ఎం కోటేశ్వరరావు
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పక్కాగా బిజెపి వ్యతిరేక వైఖరిని తీసుకోనున్నారా? మూడో రాజకీయ సంఘటన ఏర్పాటులో భాగస్వామి అవుతారా ? దక్షిణాది రాష్ట్రాలు ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పుతాయా ? కెసిఆర్ ప్రకటనలు, చర్యలు దేనికి చిహ్నం అనే చర్చ కొంత మందిలో జరుగుతోంది. గతంలో జరిగిన పరిణామాలను బట్టి అలాంటి నిర్ధారణలకు రావటం లేదా ఆ దిశగా చర్చించటం తొందరపాటవుతుంది అనే అభిప్రాయం కూడా ఉంది. మరోసారి ఎందుకీ చర్చ ? దానికి దోహదం చేసిన అంశాలేమిటి ? జనవరి నెల మొదటి పక్షంలో తెలంగాణాలో కొన్ని ముఖ్యఘటనలు జరిగాయి. సంఘపరివార్ భేటీ, ఆ వెంటనే సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం, ఇదే సమయంలో ఏఐవైఎఫ్ జాతీయ సభ, ఆలిండియా కిసాన్ సభ జాతీయ కౌన్సిలు సమావేశం,బీహార్ ఆర్జెడి నేత తేజస్వియాదవ్ సిఎం కెసిఆర్‌తో భేటీ, బిజెపి నేత బండి సంజయ అరెస్టు, విడుదల దానికి నిరసనగా జరిగిన సభలు, బిజెపి జాతీయ నేతల ప్రకటనల దాడి వంటివి ఉన్నాయి.
కేరళలోని కన్నూరులో జరిగే సిపిఎం జాతీయ మహాసభలో వచ్చే మూడు సంవత్సరాలలో అనుసరించాల్సిన రాజకీయ తీర్మానం ముసాయిదా ఖరారుకు హైదరాబాదులో పార్టీ కేంద్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, త్రిపుర మాజీ సిఎం మాణిక్ సర్కార్‌ను కెసిఆర్ విందుకు ఆహ్వానించారు.ఏఐవైఎఫ్ సభలో పాల్గొనేందుకు వచ్చిన సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఆ పార్టీ రాష్ట్రనేతలను విడిగా కెసిఆర్ ఆహ్వానించారు.అదే విధంగా ఆర్జెడి నేత తేజస్వియాదవ్ కలసినపుడూ మొత్తంగా మూడు పార్టీల నేతలతో రాజకీయ పరిస్ధితులపై అభిప్రాయ మార్పిడి చేసుకున్నారు. బిజెపితో సంబంధాలు సజావుగా ఉంటే సంఘపరివార్ సమావేశాలకు వచ్చిన నేతలకూ శాలువాల సత్కారం జరిపి ఉండేవారు. కానీ బిజెపిని గద్దెదింపాలని చెబుతున్న పార్టీల నేతలతో భేటీ ద్వారా కెసిఆర్ పంపదలచుకున్న సందేశం ఏమిటి ? తాను బిజెపి వ్యతిరేక కూటమి వైపే మొగ్గు చూపుతున్నట్లు టిఆర్ఎస్ నేత జనానికి చెప్పకనే చెప్పారు.
తేజస్వి యాదవ్ భేటీ సందర్భంగా తండ్రి, ఆర్‌జెడినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో కెసిఆర్ ఫోన్లో మాట్లాడారు. మూడవ ఫ్రంట్‌కు నేతృత్వం వహించాలని, జాతీయ రాజకీయాల్లోకి రావాలని కెసిఆర్‌ను లాలూ కోరినట్లు టిఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బిజెపి ముక్త భారత్ కోసం లౌకిక పార్టీలన్నీ దగ్గరకు రావాలన్న కోరిక రెండు పార్టీల వైపు నుంచి వ్యక్తమైనట్లు వెల్లడించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2018లో కెసిఆర్ ఇంతకంటే బలమైన సూచనలే పంపారు.బిజెపి, కాంగ్రెస్ లేని ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంటూ బెంగళూరు వెళ్లి జెడిఎస్ నేతలతో చర్చలు జరిపారు. తెలుగువారంతా ఆ పార్టీకే ఓటు వేయాలని బహిరంగంగా పిలుపు ఇచ్చారు. తరువాత ఎలాంటి చొరవా చూపలేదు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ను కలసి రాజకీయాలను చర్చించినట్లు వార్తలు వచ్చాయి.తిరిగి మరోసారి అలాంటి సూచనలు ఇస్తున్నందున వివిధ పార్టీలు, జనంలో సహజంగానే సందేహాలు ఉంటాయి.కెసిఆర్‌తో భేటీ ఐన మూడు పార్టీలు కూడా బిజెపిని వ్యతిరేకించటంలో తిరుగులేని రికార్డు కలిగినవే కనుక, ఇప్పుడు కెసిఆర్ మీదనే చిత్తశుద్ది నిరూపణ బాధ్యత ఉందన్నది స్పష్టం.
వివిధ ప్రాంతీయ పార్టీలు అటు కాంగ్రెస్‌తోనూ, ఇటు బిజెపితోనూ జత కట్టటం-విడిపోవటం-తిరిగి కూడటం వంటి పరిణామాలను చూస్తున్నాము. ఇక ముందు కూడా అలాంటివి జరగవచ్చు. ఇప్పుడు దేశానికి ప్రధాన ముప్పుగా బిజెపి ఉందని వామపక్షాలు భావిస్తున్నాయి. అవి బిజెపికి వ్యతిరేకంగా నికార్సుగా నిలబడ్డాయి.గతంలో ఏ పార్టీ ఏవిధంగా వ్యవహరించినప్పటికీ బిజెపికి వ్యతిరేకంగా ముందుకు వస్తే ఆమేరకు ఆహ్వానిస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి.గతంలో బిజెపితో చేతులు కలినందున ఇప్పుడు వ్యతిరేకంగా ఉండే అర్హత లేదని అనలేవు కదా ! ఆ గూటికి ఈగూటికి తిరుగుతున్న అవకాశవాదుల పట్ల ఎలా ఉండాలనేది జనం నిర్ణయించుకుంటారు. ఒక వేళ నిజంగానే కొంత మంది అనుకుంటున్నట్లుగా బిజెపితో కుదరాలనుకుంటున్న రాజీ మేరకు లోక్‌సభ సీట్లను బిజెపికి వదలి, అసెంబ్లీని తమకు వదలివేయాలని టిఆర్ఎస్ కోరుతుందా ? ఆ బేరం చేసేందుకే బిజెపి మీద విమర్శలను తీవ్రం చేశారా? మరో ఫ్రంట్ గురించి టిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారా ? అన్న అనుమాలను తీర్చాల్సిందే కెసిఆరే.
టిఆర్ఎస్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి బిజెపిని వ్యతిరేకించింది,2009లో అదే పార్టీ బిజెపి, తెలుగుదేశం పార్టీతో కలసి ఎన్డిఏ కూటమిలో ఉంది.రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల నుంచే టిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి రాష్ట్రంలో అధికారం కోసం పోటీ పడుతున్నాయి. వాటి మధ్య పంచాయతీ అదే కదా ! అందుకే అవిలేని మూడవ ఫ్రంట్ గురించి కెసిఆర్ మాట్లాడుతున్నారన్నది స్పష్టం. పైన చెప్పుకున్నట్లుగా కేంద్రం ఒకరికి రాష్ట్రం ఒకరికి అనే ఒప్పందం ఏ పార్టీతో కుదిరినా ఆ రెండు పార్టీలు ఒకటిగా ముందుకు పోతాయి. విధానాల పరంగా మూడు పార్టీలకు మౌలికమైన తేడాలేమీ లేవు.
రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వ విధానాలను సిపిఎం, సిపిఐ రెండూ విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అటువంటపుడు ఒక వేళ కెసిఆర్ జాతీయంగా బిజెపిని వ్యతిరేకించే శక్తులతో కలిసే వచ్చే ఎన్నికల్లో వామపక్షాల వైఖరి ఏమిటన్న ప్రశ్న వెంటనే వస్తుంది. వామపక్షాలకు ఎన్నికలే సర్వస్వం కాదు, ఓడినా గెలిచినా అవి తమ విధానాలతో ముందుకు పోతున్నాయి. ఎప్పుడో ఎన్నికలు వస్తాయని, వాటిలో బిజెపి వ్యతిరేక శక్తులకు మద్దతు ఇస్తామని చెబుతున్నాము గనుక ప్రభుత్వాలు చేసే తప్పిదాలను, ప్రజావ్యతిరేక విధానాలను అవి సమర్దిస్తూనో లేదా మౌనంగానో ఆ పార్టీలు ఉండవు. అలా ఉండేట్లైతే విడిగా కొనసాగాల్సిన అవసరం ఏముంది, ఏదో ఒక పార్టీలో చేరి పోవచ్చు. ఎన్నికలు వచ్చినపుడు కాంగ్రెస్‌తో సహా వివిధ పార్టీలతో అప్పుడు తమ ఎత్తుగడలు వుంటాయని, ఎన్నికలకు ముందు ఫ్రంట్ ఆలోచనలేదని సిపిఎం చెప్పింది. అంతిమంగా ఎలాంటి వైఖరి తీసుకుంటారన్నది కన్నూరు మహాసభ ఖరారు చేయనుంది. కోల్పోయిన తమ ప్రజాపునాదిని తిరిగి తెచ్చుకోవాలని సిపిఎం గట్టిగా భావిస్తోంది. అలాంటి ప్రక్రియకు నష్టం కలుగుతుందని భావిస్తే ఎవరితో సర్దుబాటు లేకుండానే పరిమిత సీట్లలో బరిలోకి దిగవచ్చు. మిగిలిన చోట్ల బిజెపిని ఓడించగలిగే పార్టీకి మద్దతు ఇవ్వవచ్చు, లేదా పరిస్ధితిని బట్టి సర్దుబాట్లకు సిద్దం కావచ్చు. ఒకసారి ఎన్నికల్లో సర్దుబాటు చేసుకున్నంత మాత్రాన ఆ పార్టీ పాలన ఎలా ఉన్నా మౌనంగా ఉండాలనే కట్టుబాటేమీ లేదు.
ఎన్నికలు వేరు, ప్రజాసమస్యలు వేరనే చైతన్యం ఓటర్లలో కూడా రావటం అవసరం. ఇటీవలి చిలీ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలో పోటీ పడ్డాయి. వాటిలో వామపక్షం నిలిపిన అభ్యర్ధి రెండవ స్ధానంలో, పచ్చి మితవాది,నిరంకుశ శక్తులను బలపరిచే అతను మొదటి స్ధానంలో వచ్చాడు. అక్కడి నిబంధనల ప్రకారం 51శాతం ఓట్లు తెచ్చుకున్నవారే విజేత, కనుక తొలి ఇద్దరి మధ్య తిరిగి పోటీ జరిగింది. వామపక్ష అభ్యర్ధి తిరుగులేని మెజారిటీతో గెలిచాడు.తొలి విడత ఓటు వేయని లేదా వ్యతిరేకించిన ఓటర్లు రెండోసారి ఓటు చేశారు. అంటే దాని అర్ధం తరువాత కూడా వారంతా వామపక్ష అభిమానులుగా మారతారని కాదు. అక్కడి ఎన్నికల నిబంధనల ప్రకారం తొలివిడతలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లశాతాన్ని బట్టి ఆ దామాషాలో పార్లమెంటులో సీట్లు కేటాయించారు. అధ్యక్షుడిగా వామపక్ష నేత గెలిచినప్పటికీ పార్లమెంటులో మెజారిటీ లేదు. మన దగ్గర అలాంటి విధానం ఉంటే వేరు, ప్రతి పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుంది, దామాషా పద్దతిలో సీట్లు తెచ్చుకుంటుంది.దేశ ప్రధాని లేదా ముఖ్యమంత్రి పదవులకు ఎన్నికలు జరిగినపుడు తొలి రెండు స్ధానాల్లో ఉన్న పార్టీలలో ఏదో ఒకదానిని మిగతాపార్టీల ఓటర్లు ఎంచుకోవాల్సి వస్తుంది.
టిఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఐదేండ్ల పాటు వామపక్షాలు వ్యతిరేకించవచ్చు. ఎన్నికల సమయానికి దేశ రాజకీయాల్లో ప్రధాన శత్రువుగా భావిస్తున్న బిజెపిని ఓడించాలని నిర్ణయించుకున్నపుడు అదే ప్రధాన ఎన్నికల అంశంగా మారినపుడు, రెండు ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్-కాంగ్రెస్ రెండూ గట్టిగా బిజెపిని వ్యతిరేకిస్తున్నపుడు సమస్య వస్తుంది.ప్రస్తుతానికి దాన్ని ఊహాజనిత అంశంగానే చెప్పవచ్చు. ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేము. ఉత్తర ప్రదేశ్, ఇతర నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పర్యవసానాలు, గుణపాఠాలను బట్టి పార్టీలు వ్యవహరిస్తాయి. ఇప్పటికి ఇప్పుడున్న స్ధితిలో టిఆర్ఎస్ను బిజెపి సవాలు చేసే స్ధితిలో లేదు. అందరూ ఊహిస్తున్నట్లుగా బిజెపి ఓడిపోతే బరిలో టిఆర్ఎస్-కాంగ్రెసే మిగులుతాయి. లేదూ దానికి భిన్నంగా గెలిస్తే బిజెపి మరింత రెచ్చిపోతే, టిఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ చేతులు కలపాల్సి రావచ్చు.
అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ కాంగ్రెస్ నుంచి బిజెపిలోకి ఫిరాయించిన పెద్దమనిషి.శారదా చిట్‌ఫండ్ మొదలు అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఇంకా పరిష్కారం కాలేదు. తాము అధికారంలోకి వస్తే హిమంతను జైలుకు పంపుతామని ప్రగల్భాలు పలికిని వారిలో అమిత్ షా ఒకరు. అవినీతి గురించి బుక్‌లెట్స్‌ను విడుదల చేసింది బిజెపి. అలాంటి పార్టీ అతగాడిని తమ పార్టీలోకి చేర్చుకోవటం మంత్రి పదవి, తరువాత ముఖ్యమంత్రి పదవినే కట్టబెట్టింది.
కెసిఆర్ మీద ప్రస్తుతం ఆరోపణల ప్రచారదాడి తప్ప ఎలాంటి కేసులు లేనప్పటికీ ప్రతి ఒక్కరూ జైలుకు పంపుతామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. అవినీతిని ఎవరూ సమర్ధించాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయంగా లొంగదీసుకొనేందుకే ఇలాంటి ప్రచారం అని భావిస్తున్న తరుణంలో కెసిఆర్ బిజెపి మీద తన దాడిని కూడా పెంచుతున్నారు. తాజాగా పెరగనున్న ఎరువుల ధరల మీద కేంద్రానికి లేఖ రాశారు. మొత్తం మీద చెప్పాలంటే బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు జనానికి, ఇతర పార్టీలకు విశ్వాసం కలిగించాలంటే టిఆర్ఎస్, దాని అధినేత కెసిఆర్ మరింత స్పష్టంగా ముందుకు రావాల్సిన, బిజెపి వ్యతిరేక శక్తులకు విశ్వాసం కలిగించాల్సిన అవసరం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నందున ఈ సారి కేంద్రంలో చక్రం తిప్పి అన్యాయాన్ని సరిదిద్దాలని కొందరు చెబుతున్నారు. అనేక అంశాల కారణంగా దక్షిణాది రాష్ట్రాలో జనభా నియంత్రణ ఎక్కువగా ఉంది. కేంద్ర నిధులు జనాభా ప్రాతిపదికన కేటాయిస్తున్నందున నష్టం జరుగుతున్నది వాస్తవం. దాన్ని ఎలా పరిష్కరించాలన్నది వేరు, రాజకీయ కూటమి వేరు. ప్రస్తుతం అలాంటి పరిస్ధితి, అవకాశం లేదు అని గ్రహించాలి.