Tags
AP BJP, AP ZP elections, chandrababu naidu, Jana Sena, pavan kalyan, Tirupati lok sabha by election, YS jagan
ఎం కోటేశ్వరరావు
మామూలుగా ఒక ఉప ఎన్నిక సాధారణ ఎన్నికల మాదిరి ప్రాధాన్యతను సంతరించుకోదు. అధికారంలో ఉన్న పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే, లేదా అంతకు ముందు ఎన్నికలో మెజారిటీ స్వల్పంగా ఉంటే తప్ప ప్రతిపక్షం గెలిచే పరిస్ధితి ఉండదు. ఈ నేపధ్యంలో తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికను ఎలా చూడాలి ? దాని పర్యవసానాలు ఏమిటి ? ఏప్రిల్ 8న జరగాల్సిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల మీద రాష్ట్ర హైకోర్టు స్టే విధించటంతో తిరుపతి ఎన్నిక జరిగే 17వ తేదీ లోగా జరిగే అవకాశం లేదనే చెప్పవచ్చు. తిరుపతి ఎన్నికలోపు జరపాలనే అధికారపక్షానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్‌మోనరెడ్డి, నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి కోర్టులో పెద్ద ఎదురు దెబ్బతగిలింది. ఎన్నికల నిర్వహణ గురించి సవాలు చేస్తూ తెలుగుదేశం, జనసేన,బిజెపి, ఇతరులు దాఖలు చేసిన పిటీషన్లపై విచారించిన కోర్టు ఎన్నికలను వాయిదా వేసింది. కరోనా వైరస్ కారణంగా వారం రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని ఈ పార్టీలు సవాలు చేశాయి. కమిషనర్ ప్రకటనకు ముందే ఎన్నికల తేదీల గురించి వార్తలు వచ్చాయని, సుప్రీం కోర్టు చెప్పినట్లుగా నాలుగు వారాల ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పట్టించుకోలేదని అభ్యంతరం తెలిపాయి. దీన్ని విచారించిన కోర్టు ఈనెల 15వ తేదీన ఎన్నికల కమిషనరు కోర్టుకు అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. పిటీషన్లు దాఖలు చేసిన పార్టీలు కోరుతున్నట్లు కొత్త నోటిఫికేషన్‌కు హైకోర్టు అదేశించే అవకాశం లేదు. ఒకవేళ అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు, నామినేషన్లు వేసిన వారు కోర్టుకు ఎక్కుతారు. మున్సిపల్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎన్నికల కమిషనరు, వైసిపి లేదా మరొకరు ఎవరైనా సుప్రీం కోర్టుకు వెళ్లినా ఈ నెల 8న ఎన్నికలు జరిగే అవకాశాలు ఉండవు. కోర్టు స్టే ఎత్తివేసి ఎన్నికలకు దారి సుగమం చేసినా నెల రోజుల పాటు ప్రవర్తనా నియమావళిని అమలుకు ఆదేశిస్తే మే నెలలో మాత్రమే జరిగే అవకాశం ఉంది.అప్పటికి తిరుపతి ఎన్నికల ఫలితాలు కూడా వెలువడుతాయి.
తిరుపతి నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు నెల్లూరు జిల్లాలో, మూడు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. ప్రస్తుతం అన్ని చోట్లా వైసిపి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏడింటిలో మూడు షెడ్యూలు కులాల రిజర్వుడు నియోజకవర్గాలు. మొత్తం ఓటర్లు 15,74,161. గత(2019) ఎన్నికలలో 13,16,473(79.76శాతం) పోలయ్యాయి. వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, శాతాలు ఇలా ఉన్నాయి.
పార్టీ ×××× ఓట్లు ×××× శాతం
వైసిపి ××× 7,22,877 ×× 55.03
టిడిపి ××× 4,94,501 ×× 37.65
నోటా ××× 25,781 ×× 1.96
కాంగ్రెస్ ×× 24,039 ×× 1.83
బిఎస్‌పి ×× 20,971 ×× 1.60
బిజెపి ×× 16,125 ×× 1.22
వైసిపి మెజారిటీ 2,28,376 కాగా, బిఎస్‌పిని జనసేన బలపరించింది. తాజా ఎన్నికలలో మొత్తం 28 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా గుర్తింపు పొందిన పార్టీలలో వైసిపి, తెదే, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం పోటీచేస్తున్నాయి. మిగిలిన వారందరూ గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్దులు.
గ్రామ పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలలో వైసిపి సాధించిన విజయం, దానికి వచ్చిన ఓట్ల ప్రాతిపదికన చూస్తే అసాధారణ పరిణామాలు సంభవిస్తే తప్ప తిరుపతి లోక్‌సభ స్ధానాన్ని తిరిగి అది గెలుచుకొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగినందున ఏ పార్టీ ఎంత శాతం ఓటింగ్ వచ్చిందని చెప్పుకున్నా ప్రయోజనం లేదు. మున్సిపల్ ఎన్నికలలో వైసిపికి 52.63, తెలుగుదేశం పార్టీకి 30.73, జనసేనకు 4.67, బిజెపికి 2.41శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలలో వచ్చిన 49.95 శాతంతో పోలిస్తే ఓటింగ్ పెద్దగా పెరిగినట్లు భావించలేము. నవరత్నాల గురించి ఆ పార్టీ చేసుకుంటున్న ప్రచారానికి ఓట్ల పెరుగుదలకు పొంతన కుదరటం లేదు. తిరుపతి ఎన్నికలో విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నా వైసిపి తన యావత్ శక్తిని ఉపయోగించి ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. గతం కంటే మెజారిటీ తెచ్చుకొని తమకు రాజకీయంగా రాష్ట్రంలో ఎదురు లేదని ప్రదర్శించుకోవటం, తద్వారా ప్రతిపక్ష తెలుగుదేశం శ్రేణులను నిరుత్సాహపరచటం, మతం పేరుతో ఎన్ని జిమ్మిక్కులు చేసినా, కుట్రలు పన్నినా మీ ఆటలను సాగనివ్వం అని కేంద్రంలోని బిజెపి అగ్రనేతలకు సందేశం ఇవ్వటం కూడా ఈ ప్రయత్నాల వెనుక ఉంది.2019 ఎన్నికలలో వచ్చిన మెజారిటీకి రెట్టింపు తీసుకు రావాలని మంత్రులు, ఎంఎల్‌ఏలను జగన్‌మోహనరెడ్డి ఆదేశించినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఓటింగ్ శాతం , మెజారిటీ తగ్గినా ఆ పార్టీ మీద వత్తిడి పెరగటం ఖాయం.
ఇక తెలుగు దేశం పార్టీ విషయానికి వస్తే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలలో దానికి తీవ్ర ఎదురు దెబ్బలు తగిలినా ఓటింగ్ శాతం గణనీయంగానే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 39.17శాతం వస్తే మున్సిపల్ ఎన్నికలలో 30.73శాతం వచ్చాయి. గ్రామీణ ప్రాంతాలలో అనేక చోట్ల వైసిపికి ఏకగ్రీవాలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ మేరకు ఓట్ల శాతం ఉండే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీకి గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇదే బలం ఉంటుందని చెప్పవచ్చు. తిరుపతి ఎన్నిక ఆ పార్టీకి, ముఖ్యంగా అధినేత చంద్రబాబు నాయుడి ప్రతిష్టకు ప్రతీకగా భావించవచ్చు. విజయం సాధిస్తుందా లేదా అన్నది పక్కన పెడితే గత ఎన్నికలలో వచ్చిన ఓట్లను నిలుపుకున్నా కార్యకర్తలను నిలుపుకోవచ్చు. రాజకీయ పోరు కొనసాగించవచ్చు. జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం అధినేత చేసిన నిర్ణయం దిగువ స్దాయిలో అంతగా జీర్ణం కాలేదు. తాజాగా హైకోర్టు స్టే ఇచ్చినందున ఏదో ఒకసాకుతో కార్యకర్తలను సంతృప్తి పరచేందుకు పునరాలోచన చేసినా ఆశ్చర్యం లేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో వచ్చే ఓట్లను బట్టి కూడా ఆ నిర్ణయం ఉండవచ్చు.
జనసేన-బిజెపి కూటమి విషయానికి వస్తే బిజెపి కంటే జనసేనాని పవన్ కల్యాణ్ ప్రతిష్టచుట్టూ ఈ ఎన్నికలు తిరుగుతాయి. మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ తీరు తెన్నుల ప్రకారం రెండు పార్టీలకు వచ్చిన 7.18 శాతం కంటే తిరుపతిలో ఎక్కువ వస్తేనే ఆ రెండు పార్టీల పరువు నిలుస్తుంది. లేనట్లయితే బిజెపికి కొత్తగా పోయే పరువేమీ ఉండదు కనుక పవన్ కల్యాణ్ ఏ విధంగా సమర్ధించుకుంటారన్న ప్రశ్న ముందుకు రానుంది. ప్రశ్నిస్తా అంటూ బయలు దేరిన పవన్ కల్యాణ్‌కు ప్రశ్నలేమీ లేకపోగా ఎదురు ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రత్యేక హౌదా, ఇతర అన్యాయాల గురించి మోసం చేసిన కేంద్రాన్ని ప్రశ్నించకుడా ఏమి చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రయోజనం ఉండదు.
ఇక బిజెపి విషయానికి వస్తే పర్యవసానాలు తక్కువేమీ కాదు. పవన్ కల్యాణ్ మద్దతు ఉన్నా ఓట్ల సంఖ్య పెరగపోతే దాని పరువు పోవటమే కాదు, జనసేనాని మద్దతు చిత్తశుద్ది గురించి అది సందేహాలను లేవనెత్తవచ్చు. తిరుపతి ఆపద మొక్కుల్లో భాగంగా జనసేనాని తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని ప్రకటించింది. అంతే కాదు భగవద్దీత పార్టీ కావాలా బైబిల్ పార్టీ కావాలా అనే ప్రచారాన్ని ముందుకు తెచ్చింది. ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉన్నా తిరుపతి వెంకటేశ్వరుడు అంతర్జాతీయ దేవుళ్లలో ఒకరు. అక్కడ హిందూమతానికి అపచారం, అన్యాయం జరుగుతోందని ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున చేసింది. ఇక్కడ డిపాజిట్లు రాకపోయినా, గణనీయంగా ఓట్లు సంపాదించకపోయినా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు దాని మత రాజకీయాలకు గోరీ కట్టారనే అభిప్రాయం కలుగుతుంది. ఇది దేశ వ్యాపితంగా కూడా బిజెపి వ్యతిరేక పార్టీలకు ప్రచార అస్త్రంగా మారుతుందని వేరే చెప్పనవసరం లేదు.ఇప్పటికే కేరళలో శబరిమల వివాదంతో ఓట్లు పొందాలని చూసి గత లోక్‌సభ ఎన్నికల్లో భంగపడిన బిజెపికి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే జరగనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
మిగిలిన అభ్యర్దులలో నవతరం పార్టీ పేరుతో పోటీ చేస్తున్న అభ్యర్ధికి గతంలో జనసేనకు కేటాయించిన గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. ఈ గుర్తు ఉన్న కారణంగా జనసేన మద్దతుదారులు సదరు అభ్యర్ధికి ఓటు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. బిజెపి-జనసేనలకు పోలింగ్ ముందకు వరకు ఇది ఒక సాకుగా ఉపయోగపడవచ్చు తప్ప ఓటర్ల విజ్ఞతను ప్ర శ్నించటమే అవుతుంది. నిజంగా జనసేన మద్దతుదారులు బిజెపికి మద్దతు ఇవ్వాలనుకుంటే అలాంటి ప్రశ్న ఉదయించదు. ఇష్టం లేని వారు గ్లాసు గుర్తుకు ఓటేయవచ్చు. ఇక్కడ సిపిఎం పోటీలో ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపుతుందని చెప్పలేము. తమ విధానాల ప్రచారం కోసమే ఈ పోటీ అని చెప్పవచ్చు. అనేక దళిత సంఘాలు మద్దతు ప్రకటించినప్పటికీ నైతికంగా ప్రచారం చేసుకొనేందుకు ఉపయోగపడుతుంది.2014 ఎన్నికలలో ఈ స్ధానంలో పోటీ చేసిన సిపిఎంకు 11,168 ఓట్లు వచ్చాయి. మొత్తం మీద తిరుపతి ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ఏదో విధంగా పరీక్ష పెడుతోంది, పర్యవసానాలకు సిద్దం కావాలని చెబుతోంది.