Tags
ఎం కోటేశ్వరరావు
శతృవు దాడి చేస్తున్నాడంటే కమ్యూనిస్టులు తమ కర్తవ్యాన్ని నిర్వరిస్తున్నట్లే భావించాలి. కార్మికవర్గంతో మంచిగా వుండే వారు పెట్టుబడిదారులు నిజమైన పెట్టుబడిదారులు కానట్లే పెట్టుబడిదారీ వర్గం పట్ల మెత్తగా వుండే కమ్యూనిస్టులను కూడా అనుమానించాల్సిందే. కమ్యూనిస్టులు భాగస్వాములుగా వున్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం అనుసరించే కొన్ని విధానాలపై విమర్శలు వున్నాయి. అక్కడి ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్, కార్మిక సంఘాల సమాఖ్య, దక్షిణాఫ్రికా కమ్యూనిస్టుపార్టీలు ఎన్నికలలో వుమ్మడిగానే పోటీ చేస్తాయి. గత రెండు దశాబ్దాలుగా వాటి మధ్య ఐక్యతను దెబ్బతీయాలని జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా ఒకదాని మీద మరొకదానిని రెచ్చగొట్టటం, ఆయా సంస్ధలలోనే అంతర్గతంగా కలహాలను రాజేయటం, ఆఫ్రికన్ల మధ్య చిచ్చురేపటం వంటి ఎన్నో చేస్తున్నారు. అయినా ఆ కూటమి మధ్య ఐక్యత కొనసాగటం వర్తమాన పరిస్ధితుల్లో ఒక విశేషం, విజయమూను.
కమ్యూనిస్టుపార్టీ ప్రస్తుతం మీడియాలో రావాల్సిన మార్పుల గురించి ప్రచారం చేస్తున్నది .ప్రపంచంలో పెద్ద ఇంటర్నెట్ కంపెనీలలో ఏడవ స్దానంలో వున్న దక్షిణాఫ్రికా నాస్సర్ కంపెనీ మీడియా 24 ద్వారా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంలో ముందున్నది. గతంలో ఈ సంస్ధ జాత్యహంకార శక్తుల మద్దతుదారుగా వుండి ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్యంగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారంలో మునిగి వుంది. కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బ్లేడ్ జిమాండే తదితర అగ్రనేతల ప్రతిష్టను దిగజార్చేందుకు పూనుకుందని యువ కమ్యూనిస్టు లీగ్ తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నది. నాస్పర్ తన పత్రికలు, టీవీ, డిజిటల్ మీడియాకు 2017 వరకు కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించింది.దేశాన్ని తిరిగి వెనక్కు తీసుకొని వెళ్లటాన్ని అనుమతించేది లేదని, ఆధారంలేని అభూత కల్పనలను అడ్డుకొనేందుకు అన్ని రకాల చర్యలూ తీసుకుంటామని యువ కమ్యూనిస్టు లీగ్ హెచ్చరించింది. నాస్పర్ మీడియా సంస్ధలు, ప్రతిపక్ష శ్వేతజాతి డెమోక్రటిక్ అలయన్స్ పార్టీ కుమ్మక్కై తప్పుడు వార్తలను వండి వార్చటం వాటిని పార్లమెంట్‌లో, వెలుపలా ప్రస్తావించి జనం మెదళ్లను లుషితం చేసేందుకు పూనుకున్నారు.మీడియా కుట్రలు, తప్పుడు ప్రచారం గురించి కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తున్న రెడ్ అక్టోబర్ ప్రచారానికి యువ కమ్యూనిస్టు లీగ్ పూర్తి మద్దతును ప్రకటించింది.
కమ్యూనిస్టు బూచిని చూసి బెదరని శాండర్స్
అమెరికాలో కమ్యూనిస్టు అంటే ఎయిడ్స్ వచ్చిన వారి మాదిరి చూసే రోజులు ఒకప్పుడు వుండేవి, ఇప్పుడు కూడా వ్యతిరేకతను రెచ్చగొట్టటం, భయపెట్టటంలో తక్కువేమీ లేదు. అయితే ప్రచ్చన్న యుద్ధంలో తామే విజయం సాధించామని, సోషలిజం, కమ్యూనిజాలను ఓడించామని పాతికేళ్ల క్రితం అమెరికన్లు ప్రకటించారు. శకునం చెప్పిన బల్లి కుడితిలో పడిందని సోషలిస్టు ఆర్ధిక వ్యవస్దలు పని చేయవని చెప్పిన పెట్టుబడిదారీ వ్యవస్దలే గతంలో వచ్చిన వాటి కంటే తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.ఈ పూర్వరంగంలో అమెరికాలో తాము కమ్యూనిస్టులమే అని బహిరంగంగా చెప్పుకొనే వారు పెరిగారు. కష్మా సావంత్ అనే భారతీయ సంతతికి చెందిన మహిళ సియాటిల్ నగరంలో తాను కమ్యూనిస్టును అని చెప్పి మరీ నగర పాలక సంస్ధ ఎన్నికలలో 2013లో విజయం సాధించింది, మరోసారి ఇటీవల రెండోసారి ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిగా బెర్నీశాండర్స్ అనే ఎంపీ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో పోటీ పడుతున్నారు.ఆయన ఒక కమ్యూనిస్టు అని ముద్రవేసి వ్యతిరేకతను రెచ్చగొట్టే యత్నం జరుగుతోంది.అందుకు మీడియా తన వంతు పాత్రను పోషిస్తోంది. తాను సోషలిస్టునని శాండర్స్ ప్రకటించుకున్నాడు. మూడు దశాబ్దాల క్రితం నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైన డేనియల్ ఓర్టేగాను కమ్యూనిస్టుగా పేర్కొన్న మీడియాను ప్రశ్నిస్తూ బర్లింగ్టన్ మేయర్‌గా వున్న శాండర్స్ మాట్లాడిన దానిని గతవారంలో ఒకరు యూట్యూబ్ నుంచి వెలికి తీసి జనానికి అందుబాటులోకి తెచ్చారు. దానిలో అసలు కమ్యూనిస్టు అంటే ఏమిటి అని విలేకర్లకు ప్రశ్న సంధిస్తూ ప్రారంభించారు. ఓర్టేగా బహిరంగంగా తాను మార్క్సిస్టు అని చెప్పనపుడు ఆయనకు మీడియా ఆ ముద్ర వేయటం ఎందుకన్న శాండర్స్ ప్రశ్న. వుదాహరణకు రోనాల్డ్ రీగన్ అమెరికా ఫాసిస్టు అధ్యక్షుడు అని ముద్ర వేస్తే ఏమౌతుంది అంటూ రీగన్ తనను ఫాసిస్టు అనుకోడు అందువలన ఎవరికైనా ఒక ముద్రవేసేటపుడు వారు తమను తాము ఏమనుకుంటున్నదీ పరిగణనలోకి తీసుకోవాలని శాండర్స్ చెప్పాడు. వుత్తర, దక్షిణ అమెరికా దేశాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను తీవ్రంగా రెచ్చగొట్టిన పూర్వరంగంలో ఓర్టేగాతో సహా అనేక మంది కమ్యూనిస్టులు వేరే పేర్లతో వుద్యమాలు నడిపారు. మన దేశ చరిత్రను చూసినట్లయితే స్వాతంత్య్ర వుద్యమ కాలంలో నిర్బంధకాండను తప్పించుకొనేందుకు కమ్యూనిస్టులు కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, పెజెంట్స్ అండ్ వర్కర్ పార్టీల పేరుతో పని చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి.ఇటీవలి కాలంలో డెమోక్రటిక్ పార్టీలోని అనేక మంది ఆ పార్టీలో వుంటూనే వామపక్ష వాదులుగా స్వతంత్ర కార్యాచరణకు పూనుకుంటున్నారు. దానిలో భాగంగానే కొన్ని చోట్ల కార్మికుల తరఫున ప్రత్యేక వేదికల పేరుతో ఎన్నికలలో కూడా పోటీ చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీలోని కార్మిక వ్యతిరేక శక్తులను బలపరిచేది లేదని బహిరంగంగా ప్రకటిస్తున్నార. ఈ పూర్వరంగంలో బెర్నీ శాండర్స్‌పై గత కొద్ది సంవత్సరాలుగా మీడియా, ఆయన ప్రత్యర్ధులు కమ్యూనిస్టు ముద్రవేసి వెనక్కు నెట్టాలని చూస్తున్నారు. ఆయన నిజమైన వామపక్షవాది కాదు అని కొంతమంది వామపక్షవాదులు భావిస్తున్నమాట వాస్తవం. అమెరికా రాజకీయాలలో తాను వామపక్ష వాదిని అని చెప్పుకొంటే జరిగేదేమిటో, అధికారానికి దగ్గరకావాలంటే చేయాల్సిందేమిటో తెలియనంతటి అమాయకుడు కాదు శాండర్స్.అయినా డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీల విధానాలకు భిన్నంగా కొన్ని అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడించటం ఆహ్వానించదగిన పరిణామమే. శాండర్స్ అధికార డెమోక్రటిక్ పార్టీ ఎంపీ తప్ప కమ్యూనిస్టు సభ్యుడు కాదు. అందువలన పక్కా కమ్యూనిస్టులా వుండాలని ఆశించటం, ఆ దృష్టితో చూడటం వాస్తవ దృక్పధం కాజాలదు. సోషలిస్టు అగ్ని ఆరిపోకుండా, పెరగటానికి ఎవరు ఎన్ని చితుకులు వేసినా ఆహ్వానించాల్సిందే.
అట్లీకి మావో రాసిన లేఖ వేలం
1937లో నాటి బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి చైనా కమ్యూనిస్టు నేత మావో జెడాంగ్ 1937 నవంబరు ఒకటిన రాసిన లేఖను బ్రిటన్‌లో వేలం వేయబోతున్నారు. ఆ ప్రఖ్యాత లేఖ ధర లక్ష పౌండ్లకుపైగా పలుకుతుందని అంచనా. జపాన్ సామ్రాజ్యవాదులను ఎదుర్కొనేందుకు సాయం చేయవలసిందిగా ఏనాన్‌లోని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి మావో రాసిన లేఖ అది. జపాన్‌ను ఎదుర్కొనేందుకు చైనాకు చేయదగిన సాయానికి మద్దతు ఇవ్వాలని అట్లీని మావో కోరారు. బ్రిటన్ పౌరులకు చైనాలో జపాన్ దురాక్రమణ వాస్తవం గురించి తెలుసునని, చైనా పౌరులకు వారు మద్దతుగా ముందుకు వస్తారని, చివరకు జపాన్ నుంచి తమ కంటే తక్కువగాని ముప్పును తామూ ఎదుర్కొనే ప్రమాదాన్ని తప్పించేందుకు వీలుగా తమ ప్రభుత్వం ఒక విధానాన్ని అనుసరించే విధంగా వారు వత్తిడి తెస్తారని మావో తన లేఖలో పేర్కొన్నారు.
ఈ లేఖను లండన్‌లోని సౌత్ బేలో డిసెంబరు 15న వేలానికి వుంచుతారు. లక్ష నుంచి లక్షా 50వేల పౌండ్ల వరకు అమ్ముడు పోవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచ మార్కెట్‌లో మావో సంతకంతో కూడిన పత్రాలలో ఇది రెండవది. అంతర్జాతీయ దౌత్యంలో భాగంగా అధికారానికి రాక ముందే మావోప్రారంభ చర్యలలో ఇదొకటి.ఆయన సంతకంతో కూడిన లేఖ కావటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.