Tags
China socialist market economy, chinese communist party, Mao Zedong, Mao Zedong thought, People's Republic of China
ఆదిత్య కృష్ణ
చైనాకీ, చైనాపరిశీలకులకీ చాలాముఖ్యమైనది ఈ అక్టోబరు16 న మొదలౌతున్న చెనా కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలోనూ, చైనా ప్రత్యేక లక్షణాలతోనూ కూడి వున్నది అని అక్కడి నాయకత్వం చెప్తున్నది. 2050 నాటికి ప్రపంచంలోని మధ్యస్థాయి (యూరపు) దేశాల అభివృద్ధి స్థాయిని అందుకొంటుందనీ వారు చెప్తున్నారు. దాన్ని కొట్టిపారేస్తూ – చైనా పాలకులు సోషలిజం ముసుగులో పెట్టుబడిదారీ పాలనను సాగిస్తున్నారని మీడియాలో నిత్యం ప్రచారం సాగుతున్నది. సోషలిజం సార్వజనీనమైనది, మళ్లీ ‘చైనా మాదిరి’ ఏమిటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సోషలిజానికి ఒకే రకమైన రెడీమేడ్ మోడల్ ఏమీ లేదు.
అక్కడితో ఆగక, చైనాది సామ్రాజ్యవాదం, లేదా సోషల్ సామ్రాజ్యవాదం అని మరి కొందరు – మావో వాదులమని చెప్పుకొనేవారు ‘సిద్ధాంతాల’ పేరిట – విమర్శిస్తున్నారు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ; గుత్తపెట్టుబడిదారీ విధాన అత్యున్నత రూపం సామ్రాజ్యవాదం అవుతుంది – అని లెనినిజం చెప్తుంది. చైనాలో గుత్త పెట్టుబడిదారీ విధానం అనే పునాదే లేదు; అనేక (పబ్లిక్, సమిష్టి, ప్రైవేటు, వ్యక్తిగత) సెక్టార్లున్న చైనాలో – దానికి ప్రాతిపదిక లేదు. అలాంటిచోట (సోషల్) సామ్రాజ్యవాదం ఎలా ఏర్పడుతుంది?
సామ్రాజ్యవాదాన్ని, అమెరికా అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న చైనాపై అలాంటి ఆరోపణలు అర్థరహితం. ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మూడవ ప్రపంచదేశాల్లో చైనాకి ఉన్న ఆదరణను దెబ్బతీయటానికి ప్రయత్నిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల పాలకవర్గాలకు ఈ ప్రచారాలు ఆచరణలో తోడ్పడుతున్నాయి. సిద్ధాంతరీత్యా చూసినా, ఆచరణలో చూసినా చెల్లని ఆరోపణలివి. స్వతంత్ర పరిశీలనకన్నా పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య మేధావులూ వండి వార్చినదే వారి విమర్శలకి మూలాధారం. చైనా పార్టీతో, వారి డాక్యుమెంట్ల పరిశీలనతో వారికి పనిలేదు.
భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం , అనేక తప్పులు చేసి, ఎదురుదెబ్బలు తిని,విప్లవ గమనంలో కుంటుపడి చిక్కుల్లో ఉన్నది. మనదేశంలో మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనావిధానం పేరిట బలమైన పిడివాదం వుంది. తప్పుడు విమర్శలకు ఒక పునాది అదే. మనదేశంలో చాలా మంది కమ్యూనిస్టులకూ, అభ్యుదయవాదులకూ అల నాటి రష్యాపట్ల అపార అభిమానం. వారికి ఎంగెల్స్ నొక్కి చెప్పిన “శాస్త్రీయ సోషలిజం” కన్నా ఆదర్శవాద, ఊహాజనిత సోషలిజమే ఒంట బట్టింది. అందుకే అశాస్త్రీయమైన అవగాహనతో విమర్శలు చేస్తుంటారు. ఈ విషయంపై సమగ్ర అధ్యయనం అవసరం. దానికిది క్లుప్త పరిచయం.
అంతర్జాతీయ, చైనా వ్యవహారాల నిపుణులైన జె.యన్.యు. ప్రొఫెసర్ అల్కా ఆచార్య క్జి జిన్‌పింగ్ ఎన్నికపై లోగడ ఒక సమీక్షావ్యాసం రాశారు (EPW 5-5-2018). బీజింగ్‌లో ఒక యువపరిశోధకుడు 2017లో అన్న మాటతో ఆమె తనవ్యాసం ముగించారు: “మావో మమ్మల్ని విముక్తి చేశారు. డెంగ్ మ మ్మల్ని సంపన్నులుగా మార్చారు. ఇప్పుడు జిన్‌పింగ్ మా పార్టీని, చైనాను శక్తివంతంగా రూపొందిస్తారు.” విప్లవ విజయం (1949) తర్వాత చైనా – సోషలిస్టు నిర్మాణంలో అంచెలంచెలుగా ముందుకుసాగుతున్నది. పై వాక్యాలు అక్కడి పరిణామాల క్రమాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడుతాయి.
వాస్తవాలకు విరుద్దమైన విమర్శలు : చైనాలో వ్యవసాయ భూమినేటికీ ప్రభుత్వ ఆస్తిగానే వుంది
మావోకాలంలో అంతా సవ్యంగా వుందని, మావో తర్వాత డెంగ్ అంతా తిరగ దోడారనీ విమర్శలు చేస్తుంటారు. చెనాలో మావో పద్ధతులని పక్కనపెట్టి, “స్వేచ్చామార్కెటు” (డెంగ్) విధానాలను అనుసరిస్తున్నారని అంటూ చైనాలో పెట్టుబడిదారీ పునరుద్దరణ జరిగిందన్న సిద్దాంతాన్ని – లోతుపాతులు తెలుసుకోకుండా-కమ్యునిస్టు వ్యతిరేకులు కూడా- ప్రచారం చేస్తున్నారు. నిజానికి అచ్చంగా “స్వేచ్భామార్కెట్” విధా నాలు ఈ నాడు ఏ సామ్రాజ్యవాదదేశంలో సైతం అమల్లో లేవు. సామ్రాజ్యవాదం అంటేనే గుత్తపెట్టుబడిదారీ వ్యవస్థ . స్వేచ్చా మార్కెటుకీ, గుత్త వెట్టుబడికీ పొత్తు కుదరదు. ఇటీవలి కాలంలో అనేక దేశాల్లో అక్కడితో ఆగలేదు. ప్రొటెక్షనిజం, ఆశ్రిత (క్రోనీ) పెట్టుబడిదారీ పద్దతులు గుత్తపెట్టుబడికి తోడైనాయి. చైనా పాలకులు సోషలిజం ముసుగువేసుకొన్నారు; ఆచరణలో సొంత ఆస్థిని పునరుద్ధరించారు; కమ్యూన్‌లను రద్దు చేసారు అని కొందరు చెప్తున్నారు. చైనాలో కమ్యూన్‌లను రద్దు చేసి “వ్యక్తిగత బాధ్యతావిధానం” (Individual Responsibility system) అనే వ్యవసాయరంగ సంస్క రణను చేసా రన్నది నిజమే. కానీ సొంత ఆస్తిని పునరుద్ధరించారన్నది వాస్తవం కాదు. చైనాలో వ్యవసాయ భూమి ఈనాడు కూడా ప్రభుత్వ ఆస్తిగానే వుంది. రైతులకు అనుభవించే హక్కు, ఆ హక్కుని తర్వాతి తరం పొందే హక్కు కూడా వుంది. ఆస్తి వ్యవస్థ వేరు, నిర్వహణా పద్ధతి వేరు. సంస్కరించింది రెండో అంశం మాత్రమే. ఈ కీలకమైన వాస్తవాన్ని విస్మరించి, వ్యాఖ్యానించటం తప్పు. ఇది అవాస్తవం, అశాస్త్రీయం, హేతువిరుద్ధం కూడా.
సోషలిస్ట్ మార్కెట్ ఎకానమీ అంటే.. చైనాలో అనుసరిస్తున్నది “స్వేచ్చా మార్కెట్ పద్ధతి” కాదు. దాన్ని “సోషలిస్టు మార్కెట్ ఎకానమీ” అంటారు. దానికే “సోషలిస్ట్ ప్లాన్డ్ కమోడిటీ ఎకానమీ” అనే పేరు కూడా ఉంది. “పబ్లిక్ ఓనర్‌షిప్” పైచేయిగా వుండే వ్యవస్థ అది. రాజ్యం మార్కెటుని రెగ్యు లేటు చే స్తుంది; మార్కెట్ ఎంటర్ ప్రైజెస్ ని గైడ్ చేస్తుంది” అన్నది దాని ప్రాతిపదిక. ఆ విధంగా ప్లానింగు, మార్కెటు మేళవించబడుతాయి. ఈ అవగాహ నను చైనాపార్టీడాక్యుమెంట్లలో చూడవచ్చును. కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను తెలుసుకోకుండా, లేదా విస్మరించి, తప్పు అవగాహనలు చలామణీలో వున్నాయి. పెట్టుబడిదారీ విధానం=మార్కెటు; సోషలిజం=ప్లానింగు; ఇవి విడదీయరాని జంటలని ఒక అవగాహన విస్తృతంగా వుంటూ వచ్చింది. ఇది తప్పు అని చైనా పార్టీ, డెంగ్ వివరించారు. ఫ్యూడల్ యుగంలోనూ మార్కెటు- వాణిజ్యం, ఎగుమతులూ – ఉన్నాయి; బడా పెట్టుబడిదారీ సంస్థలు ప్లానింగ్ చే సుకొన్నాకే రంగంలోకి దిగుతాయని గుర్తుచేసారు. దాని అధ్యయనం అవసరం, ఉపయోగకరం.
‘ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం‘: లెనిన్
లెనిన్ కాలంలో రష్యా విప్ణవం (1917) విజయవంత మైంది. ఆ వెంటనే సామ్రాజ్యవాదుల జోక్యం, అంతర్యుద్ధం రష్యాని అతలాకుతలం చేశాయి. 1922 దాకా అలాంటి సంక్షోభం కొనసాగింది. సోషలిస్ట్ నిర్మాణం- అభివృద్ధి తొలిదశలోనే 1924 జనవరిలో లెనిన్ మరణించారు. ఆ దశలో లెనిన్ నూత న ఆర్థిక విధానం ( NEP) పేరిట దేశ, విదేశ పెట్టుబడిదారులనూ, వారి పద్ధతులనూ రష్యా లో అనుమతించారు.
ఈ విధానం ప్రమాదకరం కాదా? అంటే అది పెట్టుబడిదారీ అభివృద్ధే అవుతుంది, నిజమే. కానీ ప్రమాదకరం కాదు; ఎందుకంటే అధికారం కార్మికుల, రైతులచేతిలోనే ఉంటుంది. కంట్రాక్టు షరతుల్ని అమలు చేస్తాం; దాని వల్ల కార్మికుల పరిస్థితులు బాగుపడుతాయి… ఇది సరైందే కూడా; ఎందుకంటే ఇతరదేశాల్లో విప్లవం ఆలస్యమైపోయింది; ఈ లోగా మన పారిశ్రామిక తదితర ఉత్పత్తులు పెరుగుతాయి; మన కార్మికుల, రైతుల, ప్రజల పరిస్థితి బాగుపడుతుంది, అది అవసరం.ఈ అవకాశాన్నివదులుకొనే హక్కు మనకిలేదు“…ఈ క్రమంలో (విదేశీ) పెట్టుబడిదారులు కొంత లాభపడుతారు; మనం కొంత వదులుకోవాల్సివస్తుంది నిజమే, ఈ త్యాగం మృత్యుసమానం కాదు, ప్రమాదకరం కాదు”, అని లెనిన్ వివరించారు ( 1921 ఏప్రెల్ 25; CW volume 32). ఈ ఏర్పాట్లు ఒక రకం యుద్ధమే; ఆయుధాలతోకాక, ఆర్థిక రంగంలో సాగించే యుద్ధం; ఈ యుద్ధంలో మన ఉత్పత్తిశక్తుల్ని ధ్వంసం చేసుకోము; పెంపొందించుకొంటాం. పెట్టుబడిదారులు మనని మోసం చేయ జూస్తారు, నిజమే; వారిని మన రాజ్యం, చట్టాలద్వారా, ఇతరత్రా ఎదుర్కొంటాం; గెల్చి తీరుతాం. మనం వారిని కేవలం ఆయుధాల ద్వారానే ఓడించగల్గుతామని భావించటంలేదు…’ప్రపంచ విప్లవ చెయిన్ లో మనమొక లింకుమాత్రమే; మనమొక్కరమే ప్రపంచ విప్లవాన్ని సాధించలేము, ఆ లక్ష్యాన్ని మనం పెట్టుకోలేదు కూడా.. అని ఆ రోజుల్లోనే ( Lenin On Concessions, 1920 నవంబరు 26; మాస్కో పార్టీ సమావేశంలో ఉపన్యాసం) వివరించారు. సామ్రాజ్యవాదం మరణశయ్యపై ఉన్నదని లెనిన్ సూత్రీకరించి శతాబ్దం దాటిపోయినా, నేటికీ అది ఎంతబలంగా ఉన్నదో చూస్తూనే ఉన్నాం.
లెనిన్ తర్వాత ఆ బాధ్యతల్నిస్టాలిన్ చేపట్టి 1953 లో తన మరణందాకా కొనసాగించారు. రష్యాలో ‘సోషలిజం చాలా పరిణతి చెంది, వర్గరహిత కమ్యూనిజంవలె’ రూపొందుతున్నదన్న అతివాద అంచనావేసి, పొరపాటుచేసినట్టు స్టాలిన్ కాలం చివరిలో గుర్తించబడింది. ఆ పొరపాటుని మావో కాలంలోనే చైనా పార్టీ గుర్తించింది. నేడు చైనాలో సోషలిజం ప్రాథమిక స్థాయిలో వున్నది; అక్కడ సోషలిస్ట్ మార్కెటు వ్యవస్థకి కీలక పాత్ర వున్నది – అని డెంగ్ నాయకత్వంలో చైనా పార్టీ సూత్రీకరించింది.
‘సోషలిజంలో కూడా మార్కెట్ పాత్ర వుంటుంది’ : మావో
సోషలిస్ట్ నిర్మాణానికి సంబంధించి కొన్ని ఆర్థికనియమాలు (EconomicLaws)వున్నాయి, వుంటాయి. వాటిపట్ల శాస్త్రీయ అవగాహన వుండాలని, అవి మన ఇష్టాయిష్టాల ప్రకారం వుండవని లెనిన్, స్టాలిన్, మావో, డెంగ్ నొక్కి చెప్పారు. వాటి అవగాహన, అన్వయాలలో అనేక ప్రయోగాలు, అనుభవాలు, సాఫల్యవైఫల్యాలు, అంగీకారాలు – అనంగీకారాలు కూడా వున్నాయి, సహజమే. ఆ నియమాలు ఇలా వున్నాయి:
“ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సోషలిజం ఇన్ యు.యస్.యస్.ఆర్” పేరుతో స్టాలిన్(1951 లో) రచించిన గ్రంధం ఒకటుంది. మానవాళి చరిత్రలో మొదటిసారిగా శాస్త్రీయ సోషలిజం అమలు జరిగింది రష్యాలోనే. కార్మికవర్గం అధికారం చేజిక్కించుకోవటం సోషలిస్ట్ విప్లవానికి నాంది. అది బతికి బట్టకట్టాలంటే ‘సోషలిస్టు నిర్మాణం-అభివృద్ధి’ కీలకం; ఆ రెంటిలోనూ రష్యాది కొత్త అనుభవం, కొత్త ప్రయోగం. ఆ అనుభవాలనే స్టాలిన్ పై పుస్త కంలో చర్చిం చారు; సోషలిజంలో కూడా సరుకుల (కమోడిటీ) ఉత్పత్తి వ్యవస్థ, మార్కెట్ పాత్ర వుంటాయని, అవి పెట్టుబడిదారీ సమాజంతోనే ముగియవని స్టాలిన్ (1951) నిర్ధారించారు. ఈ పుస్తకంపై మావో ఒక విమర్శతో కూడిన సమీక్షను (క్రిటిక్)1958లో రచించారు. చైనా భవిష్యత్తుకి ఉపయోగ పరచుకునే లక్ష్యంతో రష్యా అనుభవాలను మావో పరిశీలించారు. పారిశ్రామిక రష్యా స్థితి అది; చైనాలోని వాస్తవ పరిస్థితులతో కలిపి చూడాలని, వెనుకబడిన వ్యవసాయ దేశమైన చైనాలో మార్కెట్ మరింత అవసరం అని మావో ఆ రచన ప్రారంభంలోనే నొక్కిచెప్పారు. ఆ ‘సమీక్ష’లోని అంశాలు గమనించదగినవి. “సరకుల ఉత్పత్తి వ్యవస్థ అనగానే మనలో కొందరికి చిర్రెత్తుతుంది; అది పెట్టుబడిదారీ విధానమే అని భావిస్తాం. కానీ కోట్లాది రైతుల సంఘీభావాన్ని సమీకరించుకోగలగాలంటే, సరకుల ఉత్పత్తిని, మనీ సప్లయిని పెద్ద యెత్తున పెంపొందించాల్సి వస్తుందని కన్పడుతుంది- అని వెనుకబడిన, రైతాంగదేశాల ప్రత్యేకతల దృష్ట్యా మావో చెబుతారు. ప్రయోగాల అవసరం మావో గుర్తిస్తారు.
“కమ్యూనిస్టు స్వర్గంలోకి ఒక్క అంగలో వెళ్ళలేము, క్రమ క్రమంగానే వెళ్ళగలం. సరకుల వ్యవన్థను, విలువ సూత్రాన్ని, అవి బూర్జువా స్వభావం కలవే అయినా, వాటిని మన ఇష్టానుసారం రద్దు చేయలేము..” పీపుల్స్‌కమ్యూన్లున్నా, అక్కడ సరుకుల వినిమయాన్ని, విలువ సూత్రాన్ని వినియోగించాల్సి వస్తుంది; సోషలిస్టు పరిణామక్రమానికి అవి తోడ్పడుతాయి అంటారు మావో. వ్యవసాయ ప్రధానదేశంగా, గ్రామీణ జనాభా 80 శాతందాకా వున్న దేశంగా చైనా పరిస్థితులు వేరు (రష్యాలో కన్నా వెనుకబడి వుంటాయి) అని కూడా ఎత్తిచూపారు. అక్కడ మార్కెటు పాత్రని నొక్కి చెప్పారు. ‘పెట్టుబడిదారీ కాలంలో అయినా, సోషలిస్టు కాలంలో అయినా ఆర్థికాభివృద్దికి, రాజకీయార్థిక శాస్త్రానికి చెందిన కొన్ని నియమాలు వర్తిస్తాయని చెప్పాల్సివుంటుంది. ప్రకృతి విజ్ఞాన శాస్త్రంలో వలెనే, ఆర్థికాభివృద్ది నియమాలు కూడా వస్తుగతమైనవి (ఆబ్జెక్టివ్), అవి మానవుని ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వుంటాయ’ని మావో రాశారు. ‘సోషలిస్ట్ ఆర్థికానికి సంబంధించిన “రెడీమేడ్” అంశాలేవీ లేనందున, ‘కొత్తవైన సోష లిస్ట్ ఆర్థిక రూ పాలను సృష్టించాల్సి వుంటుంద’నీ, ఈ క్రమాన్నీ అ-ఆ ల నుంచి మొదలు పెట్టాల్సివస్తుందనీ… నిస్సందేహంగా ఇది “జటిలమైన, సంక్లిష్ట మైన, ఇంతకుముందెన్నడూ లేని కర్తవ్యంగా” వుంటుందనీ మావో చెప్పారు.’సోవియట్ యూనియన్ నుంచి నేర్చుకుని మనం మెరుగుపరుచుకోవాలని, ఆర్థిక నియమాలను రష్యా రద్దు చేయగలుగుతుందని, కొత్త వాటిని సృష్టించుకోగలుగుతుందని భావిస్తే- అది పూర్తిగా అసత్యం’-అని చెప్పారు మావో.
‘మన ప్రణాళికా సంస్థలు సామాజిక ఉత్పత్తిని సరిగ్గా (కరెక్ట్ గా) ప్లాన్ చేయడం సాధ్యమే…ఐతే దాన్నీ వాస్తవంలో సాధించటాన్నీకలగా పులగం చేయకూడదు. అవి రెండూ వేర్వేరు విషయాలు.’సాధ్యత’ను వాస్తవంగా మార్చగలగాలంటే, ఆర్థికాన్ని అధ్యయనం చేయటం, దానిపై పట్టు సాధించటం, పూర్తి అవగాహనతో దాన్ని అన్వయించగలగటం అవసరం. “ఆయా నియమాలను పూర్తిగా ప్రతిబింబించగల్గినటువంటి ప్రణాళికలను రూపొందించుకోవాలి’- అంటారు మావో. అలాంటి నియమాల్లో భాగమే సరకుల వ్యవస్థ, మార్కెటూ. ‘గతంలో మనం అలాటి కొన్ని ప్రణాళికలు రూపొందించాం; కానీ తరచుగా అవి తుఫానులని సృష్టించాయి. ఐతే అతి, కాకపోతే మరీ తక్కువ..అయింది. అనేక వైఫల్యాల తరువాత,“40 అంశాల వ్యవసాయ కార్యక్రమం” రూపొందించుకున్నాం. ఇప్పటికీ-వాస్తవిక ఆచరణలో దీన్ని ఇంకా నిరూపించాల్సే వున్నది-అని ప్రయోగాల అవనరాన్ని మావో నొక్కిచెప్పారు. “మన ప్రణాళికలు వాస్తవిక సూత్రాలను పూర్తిగా ప్రతిబింబించలేదు…అంతిమ పరిశీలనలో సరకుల ఉత్పత్తి ఉత్పాదక శక్తులతోకూడా ముడిపడి వుంటుంది. అందువల్ల – పూర్తిగా సోషలైజు చేయబడిన పబ్లిక్ ఓనర్ షిప్ క్రింద కూడా- సరకుల వినిమయం అమలులో వుండడం-కొన్ని రంగాల్లో నైనా- తప్పనిసరవుతుంది’ అని మావో అంటారు. “పట్టణాలకు-గ్రామాలకు, పరిశ్రమలకు వ్యవసాయానికి మధ్య ఆర్థిక సంబంధాన్ని గట్టిపరచాలంటే, సర కుల ఉత్పత్తి వ్యవస్థని కొంతకాలం వుంచాల్సిందేనని బోధపడుతుంది. పట్టణాలతో అలాంటి బంధం మాత్రమే రైతాంగానికి ఆమోదయోగ్యంగా వుం టుంది” -అంటారు మావో. ఇక్కడ కార్మిక రైతాంగ ఐక్యసంఘటన కూడా ఇమిడిఉంది. ఇంకా ఇలా అంటారు: అభివృద్ది చెందిన పెట్టు బడిదారీ దేశాలకీ, వెనుకబడిన పారిశ్రామిక వ్యవస్థలకూ, వ్యవసాయ ప్రధాన దేశాలకూ తేడా వుంటుంది. ఒకే దేశంలో పరిశ్రమలకూ-వ్యవసాయానికీ, పట్టణ వర్గాలకూ రైతాంగానికీ కూడా తేడాలుంటాయి..కొన్ని వాస్తవిక ఆర్థిక సూత్రాలకు, నియమాలకు లోబడి వుంటాయి; మానవుడి ఇష్టాయిష్టాల ప్రకారం వుండవు. వాటిని అవగాహన చేసుకుని, అన్వయించుకోవలసివుంటుంది. ‘సరకుల ఉత్పత్తి వ్యవస్థ వద్దే వద్దు’ -అని కొందరనుకుంటారు. కానీ అది తప్పు. ఆ వ్యవనను గురించి లెనిన్ నుంచి స్టాలిన్ నేర్చుకున్నారు. స్టాలిన్ నుంచి మనం నేర్చుకోవాలి” అంటారు మావో.”సరకుల ఉత్పత్తి వ్యవస్థ కేవలం పెట్టుబడిదారీ వ్యవస్థకు సంబంధించినదే కాదు..సరకుల ఉత్పత్తి విడిగా ఒంటరిగా వుండదు. సందర్భాన్నిబట్టి- పెట్టుబడి దారీ విధానంలోనా, సోషలిజంలోనా అని దాన్ని చూడాలి. పెట్టుబడిదారీ సందర్భంలో అది పెట్టుబడిదారీ సరుకుల ఉత్పత్తి వ్యవస్థ గాను, సోషలిస్ట్ సందర్భంలో అది సోషలిస్ట్ ఉత్పత్తి వ్యవస్థగాను వుంటుంది. నిజానికి సరుకుల ఉత్పత్తి ప్రాచీనకాలం నుంచీ వుంటూ వచ్చింది”-అని మావో అంటారు. సరకుల ఉత్పత్తి వ్యవస్థ అంటే అది పెట్టుబడిదారీ వ్యవస్థేనని నిర్దారించటానికి వీల్లేదని, దాని చారిత్రిక పూర్వ రంగాన్ని గుర్తు చేస్తారు మావో.
రష్యాలో సోషలిజం నిర్మాణ అనుభవాలతో “రాజకీయ ఆర్థిక శాస్త్రం పాఠ్యపుస్తకం” ఒకటి రష్యాలో ప్రచురించబడింది. స్టాలిన్ నేతృత్వంలో సోవియట్ ఆర్థిక వేత్తల బృందం దాన్ని రూపొందించింది. దాన్ని సమీక్షిస్తూ మావో ఒక “రీడింగ్ నోట్స్”ని రచించారు. 1961-62లో రచించిన, 1969లో వెలుగుచూ సిన ఈ సమీక్షలో కూడా పైన పేర్కొన్న అవగాహనే వుంది. రష్యాతో విభేదిస్తూనే, కొన్ని ఆర్థిక నియమాలను గుర్తిస్తూ మావో రచించారు. ఇవన్నీ మావో ఆలోచనావిధానంలో భాగంగా, మార్క్సిజం-లెనినిజం కొనసాగింపుగా అధ్యయనం చేయాల్సినవే. మావో తనజీవితకాలమంతటా నమ్మి, వివ రించిన పై సిధ్ధాంతాల్ని ‘సాంస్కృతికవిప్లవ’ (1966 తర్వాత) కాలంలో పక్కనపెట్టి, అతివాదమార్గం పట్టారు. డెంగ్ ని పెట్టు బడిదారీ మార్గీ యుడని నిందించి, తొలగించారు. రష్యాలో స్టాలిన్ తర్వాత జరిగిన తప్పుల్ని నివారించాలనే ఆదుర్దాతో అలా చేసారు.
ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, ‘సోషలిస్టు నిర్మాణ‘ సిధ్ధాంతాల్ని అభివృధ్ధి చేసిన డెంగ్
కానీ అనతికాలంలో తన అతివాద తప్పుని గ్రహించి,1973లోనే డెంగ్ ని మళ్లీ పిలిచి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పూర్తి బాధ్యతల్ని పునరుధ్ధరించారు. ఈ వాస్తవాల్ని చూడానిరాకరించే పిడివాదులు కొందరు మావోపేరిట డెంగ్ ని తిట్టిపోస్తుంటారు. వారికి ఒక దశలోని మావోయే వేదం, డెంగ్ విషం!
పై ప్రాతిపదికనే డెంగ్ వివరించి, విస్తరించి,’సోషలిస్టు మార్కెటు ఆర్థికవ్యవస్థను ప్రతిపాదించి, అమలు చేసి, ధైర్యంగా అనేక ప్రయోగాలు చేసి, చైనాని అనూహ్యంగా ముందుకు తీసుకెళ్లారు. అదే సమయంలో బూర్జువా లిబరలైజేషన్ ని వ్యతిరేకించే ఉద్యమాన్ని నడిపించారు; అలాంటి ధోరణులపట్ల మెతకగా ఉన్న ఇద్దరు (హు యావో బాంగ్, ఝావో జియాంగ్) నాయకులు ప్రధాన కార్యదర్శి పదవినుంచే – డెంగ్ మార్గదర్శకత్వంలోనే – తొలగించబడ్డారు. దేశం మొత్తం విధిగా పాటించాల్సిన సూత్రాలను డెంగ్ నొక్కిచెప్పి, తమ పార్టీ మౌలిక సిద్ధాంతంలో భాగం చేసారు: సోషలిస్టు మార్గం, జనతాప్రజాతంత్ర నియంతృత్వం, పార్టీ, మాలెమా సిద్ధాంతం – వీటి నాయకత్వ పాత్ర -ఈ ‘నాల్గు మౌలిక సూత్రాల’కి (Four Cardinal Principles) లోబడిమాత్రమే ఏ సంస్కరణలైనా సాగాల్సి ఉంటుంద’ని నిర్ణయించారు. రష్యాలో గోర్బచేవ్ నేతృత్వంలోని సంస్కరణలు పట్టాలు తప్పి, సోవియట్ పతనానికి దారితీసాయి; కాగా చైనా గ్లోబలైజేషన్ తుఫాన్లనీ,2008 ఆర్థిక సంక్షోభాన్నీ, కోవిడ్ మహమ్మారి పర్యవసానాల్నీ తట్టుకొని ముందుకు సాగుతున్నది.”సోషలిస్ట్ యుగంలో మనం సరకుల వ్యవస్థని సంపూర్ణ వికనన దశవరకూ అభివృద్ధి చేయాలి..యుద్దాన్ని దశాబ్దాల పాటు సాగించాం…తైవాన్ విముక్తి కోసం ఇప్పటికీ ఓపిగ్గా ఎదురు చూస్తున్నాం…అలాగే సోషలిజం పరిణతి కోసమూ ఎదురు చూడాల్సి వస్తుంది. మరీ త్వరగా విజయాలు వచ్చేస్తాయని ఆశించవద్దు” అంటారు మావో. చైనాలో సోషలిజం అంతిమవిజయానికి ‘వెయ్యేళ్లయినా పట్ట వచ్చు, ఇది సుదీర్ఘ ప్రయాణం’ అన్నా రు (1950లలొ) ఒక సందర్భంలో. చైనాలో సోషలిజం ప్రాథమిక దశలోనే వుంది అని డెంగ్ సూత్రీకరించింది ఈ అవగాహనతోనే.
తొమ్మిది కోట్లమంది కమ్యూనిస్టు సభ్యులూ, మూడుతరాల శ్రేణులూ నాయకుల అవిఛ్చిన్న, పటిష్ట నేతృత్వంలో చైనా తనదైన స్వతంత్ర, సోషలిస్టు అభివృద్ధిపధంలో ముందుకు సాగుతున్నది. ఎవరో కొద్దిమంది తూలనాడితే, చైనాకి పోయేదేమీ లేదు; ఆ పిడివాదం మనకే నష్టదాయకం. మనదేశంలో ఏం చేయాలి, ఎలా ఉద్యమాల్ని ముందుకు తీసుకువెళ్లాలి అన్నది మనకి ముఖ్యం. చైనాపార్టీ 20వ మహాసభను కీలకమైనదిగా భావించి, ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తున్నది. ఆ సందర్భంగా పై అవగాహన అవసరం.