ఎం కోటేశ్వరరావు
ఐక్యరాజ్యసమితి నిబంధనావళి ప్రకారం ప్రతిదేశమూ రక్షణ హక్కు కలిగి ఉంటుంది. అయితే రెండవ ప్రపంచ యుద్దంలో జర్మనీ, జపాన్ మిలిటరీ దుర్మార్గాలను చూసిన తరువాత ఆ రెండు దేశాల మిలిటరీలను రద్దు చేస్తూ యుద్ద విజేతలు శాంతి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటికి ఆత్మరక్షణ భద్రతా వ్యవస్ధలు తప్ప సాధారణ మిలిటరీ లేదు. ఆ కారణంగా పొదుపు అయిన సొమ్మును ఆ రెండు దేశాలూ పరిశోధనా-అభివృద్ధి రంగానికి మరల్చి పారిశ్రామిక రంగాలలో ఎన్నో విజయాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవి ప్రపంచ మార్కెట్ల కోసం ఇతర ధనిక దేశాలతో పోటీకి వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వాటి మిలిటరీ బడ్జెట్ల పెరుగుదల, ఆయుధ పోటీ ఎక్కడకు దారితీస్తుందో అన్న ఆందోళన కలిగిస్తోంది.
వరుసగా తొమ్మిదవ సంవత్సరం జపాన్ తన మిలిటరీ బడ్జెట్‌ను పెంచింది. 2021 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే ఈ పెంపుదల 52బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికాతో రక్షణ ఒప్పందం ఉండి, ఆత్మరక్షణకు మాత్రమే పరిమిత ఆయుధాలు, ఏర్పాట్లు కలిగి ఉండాల్సిన జపాన్ పూర్తి స్ధాయిలో యుద్దానికి వినియోగించే జెట్ బాంబర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులను, యుద్ద నౌకలు, విమానవాహక యుద్ద నౌకలను సమకూర్చుకుంటున్నది. ఆత్మ రక్షణకు రక్షణ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు ఆ ప్రాంతంలోని రష్యా, చైనాలను రెచ్చగొట్టేందుకు, ఆయుధ పోటీకి దారితీయవచ్చని భావిస్తున్నారు. తాజా పెంపుదలతో ప్రపంచంలో మిలిటరీ బడ్జెట్ అగ్రదేశాలలో జపాన్ పదవ స్దానానికి చేరింది.
అమెరికా ఆయుధాలను విక్రయిస్తున్నప్పటికీ తన ఆధునిక యుద్దవిమానాలను జపాన్‌కు అందచేయటాన్ని నిషేధించింది. వాటి నిర్మాణ రహస్యాలను జపనీయులు తెలుసుకొని తమకు పోటీకి వస్తారన్నదే దాని భయం. ఈ కారణంగానే రానున్న పదిహేను సంవత్సరాలలో తన స్వంత యుద్ద విమానాలను రూపొందించేందుకు మిత్సుబిషి సంస్దకు జపాన్ ప్రభుత్వం 40బిలియన్ డాలర్ల ప్రాజెక్టును అప్పగించింది. 2030 నాటికి విమానాన్ని రూపొందించి, 2035నాటికి మిలిటరీకి అందచేయాలన్నది లక్ష్యం. దీనిలో అమెరికా యుద్ద విమానాల కార్పొరేట్ సంస్ధ లాక్‌హీడ్ మార్టిన్ సహకారం కూడా తీసుకుంటున్నారు. అప్పటి వరకు ఆ కంపెనీ ఉత్పత్తి ఎఫ్-35ఆరు బాంబర్లను జపాన్ కొనుగోలు చేయనుంది.
రెండవ ప్రపంచ యుద్దంలో మిత్రరాజ్యాల చేతుల్లో ఓడిపోయిన జపాన్ మరోసారి మిలిటరీ శక్తిగా ఎదగకుండా చూసేందుకు మిలిటరీని రద్దు చేస్తూ పోట్స్‌డామ్ సమావేశం నిర్ణయించింది. శాంతి ఒప్పందం ప్రకారం జపాన్ ఇతర దేశాలతో రక్షణ ఒప్పందాలు చేసుకోవచ్చు, ఆత్మరక్షణ చర్యలు తీసుకోవచ్చు. అయితే తరువాత అమెరికా తన షరతుల మేరకు జపాన్‌తో రక్షణ ఒప్పందాన్ని రుద్దింది. ఒక ఏడాది ముందు తెలియచేసి ఎవరైనా ఒప్పందం నుంచి వైదొలగవచ్చనే ఒక నిబంధన ఉన్నప్పటికీ ఒక విధంగా జపాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా తన తాకట్టులో ఉంచుకుంది. 1951 సెప్టెంబరు ఎనిమిదిన కుదిరిన ఈ ఒప్పందం మరుసటి ఏడాది ఏప్రిల్ 28నుంచి అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం అమెరికా సైనిక స్ధావరం ఏర్పాటుకు జపాన్ తన గడ్డపై భూమిని కేటాయించాల్సి ఉంది. అమెరికా అనుమతి లేకుండా ఇతర దేశాలతో ఎలాంటి రక్షణ ఒప్పందాలు లేదా మిలిటరీ స్దావరాల ఏర్పాటుకు హక్కులు ఇవ్వరాదు. తన స్వంత ఖర్చుతో జపాన్‌లో మిలిటరీ స్దావరాలను నిర్వహించటమే గాక రక్షణ కల్పించాలి. ఆ మేరకు జపాన్‌లో అమెరికా మిలటరీ తిష్టవేసింది.
అయితే ఇంతవరకు ఏ దేశమూ జపాన్ మీద దాడి చేయలేదు, అలాంటి సూచికలు కూడా లేవు. సోవియట్ యూనియన్ లేదా దాన్ని కూల్చివేసిన తరువాత రష్యా వైపు నుంచి లేదా ఒక నాడు జపాన్ ఆక్రమణకు గురైన చైనా నుంచి ఎలాంటి ముప్పు తలెత్తిన దాఖలాలు లేవు. అయినా గత కొద్ది సంవత్సరాలు జపాన్ తన మిలటరీ శక్తిని పెంచుకుంటూ వస్తోంది. అమెరికాతో రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకొని స్వతంత్ర మిలిటరీ శక్తిగా ఎదగాలనే డిమాండ్ కార్పొరేట్ శక్తుల నుంచి పెరుగుతోంది. ఇదే సమయంలో తన కంటే మెరుగైన ఆర్ధిక స్దితిలో ఉన్న జపాన్‌ను ఒక వైపు తమ అదుపులో ఉంచుకుంటూనే దానికి తమ ఆయుధాలను అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఎత్తుగడను అమెరికా యుద్ద పరిశ్రమ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అదునుగా భావించి ఆయుధాల కొనుగోలుతో పాటు స్వంతంగా ఆయుధాల తయారీకి జపాన్ శ్రీకారం చుట్టింది. గతంలో వాణిజ్యం విషయంలో వివాద పడి సర్దుబాటు చేసుకున్న ఈ రెండు దేశాల మధ్య మిలిటరీ చర్యలు ఏ పర్యవసానాలకు దారి తీస్తాయో చూడాలి. అయితే జపాన్ సాయుధం కావటం తూర్పు ఆసియాలో శాంతికి ముప్పు కలిగిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
జపాన్-రష్యాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న కొన్ని దీవుల వివాదం పరిష్కారం కాలేదు. పసిఫిక్ సముద్రంలోని కురిల్, సఖాలిన్ దీవులు ప్రస్తుతం రష్యా ఆధీనంలో ఉన్నాయి. అవి తమవని జపాన్ చెబుతోంది. ఈ కారణంగానే రెండవ ప్రపంచ యుద్దం నాటి నుంచి రెండు దేశాల మధ్య యుద్ద శాంతి ఒప్పందం మీద సంతకాలు జరగలేదు. అయినప్పటికీ గత ఏడుదశాబ్దాలలో పూర్వపు సోవియట్ లేదా ఇప్పటి రష్యా-జపాన్ ఎలాంటి వివాదానికి దిగలేదు. ఆ పేరుతో ఆయుధాల మోహరింపు మాత్రం జరుగుతోంది. ఈ దీవులలో రష్యా ఇటీవలనే ఆధునిక రక్షణ వ్యవస్ధలను ఏర్పాటు చేసింది. వాటిలో స్వల్ప శ్రేణి క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, నౌకల మీద ప్రయోగించే క్షిపణులు ఉన్నాయి. చైనాతో రష్యా సంబంధాలు సజావుగానే ఉన్నందున ఇవి తమకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టినవే అని జపాన్, అమెరికా చిత్రిస్తున్నాయి.
మరోవైపు జపాన్‌లో అమెరికా మోహరిస్తున్న మధ్యశ్రేణి క్షిపణులు, వాటికి తోడుగా జపాన్ క్షిపణి వ్యవస్ధలు ఎవరికి వ్యతిరేకంగా అన్న ప్రశ్న సహజంగానే ముందుకు వస్తోంది. ఇటీవలి కాలంలో ఈ దీవులకు సమీపంలోని అంతర్జాతీయ జలాల్లో అమెరికా నౌక, యుద్ద విమానాల కదలికలు కనిపించాయి. జపాన్ విమానాలు ఈ ఏడాది కాలంలో తమ ప్రాంతాల సమీపంలో మూడు వందల సార్లు, చైనా సరిహద్దులో ఆరువందల చక్కర్లు కొట్టాయని రష్యా చెబుతోంది. కొరియా సమీపంలోని కొన్ని దీవులు కూడా తమవే అని జపాన్ వివాద పడుతోంది. ఆసియాలో సామ్రాజ్యవాదశక్తిగా గతంలో చైనా, కొరియా, ఇండోచైనా ప్రాంతాలను జపాన్ ఆక్రమించుకుంది. విధిలేని పరిస్ధితుల్లో వాటి నుంచి ఖాళీచేసినప్పటికీ కొన్ని దీవులు తమవే అని గిల్లికజ్జాలకు దిగుతోంది. ఆ పేరుతో ఆయుధీకరణకు పూనుకుంది.కరోనా వైరస్ కారణంగా ఆర్ధిక వ్యవస్ధ మీద పడిన ప్రతికూల ప్రభావం ఎంతో ఇంకా తేలనప్పటికీ మిలిటరీ ఖర్చు పెంచేందుకు పాలకులు వెనకాడటం లేదు. కరోనా కట్టడిలో జపాన్ మిగతా ధనిక దేశాలకంటే మెరుగ్గా పని చేసినప్పటికీ ఆర్ధిక వ్యవస్ధ 2027వరకు కోలుకొనే అవకాశం లేదని, అయినా మిలిటరీ ఖర్చు పెంచటం అవసరమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అమెరికా నాయకత్వాన ఆస్ట్రేలియా, భారత్‌తో కలసి చతుష్టయం పేరుతో జపాన్ ఒక మిలిటరీ కూటమి ఏర్పాటుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. మిలిటరీ బడ్జెట్ పెంపు దీనిలో భాగమే అని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా వద్ద నుంచి క్షిపణులు, విమానాలు కొనుగోలు చేస్తున్నప్పటికీ స్దానికంగానే తయారీకి కూడా ప్రాజెక్టులను ప్రారంభించింది. జలాంతర్గాములపై దాడి చేసే ఫ్రైగేట్స్, ఇతర వేగంగా ప్రయాణించే చిన్న నౌకలను కూడా సేకరిస్తున్నది.
కొద్ది మంది సిబ్బందితో దాడులు చేయగలిగిన రెండు యుద్ద నావల తయారీకి 91 కోట్ల డాలర్లను బడ్జెట్‌లో కేటాయించారు. క్షిపణుల తయారీ లేదా కొనుగోలు ఇతర దేశాల మీద దాడులకు ఉద్దేశించినవి, ఆత్మరక్షణ విధానానికి అనుకూలమైన రాజ్యాంగానికి వ్యతిరేకమైన పరిణామాలని జపాన్ ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ నైరుతి దీవుల చుట్టూ చైనా నౌకా దళ కార్యకలాపాలకు స్పందనగా, దేశ ఆత్మరక్షణ దళాల రక్షణ కోసం క్షిపణులు కీలకమని రక్షణ మంత్రి నోబు కిషి సమర్దించుకున్నారు. ఐదు సంవత్సరాలలో యుద్ద నావల నిర్మాణం, క్షిపణి పరిశోధనలు పూర్తవుతాయని, ఇప్పటికే 900 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తాకే వాటిని అభివృద్ది చేసినట్లు చెబుతున్నారు. తమ గగనతలపై ఎగిరే సూపర్‌సోనిక్ విమానాలను పసిగట్టేందుకు అవసరమైన టెలిస్కోప్‌లు, పర్యవేక్షణ వ్యవస్ధల పరిశోధనలకు నిధులు కేటాయించారు. తమ దేశ మిలిటరీ బడ్జెట్ వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రాంతీయ శక్తులకు ధీటుగా ఉంటుందని టోకియోలోని ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ స్టీఫెన్ నాగీ చెప్పారు. రెండువేల సంవత్సరం నుంచి చైనా మిలిటరీ బడ్జెట్ పెరుగుతున్న కారణంగా జపాన్ కూడా పెంచకతప్పటం లేదని సమర్ధించారు. టోకియోలోని టకుషోకు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హెయిగో నాగీ మాట్లాడుతూ స్వయం రక్షణకు జపాన్ మరింత బాధ్యత వహించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వత్తిడి కూడా మిలిటరీ బడ్జెట్ పెంపుదలకు ఒక కారణం అన్నారు. రక్షణ బడ్జెట్ పెంచకూడదనే రోజులు పోయాయన్నారు.
నాటో కూటమి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని ఐరోపా దేశాలు భరించాలని వత్తిడి చేసినట్లే జపాన్‌తో రక్షణ ఒప్పందం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్ పెంపుదల వత్తిడి వెనుక అమెరికా యుద్ద పరిశ్రమల వత్తిడి స్పష్టంగా కనిపిస్తోంది.జపాన్‌కు వంద ఎఫ్-35 రకం యుద్ద విమానాలను విక్రయించాలని జూలై నెలలో నిర్ణయించారు. అమెరికా ఆయుధ పరిశ్రమలైన లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్,నార్త్‌రోప్‌గ్రుమాన్, బ్రిటన్‌కు చెందిన బియేయి సిస్టమ్స్, రోల్స్ రాయిస్ కంపెనీలు జపాన్ ఆయుధ తయారీలో భాగస్వాములు కావాలని చూస్తున్నాయి. కరోనాకు ముందే అమెరికా ఆర్ధిక వ్యవస్ద సమస్యలను ఎదుర్కొంటుండగా కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతిన్నదని అందువలన తూర్పు ఆసియాలో తన తరఫున ప్రాంతీయ భద్రతా పెంపుదల చర్యలకు జపాన్ ఎక్కువగా ఖర్చు చేయాలనే వత్తిడి పెంచుతున్నట్లు భావిస్తున్నారు.
రెండవ ప్రపంచ యుద్దం తరువాత గణనీయంగా పుంజుకున్నప్పటి నుంచి తిరిగి ప్రపంచ రాజకీయాల్లో పాత్ర పోషించటం ద్వారా తమ మార్కెట్‌ను పెంచుకోవాలని జపాన్ చూస్తోంది. దానికి మిలిటరీ శక్తి ఒక సాధనం అన్నది తెలిసిందే. దానిలో భాగంగానే కార్పొరేట్లు రాజ్యాంగాన్ని సవరించి పూర్తి స్ధాయి మిలిటరీని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో వత్తిడి తెస్తున్నాయి. అయితే రక్షణ ఒప్పందం పేరుతో తన గుప్పెట్లో ఉన్న జపాన్ మరోసారి తనకు పోటీనిచ్చే మిలిటరీ శక్తిగా ఎదగాలని అమెరికా కోరుకోవటం లేదు. ఆసియాలో తన అనుయాయిగా ఉంచుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నది. గతంలో ఒక సామ్రాజ్యశక్తిగా పెత్తనం చేసినపుడు లబ్దిపొందిన కార్పొరేట్లు అమెరికా, ఇతర దేశాలనుంచి ఆయుధాల కొనుగోలుకు బదులు తామే వాటిని తయారు చేసి లబ్ది పొందాలని చూస్తున్నాయి. ఇప్పుడు చైనా, ఉత్తర కొరియాలను బూచిగా చూపి తమ మిలిటరీ బడ్జెట్‌ను పెంచుకుంటున్నాయి. ఒక వైపు అమెరికా మరోవైపు స్వంత కార్పొరేట్ల వత్తిడిని అక్కడి పాలకవర్గం ఏ విధంగా సమన్వయ పరుస్తుందో చూడాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అమెరికాను తోసిరాజనే స్ధితి లేనప్పటికీ దానికి బాటలు వేస్తోందన్నది బడ్జెట్ కేటాయింపులే చెబుతున్నాయి. అమెరికా బలహీనత ఏమంటే అనూహ్యరీతిలో చైనా ఆర్ధికంగా, మిలిటరీ రీత్యా పెరగటంతో దానికి గతం కంటే ఆర్దిక భారాన్ని ఎక్కువగా పంచుకొనే మిత్ర రాజ్యాలు అవసరం పెరిగింది. దాన్ని గ్రహించి జపాన్, జర్మనీలు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి.