Tags
BJP, Christians, Kerala CPI(M), LDF, Narendra Modi, Narendra Modi Failures, Pinarayi Vijayan, RSS, sangh parivar, UDF
ఎం కోటేశ్వరరావు
వెంపలి చెట్టుకు(నేల మీద పాకే ఒక మొక్క) నిచ్చెన వేసి ఎక్కే రోజులు వస్తాయని పోతులూరి వీరబ్రహ్మం చెప్పారన్న ప్రచారం గురించి తెలిసిందే. అల్లుడికి బుద్ది చెప్పిన మామ అదే తప్పు చేసినట్లు ఇంతకాలం మైనారిటీలను సంతుష్టీకరిస్తూ ఓటు బాంకుగా మార్చుకున్నట్లు ఇతర పార్టీలను మీద ధ్వజమెత్తిన బిజెపి, ప్రత్యేకించి నరేంద్రమోడీ ఇప్పుడు ఎంతవారలైనా అధికార కాంతదాసులే అని నిరూపించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా నరేంద్రమోడీ ప్రధానిగా ఉంటారని మోడీ అంతరంగం అమిత్ షా చెప్పారు. మోడీ వేస్తున్న పిల్లి మొగ్గల గురించి కేరళ సిఎం పినరయి విజయన్ ఎద్దేవా చేశారు. రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా అని ఒక సభలో అన్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకు అంటే ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఈస్టర్ పండగనాడు ప్రధాని నరేంద్రమోడీ తన మద్దతుదారులైన యావత్ హిందూత్వశక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అధికారం తరువాతే అన్నీ అన్న సందేశమిస్తూ ఢిల్లీలోని శాక్రెడ్ హార్ట్ చర్చ్‌ను సందర్శించి ప్రార్ధనల్లో పాల్గొన్నారు.మామూలుగా అయితే ఎవరైనా ప్రార్ధనా స్థలాలకు వెళ్లటాన్ని తప్పు పట్టనవసరం లేదు. అది వారి వ్యక్తిగత అంశం. ఆర్‌ఎస్‌ఎస్ సిద్దాంతవేత్త ఎంఎస్ గోల్వాల్కర్ తన ” బంచ్ ఆఫ్ థాట్స్ ” (ఆలోచనల గుత్తి ) అనే పుస్తకంలో దేశ అంతర్గత శత్రువులలో క్రైస్తవులు ఒకరు అని సెలవిచ్చారు. నరేంద్రమోడీ వంటి ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారకులు అవసరమైతే భగవద్గీతను పక్కన పెట్టి గోల్వాల్కర్ రచనను ప్రమాణంగా తీసుకొని పాటిస్తారన్నది తెలిసిందే. మరి ఇప్పుడు తమ గురువును పక్కన పెట్టి మోడీ చర్చికి వెళ్లి సామరస్యత గురించి సుభాషితం పలకటాన్ని చూసి దెయ్యాలు వేదాలను వల్లించినట్లుగా భావిస్తున్నారు.
గతంలో చేసిన దానికి ప్రాయశ్చిత్తంగా చర్చికి వెళ్లి ఉంటే మంచిదే, ఇది అదేనా ? రక్తం రుచి మరిగిన పులి భిన్నమైన దానికి మొగ్గుచూపుతుందా, మరోదారిలో వెళుతుందా ? అని పినరయి విజయన్ ప్రశ్నించారు. బిజెపి నేతలు కేరళలోని బిషప్పుల ఇళ్లను సందర్శిస్తున్నారు. కేరళ వెలుపల క్రైస్తవుల మీద వేటసాగిస్తున్నారు. ఇక్కడ వారు అలాంటి వైఖరి తీసుకోలేరు, సంఘపరివార్‌కు ఇక్కడ మైనారిటీల మీద ఏదైనా ప్రత్యేక ప్రేమ ఉందా ? ఇక్కడ గనుక మతతత్వ వైఖరి తీసుకొని మతఘర్షణలను సృష్టిస్తే ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుంటుంది, దీనిలో ఎలాంటి రాజీలేదు అని స్పష్టం చేశారు. సంఘపరివార్ అసలు రంగేమిటో జనం చూస్తున్నారు, క్రైస్తవ సమాజానికి తాము దగ్గర అవుతున్నట్లు చూపేందుకు నానా తంటాలు పడుతున్నారు. కేరళలో పాగా వేసేందుకు తమ పుస్తకంలోని అని జిమ్మిక్కులను ప్రయోగిస్తున్నారు అన్నారు. కేరళ టూరిజం మంత్రి మహమ్మద్ రియాజ్ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ మిషినరీ గ్రాహమ్ స్టెయిన్, అతని కుమారులు ఫిలిప్,తిమోతీలను సజీవ దహనం చేయటాన్ని సంఘపరివార్ ఇప్పటికీ సమర్ధిస్తున్నది అన్నారు.భజరంగ్ దళ్‌కు చెందిన దారా సింగ్‌కు కోర్టు శిక్ష విధించింది. అతను బిజెపిలో కూడా పని చేశాడు.కనీసం 89 మంది పాస్టర్ల మీద దాడులు, 68 చర్చ్‌ల విధ్వంసం, ప్రార్ధనల మీద దాడులు జరిగినట్లు కూడా రియాజ్ చెప్పారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకంలో చెప్పిన భావజాలం మేరకే జరిగాయన్నారు. గత రెండు సంవత్సరాల్లో క్రైస్తవుల మీద జరిగిన దాడులకు సంబంధించి వెయ్యికిపైగా కేసుల వివరాలను ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న యునైటెడ్ క్రిస్టియన్ ఫోరమ్(యుసిఎఫ్) వెల్లడించింది. నరేంద్రమోడీ చర్చ్ సందర్శన తరువాత అలాంటి దాడులు ఆగిపోతాయనే ఆశ క్రైస్తవుల్లో కలిగిందని క్రైస్తవ వార్తా సంస్థ యుసిఏ పేర్కొన్నది.హిందూ అనుకూల భారతీయ జనతా పార్టీ నేత 2014లో ప్రధాని అయిన తరువాత తొలిసారి చర్చిని సందర్శించినట్లు కూడా పేర్కొన్నది. ఇరవై ఐదు నిమిషాల పాటు నరేంద్రమోడీ చర్చిలో గడిపారు.
ఈస్టర్ ఆదివారం నాడు భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలోని ఒక కాథలిక్ చర్చిని అసాధారణంగా సందర్శించారని క్రిస్టియన్ పోస్ట్ అనే పత్రిక పేర్కొన్నది. మైనారిటీ సామాజిక తరగతుల మీద దాడులకు పేరుమోసిన హిందూ జాతీయవాద పార్టీ నేత క్రైస్తవ ఓటర్లకు దగ్గరయేందుకు చూశారని అన్నది. ఢిల్లీ మైనారిటీ కమిషన్ మాజీ సభ్యుడు ఏసి మైఖేల్ మోడీ సందర్శన సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. క్రైస్తవుల మీద హింసాత్మక దాడులు 2014లో వంద ఉంటే 2022 నాటికి ఆరువందలకు పెరిగినట్లు పేర్కొన్నారు.ఈ ఏడాది తొలి వంద రోజుల్లోనే 200 ఉదంతాలు జరిగినట్లు వెల్లడించారు. దేశమంతటా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల వివరాలను సమర్పించాలని 2022 సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి సుప్రీం కోర్టు పదే అడిగినా ఇప్పటి వరకు మూడుసార్లు గడువును పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని, బలవంతంగా మతమార్పిడులు చేస్తున్నారనే సాకుతో దాడులు జరుపుతున్నారని, బలవంతపు మతమార్పిడులకు తగిన ఆధారాలు దొరక్కపోవటమే దీనికి కారణమని అన్నారు. క్రైస్తవుల మీద దాడులు, వేధింపుల్లో భారత్ ప్రపంచంలోని అరవై దేశాల్లో పదవ స్థానంలో ఉందని అమెరికాకు చెందిన ఓపెన్ డోర్స్ అనే సంస్థ తన నివేదికలో పేర్కొన్నది.హిందూ ఉగ్రవాదులు దేశంలో క్రైస్తవులు, ఇతర మైనారిటీలను లేకుండా చేసి దేశాన్ని ప్రక్షాళన చేయాలని చూస్తున్నారని కూడా చెప్పింది.
సంఘపరివార్‌కు చెందిన వివిధ సంస్థలకు చెందిన వారు విద్వేష ప్రసంగాలు, ప్రకటనలు చేయటంలో పేరుమోశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన బిజెపి ఎంఎల్‌ఏ రామేశ్వర శర్మ ఛాదర్ ముక్త్ – ఫాదర్ ముక్త్ (ముస్లిం, క్రైస్తవ పూజారులు) భారత్ కావాలని బహిరంగంగా చెప్పారు. దేశంలో చత్తీస్‌ఘర్ క్రైస్తవ విద్వేష ప్రయోగశాలగా మారింది. హిందువులు గొడ్డళ్లు ధరించి మతమార్పిడులకు పాల్పడుతున్న క్రైస్తవులకు బుద్ది చెప్పాలని ఆ రాష్ట్రానికి చెందిన పరమాత్మానంద మహరాజ్ పిలుపునిచ్చారు. ఆ సభలో బిజెపి నేతలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని అదుపు చేయకుండా తాము మారినట్లు మైనారిటీలను నమ్మించేందుకు, సంతుష్టీకరించేందుకు బిజెపి నానా పాట్లు పడుతున్నది. కేరళ, క్రైస్తవులు ఉన్న ఇతర ప్రాంతాల్లో బీఫ్‌కు అనుకూలంగా మాట్లాడటమే కాదు, నాణ్యమైన మాంసాన్ని అందిస్తామని కూడా వాగ్దానం చేసిన పెద్దలు ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సిఎం ఎకె ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోనిని బిజెపి ఆకర్షించింది. కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఏకె ఆంటోనీ ప్రభావమే పెద్దగా లేదు, అలాంటిది కొడుకు బిజెపిలో చేరి ఆ పార్టీని ఉద్దరిస్తారన్నది ఆ పార్టీ పేరాశతప్ప మరొకటి కాదు. తనకు 82 సంవత్సరాలని జీవితాంతం కాంగ్రెస్‌లోనే ఉంటానని ఆంటోని చెప్పారు. తన కుమారుడు బిజెపిలో చేరటం బాధాకరమన్నారు.రబ్బరు మద్దతు ధరలను పెంచితే కేరళ క్రైస్తవులు మొత్తం బిజెపికి మద్దతుదార్లుగా మారతారని ఒక మతాధికారి గతంలో ప్రకటించారు. కానీ కేంద్రం వైపు నుంచి అలాంటి సూచనలేమీ లేవు.
నరేంద్రమోడీ చర్చి సందర్శన ఆటతీరునే మార్చివేస్తుందని కేరళ బిజెపి నేతలు సంబరపడిపోతున్నారు. తిరువనంతపురంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో జరిపిన సమీక్షలో ఒకప్పుడు కేరళ కాంగ్రెస్ పక్షాలు పొందిన ప్రజామద్దతు ఇంకే మాత్రం వాటికి ఉండదని భావించినట్లు వార్తలు. పినరయి విజయన్ ముస్లిం సామాజిక తరగతుల్లోకి చొచ్చుకుపోయినట్లుగా తాము క్రైస్తవుల్లో చోటు సంపాదించినట్లు ఇంటింటికి తిరిగినపుడు వెల్లడైందని, చర్చి పెద్దలు కూడా సానుకూల సంకేతాలను పంపినట్లు వారు భావిస్తున్నట్లు ఒక పత్రిక రాసింది. తిరువనంతపురం, త్రిసూర్ జిల్లాల్లో క్రైస్తవులు గణనీయంగా ఉన్నారని ఈ రెండు లోక్‌సభ నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్నట్లు , క్రైస్తవులు ఎల్‌డిఎఫ్, యుడిఎఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నట్లు, వచ్చే రోజుల్లో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని బిజెపి నేతలు అంచనా వేసుకుంటున్నారు. చర్చ్‌ల మీద దాడులు జరుపుతున్నది కొందరు వ్యక్తులని, వారికి ఆర్‌ఎస్‌ఎస్-బిజెపితో సంబంధం లేదని అనేక మంది గుర్తిస్తున్నారని, ఉగ్రవాద హిందూత్వ గ్రూపులకు చెందిన వారిని పార్టీ నుంచి బహిష్కరించినట్లు బిజెపి నేతలు చెప్పుకున్నారు.తమను కేవలం మైనారిటీ మోర్చాల్లో కాకుండా బిజెపి, ఇతర ప్రధాన సంస్థల్లో భాగస్వాములుగా చేయాలని క్రైస్తవులు కోరినట్లు, తిరువనంతపురంలో ఒక లక్ష ఈస్టర్ శుభాకాంక్షల కార్డులను ముద్రించగా డిమాండ్ పెరగటంతో మరో 50వేలు అదనంగా ముద్రించాల్సి వచ్చిందని బిజెపి నేతలు సమావేశంలో చెప్పుకున్నారు.
క్రైస్తవులతో పాటు పసమండా ముస్లింలను కూడా ఆకర్షించేందుకు బిజెపి పూనుకుంది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటులో కూడా ముస్లింలను నిలపని బిజెపి ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు ప్రముఖులను శాసనమండలికి నామినేట్ చేసింది. హిందూత్వ పేరుతో జనాన్ని సమీకరించాలని చూసిన బిజెపి కొంత మేరకు సఫలీకృతమై కేంద్రంలో అధికారానికి వచ్చింది.ఇదే సమయంలో అటు సూర్యుడు ఇటు పొడిచినా మొత్తం హిందువులందరూ బిజెపి వెనుక సమీకృతులు కారని తేలిపోయింది. మరోవైపు తొమ్మిదేండ్ల బిజెపి పాలన వైఫల్యాలమయంగా మారింది. ఈ నేపధ్యంలో అధికారాన్ని నిలుపుకొనేందుకు మైనారిటీల సంతుష్టీకరణ తప్ప మరొక మార్గం లేదని భావించి లేదా ప్రపంచంలో హిందూమతోన్మాదశక్తిగా కనిపించకుండా మేకతోలు కప్పుకొనేందుకు గానీ బిజెపి కొత్త ఎత్తులు వేస్తోంది, కొత్త రాగాలు పలుకుతోంది.