ఎం కోటేశ్వరరావు
దేశంలో ఏం జరుగుతోందో, పాలన ఎలా సాగుతోందో మనం(జనం) పట్టించుకుంటున్నామా ? చాలా మందికి ఇది అంతుచిక్కని ప్రశ్న. కమ్యూనిస్టులు ఏదైనా చెబితే దాన్లో కొత్తేముంది, వారు ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు, అందుకే పుట్టారు అనే వారు ఎందరో. పోనీ అలా వ్యాఖ్యానించేవారు దేశం గురించి పట్టించుకుంటున్నారా అని అడిగితే మనోభావాలు దెబ్బతింటాయి. ఎలా చావాలి ? కరోనాతో మరణించిన వారు అటు స్వర్గంలోనో, నరకంలోనో, అటూ ఇటూ కాకుండానో ఎందుకంటే ఆ రెండు చోట్ల కూడా కరోనా వారిని అనుమతించరు గనుక ఏదో వారి తిప్పలు వారు పడుతూ ఉండి ఉంటారు. బతికి ఉన్నవారు చెప్పలేని బాధలు అనుభవిస్తున్నారు. ఉద్యోగాలు పోయాయి, ఆదాయాలు లేవు, సంపాదించే వారి ఆకస్మిక మరణాలు, ఎప్పుడు పరిస్ధితి బాగుపడుతుందో తెలియని అయోమయం. ఆస్తులు అమ్మి, లక్షలు ఖర్చు చేసి కరోనా నుంచి బతికి బయటపడ్డా ప్రాణం మిగిలిందనే తృప్తి తప్ప చేసిన అప్పులు ఎలా తీర్చాలన్న పెద్ద బాధ వారిని వెన్నాడుతోంది. అంతచేసినా ప్రాణాలు దక్కని వారి కుటుంబాల పరిస్ధితి చెప్పనలవి కావటం లేదంటే అతిశయోక్తి కాదు. ఎటు చూసినా అప్పులు అప్పులు తిప్పలు తిప్పలు !
గతంలో యుపిఏ హయాంలో చేసిన అప్పులన్నింటినీ నరేంద్రమోడీ గారు తీర్చారని ప్రచారం చేశారు.ముందుగా కేంద్రం చేసిన అప్పుల గురించి చూద్దాం.ఏడు సంవత్సరాల కాలంలో 55లక్షల కోట్ల దేశీయ అప్పును 117లక్షల కోట్లకు పెంచారు, దీనికి విదేశీ అప్పును కూడా కలిపితే 2021 మార్చి ఆఖరుకు 121లక్షల కోట్లు. వచ్చే ఏడాది అది 136లక్షల కోట్లు అవుతుందని అంచనా.ఏం చేశారని అడగొద్దు. అత్మనిర్భరలో జనానికి ఏం చేశారని అసలే అడగొద్దు. ఈ అప్పుకు ఏటా ఏడు లేదా ఎనిమిది శాతం వడ్డీ చెల్లించాలి అనుకుంటే పది లక్షల కోట్ల వడ్డీయే అవుతుంది. ఈ భారాన్ని జనమే భరించాలి. ఇవి గాక కుటుంబాల అప్పులు కూడా పెద్ద సమస్యగా మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.2019-20లో ప్రతి వ్యక్తికి సగటున రు.34,304 అప్పు ఉండగా 2020-21లో రు.52,273కు పెరిగింది.2017-18లో మన జిడిపిలో గృహరుణాలు 30.1శాతం ఉండగా 2020-21లో 37.3శాతానికి పెరిగాయి.కేంద్ర బడ్జెట్ పత్రాల ప్రకారం 2020-21లో జిడిపి విలువ రు.194.81లక్షల కోట్లు. దీనిలో 37.3శాతం అంటే 72.66లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నట్లు.దాన్ని జనాభాతో భాగిస్తే సగటు అప్పు తెలుస్తుంది. అయితే జిడిపిలో ఎగుడుదిగుడులు ఉన్నపుడు సంఖ్యలు మారుతుంటాయి. 2017-18లో తలసరి గృహరుణం రు.29,385 ఉంది. ఇప్పుడు ఉన్నదానితో పోల్చితే గత నాలుగు సంవత్సరాలలో 78శాతం భారం పెరిగింది.
హౌమ్ క్రెడిట్ ఇండియా అనే సంస్ధ ఏడు నగరాల్లో ఒక సర్వే నిర్వహించింది. 2019లో అప్పు చేసేందుకు వంద కారణాల్లో 33 వినిమయ వస్తువుల కొనుగోలుకు, వ్యక్తిగత అవసరాలకు 23, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు 20 ఉండేవి. అదే మరుసటి ఏడాది కరోనా కాలంలో 46 ఇంటి నిర్వహణకు, 27 వాయిదాల చెల్లింపు, ఉపాది లేదా వ్యాపార నష్టాలు తీర్చేందుకు 14 చేస్తున్నట్లు తేలింది. అంటే ఏడాది కాలంలో జీవన విధానంలో ఎంత తేడా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. బ్యాంకులు పదిశాతం రుణాలను బలహీనవర్గాలకు ఇవ్వాలన్నది విధానపరమైన నిర్ణయం. అయితే ప్రయివేటు బ్యాంకుల్లో 52.4శాతం బ్యాంకులు అంతమేరకు ఇవ్వలేదని ఒక సర్వేలో వెల్లడైంది. అంటే ఆ మేరకు అధికవడ్డీలకు వారు ప్రయివేటు రుణాలను తీసుకోవాల్సి వచ్చినట్లే.
గత నాలుగు సంవత్సరాల్లో గృహరుణాలు ఎందుకు పెరిగాయి ? ఇటీవలి కాలంలో ప్రభుత్వ రంగంలో వైద్య సేవలు దిగజారి జనాలు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సి రావటం రుణ భార కారణాల్లో ఒక ప్రధానమైనదిగా మారింది. అదే విధంగా విద్యారంగం కూడా తయారైంది. మతిమాలిన చర్య పెద్ద నోట్ల రద్దు, తరువాత తగినంత కసరత్తు చేయకుండా అమల్లోకి తెచ్చిన జిఎస్‌టి పర్యవసానాలు కూడా రుణభారాన్ని పెంచిన అంశాల్లో చేరాయి. ఇవిగాక ఇతర కారణాలను చూద్దాం.2017లో నిరుద్యోగులశాతం 3.4, అది 2020 మార్చినాటికి 8.8, 2021జూన్‌కు 9.17శాతానికి చేరింది. ఇదే విధంగా ద్రవ్యోల్బణం రేటు 2.41నుంచి 2021 జూన్ నాటికి 7.39శాతానికి చేరింది. అంటే నిరుద్యోగం వలన ఆదాయం తగ్గటం, ఖర్చులు పెరగటం, ద్రవ్యోల్బణం వలన ధరల పెరుగుదల కుటుంబాలను అప్పుల పాలు చేస్తున్న కారణాలలో చేరాయి.
అయితే కొంత మంది గృహరుణాలు పెరగటం మన దేశం ఒక్కదానిలోనే కాదు. అనేక దేశాల్లో ఉందని చెబుతారు. దక్షిణ కొరియాలో 103.8, హాంకాంగ్‌లో 91.2, బ్రిటన్‌లో 90, అమెరికాలో 79.5, చైనాలో 61.7శాతం ఉంది. అయితే ఈ దేశాలతో మనం దేనితోనూ పోల్చులేము.మిగతా దేశాలు ఈ సమస్యను ఎలా అధిగమిస్తాయో తెలియదు గానీ సమీప భవిష్యత్‌లో మన కుటుంబాలు తీవ్ర పరిస్ధితిని ఎదుర్కోనున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ మూడవ తరంగం కూడా వచ్చేట్లయితే ఇప్పటి వరకు గోచిపాతలతో మిగిలిన జనాలు వాటిని కూడా కోల్పోయినా ఆశ్చర్యం లేదు.
ప్రపంచ రేటింగ్ సంస్ధ ఎస్ అండ్ పి మన దేశాన్ని కనిష్ట పెట్టుబడి బిబిబిమైనస్ గ్రేడ్‌లో పెట్టింది. వృద్ది రేటు అంచనాలను అందుకోలేకపోయినా, ద్రవ్యలోటు మరియు రుణభారం జోశ్యాలకు మించి పెరిగినా భారత రేటింగ్స్‌ను తగ్గించాల్సి ఉంటుందని హెచ్చరించింది. దెబ్బతిన్న భారత ఆర్ధిక వ్యవస్ద స్వస్ధత అసంపూర్తిగా ఉందని ఇక్రా రేటింగ్ సంస్ధ పేర్కొన్నది. వర్తమాన ఆర్ధిక సంవత్సరం తొలి మూడు మాసాల్లో రెండంకెల వృద్ధి నమోదైనా అది 2019 తొలి త్రైమాసికంతో పోలిస్తే తక్కువే అని చెప్పింది. కరోనాకు ముందే కుదేలైన ఆర్ధిక వ్యవస్ధ తరువాత మరింత దిగజారింది.ఇది తిరిగి పూర్వపు స్ధాయికి అయినా ఎప్పుడు చేరుతుందో తెలియని అయోమయంలో ఉన్నాం.కొన్ని సంవత్సరాలు పట్టవచ్చని జోశ్యం చెబుతున్నారు. ముఖ్యంగా యువత ఉపాధి గురించి కనుచూపు మేరలో దారి కనిపించటం లేదు. ఇరవై-ఇరవైనాలగు సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 37.9శాతం మంది పని లేకుండా ఉన్నారని సిఎంఐయి తాజా విశ్లేషణ వెల్లడించింది. ముఖ్యంగా యువతులు తీవ్ర సమస్య ఎదుర్కొంటున్నారు. డిగ్రీ చదివిన నలుగురిలో ఒకరు, పోస్టు గ్రాడ్యుయేషన్ చదివిన వారిలో ఐదుగురిలో ఒకరు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో రెండు కోట్ల మంది డిగ్రీ చదివే వారిలో కాలేజీ, విశ్వవిద్యాలయాల్లో 85శాతం మంది ఉంటే ఇంజనీరింగ్, వైద్య సంస్దల్లో 15శాతం ఉన్నారు.ఐఐటి, ఐఐఎంలలో చదివిన వారికి కూడా వెంటనే ఉద్యోగాలు రావటం లేదు. ఏ సర్వే వివరాలు చూసినా ఆర్ధిక వ్యవస్ధ తిరిగి కోలుకోవటం కష్టం, దీర్ఘకాలం పడుతుందనే చెబుతున్నాయి. ఉద్యోగ మార్కెట్లో ఏటా చేరుతున్న కోటి మంది ఉద్యోగాల కోసం చూస్తుంటారు. నైపుణ్యం లేని వారి పరిస్ధితి చెప్పనలవి కాదు. గత ఏడు సంవత్సరాలుగా నైపుణ్య అభివృద్ది పేరుతో తీసుకున్న చర్యలు, చేసిన ఖర్చు ఏమైందో అర్ధం కావటం లేదు.
సంస్కరణలు అంటే కరడు గట్టిన పెట్టుబడిదారీ సంస్కరణలు అమలు జరపాలని కోరుకొనే వారు కార్మికులనే కాదు యజమానులను కూడా విమర్శిస్తారు. వేగంగా దూసుకుపోయి, వృద్ధిచెందిన అమెరికా, ఐరోపా దేశాల కార్పొరేట్లతో పోటీ పడలేరని దెప్పుతారు. ఎలాంటి మార్పూ లేకుండా ఎంతసేపూ ప్రభుత్వ సాయం, సబ్సిడీలు పొందేందుకు వెనక్కి తిరిగి చూస్తుంటారని ఈసడించుకుంటారు. అలాంటివారిని వదిలించుకున్నప్పటికీ ఇప్పటి ప్రభుత్వం కూడా కొత్తగా రంగంలోకి వచ్చిన వారికి, సాయం కోసం వెనక్కి చూసే వారికి, పోటీ పడలేని దేశీయ మార్కెట్ కోసం ఉత్పత్తి చేసే కంపెనీలకు నిధులిస్తోందనే వాదనను కొందరు ప్రారంభించారు. పెద్ద ఎత్తున పారిశ్రామిక ఉత్పత్తి చేస్తేనే ప్రతినెలా పెరుగుతున్న పది లక్షల మంది యువతీ యువకులకు పని కల్పించటం సాధ్యమని ఎందరో చెప్పారు. గతంలో అతల్ బిహారీ వాజపాయి నాయకత్వంలోని ఎన్‌డిఏ, తరువాత పదేండ్లు అధికారంలో ఉన్న మన్మోహన్ సింగూ ఆపని చేయలేకపోయారు. ఇప్పుడు మోడీ సర్కార్ కూడా అదే బాటలో నడుస్తోంది. ప్రధానిగా తొలి ప్రసంగంలోనే ఆయన ” ప్రపంచ వ్యాపితంగా ఉన్న వారికి నేనొక విజ్ఞప్తి చేయదలచాను. మీరు రండి భారత్‌లో తయారు చేయండి, ప్రపంచంలో వాటిని ఎక్కడైనా అమ్ముకోండి కానీ తయారీ ఇక్కడ మాత్రం చేయండి ” అన్నారు. ఆహ్వానం పలకటమే తరువాయి గుంపులు గుంపులుగా వస్తారని నిజంగానే మోడీతో సహా అనేక మంది భావించారు. సులభతర వాణిజ్య వాతావరణం సృష్టించాలన్నారు, విదేశీ పెట్టుబడుల వరద పారనుంది గేట్లు ఎత్తివేయాలన్నారు. ఇంకా ఎన్నో ఊసులు చెప్పారు.ఐదు సంవత్సరాల తరువాత చూస్తే పరిస్దితి ఏమిటి ? ప్రపంచ జిడిపిలో మన దేశ తయారీ రంగం వాటా 2019లో ఇరవై ఏండ్ల కనిష్టానికి పడిపోయింది. వచ్చిన విదేశీ పెట్టుబడులు స్టాక్‌మార్కెట్లో వాటాలు కొనుగోలు చేయటానికి, టెలికాం, చిల్లర వాణిజ్యం వంటి సేవా రంగంలోకి వెళ్లాయి. ఇంతవరకు ఎప్పుడైనా మేక్ ఇండియా లేదా మేకిన్ ఇండియా పిలుపులు విఫలమైనట్లు అంగీకరించారా ? దాని బదులు స్ధానిక వస్తువులను కొనండి వంటి కొత్త నినాదాలు ఇచ్చారు.
దేశంలో నూతన ఆర్ధిక విధానాలు ప్రారంభమై మూడు దశాబ్దాలు గడిచాయి.ఈ కాలంలో పాలకుల మొగ్గు ఎటు ఉంది ? ప్రభుత్వ రంగ అభివృద్ది నిలిపివేత, అప్పటికే ఏర్పాటు చేసిన వాటిని విక్రయించటం, మొత్తం ప్రయివేటు రంగంపై ఆధారపడటం, మోడీ గారి రాకతో అంతకు ముందు ఉన్న ప్రణాళికల రద్దు. నిజానికి ప్రభుత్వ రంగం లేకపోయిన తరువాత లేదా అన్ని రంగాల నుంచి ప్రభుత్వం వైదొలుగుతున్న క్రమంలో ప్రణాళికల వలన ప్రయోజనం కూడా ఉండదు. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యాల ప్రకారం ప్రయివేటు రంగం పని చేయదు, అసలు ప్రయివేటు వారి మీద ఆంక్షలే ఉండకూడదు అన్న తరువాత వారికి లక్ష్యనిర్దేశం ఎలా చేస్తారు. ప్రణాళికల వైఫల్యం, నరేంద్రమోడీ మీద ఉన్న మోజు కారణంగా వాటిని ఎత్తివేసినా జనానికి పట్టలేదు. అవి ఉన్నపుడు తమకు ఒరగబెట్టిందేమిటన్న వారి ప్రశ్నకు జవాబు లేదు.
తమ పిలుపులు విఫలమైన తరువాత కేంద్ర పాలకులు కొత్త దారి తొక్కారు. జట్కా గుర్రం కళ్ల ముందు గడ్డి కట్ట పెట్టినట్లు ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపెట్టిన ప్రోత్సాహకాల విధానాన్ని ముందుకు తెచ్చారు. కరోనా వచ్చి జనం నానా యాతనలు పడుతున్నా అరకొర సాయం తప్ప పరిశ్రమలకు రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు సబ్సిడీలు ఇచ్చినట్లు కొందరి అంచనా. అందుకే ఆర్ధిక వ్యవస్ధ దిగజారినా కంపెనీల వాటాలను కొనుగోలు చేసి డివిడెండ్లు, ఇతరంగా లాభాలను తరలించుకుపోయేందుకు విదేశీ సంస్దలు ముందుకు వచ్చాయి. ఈ సబ్సిడీలు, ఉత్పాదకత, ఎగుమతులతో ముడిపడిన ప్రోత్సాహక రాయితీలు ఎక్కువ భాగం ఉపాధి కల్పించే రంగాలు, పరిశ్రమలకు ఇవ్వలేదు. ఉపాధి పడిపోవటానికి ఇదొక కారణం.
చైనాకు పోటీగా మన దేశాన్ని తయారు చేయాలనటంలో తప్పు లేదు. దాని అర్ధం జనానికి ఉపాధి కల్పించటం. మన విధానాలు ఆ దిశలో లేవు. నీకిది నాకది అన్నట్లుగా కొన్ని రంగాలు, కొన్ని గ్రూపుల కార్పొరేట్ సంస్దల మీదనే మన పాలకులు, యంత్రాంగ దృష్టి ఉందనే విమర్శ ఉంది. ఉత్పత్తి, ఎగుమతి ఆధారిత ప్రోత్సాహకాలకు విధించిన నిబంధనలను సడలించి గడువు పొడిగించటం దానిలో భాగమే. చైనాలో స్ధానిక పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చారు, మనం కూడా సబ్సిడీలు ఇవ్వకుండా ఎలా అనేవారు కొందరు. చైనా సబ్సిడీలు ఇచ్చింది-ప్రపంచానికి ఎగుమతులు చేస్తోంది, తన జనానికి ఉపాధి కల్పిస్తోంది, ఆదాయాలు, జీవన ప్రమాణాలను పెంచుతోంది. మన దేశంలో సబ్సిడీలు ఇస్తున్నా మిగతావి ఎందుకు జరగటం లేదు ? పన్ను చెల్లించే జనానికి చమురు వదలటం తప్ప మేకిన్ ఇండియా ఎందుకు విఫలమైంది ? నిత్యం రాముడిని స్మరించే బిజెపి వారు వస్తే నిజంగా రామరాజ్యం వస్తుందని నమ్మిన వారెందరో ఉన్నారు. ఏడేండ్లలో జరిగింది, జనానికి మిగిలింది ఏమిటి ? తిప్పలు – అప్పులు, కాదంటారా ?