Tags
Britain, Grace 1, Iran Oil, Iran Tanker, Stena Impero, tit-for-tat ship seizures, UK Tanker., US Trap
ఎం కోటేశ్వరరావు
దెబ్బకు దెబ్బ, కంటికి కన్ను అందరికీ తెలిసిన ప్రతీకార చర్యలు. ఇప్పుడు గల్ఫ్‌లోని హార్ముజ్ జలసంధిలో అమెరికా-ఇరాన్ మధ్య ప్రతీకార చర్యలలో బ్రిటన్ ఓడకు ఓడ చేరింది.తమ ఓడను పట్టుకున్న బ్రిటన్ చర్యకు ప్రతిగా బ్రిటన్ ఓడను ఇరాన్ పట్టుకొని తన రేవుకు తరలించింది. అమెరికా పన్నిన వలలో తనకు మాలిన ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించిన బ్రిటన్ ఇప్పుడు ఇరాన్‌తో కొత్త వైరాన్ని తెచ్చుకుంది, దాన్నుంచి పరువు దక్కించుకొని ఎలా బయపడుతుందన్నది ఆసక్తికరం. ఇరాన్ వ్యవహారంలో ఒంటరిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమెరికా తనకు తోడుగా బ్రిటన్ వున్నట్లు ప్రపంచానికి చూపింది. ఇరాన్ అణు ఒప్పందంపై అమెరికా వైఖరిని తొలి నుంచి వ్యతిరేకిస్తున్న బ్రిటన్ ఇప్పుడు ఈ పిచ్చిపని ఎందుకు చేసిందని ఆంగ్లేయులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఎవరు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు, ఎలా జరిగిందన్నది తేలాలని కోరుతున్నారు. మరోవైపు బ్రిటన్ చర్యకు ఐరోపా యూనియన్(ఇయు) మద్దతు ప్రకటించలేదు. మౌనంగా వుంది. ఇరాన్ చర్యను మాట మాత్రంగా ఫ్రాన్స్, జర్మనీ తప్ప ఐరోపా యూనియన్ తప్పు పట్టలేదు, మౌనం దాల్చింది. అమెరికా-ఇరాన్ వివాదంలో బ్రిటన్ ముందుకు రావటం యాదృచ్చికమా ? వ్యూహాత్మకమా ? అమెరికా పన్నిన వలలో చిక్కుకుందా? పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయి? ఇది అనూహ్య పర్యవసానాలకు దారి తీస్తుందా ? తన తప్పిదాన్ని బ్రిటన్ గ్రహిస్తే టీ కప్పులో తుపానులా ముగుస్తుందా ! పరువు ప్రతిష్టలకు పోయి మరేదైనా చేస్తుందా ?
తాజా వుదంత నేపధ్యాన్ని క్లుప్తంగా చూద్దాం. జూన్ 13: తమ రెండు చమురు ఓడలపై ఇరాన్ దాడి చేసిందని అమెరికా ఆరోపణ, తప్పుడు ప్రచారం తప్ప అలాంటిదేమీలేదని ఇరాన్ ఖండన. జూన్ 20: తమ గగన తలాన్ని అతిక్రమించినందున అమెరికా మిలిటరీ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన. ప్రతిదాడికి ఆదేశాలిచ్చిన ట్రంప్ 150 మంది పౌరుల ప్రాణాలు పోతాయని చెప్పటంతో చివరి నిమిషంలో వుపసంహరించుకున్నట్లు అమెరికా మీడియా ద్వారా వెల్లడి. జూలై 4: సరిగ్గా అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం రోజున సిరియాకు చమురు తీసుకు వెళుతోందని, ఇది ఇయు ఆంక్షలను వుల్లంఘించటమే అనే సాకుతో జిబ్రాల్టర్ ప్రభుత్వ కోరిక మేరకు బ్రిటన్ నౌకాదళం రంగంలోకి దిగి జిబ్రాల్టర్ జలసంధిలో పనామా పతాకంతో ప్రయాణిస్తున్న ఇరాన్ చమురు ఓడ గ్రేస్1ని పట్టుకుంది. దెబ్బకు దెబ్బగా బ్రిటీష్ చమురు ఓడలను పట్టుకుంటామని ఇరాన్ ప్రకటన. జూలై 10: వాణిజ్య నౌక బ్రిటీష్ హెరిటేజ్‌ను అడ్డుకోబోయిన మూడు ఇరాన్ పడవలకు దగ్గరగా వెళ్లిన బ్రిటన్ నావీ ఫ్రైగేట్ హెచ్‌ఎంఎస్ మాంట్‌రోజ్, హెచ్చరికలతో ఇరాన్ పడవలు వెళ్లిపోయాయని, ఎలాంటి కాల్పులు జరగలేదని బ్రిటన్ ప్రకటన. అయితే ఆ వుదంతానికి ఎలాంటి ఆధారాలు లేవు, అస్పష్టమైన ఫొటోల వెల్లడి. అలాంటిదేమీ లేదని ఇరాన్ ప్రకటన.ఈ నౌక తన ట్రాకర్‌ను ఒక రోజు ముందుగా నిలిపివేసింది. దానికి వెన్నుదన్నుగా బ్రిటీష్ యుద్ధ నౌక ఎందుకు వెళ్లింది అన్న ప్రశ్నకు సమాధానాలు లేవు. జూలై 11: గ్రేస్1 నౌక కెప్టెన్, ఇతర అధికారులను అరెస్టు చేసినట్లు జిబ్రాల్టర్ ప్రకటన. ఇయు ఆంక్షలను వుల్లంఘించారని ఆరోపణ. రెండు రోజుల తరువాత బెయిలు మీద అధికారుల విడుదల. ఆంక్షలను వుల్లంఘించబోమని ఇరాన్ హామీ ఇస్తే గ్రేస్1 టాంకర్‌ను వదులుతామని ఇరాన్ మంత్రికి బ్రిటన్ విదేశాంగ మంత్రి ప్రతిపాదన. జూలై 15:ఇరాన్ అణు ఒప్పందంపై బ్రసెల్స్‌లో ఇయు విదేశాంగ మంత్రుల సమావేశం. గల్ఫ్‌లో సైనిక చర్యకు చూస్తున్న ట్రంప్‌కు మద్దతు ఇచ్చేది లేదని బ్రిటన్ నేతల ప్రకటన. జూలై 16:తమ నౌక గ్రేస్1 నిర్బంధం అపహరణ తప్ప మరొకటి కాదని, దెబ్బకు దెబ్బ తీస్తామని ఇరాన్ అధ్యక్షుడి ప్రకటన.జూలై 17: యుఏయి నుంచి బయలు దేరిన పనామా పతాకం వున్న చమురు ఓడను హార్ముజ్ జలసంధిలో ఇరాన్ నిర్బంధించినట్లు అనుమానిస్తున్నట్లు అమెరికా అధికారుల వెల్లడి. ఇరాన్ జలాల్లో ప్రవేశించే ముందు మూడురోజుల క్రితమే ట్రాకర్‌ను ఆపివేసిన ఓడ. తమ దళాలు ఒక విదేశీ ఓడను, పన్నెండు మంది సిబ్బందిని పట్టుకున్నట్లు ఇరాన్ ప్రకటన. జూలై 18: తమ నౌక యుఎస్ బాక్సర్‌కు వెయ్యి గజాల సమీపానికి వచ్చిన ఇరాన్ డ్రోన్‌ను కూల్చివేసినట్లు ట్రంప్ ప్రకటన, అంత సీన్ లేదు, అదంతా వట్టిదే అని ప్రకటించిన ఇరాన్. జూలై 19: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ రెండు నౌకలను నిర్బంధించినట్లు వార్తలు. వాటిలో ఒకటైన బ్రిటన్ స్టెనా ఇంపెరో అంతర్జాతీయ నౌకా నిబంధనలను వుల్లంఘించినందున అదుపులోకి తీసుకున్నట్లు ఇరాన్ ప్రకటన. లైబీరియా పతాకంతో వున్న మరొక నౌక మెస్‌డార్‌ను నిలువరించిన ఇరాన్ దళాలు తరువాత వారి ప్రయాణాన్ని అనుమతించినట్లు నౌక ఆపరేటర్ ప్రకటన.
ఇరాన్ అనే ఒక చిన్న దేశాన్ని దెబ్బతీసేందుకు అమెరికా అనే ప్రపంచ అగ్రరాజ్యం గత కొద్ది నెలలుగా గిల్లికజ్జాలు పెట్టుకొనేందుకు చేస్తున్న యత్నాలను ప్రపంచం చూస్తోంది.వాటిలో ఓడకు-ఓడ కొత్త అధ్యాయం. అట్లాంటిక్-మధ్యధరా సముద్రాలను కలిపే, ఐరోపా-ఆఫ్రికాలను విడదీసే జలసంధి పేరు జిబ్రాల్టర్. ఐరోపాలో స్పెయిన్, ఆఫ్రికాలో మొరాకో ఈ జలసంధికి ఎదురెదురుగా వుంటాయి. వాటి మధ్య దూరం కేవలం 14.3కిలోమీటర్లే. జిబ్రాల్టర్ 30వేల జనాభా వున్న బ్రిటీష్ పాలిత ప్రాంతం. అది స్పెయిన్‌దే అయినప్పటికీ ఆధిపత్యం కోసం ఐరోపాలో జరిగిన యుద్ధాలలో కీలకమైన ఈ ప్రాంతాన్ని 1713లో బ్రిటన్‌కు అప్పగించారు. ప్రస్తుతం అక్కడ బ్రిటన్ నౌకాదళ స్దావరం వుంది. ప్రపంచంలో సముద్రం ద్వారా జరిగే వాణిజ్య ఓడల రవాణాలో సగం ఇక్కడి నుంచి రాకపోకలు సాగించాల్సి వుంది. ఆ ప్రాంతాన్ని తమకు తిరిగి అప్పగించాలన్నది స్పెయిన్ డిమాండ్. అయితే ఇప్పటి వరకు రెండు ప్రజాభిప్రాయ సేకరణల్లో అక్కడి వారు స్పెయిన్‌లో విలీనం కావటానికి గానీ లేదా స్పెయిన్ సార్వభౌమత్వాన్ని అంగీకరించటానికి గానీ అంగీకరించలేదు. దాని వెనుక బ్రిటన్ హస్తం వుందని వేరే చెప్పనవసరం లేదు.
ఇక తాజా వివాద విషయానికి వస్తే ఈ వుదంతంలో నిబంధనలను వుల్లంఘించి బ్రిటన్ గిల్లి కజ్జాకు దిగినట్లు కనిపిస్తోంది. ఇరాన్ అణుకార్యక్రమాన్ని నియంత్రించేందుకు ఇరాన్, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. దాన్ని ఇరాన్ వుల్లంఘిస్తోందంటూ ఏకపక్షంగా ఆరోపించి ఆ ఒప్పందం నుంచి తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా వెంటనే ఇరాన్‌పై ఆంక్షలను తీవ్రతరం చేయటమే కాదు, యుద్ధానికి కాలుదువ్వుతోంది. చమురు అమ్మకాలను అడ్డుకుంటోంది. అమెరికా చర్యలను బ్రిటన్‌తో సహా ఇతర దేశాలేవీ ఆమోదించలేదు. ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవటానికి ఒక రోజు ముందుగా జిబ్రాల్టర్ తన చట్టాన్ని సవరించుకుంది. ఆ మేరకు గ్రేస్1 చమురు నౌక(టాంకర్) ద్వారా ఐరోపా యూనియన్ ఆంక్షలను వుల్లంఘించి సిరియాలోని బానియాస్ చమురు శుద్ధి కేంద్రానికి చమురు సరఫరా చేస్తున్ననట్లు తమకు అనుమానంగా వుందని జిబ్రాల్టర్ చేసిన వినతి మేరకు బ్రిటన్ నౌకాదళం రంగంలోకి దిగింది. 2012 నాటి ఐరోపా యూనియన్ నిబంధన 36 మేరకు నౌకను స్వాధీనం చేసుకున్నట్లు జిబ్రాల్టర్ కోర్టు పేర్కొన్నది.
సిరియాకు చమురు సరఫరాలపై ఐరోపా యూనియన్ విధించిన ఆంక్షలు సభ్యదేశాలకు వర్తిస్తాయి తప్ప ఇరాన్‌కు వర్తించవు. ఎందుకంటే ఇరాన్ సభ్యరాజ్యం కాదు. నౌకలోని చమురు సిరియాకు కాదని ఇరాన్ ప్రకటించింది. అలాంటపుడు ఇరాన్ చమురు ఓడను కూడా ఐరోపా యూనియన్ మధ్యలో అడ్డుకోకూడదు. ఒకవేళ అడ్డుకున్నా ఇరాన్ ప్రకటన తరువాత వదలి వేయాలి. ఇక్కడ ఆంక్షలు విధించిన ఐరోపా యూనియన్ అసలు రంగంలోనే లేదు. అలాంటపుడు జిబ్రాల్టర్ జలసంధిలో ప్రయాణిస్తున్న నౌకను అడ్డుకోవటానికి బ్రిటన్‌కు ఎవరు అధికారమిచ్చారు? ఐరోపా యూనియన్ అలాంటి అధికారం ఇవ్వలేదు. సిరియా మీద ఐరోపాయూనియన్ ఆంక్షలను బ్రిటన్ అమలు జరుపుతోందా లేక ఇరాన్ మీద అమెరికా ఆంక్షలను బ్రిటన్ అమలు జరుపుతున్నట్లా ? ఒక వైపు తాను ఐరోపా యూనియన్ నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించుకుంది. దాంతో తలెత్తిన సంక్షోభంలో ప్రధానిగా వున్న థెరెసా మే తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఇంకా ఏర్పడలేదు. ఈ తరుణంలో ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకోవాలన్న నిర్ణయం ఎక్కడ జరిగిందన్నది ఒక ప్రశ్నగా ముందుకు వచ్చింది. అంతర్గతంగా ఏమి జరిగినా అమెరికా తరఫున బ్రిటన్ అడ్డగోలు చర్యలకు పాల్పడుతున్నట్లు స్పష్టం అవుతోంది.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్ చర్యలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. సౌదీ అరేబియాకు తాజాగా సైనికులతో పాటు ఎఫ్ 22 యుద్ధ విమానాలను, క్షిపణులను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సెనెటర్ రాండ్ పాల్‌ను నియమించారు. బ్రిటన్-ఇరాన్ సంబంధాల చరిత్రను చూస్తే రెండు దేశాల మధ్య విశ్వాసం లేదు.1901లో బ్రిటన్ వ్యాపారి విలియం నాక్స్ డీ అర్సే పర్షియాగా మరో పేరున్న ఇరాన్‌లో చమురు అన్వేషణకు నాటి రాజుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. దాని ప్రకారం అక్కడ దొరికే చమురు మొత్తం అతనిదే. లాభాల్లో 16శాతం మాత్రమే ఇరాన్‌కు దక్కుతుంది. కంపెనీ మీద రాజుకు ఎలాంటి ప్రమేయం వుండదు. ఆ విధంగా ది ఆంగ్లో పర్షియన్ ఆయిల్ కంపెనీ వునికిలోకి వచ్చింది. తరువాత బ్రిటన్ ప్రభుత్వం అక్కడ పెద్ద చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వుత్పత్తులను బ్రిటన్‌కు తీసుకుపోయింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత 1951లో కంపెనీని జాతీయం చేశారు, ఆస్ధులను స్వాధీనం చేసుకున్నారు. దానికి ప్రతిగా బ్రిటన్ తన చమురుశుద్ధి కర్మాగారాన్ని మూసివేసింది. ఇరాన్ బ్యాంకు ఖాతాలను స్ధంభింపచేసింది. అయితే 1953లో అమెరికా- బ్రిటన్ తమ తొత్తు అయిన షాను గద్దెపై కూర్చోపెట్టాయి. బ్రిటీష్ పెట్రోలియం(బిపి)కు తిరిగి చమురు క్షేత్రాలను కట్టబెట్టారు.1979లో అయాతుల్లా ఖొమైనీ నాయకత్వంలో తిరుగుబాటు జరిగే వరకు అదే కంపెనీ దోపిడీ కొనసాగింది. తరువాత మరోసారి చమురు పరిశ్రమను కంపెనీని జాతీయం చేశారు.
ఓడకు ఓడ వుదంతానికి ఇరాన్ మీద ఒంటి కాలిపై లేచే అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సూత్రధారిగా వున్నట్లు కనిపిస్తున్నది. నౌకను పట్టుకోగానే బోల్టన్ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు. అయితే ఇదంతా అతగాడి బృంద పధకం ప్రకారం జరిగిందని, ఆశ్చర్యం ఒక నటన అని తేలింది. అమెరికా వూబిలోకి తమ దేశాన్ని లాగారని ఆంగ్లేయులు అంటున్నారు. బ్రిటన్ స్వాధీనం చేసుకున్న ఇరాన్ నౌక పెద్దది కావటంతో అది సూయజ్ కాలువ గుండా ప్రయాణించే అవకాశం లేదు.దాంతో మధ్యధరా సముద్రంలో నుంచి జిబ్రాల్టర్ జల సంధిలో ప్రవేశించేందుకు గుడ్ హోప్ ఆగ్రాన్ని చుట్టి వచ్చింది. మరో 48 గంటల్లో ఇరాన్ నౌక జిబ్రాల్టర్ ప్రాంతానికి రానుండగా అమెరికా గూఢచార సంస్ధలు స్పెయిన్ నౌకదళానికి ఆ విషయాన్ని చేరవేశాయి. అయితే స్పెయిన్ మీద నమ్మకం లేని అమెరికన్లు బ్రిటన్‌కు సైతం తెలియచేశారు. వారు కోరుకున్నట్లుగానే బ్రిటన్ అడ్డగించింది. ఈ సైనిక చర్యకు ఎవరు వుత్తరువులు జారీ చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమెరికా వినతి మేరకు నౌకను పట్టుకుంది బ్రిటన్ తప్ప తమకు ఆ చర్యతో ఎలాంటి సంబంధం లేదని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ బోరెల్ ప్రకటించారు. ఐరోపా యూనియన్ విదేశీ వ్యవహారాల విభాగం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. ఇరాన్ మీద దాడికి ఐరోపా ధనిక దేశాలు సుముఖంగా వుంటే ఈ పాటికి అమెరికా ఆ పని చేసి వుండేది. ఇప్పటి వరకు అలాంటి సూచనలేమీ లేకపోవటంతో ఏదో ఒక విధంగా ట్రంప్ గిల్లికజ్జాలతో కాలం గడుపుతున్నాడు, దానిలో భాగమే బ్రిటన్ నౌకా వుదంతం అని చెప్పవచ్చు. సోమవారం నాడు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఫాక్స్ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ బ్రిటన్ తన నౌకల రక్షణ బాధ్యతను తానే చూసుకోవాలని చెప్పటం మరో మలుపు. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న వాటిని ఇరాన్ పట్టుకోవటం ఏమిటని ప్రశ్నిస్తూ అంతర్జాతీయ జలాల్లో ఆటంకం లేకుండా చూసుకోవటం ప్రపంచ బాధ్యత అని అన్ని దేశాలను రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేశాడు. ఈ పూర్వరంగంలో ఈ వుదంతానికి ముగింపు సుఖాంతం అవుతుందా ? కొత్త పరిణామాలకు నాంది పలుకుతుందా అని చూడాల్సి వుంది.