయి. మొత్తం కార్మికుల సంఖ్యతో పోలిస్తే వృత్తిశిక్షణ సామర్ధ్యం చైనాలో 11.5శాతం కాగా అమెరికాలో 6.7, అదే మన దేశంలో 0.8శాతం మాత్రమే. దేశాల వారీగా దక్షిణ కొరియాలో 96, జపాన్‌లో 80, జర్మనీలో 75, బ్రిటన్‌లో 68శాతం మంది వున్నారు. రెండుశాతమే మన దగ్గర అని చెప్పుకోకపోవటమే మంచిది.

ఒక వైపు ప్రధాని నరేంద్రమోడీ పురోగామి మహోపన్యాసాలు మరోవైపు ఆయన అనుయాయులేమో స్త్రీల రుతుస్రావం అపవిత్రమంటూ వీధుల్లో అల్లరి, దాడులు చేస్తుంటారు. పనిలేని వారు ఏదో చేశారన్నట్లుగా కొందరు అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గానూ, సిమ్లాను శ్యామలాగా మార్చేందుకు, మసీదులను పడగొట్టి గుడులు ఎలా కట్టాలా అని, మరి కొందరు అయ్యప్ప గుడికి వచ్చే మహిళా భక్తులు మీద ఎలా దాడులు చెయ్యాలా అని తిరుగులేని తిరోగామి ఆచరణలో మునిగి తేలుతుంటారు. మోడీ, ఆయన అనుయాయులను తయారు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ దళం చేస్తున్న వాదనల ప్రకారం రాజారామ్మోహన్‌ రాయ్‌ బ్రిటీష్‌ వారితో చేతులు కలిపి మన పవిత్ర సతీసహగమన ఆచారాన్ని మట్టికలిపారు. వితంతు పునర్వివాహ నిషేధం, బహుభార్యాత్వం, దేవదాసీ వంటి మన హిందూ ఆచారాలు సాంప్రదాయాలను తిరిగి పునరుద్దరించాల్సిందే. అవి లేకుండా పోయిందని చెబుతున్న మన గత గౌరవం, ఘనత తిరిగిరాదు. వాటన్నింటి పునరుద్ధరణ ప్రపంచంలో మరోమారు మన దేశాన్ని వున్నత స్ధానంలో వుంచుతుంది. అందుకుగాను వున్న రాజ్యాంగాన్ని రద్దు చేయాలి. మనువు కంటే ముందే మన ఆచారాలు వున్నాయి గనుక వాటిని క్రోడీకరించటం తప్ప కొత్తగా చేసిందేమీ లేని మనుస్మృతిని తిరిగి ప్రవేశపెట్టాలి. సాంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ పేరిట సామాజిక మాధ్యమం, వీధుల్లో వేస్తున్న వీరంగాలను చూస్తే అంతపనీ చేసినా ఆశ్చర్యం లేదు. అందుకే అంతరకు వచ్చినపుడు ఏం చేయాలో, ఏ వైపున వుండాలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే ఆలోచించుకోవటం మంచిది. ఇలాంటి వారి నాయకత్వంలో మహా అయితే కుక్కతోకపట్టుకొని గోదావరి కాక పోతే గత నాలుగేండ్లలో మరింతగా మురికి అయిందని వార్తలు వచ్చిన గంగానదిని ఈదగలమేమోగానీ నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించగలమా ?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

వాణిజ్య యుద్ధంతో ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు

10 Tuesday Jul 2018

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, USA

≈ Leave a comment

Tags

INDIA, Indonesia, TRADE WAR, Trade war India, Trade war puts Indonesia and India at risk

Image result for trade war

ఎం కోటేశ్వరరావు

ప్రపంచ పౌరుల ఆకాంక్షలకు విరుద్దంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్రలో అతిపెద్ద ప్రపంచ వాణిజ్య యుద్ధం ప్రారంభసూచికగా జూలై ఆరవతేదీ అర్ధరాత్రి చైనా మీద తొలి తూటా పేల్చాడు. గతంలో కూడా వాణిజ్య యుద్ధాలు జరిగినప్పటికీ తాజా పరిణామం పర్యవసానాలు తీవ్రంగా వుంటాయనే అభిప్రాయాలు, భయాలు వెలువడుతున్నాయి. చైనా, ఇతర దేశాల మీద ప్రారంభించిన యుద్ధంతోతాము ఎంతో కొంత లాభపడవచ్చనే ఆశ అమెరికన్‌ కార్పొరేట్లలో అంతర్గతంగా వుంది. అయితే అదే సమయంలో జరిగే నష్టాల గురించి కూడా అంతే భయపడుతున్నా. లాభాల గురించి బహిరంగంగా చెప్పుకోలేరు, ఇదే సమయంలో ప్రతికూలతల గురించి మీడియాలో ఎన్నో హెచ్చరికలు వెలువడుతున్నాయి. అమెరికా దిగుమతులపై విధించిన పన్నుద్వారా వసూలయ్యే మొత్తాన్ని అమెరికా ఆంక్షలతో ప్రభావితమయ్యే చైనా కంపెనీలు, కార్మికుల కోసం వినియోగిస్తామని చైనా ప్రకటించింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులను ఇతర దేశాల నుంచి సేకరించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని కూడా సూచించింది. అమెరికా-చైనా రెండూ కూడా దీర్ఘకాల వాణిజ్య యుద్ధానికి సిద్దపడుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. అమెరికా వుత్పత్తులపై అదనపు పన్ను వసూలు ప్రారంభించిన చైనా మరోవైపు గతంలో నిలిపివేసిన తమ కోడి మాంస దిగుతులకు అనుమతించినట్లు జర్మనీ మంత్రి ప్రకటించారు.

వాణిజ్య యుద్ధాలను, వాటిలో భాగంగా దిగుమతి పన్నులను విధించేందుకు అధ్యక్షుడికి వున్న అధికారాలను పరిమితం చేయాలని నేషనల్‌ టాక్స్‌ పేయర్స్‌ ఫౌండేషన్‌ విశ్లేషకుడు ఆండ్రూ విల్‌ఫోర్డ్‌ ‘యుఎస్‌ఏ టుడే’లో పేర్కొన్నాడు. దాని సారాంశం ఇలా వుంది. 1962లో చేసిన వ్యాపార విస్తరణ చట్టంలోని అవకాశాలను ట్రంప్‌ వినియోగిస్తున్నాడు. నిర్దిష్ట జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే వాటికోసం చేసిన చట్టాలను దుర్వినియోగపరుస్తూ దేశ వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నందున, పార్లమెంట్‌ జోక్యం చేసుకొని అధ్య క్షుడిని నిలువరించాలి. అల్యూమినియం, వుక్కు దిగుమతుల ద్వారా దేశభద్రతకు ముప్పు తలెత్తిందని ట్రంప్‌ పేర్కొన్నాడు. అయితే 2010-15 మధ్య దేశీయంగా వుత్పత్తి అయిన వుక్కులో కేవలం సగటున మూడుశాతం లోపే జాతీయ భద్రతకు వినియోగిస్తున్నట్లు తేలింది, అవసరానికి మించి దేశంలో వుత్పత్తి వుంది, అదే విధంగా దిగుమతి చేసుకున్న వుక్కులో జాతీయ భద్రతకు వినియోగిస్తున్నది సగటున 2.4నుంచి 2.8శాతం మధ్యనే వుంది, ఆ దిగుమతులలో కూడా అత్యధిక భాగం భాగస్వామ్య లేదా మిత్ర దేశాల నుంచే వున్నాయి. వుక్కు పరిశ్రమలో వుపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. గత ఐదు సంవత్సరాలలో ఐదు పెద్ద కంపెనీలు మార్కెట్‌ కాపిటలైజేషన్‌ను రెట్టింపు చేసుకున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా వుత్పాదకత గణనీయంగా పెరిగింది.అల్యూమినియం, వుక్కు దిగుమతులపై పన్నుల విధింపు కారణంగా నిఖరంగా 4.7లక్షల వుద్యోగాలు పోతాయి. ఇవి అమెరికా వుక్కు పరిశ్రమలో పని చేస్తున్న లక్షా 40వేల మందికి మూడు రెట్లు. బలమైన ఆర్ధిక వ్యవస్ధ లేకుండా బలమైన జాతీయ భద్రత సాధ్యం కాదని వాణిజ్య మంత్రి విల్‌బర్‌ రోస్‌ స్వయంగా చెప్పాడు. పన్నుల విధింపు తగదని వంద మంది రిపబ్లికన్‌ ఎంపీలు లేఖ రాశారు. ట్రంప్‌ వినియోగిస్తున్న చట్టంలోని నిబంధనను 1979,82 సంవత్సరాలలో ఇరాన్‌, లిబియా చమురు దిగుమతుల నిరోధానికి వినియోగించారు.

రక్షణాత్మక చర్యలను చేపట్టబోయే ముందు వస్తువుల నిజమైన జాతీయత ఏమిటో తెలుసుకోవాలని లాసానే విశ్వవిద్యాలయ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌ స్టెఫానే గారెలీ హితవు చెప్పాడు. ఆయన వాదన ఇలా వుంది. ప్రపంచీకరణ యుగంలో వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం అంత సులభం కాదు. కొద్ది సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా, లాస్‌ ఏంజల్స్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఒక ఐపాడ్‌లోని 431భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొన్నారు.ప్రపంచంలోని పలు దేశాల నుంచి వచ్చిన ఆ భాగాలను చైనాలోని ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీలో ఐపాడ్‌గా రూపొందిస్తారు. అంతిమ వుత్పత్తిపై చైనా జోడించే విలువ ఐదుశాతం మించటం లేదు. అయితే అమెరికా కస్టమ్స్‌ శాఖ వద్దకు వచ్చే సరికి అది చైనా తయారీ వుత్పత్తిగా పరిగణించబడుతోంది. అది నిజంగా చైనా వుత్పత్తా ? అమెరికా వాణిజ్యలోటు అది చేసుకొనే దిగుమతుల కారణంగా ఏర్పడుతోంది. మెక్సికో నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే వాటిలో 40శాతం మెక్సికోలోని అమెరికన్‌ కంపెనీలు లేదా అమెరికాకు మాత్రమే ఎగుమతి చేసే మెక్సికో స్ధానిక కంపెనీల నుంచి వుంటున్నాయి. చైనా నుంచి చేసుకొనే దిగుమతులు కూడా అలాంటివే. వాణిజ్య వ్యూహాలలో భాగంగా స్మార్ట్‌ ఫోన్ల తయారీకి గూగుల్‌ ఆండ్రాయిడ్‌ వుచితంగా సాప్ట్‌వేర్‌ను అందచేస్తున్నది. దానికి గనుక ధర నిర్ణయిస్తే ఏడాదికి రెండువందల బిలియన్‌ డాలర్లు వుంటుంది. ఆ మొత్తం అమెరికా వాణిజ్యలోటులో సగం.

వాణిజ్యం యుద్ధం విస్తరిస్తే అమెరికా అధ్య క్షుడు జర్మన్‌ ఆటో పరిశ్రమకు కూడా ముప్పు తెస్తున్నట్లే. బిఎండబ్ల్యు సౌత్‌ కరోలినా లోని స్పార్టన్‌బర్గ్‌, అలబామాలోని వాన్స్‌లో మెర్సిడెస్‌, టెనెసీలోని ఛాటూంగాలో ఓక్స్‌వాగన్‌ కార్లు తయారవుతాయి. ఇవి ఎగుమతుల కోసం కూడా తయారు చేస్తాయి. గతేడాది బిఎండబ్ల్యు తయారు చేసిన వాటిలో 70శాతం ఎగుమతి చేశారు. వీటిని అమెరికన్‌ కార్లు అనాలా జర్మనీవి అనాలా ? వాణిజ్య యుద్ధానికి ముందు అమెరికా తయారీ కార్లపై చైనా దిగుమతి పన్ను తగ్గించిన కారణంగా ఫోర్డ్‌, టెల్సా వంటి కంపెనీలు కొద్దివారాల ముందు చైనాలో పదిహేనుశాతం వరకు కార్లధరలను తగ్గించాయి. అమెరికా ప్రారంభించిన యుద్ధంతో చైనా విధించిన ప్రతికూల సుంకాల కారణంగా ఇప్పుడు 40శాతం పన్నుతో ధరలు పెరిగాయి. ఈ పన్నులను వినియోగదారుల నుంచి వసూలు చేయటం తప్ప తాము భరించలేమని బిఎండబ్ల్యు చైనా ప్రకటించింది.1974 నుంచి అమలులోకి వచ్చిన కొయొటో ఒప్పందం ప్రకారం ఒక వస్తువు తయారీలో కనీసంగా స్ధానిక అంశం ఎంత వుంది లేదా చివరి తయారీ క్రమం పాత్ర ఎంత అనేది నిర్ధారించవచ్చు. అయితే ప్రపంచీకరణ మరియు డిజిటలైజేషన్‌ సంక్లిష్టతను పెంచాయి. వివిధ విడిభాగాలతో తయారైన ఒక వస్తువులు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఆయాప్రాంతాల సామర్ధ్యం, ధరలను బట్టి మారిపోతుంటాయి.

ప్రపంచీకరణ కారణంగా ఒక ఆర్ధిక వ్యవస్ధను వేరు చేసి చూడటం కష్టం అనే విషయాన్ని బ్రెక్సిట్‌ మద్దతుదారుల మాదిరి అమెరికా అధ్యక్షుడు విస్మరించినట్లు కనిపిస్తోంది. ఇతర దేశాలలో అమెరికా ఎనిమిది లక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టింది, అలాగే ఇతర దేశాలు అమెరికాలో ఏడులక్షల కోట్ల డాలర్ల మేరకు పెట్టుబడులు పెట్టాయి. మొత్తం మీద ప్రపంచ జిడిపిలో ప్రత్యక్ష పెట్టుబడులు 35శాతం వరకు వుంటాయి. ఎనిమిది కోట్ల మందికి వుపాధి కల్పిస్తున్నాయి. ప్రయివేటు జీవితంలో వివాహం చేసుకోవటం కంటే విడిపోవటం ఎంతో సంక్లిష్టం, ఖరీదైనది. అంతర్జాతీయ వాణిజ్యం మీద చూపే ప్రభావాన్ని స్పష్టంగా చూడాలంటే కస్టమ్స్‌ లెక్కల నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనేదానికంటే ఒక వస్తువు వుత్పత్తిలో విలువ జోడింపు మీద కేంద్రీకరించాలి. బ్లాక్‌ చెయిన్‌ ద్వారా నమోదయ్యే లావాదేవీల ద్వారా వికేంద్రీకరణ చెందిన మరియు నిరాకార ప్రపంచంలో ఎవరు దేనికి యజమానులో ఎలా చెప్పగలం? జాన్‌మైేునార్డ్‌ కీన్స్‌ చెప్పినట్లు సమస్యలన్నీ ఆర్ధిక పరమైనవి అయితే పరిష్కారాలన్నీ రాజకీయ పరమైనవి అయినందున ట్రంప్‌తో మనం జీవించాల్సి వుంది.

వాణిజ్య యుద్ధం జరిగితే నష్టపోయేది అమెరికా అని గతంలో బిల్‌క్లింటన్‌ హయాంలో సహాయ విత్తమంత్రిగా చేసిన ప్రొఫెసర్‌ జె బ్రాడ్‌ఫోర్డ్‌ డెలాంగ్‌ స్పష్టం చేశారు. మోటార్‌ సైకిళ్ల తయారీలో పేరెన్నికగన్న హార్లే డేవిడ్స్‌న్‌పై ఇటీవల డోనాల్డ్‌ ట్రంప్‌ విరుచుకుపడటం అమెరికా ప్రజాస్వామ్యం మీదే దాడి వంటిదని, నవంబరులో జరిగే ఎన్నికలలో వుభయ సభలలో ఒకదానిలో అయినా మెజారిటీ సంపాదించగలిగితే తప్ప ట్రంప్‌, రిపబ్లికన్‌ పార్టీ నేతలు ప్రపంచంలో దేశ ప్రతిష్టకు చేసిన నష్టాన్ని సరిచేయలేమని అన్నారు. బ్రాడ్‌ఫోర్డ్‌ విశ్లేషణలో ఇలా పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరిలో హార్లే డేవిడ్స్‌న్‌ అధికారులు, యూనియన్‌ నేతలతో ట్రంప్‌ ఒక సమావేశం జరిపారు. ఈ కంపెనీ అమెరికాలో వస్తువులను తయారు చేస్తున్నది, నేను చూస్తుండగానే దాన్ని విస్తరించాలని చెప్పాడు. ఏడాది తిరగ్గానే పరిస్ధితులు మారిపోయాయి. దిగుమతి చేసుకున్న అల్యూమినియం, వుక్కుపై పన్నులు విధిస్తామని ట్రంప్‌ చేసిన ప్రకటన కారణంగా ఐరోపా యూనియన్‌ ప్రతికూల చర్యలకు గురికాని ప్రాంతాలకు కొన్ని కార్యకలాపాలను తరలిస్తామని మోటార్‌ సైకిల్‌ కంపెనీ ప్రకటించింది. దాన్ని చూడగానే ట్రంప్‌ ఆ కంపెనీ మీద దాడి చేశాడు. ఒకసారి బయటకు పోయిన తరువాత తిరిగి అమెరికాలో పెద్ద మొత్తంలో పన్ను చెల్లించకుండా అమ్ముతామంటే కుదరదు అని హెచ్చరించాడు. వారు మరొక దేశంలో ఫ్యాక్టరీ నిర్మించటానికి వీల్లేదంటే వీల్లేదు, వారు ఇక్కడి నుంచి తరలటం అంటే అంతానికి ఆరంభం అని ట్వీట్లలో వాగాడు.

వాణిజ్య యుద్ధం తధ్యమనే అభిప్రాయంతో చైనాలోని కొన్ని కంపెనీలు వేరే దేశాలకు తరలించేందుకు ఆలోచన చేశాయి, ఇంకా చేస్తున్నాయి. అక్కడ పెరుగుతున్న వేతనాలతో అనేక కంపెనీలు ఎప్పటి నుంచో తక్కువ వేతనాలకు శ్రమ దొరికే చోటికి తరలిపోవాలని చూస్తున్నాయి. ఇదే సమయంలో అమెరికాతో వాణిజ్యంలో చైనాకు ఎంతో మిగులున్న కారణంగా చైనాను లంగదీసుకోవచ్చనే అభిప్రాయం కొంత మందిలో లేకపోలేదు. చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఐదువందల బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువుల మీద పన్ను విధిస్తానంటున్నాడు ట్రంప్‌, దానికి పోటీగా చైనా ఎంతపన్ను విధించినా 130 బిలియన్‌ డాలర్ల మేరకే దాని దిగుమతులున్నాయని వారు గుర్తు చేస్తున్నారు. వాణిజ్య యుద్ధాలు మంచివి, విజయం సాధించటం సులభం అని ట్రంప్‌ చెప్పారు, వాస్తవం ఏమంటే వాటిలో పాల్గనేవారే కాదు వాణిజ్య యుద్ధాలు ప్రతి ఒక్కరినీ నష్టపరుస్తాయి, ఎవరూ గెలవజాలరని ఆస్ట్రేలియా సిడ్నీ మోర్నింగ్‌ హెరాల్డ్‌ పత్రికలో ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. ఒక వేళ విజయం సాధించినా అది పరిమితం. ట్రంప్‌ తన కలలను నిజం చేసుకోవాలంటే చైనా లేదా ఐరోపా యూనియన్‌ అందచేసే వస్తువులను స్ధానికంగా తయారుచేసేందుకు మరిన్ని ఫ్యాక్టరీలను పెట్టాలి, వాటిద్వారా మరిన్ని వుద్యోగాలను కల్పించవచ్చు. అయితే అలా తయారు చేసే వస్తువులు ఎంతో ప్రియమైనవిగా పరిమితంగా వుంటాయి.

వాణిజ్యయుద్ధ తుపాకి గుండు పేల్చాలన్న నిర్ణయం దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఒక్క చైనాకే పరిమితం చేయలేదు, కెనడా, మెక్సికో, ఐరోపా యూనియన్‌ నుంచి దిగుమతి చేసుకొనే వాటి మీద కూడా పన్నులు విధించాడు. అదే జరిగితే అమెరికా దిగుమతి చేసుకొనే 300 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై కూడా ఐరోపా యూనియన్‌ పన్నులు విధిస్తుంది. ప్రభావాలు, అనిశ్చిత పరిస్ధితులు పరిస్ధితిని మరింత దిగజార్చుతాయి. ఐరోపా యూనియన్‌, ఇతర అమెరికా మిత్రదేశాలకు చైనాతో స్వంత సమస్యలు వున్నాయి. ట్రంప్‌ గనుక వాణిజ్యదాడిని ఒక్క చైనాకే పరిమితం చేసి వుంటే వారంతా కలసి వచ్చేవారు. దానికి బదులుగా ఐరోపా యూనియన్‌, జపాన్‌, దక్షిణ కొరియా, కెనడా, మెక్సికోలపై చర్యల ద్వారా అమెరికాను ఒంటరిపాటు చేశాడని ఆస్ట్రేలియా పత్రిక పేర్కొన్నది.

తొలి దఫా పన్నుల అర్ధం వాణిజ్య యుద్ధ పూర్తి స్ధాయి ప్రభావం ఎలా వుంటుందో అనుభవించటానికి అమెరికన్‌ వినియోగదారులు ఒక అడుగు దగ్గర కావటమే అని నేషనల్‌ రిటైల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మాథ్యూ సాహే అన్నారు. విధించే పన్నులు అమెరికా వుద్యోగాలనేమాత్రం కాపాడలేవు, కానీ అవి పన్నుల సంస్కరణద్వారా పొందిన లబ్దిని దెబ్బతీస్తాయి, అనేక వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తాయి, తమ గదులకు అవసరమైన చిన్న ఫ్రిజ్‌లకు విద్యార్ధులు అధిక మొత్తాలను చెల్లించాల్సి వస్తుంది, ఏకపక్షంగా పన్నులు విధించటం తప్పుడు పద్దతి, దానిని వెంటనే నిలిపివేయాలి అని కూడా సాహే చెప్పారు.

ఇరవై లక్షల కోట్ల పెద్ద అమెరికా ఆర్ధిక వ్యవస్ధతో పోల్చితే వాణిజ్య యుద్ధం, దానిలో 34బిలియన్‌ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించటం సముద్రంలో కాకిరెట్ట వంటిదని, దీని వలన కొంత మంది నష్టపోతారు, కొందరు లాభపడతారు అని ఓక్స్‌ డాట్‌కామ్‌ విశ్లేషణలో పేర్కొన్నారు. చట్టపరంగా చెప్పాలంటే 34బిలియన్‌ డాలర్ల చైనా వస్తువులపై 25శాతం పన్ను విధింపు అక్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని తస్కరిస్తున్న చైనాను శిక్షించటమే. ట్రంప్‌ వాక్పటిమలో 300బిలియన్‌ డాలర్లపై పన్ను విధిస్తామని చెప్పాడు. ఇరవైలక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్ధ కలిగిన అమెరికాకు గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న 478బిలియన్‌ డాలర్ల దిగుమతులు చాలా తక్కువ. మరో విధంగా చెప్పాలంటే 2017లో ఏడాదికి 150 బిలియన్‌ డాలర్ల మేరకు పన్ను రాయితీలు ఇవ్వాలన్న పార్లమెంట్‌ తీర్మానంతో పోలిస్తే 25శాతం పన్ను విధింపుద్వారా ఏడాదికి వచ్చే 8.5బిలియన్‌ డాలర్లు ఏపాటి? వాషింగ్‌మెషిన్ల పరిశ్రమకు పన్నుల మొత్తం పెద్దగా వుండవచ్చుగాని ఒక మిషన్‌ కొనే పౌరుడికి పెద్ద భారం అనిపించదు. వాషింగ్టన్‌ పోస్టు పత్రిక సమాచారం ప్రకారం 1977 తరువాత తొలిసారిగా జనవరిలో పన్నులు పెంచిన కారణంగా మార్చినెల నుంచి వాషింగ్‌ మెషిన్ల ధరలు 16శాతం పెరిగాయి. పౌరులు వాటిని రోజూ కొనరు కదా ! అయినప్పటికీ 2015లో వున్న ధరలకంటే ఇప్పుడు చౌకగానే వున్నాయి. అనేక పరికరాల ధరలు గత కొద్ది సంవత్సరాలుగా పడిపోతున్నాయి, ట్రంప్‌ వాటిని కొద్దిగా పెంచారు. దాని కధనం ఇలా సాగింది.

Image result for trade war

వాణిజ్య యుద్ధం కారణంగా అమెరికాలో ధరలు పెరిగి, అభివృద్ధి దిగజారుతుందని ప్రభుత్వ నిధులతో నడిచే వాయిస్‌ ఆఫ్‌ అమెరికా రేడియో పేర్కొన్నది.తొలుత 34 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులపై విధించిన 25శాతం పన్నుతో అటు చైనా, ఇటు అమెరికాపై ఆర్ధికంగా పెద్దగా ప్రభావం చూపదు. నష్టం తరువాత పెరుగుతుంది. గతేడాది చైనా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల విలువ 506బిలియన్‌ డాలర్లు కాగా అవసరమైతే తాను 550 బిలియన్‌ డాలర్ల వస్తువులపై పన్ను విధిస్తానని ట్రంప్‌ పేర్కొన్నాడు. పన్నులను విస్తరించే కొద్దీ వినియోగదారులకు ధరలు పెరుగుతాయి, దిగుమతి చేసుకొనే విడిభాగాలపై ఆధారపడిన కంపెనీల ఖర్చు పెరుగుతుంది.ద్రవ్యమార్కెట్‌లు దడదడలాడతాయి.కొంత మందిని లేఆఫ్‌ చేయవచ్చు, చైనాతో ట్రంపేమైనా రాజీకి వస్తారా అని వాణిజ్యపెట్టుబడులపై నిర్ణయం తీసుకొనేందుకు వేచి చూస్తారు. గతేడాది పన్నుల తగ్గింపు ద్వారా కల్పించిన అనేక ఆర్ధిక లబ్దులు ప్రమాదంలో పడతాయి. పూర్తి స్ధాయి వాణిజ్య యుద్దం జరిగితే బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇతరులు హెచ్చరించినట్లుగా అమెరికా ఆర్ధిక వ్యవస్ధ మాంద్యంలోకి పోయే ప్రమాదముంది. అమెరికా సోయాలో 60శాతం దిగుమతి చేసుకుంటున్న చైనా హెచ్చరిక కారణంగా గత నెలలో 17శాతం మేరకు ధరలు పడిపోయాయి. ఇదే సమయంలో చైనా కరెన్సీ విలువ డాలరు మారకంతో గతనెలలో 3.5శాతం పడిపోయింది. ఇది అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి చైనా కంపెనీలకు వూతమిస్తుంది. అమెరికా వినియోగదారుల మీద ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ట్రంప్‌ యంత్రాంగం చైనా పారిశ్రామిక వస్తువుల మీదనే తొలుత కేంద్రీకరించింది. అయితే ఆ చర్య ద్వారా కంపెనీల యంత్రాల ధరలు పెరిగితే ఆ భారాన్ని అవి చివరికి తమఖాతాదారులు, వినియోగదారులమీదనే మోపుతాయని వాయిస్‌ ఆఫ్‌ అమెరికా తెలిపింది.

అమెరికా-చైనాల మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ఇండోనేషియా, భారత్‌లకు ముప్పు కలిగించవచ్చని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ రేటింగ్స్‌ ప్రధాన ఆర్ధికవేత్త పాల్‌ గ్రుయెన్‌వాల్‌ హెచ్చరించాడు. వర్ధమాన దేశాల మార్కెట్లనుంచి మంచి వడ్డీ రేట్లు వస్తున్న అమెరికాకు మదుపుదార్లు తమ పెట్టుబడులను తరలిస్తున్నారని, మిగతా ఆసియా దేశాలతో పోల్చితే ఇండోనేషియా, భారత్‌లకు ఎక్కువ ముప్పు వుందన్నాడు.పతనమౌతున్న ఇండోనేషియా కరెన్సీ రుపయా విలువ నిలబెట్టేందుకు, స్టాక్‌మార్కెట్ల నుంచి పెట్టుబడుల వుపసంహరణను నివారించేందుకు మే, జూన్‌ నెలల్లో వడ్డీ రేట్లను పెంచింది. పెట్టుబడులరాక మందగించటం, వున్న పెట్టుబడులు బయటకు పోతుండటంతో భారత్‌ కూడా నాలుగేండ్లలో తొలిసారి వడ్డీ రేట్లను పెంచింది. క్రమంగా పెరుగుతున్న వేతనాలు ఆర్ధిక వ్యవస్ధపై విశ్వాసాన్ని కలిగిస్తూ చైనా ఆర్ధిక పురోగతిని కొనసాగిస్తున్నాయి, అది బ్యాంకింగ్‌ వ్యవస్ధలో డబ్బును మదుపు చేయటానికి జనాన్ని ప్రోత్సహిస్తున్నది, ఆ సొమ్మును కంపెనీలకు రుణాలుగా ఇస్తున్నారని, ఈ వలయం తిరుగుతున్నంత వరకు బయటకు పోయే అవకాశం లేదు, తరువాత ఆ విధానం కొనసాగుతుంది, ఒక వేళ విశ్వాసం కోల్పోయినట్లయితే కరెన్సీ మారకపు విలువమీద, విదేశీమారపు నిల్వల మీద వత్తిడి పెరుగుతుందని గ్రుయెన్‌వాల్‌ పేర్కొన్నాడు.

వాణిజ్య యుద్ధం ప్రారంభమై ఇంకా వారం కూడా గడవ లేదు. దాని ప్రభావం గురించి ప్రారంభానికి ముందూ వెనుకూ ఎలా వున్నాయో చూశాము. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు, ప్రభావాలు వెల్లడవుతాయి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

పిల్లి నల్లదా తెల్లదా అని కాదు ఎలుకలను పడుతుందో లేదో చూడాలి !

14 Monday Aug 2017

Posted by raomk in CHINA, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Politics, Uncategorized

≈ Leave a comment

Tags

anti china, Anti communist, China, cow sciences, economic reforms, INDIA, india china comparison, India Independence Day

ఎం కోటేశ్వరరావు

దేశంలో ప్రస్తుతం ఒక ప్రమాదకరమైన వాతావరణం రోజురోజుకూ విస్తరిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వానికి ప్రతీక మన గత చరిత్ర. గత ఘనతను చెత్తబుట్టలోకి నెట్టి మా శంఖంలోంచి వచ్చిందే పవిత్ర తీర్ధం, మేం చెప్పేదే అసలైన చరిత్ర,అదే వేదం, మేమే నిజమైన దేశభక్తులం, మాతో విబేధించేవారందరూ దేశ ద్రోహులే అనే అసహన, నిరంకుశ ధోరణులు వైరస్‌ మాదిరి వేగంగా విస్తరిస్తున్నాయి. ఒక సమాజం పరిణితి చెందటానికి ఏమి చెయ్యాలి, ఎంత వ్యవధి పడుతుందన్నది ఒక పెద్ద ప్రశ్న. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇంతకాలంగా పాలకులు అనుసరించిన విధానాలు తీవ్ర అసంతృప్తి కలిగించాయి. దానిని అవకాశంగా తీసుకొని స్వాతంత్య్రం, హక్కులకోసం జరిగిన పోరులో భాగస్వాములు కాని భావజాల వారసులు వాటికే ఎసరు తెస్తున్నా జనం మౌనముద్రదాల్చటం నిజంగా ఆందోళనకరమే.

71వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకొనే సందర్భంగా అసంతృప్తికి ఆజ్యం పోస్తున్న ప్రధానమైన వాటిలో ఒకటైన అభివృద్ధి సమస్య గురించి అవలోకించటం సముచితంగా వుంటుంది. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, జనంలో ప్రచారంలో వున్న సాహిత్య సారం ఏమిటి? వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు కదా? వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు, ప్రతి నాగరిక సమాజం అలాంటి ఆకాంక్షలనేే వ్యక్తం చేసింది. అయినా ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం, బలవంతులు బలహీనులను దోపిడీ చేసేందుకు జరిపిన మారణహోమమే సమస్త మానవజాతి గత చరిత్ర. మంచిని కోరుకుంటే అమలు జరిగేది కాదు, దోపిడీని అరికట్టి కొత్త వ్యవస్దను నిర్మించటమే మార్గమని సోషలిజం, కమ్యూనిజం అనే ఒక నూతన భావనను కారల్‌మార్క్స్‌-ఎంగెల్స్‌ ముందుకు తెచ్చారు. వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినో భవంతు అనే మార్గంలో మన ప్రయాణం ఎంత వరకు సాగింది? గడ్డం, టోపీ పెట్టుకున్నావు, నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావ్‌,దేశద్రోహివి నిన్ను చంపేస్తా అన్న వున్మాదం వరకు అని న్యూఢిల్లీ రైలు వుదంతంలో చూశాం కదా ! గుప్తుల స్వర్ణయుగం అనో మరొకటో చెప్పి మా తాతలు నేతులు తాగారు కావాలంటే మా మూతులు వాసన చూడండి అంటే ప్రయోజనం వుంటుందా? మన పూర్వీకులు ప్రపంచానికి ఎంత ఇచ్చారో ప్రపంచం నుంచి కూడా అవసరమైంది పుచ్చుకున్నారని గ్రహించాలి.

అలెగ్జాండర్‌ మన దేశాన్ని ఆక్రమించుకొనేందుకు చేసిన ప్రయత్నం సఫలమై వుంటే, మన దేశంలో పుట్టిన బౌద్ధాన్ని మన పాలకులే నాశనం చేయకుండా వుంటే, మనువాదంతో మన చుట్టూమనం, ఇతరుల చుట్టూ గిరులు గీసి వుండకపోతే మన చరిత్ర మరోవిధంగా వుండేది. తురుష్కులు, ఆఫ్ఘన్‌్‌ దేశాల పాలకుల దండయాత్రలను ఎదుర్కోవటంలో జరిగిన వైఫల్యమే, తరువాత కాలంలో ఐరోపా దేశాల విషయంలో కూడా పునరావృతమై వాటిలో అగ్రశక్తిగా వున్న బ్రిటన్‌ ఆధీనంలోకి మన దేశం వెళ్లిపోయింది.

పొరుగునే వున్న చైనా పరిణామాలు మనకు భిన్నంగా జరిగాయి. హాంకాంగ్‌ను బ్రిటీష్‌వారికి అప్పగించినా అక్కడి క్వింగ్‌ రాజరికం ప్రధాన భూ భాగ ఆక్రమణకు బ్రిటీష్‌ వారికి అవకాశమివ్వలేదు. ఆ రాచరికానికి, బ్రిటీష్‌, ఇతర సామ్రాజ్యవాదుల కుట్రలకు వ్యతిరేకంగా జాతీయవాదులు పోరాడి రాజరికాన్ని అంతమొందించి 1912లో రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసుకున్నారు. రాచరిక శక్తులు వాటితో కుమ్మక్కయిన యుద్ధ ప్రభువులు బీజింగ్‌లోని కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ప్రశ్నించి తిరుగుబాటు చేశారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు సన్‌యెట్‌సేన్‌ నాయకత్వంలోని కొమింటాంగ్‌ పార్టీ కమ్యూనిస్టులతో కలసి ఒక జాతీయ సైన్యాన్ని తయారు చేసి యుద్ద ప్రభువులను అణచివేసేందుకు దశాబ్దాల పాటు సాయుధ చర్యలను జరపాల్సి వచ్చింది.ఆ క్రమంలో అదే కొమింటాంగ్‌ పార్టీలోని మితవాదులు కమ్యూనిస్టులను అణచేందుకు పూనుకోవటంతో రెండు శక్తుల మధ్య జరిగిన అంతర్యుద్ధమే కమ్యూనిస్టుల నాయకత్వంలో సాగిన ప్రఖ్యాత లాంగ్‌ మార్చ్‌.ఆ క్రమంలోనే 90 ఏండ్ల క్రితం కమ్యూనిస్టు పార్టీ ప్రజావిముక్తి సైన్యాన్ని ఏర్పరచింది.

అంతర్యుద్ధాన్ని అవకాశంగా తీసుకొని జపాన్‌ సామ్రాజ్యవాదులు చైనాను ఆక్రమించుకున్నారు. దానికి వ్యతిరేకంగా మరోసారి కొమింటాంగ్‌-కమ్యూనిస్టులు చేతులు కలిపారు. ఒకవైపు జపాన్‌తో పోరాడుతూనే బలపడుతున్న కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసేందుకు కొమింటాంగ్‌ మితవాదులు మరోసారి కమ్యూనిస్టులను అణచేందుకు ప్రయత్నించారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి జపాన్‌ ఓటమితో పాటు కొమింటాగ్‌ సేనలను కూడా కమ్యూనిస్టులు అదుపులోకి తెచ్చారు. 1949 నాటికి అది సంపూర్ణమైంది. అంటే నిజమైన స్వాతంత్య్రం, సమగ్ర చైనా అప్పటికికాని రూపొందలేదు.

మనకంటే రెండు సంవత్సరాలు వెనుక విముక్తమైన చైనాతో పోల్చుకుంటే స్వాతంత్య్రం నాటికి మన పరిస్థితి ఎంతో మెరుగు. తమ అవసరాలకోసమే అయినప్పటికీ బ్రిటీష్‌ వారు మన దేశంలో పరిశ్రమలను ప్రోత్సహించారు, ఆనకట్టలను నిర్మించారు. చైనాకు నల్లమందును దిగుమతి చేసి అక్కడి జనాన్ని నల్లమందు భాయిలుగా మార్చారు. క్వింగ్‌ రాజరికశక్తులు, యుద్ద ప్రభువులు తమ అధికారాన్ని కాపాడుకొనేందుకు ప్రయత్నించారు తప్ప దేశాభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కమ్యూనిస్టుల విప్లవానికి ముందు మూడున్నర దశాబ్దాలు జరిగిన, తరువాత పదిహేను సంవత్సరాల పాటు అంటే మొత్తం ఐదు దశాబ్దాలకు పైగా చైనాలో పరిస్ధితులు తిరుగుబాట్లు, కుట్రలతోనే కూడి వున్నాయి, అసలు ఐక్యరాజ్యసమితిలో దానికి 1971వరకు సభ్యత్వం, గుర్తింపే లేదు. పెట్టుబడులు, ఆధునిక పరిజ్ఞానం అందకుండా సామ్రాజ్యవాదులు అడ్డుకున్నారు. మనపరిస్ధితి అది కాదు. సోవియట్‌ సాయం పొంది అనేక పరిశ్రమలు, రక్షణ వుత్పత్తులను పొందాం. చివరకు ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో సాధిస్తున్న విజయాల వెనుక సోవియట్‌ సాయం ఎంతో వుంది.నాటి నుంచి నేటి వరకు ఒక్క జనాభాలో మాత్రమే మనం చైనాతో పోటీలో వున్నాం.మరో పది సంవత్సరాలలో చైనీయులు అమెరికానే అధిగమించనున్నారని కొందరు అంచనా వేస్తున్న సమయంలో సమవుజ్జీకాని దానితో మన దేశాన్ని పోల్చుకోవటం వృధా ప్రయాసే అవుతుంది.

వర్తమానానికి వస్తే అనేక ఆటంకాలను ఎదుర్కొని చైనా ఆర్ధికంగా బలపడి రెండో స్ధానంలో వున్న జపాన్‌ను వెనక్కు నెట్టి అమెరికా తరువాత పెద్ద శక్తిగా తయారైంది. కొందరు మన దేశం త్వరలో చైనాను అధిగమించే విధంగా పురోగమిస్తోంది అని చెబుతున్నారు. మనం చైనా, ఐరోపా, అమెరికాతోనే పోటీపడి ముందుకు పోతే అంతకంటే కావాల్సింది ఏముంది? పోటీపడాలనే అభ్యుదయవాదులు కోరుకుంటున్నారు.

విధానాలపై ప్రశ్నలు వేసుకొనే ముందు రెండు దేశాలలో వున్న తాజా పరిస్ధితులను ఒక్కసారి చూద్దాం. 1952లో ప్రపంచ జిడిపిలో రెండు దేశాల వాటా దాదాపు సమానం. ఈరోజు మనమెక్కడ, వారెక్కడ ? మనకు ఆరు దేశాలతో సరిహద్దులుంటే చైనాకు 14తో 22వేల కిలోమీటర్లకు పైబడిన భూ సరిహద్దులున్నాయి. ఇలాంటిది ప్రపంచంలో మరొక దేశం లేదు. సముద్రతీరం మనది ఏడువేల కిలోమీటర్లయితే వారికి 14,500 అందువలన దౌత్యపరంగా, సమస్యలతో పాటు మనకంటే రక్షణ ఖర్చూ, దౌత్య అనుభవమూ ఎక్కువే. వ్యవసాయ భూమి మన దేశంలో 64.5శాతం, దానిలో సాగుకు యోగ్యమైంది 52.8శాతం వుంటే చైనాలో అవి 54.7,11.3 శాతాలుగా మాత్రమే వున్నాయి. ప్రపంచ సాగు భూమి వాటా చైనాలో ఏడు శాతం వుంటే జనాభా 21శాతం వుంది. అయినా అక్కడ ఆహార ధాన్యాలకు కొరత లేదు.అమెరికా, జపాన్‌, ఐరోపా ధనిక దేశాలు వందల సంవత్సరాలలో సాధించిన అభివృద్దిని చైనా కొన్ని పదుల సంవత్సరాలలోనే అందుకుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు సాధించిన చైనాను చూసి మన దేశం కూడా ఎలా ముందుకు పోవాలా అని చూడకుండా మనది ప్రజాస్వామ్యం, వారిది కమ్యూనిస్టు నియంతృత్వం అని పోసుకోలు కబుర్లు చెబితే కుదరదు. వాస్తవాలేమిటని యువత ఆలోచించాల్సిన అవసరం లేదా ?

1987లో ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో చైనా వాటా 1.6శాతం కాగా అది 2012 నాటికి 11.47శాతానికి చేరింది. 1964లోనే 3.1శాతంగా వున్న మన వాటా 1992 నాటికి ఒకశాతానికి పడిపోయింది. ప్రపంచబ్యాంకు తాజా సమాచారం ప్రకారం అమెరికా జిడిపి వాటా 24.32, చైనా 14.84,జపాన్‌ 5.91 శాతాలతో వుండగా మన దేశం 2.83 శాతం దగ్గర వుంది. అంటే జపాన్‌, మన కంటే పెద్దవిగా జపాన్‌ తరువాత వున్న జర్మనీ,బ్రిటన్‌, ఫ్రాన్స్‌లను కూడా దాటి త్వరలో చైనాను అధిగమించే దిశగా నరేంద్రమోడీ నాయకత్వంలో మనం పయనిస్తున్నామనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దానికి తందాన అంటే దేశభక్తులు, మోసపూరిత ప్రచారం, వాస్తవ విరుద్ధం అంటే దేశద్రోహులా ? అయితే మనదేశంలో ఎలాంటి అభివృద్ధి జరగటం లేదా ? అది కార్పొరేట్లను, బిలియనీర్లను పెంచుతున్నది తప్ప సామాన్యులకు మేలు చేయటం లేదనేదే విమర్శ. వుపాధి రహిత అభివృద్ది సంపదలు ధనికుల వద్ద పోగుపడటానికి దారితీస్తుంది తప్ప జనానికి మేలు చేయదు.

స్వాతంత్య్రం తరువాత మన దేశంభూస్వాములతో రాజీపడిన పెట్టుబడిదారీ విధానంలో అభివృద్ధి చెందే బాటను ఎంచుకుంది.దానితోనే సమసమాజాన్ని స్ధాపిస్తామని పాలకవర్గం నమ్మబలికింది. మరోవైపు చైనా కమ్యూనిస్టుపార్టీ సోషలిస్టు వ్యవస్ధతో సమసమాజాన్ని ఏర్పాటు చేయాలనే బాటను ఎంచుకుంది. ఇక్కడే అనేక మంది గందరగోళపడుతున్నారు. వందల సంవత్సరాల పాటు, భూస్వామిక, పెట్టుబడిదారీ వ్యవస్ధలలో వున్న దేశాలు ఒక్క గంతువేసి తెల్లవారేసరికి సోషలిస్టు సమాజాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ చెప్పలేదు. చరిత్రను గమనిస్తే ఫ్యూడల్‌ వ్యవస్ధను కూలదోసి పెట్టుబడిదారీ విధానం నేటి వున్నత స్ధితికి చేరుకోవటానికి వందల సంవత్సరాలు పట్టింది. పెట్టుబడిదారీ విధానం నుంచి సోషలిజం వైపు నడుస్తున్న ప్రాధమిక సంధిదశ ఇది.

నిర్దేశిత నమూనాలేవీ లేవు కనుక తన అనుభవాల ఆధారంగా చైనా కమ్యూనిస్టు పార్టీ తనదైన ప్రత్యేక తరహా( దానినే చైనా లక్షణాలతో కూడిన అంటున్నారు) సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం చేస్తున్నట్లు ప్రకటించింది. భిన్న దశలలో వున్న దేశాలలో ఒకే విధంగా సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం సాధ్యం కాదన్నది స్పష్టం. 1949 నుంచి 1978 వరకు తన బాటను సమీక్షించుకున్న చైనా కమ్యూనిస్టుపార్టీ దానికి భిన్నంగా కొన్ని సంస్కరణలు అవసరమని భావించింది. 1978లో చైనా సంస్కరణలను ప్రవేశ పెట్టింది. అంతకు ముందు అక్కడ అభివృద్ధి లేదా? ఆరుశాతానికి అటూఇటూగా వుండేది. అంతమంది జనానికి పని కల్పించాలన్నా, వారి జీవితాలను మెరుగుపరచాలన్నా ఆ వృద్ధి రేటు, ఆదాయాలు చాలవని కమ్యూనిస్టుపార్టీ గుర్తించింది.ఆ సంస్కరణలు కొన్ని కొత్త సమస్యలను సృష్టించినప్పటికీ మొత్తం మీద జనజీవితాలను ఎంతగానో మెరుగుపరిచాయి. ఇదే సమయంలో కొత్త ధనిక తరగతిని కూడా సృష్టించాయి. మొత్తం మీద మొగ్గు ఎటుఅంటే జనజీవితాల మెరుగుదల, దారిద్య్రనిర్మూలన వైపే అన్నది స్పష్టం.మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను గడువు కంటే ముందుగా చైనా చేరుకుంది. ఆ విషయాన్ని ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్‌, ప్రపంచ ఆర్ధిక వేదిక వంటి సంస్ధలన్నీ తమ నివేదికలలో పుంఖాను పుంఖాలుగా పేర్కొన్నాయి.

1978 నుంచి చైనా సంస్కరణలు విఫలమౌతాయని అనేక మంది చెప్పిన జోశ్యాలన్నీ ఇప్పటివరకు విఫలమయ్యాయి. చైనా ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం అమలు జరుపుతున్నదని చెప్పటమే ఒక వక్రీకరణ. అసలు అక్కడ పెట్టుబడిదారీ విధానమే వుందని చెప్పేవారు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్ధ మూలస్ధంభాల వంటి అమెరికా, ఐరోపా ధనిక దేశాలలో 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం లేదా మాంద్యం చైనా వేగాన్ని కొంత మేరకు తగ్గించింది తప్ప సంక్షోభంలోకి ఎందుకు నెట్టలేదు? ఈ కాలంలోనే అది జపాన్‌ను వెనక్కు నెట్టి రెండవ దేశంగా ముందుకు రావటం ఎలా సాధ్యం? నిజాయితీగా ఆలోచించేవారికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకటం కష్టం కాదు.

తనకున్న అపార మానవవనరును ఆర్ధిక శక్తిగా మార్చేందుకు చైనా విదేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తన షరతుల మీద ఆమోదించింది. పెట్టుబడిదారీ వ్యవస్ధలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు ముగిసిన సందర్భంగా అక్కడి పెట్టుబడులు తరలి పోకుండా చూసేందుకు, అవి ప్రధాన చైనాలో కొనసాగేందుకు ఒకే దేశం- రెండు వ్యవస్ధలు అనే విధానాన్ని 2050వరకు అమలు జరుపుతామని ప్రకటించింది. అంటే ప్రధాన భూభాగంలో చైనా లక్షణాలతో కూడిన సోషలిస్టు వ్యవస్ద, హాంకాంగ్‌, మకావుల్లో నెలకొన్న పెట్టుబడిదారీ వ్యవస్దలను కూడా కొనసాగనిస్తామని స్పష్టం చేసింది. హాంకాంగ్‌లో డాలర్లు, చైనాలో యువాన్‌ కరెన్సీ. ఇదొక ప్రయోగం. ఈ కారణంగా హాంకాంగ్‌ కేంద్రంగా వున్న అనేక కంపెనీలు ఎలాంటి భయం లేకుండా చైనాలో పెట్టుబడులు పెడుతున్నాయి. దాని వలన చైనాతో పాటు ఆ కంపెనీలు కూడా లాభపడుతున్నాయి. సంస్కరణల ప్రారంభంలో వాటికి ఆద్యుడైన డెంగ్‌ సియావో పింగ్‌ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు. గాలికోసం కిటికీ తెరిచినపుడు మంచిగాలితో పాటు దోమలూ, ఈగలు కూడా వస్తాయి, వాటిని ఎలా అదుపు చేయాలో మాకు తెలుసు అన్నారు.

ప్రపంచ ధనిక దేశాలలో కొనసాగుతున్న మాంద్యం కారణంగా చైనా వస్తువులకు కొంత డిమాండ్‌ తగ్గినమాట వాస్తవం. ఆ కారణంగా అక్కడ లేఆఫ్‌లు జరిగినట్లు వార్తలు లేవు. ఎందుకని ? విదేశీ ఎగుమతులు తగ్గినదానికంటే స్వదేశీ వినియోగం ఎక్కువగా పెరుగుతోంది. 2008లో చైనా కార్మికుడి వార్షిక సగటు వేతనం 29,229 యువాన్లు వుంటే 2016లో అది 67,596కు చేరిన కారణంగా అంతర్గత వినియోగం పెరిగింది. అందుకే చైనా ముందుకు పోతోంది. ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మన మాదిరి కార్పొరేట్‌ సంస్ధలకు రాయితీలు ఇవ్వటం గాక జనానికి మరలిస్తున్నకారణంగానే వారి వస్తువినియోగం పెరుగుతున్నది. చైనా విజయ రహస్యం అదే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో పేదరిక సమస్య వుందని చైనాయే స్వయంగా చెబుతోంది.

చైనాలో ఏటేటా వేతనాలు పెరుగుతున్నందున ఇంకేమాత్రం అక్కడ చౌకగా వుత్పత్తి చేయటం సాధ్యం కాదని అనేక కార్పొరేట్‌ సంస్ధలు అంతకంటే శ్రమశక్తి చౌకగా దొరికే చోట్లను వెతుకుతున్నాయి. ఈ పూర్వరంగంలోనే మేకిన్‌ ఇండియా పేరుతో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులను నరేంద్రమోడీ ఆహ్వానిస్తున్నారు. వాటికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు పూనుకున్నారని వేరే చెప్పనవసరం లేదు. ఇటువంటి విధానాలు అనుసరించటమంటే ఏమిటి ? గతంలో బ్రిటీష్‌ వాడు మన దేశంలోని రాజుల, రంగప్పల అనుమతి కోరి మన దేశంలో వ్యాపారం ప్రారంభించాడు. ఎర్రతివాచీ పరచి చక్కగా ఏర్పాట్లు చేస్తాము వచ్చి మా కార్మికుల శ్రమను దోచుకుపోండని విదేశీయులను మనమే ఆహ్వానిస్తున్నాము.

ఈ మధ్యకాలంలో కొందరు చైనా వ్యతిరేకులు చైనా వస్తువులను బహిష్కరించాలని పిలుపులు ఇస్తున్నారు. తద్వారా అందరూ దేశ భక్తిని నిరూపించుకోవాలని చెబుతున్నారు. మన దేశాన్ని ఆక్రమించి మన సంపదల మూల్గులు పీల్చుతున్న బ్రిటీష్‌ వారిని తరిమివేసేందుకు సాగిన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ అన్నది ఒక ఆయుధం. ఆ వుద్యమానికి దూరంగా వుండి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన ఆర్‌ఎస్‌ఎస్‌, ఇతర హిందూత్వ సంస్ధలకు చెందిన వారే ఇప్పుడు చైనా వస్తువు బహిష్కరణకు విఫల పిలుపులు ఇస్తున్నారు. మన దేశంతో సహా ప్రపంచంలో తయారయ్యే కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, అవి పని చేసే వ్యవస్ధలలో చైనా వస్తువులు లేదా చైనాలో తయారైన విడిభాగాలు లేనిదెక్కడ? అందువలన ముందుగా వారు తమ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లను తగులబెట్టి మేకిన్‌ ఇండియా పిలుపు ఇచ్చిన నరేంద్రమోడీగారి ఫ్యాక్టరీలలో తయారైన నిఖార్సయిన స్వదేశీ వస్తువులను వాడి చూపమని అడగాలి.

చౌకబారు రాజకీయం కాకపోతే ఒక్క చైనాయేం ఖర్మ అన్ని రకాల విదేశీ వస్తువులను బహిష్కరించి వాటిని మన దేశంలోనే తయారు చేసుకోవటానికి ఎవరు అడ్డుపడుతున్నారు?. అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ సమాచారం ప్రకారం 2016లో చైనా 2011 బిలియన్‌ డాలర్లు, హాంకాంగ్‌ 487 బిలియన్‌ డాలర్ల మేరకు ఎగుమతులు చేసింది. ఒకే చైనాగా లెక్కవేస్తే 2497 బిలియన్‌ డాలర్లు. దానిలో మనం దిగుమతి చేసుకొనేది కేవలం 58 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువులనే. వాటి దిగుమతులను నిలిపివేస్తే చైనా దారికి వస్తుందని చెబితే అమాయకులు తప్ప ఎవరు నమ్ముతారు.

చివరిగా మన సంస్కరణల విజయవంతం గురించి ముచ్చటించుకోకపోతే అసంపూర్ణం అవుతుంది. కాంగ్రెస్‌ పాలనలో సంస్కరణలు విఫలమయ్యాయని, అభివృద్ధి ఏదైనా వుంటే అది వుపాధిరహితంగా జరిగి కార్పొరేట్లకే ప్రయోజనం జరిగిందన్నది స్పష్టం. నరేంద్రమోడీ సర్కార్‌ ఆ విఫల విధానాల కొనసాగింపు తప్ప కొత్తదనం ఏముంది? గతనెలలో ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక సహకార కూటమి(ఆర్‌సిఇపి) సమావేశాలు హైదరాబాదులో జరిగాయి.దానిలో చైనా భాగస్వామి. వాటిలోని కొన్ని అంశాలు మన దేశ పౌరుల ప్రయోజనాలకు హానికలిగిస్తాయని వామపక్ష, ఇతర అభ్యుదయ భావాలు కలిగిన వారు వ్యతిరేకత, నిరసన తెలిపారు తప్ప కాషాయ దళాల జాడలేదెందుకని? ఏదేశమైనా పరిశోధన, అభివృద్ధికి తగిన మొత్తాలను ఖర్చు చేయకుండా అభివృద్ధి చెందజాలదు. మనం 2015 తలసరి 39.37, చైనా 298.56 డాలర్లు ఖర్చు చేశాయి. ఇంత తక్కువ ఖర్చు చేయమని ఏ ప్రజాస్వామిక వాది చెప్పాడు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు ఒక ఎత్తయితే నరేంద్రమోడీ సర్కార్‌ వాటిని కొత్త పుంతలు తొక్కించింది. ఆవు పేడలో ఏం దాగుంది, మూత్రంలో ఏమున్నాయో పరిశోధించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే కేటాయింపు తక్కువ, దాన్ని ఆవు సైన్సు మీదకు మళ్లింపా ! ఇలాంటి పరిశోధనలతో చైనాను అధిగమిస్తామా ! ప్రపంచం నవ్విపోతుంది. చైనా గాకపోతే మరొక మంచి విధానాన్ని అమలు జరపండి ! పిల్లి నల్లదా తెల్లదా అని కాదు, ఎలుకలను పడుతుందా లేదా అన్నది చూడాలి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మరో జండా పండుగ-మన కర్తవ్యం !

16 Sunday Jul 2017

Posted by raomk in AP NEWS, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, RELIGION

≈ 1 Comment

Tags

beef, cow politics, independence day, INDIA, india 71st independence day, India Independence Day, Mahatama Gandhi, pig politics, RSS

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ?

ఎం కోటేశ్వరరావు

ఆగస్టు 15 సందర్భంగా మరోసారి టీవీలు, వీధులన్నీ దేశ భక్తి గీతాలతో మార్మోగనున్నాయి. జాతర్లలో పూనకం వచ్చినట్లుగా కొందరు దేశ భక్తితో వూగిపోతారు. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సాంప్రదాయ గూండాలు, రౌడీలు, కొత్తగా వునికిలోకి వచ్చిన కాషాయ గో గూండాలు, కాషాయ, ఆకుపచ్చ తాలిబాన్లు, మనువాదులు, మెజారిటీ, మైనారిటీ మతవాదులు, భావ ప్రకటనా స్వేచ్చా, ప్రజాస్వామ్య వ్యతిరేకులు, స్వాతంత్య్ర వుద్యమాన్ని వ్యతిరేకించి బ్రిటీష్‌ వారితో చేతులు కలిపిన వారి అన్ని రకాల వారసులు, రాజకీయ ప్రవేశానికి సోపానంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రయత్నించే సకల అవాంఛనీయ శక్తులు ఆరోజున వీధుల్లో దర్శనమివ్వబోతున్నాయి. నిజమైన స్వాతంత్య్రపోరాటానికి, స్వాతంత్య్ర భావనలకు వారసులుగా వున్నవారు కూడా అక్కడక్కడా బిక్కుబిక్కు మంటున్నట్లుగా జెండా పండగలను నిర్వహిస్తారు. అవాంఛనీయ శక్తులను వ్యతిరేకించే లేదా ఇష్టపడని వారు వారితో మనకెందుకు గొడవ అనుకుంటూ వారి ఆధీనంలో జండా కార్యక్రమం జరిగే ప్రాంతం నుంచి తప్పుకొని వెళ్లిపోయే దృశ్యాలు మరోసారి చూడబోతున్నాం.

వందల సంవత్సరాల పాటు బ్రిటీష్‌ వారు మన దేశాన్ని ఆక్రమించుకొని తమ వలసగా చేసుకున్నారని, వారికి వ్యతిరేకంగా పోరాడి అశేష త్యాగాలు చేసిన ఫలితంగానే ఇప్పుడు సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా మన పాలన మనమే చేసుకుంటున్నాం అనే విషయం ఎంత మందికి తెలుసు ? అసలు ఏదేశానికైనా స్వాతంత్య్రం ఎందుకు ? ఎవరినైనా ఈప్రశ్న అడిగితే, స్వాతంత్య్రమా చట్టుబండలా 70 ఏండ్ల క్రితం మనం తెచ్చుకున్న స్వాతంత్య్రం కూడు పెట్టిందా, నీడ నిచ్చిందా అని నిట్టూర్పు లేదా ఈసడించుకోవటం కనిపిస్తుంది. ఇలాంటి భావం సమాజంలో వుండటం అంటే నిరంకుశత్వం పెరగటానికి అనువైన పరిస్థితులు ఏర్పడినట్లుగా భావించాల్సి వుంటుంది. సోవియట్‌ యూనియన్‌, తూర్పు ఐరోపా దేశాలలో సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణం, సోషలిస్టు చైతన్యం కలిగించటంలో చేసిన తప్పిదాలు లేదా లోపాల కారణంగా అంతకు ముందు తమ పూర్వీకులు కూల్చివేసిన పెట్టుబడిదారీ వ్యవస్ధను అక్కడి జనాలు కోరి పున: ప్రతిష్టించుకున్నారు. మొత్తంగా చూసినపుడు చరిత్ర ముందుకు పోయినప్పటికీ ఇలాంటి తిరోగమన వుదంతాలు కూడా జరుగుతాయని మన కళ్ల ముందు కనిపించిన పరిణామమిది. సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేస్తుంటే దాని వలన లబ్ది పొందిన జనం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. నియంతృత్వశక్తులు ప్రజాస్వామిక, ప్రగతిశీల అవతారాలెత్తితే గుడ్డిగా నెత్తినెక్కించుకున్నారు. మబ్బులను చూసి చేతుల్లో వున్న ముంత నీళ్లు పారబోసుకున్నారు.

సోషలిజమే కాదు, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన, జీవన స్వేచ్చలకు సైతం అలాంటి ముప్పే ముంచుకు వస్తోంది. అనేక దేశాలలో పచ్చి మితవాద శక్తులు ప్రజాకర్షక నినాదాలతో ఎన్నికలలో విజయాలు సాధిస్తున్నాయి. నిప్పును ముట్టుకుంటే కాలుతుందని తెలియని పసివారి సంగతి అటుంచుదాం. తెలిసిన వారు కూడా ఒకసారి పట్టుకొని చూద్దాం అన్నట్లుగా ఒక విధమైన వున్మాద స్ధితిలో వ్యవహరిస్తున్నారు. అదానీ, అంబానీల వంటి లాభాలే పరమావధిగా వున్న వారికి ఎవరైనా ఒకటే అనుకోండి. మంచి వాళ్లనుకున్నవారు ఏం ఒరగబెట్టారని, వీరికి కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే పోయేదేముంది అన్నట్లుగా మితవాద, తిరోగామి శక్తుల గురించి తెలిసిన మేథావులు, సామాన్యులు కూడా వుదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

చరిత్ర పునరావృతం అవుతుంది. అంటే దాని అర్ధం హిట్లర్‌ లాంటి వాడే తిరిగి జర్మనీలోనే పుట్టి ఫాసిజాన్ని అమలు జరపనవసరం లేదు. ప్రతి చోటా కొత్త రూపాల్లో కొత్త శక్తులు పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ప్రపంచాన్ని ఆక్రమించుకోవటంలో జర్మన్లు వెనుకబడ్డారు కనుక తనదైన శైలిలో ప్రపంచాన్ని ఆక్రమించుకొనేందుకు హిట్లర్‌ ప్రయత్నించాడు. ప్రపంచంలో వలసరాజ్యాలు అంతరిస్తున్న దశలో చరిత్ర గతికి విరుద్దమది. అయినా అలా మొరటు పద్దతులలో నడపాలని చూసి ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రాణాలు పోవటానికి, జీవితాలు నాశనం కావటానికి కారకుడయ్యాడు. ఇప్పుడు అమెరికా తన కార్పొరేట్‌ శక్తులకు మార్కెట్‌ కోసం కొత్త పద్దతులు, కొత్త రూపాలలో యుద్ధాలు, అంతర్యుద్ధాలను, వుగ్రవాదం, వుగ్రవాదులను సృష్టించి మార్కెట్లను హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో తమతో కలసి వచ్చే దేశాలను కూడగట్టి ప్రతి అమెరికా అధ్యక్షుడు నిత్యం ఏదో ఒక మూలన యుద్ధాలు చేస్తూ జనం ప్రాణాలను బలిగొంటూ, జీవితాలను నాశనం చేస్తూనే వున్నాడు. దీన్ని చరిత్ర పునరావృతం కావటం అనిగాక మరేమనాలి ?

మన ఏడుపదుల స్వాతంత్య్రాన్ని కూడా ఈ నేపధ్యంలోనే అవలోకించాలి. బ్రిటీష్‌ వారు మన దేశం నుంచి తప్పుకున్న సమయంలో మన నేతలు ఏం చెప్పారు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించటం అవసరం. మన స్వాతంత్య్రానికి ముందే మన దేశంలో వుట్టిన అనేక సంస్ధలలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఒకటి. వారేమి చెప్పుకున్నప్పటికీ స్వాతంత్య్ర వుద్యమానికి దాని నేతలు, అనుచరులు వ్యతిరేకంగా, దూరంగా వున్నారు. సావర్కర్‌ వంటి నాయకుడు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి సేవలు చేసుకుంటానని లేఖలు రాశాడు.

సరిగా నిర్వహించారా లేదా అన్న చర్చ ఎలా వున్నప్పటికీ గాంధీ, నెహ్రూ వారి అనుచరులు స్వాతంత్య్ర వుద్యమానికి ప్రధానంగా నాయకత్వం వహించారు. వారి విధానాలతో ఏకీభవించని వారు కమ్యూనిస్టులుగా మారారు తప్ప కాషాయ శక్తుల మాదిరి బ్రిటీష్‌ వారి చంకనెక్కలేదు. మన పాలనను మనం చేపట్టిన తరువాత వారి నాయకత్వంలోని కాంగ్రెస్‌ అధికారంలో వుంది, అనేక అక్రమాలకు పాల్పడింది, స్వాతంత్య్ర లక్ష్యాలకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఒక బిడ్డ పుట్టిన తరువాత బతికి వయస్సు వచ్చిందా లేదా అంటే రాకుండా ఎలా వుంటుంది. అలాగే కాంగ్రెస్‌ వారు మా పాలనలో అసలేమీ అభివృద్ధి జరగలేదా అని అడ్డు సవాళ్లు విసురుతారు. పుట్టిన తరువాత బతికి వుంటే వయస్సు రావటానికి ఎవరూ తోడ్పడనవసరం లేదు. ఆ బతికిన బిడ్డ ఆఫ్రికాలో అకలితో మాడే జీవచ్చంలా వుందా ఆరోగ్యంగా పెరిగిందా లేదా అన్నది చూడాలి. అలా చూసినపుడు ఆఫ్రికా అంతగాక పోయినా మన దేశంలో మెజారిటీ జనజీవితాలు జీవచ్చవాలకు దగ్గరగానే వున్నాయి. పోషకాహారలేమితో గిడసబారిపోవటం, ఇరవైల్లోనే అరవై లక్షణాలు రావటం, శరీరాన్ని కప్పుకొనేందుకు తగినన్ని బట్టలు లేకపోవటం, వుండటానికి ఇళ్లు లేకపోవటం వంటి అనేక సమస్యలు ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత కూడా వుండబట్టే అనేక మంది దానిని అభివృద్ధిగా చూడటం లేదు, అందుకే స్వాతంత్య్రం మనకేమి తెచ్చింది, మాకేమిచ్చింది అని అడుగుతున్నారు.

ఇన్ని అనర్ధాలకు కారణం కాంగ్రెస్‌, దానికి నాయకత్వం వహించిన గాంధీ, నెహ్రూ వారి అనుచరులే కారణమని ఆరోపించే బిజెపి దేశ చరిత్రలో వారి పాత్రను పూర్తిగా చెరిపివేసే లేదా వక్రీకరించేందుకు పూనుకుంది. తమకెలాగూ మంచి చరిత్ర లేదు కనుక వున్నవారిపై బురదజల్లి తమ నిజస్వరూపాన్ని కప్పిపుచ్చుకొనే యత్నమిదని విమర్శకులు భావిస్తున్నారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేకు ఆర్‌ఎస్‌ఎస్‌తో వున్న సంబంధాల గురించి తెలిసిందే. ఒకవైపు మహాత్ముడిని పొగుడుతూనే మరోవైపు ఆయన ఒక చతురుడైన కోమటి అని సాక్షాత్తూ బిజెపి అధ్యక్షుడు అమిత్‌ షా చేసి వ్యాఖ్యను నరేంద్రమోడీతో సహా ఏ బిజెపి సీనియర్‌ నేతా తప్పు పట్టలేదు, గడ్డి పెట్టలేదు, ముసి ముసి నవ్వులతో చోద్యం చూశారు. ఇక నెహ్రూ గురించి చేస్తున్న ప్రచారం గురించి చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న ఆర్ధిక సమస్యలు, అసమానతలు,అవినీతి, నిరుద్యోగం, దారిద్య్రం, సామాజిక న్యాయలేమి వంటి సకల అవలక్షణాలకు మహాత్ముడు అధికారంలో ఎన్నడూ భాగస్వామి కాలేదు కనుక, నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు అత్యధిక కాలం పరిపాలించిన కాంగ్రెస్‌ విధానాలు, వ్యవహరించిన తీరే కారణం అనటంలో ఎలాంటి పేచీ లేదు. అవన్నీ విధానాల కారణంగా వచ్చాయి తప్ప మరొకటి కాదు. వాటిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న, ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తున్న వామపక్షాలు, శక్తులు నెహ్రూ లేదా ఆయన వారసుల విధానాలను విమర్శిస్తే అర్ధం వుంటుంది.అధికారం కోసం ఆరాటం తప్ప ఏనాడూ ప్రత్యామ్నాయ విధానాల వూసులేని, ఏ కాంగ్రెస్‌నైతే విమర్శిస్తున్నారో దాని విధానాలనే మక్కీకి మక్కీ అనుసరిస్తున్న బిజెపి,ఎన్‌డిఏ పక్షాలకు అర్హత ఏమిటి అన్నది ప్రశ్న.

స్వాతంత్య్రం సందర్భంగా 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూ చేసిన ప్రసంగంలో ‘ఆమె బిడ్డలందరూ నివశించాల్సిన స్వేచ్చా భారతాన్ని మనం నిర్మించాల్సి వుంది’ అని చెప్పారు. ఏడు పదుల స్వాతంత్య్రం తరువాత రాజధాని ఢిల్లీ రైలులో గడ్డం, టోపీ పెట్టుకోవటాన్ని చూసి నువ్వు ముస్లిం, గొడ్డు మాంసం తింటావు, పాకిస్ధాన్‌ వెళ్లిపో అంటూ ఒక కుటుంబ సభ్యులపై వున్మాదంతో కొందరు దాడి చేసి రైలు నుంచి తోసి వేస్తుంటే దానిని అడ్డుకొనేందుకు ఒక్కరు కూడా ముందుకురాని ‘సహనపరుల’ సేచ్చా భారతంలో నేడు మనం వున్నాం. ఆ దాడిలో జునైద్‌ అనే 15 ఏండ్ల యువకుడు కత్తిపోట్లతో సోదరుడి ఒడిలో రైల్వే ఫ్లాట్‌ఫారంపై మరణించాడు. మతోన్మాద కోణాన్ని మూసి పెట్టేందుకు దాన్ని సీట్ల గొడవగా చిత్రించేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా మన మీడియా దానిని జనానికి అందించిందంటే ఏమనుకోవాలి?

ఎక్కడో దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షను ఒక విధానంగా పాటించిన సమయంలో గాంధీ మొదటి తరగతి బోగీలో ప్రయాణించటానికి వీలు లేదంటూ 19వ శతాబ్దంలో రైలు నుంచి తోసి వేస్తే ఔరా తెల్లవారికి అంత కండకావరమా అనుకొని మన రక్తం వుడికి పోయింది. అదే మన ఢిల్లీ రైలులో 21వ శతాబ్దంలో అంతకంటే దారుణంగా జరిగిన దానిపై మనం అంతగా ఎందుకు స్పందించలేకపోతున్నాం? అలాంటిది ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, గిరిజనులు, మొత్తంగా జనం ఏది తినాలో ఏది తినకూడదో ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్దేశించే శక్తులు యధేచ్చగా చెలరేగుతున్న ‘స్వేచ్ఛా భారతాన్నా’ మన పెద్దలు కోరుకున్నది, త్యాగాలు చేసింది ? మన నిచ్చెన మెట్ల కుల వ్యవస్ధలో పై మెట్టులో వున్నామనుకుంటున్న ప్రతివారూ కింది మెట్టులోని వారిని తక్కువగా చూస్తున్న స్ధితిలో పేరు,వేష భాషలను బట్టి అణచివేతకు పూనుకోరన్న గ్యారంటీ ఏమిటి ?

ఆధునికత విలసిల్లే ప్రాంతాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఒకటి. అలాంటి చోట గరగపర్రు అనే గ్రామంలో మిగతా నేతల విగ్రహాల సరసన అంబేద్కర్‌ విగ్రహాన్ని అనుమతించం వేరే చోట పెట్టుకోండి అంటూ కొంత మంది అడ్డుకోవటంలో అర్ధం ఏమిటి? అంబేద్కర్‌ విగ్రహాన్ని వేరే చోట పెట్టుకోమనటానికి ముస్లింలను చూసి పాకిస్ధాన్‌ పొమ్మనటానికి తేడా ఏముంది. ఈ రోజు ముస్లింలు అయితే రేపు దళితులు,గిరిజనులు, వెనుక బడిన వారూ, మహిళలకూ అదే గతి పడుతుంది. వూరి మధ్యలో ఎవరైనా దళితులు, గిరిజనులు వుంటే గొడ్డు మాంసం తినేవారు మీరు, ఖాళీ చేసి మీ వాడలకు పోండి అనరన్న గ్యారంటీ ఏముంది ?(గొడ్డు మాంసం తినని దళితులు, గిరిజనులను కూడా సహించరని మనవి) విగ్రహాన్ని అడ్డుకోవటాన్ని ప్రశ్నించినందుకు దళితులను సాంఘిక బహిష్కరణ చేయటమే గాక అందుకు పాల్పడిన వారే తమకు న్యాయం చేయండి అంటూ గరగపర్రులో మాదిరి పోటీ దీక్షలకు దిగే పరిస్దితికి, దానిని రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే పరిస్ధితికి కారకులెవరు ?నాడు అంబేద్కర్‌ అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడినపుడు దానిని పాటించే హిందువులలోని అనేకశక్తులు ఆ అనాచారానికి వ్యతిరేకంగా మద్దతుగా నిలిచాయి కనుకనే మనువాదులు మౌనంగా వున్నారు. అదే అంబేద్కర్‌ ఈ రోజు గరగపర్రులో అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడి వుంటే పోటీ దీక్షలకు దిగిన వారు సహించి వుండేవారా ? ఇలాంటి వుదంతాలు, ప్రశ్నలను 70 ఏండ్ల స్వాతంత్య్రం తరువాత చర్చించుకోవాల్సి రావటం గురించి ఆవేదన చెందటం కాదు, రానున్న ముప్పు గురించి ఆందోళనపడాలి. ఎదుర్కోవటానికి కార్యాచరణకు దిగాల్సిన తరుణం ఆసన్నం కాలేదా ?

దక్షిణాఫ్రికాలో ఎక్కడైతే రైలు నుంచి తోసివేశారో ఆ పట్టణ కేంద్రంలో అక్కడి ప్రభుత్వం మహ్మాతుడి విగ్రహాన్ని ప్రతిష్టించి వివక్షకు వ్యతిరేకంగా పోరాడినందుకు నివాళి అర్పించింది. మన రాజ్యాంగ నిర్మాతగా కీర్తించబడే అంబేద్కర్‌ విగ్రహాన్ని వూరి మధ్యలో ప్రతిష్టించి తెలుగుదేశం ప్రభుత్వం, దాడి అనంతరం రైలు నుంచి తోసివేతకు గురై మరణించిన జునైద్‌ విగ్రహం లేదా చిహ్నాలను రైల్వే ఫ్లాట్‌ఫారంపై ప్రతిష్టించి నరేంద్రమోడీ సర్కార్‌ తమకు కులం, మత వివక్ష లేదని ప్రదర్శించుకుంటాయా ?

ఆవు, పంది కొవ్వులను తుపాకి తూటాల తొడుగులకు(కాట్‌రిడ్జ్‌) పూసిన బ్రిటీష్‌ వారి చర్య హిందూ-ముస్లింలను ఏకం చేసి 1857లో ప్రధమ స్వాతంత్య్ర యుద్దానికి తిరుగుబాటు కారణాలలో ఒకటని చరిత్రలో చదువుకున్నాం. తూటాలను తుపాకిలో నింపాలంటే నోటితో తొడుగులను కొరికి తొలగించాల్సి వచ్చేది. అణుబాంబును కనిపెట్టాం, అంతరిక్షంలో జయప్రదంగా వుపగ్రహాలను ప్రయోగిస్తున్నాం, క్షిపణులను తయారు చేశాం, అయితేనేం

నూట అరవై సంవత్సరాల తరువాత కూడా అదే ఆవు, పంది సమస్యలను డెబ్బయి సంవత్సరాల స్వతంత్రభారతంలో పరిష్కరించుకోలేక వుద్రిక్తతలు, మారణకాండకు కారణం అవుతున్నాయి. అన్ని మతాలవారూ గొడ్డు మాసం తింటున్నది వాస్తవం, అయినా కొన్ని శక్తులు ఒక మతం వారిని వెంటాడి తరిమి దాడులు, హత్యలు చేస్తుంటే మనం చోద్యం చూస్తున్నామంటే ముందుకు పోతున్నట్లా తిరోగమిస్తున్నట్లా ? దేశంలోని అన్ని రాష్ట్రాలలో ముస్లింలు విదేశీయులు, విదేశీ మతం అంటూ ప్రచారం, దాడులు చేస్తున్న కాషాయ దళాల గురించి తెలియందెవరికి ? అదే ప్రచారం, దాడులు కాశ్మీరులో చేయగలరా ? గొడ్డుమాంసం, అలాగే క్రైస్తవ మతవ్యాప్తి గురించి రెచ్చగొట్టే ప్రచారం చేస్తున్న వారు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లి అదే చేయగలరా ? నాడు బ్రిటీషు వాడిది రాజకీయం అన్నాం మరి నేడు చేస్తున్నదానినేమనాలి ?

బ్లాక్‌ మార్కెటీర్లను లైటు స్ధంభాలకు కట్టి వురి తీయాలని ఒక సందర్భంగా స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రధాని నెహ్రూ చెప్పారు. ఆయన లేదా వారసుల హయాంలో ఒక్క బ్లాక్‌ మార్కెటీరుకు కూడా ఆ గతి పట్టలేదు. ఆ నెహ్రూను నిత్యం విమర్శించే బిజెపి నేతల పాలనలో జరిగిందేమిటి ? 2015లో పప్పుల ధరలు ఆకాశానికి అంటినపుడు ఎవరూ నియంత్రించలేకపోయారు. ఆకస్మికంగా ధరలు రెట్టింపు కావటం గురించి ఆదాయపన్నుశాఖ చేపట్టిన దర్యాప్తులో విదేశీ-స్వదేశీ పప్పుధాన్యాల వ్యాపారులు, దిగుమతిదారుల కుమ్మక్కు ఇందుకు దారితీసినట్లు రెండువేల పేజీల నివేదిక వెల్లడించింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పప్పులను ముంబై, చెన్నయ్‌ రేవుల్లో దొంగనిల్వలు చేసినట్లు తేలింది. అందుకు బాధ్యులపై ఇంతవరకు నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద కుంభకోణమిది. పోనీ కాంగ్రెస్‌ హయాంలో జరిగిన కుంభకోణాలపై ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో కూడా మనకు తెలియదు.ఎవరు ఎవరిని రక్షిస్తున్నట్లు ?

1991లో కాంగ్రెస్‌ పాలనా కాలంలో ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలు అనేక అక్రమాలకు తెరతీశాయి. ధనవంతులు మరింత ధనవంతులు అయ్యారు. శతకోటీశ్వరులు పెరిగారు, అదాయ అసమానతలు పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత వుంటాయి. ఇవన్నీ మన స్వాతంత్య్ర వుద్యమ ఆకాంక్షలకు విరుద్ధం. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) వ్యవస్ధను అమలులోకి తీసుకు రావటం మరొక స్వాతంత్య్రం అన్నట్లుగా పాలకపక్ష నేతలు చిత్రిస్తున్నారు. గతంలో కూడా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో, భూసంస్కరణల బిల్లుల సందర్భంగా కూడా నాటి పాలకులు జనంలో ఇలాంటి ఆశలనే కల్పించారు. ఆ కోవకు చెందిందే ఇది తప్ప మరొకటి కాదు. విదేశీ, స్వదేశీ కంపెనీలు రాష్ట్రానికొక పన్ను చెల్లింపు విధానం లేకుండా వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు తీసుకున్న చర్య ఇది. ఏ విధానం అయినా జనానికి చేసే మేలు ఏమిటన్నదే గీటురాయి. జిఎస్‌టి వ్యాపారులకు వుద్ధేశించింది తప్ప జనంపై భారాలు తగ్గించేది కాదు.నిజానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్దే వుంటే పెట్రోలియం వుత్పత్తులను కూడా దాని పరిధిలో చేర్చి వుండాల్సింది. కనీసం గత మూడు సంవత్సరాలలో పెట్రోలియం వుత్పత్తులపై అదనంగా పెంచిన పన్ను మొత్తాన్ని తగ్గించినా ఎంతో మేలు జరిగేది. జిఎస్‌టి వలన సామాన్య మానవుడి కుటుంబ బడ్జెట్‌లో పెద్ద మార్పులేమీ లేవన్నది ప్రాధమిక పరిశీలన.వ్యాపారం చేసుకొనేందుకు అనుమతి పేరుతో మన గడ్డపై కాలు పెట్టి క్రమంగా రాజకీయ అధికారాన్నే తెల్లవారు స్వాధీనం చేసుకున్నారు. మన సంపదలను కొల్లగొట్టారు. సారం వారు పీల్చుకొని మనకు పిప్పి మిగిల్చారు. ఇప్పుడు ప్రపంచంలోని కార్పొరేట్‌ శక్తులన్నీ మనదేశంలో కాలు పెట్టేందుకు కాంగ్రెస్‌ పాలకులు తలుపులను కొద్దిగా తెరిస్తే బిజెపి పాలకులు బార్లా తెరిచి ఎర్రతివాచీ పరచి స్వాగతాలు పలుకుతున్నారు. ఇది తిరోగమనం తప్ప పురోగమనం కాదు. మన షరతులపై విదేశీ పెట్టుబడులను అనుమతిస్తే అది మన అధికారానికి చిహ్నం, అదే వారి షరతులకు అంగీకరిస్తే స్వాతంత్య్రాన్ని వారి కాళ్ల ముందు పెట్టటం తప్ప వేరు కాదు.

దీర్ఘకాలం పాటు అటు సోవియట్‌ కూటమిలోనూ ఇటు అమెరికా కూటమిలో చేరకుండా మన దేశం అవలంభించిన అలీన విధానం నుంచి మన ప్రభుత్వం క్రమంగా వైదొలుగుతూ క్రమంగా అమెరికా కౌగిట్లోకి చేరుతోంది. శకుని రాజకీయానికి కౌరవులు బలైనట్లుగా అమెరికాతో చేతులు కలిపిన ఏదేశం కూడా బాగుపడలేదు. మన పక్కనే వున్న పాకిస్ధాన్‌ ఎలా నియంతలపాలనలో మగ్గిందీ చూశాం, అప్పుడప్పుడు పౌరపాలకులు అధికారానికి వచ్చినా సైన్యం కనుసన్నలలోనే వారు పని చేయాలి. ఏడుపదుల స్వాతంత్య్రం తరువాత పాకిస్ధాన్‌ ఎంత దుస్ధితిలో వుందో చూశాము. లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండాలలో అమెరికాతో చేతులు కలిపిన దేశాలన్నింటా సైనిక నియంతలు, ప్రజాద్రోహులు తప్ప మంచివారెవరినీ అధికారంలోకి రానీయలేదు. పాలస్తీనాను ఆక్రమించి అరబ్బులను వారి ప్రాంతాల నుంచి తరమివేసిన ఇజ్రాయెల్‌ను ఇప్పటికీ ప్రపంచమంతా చీదరించుకొంటోంది, అధికారికంగా ఐక్యరాజ్యసమితిలో దానిని వ్యతిరేకిస్తోంది. అలాంటి దేశంతో తొలిసారిగా మన ప్రధాని నరేంద్రమోడీ చేతులు కలపటం అంటే అమెరికాతో మన స్నేహం ఎక్కడికి దారితీయించిందో అర్ధం అవుతోంది. నువ్వు ఎలాంటి వాడివో చెప్పాలంటే నీ స్నేహితులను చూస్తే చాలు అన్న విషయం తెలిసిందే.

డెబ్బయి ఒకటవ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గతాన్ని నెమరు వేసుకొంటే మన మహత్తర లక్ష్యాల నుంచి ఎలా వైదొలిగామో, దాని పర్యవసానాలేమిటో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. వాటిని చూసి గుండెలు బాదుకోవటం గాక వర్తమానంలో కర్తవ్యాలను గుర్తెరగటం, అందుకోసం పని చేయటమే స్వాతంత్య్ర వుద్యమంలో అశేష త్యాగాలు చేసిన వారికి సరైన నివాళి.

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

మసూద్‌ అజార్‌ను చైనా, దలైలామాను మనం ఎందుకు కాపాడుతున్నాం ?

01 Sunday Jan 2017

Posted by raomk in BJP, CHINA, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, Others, USA

≈ Leave a comment

Tags

anti china, anti india, China, Dalai Lama, INDIA, masood azhar

Image result for masood azhar,  Dalai Lama

ఎం కోటేశ్వరరావు

    ఈ ప్రశ్న రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు వుండాలని కోరుకొనే అనేక మందికి ఆవేదన కలిగిస్తోంది, అదే సమయంలో శత్రుపూరిత సంబంధాలుండాలని కోరుకొనే వారికి ఆనందం కలిగిస్తోందంటే అతిశయోక్తి కాదు. అసలేం జరుగుతోంది ? ఐక్యరాజ్యసమితి పరిభాషలో సాంకేతిక అంశాలు ఎలా వున్నప్పటికీ ఆచరణలో మన దేశానికి వ్యతిరేకంగా వుగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లుగా మన ప్రభుత్వం చెబుతున్న మౌలానా మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ వుగ్రవాదిగా పరిగణిస్తూ తీర్మానం చేయకుండా ఏప్రిల్‌, అక్టోబరులో భద్రతా మండలిలో తీర్మానం చేయకుండా అడ్డుకుంది. దాని అభ్యంతరాల గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అయితే రెండు రోజుల ముందే చర్చకు వచ్చిన ఈ అంశాన్ని మరోసారి అడ్డుకొన్నది. దీంతో వుగ్రవాదం పట్ల చైనా ద్వంద్వ ప్రమాణాలను అసుసరిస్తోందని మన దేశం విమర్శించింది. సరిగ్గా ఈ సమయంలోనే అంటే బుధవారం నాడు కజకస్తాన్‌, మంగోలియా, మన దేశ (కాశ్మీర్‌లోని లడక్‌ ప్రాంతాన్ని అనుకొని వుండే) -చైనా సరిహద్దులలో వున్న చైనా రాష్ట్రం గ్జిన్‌జియాంగ్‌లో కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంపై వుగ్రవాదులు దాడి చేసి ఒక కార్యకర్త, భద్రతా సిబ్బంది ఒకరిని హత్య చేశారు. వెంటనే పోలీసులు దాడిలో పాల్గొన్నవారిలో ముగ్గురిని కాల్చివేశారు. అనేక సార్లు ఇస్లామిక్‌ తీవ్రవాదులు అక్కడ దాడులకు పాల్పడిన కారణంగా ఇప్పుడు కూడా వారే అయి వుండవచ్చని వార్తలలోని వ్యాఖ్యలను బట్టి అనుకోవాలి. ఆ వుగ్రవాదులను ఇరుగు పొరుగు దేశాల వారు పెంచి పోషించి రెచ్చగొడుతున్నందున దాడులు చేస్తున్నట్లు చైనా గతంలో విమర్శించింది. చైనా కూడా వుగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది కదా అలాంటపుడు మసూద్‌ అజార్‌పై చర్యను ఎందుకు అడ్డుకుంటున్నట్లు అన్న సందేహం కొంత మందికి కలుగటం సహజం.

    ఈ సమస్య గురించి గురించి ఏకపక్షంగా ఒక వాదననే సమర్ధిస్తూ చర్చించిన వారిని దేశ భక్తులుగానూ, భిన్న కోణాల గురించి వివరించే వారిని దేశ ద్రోహులు లేదా చైనా అనుకూలురుగానో చిత్రించే వాతావరణంలో వున్నాం. ప్రస్తుతం ముస్లిం పాకిస్థాన్‌, కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే అసలు సిసలైన దేశ భక్తిగా కాషాయ సర్టిఫికెట్లు ఇస్తున్న రోజులివి. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన సిపిఎంను చైనా అనుకూల పార్టీగా చిత్రించిన వారిలో ఆర్‌ఎస్‌ఎస్‌, అది గతంలో తన రాజకీయ విభాగంగా నడిపిన జనసంఘం ముందు వరుసలో వున్నాయి. అప్పటికీ ఇప్పటికీ సిపిఎం తన వైఖరిని మార్చుకోలేదు. సరిహద్దు గురించి సంప్రదింపులు జరిపేందుకు అర్హత కేంద్రంలో అధికారంలో వున్నవారికి మాత్రమే వుంటుంది. సిపిఎంకు అటువంటి అవకాశం రాలేదు. అంతకు ముందు చైనాతో యుద్ధానికి అవసరమైతే తాము రంగంలోకి వస్తామంటూ వీధులలో ప్రదర్శనలు చేసిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు జనతా పార్టీ ముసుగులో ఒకసారి అధికారానికి వచ్చారు, రెండవ సారి బిజెపి పేరుతో, మూడవ సారి కూడా అదే పేరుతో అధికారానికి వచ్చి చేసిందేమిటయ్యా అంటే సామరస్య పూర్వరంగా చైనాతో చర్చలు జరపటమే కాదు, కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా చైనా కమ్యూనిస్టుపార్టీతో అధికారిక సంబంధాలు పెట్టుకొని చైనా యాత్రలు చేసి వస్తున్నారు. అదనంగా వ్యాపారలావాదేవీలతో మునిగి తేలుతున్నారు. చైనాతో ఒకవైపు సంబంధాలు నెరుపుతూనే మరోవైపు చైనా వ్యతిరేక రాజకీయాలలో కూడా భాగస్వాములు అవుతున్న పెద్దలు దేశ భక్తులుగా చెలామణి అవుతున్నారా లేదా ? దీనికి నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, ఇతర బిజెపి మిత్రపక్ష నేతలెవరూ మినహాయింపు కాదు. అలాంటపుడు మసూద్‌ అజార్‌ను చైనా కాపాడటం కూడా అదే రాజకీయాలలో అంతర్బాగమే అని అభిప్రాయపడిన వారు చైనా అనుకూలురు, దేశద్రోహులు ఎలా అవుతారు ?

     అవన్నీ కాదు మన ప్రయోజనాలే ముఖ్యం, చైనా అయినా మరొక దేశమైనా మనకు అనుకూలంగా వున్నంత వరకు వుపయోగించుకోవాలి, లేనపుడు వ్యతిరేకించాలి అని అనుకోవటానికి ఎవరికైనా హక్కుంది తప్ప భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారి మీద రంగులు చల్లితే, బురద వేస్తే కుదరదు. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్‌, మీ ఇంటికొస్తే మాకేం పెడతావ్‌ అనే అతి తెలివి అనాలి. కొంచెం కటువుగా వున్నప్పటికీ అంతర్జాతీయ రాజకీయాల్లో ఇలాంటివి పని చెయ్యవు అని చెప్పక తప్పదు. ఇరుగు పొరుగుతో స్నేహం చేసేటపుడు రెండువైపులా స్నేహ ధర్మం పాటించాలి. ఈ పూర్వరంగంలో మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు కాపాడుతోందో వారి వైపు నుంచి కూడా చూడటం అవసరం.

Image result for masood azhar,  Dalai Lama

      మసూద్‌ అజార్‌, ఆ వరుసలో వున్న ఇంకా అనేక మంది టెర్రరిస్టులను అంతర్జాతీయంగా గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవాలనటం నిర్వివాదాంశం. ప్రపంచంలో అనేక దేశాలలో టెర్రరిస్టులు, తిరుగుబాటుదారులు, వేర్పాటు వాదులు ఎందరో వున్నారు. వారు మతాధికారులు, మరొకరు ఎవరైనా కావచ్చు, ఇతర దేశాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు. అలాంటి అభ్యంతరాలున్న జాబితాలు ప్రతి దేశంలోనూ వుంటాయి. మనకు చైనాకు మధ్య సరిహద్దు వివాదం వుంది. వాటిలో లడఖ్‌ ప్రాంతంలోని ఆక్సాయ్‌ చిన్‌, ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్‌ ప్రదేశ్‌ వున్నాయి. బ్రిటీష్‌ పాలకులు మనకు తెచ్చిన అనేక సమస్యలలో ఇదొకటి. బ్రిటీష్‌ ఇండియా విదేశాంగ కార్యదర్శిగా పని చేసిన బ్రిటీష్‌ అధికారి హెన్రీ మెక్‌మోహన్‌ 1914లో గీసిన సరిహద్దు లైన్ల ఆధారంగా అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం-టిబెట్‌ ప్రభుత్వం మధ్య ఒక సరిహద్దు ఒప్పందం కుదిరింది. టిబెట్‌కు అలాంటి అధికారం లేదని వాదించిన చైనా ఆ హద్దును తాను గుర్తించటం లేదని అప్పుడే స్పష్టం చేసింది. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మరుసటి ఏడాది చైనా కమ్యూనిస్టుపార్టీ అధికారంలోకి వచ్చింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా వుంచటానికి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు కుట్ర చేసినట్లే , సామ్రాజ్యవాదులు టిబెట్‌ను కూడా స్వతంత్ర రాజ్యంగా మార్చేందుకు కుట్ర పన్నారు. మిలిటరీ చర్య ద్వారా కాశ్మీర్‌ను మన దేశంలో అంతర్భాగంగా చేసినట్లే టిబెట్‌ను కూడా చైనా సైనిక చర్య ద్వారా టిబెట్‌ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ఆ సమయానికి మనదిగా బ్రిటీష్‌ వారు మ్యాపులలో చూపిన ఆక్సాయ్‌ చిన్‌ చైనాలో, చైనాకు చెందినదిగా పేర్కొన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ మన ఆధీనంలో వుంది. దాంతో ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అగత్యం కలిగింది. కాశ్మీర్‌ మన దేశ అంతర్బాగమని కమ్యూనిస్టు చైనా గుర్తించినట్లే, టిబెట్‌ ప్రాంతం చైనా అంతర్భాగమని మన దేశం కూడా గుర్తించింది. అయితే చైనా ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి, టిబెట్‌ ప్రత్యేక దేశంగా ప్రకటించిన మత పెద్ద దలైలామాకు మన దేశంలో ఆశ్రయం కల్పించటమే గాక హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస ప్రభుత్వ ఏర్పాటును సైతం అనుమతించింది. అయితే దౌత్యపరంగా వాటికి గుర్తింపు ఇవ్వలేదు తప్ప దలైలామా అండ్‌కో చేసే చైనా వ్యతిరేక కార్యక్రమాలు, కార్యకలాపాలన్నింటినీ మన ప్రభుత్వం అనుమతిస్తున్నది.దీనికి కాంగ్రెస్‌, జనతా, నేషనల్‌ ఫ్రంట్‌, బిజెపి అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు ఒకటిగానే వ్యవహరిస్తున్నాయి. ఒక వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్నవారెవరైనా దానికి కొత్త పీఠ ముడులను వేయకుండా చూడాలి. కానీ పరిణామాలు అలా లేవు.

    ఒక శరణార్ధిగా దలైలామాను మన దేశంలో అనుమతించటం వేరు, ఒక తిరుగుబాటు ప్రవాస ప్రభుత్వ నేతగా కార్యకలాపాలను పదే పదే అనుమతించటాన్ని చైనా సహించదని తెలిసి కూడా అనుమతించటాన్ని ఏమనాలి? మన దేశానికి మసూద్‌ అజార్‌ ఎలాంటి ప్రమాదకర వ్యక్తో చైనాకు దలైలామా అంతకంటే ఎక్కువ ప్రమాదకర వ్యక్తి. 1959లో చైనా ప్రభుత్వంపై విఫల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. అప్పటి నుంచి అనేక మంది టిబెట్‌ తిరుగుబాటుదార్లు వుగ్రవాదులుగా మారి అనేక దేశాలలో చైనా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కుట్రలు చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌ చివరి వారంలో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో తొలిసారిగా నాలుగు రోజుల పాటు చైనా వ్యతిరేక సంస్ధల అంతర్జాతీయ సమావేశాన్ని జరుపుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించటాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. దలైలామాకు ఎప్పటి నుంచో మన దేశం ఆశ్రయం కల్పించి మద్దతు ఇస్తున్నా బహిరంగంగా అమెరికా, ఇతర దేశాలలో ప్రభుత్వేతర సంస్ధల ముసుగులో పనిచేసే చైనా వ్యతిరేకుల సమావేశాన్ని అనుమతించిన ఘనత నరేంద్రమోడీకే దక్కింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లోని దక్షిణ ప్రాంతంగా చైనా అంటోంది. అక్కడి తవాంగ్‌ పట్టణం ఆరవ దలైలామా జన్మ స్ధలం. ఈ ఏడాది మార్చి నెలలో తవాంగ్‌ పర్యటన జరపాలని దలైలామా నిర్ణయించుకున్నారు. చైనాకు అభ్యంతరమని తెలిసి కూడా దేశంలో దలైలామా ఎక్కడికైనా స్వేచ్చగా వెళ్ల వచ్చని నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రకటించటం, గతేడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో అమెరికా రాయబారి పర్యటనను అనుమతించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? కాశ్మీర్‌ సమస్యలో మూడో దేశ జోక్యాన్ని మనం అనుమతిస్తామా ?

     దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి మన దేశానికి ఎలాంటి వివాదం, సంబంధం లేదు, మన నౌకలు వెళితే చైనా అడ్డుకున్న వుదంతాలు లేవు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులపై చైనా, జపాన్‌, వియత్నాం, మరికొన్ని దేశాలు వివాదపడుతున్నాయి. ఆ సమస్యను అవే పరిష్కరించుకోవాలి. ఆ ప్రాంతంలో అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం తమ నౌకలు స్వేచ్చగా తిరగటానికి వున్న హక్కును అమలు చేసుకొంటున్నామనే పేరుతో అమెరికా-జపాన్‌ కార్యాచరణ బృందం తమ యుద్ధ నౌకలతో ఆ ప్రాంతంలో 2016 మే-జూలై మధ్య రెండున్నర నెలలపాటు విన్యాసాలు నిర్వహించి చైనాతో కయ్యానికి కాలుదువ్వాయి. వాటితో కలసి జలకాలాడేందుకు మన నాలుగు నౌకలను మోడీ సర్కార్‌ పంపటం ఏమిటి ? అమెరికా, జపాన్‌లకు జూనియర్‌ భాగస్వామిగా మన దేశాన్ని మార్చినట్లా, వాటితో పాటు కలిసి చైనాపై బస్తీమే సవాల్‌ విసిరినట్లా ? జపాన్‌తో అమెరికాకు రక్షణ ఒప్పందం వుంది కనుక అమెరికన్లు ఆ ముసుగులో జోక్యం చేసుకుంటున్నారు. మనకు సంబంధం ఏమిటి ? ఎవరిని సంతోష పెట్టటానికి ఈ పని చేసినట్లు ? మసూద్‌ అజార్‌ విషయంలో చైనా అనుసరిస్తున్నదానికి దెబ్బకు దెబ్బ అని మన దేశంలోని చైనా వ్యతిరేకులు వాదించ వచ్చు. అటువంటి వారికి మసూద్‌తో సహా ఇతర వివాదాలపై చైనాను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది ? మనం చైనా వ్యతిరేకికి ఆశ్రయం ఇచ్చిన మాదిరి మన వ్యతిరేకి మసూద్‌ అజార్‌కు చైనా ఆశ్రయం కల్పించలేదు, అలాంటి వారితో మనకు వ్యతిరేకంగా తన గడ్డపై సభల నిర్వహణకు ఏర్పాటు చేయలేదు. మసూద్‌ అజార్‌ను వుగ్రవాదిగా తీర్మానించబోయే ముందు ఆ సమస్యను రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకుంటున్నారేమో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని చైనా కోరింది తప్ప అతను తీవ్రవాది కాదని గానీ అవుననిగానీ చెప్పలేదు. అయితే ఆ వైఖరి ఆచరణలో తీర్మానానికి అడ్డుపడినట్లే అన్నది స్పష్టం. ఇటువంటి వైఖరులతో సంబంధాల మెరుగుదలకు కృషి చేస్తున్నామని వుభయ దేశాలు చేసే ప్రకటనలకు అర్ధం వుండదు. ఎవరు ముందు తప్పు చేశారు, ఎవరు తరువాత చేశారు అనే వాద ప్రతివాదాలలోకి పోతే పరిష్కారం కుదరదు.

    గత పాతిక సంవత్సరాలలో ముఖ్యంగా గత పది సంవత్సరాలలో మన దేశాన్ని అమెరికాకు దగ్గరగా తీసుకుపోతున్న కొద్దీ ఆ మేరకు పాకిస్థాన్‌ చైనాకు దగ్గర అవుతోంది. గతంలో అమెరికా-సోవియట్‌ యూనియన్‌ మధ్య వున్న విబేధాలను మన పాలకవర్గం వుపయోగించుకొని లబ్ది పొందిన విషయం తెలిసిందే. ఇప్పుడు చైనా-అమెరికా మధ్య వున్న విబేధాలను వుపయోగించుకొని పాకిస్థాన్‌ అదేపని చేస్తోందన్నది స్పష్టం. ఒకవైపు పాకిస్థాన్‌ అమెరికన్లతో దగ్గర సంబంధాలను కొనసాగిస్తూనే చైనాతో రోజు రోజుకూ సంబంధాలను పెంచుకొంటోంది. మనకు చైనాతో వివాదాలు పెంచుకొని అమెరికాతో దగ్గర కావటం లాభమా, చైనాతో వివాదాలను తగ్గించుకొని లాభపడటం మంచిదా అని ఆలోచించుకోవాలి. మనకు, పాకిస్తాన్‌కు ఆయుధాలు విక్రయించి లబ్ది పొందుతున్న అమెరికా ఇప్పుడు చైనాతో మరోసారి మన వివాదాలు పెంచుకోవాలని కోరుకుంటోంది. మన దేశానికి వారి ఆయుధాలను మరింతగా విక్రయించాలంటే చైనాతో లడాయి పెరగాలి. అప్పుడే వారి ఆయుధ పరిశ్రమలు మూడు పూవులు ఆరు ఆయుధాలుగా వర్ధిల్లుతాయి. ఈ పరిణామాల పూర్వరంగాన్ని అర్ధం చేసుకుంటే చైనా తిరుగుబాటుదారుడు దలైలామాను మన దేశం ఎందుకు సమర్ధిస్తుందో, వుగ్రవాది మసూద్‌ అజార్‌ను చైనా ఎందుకు రక్షిస్తుందో అర్ధం చేసుకోవటం కష్టం కాదు !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూద్దాం !

16 Sunday Oct 2016

Posted by raomk in CHINA, Current Affairs, Economics, History, INDIA, INTERNATIONAL NEWS, NATIONAL NEWS, Opinion, RUSSIA, USA

≈ Leave a comment

Tags

China, economic reforms, INDIA, Indian economy, Riding on flying horses

Image result for narendra modi on flying horse

సత్య

   రెక్కల గుర్రాలు ఎక్కి చుక్కల లోకాలు చూసే బాల్యం నాటి వూహలు, కథలు జీవితాంతం గుర్తుంటాయి. మన పూర్వీకులు పెట్రోలు, పైలట్లతో పని లేకుండా ఒక లోకం నుంచి మరో లోకానికి, పైకీ, కిందికీ, ఎటుబడితే అటు తిప్పుతూ ఎంత మంది ఎక్కినా మరొకరికి సీటు వుండే విమానాలలో తిరిగే వారని వయస్సు వచ్చిన వారికి, అందునా చదువుకున్న వారికి చెప్పటమే కాదు, వారి చేత నమ్మింప చేస్తున్న రోజులి. ఇక ప్రతిదానినీ ముందుగానే వూహించి చెప్పారంటున్న పోతులూరి వీరబ్రహ్మంగారి ప్రవచనాలను మనకు సరికొత్తగా అందించే మహానుభావుల సంగతి సరే సరి. ఈ కారణంగానే మన నిఘంటువులో అసాధ్యం అనే దానికి ఒక్క వుదాహరణ కూడా దొరకని తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నాం.దీనికి తోడు సామాజిక మాధ్యమం వచ్చిన తరువాత అది సంక్షోభ స్థాయికి చేరింది.

    లాభం లేనిదే వ్యాపారి వరదన పోడు అన్నది తెలుగు సామెత. ఒక పేదవాడు పండుగకో, పబ్బానికో అని కొనుక్కున్న దుస్తుల మీద ఏదైనా పడితే మరకగా మారుతుందేమోనని ఎంత కంగారు పడిపోతాడో తెలిసిందే. ఆత్మగౌరవం గల వ్యక్తులు తమ వ్యక్తిత్వాల మీద ఒక మరక పడితే తల్లడిల్లి పోతారని పాత పుస్తకాల్లో చదువుకున్నాం. అంతరించి పోతున్న అలాంటి వారు ఎక్కడన్నా కనపడతారేమోనని పాతాళభైరవి దురి&భిణి వేసి చూసినా కనిపించటం లేదు . ఇక ‘బ్రహ్మం గారు చెప్పినట్లు ‘ అధికారం రుచి మరిగిన మన రాజకీయ నాయకుల గురించి ఇక చెప్పుకోనవసరం లేదు. ఎన్ని మరకలు పడితే అంతగా మార్కెట్లో డిమాండు వుంటుందనే సత్యాన్ని బోధి చెట్టు కింద కూర్చోకుండానే తెలుసుకున్న అపర జ్ఞానులు. ఎదుటి వారి మీద మరకలు వేయటం, తాము వేయించుకోవటంలో ఆరితేరిన వారు. ఒక వ్యాపారి ‘మరకు మంచిదే ‘ అంటూ తన వుత్పత్తులను అమ్ముకోవటానికి ఒక మరక నినాదాన్ని సృష్టించి నిజంగా మరక పడటం మంచిదే అని జనం అనుకునేట్లుగా వాణిజ్య ప్రకటనలను తయారు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ వ్యాపారులు కూడా అలాంటి ఎక్కువ మరకలున్నవారి కోసం నిత్యం ఎదురు చూస్తూ కొనుగోలుకు ప్రయత్నిస్తుంటారు. ఆ సరకులకు ‘నియోజక వర్గ అభివృద్ధికోసం, కార్యకర్తల అభీష్టం మేరకు, మా నేత అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు, స్వగృహ ప్రవేశం ‘ వంటి ఎన్నో ట్యాగులను కూడా రూపొందించిన మేథావులు.

    1848లో కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌ రాసిన కమ్యూనిస్టు మానిఫెస్టోను కమ్యూనిస్టు పార్టీలు అనేక ముద్రణలు, ప్రపంచ భాషలన్నింటిలోనూ తర్జుమా చేయటం మామూలు విషయం. ఈ విషయంలో బైబిల్‌తో పోటీ పడేది ఏదైనా గ్రంధం వుందంటే అది ముమ్మాటికీ కమ్యూనిస్టు మానిఫెస్టో ఒక్కటే. కార్మికుల శ్రమ శక్తి నుంచి లాభాలను పిండుకోవటం గురించి తేటతెల్లం చేసిన ఆగ్రంధాన్ని, అది వ్యాపింపచేసిన భావజాలం కమ్యూనిజాన్ని వ్యతిరేకించని పెట్టుబడిదారుడు, బడా వ్యాపారి వుండడు అంటే అతిశయోక్తి కాదు. కానీ అదే పెట్టుబడిదారులు, వ్యాపారులు ఆ కమ్యూనిస్టు మానిఫెస్టోకు మార్కెట్‌లో వున్న గిరాకీని బట్టి దానిని ముద్రించి లాభాలు ఆర్జించటమే అసాధారణం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పుకుంటున్న ఇండోనేషియాలో ఈనెలలోనే ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు మానిఫెస్టో గ్రంధాన్ని చూసిన మిలిటరీ గూఢచారులు ఇంకేముంది ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని వ్యాపింప చేస్తున్నారంటూ పుస్తకాలు అమ్ముతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి గంటల కొద్దీ విచారణ పేరుతో నిర్బంధించారు. దానిని ప్రచురించిన వారు అబ్బే మాకు కమ్యూనిజం ఏమిటి, దాన్ని వ్యాపింప చేయట ఏమిటి, అమ్ముడు పోయే పుస్తకాలన్నీ ప్రచురించటం, అమ్ముకోవటం తప్ప మాకేమీ తెలియదని చెప్పిన తరువాత వారిని వదలి వేశారు. తమకు లాభదాయకం అనిపించింది కనుకనే రెండవ ప్రపంచ యుద్ధం తరువాత సామ్రాజ్యవాదులు కమ్యూనిస్టు వ్యతిరేకతను సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నించి లాభపడ్డారు. అదే సామ్రాజ్యవాదులు కమ్యూనిజాన్ని కూడా సొమ్ము చేసుకోవచ్చు అని గ్రహించి చైనాతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. అంటే లాభం వస్తే వ్యాపారి అవసరమైతే తనను తానే అమ్ముకోవటానికి కూడా వెనుతీయని ‘త్యాగశీలి’.

   పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాల కోసమే కదా ఇండియాకు సముద్రమార్గం కనుగొనమని కొలంబస్‌ను పురికొల్పారు. దారి తెలియనపుడే అంతగా తహతహలాడిన వారు ఇప్పుడు ఎక్కడ లాభం వస్తుందో స్పష్టంగా తెలిసిన తరువాత అక్కడ వాలిపోవటంలో ఆశ్చర్యం ఏముంది? లాభానికి భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాల్లో ఎప్పుడూ దేశ భక్తి వుండదు. లాభం వస్తే ప్రాణాలు హరించే వరదల్లో కూడా వెళ్లేందుకు సిద్దపడే వ్యాపారులు మన మార్కెట్లో ప్రవేశించేందుకు సామ,దాన,బేధో పాయాలను ప్రయోగించారు. వివిధ ప్రాంతాలలో వేర్పాటు, వుగ్రవాద శక్తులు వాటిలో భాగమే. కమ్యూనిజం అని మడి కట్టుకు కూర్చుంటే లాభాలు వస్తాయా మీ పిచ్చిగానీ అని అవగతం చేసుకున్న వారు ప్రపంచంలో అతి పెద్ద ఎగుమతి, దిగుమతి మార్కెట్టు కమ్యూనిస్టు చైనాను వదులుకుంటారా ? అలా వదులు కున్న వారు నిజంగా దేశ భక్తులే ! కుందేటి కొమ్మును సాధించ వచ్చు గాని అలాంటి వారిని ఎవరినైనా ఒక్కరిని చూపగలరా ? అమెరికా వ్యాపారులు పాతాళ భైరవిలోని దుష్ట గురువుల వంటి వారైతే, భారత వ్యాపారులు ఆ గురువు శిష్యుని వంటి వారు. అందుకే కమ్యూనిస్టు చైనాను వ్యతిరేకించటమే దేశ భక్తికి గీటు రాయి అని వూరూ వాడా ప్రచారం చేసిన సంఘపరివారం తీరా తాము అధికారానికి వచ్చిన తరువాత అదే చైనాతో భాయీ భాయీ అన్నట్లుగా వాజపేయి హయాంలో వున్నారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దగ్గరయ్యారు. గతంలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టిన వారు ఇప్పుడు ప్లేటు ఫిరాయించారేమిటి అని ఎవరైనా అడుగుతారేమోనన్న భయంతో అనధికారికంగా చైనా వ్యతిరేకతను వ్యాపింప చేయటంలో కూడా వారే ముందుంటున్నారు. ముఖ్యంగా సామాజిక మీడియాలో పెద్ద ఎత్తున ఆపని చేస్తున్నారు. వారి ద్వంద్వ ప్రవత్తికి అది పెద్ద తార్కాణం.

   ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మీడియాలో దేశాలు, వ్యాపారం, వస్తువులు, దేశభక్తి గురించి చర్చ పొంగి పొర్లుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం మనుస్మృతి, బైబిల్‌,ఖురాన్‌లో చెప్పిందానికి తిరుగులేదు చర్చ లేకుండా పప్పుసుద్దల్లా పడి వుండటం, తలాడించాలని చెప్పే అపర వ్యాఖ్యాతలు, నిర్ధేశకుల నిరంకుశ భావజాలం కంటే ఏదో ఒక చర్చ జరపటం మంచిదే. మరకలు పడినా, కావాలని సిరాలు చల్లినా చర్చంటూ జరిగితే కదా తెలియని విషయాలు బయటికి వచ్చేది. మూఢ భక్తులు తమ మూఢ గురువు ముందు ఎవరైనా ప్రశ్నిస్తే సహించరు, సామాజిక మీడియాలో వారికి ఇష్టం లేకపోయినా భిన్న వాదనలు, ప్రశ్నలు ఎదురవుతాయి. అవి వారిని మార్చకపోయినా ఎదుటి వారి వాదనలను కూడా వినాలనే సహనం గల ఆలోచనా పరులకు వుపయోగం కనుక ఆ చర్చలో ప్రతివారూ పాల్గొనాలి.

    ఈ నేపధ్యంలో కొన్ని అంశాలను చూద్దాం. మీ ఇంటికి మా ఇల్లెంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లూ అంతే దూరంలో వుంటుంది అన్న సూక్ష్మ విషయం కూడా తెలియని వారు కొద్ది రోజుల పాటు చైనా వస్తువులను కొనకుండా, అమ్మకుండా, వుపయోగించకుండా వుంటే చైనా మన కాళ్ల దగ్గరకు వస్తుందన్నంతగా కొంత మంది సూచనలు చేస్తున్నారు. ఇది నిజానికి కొత్త అయిడియా కాదు, అరువు తెచ్చుకున్నదే. మన స్వాతంత్య్ర వుద్యమంలో విదేశీ వస్తుబహిష్కరణ పేరుతో ఒక పెద్ద అధ్యాయమే వుంది. దాన్నుంచి వచ్చిన ఆలోచన ఇది. ఆ వుద్యమానికి నాయకత్వం వహించిన ఆ కాంగ్రెస్‌ పార్టీ పెద్దలే విదేశీ వస్తువుల వరదకు తలుపులు తెరిచారు.స్వదేశీ జాగరణ మంచ్‌పేరుతో ఒకవైపు కాస్త హడావుడి చేసినా ఆ విధానాన్ని బిజెపి పెద్దలు పూర్తిగా బలపరిచారు.తమకు అధికారం వచ్చిన తరువాత ఆ స్వదేశీ జాగరణ మంచ్‌ ఏమైందో తెలియదు. కాంగ్రెస్‌ను తలదన్నేలా మరిన్ని సంస్కరణల పేరుతో విదేశీ వస్తువుల సునామీకి తెరతీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for Riding on flying horsesIndia

    భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా  పెట్టుబడిదారీ విధాన సమర్ధకుడు. ఆయన చేసిన వ్యాఖ్యలే కనుక ఏ రాజకీయ పార్టీనేతో, అభ్యుదయ భావాలు వున్నవారో చేసి వుంటే ఈ పాటికి దేశ ద్రోహుల, చైనా అనుకూల జాబితా పెరిగి పోయి వుండేది. భిన్నాభి ప్రాయాన్ని వ్యక్తం చేయకుండా వుండటం కోసం అలాంటి ముద్రలు వేయటం ఒక పదునైన ఆయుధం. ‘ చైనాకు మన ఎగుమతులు తక్కువగా వుండటమనేది సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా మన ఎగుమతులు తగ్గిపోవటమే అసలు సమస్య. ఎగుమతుల నుంచి మనం తక్కువ ఆర్జిస్తున్నాము. వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలెట్స్‌ దిగుమతులకు అధిక మొత్తంలో ఖర్చు చేస్తున్నాము. చైనా వారి పద్దతి పూర్తిగా భిన్నమైనది. చైనా రైతు పొలాలకు నీటిని తీసుకు వచ్చే కాలువలలో నీరు సదా నిండుగా వుంటుంది.ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన దుర్గతి అతనికి లేదు. మన రైతులతో పోల్చితే చైనా రైతు వుత్పత్తి వ్యయం తక్కువ. అలాగే చైనా మన దేశంలో తన వుత్పత్తులను కుమ్మరించటం కూడా ఈ వాణిజ్యలోటుకు కారణం కానే కాదు. ఆర్జిస్తున్నదాని కంటే ఎక్కువగా వినియోగం చేసేలా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అప్పు చేసి పప్పుకూడు తినమంటున్నది. వాణిజ్య లోటుకు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి.’ ప్రస్తుత పరిస్థితులలో ఇలా చెప్పటం నిజంగా పెద్ద తెగింపే. ఇష్టంలేని వారు చెప్పింది ఇనుప రింగులతో , ఇష్టం వున్నవారు వుంగరాల చేతో మొట్టినట్లుగా వుంటుంది.

    భరత్‌ ఝన్‌ఝున్‌ వాలా రాసిన పై వ్యాసంతో పాటు ఆంధ్రజ్యోతిలో వి.శ్రీనివాస్‌ అనే రచయిత మరొక వ్యాసం కూడా దీని గురించే రాశారు. ‘ ‘దేైశభక్త రాజకీయాలతో ‘ సంబంధం వున్న ప్రతి నేతా ఇప్పుడు పాకిస్తాన్‌ అంతు చూడటం, చైనాకు బుద్ధి చెప్పటం గురించే మాట్లాడుతున్నారు. భారతీయులు నిష్టగా ‘చైనా వస్తు బహిష్కరణ వ్రతం ‘ ఒక్క నెల రోజులు పాటించినా ఆ దేశ ఆర్ధిక వ్యవస్ధ కుప్పకూలటం ఖాయమంటూ సోషల్‌ మీడియాలో గణాంకాలు షికార్లు చేస్తున్నాయి. ఈ దీపావళికి చైనా టపాసులను ముట్టుకోబోమని ప్రతి భారతీయుడు ప్రతిజ్ఞ చేయాలన్న ప్రబోధాలు వినవస్తున్నాయి. చైనాను దారిలోకి తెచ్చుకొనేందుకు వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించే వ్యూహంలో భారత్‌ వున్నట్లు నిర్మలా సీతారామన్‌ చెబుతున్నారు. చైనా వస్తువుల క్రయ విక్రయాల్లో భారీ లాభాలు మూట కట్టుకుంటున్న దేశీయ వ్యాపార కూటముల మాటేమిటి ? ఎవరి లాబీయింగ్‌ దేశీ మార్కెట్లో చైనా సరకులకు బాట వేసింది ? ఎవరి లాభ కాంక్ష దేశీయ చిన్న పరిశ్రమల వుసురు తీసింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో పెరుగుతున్న అసమతౌల్యం ఆర్ధిక రంగానికి విఘాతంగా మారుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదు? చైనా ధోరణి అంతర్జాతీయ వేదికలపై భారత ప్రయోజనాలను దెబ్బతీసేట్లుగా వున్నప్పటికీ వాణిజ్య బంధం సడల కుండా ఎందుకు పోషిస్తోంది? మనం కొన్ని వస్తువులను బహిష్కరిస్తే మనకు అత్యవసరమైన కొన్ని వస్తువుల దిగుమతులను నిలిపివేయట ద్వారా చైనా వుల్టా మనపై వత్తిడి చేయగల పరిస్ధితి ఇప్పుడు వుంది.’ ఇలా సాగింది. దీని అర్ధం ఏమిటో ఎవరికి వారు తీసుకోవచ్చు. ఎందుకంటే సూటిగా చెబితే ఇక్కడా దేశ భక్తి ముద్ర వేయటానికి కొందరు సిద్దంగా వుంటారు.

   దీనంతటికీ కారణం ఏమిటి అంటే పాచిపోయిన రోత పుట్టించే సమాధానం అది కమ్యూనిస్టు నియంతృత్వ దేశం, మనది ప్రజాస్వామ్య వ్యవస్ధ అని కూడా చెబుతారన్నది తెలిసిందే. వసుధైక కుటుంబమనే విశాల భావన మనది అని చెప్పుకుంటూనే ఇరుగు పొరుగు దేశాలపై కాలు దువ్వే వారి సంగతి పక్కన పెడితే కాసేపు చైనా సంగతి వదిలేద్దాం. మన పరిశ్రమలను, మన రైతులను కాపాడు కోవద్దని లేదా దెబ్బతీయమని మన ప్రజాస్వామ్య వ్యవస్ధ చెప్పిందా లేదే ! దీనికంతటికీ కారకులు కాంగ్రెస్‌ నేతలే అని వెంకయ్య తన భాషా చాతుర్యాన్ని వుపయోగించి ప్రాసతో సహా చెప్పగలరు. మన దేశ పరిశ్రమలు, రైతులను దెబ్బతీసే దిగుమతులను నిరోధించటానికి అవసరమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఇవ్వాల్సింది నరేంద్రమోడీ సర్కారే కదా ? ఎందుకు నిలిపివేయలేదు ? దేశ భక్తి ఎక్కడికి పోయింది. ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు విలువైన విదేశీ మారక ద్రవ్యంతో వాషింగ్టన్‌ ఆపిల్స్‌, స్విస్‌ చాకొలేట్లు దిగుమతి చేసుకోకపోతే మనకు రోజు గడవదా ? నరేంద్రమోడీకి తెలియదు అనుకుంటే అన్నీ ఎక్కువగా వున్న అపర కౌటిల్యుడు సుబ్రమణ్యస్వామి, ఎప్పటి అవసరాలకు అనుగుణంగా అప్పటికి తగిన విధంగా చక్రం తిప్పే చంద్రబాబు నాయుడి వంటివారి సేవలను ఎందుకు వుపయోగించుకోవటం లేదు ?

   ప్రియమైన పాఠకులారా ఇవేవీ నరేంద్రమోడీతో సహా ఎందరో మహానుభావులు ఎవరికీ తెలియకుండా జరుగుతున్నవి కాదు, అంత అమాయకులెవరూ లేరని ముందుగా మనం తెలుసుకోవాలి. ఆరు వందల సంవత్సరాల నాటి పెట్టుబడిదారీ మేథావులు తమ యజమానుల లాభాలకు కొత్త మార్కెట్ల కోసం కొలంబస్‌లను పంపించారు. ఆధునిక పెట్టుబడిదారీ మేథావులు అంతకంటే తెలివి గల వారు కనుక లాభాల వేటకు హైటెక్‌ పద్దతులను కనిపెట్టారు. గ్రామాలలో ధనిక రైతులు వ్యవసాయాలు మానేసి తమ పొలాలను కౌలుకు ఇస్తున్నారంటే అర్ధం ఏమిటి ? సూటిగా చెప్పాలంటే పంట పండించకుండానే ఫలితాన్ని పొందటమే కదా ? స్వంతంగా వ్యసాయం చేస్తే ఎంత మిగులుతుంతో తెలియదు, కౌలుకు ఇస్తే వ్యవసాయం ఏమయినా, కైలు రైతు మట్టి కొట్టుకుపోయినా ఆ మొత్తం గ్యారంటీగా భూ యజమానికి వస్తుంది. అలాగే ఇంతకాలం లాభాలు సంపాదించి కవిలె కట్టలు గుట్టలుగా పెట్టుకున్న పెట్టుబడిదారులు ధనిక రైతులు లేదా భూస్వాముల కంటే మరింత మెరుగైన పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టకుండా, వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేయకుండానే కొత్త పద్దతుల్లో ప్రపంచంలో ఎక్కడ అవకాశం వుంటే అక్కడ లాభాలు పిండుకుంటున్నారు. అందుకు అనేక కొత్త పద్దతులు కనుగొన్నారు. నూతన ప్రపంచాన్ని కనుగొన్న ఆ కొలంబసే కనుక ఇప్పుడు తిరిగి వస్తే పెద్ద షాపింగ్‌ మాల్లో ఏం చేయాలో తెలియని పల్లెటూరి అమాయకుడిలా నోరెళ్ల బెట్టటం తప్ప జరుగుతున్నదేమిటో అర్ధం చేసుకోలేడంటే అతిశయోక్తి కాదు.

    అమెరికాలో ఒక కార్మికుడు ఒక గంట పని చేస్తే కనీస వేతనంగా ఏడు నుంచి పది డాలర్ల వరకు వుంది. ఒక డాలరు విలువ 67,68 రూపాయలు. అంటే రోజుకు ఎనిమిది గంటలు అంటే ఎనభై డాలర్లు సంపాదిస్తారు, దాదాపు ఐదు వేల రూపాయలు. కనీసంగా గంటకు 15 డాలర్లను సాధించుకోవాలని అక్కడి కార్మిక వర్గం పోరాటాలు చేస్తోంది. కొన్ని చోట్ల అంగీకరించారు. ఆ స్ధితిలో అమెరికా పెట్టుబడిదారులు రోజుకు కనీస వేతనంగా ఐదు వేల రూపాయలు ఇచ్చి ఒక కార్మికుడితో పని చేయించుకోవటం కంటే చౌకగా శ్రమశక్తి దొరికే చోట నెల మొత్తానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పనిచేయించుకున్నారనుకున్నా ఒక్కొక్క కార్మికుడి మీదే నెలకు యాభైవేల రూపాయలు మిగులుతాయి. జపాన్‌ వారు మన దేశంలో మారుతీకార్ల తయారీ (కూర్పు) కేంద్రాలు, కొరియా వారు శాంసంగ్‌ టీవీలు, ఫోన్ల తయారు చేసినా లాజిక్‌- మాజిక్‌ ఇదే. యుద్దనపూడి సులోచనా రాణి నవలల్లోని ఆరడుగుల అందగాడు ఒయ్యారాలు ఒలికించే ఇంపాలా కారులో దిగాడని ఒకపుడు మనం చదువు కున్నాం. ఇప్పుడు వాటి తాతలను మన దేశంలోనే తయారు చేయగల పరిస్థితి వుంది. కార్లు, టీవీలు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువుల విడిభాగాలను మన దేశానికి తీసుకువచ్చి తెల్లవారే సరికి వాటిని బిగించి మన దేశంలో అమ్మటంతో పాటు విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తున్నాము.

   వీళ్లు కాకుండా మరికొందరున్నారు. వారు ఇప్పటికే మన వంటి దేశాలలో వున్న పరిశ్రమలు, వ్యాపార సంస్ధల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొంటారు. తెలుగు సినిమాల్లో విలన్లు చివరికి మనకు కనిపిస్తారు. వీరసలు ఎలా వుంటారో కూడా తెలియదు. మన విజయ మాల్య మాదిరి రోజుకు ఒక కిరాయి భామను పక్కనే పెట్టుకొని ఎక్కడో ఒక విహార కేంద్రంలో కూర్చొని కంప్యూటర్ల ద్వారా వుదయం పూట షేర్లు కొని గోలు చేసి లాభం వస్తే సాయంత్రానికి అమ్మి సొమ్ము చేసుకుంటారు. ముంబైలో లాభాలు రాలేదనుకోండి మరుసటి రోజు ఏ దక్షిణాఫ్రికాలోనో లేక ఏ బ్రెజిల్‌లోనో కొని అమ్ముతారు.

   ఇంకా కొందరు వున్నారు. విజయవాడ-హైదరాబాదు మధ్య కార్లు సర్రున దూసుకుపోయే రోడ్లు వేయటానికి మన దేశంలోని జిఎంఆర్‌ వంటి కంపెనీలకు డబ్బు పెట్టుబడిపెడతారు. వాటి చేత మన దగ్గర టో(తో) లు వలిచి పన్ను వసూలు చేయిస్తారు. వాటిలో తమ వాటా తాము పట్టుకుపోతారు. మరి కొందరున్నారు. చంద్రబాబు నాయుడి వంటి వారి చేత తక్షణమే విద్యుత్‌ వుత్పత్తి కేంద్రాలు పెట్టకపోతే అంధకారం అలుముకుంటుందని పెద్ద ఎత్తున వూదరగొట్టిస్తారు. గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని గ్యాస్‌ విద్యుత్‌ కేంద్రాలు అలా పెట్టినవే. గ్యాస్‌ లేక అవి పనిచేయకపోయినప్పటికీ, ఒక్క యూనిట్‌ విద్యుత్‌ వుత్పత్తి చేయకపోయినా స్ధిర ఖర్చు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం డబ్బు చెల్లించిన విషయం తెలిసిందే. అధిక ధరలను చూపి నిర్మాణ ఖర్చును రెట్టింపుగా చూపుతారు. విదేశాలలోని తమ కంపెనీల నుంచే బొగ్గు దిగుమతి చేయించి సముద్రతీరంలోని ఏ నెల్లూరు దగ్గరో శ్రీకాకుళంలోనో విద్యుత్‌ కేంద్రాలన్నింటినీ పెట్టిస్తారు. కాలుష్యాన్ని జనానికి వెదజల్లి లాభాలను మాత్రం పట్టుకుపోతారు. వాటికి అవసరమయ్యే యంత్రాలను కూడా విదేశాలలోని తమ కంపెనీలు లేదా ఏజంట్ల నుంచే తెప్పిస్తారు. మొత్తానికి వుత్పత్తి ప్రారంభించకుండానే తమ ఖర్చును రాబట్టుకుంటారు.వాటంగా వుంటే కొంతకాలం వుంటారు లేకపోతే ఎవరో ఒకరికి విక్రయించి తప్పుకుంటారు.

   1948 నుంచి 1970 దశకం వరకు అమెరికా నాయకత్వంలోని సామ్రాజ్యవాద దేశాలు పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందకుండా కమ్యూనిస్టు చైనాను అడ్డుకున్నాయి. సోవియట్‌ కమ్యూనిస్టుపార్టీతో విబేధాల కారణంగా కొన్ని ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయాయి. అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ కేంద్రంగా వున్న హాంకాంగ్‌, మకావో దీవుల కౌలు గడువు తీరిన తరువాత 2000 సంవత్సరం నుంచి ప్రధాన భూభాగం చైనాలో విలీనం అవుతాయని ముందే నిర్ణయం అయింది. అక్కడ వున్న సంస్ధల పెట్టుబడులు, చైనీయుల పెట్టుబడుల గురించి ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరించాల్సిన పూర్వరంగంలో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షణ, ప్రవాస చైనీయుల పెట్టుబడుల ఆకర్షణ, ఇతర పెట్టుబడిదారీ దేశాల నూంచి కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్దిక వ్యవస్ధను పరిమితంగా విదేశీ సంస్థలకు తెరిచేందుకు సంస్కరణలను రూపొందించింది. తద్వారా కలిగే ఫలితాన్ని జనానికి చేరే విధంగా ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమలు, ఇతర వ్యాపారాల నిర్వహణ వంటి విధానాలను రూపొందించింది. హాంకాంగ్‌ కేంద్రంగా వున్న పెట్టుబడులు చెదరకుండా వుండేందుకు 2050 వరకు ఒకే దేశం రెండు ఆర్ధిక వ్యవస్ధల పేరుతో ప్రధాన భూభాగంలో సోషలిస్టు విధానం, హాంకాంగ్‌, మకావుల్లో పెట్టుబడిదారీ విధానాన్ని కొనసాగించేందుకు పెట్టుబడిదారులకు హామీ ఇచ్చింది. దాంతో ప్రవాస చైనీయులు పెట్టుబడులతో పాటు, భారీ ఎత్తున సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకు వచ్చారు. ప్రభుత్వం పరిశోధన-అభివృద్ధికి భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇలా బహుముఖ చర్యలతో చైనా అనూహ్య అభివృద్దిని సాధించింది. అది కింది వరకు వూట మాదిరి కింది వరకు దిగే విధానాలు అనుసరించింది. ఈ కారణాలన్నింటితో చైనా నుంచి బుల్లెట్‌ రైళ్ల నుంచి బుల్లి బుల్లి దీపావళి చిచ్చు బుడ్ల వరకు మన వంటి దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మన దేశంలోని బడా వ్యాపారులు తెల్లవారేసరికి లాభాలు కావాలంటే వాటిని దిగుమతి చేసుకొని సాయంత్రానికి అమ్మి రాత్రికి లాభాల లెక్కలు వేసుకోవచ్చు. ఫ్యాక్టరీలు పెట్టి, తయారు చేసి వాటిని అమ్ముకోవటం కంటే ఏది లాభం ? దీనికి మన్మోహన్‌ సింగ్‌, నరేంద్రమోడీ వంటి వారు పురచేయి అడ్డుపెడితే ఆగేవారు ఎవరైనా వుంటారా ? కావాలంటే వారిని ఎత్తి గోడవతల పారవేసి నోర్మూసుకొని చూస్తుండేవారిని గద్దెపై కూర్చో పెడతారు.

   అమెరికా,ఐరోపాలోని ధనిక దేశాలలోని వ్యాపారులు కూడా చైనా నుంచి సరకులు దిగుమతి చేసుకోవటం ద్వారా తమ లాభాలకు ఎలాంటి ఢోకా వుండదని గ్రహించి దానికే మొగ్గు చూపటంతో అటు చైనా ఇటు ధనిక దేశాలలోని పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు లాభపడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు చైనాలో పెట్టుబడులు పెట్టటానికి వీలు కలిగింది. ఎగుమతులపై ఆధారపడిన ఆర్ధిక వ్యవస్థలతో తలెత్తే చిక్కులేమిటో లాటిన్‌ అమెరికా అనుభవం నుంచి నేర్చుకున్న చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం దేశీయంగా వినిమయాన్ని పెంచేందుకు వీలుగా పౌరుల ఆదాయాలను కూడా క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ కారణంగానే 2008లో ప్రారంభమైన పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధల సంక్షోభం పరిమితంగానే చైనాపై ప్రభావం చూపింది. బయటి దేశాల పరిశీలకులు ఈ కోణాన్ని చూడకుండా 2008 కంటే ముందున్న వేగం తగ్గింది కదా అని తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఇప్పటికీ చైనాలో సమస్యలు వున్నట్లు చైనా నాయకత్వమే చెబుతోంది.వారేమీ దాచుకోవటం లేదు. ఇంకా తమది వర్ధమాన దేశమే అని చెప్పటంలో అర్ధం అదే. పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్లుగా మన సంస్కరణలకు, చైనా సంస్కరణల విధానాలకు ఎంతో తేడా వుంది. భరత్‌ ఝన్‌ఝన్‌ వాలా చెప్పినట్లు చైనాను తప్పు పట్టటం మాని మన అసమర్ధతను అంతర్గతంగా ఎదుర్కోవాలి, రెక్కల గుర్రం ఎక్కి చుక్కలు లోకం చూడొద్దని అంటే నన్ను దేశ భక్తి లేనివాడిగానో, చైనా అనుకూల వాదిగానో చిత్రీకరించరు కదా !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

ఆఫ్ఘనిస్తాన్‌కు మిలిటరీ సాయం అంటే తాలిబాన్లకు ఆహ్వానమే !

18 Sunday Sep 2016

Posted by raomk in BJP, Current Affairs, History, INDIA, INTERNATIONAL NEWS, UK, USA

≈ Leave a comment

Tags

Afghanistan, INDIA, military supplies, Narendra Modi, talibans

Image result for MI-24/25 attack helicopters

అమెరికా వుచ్చులోకి దేశాన్ని నెడుతున్న నరేంద్రమోడీ ప్రమాదకర క్రీడ

సత్య

     అమెరికాతోనూ, వుగ్రవాదులతో జట్టు కట్టి బాగుపడిన దేశం గానీ, ముప్పును తప్పించుకున్న నేతలు గానీ అరుదుగా కనిపిస్తారు. అకాలీదళ్‌ను దెబ్బతీసేందుకు భింద్రన్‌ వాలే అనే ఖలిస్తాన్‌ వుగ్రవాదిని పెంచి పెద్ద చేసి ఇందిరా గాంధీ, ఒక దశలో తమిళ ఎల్‌టిటియి వుగ్రవాదులకు ఆయుధాలు ఇచ్చి తరువాత మారిన పరిస్థితుల్లో వారిని అణచివేతకు సైన్యాన్ని పంపి రాజివ్ గాంధీ వారి చేతుల్లోనే బలైన వుదంతం మన కళ్ల ముందే జరిగింది. తాలిబాన్లను తయారు చేసి చివరకు వారి చేతుల్లో చావు దెబ్బలు తిని ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి సేనలను వుపసంహరించుకున్న అమెరికా నిర్వాకాన్ని చూశాము. ఇంత జరిగాక వాటి నుంచి గుణపాఠాలేమీ తీసుకోకుండా నరేంద్రమోడీ సరికొత్త ప్రమాదకర క్రీడ మొదలు పెట్టారు. ఇప్పటివరకు మన దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి భిన్నంగా స్నేహ సంబంధాలను మెరుగుపరుచుకోవటం లేదా ఏర్పరుచుకోవటానికి బదులు ఇరుగు పొరుగు దేశాలతో గిల్లి కజ్ఞాలకు దిగి కొత్త ప్రమాదాలను కొని తెచ్చుకొనే విధంగా ఎన్‌డిఏకు మార్గదర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ దేశాన్ని ప్రమాదకర స్ధితిలోకి నెడుతోంది.

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆప్ఘనిస్తాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల సాయం చేయటానికి నిర్ణయించుకకుంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ న్యూఢిల్లీ పర్యటన సందర్బంగా ఆ మొత్తాన్ని ప్రకటించారు .అందుకు గాను వెంటనే అమెరికా సర్కార్‌ మోడీ ప్రభుత్వాన్ని పొగడ్తల వరదలో ముంచెత్తింది. సాయం ప్రకటించింది మన దేశం, లబ్ది పొందేది ఆఫ్ఘనిస్తాన్‌. మధ్యలో అమెరికా పొగడ్తలు ఎందుకు ? వాటిని చూసి మీడియాలోని మోడీ భక్తులు కొందరికి ఒంటి మీద బట్టలు ఎందుకు నిలవటం లేదు. అష్రాఫ్‌ మన దేశ పర్యటనకు ముందు తాలిబాన్లు ఒక ప్రకటన చేస్తూ తమను అణచేందుకు ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి భారత్‌ మిలిటరీ సాయం అందచేస్తున్నదని దానిని నిలిపివేయాలని వినతితో కూడిన హెచ్చరిక చేశారు.

     మన అవసరాల కోసం మనమే ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ, ఎవరిస్తామంటే వారి దగ్గర అందిన కాడికి అప్పు చేస్తున్నాం కదా ? అటువంటపుడు మనం మరొక దేశానికి సాయం చేయటం ఏమిటి ? మనమే విదేశాల నుంచి మిలిటరీ ఆయుధాలు కొంటున్నాం కదా వాటిలో కొన్నింటిని ఆఫ్ఘనిస్తాన్‌కు ఇవ్వటం ఏమిటి ? ఈ ఏడాది మార్చి నెలాఖరుకు మన విదేశీ అప్పు 485.6 బిలియన్‌ డాలర్లు. దానిలోంచి లేదా మనం చేయి చాపి తెచ్చుకున్న మొత్తంలోంచి ఒక బిలియన్‌ డాలర్లు ఆఫ్ఘనిస్తాన్‌కు సాయంగా ఇస్తున్నాం. అంటే దాదాపు ప్రతి ఒక్కరం తలకు 60 రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు. తాజా వందకోట్లతో కలిసి ఇంతవరకు మొత్తం సాయం 200 కోట్ల డాలర్లకు చేరుకోనుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడటానికి, విద్య, వైద్య సాయం అందించటానికి అవసరమైన సాయం ఏ దేశానికి అందించినా ఎవరూ తప్పు పట్టరు. అయితే ఎక్కడో స్విచ్‌ వేస్తే మరెక్కడో లైట్‌ వెలిగినట్లు ఇలాంటి సాయాలను ఏ దేశం కూడా చివరికి చైనా వంటి సోషలిస్టు దేశాలు సైతం వుత్తి పుణ్యానికే చేయవు. ఏదో ఒక ప్రతిఫలం ఇంకా చెప్పాలంటే తనకు అవసరమైన వాటి కోసమో లేదా తన దగ్గరవున్న వస్తువులకు మార్కెట్‌ కోసమో, రాజకీయ ప్రయోజనం కోసమో ఏదో ఒక లక్ష్యం లేకుండా వుండదు. ఆప్ఘనిస్తాన్‌తో మనకు సరిహద్దు సంబంధాలు లేవు, పొరుగు దేశం కాదు, మధ్యలో పాకిస్తాన్‌ వుంది.ఈ నేపధ్యంలో మోడీ సర్కార్‌ ఆర్ధిక సాయానికే పరిమితం కాకుండా మిలిటరీ ఆయుధాలు ఎందుకు అందిస్తున్నట్లు ? ఎవరికైనా సందేహం కలగక తప్పదు. పోనీ ఆర్ధిక, మిలిటరీ సాయం అందించటం ద్వారా మనం ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి ? మన్‌కీ బాత్‌తో సహా ఎక్కడా మనకు చెప్పలేదు.

    మన దేశం గురించి చెప్పుకోవాలంటే గత రెండు దశాబ్దాలుగా చైనా తరువాత అత్యధిక సగటు వృద్ధి రేటుతో ముందుకు పోతున్న ఏకైక దేశం. అభివృద్ధి ఫలం అంతా కొద్ది మంది బిలియనీర్ల చేతుల్లోకి పోతున్నది. గత పది సంవత్సరాలలో ప్రపంచంలో బిలియనీర్లు సగటున 68శాతం వృద్ధి చెందితే మన దేశంలో 330 శాతం వుంది. ఇంత వేగంగా కొంత మంది చేతుల్లోకి డబ్బు చేరుతున్నది కనుకనే వారిని చూసి ప్రతివారూ ఏదో విధంగా తాము కూడా ఇలా చూసి అలా తిరిగే లోపల కోటీశ్వరులు కావాలనుకుంటున్నారు. మన దగ్గర అణ్వాయుధాలున్నాయి వాటిని వుపయోగించలేము కనుక ఇతర ఆయుధాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నాము. అంతరిక్ష రంగంలో కూడా అనేక విజయాలు సాధించాము. పెద్ద మిలిటరీ, వైమానిక దళం వుంది. అయినా ధనిక దేశాల ముందు చేయి చాపుతున్నాం, మనకు వచ్చిన మొత్తంలో లేదా అప్పు చేసి కొంత మొత్తాన్ని మన దగ్గర చేయి చాచే వారికి ఇస్తున్నామన్న విషయం ‘నయా దేశ భక్తులతో’ సహా కొంత మందికి మింగుడు పడకపోవచ్చు. ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం 2011లో మన దేశం చేయి చాస్తున్న వరుసలో ఆరవ స్ధానంలో వున్నాం. మనం 2011లో 3.2, 2012లో 1.6, 2013లో 2.4 బిలియన్‌ డాలర్లు తీసుకున్నాంhttps://thelogicalindian.com/story-feed/exclusive/know-everything-about-how-much-india-receives-and-donates-foreign-aid/  మన కంటే దరిద్రపు దేశాలకు ఇచ్చేందుకు 2015-16లో మన బడ్జెట్‌లో 1.6 బిలియన్‌ డాలర్లు కేటాయించాం.మనం చేస్తున్న సాయంలో భూటాన్‌కు గణనీయ మొత్తం ఇచ్చాం. ముందే చెప్పుకున్నట్లు ఎలాంటి ప్రయోజనం లేకుండా కాదు సుమా ! మన సాయంతో వారు హిమాలయ పర్వత ప్రాంతాలలో జల విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మిస్తారు, 2020 నాటికి మన దేశం వారి నుంచి పదివేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాం. భూటాన్‌ నుంచి విద్యుత్‌ తెచ్చుకుంటున్నాం, తెచ్చుకుంటాం మరి ఆప్ఘనిస్తాన్‌ నుంచి మోడీగారు ఏం తెస్తారు ? వుగ్రవాదాన్ని, తాలిబాన్లనా ?

   ఆఫ్ఘనిస్తాన్‌ అంటే చాలా మందికి తెలిసినట్లు వుండి వివరాలు లోతుగా తెలియని దేశం. రాబందులు ఆకాశంలో తిరుగుతుంటాయి, ఎక్కడ కళేబరం కనిపిస్తే అక్కడ వాలి పోతాయి. ప్రపంచంలో మిలిటరీ, ఆర్ధిక, రాజకీయంగా కీలక ప్రాంతాలుగా వున్న వాటిని తమ ఆధీనం చేసుకొనేందుకు అమెరికా సామ్రాజ్యవాదులు కూడా నిత్యం అలాగే ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాటిలో ఒకటైన ఆఫ్ఘనిస్తాన్‌లో పాగావేసేందుకు పూనుకున్న సమయంలో దానిని పసిగట్టిన మిలిటరీలోని అభ్యుదయ వాదులైన అధికారులు తిరుగుబాటు చేసి దేశాధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ి పొరుగునే వున్న నాటి సోవియట్‌ యూనియన్‌ మద్దతు ఇవ్వటమే కాదు, ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు, దానిని కూల్చేందుకు ప్రయత్నిస్తున్న శక్తులను అణచివేసేందుకు వారి ఆహ్వానం మేరకు మిలిటరీ సాయాన్ని కూడా పంపింది. ఆ ప్రభుత్వాన్ని కూల్చి వేసే కుట్రలో భాగంగానే అధికారంలో వున్న వారిని కమ్యూనిస్టులని ప్రచారం చేశారు. అయితే మిలిటరీ అధికారులు కమ్యూనిజం పట్ల అభిమానం వున్నవారు నుక తాము కమ్యూనిస్టులం కాదని ఖండించలేదు. కమ్యూనిస్టుల కారణంగా ఇస్లాం మతానికి ముప్పు ఏర్పడింది, దానిని కాపాడుకోవాలంటే తాలిబాన్లుగా మారి ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వాన్ని కూల్చివేయాలని అమెరికన్లు ఒక పధకం ప్రకారం రెచ్చగొట్టారు. అందుకు పక్కనే వున్న పాకిస్థాన్‌కు అలాంటి వారిని తరలించి అన్ని రకాలుగా శిక్షణ ఇచ్చి సాయుధులను చేసి పంపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ముసుగులో తిష్ట వేయటానికి అమెరికా పూనుకుందన్న విషయం గ్రహించగానే మరో పొరుగు దేశం ఇరాన్‌ కూడా తన మద్దతుదారులను అక్కడ వుంచేందుకు అది కూడా తాలిబాన్లను తయారు చేసింది. మొత్తం మీద వారూ వీరూ తయారు చేసిన వారు అక్కడి వామపక్ష ప్రభుత్వానికి, వారికి సాయంగా వచ్చిన సోవియట్‌ సేనల మీద దాడులు, వత్తిడి తెచ్చి చివరకు వుపసంహరించుకొనే విధంగా, వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోయటంలో జయప్రదం అయ్యారు. తరువాత ఆ తాలిబాన్లే అమెరికా, పాకిస్థాన్‌కు ఏకు మేకయ్యారు. వారిని నాశనం చేయటానికి అమెరికా సైన్యాన్ని దించి చావు దెబ్బలు తిన్నది, దేశాన్ని సర్వనాశనం చేసింది, చివరకు తాలిబాన్లను అదుపు చేయలేక ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన సేనలను వుపసంహరించుకుంది. వుగ్రవాదులను గానీ, మరొక సంఘవ్యతిరేక శక్తుల అణచివేత గానీ ఆయా దేశాల అంతర్గత వ్యవహారం మాత్రమే. పొరుగువారు వెళ్లి ఆ పని చేయటం తగని పని. తమకు హాని చేసే వుగ్రవాదాన్ని రూపుమాపే శక్తి ఆ సమాజాలకు అంతర్గతంగానే వుంటుంది. కానీ అమెరికా ఆ పేరుతో అనేక దేశాలలో జోక్యం చేసుకొంటోంది, చావు దెబ్బలు తింటోంది. ఇప్పుడు వుగ్రవాద వ్యతిరేక పోరు, ఆప్ఘనిస్తాన్‌ పునరుద్దరణ పేరుతో అక్కడే తిష్టవేసింది. తాలిబాన్లను అణచివేసేందుకు తమతో పాటు ఇతర దేశాలు కూడా అన్ని రకాలుగా భాగం పంచుకోవాలని వత్తిడి తెస్తూ తన భారాన్ని తగ్గించుకుంటున్నది. ఆ వుచ్చులోకి భారత్‌ను లాగుతున్నది. నరేంద్రమోడీ సర్కార్‌ ఎలాంటి ముందు వెనుకలు చూడకుండా ఆ బాటలో ముందుకు పోతున్నది.

     ఆప్ఘనిస్తాన్‌ను అన్ని విధాలుగా నాశనం చేసింది అమెరికా, తామరతంపరగా తాలిబాన్లను సృష్టించి ప్రపంచంలో అనేక దేశాలకు వారిని ఎగుమతి చేసింది అమెరికా, గతంలో దేశ భక్తులుగా ప్రచారం చేసిన వారిని ఇప్పుడు టెర్రరిస్టులుగా చిత్రిస్తూ వారిపై పోరు, అభివృద్ధి పేరుతో జరిగే ఖర్చును ప్రపంచ దేశాలన్నీ పంచుకోవాలని వత్తిడి తెస్తోంది అమెరికా. గతంలో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తాలిబాన్ల చేతిలో నాశనమైన పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించేందుకు అంగీకరించి నిర్మించింది. దానిని నరేంద్రమోడీ తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఇప్పుడు మరొక వంద కోట్ల డాలర్ల సాయం ప్రకటించారు. ఇది కాకుండా ఇప్పటికే రష్యా తయారీ ఎంఐ-25 గన్‌షిప్‌ హెలికాప్టర్లను మూడింటిని పంపారు. మరొకదానిని పంపనున్నారు. తమకు మరిన్ని మారణాయుధాలు,ఎంఐ-35 గన్‌షిప్‌ హెలికాప్టర్లు కూడా కావాలని అక్కడి ప్రభుత్వం కోరుతున్నది. ఇలా ఆయుధాలు ఇవ్వటం ఇప్పటివరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానానికి భిన్నం. అమెరికా ఆదేశాల మేరకు తాలిబాన్లను తయారు చేసిన పాకిస్తాన్‌ తరువాత కాలంలో అమెరికా ఆదేశాల మేరకు ఆ తాలిబాన్లనే అణచివేయటం ప్రారంభించింది. తమ దేశంలో తలదాచుకున్న ఒసామాబిన్‌ లాడెన్‌ను హతమార్చటానికి అమెరికాకు తోడ్పడిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఇప్పుడు ఐఎస్‌ వుగ్రవాదులు, తాలిబాన్లు కలిసి పాకిస్థాన్‌పై దాదాపు ప్రతి రోజూ దాడులు చేస్తున్నారు.దానికి తోడు ఆఫ్ఘన్‌లో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితి. చాలా ప్రాంతాలపై ప్రభుత్వానికి అదుపు లేదు. తాలిబాన్లదే పెత్తనం. తెగల వారీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరిది ఆధిపత్యం. కాబూల్‌ గద్దెపై ఎవరుంటే ఆ తెగవారు చూసీ చూడనట్లు వుంటారు తప్ప మిగతావారు శత్రువులే. తమ అణచివేతకు తోడ్పడుతున్న పశ్చిమ దేశాలలో తాలిబాన్లు, ఐఎస్‌ తీవ్రవాదులు దాడులకు పాల్పడటాన్ని చూస్తున్నాము. ఇప్పటికే పాక్‌ ప్రేరేపిత వుగ్రవాదులతో నిత్యం కాశ్మీర్‌ రావణకాష్టంలా మండుతున్నది. ఇప్పుడు తాలిబాన్‌ -ఐఎస్‌ తీవ్రవాదులను కూడా మోడీ సర్కార్‌ ఆహ్వానించేందుకు పూనుకున్నట్లు కనిపిస్తున్నది. మనదైన స్వతంత్ర విదేశాంగ విధానం మనకు వుండాలి తప్ప మరొక దేశం అది అమెరికా లేదా మరేదైనా దాని ప్రయోజనాలకు, ఎత్తుగడలకు అనుగుణంగా వుంటే నష్టపోయేది మనమే. ఇప్పటికైనా మించి పోయింది లేదు. మేలుకోవటం మంచిది. మొండిగా వ్యవహరిస్తే జరిగే పరిణామాలకు ఎన్‌డిఏదే బాధ్యత అవుతుంది.

  చైనా ప్రభుత్వం సాయం చేస్తున్నదంటే అది ప్రభుత్వ రంగ కంపెనీలకు ఆర్డర్లు సంపాదించుకుంటున్నది. దాని ద్వారా వచ్చే లాభం, ప్రయోజనం ప్రజలకు చెందుతుంది. బిల్‌ గేట్స్‌ వంటి కార్పొరేట్లు అంద చేసే సాయం వారి కంపెనీలకు ఆర్డర్లకోసం వుపయోగపడుతుంది. అమెరికా,జపాన్‌, బ్రిటన్‌ ప్రభుత్వాలు చేసే సాయం ఆ దేశాలలోని కార్పొరేట్‌ కంపెనీల ప్రయోజనాలకు లంకె వుంటుంది. నరేంద్రమోడీ సర్కార్‌ వున్న ప్రభుత్వ రంగ సంస్ధలను తెగనమ్మటం లేదా మూసివేతలకు పూనుకుంది. పెట్టుబడులు పెడుతున్నది ప్రయివేటు కార్పొరేట్‌ కంపెనీలే అంటే సాయం పేరుతో ఏటా బడ్జెట్‌ నుంచి కేటాయించే 160 కోట్ల డాలర్ల సాయంలో ఎక్కువ విదేశాలలో పెట్టుబడులు పెట్టే భారతీయ కార్పొరేట్లకు అందచేస్తున్న సబ్సిడీ అవుతుంది తప్ప మరొకటి కాదు. మన జనానికి సబ్సిడీలలో కోత, కార్పొరేట్లకు మోత !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...
← Older posts

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • నరం లేని బిజెపి నాలికలు – మాంసానికి మత ముద్ర !
  • డోనాల్డ్‌ ట్రంప్‌ నాయకత్వంలో కొత్త పార్టీ ఏర్పడుతుందా !
  • మోడీని మునగ చెట్టు ఎక్కిస్తున్న భక్తులు – వాస్తవాల వక్రీకరణ కుయుక్తులు !
  • నీతులెందుకు గురువా ! ఎదుటి వారికి చెప్పేటందుకే శిష్యా !!
  • ఎరుపంటే భయం భయం….మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేకత ఎందుకు ?

Recent Comments

Rajamohan Kolla on రైతుల ఆందోళన : బి-జెపి-అండ్‌కో…
V VENKATA KRISHNA on మెజారిటీ-మైనారిటీ మతవాదుల అడ్డ…
CHIMME JOHN BARNABAS… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…
మహేంధర్ on చైనా సంగతి తరువాత, ముందు బంగ్ల…
Kameswara Rao Velpur… on జస్టిస్‌ ఎన్‌వి రమణపై సిఎం జగన…

Archives

  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Create a free website or blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
%d bloggers like this: