డాక్టర్ కొల్లా రాజమోహన్
మూడు వ్యవసాయ చట్టాలను రద్దుచేయమని సెప్టెంబరునుండి భారత దేశ రైతులు ఆందోళన చేస్తున్నారు. భారత దేశ రైతు ఉద్యమ చరిత్రలో దేశరాజధానిని లక్షలాదిమంది రైతులు ముట్టడించటం ఇదే ప్రధమం.
ఢిల్లీకి వచ్చి ధర్నాచేయాలనుకున్న రైతులను ఢిల్లీసరిహద్దులలోనే సైన్యం ఆపేసింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా పెద్ద బండరాళ్ళను రోడ్డుకి అడ్డంగా పెట్టారు. వాహనాలు ముందుకు వెళ్ళకుండా రోడ్డ్డుకు గుంటలు తవ్వారు. ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. బాష్పవాయువును ప్రయోగించారు. చలిలో వణుకుతున్నప్రజలపై వాటర్ గన్స్ తో నీళ్ళను కొట్టారు. అయినా రైతులు వెనుకాడలేదు. ఎన్ని కష్టాలనైనా భరించి ఎన్నాళ్ళైనా వుండి తాడోపెడో తేల్చుకుంటామని ఏకైక దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
దేశానికి అన్నంపెట్టే రైతులకు రోడ్డే ఇల్లయింది. ప్రభుత్వం -రైతుల మధ్య చర్చలు విఫలం కావటంతో, దశలవారీగా ఆందోళనను ఐక్యంగా కొనసాగిస్తున్నారు. ఎవరైనా కలుస్తారేమో కానీ రైతులు మాత్రం ఐక్యం కారు అనే మాటను వమ్ము చేశారు . 500 రైతు సంఘాలు ఐక్యమయ్యాయి. లక్షలాదిమంది రైతులు రోడ్డెక్కారు. ఇదొక అపూర్వ సంఘటన. ఈ ఉద్యమం భారత దేశ ప్రజలకు ఒక సవాలు విసిరింది. మీరు ఎటువైపో తేల్చకోమంది.
విశాల ప్రజల ప్రయోజనాలా లేక కొద్దిమంది ప్రయోజనాలా ,రైతు ప్రయోజనాలా లేక కార్పోరేటు కంపెననీల ప్రయోజనాలా తేల్చుకోమని రైతు ఉద్యమం కోరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలన్నీ ప్రస్తుతం అన్నదాతల నిరసనల కేంద్రాలయ్యాయి. ఢిల్లీ నగర ప్రవేశమార్గాలయిన సింఘూ. టిక్రీ,నోయిడా, పల్వల్ ప్రాంతాలలో లక్షలాదిమంది రైతాంగం భైఠాయించారు, ప్రపంచ ప్రసిధ వాల్ స్ట్రీట్ పోరాటాన్ని మించిపోయింది.
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అలుపెరగకుండా రైతులు సాగిస్తున్న ఉద్యమం నెలరోజులకు మించింది. కాగా, ఈ చట్టాలు రద్దును కోరుతూ ఏడో దఫాకూడా చర్చలు జరిగాయి. కేంద్ర మంత్రులతో రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. కాగా, చట్టాల రద్దు చేయాలని రైతు సంఘాలన్నీ బలంగా కోరుతున్నారు. తమ ప్రతిపాదనలను అంగీకరిస్తేనే ఆందోళనలను విరమించుకుంటామని అన్నదాతలు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ఉన్నది. చర్చలకు లాజిక్, రీజన్ తో రావాలని ప్రధాన మంత్రి చెబుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం…రైతులతో చర్చలు సాగిస్తోంది. కాగా, ఈ . 40 రైతు సంఘాల నేతలతో తోమర్ పాటు పీయూష్ గోయల్, సోం ప్రకాశ్ చర్చిస్తున్నారు. కాగా, చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు ఒకే మాటపై నిల్చున్నాయి.,ఢిల్లీ చుట్టుపక్కల గడ్డి కాల్చటం పై ఆర్డినెస్స్, 2020 విద్యుత్‌బిల్లు సవరణ,ఈ రెండు అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా స్పందించింది. చర్చలు సాఫీగా జరుగుతున్నాయనే ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా రైతులు కోరుతున్న వ్యవసాయ చట్టాల రద్దు సమస్యపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు.
రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగమవుదామని బయల్దేరాం.
ఈ నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నుండి రైతు సంఘాల ప్రతినిధులు 12 మంది ఢిల్లీ బయల్దేరాము. ఢిల్లీ సరిహద్దులలో నవంబరు 26 నుండి రైతు పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసి ఉద్యమంలో భాగ మయి, సంఘీభావం తెలపాలని బయలుదేరిన మా ప్రతినిధి వర్గానికి కొంతమంది రైతులు వీడ్కోలు పలికారు. మరో ఇద్దరు ఢిల్లీ లో కలిశారు. చారిత్రాత్మక రైతు ఉద్యమంలో భాగమయి పోరాడుతున్న రైతులను ఆంధ్ర ప్రదేష్ కు చెందిన 12 మంది రైతుసంఘాల ప్రతినిధులు మనసారా అభినందించారు. స్ఫూర్తి పొందారు.
డిసెంబరు 27 ఉదయం ఢిల్లీ చేరిన వెంటనే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులైన హన్నన్ మొల్లా , ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకులు అశోక్ ధావలే లను, విజూ కృష్ణన్, ప్రసాద్ , వ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ ,సునీల్ చోప్రా గారిని కిసాన్ సభ కార్యాలయంలో కలిశాం. వారు ఢిల్లీ సరిహద్దులలో జరుగుతున్న రైతుల పోరాటాన్ని వివరించారు. ఈ పోరాటం ఈ శతాబ్దంలో అతి ముఖ్యమైన పోరాటం అన్నారు. స్వాతంత్ర పోరాటం తర్వాత ఇంత పెద్ద పోరాటం లేదన్నారు. ఈ పోరాటాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఈ పోరాటం పరాజయం చెందితే రైతాంగ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా కార్పొరేట్ శక్తులు విజృంభిస్తాయి అన్నారు. ఈ రైతు ఉద్యమానికి సంఘీభావం తెలపటానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతు ప్రతినిధులకు, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. పోరాటం ఉధృతం చేయటానికి అందరూ కృషి చేయాలని కోరారు.
అక్కడ నుండి ఢిల్లీ సింఘు సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. మాతో పాటుగావ్యవసాయ కార్మిక నాయకులు వెంకట్ గారు, ఢిల్లీలోని తెలుగు పత్రికా విలేకరులు వచ్చారు. వారి సహాయం విలువైనది. ఢిల్లీ లో ఉన్నన్ని రోజులూ మాకు బస కల్పించి వాహన సదుపాయాలు కల్పించిన ఉద్యమ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
పోరాట ప్రాంతానికి పయనం
శోభనాద్రీశ్వరరావు గారి ఆరోగ్యం దృష్ట్యా పోరాట ప్రాంతానికి వారు వెళ్ళటం కష్టం అన్నారు. అయినా శోభనాద్రీశ్వరరావు గారు అంగీకరించకపోవడంతో వారితో పాటు అందరూ కలిసి వెళ్ళాం. పోలీసు సరిహద్దులను దాటుకొని పోరాట ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ చేరిన ప్రజల సమూహాన్ని చూస్తే మాకు ఆశ్చర్యంతో కూడిన ఆనందం వేసింది. అక్కడున్న వేదికకు చేరడానికి చాలా కష్టమైంది. ప్రజా సమూహం మధ్య దారి చేసుకుంటూ పదండి ముందుకు అనుకుంటూనడిచాము.శోభనాద్రీశ్వరరావు గారు నడవటం చాలా కష్టమైంది. అయినా ఆయన పట్టుదలతో ముందుకు సాగాడు. అంతలో టాపు లేని చెక్క రిక్షా ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఆ రిక్షా పై వారిని కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం. ఆ రిక్షాకూడా ఇకపై ముందుకు వెళ్లే పరిస్థితి కనిపించలేదు. అంతలో కొంతమంది మిత్రులు ఒక మోటార్ సైకిల్ ని తీసుకొచ్చారు.. ఆ మోటార్ సైకిల్ పై కూర్చోబెట్టి కొంత దూరం నడిచాం.
మోటార్ సైకిల్ ముందుకు వెళ్ళటం మరీ కష్టమైంది. ప్రజల తోపులాటలో కింద పడే పరిస్థితి వచ్చింది.
ఎలాగోలా వేదిక వద్దకు చేరుకున్నాం. మాలో కొంతమందిని వేదిక పైకి తీసుకుని వెళ్లారు. వేదికపై నుండి కొంతమంది మహిళలు ఉపన్యాసాలు చేస్తున్నారు. వేదిక ముందు, చూపు ఆనినంతవరకుతవరకు ప్రజలు కూర్చుని ఉన్నారు. ఎక్కువ మంది మహిళలు పాల్గొన్నారు.
వేదిక వెనుక ఉన్న గుడారంలో ప్రెస్ మీట్ లను ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ మంది యువకులు ఏర్పాట్లన్నీ చూస్తున్నారు. సినిమా నటులు హరిబీత్ సింఘ్, , ప్రసిద్ధ గాయకులు, ప్రసిధ క్రీడాకారులు మంగీ, జిలానీ జోహాల్ వంటివారు పత్రికా విలేకరుల సమావేశాలు జరిపి ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ప్రెస్ మీట్ లో శోభనాద్రీశ్వరరావు గారు రామకృష్ణ గారు రైతు ఉద్యమం గురించి వివరంగా మాట్లాడారు. టీవీలు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. పత్రికా విలేఖరులు అత్యుత్సాహంతో తోపులాడుకుంటూ వార్తలు సేకరించారు.బిస్కెట్లు, రస్కులు, మంచినీటి సీసాలు , టీ, నిరంతరాయంగా సరఫరా జరుగుతుంది.
కొన్ని వారాలుగా పోరాడుతున్నరైతు ఉద్యమానికి ,రు.10 లక్షల ఆంధ్ర ప్రజల ఆర్థిక సహాయాన్ని శ్రీ వడ్డే శోభనాద్రీశివరరావు గారి చేతుల మీదుగా ఎఐకేఎస్ సిసి నేత హన్నన్ మొల్లా, సంయుక్త కిసాన్ మోర్చానేత దర్శన్పాల్ లకు చెరొక రూ.ఐదు లక్షలనగదును అందించారు.
రోడ్ పై ఎలా బతుకుతున్నారు?
వేదిక నుండి బయటకు వచ్చిన తర్వాత కొంత దూరం రోడ్డు మీద నడిచాం. కనిపించినంత వరకు లక్షలాదిమంది ప్రజా సమూహం కనబడుతుంది.వారిలో పిల్లల వద్ద నుండి వృద్ధుల వరకు ఉన్నారు. ఒక దృఢమైన నిశ్చయం వారి ముఖాలలో కనబడుతుంది. తీవ్రమైన చలి లో, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ గుడారాలలో నివసించుచున్న రైతుల పోరాటపటిమను భారత ప్రజలందరూ స్పూర్తిగా తీసుకోవాలని అనుకున్నాం.. ఎవరితో మాట్లాడి నా రెండు విషయాలపై స్పష్టత కనిపిస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలు రైతులప్రయోజనాలకు వ్యతిరేకమయినవనీ, కార్పోరేటు కంపెనీలకు అనుకూలమయినవనీ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రజలందరూ చైతన్యంతో స్పషంగా కార్పోరేట్ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేవరకు పోరాడాలనటం వారి చైతన్యస్ధాయికి నిదర్శనం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ విధంగా ఉంటారు అని అడిగితే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు అయిందాకా అని అందరూ చెప్తున్నారు. మీరిక్కడ ఉంటే వ్యవసాయం ఎలా అని అడిగాను. నిజమే. పొలాలలో పనులున్నాయి. ఇంటివద్ద పశువులున్నాయి. నా భార్య బాధ్యతగా పని భారాన్ని భరిస్తున్నది. వ్యవసాయచట్టాలను రధ్దు చేసుకుని ఇంటికి రమ్మని భరోసా ఇచ్చిందన్నారు. ఊరిలో ఉన్న వాళ్ళు మా వ్యవసాయాన్ని కూడా చూస్తున్నారని ఆ రైతు చెప్పాడు. కార్పొరేటు అనుకూల చట్టాలు రద్దయిందాక ఇంటికి రావద్దు అని చెప్తున్నారు. ప్రభుత్వం పోలీసులను సైన్యాన్ని ఉపయోగించి ఈ రైతాంగ ఉద్యమాన్ని అణచి వేస్తుందేమో అని అనుమానం వ్యక్తం చేశాము. మేము ఎటువంటి పోరాటానికైనా సిద్ధం. మాకు ఆదర్శం భగత్ సింగ్ అన్నారు.
వారి జీవన విధానాన్ని పరిశీలించాము. ట్రాక్టర్లు, ట్రాలీలు వాడకం చాలా ఎక్కువగా ఉంది, ట్రాక్టర్ ట్రాలీ లో కింద గడ్డి పరిచి దానిపై పడుకుంటున్నారు. కొన్నిచోట్ల పైన ప్లాస్టిక్ షీట్లు తో గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. కిందనే గడ్డి వేసుకొని దానిపై పడుకుంటున్నారు.
దాదాపు యాభై కిలోమీటర్లు గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. ముందు వచ్చిన వారు ఢిల్లీ నగరం దగ్గరగా రోడ్డుపై వుంటే, వెనక వచ్చినవారు వారి పక్కన గుడారాలు వేసుకుని నిరసన తెలియచేస్తూ జీవిస్తున్నారు. సింఘూప్రాంతంలో ఉంటే వెనక వచ్చిన వారు 50 కిలోమీటర్ల దూరంలో టెంట్ వేసుకుని ఉంటున్నారు. దేశప్రజలంతా ఈ రైతాంగపోరాటానికి అండగా వుంటారన్నారు.
చలిని తట్టుకోవటానికి గుడారాలముందు చలిమంటలు వేసుకుంటున్నారు .ఎముకలు కొరికే చలిలో కొంతమంది చన్నీళ్ల స్నానం చేస్తున్నారు.
వర్షం నీళ్ళు పడటం వల్ల దుప్పట్లు, బట్టలు, తడిసిపోయాయని నిరసన వ్యక్తం చేసిన రైతు వీర్‌పాల్ సింగ్ తెలిపారు. “వర్షపు నీరుతో కట్టెలు తడిసినందున మేము ఆహారాన్ని వండడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు ఎల్‌పిజి సిలిండర్ ఉంది, కానీ ఇక్కడ ప్రతిఒక్కరికీ అది లేదు, ”అన్నారాయన.
లంగరు సేవ
ఎక్కడికక్కడే వంటలు చేసుకుంటున్నారు. వేలాది మంది భోజనాలు చేస్తున్నారు. లోటు లేదు.వంట చేసేవారికి కొదవ లేదు. గ్రామంలోని రైతులు కూరగాయలు,పళ్ళు , వంట సరుకులు తీసుకుని వస్తున్నారు. నెలలపాటు సరిపోయే ఆహారాన్ని వెంట తెచ్చుకున్నారు. వంట మనుషులు, వడ్డించే వారు ప్రత్యేకంగా ఎవరూ లేరు. రైతులతో పాటుగా చూడటానికి వచ్చిన విద్యార్ధులు, ఉద్యోగస్తులు అందరూ పని చేస్తున్నారు. వెల్లుల్లిపాయలు వలవటం దగ్గరనుండి, కూరగాయలు కోయటం వరకూ అన్ని పనులూ చేస్తున్నారు. పెద్దవాళ్లు కూడా నడుము వంచి వంటలు చేస్తున్నారు. వండేవారు, వడ్డించే వారు అంతా సేవకులే. సేవే పరమావధి గా భావిస్తున్న పంజాబీ ప్రజలు లంగర్ సేవ ధర్మంగా ఆచరిస్తున్నారు.లక్షలాది మంది ప్రజలకు భోజనం సరఫరా చేయడం చాలా కష్టమైన పని. లంగర్ సేవ ఆధారంగా ఈ సమస్యలు ఆందోళనకారులు పరిష్కరించారు. చూడటానికి పోయిన వారందరికీ కూడా భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. సేవా దృక్పథంతో రోటి మేకర్ల ను కూడా తీసుకొచ్చి ప్రేమతో బహుమానంగా కొంతమంది ఇచ్చారు. అయినా చేతుల తోనే సులువుగా రొట్టెలు చేస్తున్నారు. రొట్టెలు పెద్ద పెద్ద పెనములపై కాలుస్తున్నారు.
కొన్ని ప్రాంతాలలో జిమ్‌లు, లైబ్రరీలు, కమ్యూనిటీ సెంటర్లు పని చేస్తున్నాయి. పుస్తకాలు ప్రముఖంగా ప్రదర్శిస్తున్నారు. భగత్సింగ్ పుస్తకాలు , ఫొటోలు అన్నిచోట్లా ప్రదర్శిస్తున్నారు.
‘ట్రాలీటైమ్’ అనే వార్తా పత్రిక కూడా వస్తోంది. రైతుల ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో ఆందోళనకు సంబంధించిన సమాచారం ఇస్తున్నారు. ఉద్యమం కోసమే పుట్టిన ఆ పత్రికలో అనేకమంది రాసిన కథనాలు, వ్యాసాలు ఉన్నాయి. ఆందోళనకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఉద్యమానికి మద్దతుగా రైతులు, విద్యార్ధులు రాసిన కవితలు ప్రచురితమయ్యాయి.
మరికొంతమంది నిరశనకారులలో ఉత్సాహం నింపేందుకు సంగీత కచేరీలు నిర్వహిస్తూన్నారు.
మల మూత్ర విసర్జనకు టాయిలెట్స్ ఏర్పాటు చేశారు.బయో టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. రోడ్డు పక్కన మలమూత్ర విసర్జన కనిపించలేదు. పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కావలసిన నీళ్లను టాంకుల ద్వారా తీసుకొచ్చి నిల్వ పెట్టుకుంటున్నారు.
ఉద్యమం ప్రారంభమైన కొద్ది సమయానికి అందరి సెల్లులకు చార్జింగ్ అయిపోయింది. చార్జింగ్ ఎలా అనే సమస్య ముందుకు వచ్చింది. ఎలక్ట్రిసిటీ లేదు. కరెంటు లేకుండా సెల్ ఛార్జింగ్ కాదు. వెంటనే సోలార్ ప్యానల్ తడికలను తీసుకొచ్చి బిగించారు.కరెంటు సమస్యను పరిష్కరించి వెలుగు ను ప్రసాదించారు.ఆధునిక అవసరాలలో అతి ముఖ్య అవసరమైన సెల్ చార్జింగ్ సమస్యను పరిష్కరించారు కొంతమంది టూత్ బ్రష్ లను పేస్ట్ లను అందిస్తున్నారు.
వైద్య సహాయం చేయటానికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ నుండి డాక్టర్లు, నర్సులు స్వచ్ఛందంగా వచ్చారు. మందులను, పేస్ మాస్క్ లను ఉచితంగా ఇస్తున్నారు. 50 చోట్ల “లంగర్ మెడికల్ క్యాంపు” లను ఏర్పాటు చేశారు. పేరున్న స్పెషలిస్టులు కూడా వచ్చి మెరుగైన చికిత్సలను అంది స్తున్నారు. అందోళనకారుల లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యలను, మానసిక అందోళనను నివారించటానికి కౌన్సిలింగ్ సెంటర్ లను ఏర్పారిచారు. అత్యవసరం గా సీరియస్ కేసులను పంపటానికి అంబులెన్సులను రెడీ గా ఉంచారు.
చదువుకునేందుకు పుస్తకాలను కొన్ని స్వఛంద సంస్ధలు సరఫరా చేశాయి.
కొందరు ఆఫీసులకు సెలవులు పెట్టి కుటుంబంతో ఆ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. “చరిత్రలో భాగం కావాలంటే రైతుల నిరసనల్లో ఒక్కసారైనా పాల్గొనాల్సిందే” అని అంటున్నారు. “మా కుటుంబం రైతు కుటుంబమని చెప్పుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక్కడి రైతుల డిమాండు న్యాయమైనది. ఈ వాతావరణం చూస్తుంటే వ్యవసాయ బిల్లుల ఉపసంహరణ అయ్యేవరకు వీరు కదలకూడదు అని ప్రతిజ్ఞ చేసుకున్నట్లుగా ఉంది” అని ఒక పెద్దాయన అన్నాడు.
అన్నం పెట్టే రైతన్నలకు సేవ చేయడానికి మించింది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. ఇలా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరిగిపోతూ ఉంది. సందర్శించేందుకు పెద్ద మొత్తంలో వస్తున్న జన సందోహానికి కూడా కడుపు నింపుతున్న లంగర్ కార్యకర్తలు అభినందనీయులు.
“ ఈ వ్యవసాయ చట్టాలు వయసుడిగిన మాకు పెద్ద నష్టం కలిగించకపోవచ్చు కాని మా తరువాతి తరాన్ని మాత్రం తీవ్రంగా నష్ట పరుస్తాయి. అందుకే వీటిని ఉపసంహరించేంత వరకు పోరాడతాం. మా భూమిని వదిలి వెళ్లే ప్రసక్తే లేదు “ అంటున్నాడు ఒక వయస్సు మళ్లిన రైతు.
యూపీ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రోడ్డు పక్కన సెలూన్ పెట్టుకున్న ఓ వ్యక్తి కస్టమర్లకు షేవింగ్, కటింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు.రైతుల ఆందోళన మొదలయ్యాకే ఆయన ఇక్కడ షాప్ తెరిచారు. ఆయనలాంటి మరికొందరు కూడా ఉద్యమం మొదలైన వారంలోనే ఇక్కడ షాపులు పెట్టారు.మరో దుకాణదారు రైతులకు చెప్పులు అమ్మతున్నారు. కొంత దూరంలో కొందరు చలికోట్లు అమ్ముతున్నారు. ఇక్కడ నిరసన స్థిర రూపం దాల్చింది. ఈ ప్రాంతం ఆందోళన చేసే ప్రాంతంగా మారింది.
నెల రోజులకు పైగా నిరసనలు తెలపడం చరిత్ర సృష్టించడమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత లక్షలాది నిరసనకారులు, లక్షలాది మద్దతుదారుల సంఘీభావంతో సుదీర్ఘకాలం నడుస్తున్న పోరాటం ఇది. ఇప్పుడు ఢిల్లీ సరిహద్దులలో నిరసనలు చేస్తోంది హర్యానా, పంజాబ్‌లకు చెందిన రైతులే కాదు; ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్‌ల నుంచి తండోపతండాలుగా వచ్చి చేరుతున్నారు.
షాజన్ పూర్ నిరశనప్రాంత సందర్శన.
చరిత్ర సృష్టించిన రైతాంగం
సోమవారం రైతు సంఘ ప్రతినిధులు హర్యానా రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమైన షాజన్ పూర్ వద్ద జరుగుతున్నరైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపాము. అక్కడ ఉద్యమ నేతలు యోగేంద్రయాదవ్, అమ్రా రామ్, అజిత్ నవలీలను కలిసి మద్దతు తెలియజేశాం. అక్కడ చేరిన రైతులను ఉద్దేశించి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలు అమలు అయితే భారత రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. రైతులు వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి అవుతుందన్నారు. ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అన్నారు.
వడ్డే శోభనాద్రీశ్వరరావురావు గారి ప్రసంగాన్ని పంజాబీ భాష లోకి అనువదించారు. ప్రముఖ పంజాబీ టీవీలు డైరెక్ట్ గా రిలే చేశాయి. యోగేంద్ర యాదవ్ ఆంధ్ర ప్రజల ఈ సహకారాన్ని అభినందించారు. “లడేంగే-జీతేంగే”, “కిసాన్ ఏక్తా-జిందాబాద్.” అని నినాదాలు చేశారు.
దూరంగా కన్పడుతున్న రైతులనందరినీ చూద్దామని కొంతదూరం నడిచాము. ఎంతదూరంనడిచినా చివరి గుడారాన్ని చేరుకోలేకపోయాం.కొన్ని మైళ్ళబారున రైతులు జీవిస్తున్నారు. కృతనిశ్చయంతో నిలబడ్డారు. మా బతుకు కోసం, మా భూమికోసం రోడ్డుమీదకు వచ్చామంటున్నారు.పెప్సీ లాంటి కార్పోరేట్ కంపెనీలతో చేసిన కాంట్రాక్టు వ్యవసాయం వలన రైతులకు లభించిన నష్ఠాలు ఆరైతులుఇంకా మరచిపోలేదంటున్నారు.ప్రభుత్వం ,ఈ పోరాటాన్ని ఖలిస్తాన్ వాదుల పోరాటం, టెర్రరిస్టుల పోరాటం, నక్సలైట్ల పోరాటం, ప్రతిపక్ష పార్టీల పోరాటం, ఆర్ధియాస్ దళారీల పోరాటం గా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది. దేశం మొత్తంగా ప్రచార దళాలను ఏర్పరిచారు. స్వయానా ప్రధాన మంత్రి గంగానది సాక్షిగా రైతుఉద్యమాన్ని కించపరిచారు. మన్ కీ బాత్ లో అవాస్తవాలను చిత్రీకరించారు. కానీ రైతులు వారి మాటలను నమ్మలేదు. పౌర సమాజం గమనిస్తోంది. రైతుల నిరసనలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలిచే దిశలో కదులుతోంది.
రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు రైతు ప్రయోజనాలను బలిపెట్టేవేనంటూ రైతులు చేస్తున్న ఢిల్లీ ముట్టడి రెండోనెలలో ప్రవేశించింది. .అనవసర కాలయాపన చేస్తూ ప్రమాదకర ప్రతిష్టంబనను పొడిగించుతూ ప్రభుత్వం ప్రతిష్టకు పోతున్నది. ఢిల్లీలోకి రానివ్వకుండా సృషించిన అడ్డంకులను తొలగించుకుని రోడ్డులనే నివాసంగామార్చుకున్న రోజునే ప్రభుత్వ ప్రతిష్ట మంటగలిసింది. చర్చల లో పాల్గొన్న రైతునాయకులందరూ ఒకే మాటపై నిలబడి ఏకైక ఎజెండా గా నూతన చట్టాలను రద్దు చేయమని అడగటం రైతాంగ ఐక్యతకు చిహ్నం. 500 రైతు సంఘాలను , లక్షలాదిమంది రైతుల అపూర్వమైన ఐక్యత ను సాధించి రైతులను ఏక తాటి పై నిలబెట్టిన రైతు నాయకులందరూ అభినందనీయులు. రైతుల ఐక్యత కోసం అనుసరించిన మార్గాన్ని రైతు కార్యకర్తలు, మేధావులు అధ్యయనం చేయాలి.
ఒకపక్క వర్షం కురుస్తున్నా మరోపక్క ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు నిరసనను కొనసాగిస్తున్నారు. తమతో పాటుగా ఆందోళన చేస్తున్న 50 మంది సహచరులు తమ ఎదురుగా మరణించినా మౌనంగా రోదిస్తున్నారు తప్ప , తమ ఆందోళన విరమించలేదు.
కిసాన్ ఏక్తా జిందాబాద్ ; కిసాన్ మజ్దాూర్ ఏక్తా జిందాబాద్ ; లడేంగే- జీతేంగే; “జబ్ తక్ కానూన్ వాపస్ నహీ – తబ్ తక్ ఘర్ వాపసు నహీ ” , నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తుతున్నది.
మీడియాలోమొక్కుబడి వార్తలు.
ముఖ్యంగా పెద్ద టీవీలు, ప్రధాన మీడియా రైతుల ఉద్యమాన్ని చిన్నచూపు చూస్తూ, రైతుల ఆత్మ స్ధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని ప్రజలు గ్రహించారు. కొన్ని టీవీ ఛానళ్లు, పత్రికలు రైతుల పోరాటాన్ని కించపరిచాయి. రైతుల చైతన్యాన్ని ఎగతాళి చేశాయి. ప్రజలు తమ జీవిత అనుభవం నుండి జీవన పోరాటాన్ని సాగిస్తున్నారనే విషయాన్ని విస్మరిస్తున్నారు. జీవనోపాధికి ప్రభుత్వం కలిగిస్తున్న అడ్డంకులను ఉద్యమకారులు ఛేదిస్తున్న తీరును ప్రజలు హర్షిస్తున్నారు. కానీ కార్పొరేట్ కబంధహస్తాల్లో బంధించబడిన మీడియాకు రైతు ఉద్యమo కనపడలేదు. ఆ లోటును సోషల్ మీడియా కొంతవరకు భర్తీ చేసింది. కిసాన్ ఏక్తా వార్తా సంస్ధను రైతులు ప్రారంభించారు. కొద్దికాలంలోనే అనన్య ప్రచారం, గుర్తింపు పొందింది.
ఇప్పుడు, నిరసన, అసమ్మతి , సంఘీభావం తెలియజేయడానికి ప్రజలు ధైర్యంగా ముందుకు వస్తున్నారు. పోరాట ప్రాంతం పుణ్యస్ధలమయింది. ఢిల్లీ నుండి వేలాదిమంది తీర్ధయాత్రకు వచ్చినట్లుగా వస్తున్నారు. పోరాటం జయప్రదం కావాలని మనసారా కాంక్షిస్తూ చదివింపులు చదివిస్తున్నారు. లంగర్ సేవలో పాలు పంచుకుంటున్నారు . పౌర సమాజంలో కొందరు తమ హక్కుల గురించి పోరాడడమే కాకుండా తోటి ప్రజల సమస్యల పట్ల ముఖ్యంగా రైతుల ఉద్యమం పట్ల సానుభూతి ప్రదర్శిస్తున్నారు. రైతుల ఉద్యమం కేవలం కొద్దిమంది ఉద్యమకారుల గొంతుగా మిగిలిపోలేదు. సన్న, చిన్నకారు రైతులు, భూమిలేని శ్రామికులు, ధనిక, మధ్య తరగతి రైతులు విశాల రైతాంగ ఉద్యమంలో భాగమయ్యారు. రోజురోజుకీ బలం పెరుగుతున్నది. గెలవగలమన్న ధైర్యం పెరుగుతున్నది.
కార్పొరేట్ కంపెనీల పునాది కదులుతున్నది.
ఈ ఉద్యమ ప్రభావంతో అంబానీ ప్రకటన చేయక తప్పలేదు.
‘మా గ్రూప్ సంస్థలు ఒప్పంద వ్యవసాయ రంగంలో లేవు. భవిష్యత్తులో ప్రవేశించాలన్న ఆలోచనా లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడా మేం వ్యవసాయ భూమిని కొనలేదు’ అని రిలయన్స్ పేర్కొంది. సంస్థకు చెందిన రిటెయిల్ యూనిట్లు ఆహార ధాన్యాలు సహా నిత్యావసరాలను కొని అమ్ముతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా రిలయన్స్ స్పష్టత ఇచ్చింది. తాము రైతుల నుంచి నేరుగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయమని వివరించింది. పంజాబ్‌లో ఉన్న 9 వేల జియో టవర్లలో దాదాపు 1,800 టవర్లు ధ్వంసమయ్యాయి. రైతుల పంటలకు న్యాయమైన, లాభదాయకమైన ధరలు లభించాలన్న డిమాండ్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రిలయన్స్ పేర్కొంది.
రైతుల ఆందోళనకు గల రాజకీయ ప్రాధాన్యం ఏమిటి?
ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు, పదవులేనని పాలకవర్గ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. జనాభాలో సగం పైగా ఉన్న తమ జీవన విధానం అయిన వ్యవసాయ విధానం మెరుగ్గా సాగాలని, శ్రమకు ఫలితం దక్కాలని రైతులు కోరుకుంటున్నారు.
రైతులు ఆ విధముగా ఆలోచించి ప్రశ్నించటం మొదలెట్టారు. ప్రజాస్వామ్య మంటే కార్పోరేట్ కంపెనీల సేవ కాదని స్పష్టంగా వెల్లడిస్తున్నారు. శాంతియుతంగా ఢిల్లీ సరిహద్దులలో మకాం పెట్టి , ఒక నూతన పోరాట రూపాన్ని రూపొందించారు. కొన్ని లోపాలున్నప్పటికీ క్రియాశీలంగా వున్నారు. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు.
ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు మూగబోయినట్లుగా, నిష్ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. అయినా ప్రజల పక్షాన మాట్లాడక తప్పటంలేదు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నాయి. అధికారంలో లేని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలు కూడా రైతుల పక్షాన నిలబడటానికి వెనకాడు తున్నాయి. వామపక్ష పార్టీలు బలహీనంగా ఉన్నాయి.
ముఖ్యంగా మధ్యతరగతి వర్గం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. అయితే, మేధావులు ఇదొక ప్రయోగంగా భావిస్తున్నారు. చారిత్రాత్మకమైన రైతుల ఆందోళన ఒక ప్రయోగంలా కాకుండా చూడాలి.పౌర సమాజం మేధావులతో కలిసి చర్చించి, చైతన్యవంతం కావాలి. ప్రజలను చైతన్య పరచవలసిన సమయం ఆసన్నమయ్యింది.
ఇప్పుడు, ప్రజలు అసమ్మతి తెలియజేయడానికి ధైర్యంగా ముందుకు వస్తున్నారు.
కార్పొరేట్ శక్తులతో పోరాటం సామాన్యమైనది కాదు. రైతులు తలకు మించిన భారాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. రైతుల వైపా లేక కార్పొరేట్ శక్తుల వైపా అని అందరూ తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్గత నిరాశావాదంతో పోరాటం సులభంగా ఉండదు. పౌర సమాజం మరింత శక్తిని కూడగట్టుకుని పోరాటానికి సిద్ధం కావాలి.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు.
- జనవరి 6 నుండి 20 వరకు, జన జాగరన్ అభియాన్ జరగాలి. గ్రామాలలో రైతులను చైతన్యపరచాలి. జనవరి 13 న భోగి మంటల్లో చట్టాల కాపీలను దగ్ధం చేయటం,”జనవరి 18 న, మహిళా కిసాన్ దివాస్ జరగాలి. 4) జనవరి 23 న, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా, ఆజాద్ హింద్ కిసాన్దివాస్ జరుపుకోవాలి. 5) జనవరి 26 న రిపబ్లిక్ దినోత్సవ సందర్భంగా ట్రాక్టర్ పెరేడ్ ఊరేగింపు జరపాలి..
ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు
వడ్డే శోభనాద్రీశ్వరరావు, AIKSCC ఆంధ్ర ప్రదేశ్ కన్వీనర్ , ఎర్నేని నాగేంద్రనాధ్, రైతుసంఘాల సమన్వయ సమాఖ్య, రామక్రిష్ణ, సీపీఐ నేత, రావుల వెంకయ్య, ఎఐకేఎస్ , జాతీయ ఉపాధ్యక్షులు, వై కేశవరావు, ఏపీ రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి,శ్రీమతి సింహాద్రిఝాన్సీ, ఏపీ రైతు కూలీ సంఘం,రాష్ట్రఅద్యక్షులు, జమలయ్య, ఏ పీ కౌలు రైతు సంఘం కార్యదర్శి. హరనాధ్ ,ఎఐకేఎం, రాష్ట్రకార్యదర్శి, తోట ఆంజనేయులు, ఎఐకేఎం, రాష్ట్రఅద్యక్షులు, కే విద్యాధరరావు, ఎఐకేఎస్.శ్రీమతి చల్లపల్లి విజయ, స్త్రీ విముక్తి సంఘటన, జెట్టి. గుర్నాధరావు, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఛైర్మన్,డాక్టర్ కొల్లా రాజమోహన్, నల్లమడ రైతు సంఘం.
Like this:
Like Loading...