Tags
'Socialist' Bernie Sanders, Democratic Socialists of America, focus on Socialism, Karl Marx, rise of the left, socialists are coming, US midterm Elections
ఎం కోటేశ్వరరావు
చివరి క్షణంలో అనూహ్య పరిస్ధితులు ఏర్పడితే తప్ప మంగళవారం నాటి అమెరికా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ వుభయ సభల్లోనూ మెజారిటీ పక్షంగా అవతరించనున్నదని ఎన్నికల సర్వేలు చెప్పాయి. రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గత కొద్ది రోజులుగా చేస్తున్న ప్రేలాపనలు కూడా ఓటర్లనాడి తమకు వ్యతిరేకంగా వుందని వెల్లడించటమే. అయితే పార్లమెంట్‌లో ఎవరికి మెజారిటీ వచ్చినా ఫలితం ఏమిటన్నది అసలు ప్రశ్న. గత ఎన్నికల ఫలితాలను చూస్తే అధికారంలో ఏ పార్టీ అధ్యక్షుడు వుంటే మధ్యంతర ఎన్నికల్లో సదరు పార్టీ ఓడిపోవటం అత్యధిక సందర్భాలలో జరిగింది. అందువల్లనే ప్రతి అధ్య క్షుడు తన సర్వశక్తులూ ఒడ్డి ఓటమిని తప్పించుకొనేందుకు, ప్రతిపక్ష మెజారిటీని బటాబటాగా అయినా వుంచేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అలాంటి విఫల యత్నమే చేసినట్లు చెప్పవచ్చు. గత చరిత్రను చూసినపుడు ఎవరు అధికారంలో వున్నా పార్లమెంటులో ప్రతిపక్షానికి మెజారిటీ వున్నప్పటికీ అధ్యక్షులు లేదా పాలకవర్గం దేశీయంగా కార్మిక వ్యతిరేక, అంతర్జాతీయంగా వివిధ దేశాల పట్ల అనుసరించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, స్వార్ధపూరిత, దుర్మార్గ , యుద్ధోన్మాద వైఖరుల్లో ఎలాంటి మార్పు లేదు. అందువలన ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికలు కూడా అలాంటివే అన్నది కొందరి అభిప్రాయం.
విప్లవం ! ఈ మాట వింటే కొందరికి భయం, అందువలన ఒక గుణాత్మక మార్పు అందాం. అది ఆలశ్యం అవుతోందని ప్రగతిశీలశక్తులు ఆవేదన చెందుతుంటే , ఆలశ్యంగా అయినా వస్తుందేమో అని దాని గురించి భయపడే వారు ఆందోళన చెందుతారు. ఎవరు అవునన్నా కాదన్నా మార్పు అని వార్యం. అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది, ఒక విధంగా చూస్తే ఈ ఎన్నికల ప్రత్యేకత కూడా అదే.సున్నా కంటే ఒకటి ఎంతో పెద్దది కదా ! సోషలిజం, కమ్యూనిజం అనే పదాలే వినపడకూడదు, అలాంటి భావజాలం వున్న వారు కనపడకూడదు అన్న అమెరికాలో వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నారు. గతేడాది జార్జియాలోని ఓక్‌వుడ్ అనే చోట లానియర్ టెక్నికల్ కాలేజీలో ఆంగ్లబోధన టీచర్‌గా డాక్టర్ బిల్ ఎలెనెబర్గ్ అనే అతను దరఖాస్తు చేశాడు. అతని వివరాలు చూసిన యాజమాన్యం సాహిత్యం, ఇతర అంశాలలో అతని ప్రతిభాపాటవాలను చూసి ఇన్ని తెలివి తేటలున్నాయంటే ఎవడో కమ్యూనిస్టు అయి వుంటాడని భావించి నేను కమ్యూనిస్టును కాదు అని ప్రమాణ పత్రం ఇవ్వాల్సిందే అంటూ బలవంతంగా రాయించుకున్నారు.
అలాంటి చట్టవిరుద్దమైన, కమ్యూనిస్టు వ్యతిరేక పరిస్ధితి వున్న చోట ఈ ఎన్నికల సందర్భంగా అనేక మంది పురోగామివాదులు అంతకు ముందు పాతుకుపోయి వున్నవారిని పెకలించి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులుగా పోటీలోకి వచ్చారు. సంఖ్యరీత్యా వారెంత మంది అనటం కంటే ఓటర్లలో వచ్చిన, వస్తున్న మార్పు ముఖ్యం. ఒకవైపు లాటిన్ అమెరికాలో వామపక్ష శక్తులకు అర్జెంటీనా, బ్రెజిల్ వంటి కొన్ని చోట్ల తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలినా అమెరికాలో సోషలిస్టు నినాదం పట్ల పెరుగుతున్న ఆకర్షణ తగ్గలేదు. దీనర్ధం అమెరికాలో వామపక్షాలు త్వరలో అధికారానికి వస్తాయని అతిశయోక్తి చెప్పటం కాదు.అమెరికాలో ఒక పార్టీ తరఫున అభ్యర్ధిగా ఎన్నిక కావాలంటే కొన్ని నెలల ముందే పోటీ చేయాలనుకునే వారు ఆయా నియోజకవర్గాలలో పార్టీ మద్దతు సంపాదించాలి. వాటినే ప్రైమరీలు అంటారు. పార్టీ అంతర్గత ఎన్నికలు జరుగుతాయి. వాటిలో నెగ్గిన వారిని సాధారణంగా అభ్యర్ధులుగా ఆయా పార్టీలు నిర్ణయిస్తాయి. మన దగ్గర మాదిరి కొన్ని పార్టీలలో కార్యకర్తల అభిప్రాయ సేకరణ పేరుతో తమకు కావాల్సిన వ్యక్తిని అభ్యర్ధిగా పెట్టటం సాధారణంగా జరగదు.
జూలై నెలలో బ్రూకింగ్ ఇనిస్టిట్యూట్స్ ప్రైమరీ ప్రాజక్టు అనే సంస్ధ ఆరువందల స్ధానాల అభ్యర్ధిత్వాలకోసం పోటీ పడిన 1600 మంది డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధుల గురించి విశ్లేషణ చేసింది. ముప్పై ఒక్క రాష్ట్రాలలో 2014ఎన్నికలలో తాము పురోగామి వాదులం అని స్వయంగా చెప్పుకున్న అభ్యర్ధులు కేవలం 60 మంది అయితే తాజా ఎన్నికలలో 280 మంది వున్నారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలలో పురోగామివాదులుగా బహిరంగంగా చెప్పుకొని అభ్యర్ధులుగా ఎన్నికైన వారు 24 మంది అయితే తాజా ఎన్నికలలో 81మంది విజయం సాధించటం లేదా విజయబాటలో వున్నట్లు ఆ విశ్లేషణ పేర్కొన్నది. ఇప్పుడు అమెరికాలో పరిస్ధితి ఎలా వుందంటే అందరికీ ఆరోగ్యం అనే నినాదాన్ని బలపరచే వారందరికీ సోషలిస్టు ముద్రను తగిలిస్తున్నారు. దానికి వ్యతిరేకమా అనుకూలమా అనేది డెమోక్రటిక్ పార్టీలో ఒక ప్రధాన అంశం. అందరికీ ఆరోగ్యం కావాలనటమే సోషలిజం అయితే మాకది కావాలి, మేమూ సోషలిస్టులమే అని సాధారణ ఓటర్లు ఆ నినాదాన్ని బలపరిచిన వారికి మద్దతుదారులుగా మారుతున్నారంటే అతిశయోక్తి కాదు. డెమోక్రటిక్ పార్టీ అంటే గతంలో ప్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ వంటి కులీన వుదారవాదులది పైచేయిగా వుండేది. కానీ ఇప్పుడు వారి సంఖ్య తగ్గిపోతూ రంగు, నల్లజాతి వారి చురుకుదనం పెరుగుతున్నది. న్యూయార్క్ నగరంలోని ఒక ఎంపీ స్ధానంలో 20సంవత్సరాల నుంచీ గెలుస్తున్న జో క్రోలేను బార్‌లో పనిచేసిన అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్ అనే 29సంవత్సరాల యువతి ఓడించి యావత్ అమెరికాను ఆశ్చర్యపరచింది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో కాంగ్రెస్‌లో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ మాదిరి డెమోక్రటిక్ పార్టీలో బెర్నీశాండర్స్ నాయకత్వంలోని డెమోక్రటిక్ సోషలిస్టు పార్టీలో ఆమె పని చేస్తున్నది. ఇది డెమోక్రటిక్ పార్టీలో అంతర్భాగంగానే వుంటుంది. తాము సోషలిస్టులమని బహిరంగంగా చెప్పుకొనే ఒకాసియో వంటి వారు ఆవిర్భవించటం డెమోక్రటిక్ పార్టీలోని యథాతధ వాదులకు, మితవాద రిపబ్లికన్లకు ఆందోళన కలిగించే అంశమే.
‘కారల్ మార్క్స్ 200వ జన్మదినోత్సవ సంవత్సర సందర్భోచితంగా అమెరికా రాజకీయ చర్చలలో సోషలిజం తిరిగి చోటుచేసుకుంటున్నది. సోషలిస్టులం అని స్వయంగా చెప్పుకుంటున్నవారి నుంచి వచ్చిన వివరణాత్మక విధాన ప్రతిపాదనలకు పార్లమెంటులోమరియు ఎక్కువ మంది ఓటర్లలో మద్దతు పెరుగుతున్నది’ అని అమెరికా అధ్యక్ష భవనంలోని ఆర్ధిక సలహాదారుల మండలి అక్టోబరు 23న ఒక శ్వేతపత్రంలో పేర్కొన్నది. 1950దశకంలో అమెరికా నలుమూలల సోవియట్ యూనియన్ పట్ల పెరిగిన కమ్యూనిస్టు సానుభూతి అమెరికన్ పాలకవర్గాలను భయపెట్టినట్లుగా ఇప్పుడు సోషలిజం గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నదనటానికి ఈ నివేదిక ఒక సూచిక. ఓటర్లను భయపెట్టేందుకు, సోషలిస్టులుగా ప్రకటించుకున్నవారిని ఓడించేందుకే సరిగా ఎన్నికల ముందు దీనిని విడుదల చేశారని వేరే చెప్పనవసరం లేదు. దాని కొనసాగింపుగానే పోలింగ్‌కు ఇంకా కొద్ది గంటల వ్యవధి వుందనగా ట్రంప్ కుటుంబం ఓటర్ల ముందు సోషలిస్టు బూచిని చూపింది. డెమోక్రాట్లు గెలిస్తే అరాచకం, సోషలిజాలను తీసుకువస్తారనే యుగళగీతాన్ని వారు అలపించారు. టీవీ యాంకర్ మరియు ట్రంప్ కోడలైన లారా ట్రంప్ తన మామ ఎజండాను అడ్డుకొనేందుకు డెమోక్రాట్లు వూహించటానికి కూడా వీలు లేని అంశాలను ముందుకు తెచ్చారని ఆరోపించింది. వారు సోషలిజం గురించి మాట్లాడుతున్నారు, మనం దాన్ని మరిచిపోరాదు, అది చాలా భయంకరమైనది, ప్రతి ఒక్కరూ దీనిమీద దృష్టి సారించాలి అని సెలవిచ్చింది. నాన్సీ పెలోసీ, చుక్ స్కుమర్ వంటి వారు పార్లమెంటులో వుంటే రానున్న రెండు సంవత్సరాలూ అరాచకమే, మా నాన్నను అడ్డుకుంటారు, మూక పాలనను ప్రవేశపెడతారు. ఎవరైనా తమ దేశభక్తి సూచనలను వెల్లడిస్తూ కార్లమీద అమెరికా జండాలను కడితే కార్లను తగులబెడతారు, నా తండ్రి విధ్వంసానికి వ్యతిరేకంగా వుపాధి చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు, వారు వస్తే పన్నులను రెట్టింపు చేస్తారు, అది మాంద్యానికి లేదా సంక్షోభానికి దారి తీయవచ్చు, వారు చట్టాల అమలును అడ్డుకొని దాడులు చేస్తారు. అందుకే రిపబ్లికన్లకు ఓట్లు వేయాలి. అని ట్రంప్ కుమారుడు ఎరిక్ ఆరోపించాడు.
సోషలిజం వాస్తవిక ముప్పు తెస్తోందనటానికి ఈ అధ్యయనం ఒక రుజువు అని ఫాక్స్ న్యూస్ యాంకర్ సీన్ హానిటీ వర్ణించాడు. అందరికీ ఆరోగ్యం అని డెమోక్రటిక్ సోషలిస్టు బెర్నీ శాండర్స్ ప్రతిపాదించిన విధానాన్ని అమలు జరపాలంటే పదేండ్ల వ్యవధిలో 32.6లక్షల కోట్ల డాలర్ల వ్యయం అవుతుంది. అంత మొత్తాన్ని జనానికి ఖర్చు చేసేందుకు కార్పొరేట్ శక్తులు అంగకరించటం లేదు. అమలు జరిగితే జిడిపి పడిపోతుందని, పన్నులు పెరుగుతాయని, అమలు జరుగుతున్న ఇతర సంక్షేమ చర్యలకు కోతపడుతుందని రిపబ్లికన్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియా సర్వేల ప్రకారం ఈ విధానానికి మద్దతు ఇస్తున్న వారు డెమోక్రటిక్ అభ్యర్ధులలో సగానికి మించి వున్నారు. వారు కనుక ఎన్నికైతే రాబోయే రోజుల్లో పార్లమెంట్‌లో అందుకోసం పట్టుబట్టటం అనివార్యం. ఒకవైపు సోషలిస్టు నినాదం పట్ల సామాన్య ఓటర్లు అకర్షితులౌతుంటే మితవాద ఓటర్లను నిలుపుకొనేందుకు, ఆకట్టుకొనేందుకు డెమోక్రటిక్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు నాన్సీ పెలోసీ వంటి వారు మేము పెట్టుబడిదారులం అదే సరైన మార్గం అని ప్రకటించుకున్నారు. ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు ట్రంప్ రెచ్చగొట్టని అంశం లేదు, చేయని వక్రీకరణ, ఆడని అబద్దం లేదు. అయితే అధికారానికి వచ్చిన 649రోజుల్లో రోజుకు పది వంతున 6,420 వక్రీకరణలు, అబద్దాలు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రకటించింది. డెమోక్రాట్లు రెట్టింపు లేదా మూడు రెట్లు పన్నులు పెంచాలని కోరుకుంటున్నారు, దేశం మీద సోషలిజాన్ని రుద్దాలని, అమెరికా సరిహద్దులను చెరిపివేయాలని చూస్తున్నారు. దేశంలోకి అక్రమంగా వలసలు వచ్చే వారిని బిడారులుగా ఒకదాని తరువాత ఒకదానిని ఆహ్వానిస్తున్నారు. అది మన దేశం మీద దండయాత్ర చేయటమే. ఇవి అలాంటి వాటిలో కొన్ని. గత కొద్ధి సంవత్సరాలుగా ముఖ్యంగా గత అధ్యక్ష ఎన్నికల నాటి నుంచి అమెరికాలో జరుగుతున్న అంతర్మధనాన్ని పరిశీలించితే డెమోక్రటిక్ పార్టీ నాయకుల కంటే దాని మద్దతుదార్లయిన ఓటర్లలోనే సోషలిస్టు భావజాలంవైపు ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. మరో రెండు సంవత్సరాలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో దాని ప్రభావం ఎలా వుంటుందోనని ఇప్పటి నుంచే కొందరు విశ్లేషణలు చేస్తున్నారు.పలు మీడియా సంస్ధల ఎన్నికల సర్వేలు డెమోక్రాట్లకే మెజారిటీని చూపాయి. అయితే సోషలిస్టు, కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, రిపబ్లికన్లు ఇతరులు రెచ్చగొట్టిన ప్రచారంతో డెమోక్రాట్లలోని మితవాదులు గనుక ప్రభావితమైతే అనూహ్యంగా రిపబ్లికన్లు బటాబటి మెజారిటీతో విజయం సాధించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ నిజంగా అదే జరిగినా లేక ఈ ఎన్నికలలో డెమోక్రటిక్ సోషలిస్టులు గణనీయ విజయాలు సాధించినా అమెరికా రాజకీయ సమీకరణలు మరింత వేగవంతం కావటం అనివార్యం !