ఎంకెఆర్
సమాజంలో ఎప్పుడూ విరుద్ధ భావజాలాల మధ్య సంఘర్షణ జరుగుతూనే వుంటుంది. అయితే అన్ని వేళలా అన్నీ ఒకే విధంగా సంఘర్షించుకోవు. ఎప్పుడూ ఒకటి ప్రధాన మైన సంఘర్షణగా వుంటుంది. దీని అర్ధం మిగతావి సంఘర్షించుకోవు అని కాదు. ఏ రెండింటి మధ్య జరిగేది ప్రధాన సంఘర్షణ అన్నది గుర్తించటం ముఖ్యం. అయితే వెంటనే దానితో అందరూ ఏకీభవించకపోవచ్చు.అసలు దానిని ఒక వైరుధ్యంగా కొందరు గుర్తించకపోవచ్చు కూడా. ఇప్పుడు దేశంలో అదే పరిస్ధితి వుందన్నది అనేక మంది అభిప్రాయం. కొంత మంది విభేదించినప్పటికీ అనేక దేశాలతో పోలిస్తే మనం మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్ధలో వున్నాం. భావ ప్రకటనా స్వేచ్చ మీద జరుగుతున్న తీవ్ర దాడిని సాధారణంగా మేథావి వర్గంగా భావించే వారందరూ వ్యతిరేకించకపోయినా గట్టిగా వ్యతిరేకించే వారు కూడా వున్నారు. కలుబుర్గి హత్యను ఖండించటానికి కేంద్ర సాహిత్య అకాడమీ తిరస్కరించటం మొదలు, ఎవరు ఏమితినాలి, తినకూడదు అని నిర్ధేశించిన దానిలో భాగంగా గొడ్డు మాంసంపై తలెత్తిన వివాదం, విశ్వవిద్యాలయాలలో భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకొనే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడిన వుదంతాలు, గో సంరక్షణ ముసుగులో ముస్లింలు, దళితులపై దాడులు, చివరికి తాజా సర్జికల్ దాడుల వరకు అనేక వుదంతాలలో తలెత్తిన ఘర్షణలను చూస్తే పూసల్లో దారంలో తిరోగామి భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ఆర్‌ఎస్‌ఎస్, ఇతర మనువాద, మతశక్తులు అన్ని రంగాలలో, అంశాలలో తమ ఆధిపత్యాన్ని రుద్దేందుకు ప్రయత్నించటం చూస్తున్నాం. వారేమీ దాచుకోవటం లేదు, బాహాటంగానే తెగింపుతో ముందుకు వస్తున్నారు. చర్చను ప్రమాదకర పరిస్థితిల్లోకి నెడుతున్నారు. ఇది ఒక పధకం ప్రకారం జరుగుతున్నదా? యాదృచ్చికమా అన్న గుంజాటన వున్న వారు తీరికగా ఆలోచించి దానిని తేల్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ దాడులకు ప్రతిఘటన కూడా అలాగే వుంది. అనేక మంది ఇదేదో తేడాగా వుంది అని ఆలోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అలాంటి వారు పెరుగుతారు.అయితే ఈ శక్తుల ప్రయత్నాలన్నింటికీ తీవ్రమైన ఎదురు దెబ్బలు తగులుతుండటంతో ఒక ఎత్తుగడగా అయినా వెనక్కు తగ్గి కొత్త దారులు వెతుకుతున్నారు.
కలుబుర్గి హత్యపై తలెత్తిన రచయితలు, కళాకారులు, మేథావుల నిరసనలతో ఖంగు తిన్న శక్తులు కేంద్ర సాహిత్య అకాడమీతో సంతాపం ప్రకటింపు చేయించి పరువు దక్కించుకొని బయట పడ్డాయి. ఆవు మాసం వివాదం చివరకు దళితులపై దాడులకు తెరతీయటంతో స్వయంగా ప్రధాని జోక్యం చేసుకొని లోపల ఎలా వున్నప్పటికీ దళితుల ఓట్ల కోసం గోసంరక్షకులపేరుతో దుకాణాలు తెరిచారని తీవ్ర విమర్శలు చేయాల్సి వచ్చింది. వురి శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడిన, యాకుబ్ మెమెన్ వురి తీత సరైంది కాదని అభిప్రాయపడిన వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేసి హైదరాబాదులో రోహిత్ వేముల ఆత్మ హత్యకు కారకులు కావటం, జెన్‌యు విద్యార్ధులపై తప్పుడు ప్రచారం, తప్పుడు వీడియోలు, కేసులతో వేధించేందుకు పూనుకున్నారు. ఆ రెండు చోట్లా జరిగిన విద్యార్ధి సంఘ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. ఈ విషయంలోనూ తాత్కాలికంగా వెనక్కు తగ్గారు. తమకు రాజకీయంగా లాభం అనుకుంటే ఏ వివాదాన్ని అయినా రావణా కాష్టంలా రగిలిస్తూనే వుంటారు, తాత్కాలికంగా అయినా నష్టం అనుకుంటే వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గుతారు.ఇప్పుడు సర్జికల్ దాడుల వివాద వుదంతాన్ని ఎలా ముగిస్తారో చూడాల్సి వుంది.
ఒక్కొక్క అంశంపై తమ ఆధిపత్యాన్ని రుద్ధేందుకు ప్రయత్నిస్తున్న మత, తిరోగామి శక్తులు సమస్యలను సృష్టించేందుకు ప్రయత్నించటం ఒకటైతే , తలెత్తిన పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోవటం మరొకటి. అసహనం, దేశభక్తి, ఆవు నుంచి తాజా మిలిటరీ చర్యల వరకు నడుస్తున్న చర్చలో రెండు ఈ ధోరణులను మనం చూడవచ్చు. పాక్ ప్రేరేపిత వుగ్రవాదుల అణచివేతలో భాగంగా మిలిటరీ చేపట్టిన సర్జికల్ దాడులను దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సమర్ధించాయి. ఎవరూ వాటిని వివాదం చేయలేదు. అయితే ఆ దాడులనుంచి రాజకీయ ప్రయోజనాలను పిండుకోవటానికి బిజెపి తెరతీయటం, అది తగదన్న అంశంపై తీవ్రమైన రెచ్చగొట్టుడు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ముందు బోనులో నిలబెట్టాల్సింది మీడియాను అంటే అతిశయోక్తిగా కనిపించవచ్చు. సర్జికల్ దాడుల గురించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరించినపుడు వచ్చిన వార్తల తీరు తెన్నులను ఒక్కసారి నెమరు వేసుకోండి. దాడుల ఖ్యాతిని పూర్తిగా మిలిటరీకే ప్రతిపక్షాలు అప్పగిస్తున్నాయని, నరేంద్రమోడీకి దానిని పంచేందుకు నిరాకరించాయని రాయటాన్ని ఏమనాలి. మరణించింది సైనికులు, ప్రాణాలకు తెగించి ప్రతిదాడులు జరిపింది సైనికులు, దీనిలో రాజకీయ నాయకులు లేదా పార్టీలకు ఖ్యాతిని ఆపాదించటం ఏమిటి ? వుప్పు తిన్న విశ్వాసం లేదా కిరాయి రాతలని ఇలాంటి వాటినే అంటారు.
మిలిటరీ చర్యలను, మిలిటరీని రాజకీయ ప్రయోజనాలకు వుపయోగించుకున్న దేశాలలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. మన దేశాన్ని కూడా ఆ స్ధితిలోకి నెట్టదలచుకున్నారా ? కొందరి వుత్సాహం అలాగే కనిపిస్తోంది. కార్గిల్ యుద్ధాన్ని బిజెపి తన ఎన్నికల ప్రయోజనానికి వుపయోగించుకోవటం జగమెరిగిన సత్యం. ప్రతిపక్షం ఎంత బలహీనంగా వున్నప్పటికీ ఇది 1999 కాదు 2016 అని గుర్తించకుండా సర్జికల్ దాడులను కూడా అందుకు వినియోగించుకొనే ప్రయత్నం చేస్తే సహించే పరిస్థితి వుంటుందా ? మిలిటరీ చర్యలనుంచి రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నించవద్దన్న అభిప్రాయాల వెల్లడి, ప్రకటనలు జాతీయ ఐక్యత ప్రదర్శించాల్సిన సమయంలో సైనికుల శౌర్య, పరాక్రమాలను అవమానించటమే అని చిత్రించటం అత్యంత ప్రమాదకర పోకడ. మొదటిది ప్రజాస్వామ్యంలోని భావ ప్రకటనా స్వేచ్చకు ప్రతిబింబం అయితే రెండవది అందుకు విరుద్ధమైన అణచివేత వ్యవస్ధ లక్షణం.
మన దేశంలో స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్ పార్టీ చేయని తప్పిదం లేదు. అత్యవసర పరిస్థితి విధించి నిరంకుశత్వాన్ని రుద్ధేందుకు ప్రయత్నించింది. దివాళాకోరు ఆర్ధిక విధానాలు అనుసరించి సామాన్య జనజీవితాలను అతలాకుతలం చేసింది. మతోన్మాదులతో పోటీపడి ఓట్ల కక్కుర్తితో మతశక్తులతో రాజీపడి లౌకిక వ్యవస్ధకు హాని చేసింది. తన రాజకీయ ప్రయోజనాల కోసం వేర్పాటు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చింది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించి ఇప్పుడు ప్రతిపక్షంగా పార్లమెంట్‌లో గుర్తింపునకు తగిన సంఖ్యలో కూడా సీట్లను పొందలేకపోయింది. ఇంకా దాని తప్పిదాలు చాలా వున్నాయి.
రెండవ ప్రపంచ యుద్ధంలో విజేతలు జర్మనీ మిలిటరీపై నిషేధం విధించారు. అదే యుద్ధంలో జపాన్‌ను ఓడించి 1945-52 మధ్య కాలంలో తమ ఆక్రమణలో వుంచుకున్న అమెరికా ఆ దేశ రక్షణ బాధ్యతను తాము తీసుకుంటున్నట్లు ఆ దేశంతో ఒక ఒప్పందం చేసుకొన్నది. రెగ్యులర్ మిలిటరీని నిషేధిస్తూ జపాన్ నూతన రాజ్యంగంలో ఒక అంశంగా చేర్పించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీ, జపాన్‌లకు సైన్యం లేదు. గత ఎన్నికలలో కాంగ్రెస్‌ను బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ చిత్తుగా ఓడించింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని లేదా దాని హక్కులను గానీ జపాన్,జర్మనీ మిలిటరీల మాదిరి నిషేధించలేదు. అందువలన ఆ పార్టీ అయినా మరొకదానికి అయినా ఒక అంశం మీద అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్చను కలిగి వున్నాయి.
ఆ విధంగా చూసినపుడు బిజెపి లేదా దాన్ని చూసి సమాజవాది పార్టీ గానీ రాజకీయ ప్రయోజనాల కోసం జరిపే ప్రచారంలో, పోస్టర్లలో సైన్యాన్ని వుపయోగించుకోకూడదని చెప్పేందుకు ఎవరికైనా హక్కుంది. ‘సర్జికల్ దాడులకు మా సంపూర్ణ మద్దతు వుందని నిర్ద్వంద్వంగా చెప్పాను. అయితే సైన్యాన్ని రాజకీయ పోస్టర్లు, ప్రచారానికి వినియోగించుకోవటాన్ని నేను సమర్ధించను ‘ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశాడు. అంతకు ముందు రోజు కాస్త ఘాటుగా సైనికుల త్యాగాలను సొమ్ము చేసుకొనే దళారులుగా వ్యవహరించవద్దని విమర్శించారు. ఆ విమర్శ తమను గాక మిలిటరీని అన్నట్లే అంటూ బిజెపి విరుచుకుపడింది. సైనికుని బొమ్మను, మోడీ, బిజెపి నేతల బొమ్మలతో కలిపి ముద్రించి వుత్తర ప్రదేశ్‌లో బిజెపి ప్రచారం ప్రారంభించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమపై చేసిన విమర్శలను మిలిటరీకి వర్తింప చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించింది.
దళాలీ( తెలుగులో దళారీ ) అన్నది పార్లమెంటేతర భాష కాదు. భోఫోర్స్‌తో సహా అనేక కుంభకోణాలలో దళారుల పాత్ర ఏమిటో కాంగ్రెస్‌కు, బిజెపికి తెలిసినంతగా ఈ దేశంలో మరొక పార్టీకి తెలిసే అవకాశం లేదు. దానిలో భాగంగానే బిజెపి ‘ధరమ్ కీ దలాలీ(మతం), గాయ్ కీ దళాలీ( ఆవు ) గంగా కీ దళాలీ ( గంగా నది)ని వుపయోగించుకుంటున్నట్లుగానే సైనికుల త్యాగాలను కూడా వుపయోగించుకుంటున్నదని బిజెపి పోస్టర్లను వుటంకిస్తూ కాంగ్రెస్ ఎదురు దాడికి దిగింది. రాజకీయాలలో దళారీ పదం వాడటం వుచితమేనా అన్న ప్రశ్నకు రాజకీయాలకు తావు లేని చోట బిజెపి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నది, మోడీని రాముడిగా చిత్రిస్తూ పోస్టర్లు వేశారు, సర్జికల్ దాడులతో ఆయన ఛాతీ 56 అంగుళాల నుంచి వందకు పెరిగిందని చెప్పారు, జాంబవంతుడు చెప్పిన తరువాతే హనుమంతుడికి తన బలం గురించి తెలిసి వచ్చి ఒక్క వూపులో సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించినట్లుగా సర్జికల్ దాడుల తరువాత మన సైన్యానికి తన బలం ఏమిటో తెలిసి వచ్చిందన్నారు రక్షణ మంత్రి పరికర్. ఆయనను సన్మానించేందుకు సభలు జరుపుతున్నారు. బిజెపి ప్రతినిధి జివిఎల్ నరసింహారావు కూడా అదే రీతిలో తొలిసారిగా మిలిటరీకి తానంటే ఏమిటో తెలిసిందని మాట్లాడారు. నిజానికి ఇవి మిలిటరీని అవమానించే మాటలు. గతంలో చేసిన సర్జికల్ దాడులను విస్మరించటం, త్యాగాలను కించపరచటం తప్ప మరొకటి కాదు. దాడుల ఖ్యాతి పూర్తిగా సైనికులకే దక్కాలి. ఈ పూర్వరంగంలో ఒక పదం ముఖ్యం కాదు దాని వెనుక వున్న భావాన్ని అర్ధం చేసుకోవాలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. వుగ్రవాదులు పాకిస్తాన్ అనే వ్యాధి గ్రస్తు శరీరంలోని క్యాన్సర్ కణాల వంటి వారు, ప్రభుత్వం వాటిని అంతం చేయటానికి మద్దతు ఇస్తున్నాం, దానికి గుండెలు పొంగటం ఎందుకు, పోస్టర్ల ప్రచారం దేనికి, ఒక సర్జికల్ దాడితో వుగ్రవాదం అంతం కాదు, కానీ బిజెపి వుత్తర ప్రదేశ్‌లో ఆ పేరుతో ఓట్లు అడిగేందుకు ప్రచారం ప్రారంభించింది’ అని కూడా సిబాల్ చెప్పారు.
ఆవు మాంసం కలిగివున్నారంటూ వుత్తర ప్రదేశ్‌లోని దాద్రిలో ఒక ముస్లిం కుటుంబంపై సామాహిక దాడి చేసి కుటుంబ పెద్దను హత్య చేసిన కేసులోని ఒక నిందితుడు రవి శిశోదియా జైలులో చికున్ గున్యా వ్యాధితో మరణించాడు. అతని మృత దేహంపై బిజెపి నేతలు జాతీయ జండా కప్పటాన్ని ఏమనాలి. హిందూత్వ వాది కనుక కావాలంటే తమ బిజెపి జెండాను కప్పుకోవచ్చు, జాతీయ జెండాను కప్పటమంటే దానిని అవమానించటం తప్ప మరొకటి కాదు. బిజెపి ప్రవచించే జాతీయవాద నిజ స్వరూపం ఇదా ? దేశం కోసం ప్రాణాలర్పించే సైనికుల మృత దేహాలపై జాతీయ జెండా కప్పుతారు. మరి శిశోదియా ఏ త్యాగం చేశాడని ఇలా చేశారు ?

చికున్ గున్యాతో మరణించిన దాద్రి హత్య నిందితుడికి జాతీయ జెండా కప్పిన బిజెపి జాతీయవాదం
సర్జికల్ దాడుల గురించి చర్చించ కూడదని బిజెపి నేతలు మనకు చెబుతున్నారు. అడిగితే అది పాక్ ప్రచార వలలో పడినట్లే నట ! సైనిక చర్యకూ జాతీయ వాదానికి ముడి పెడుతున్నారు. గో వధ నిషేధానికీ అదే ముద్ర, చివరికి గో సంరక్షకుల ముసుగులో చచ్చిన ఆవుల చర్మం తీసే, చచ్చిన ఆవులను తొలగించటానికి నిరాకరించిన దళితులపైనా దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. వారిని అలాగే వదలి వేస్తే చివరికి గో సంరక్షక్షుల దాడుల గురించి కూడా చర్చించటం కూడా దేశ ద్రోహమే అంటారేమో ? కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని పత్రికలు, కాషాయ దళాల దృష్టిలో భిన్న, బేదాభి ప్రాయం వ్యక్తం చేసే వారందరూ ప్రమాదకారులు, దేశద్రోహుల కింద లెక్క. కనుక అంతిమంగా అలాంటి వారి నోరు మూయాలి లేకపోతే మూయించాలి, ఇదేగా ఇస్తున్న సందేశం ! ఇది ప్రారంభం మాత్రమే. మొగ్గలోనే ఇలాంటి ధోరణులను ఎదుర్కొనకపోతే చివరికి మానులై కూర్చుంటాయి.
మిలిటరీని విమర్శించకూడదు ! న్యాయ వ్యవస్ధను విమర్శించకూడదు !! మిలిటరీ, న్యాయవ్యవస్ధలనేవి ఆకాశంలోంచి వూడి పడలేదు, కనుక విమర్శలకు అతీతం కాదు. ఏ దేశంలో అయినా మిలిటరీ చర్యలపై , న్యాయ వ్యవస్ధ తీర్పులపై విమర్శలు సహజం. వుద్రేకాలు, విద్వేషాలను అదుపులో వుంచుకొని ఆలోచించాల్సిన విషయాలు వున్నాయి. న్యాయమూర్తి స్ధానంలో కూర్చున్న వారు నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్నది ఒక విధి. తీర్పు రాకముందే లేదా తీర్పు వచ్చిన తరువాత వారికి దురుద్ధేశ్యాలను ఆపాదించకూడదు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ముందుగానే మరొక కోర్టులో తన కేసును విచారించాలని కోరే హక్కు ఎవరికైనా వుంది. అంత మాత్రాన సదరు న్యాయమూర్తిని అవమానించినట్లు కాదు. కొన్ని కేసుల విచారణలో న్యాయమూర్తులు స్వచ్చందంగా తప్పుకొంటున్న విషయం విదితమే. అయితే ఒక తీర్పు వెలువడిన తరువాత దాని మంచి చెడ్డలపై వ్యాఖ్యలు చేసే హక్కు ఎవరికైనా వుంటుంది. అంతిమ తీర్పులో కూడా తమకు న్యాయం జరగలేదని ఎవరైనా తమ అభిప్రాయాన్ని వెల్లడించవచ్చు. మిలిటరీ వ్యవహారం కూడా అంతే . దానిలో పని చేసే వారి చిత్త శుద్ధిని శంకించటం వేరు, మిలిటరీలో జరిగే, మిలిటరీ చేసే తప్పులను ఎత్తి చూపటం వేరు అని గమనించాలి.మిలిటరీకి అవసరమైన కొనుగోళ్లలో జరిగే అక్రమాల గురించి ఎన్నో విన్నాం.సంబంధిత అధికారుల ప్రమేయం లేకుండా అవి జరగవు. మిలిటరీ గనుక అక్కడ ఏం జరిగినా విమర్శించకూడదు, మీడియాలో దాని గురించి చర్చించకూడదు అంటే ఎలా ? కార్గిల్ యుద్ధంలో వందల మంది సైనికులు ప్రాణాలర్పించారు. వారి భౌతిక కాయాలను తరలించేందుకు కొనుగోలులో అక్రమాలకు పాల్పడింది అపర దేశభక్తులుగా పేరుపొందిన బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఏ పాలనలో అన్నది తెలిసిందే. మిలిటరీ కొనుగోళ్లు కనుక విమర్శించకూడదంటే ఆ వివరాలు బయటకు వచ్చేవా ? అదే అయితే భోపోర్సు ఆయుధాల కమిషన్ ముడుపులూ అంతే కదా ?
పది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం మిలిటరీలో వున్న మైనారిటీల సంఖ్య ఎంత అనే సమాచారాన్ని సేకరించేందుకు నిర్ణయించింది. ప్రతిపక్షంలో వున్న బిజెపి, మిలిటరీ అధికారులు, మరికొందరు దానిపై నానాయాగీ చేశారు. దాంతో ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం విరమించుకుంది. మిలిటరీ అంటే త్యాగం తప్ప రిజర్వేషన్లు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ భాష మాట్లాడతారు, కుల మతాల లెక్క కాదు అన్నారు. వివరాలు సేకరించాలన్నవారి కారణాలు వారికి వుంటే వ్యతిరేకించే వారికారణాలు వారికి వున్నాయి. అయితే మిలిటరీలో కుల, మత లేదా తెగల ప్రస్తావన లేదా, ముస్లింల సంఖ్యా వివరాలు లేవా అంటే వున్నాయి. అలాంటపుడు ఎందుకు వ్యతిరేకించినట్లు ? మన రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడు. అయితే అది గౌరవం తప్ప అధికారాలు లేవు. లెక్కలు తీయాలని కోరింది రక్షణ మంత్రిత్వశాఖ. అలా లెక్కలు తీయటం మిలిటరీలో మతతత్వ బీజాలు వేయటమే అవుతుంది కనుక ఆ ప్రక్రియను నిలిపివేయాలని మాజీ సైనికాధికారి ఆర్‌ఎస్ కడియన్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ఇలాంటి లెక్కలు తీయటాన్ని నిలిపివేసేందుకు రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. మాజీ సైనికాధికారులు ధర్నాలు చేశారు. కార్గిల్ శవపేటికల కుంభకోణం ఫేం జార్జి ఫెర్నాండెజ్ సైన్యాన్ని మత పూరితం చేసే దేశ ద్రోహకర చర్య అని వర్ణించారు. 2004 జనవరి తొమ్మిదిన రక్షణ మంత్రిత్వ శాఖకు సైన్యం పంపిన ఒక నోట్‌లో పదకొండు లక్షల మంది సైనికులలో ముస్లింలు 29,093 మాత్రమే అని పేర్కొన్నారు. అంటే 13శాతం జనాభాకాగా సైనికులలో వారి శాతం 2.6 మాత్రమే. వారి శాతాన్ని పెంచమని కోరటం జాతి వ్యతిరేకం అవుతుందా ? గూర్ఖా, సిక్కు, రాజపుత్ర, డోగ్రా రెజిమెంట్లలలో ముస్లింలతో సహా ఆ తరగతులకు చెందని వారికి చాలా కాలం అసలు ప్రవేశం లేని విషయం తెలిసిందే. 1984లో అమృతసర్ స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన వుగ్రవాదులను బయటకు గెంటి వేసేందుకు చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్ చర్య సందర్భంగా సిక్కు రెజిమెంట్‌లో కొందరు సైనికులు తిరుగుబాటు చేసిన తరువాతే రెజిమెంట్లలో ఇతరులకు కూడా చోటు కల్పించి అఖిల భారత స్వభావం తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
మన మిలిటరీ, న్యాయవ్యవస్ధ అయినా మన వైవిధ్య సమాజానికి ప్రతిబింబంగా వుండాలన్నదానితో ఎవరూ విబేధించనవసరం లేదు. అలా వుందా లేదా అన్నతి తెలియాలంటే వివరాలు వుండాలి, లోపం వుంటే అధిగమించేందుకు ప్రయత్నించాలి. మన దేశానికి వలస పాలన వారసత్వంగా అనేక అవలక్షణాలు వచ్చాయి. వాటిని వదలగొట్టుకోవాల్సి వుంది. వలస పాలకులు ఎందుకు అలా చేశారన్నది మరో సందర్భంలో చర్చించవచ్చు.మన సైన్యంలో సిక్కు, గూర్ఘా, జాట్, రాజపుత్ర, డోగ్రా,పంజాబ్, మద్రాస్, మరాఠా, బీహార్, ఇలా మరికొన్ని పేర్లతో రెజిమెంట్లు వున్నాయి. నిజానికి లౌకిక భారత్ లేదా స్వతంత్ర భారతంలో ఇలాంటివి ఇప్పటికీ కొనసాగటం ఆశ్చర్యకరమే. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తరువాత నాగా రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని, దేశ రక్షణలో మరింత చురుకుగా పాల్గొనేందుకు తమ పేరుతో ఒక రెజిమెంట్‌ను ఏర్పాటు చేయాలని నాగాల ప్రతినిధులు కోరిన మేరకు 1970లో ఆ రెజిమెంట్‌ను ఏర్పాటు చేశారు. మేమెంతో మాకంత వాటా మాదిరి నినాదాలతో అస్థిత్వ భావనలు తీవ్రంగా వ్యాపించిన వర్తమాన పరిస్థితులలో ప్రత్యేక రెజిమెంట్ల ఏర్పాటు డిమాండ్‌ను ముందుకు తెచ్చేందుకు అవకాశం వుందా లేదా ?
దేశ విభజనకు ముందు పాకిస్థాన్లో ఎంత మంది హిందువులున్నారు, ఇప్పుడు ఎంత మంది వున్నారో చూడండంటూ ఆర్‌ఎస్‌ఎస్ వారు జనాన్ని తప్పుదారి పట్టించే లెక్కలు కొన్ని చెబుతుంటారు. మన రక్షణ శాఖ సహాయ శాఖ మంత్రిగా పని చేసిన మహావీర్ త్యాగి అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం దేశ విభజనకు ముందు భారత సైన్యంలో ముస్లింలు 32శాతంగా వుండగా విభజన తరువాత రెండు శాతానికి పడిపోయింది. ఇది ఒక్క ముస్లింలకే పరిమితం కాదు, ఇతరుల శాతం ఎంత అన్నది కూడా తెలుసుకోవాల్సిన అవసరం వుందా లేదా ? అయితే సచార్ కమిటీ సూచన ప్రకారం ముస్లింల సంఖ్య తెలుసుకోవాలనుకోవటంలో మైనారిటీల సంతుష్టీకరణ, దాన్ని వ్యతిరేకించటంలో మెజారిటీ సంతుష్టీకరణ కోణాలు కూడా లేకపోలేదు. అధికారంలో ఏ పార్టీ వున్నప్పటికీ రాజ్యాంగ బద్దంగా దళితులు, గిరిజనుల వుప ప్రణాళికలకు నిధులు కేటాయించాలన్నా, మత, భాషా మైనారిటీల సంక్షేమానికి చర్యలు, పధకాలను రూపొందించాలన్నా వారి సంఖ్యా, ఇతర పరిస్థితుల వివరాలు తెలియకుండా ఎలా సాధ్యం. వాటిని సేకరించటం ఆ తరగతుల సంతుష్టీకరణ అని ఇంతకాలం రాజకీయం చేసిన బిజెపి ఇప్పుడు కేంద్రంలో, అనేక రాష్ట్రాలలో అధికారంలో వుంది. అవేమీ లేకుండానే వారికి పధకాలు రూపొందిస్తుందా? వున్న పధకాలను ఎత్తివేస్తుందా ? అమెరికా అంటే బిజెపి, సంఘపరివార్ శక్తులకు వల్లమాలిన అభిమానం అక్కడ వర్షం కురిస్తే ఇక్కడ గొడుగులు పడతారు. అమెరికా పర్యటన జరపాలని నరేంద్రమోడీ ఎంతగా తపించి పోయారో తెలిసిందే. అలాంటి అమెరికా సైన్యంలో ముస్లింలు, నల్లవారు, తెల్లవారు, ఇతర జాతుల వారు ఎందరున్నారో ప్రతి ఏటా సంఖ్యా వివరాలను ప్రకటిస్తారని తెలియదా ? మరి అక్కడ రాని పొరపొచ్చాలు మన దేశంలో ఎందుకు వస్తాయని భావిస్తున్నారు?
పాకిస్తాన్ పాలనలో మిలిటరీ ఆధిపత్యం, ప్రభావం గురించి బహిరంగ రహస్యమే. ఆ మిలిటరీ చర్యలను కూడా అక్కడి మీడియా తప్పు పట్టి ప్రశ్నించిందన్న విషయాన్ని అంగీకరిస్తారా లేక పాక్ మీడియా కథలను ప్రచారం చేయటంగా కొట్టి పారవేస్తారా ?http://indiatoday.intoday.in/story/pakistan-miliatry-is-no-holy-cow/1/143245.html ఈ వ్యాసాన్ని మన భారతీయ పత్రిక ఇండియా టుడే ఐదు సంవత్సరాల క్రితం ప్రచురించింది. అందరూ చూస్తుండగానే ఇస్లామాబాద్‌లో సలీమ్ షహజాద్ అనే ఒక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు అపహరించి తరువాత చంపివేశారు.అది మిలిటరీ కనుసన్నలలో పని చేసే ఐఎస్‌ఐ పనే అని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిని ఖండిస్తూ మిలిటరీ ఒక ప్రకటన చేసింది. వార్తలు వాస్తవం కాదని తోసి పుచ్చితే ఒక రకం, అలా కాకుండా వివరాలను వెల్లడిస్తే అది జాతీయ భద్రతకు ముప్పు వస్తుందని, సైనిక బలగాల నైతిక స్ధైర్యం దెబ్బతింటుందని పేర్కొనటమే కాదు, కస్టడీలోకి తీసుకున్న పౌరులను మిలిటరీ చిత్రహింసలు పెట్టదు, చంపదు అని, సలీమ్ సహజాదీ హత్యలో ఐఎస్‌ఐ ప్రమేయమున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ప్రకటించింది. దీనిపై పాక్ పత్రిక ఫ్రైడే టైమ్స్ పత్రిక సంపాదకుడు నజమ్ సేథీ వ్యాఖ్యానిస్తూ ప్రజాస్వామ్యంలో విమర్శలకు అతీతమైవేవీ లేవు, మిలిటరీ కూడా అలాంటిదే అని రాశాడు. మరి మనది ప్రజాస్వామ్యం. కాశ్మీర్, ఈ శాన్య రాష్ట్రాలలో ప్రత్యేక అధికారాలు కలిగిన మిలిటరీపై అనేక విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. మిలిటరీ సైతిక స్ధైర్యం దెబ్బతిన కుండా వుండాలంటే ఆ చర్యలను విమర్శించకూడదా ? మిలిటరీ చర్యలతో దెబ్బతింటున్న సామాన్య పౌరుల మనో స్ధైర్యం నంగతేమిటి ?
పౌరపాలకుల పర్యవేక్షణలో పని చేస్తున్న మిలిటరీ వ్యవస్ధలలో మనది ఒకటిగా గర్వించాల్సిందే. నిత్యం సరిహద్దులను కాపాడుతున్న వారి సామర్ధ్యం, త్యాగాలకు హారతి పట్టాల్సిందే. వారి విశ్వసనీయతను ప్రశ్నించకూడదన్నది కూడా నిజమే. సర్జికల్ దాడులకు మన దగ్గర సాక్ష్యాలు వున్నాయని బల్లగుద్ది మరీ చెప్పినపుడు అబ్బే అసలు దాడులే జరగలేదని పాక్ ప్రభుత్వం ఎత్తుగడగానే చెప్పి వుండవచ్చు, ఎందుకంటే తన పౌరులకూ అది సంజాయిషీ ఇచ్చుకోవాలి గనుక.ఈ వుదంతంలో ప్రపంచ దృష్టిలో ఎవరిది పైచేయిగా కనిపిస్తుంది. పాకిస్తాన్ అసలు దాడులే జరగలేదనే వాదనకే కట్టుబడి వుంది. పరిస్థితులు సాధారణంగానే వున్నాయి చూడమంటూ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతాలను చూపింది. దాడులు జరిగి వుంటే సాక్ష్యాలు వెల్లడించాలని సవాలు చేస్తున్నది. ఇది కూడా ప్రచార ఎత్తుగడే అనుకుందాం .
మన దేశంలో జరిగిందేమిటి ? తాజా వివాదానికి అధికార రాజకీయ నేతల, మిలిటరీ వున్నతాధికారుల బాధ్యతేమీ లేదా ? సర్జికల్ దాడుల వివరాలతో సహా అనేక అంశాలు గోప్యంగా వుంచాల్సినవే అయినపుడు దాడులను తాము చిత్రీకరించామని, ద్రోణులను కూడా వుపయోగించామని చెప్పాల్సిన అవసరం ఏముంది. దాడులు చేశాం అని మాత్రమే చెప్పి వుంటే సరిపోయేది కదా ? అతని కంటే ఘనుడు ఆచంట మల్లన మాదిరి కాళిదాసు కవిత్వానికి స్వంతపైత్యం జోడించి నట్లు మిలిటరీ వినియోగించిన రాత్రుళ్లు చూడగలిగే పరికరాలు మా మచిలీపట్నంలోని బెల్‌లో తయారు చేశారని, ఆ ఫ్యాక్టరీని మరింత విస్తరించేందుకు మా చంద్రబాబు నాయుడు నిమ్మలూరులో మరో ప్లాంట్ ఏర్పాటుకు చర్య తీసుకున్నారని తెలుగు తమ్ముళ్లు సర్జికల్ దాడుల నుంచి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదా ? సర్జికల్ దాడుల రీత్యా సరిహద్దులలో పాక్ మిలిటరీ చర్యకు పూనుకోవచ్చంటూ వందలాది గ్రామాల నుంచి పౌరులను ఖాళీ చేయించటానికి, తరువాత ఆ కార్యక్రమాన్ని వుపసంహరించుకోవటానికి బాధ్యత ఎవరిది? దాడుల గురించి గుండెలు వుప్పొంగించుకోనవసరం లేదని జబ్బలు చరుచుకోవనవసరం లేదని ప్రధాని నరేంద్రమోడీ హితవు చెప్పారంటూ వచ్చిన వార్తలు కూడా పాక్ సృష్టే అంటారా ? సర్జికల్ దాడుల ఖ్యాతి అంతా మోడీకే దక్కాలని రాసిన మీడియా పెద్దమనుషులే రొమ్ములు విరుచుకోవనసరం లేదని ప్రధాని చెప్పినట్లు కూడా రాయటం మోడీ వ్యక్తిత్వాన్ని పెంచటంలో భాగమని సంతోషించి వుండవచ్చు. కానీ అవి సర్జికల్ దాడుల తీవ్రతను తగ్గించే సందేశాన్ని కలిగి వున్నాయని గ్రహించారా ? ఎవరు ఎవరి వలలో పడ్డారు.ఈ మొత్తం వుదంతం ఎలాంటి సందేశం ఇస్తున్నది ?
Like this:
Like Loading...