Tags
media bias, media credibility, Propaganda War, US imperialism, US MEDIA COCK AND BULL STORIES, US Media lies
ఎం కోటేశ్వరరావు
మొదటి ప్రపంచ యుద్ధానికి కారకులలో ఒకడు జర్మన్ చక్రవర్తి కైజర్ రెండవ విల్‌హెల్మ్.1917 ఫిబ్రవరిలో చైనాలో బ్రిటీష్ వారి పత్రిక నార్త్ చైనా డైలీ న్యూస్ ఒక వార్త ప్రచురించింది. కైజర్ సేనలు శవాల నుంచి గ్లిజరీన్ను తయారు చేస్తున్నారన్నది దాని సారాంశం. ఏప్రిల్ నాటికి లండన్ నుంచి వెలువడే టైమ్స్, డెయిలీ మెయిల్ పత్రికలు తమ ప్రతినిధులు శవాల నుంచి గ్లిజరీన్ తీస్తున్న ఫ్యాక్టరీలను చూసినట్లు వార్తలను ప్రచురించాయి. అదే నెలలో లండన్ నుంచి ప్రచురితమౌతున్న ఒక బెల్జియన్ పత్రిక శవాలకు సంబంధించిన వార్తను ప్రచురించింది. దానికి జర్మనీలో ప్రచురితమైన ఒక వార్త ఆధారం. జర్మన్ పత్రికలో గుర్రాలు, కంచరగాడిదల శవాలను కాల్చుతున్నట్లు విలేకరి పేర్కొన్నాడు. అది బ్రిటీష్ పత్రికల్లో మానవశవాలుగా మారింది. అలాంటిదేమీ లేదని జర్మనీ పేర్కొన్నప్పటికీ అప్పటికే జర్మనీ మీద కోపంతో ఉన్న జనం వార్తలను నిజమే అని నమ్మారు. గ్లిజరీన్ వార్తకు ఎలాంటి ఆధారం లేదని 1925లో బ్రిటన్ ప్రజాప్రతినిధుల సభలో ప్రభుత్వం పేర్కొన్నది. అదే ఏడాది కన్సర్వేటివ్ పార్టీ ఎంపీ జాన్ చార్టరీస్ అమెరికాలో పర్యటించినపుడు తానే ఈ వార్త సృష్టికర్తనని వెల్లడించాడు. అతగాడు పూర్వాశ్రమంలో ఇంటిలిజెన్స్ అధిపతిగా పని చేశాడు.1917లో బ్రిటన్ గూఢచార సంస్థ ఎం17 వివిధ పత్రికల్లో స్పెషల్ కరస్పాండెంట్లుగా పని చేసేందుకు 13 మంది అధికారులు, 25 మంది కిరాయి రాతగాళ్లను నియమించింది. వారిలో ఒకడు శవాల ఫ్యాక్టరీ కట్టుకధ గురించి అంగీకరించాడు.మొదటి ప్రపంచ యుద్దంలో బ్రిటన్ అనుసరించిన ఎత్తుగడలను తరువాత జర్మన్ నాజీ హిట్లర్ మరింతగా పెంచి నీవు నేర్పిన విద్య అన్నట్లుగా కట్టుకథలను ప్రచారంలో పెట్టించాడు. వాటికి మారు పేరుగా తన ప్రచారశాఖ మంత్రి గోబెల్స్‌ను ప్రపంచానికి అందించాడు.ఇప్పుడు గోబెల్స్ వారసులు తామరతంపరగా పెరిగారు.గత వంద సంవత్సరాలుగా మీడియా అబద్దాలు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పెరుగుతున్నాయి.
అభిప్రాయ సేకరణ సంస్థ గాలప్ తాజాగా విడుదల చేసిన జూలై మాస సర్వే ప్రకారం అమెరికాలో కేవలం పదకొండుశాతం మంది మాత్రమే టీవీ ఛానళ్ల వార్తలను నమ్ముతున్నారు.పత్రికలపై 16శాతం మందికి విశ్వాసం ఉంది.రెండవ ప్రపంచ యుద్దం, ఆ తరువాత అమెరికా జరిపిన యుద్దాల సందర్భంగా వాటిని సమర్ధించేందుకు అమెరికా సిఐఏ, దానితో చేతులు కలిపిన వివిధ దేశాల సంస్థలు వండి వార్చిన తప్పుడు వార్తలతో జనం విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ సంక్షోభంలో కుహనా వార్తలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆయుధాలతో పాటు అంతేశక్తి వంతంగా ప్రచారదాడులు సాగుతున్నాయి. సిఐఏ స్థాపక అధికారుల్లో ఒకడైన ఫ్రాంక్ విస్నర్ ఒక సందర్భంగా మీడియా ఒక సంగీత వాద్యం వంటిదని చెప్పాడు. ప్రపంచంలోని ప్రధాన మీడియా సంస్థల కార్యాలయాల్లో సంగీత దర్శకుల మాదిరి సిఐఏ అధికారులు, గాత్ర,వాయిద్యకారులుగా ఇతరులు చేరతారు. తప్పుడు వార్తలను వీనుల విందుగా, కనులపసందుగా రూపొందిస్తారు. ఇటీవల బిజెపి తమ భావజాలం ఉన్నవారిని ఒక పథకం ప్రకారం పెద్ద ఎత్తున మీడియాలో ప్రవేశపెట్టింది. ప్రతి పార్టీ అలాంటి వారిని ప్రవేశపెట్టటం లేదా అప్పటికే ఉన్నవారిని తమకు అనుకూలంగా మార్చుకోవటం చేస్తున్నది. ఇలాంటి వారంతా తమ అజెండాలకు అనుగుణంగా పాఠకులు, వీక్షకులకు వినిపిస్తారు, చూపిస్తారు. అమాయకులను నిందితులుగా, నిందితులను అమాయకులుగా మార్చివేస్తారు. వీరికి పోలీసు, గూఢచార ఏజన్సీల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఎంపిక చేసుకున్నవారికి లీకులు అందిస్తారు. అందుకే ప్రస్తుతం ప్రపంచ మీడియాలో జర్నలిజానికి బదులు ప్రచారదాడి తిష్టవేసిందని అనేక మంది చెబుతున్నారు. ఇది యజమానులకు పెద్ద లాభసాటిగా ఉంది.
పాలకవర్గ దోపిడీ, సామ్రాజ్యవాద కాంక్ష, విస్తరణకు మీడియా తన వంతు పాత్ర నిర్వహిస్తోంది. అమెరికా-స్పానిష్ యుద్దాలలో 1898లో క్యూబా, పోర్టోరికో, ఫిలిఫ్పీన్సును వలసలుగా చేసుకున్నపుడు అమెరికాను మీడియా సమర్ధించింది. దీన్ని అప్పుడే ఎల్లో జర్నలిజం అని పిలిచారు. అంతెందుకు జపాన్‌పై రెండు అణుబాంబులు వేసిన దుర్మార్గాన్ని కూడా అధికభాగం అమెరికన్ మీడియా సమర్ధించింది.యుద్దాన్ని ముగించేందుకు అణుబాంబులు వేయకతప్పలేదని పేర్కొన్నాయి. హిరోషిమా నాశనంలో రేడియోయాక్టివిటీ లేదు అని న్యూయార్క్ టైమ్స్ పత్రిక శీర్షిక పెట్టి మరీ రాసింది.అణుదాడితో ప్రమాదకరమైన అణుధార్మికత ఏర్పడదన్న మిలిటరీ అధికారిని ఉటంకించింది. వియత్నాంపై దాడి చేసేందుకు అమెరికా టోంకిన్ గల్ఫ్ దాడిని సాకుగా చూపింది. ఆ కట్టుకథకు మీడియా ఎంతో ప్రాచుర్యమిచ్చింది. 1980 దశకంలో నికరాగువాలో అమెరికా సిఐఏ ఏజంట్లు, కాంట్రా కిరాయి మూకలు చేసిన చిత్రహింసలు, హత్యలు, దుర్మార్గాలను శాండినిస్టా విప్లవకారులకు అంటగట్టి పత్రికలు ప్రచారం చేశాయి.1990 దశకంలో కువైట్‌పై ఇరాక్ దాడి చేసింది. అప్పుడు ఇరాకీ సైనికులు కువైట్ ఆసుపత్రుల్లో ఇంకుబేటర్లలో ఉన్న పిల్లలను కిందపడవేసి చంపారని అమెరికా పత్రికలు రాశాయి. ఇలాంటి కట్టుకథలను సాకుగా చూపి ఇరాక్ మీద అమెరికా దాడి చేసింది. తరువాత సద్దామ్ హుసేన్ మారణాయుధాలను గుట్టలుగా పోగేసినట్లు ప్రచారం చేసి దురాక్రమణకు పూనుకోవటం సద్దామ్‌ను హత్యచేసిందీ తెలిసిందే. 2011లో లిబియాపై నాటో దాడిచేసినపుడు కూడా కట్టుకథలు రాశారు. మహిళలపై అత్యాచారాలు చేసేందుకు ఆ దేశ నేత గడాఫీ సైనికులకు వయగ్రా మాత్రలు ఇచ్చాడని రాశారు. సిరియాలో సిఐఏ మద్దతు ఉన్న సలాఫీ జీహాదీ తీవ్రవాదుల దుర్మార్గాలను ప్రభుత్వానికి ఆపాదించారు.ఈ తప్పుడు ప్రచారాన్ని పులిట్జర్ బహుమతి గ్రహీత జర్నలిస్టు సేమౌర్ హెర్ష్ బయట పెట్టినందుకు అమెరికన్ కార్పొరేట్ మీడియా అతని రచనలను ప్రచురించకుండా నిలిపివేసింది.
అమెరికా దౌత్యవేత్తలు, గూఢచారులను లక్ష్యంగా చేసుకొని క్యూబా, చైనా, రష్యాలు ఎలక్ట్రోమాగటిక్ తరంగాలతో దాడులు చేయటంతో వారందరికీ చెవుల్లో గింగుర్లు, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించినట్లు దీనికి హవానా సిండ్రోమ్ అనిపేరు పెట్టి పత్రికలు రాశాయి. ఇది ఒక మానసిక జబ్బు తప్ప మరొకటేమీ కాదని కొందరు నిపుణులు చెప్పారు.నిజానికి అలాంటి అవకాశమే ఉంటే అనేక దేశాల్లో ఉన్న అమెరికన్లందరి మీద ఆప్ఘనిస్తాన్ వంటి చోట్ల వాటిని ఇప్పటికే ప్రయోగించి ఉండేవారు. వర్తమానంలో ఉక్రెయిన్ సంక్షోభంలో అమెరికా, ఐరోపా మీడియా అల్లిన కట్టుకథలకు లెక్కే లేదు.వీడియో గేమ్‌లను రష్యా దాడులుగా చూపారు.
అమెరికన్ మీడియా అనేక దేశాల్లో జరిగిన పరిణామాలను కూడా వక్రీకరించింది.ఇరాన్‌లో మహమ్మద్ మొసాద్ ప్రభుత్వం 1953లో బ్రిటీష్, అమెరికన్ చమురు కంపెనీలను జాతీయం చేసినపుడు సిఐఏ తప్పుడు ్పచారాలు చేసింది. 1973లో చిలీ అధ్యక్షుడు, సోషలిస్టు నేత సాల్వడోర్ అలెండీపై జరిగిన కుట్ర, తిరుగుబాటు, హత్యను ప్రజాగ్రహంగా వక్రీకరించి రాశారు.2019లో బొలీవియాలో ఎన్నికైన వామపక్ష నేత ఇవో మొరేల్స్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర జరిగింది.దాన్ని సమర్ధించేందుకు ఎన్నికల్లో మొరేల్స్ రిగ్గింగుకు పాల్పడినట్లు పత్రికలు రాశాయి. ఇలాంటి ఎన్నో ఉదంతాలు తమను తప్పుదారి పట్టించిన కారణంగానే అమెరికన్లు మీడియాను విశ్వసించటం లేదన్నది వాస్తవం. అంతే కాదు అమెరికన్లు తమ ప్రభుత్వాన్ని కూడా నమ్మటం లేదని జూన్ నెల గాలప్ పోల్ పేర్కొన్నది. ఎల్లవేళలా ప్రభుత్వం చేస్తున్నది సరైనదే అని నమ్ముతున్నవారు కేవలం రెండుశాతమే,ఎక్కువసార్లు మంచే చేస్తున్నదని నమ్మేవారు 19శాతమే ఉన్నారు. పార్లమెంటు మీద ఏడు,న్యాయవ్యవస్థపై 14, అధ్యక్ష వ్యవస్థపై 23, సుప్రీం కోర్టుపై 25,కార్పొరేట్లపై 14, పెద్ద టెక్నాలజీ కంపెనీలపై 26, పోలీసులపై 45శాతాల చొప్పున విశ్వాసం వెల్లడించినట్లు మరొక గాలప్ పోల్ పేర్కొన్నది.
ప్రపంచం మొత్తం మీద మీడియా విశ్వసనీయ తగ్గుతున్నది.ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన ఎడెల్‌మాన్ బారోమీటర్ విశ్లేషణ ప్రకారం 46శాతం మంది జర్నలిస్టులను నమ్మటం లేదని చెప్పారు.2021 నవంబరు నెలలో 28 దేశాల్లో 36వేల మందితో జరిపిన సంభాషణల్లో ఇది వెల్లడైంది.సమాజాలు చీలిపోవటానికి ఒక వనరుగా మీడియా ఉందని 46శాతం మంది చెప్పారు. కుహనా వార్తలు రాజకీయ ఆయుధాలుగా మారుతున్నట్లు 75శాతం మంది చెప్పారు. ఫేస్‌బుక్‌లో ఆరు రెట్లు అదనంగా కుహనా వార్తలు పుడుతున్నాయి.
మన దేశ మీడియాలో కొన్ని ఛానళ్లు సంచలన వార్తలకు పేరు మోసినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ డిజిటల్ న్యూస్ రిపోర్టు 2022 పేర్కొన్నది. దీని కోసం 2,035 మంది ఆంగ్ల పాఠకులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. అందువలన ఇది మొత్తం అభిప్రాయంగా పరిగణించకూడదు. వారి అభిప్రాయాల ప్రకారం వార్తలను మొత్తం మీద నమ్ముతున్నట్లు చెప్పిన వారు మన దేశంలో 38శాతం మంది ఉన్నారు. సర్వే చేసిన 46 దేశాల్లో మనది 20వ స్థానంలో ఉంది. టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తలను 75శాతం మంది, రేడియో 72, ది ప్రింట్ 61, రిపబ్లిక్ టీవి 57, ది వైర్‌ను 57శాతం మంది నమ్ముతున్నారు. వార్తల కోసం తాము ఆన్‌లైన్ మీడియా మీద ఆధారపడుతున్నట్లు 84శాతం మంది చెప్పగా ప్రింట్ మీడియా మీద 49, టీవీల మీద 59శాతం మంది ఆధారపడుతున్నట్లు వెల్లడించారు.టీవీ ఛానల్స్‌లో బహుళ ఆదరణ పొందినవిగా ఎన్‌డిటివీ, ఇండియా టుడే, బిబిసి ఉండగా పత్రికల్లో టైమ్స్‌ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ టైమ్స్, హిందూ ఉన్నాయి. వార్తల కోసం యుట్యూబ్ చూస్తామని 53శాతం, వాట్సాప్ చూస్తామని 51శాతం చెప్పారు. క్లుప్తంగా కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.కేవలం 36శాతం మందే మీడియా మీద రాజకీయ ప్రభావం లేదని, 35శాతం మంది కార్పొరేట్ల ప్రభావం లేదని భావిస్తున్నారు. అమెరికాలో 30శాతం మంది వార్తల కోసం యాప్స్ మీద ఆధారపడుతుండగా భారత్‌లో 82శాతం ఉన్నారు.ఫేస్‌బుక్‌ను నమ్మేవారు 29-65శాతాలుగా ఉన్నారు. వర్గాల వారీ చీలికలు తెస్తున్న వాటిలో రిపబ్లిక్ టీవీ, జి న్యూస్ ముందున్నాయి. రిపబ్లిక్ టీవిని బిజెపి మద్దతుదార్లు 85శాతం మంది ఇతరులు 50శాతం నమ్ముతున్నారు, జి న్యూస్‌ను 85శాతం బిజెపి, 63శాతం ఇతరులు నమ్ముతున్నారు. మొత్తం మీద ఎన్‌డిటివీని 75శాతం మంది బిజెపి మద్దతుదార్లు, ఇతరులు 81శాతం మంది నమ్ముతున్నారు.
మనుషుల మధ్య సంబంధాలను కలిపేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా దోహదం చేసిందో అదే మానవులు అలవోకగా అబద్దాలు ఆడేందుకు,ప్రచారం, మోసం చేసేందుకు సైతం అవకాశం ఇచ్చిందన్నది కాదనలేని సత్యం. రాను రాను పత్రికలు, టీవీ ఛానళ్లతో కూడిన మీడియా మీద రానురాను జనాల్లో విశ్వాసం తగ్గుతున్నది. ప్రత్నామ్నాయంగా ముందుకు వచ్చిన సామాజిక మాధ్యమం కూడా ఇప్పుడు అదే దారిలో ఉంది. సంప్రదాయ మీడియా స్పందించినా లేకున్నా ప్రశ్నించేందుకు ఒక చిరునామా ఉంటుంది. సామాజిక మాధ్యమానికి అది కనిపించదు, పట్టుకోవటం సామాన్యులకు చాలా కష్టం.