ఎం కోటేశ్వరరావు
ఒక ఐఏఎస్ అధికారికి రాత్రి పదిగంటల సమయంలో అదీ ప్రధాన మంత్రి నరేంద్రమోడీ స్వయంగా ఫోన్ చేసి రోడ్డు మరమ్మతుల గురించి మాట్లాడటం ప్రస్తుతం మీడియాలో ఒక పెద్ద వార్తగా మారింది. తొలుత కోరా అనే ఒక వెబ్‌సైట్‌లో రాసిన కథనం క్రమంగా జాతీయ వార్తగా మారింది.నిజమే ఒక జిల్లా అధికారికి ప్రధాని స్వయంగా ఫోన్ చేయటం అంటే చిన్న విషయం కాదు. ప్రధాని స్వయంగా జోక్యం చేసుకోవటంతో నాలుగు రోజుల్లో రహదారి మరమ్మతులు పూర్తి చేసి లీటరు పెట్రోలు మూడువందల రూపాయలకు, అదే స్థాయిలో ఇతర నిత్యావసర వస్తువులను కూడా కొనుగోలు చేస్తున్న త్రిపుర పౌరుల దుస్థితిని తప్పించి ఎంతో మహోపకారం చేశారన్నది కధనం సారాంశం. అయితే ఈ కధనాన్ని అనేక మంది అదొక కట్టుకధ అని భావించారు, ఇప్పటికీ భావిస్తున్నారు. కాదు నిజమే అని త్రిపుర వున్నతాధికారులు ధృవీకరించినట్లు అక్కడి ఒక పెద్ద పత్రిక రాసింది కనుక నిజమే అని, అనుమానం వున్నవారు దాన్ని చదవ వచ్చని కూడా కొందరు పేర్కొన్నారు. పెద్ద పత్రికలు అసలు అవాస్తవాలు రాయవు అన్నది వారి గట్టి నమ్మకం.
ఈ వుదంతం వాస్తవమా అవాస్తవమా అన్నది తేల్చటం కష్టం .ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు తమకు తాము కూడా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరైనా లేవనెత్తిన వాటికి సమాధానం చెప్పాలి. వున్నత పదవులలో వున్నవారి ప్రతిష్ట పెంచటంలో భాగంగా అలాంటి జిమ్మిక్కులు చేయటం ఈ వుదంతంతో ప్రారంభం కాలేదు, గతంలోనూ జరిగాయి, ఇంతటితో ఆగవు. అయితే దున్న ఈనిందంటే దూడను గాటన కట్టేయ మన్నట్లుగా ఎలాంటి ఆలోచన లేకుండా నమ్మేవారికి ఏ సందేహాలు రావు. జనమంతా అలాగే వుండాలని పాలకులు కోరుకుంటారు. అక్కడే వస్తుంది పేచీ. ప్రభువులు ఒక విధంగా ఆలోచిస్తే జనం ఆలోచన మరో విధంగా వుంటుంది.జన కోణం నుంచి ఈ వుదంతాన్ని పరిశీలిద్దాం.
దాదాపు 93వేల కిలోమీటర్ల దూరం వున్న జాతీయ రహదారులలో ఒక రాష్ట్రానికి కీలకంగా వున్న ఒక రహదారిలో 15 కిలోమీటర్ల మేర తక్షణం మరమ్మతులు చేయాలంటే స్వయంగా ప్రధాని జోక్యం చేసుకుంటే తప్ప పని జరగని పరిస్థితి భారత్‌లో వుంది అని ప్రపంచానికి తెలిసింది. జాతీయ రహదారి కనుక ఈ రోడ్డు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వుంటుంది. రోడ్ల శాఖకు నితిన్ గడ్గరీ అనే ఒక పెద్దాయన మంత్రిగా వున్నారు. ఆయన కింద పెద్ద యంత్రాంగం వుంటుందని వేరే చెప్పనవసరం లేదు. ప్రధాన మంత్రి రాత్రి పది గంటలకు (ఈశాన్య ప్రాంతంలో ఒక గంట మనకంటే ముందే సూర్యుడు అస్తమిస్తాడు కనుక స్థానిక సమయం పదకొండు గంటలనుకోవాలి.) ఒక జిల్లాలోని ఐఏఎస్ అధికారిని లేపి ఆ సమయంలో అంతరాయం కలిగించినందుకు క్షమాపణ కూడా చెప్పి ప్రధాని మాట్లాడారంటే అప్పటి వరకు కేంద్ర మంత్రి ఏ గుడ్డి గుర్రానికి పండ్లు తోముతున్నట్లు ?
ప్రధాన మంత్రి అంటే వున్నత స్ధాయిలో జరగాల్సిన దౌత్య నిర్ణయాలు, ఆర్ధిక, రాజకీయ విధానాల వంటి ముఖ్యమైన అంశాలపై కేంద్రీకరిస్తారని మాత్రమే ఇప్పటి వరకు అనుకుంటున్నాము. మరమ్మతులు చేయాల్సిన రోడ్ల వంటి చిన్న చిన్న విషయాల గురించి కూడా వదలటం లేదంటే మన దేశానికి మంచి రోజులు వచ్చినట్లే. మన వీధిలో మున్సిపాలిటీ, పంచాయతీ వారు చెత్త కుప్పలను ఎత్తివేయకపోయినా, రోడ్ల మీద తిరిగే వట్టి పోయిన ఆవులు పేడవేసినా అవి ప్రధాని దృష్టిలో వుంటాయని, ఏదో ఒక రోజు ప్రతి పారిశుధ్య కార్మికుడికి ఫోన్ వస్తుందని ఆశించటం తప్పుకాదు. కేంద్ర మంత్రులు, అధికారులు పెద్దగా పని చేయనవసరం లేదు, ఎందుకంటే అన్నీ ప్రధాని పట్టించుకుంటారు కదా !
మరమ్మతు చేయాల్సిన రోడ్డు అసోంలో వుంది. ముందే చెప్పుకున్నట్లు జాతీయ రహదారుల నిర్వహణకు ఒక సంస్ధ, దానికి ఒక పెద్ద యంత్రాంగం వుండగా ప్రధాని సంబంధిత అధికారికి ,లేదా అసోం అధికారికి ఫోన్ చేయకుండా త్రిపుర ఛీఫ్ సెక్రటరీని వదలి ఒక జిల్లా అధికారికి ఎందుకు చేశారు? ఇక్కడ ఏం జరిగి వుండాలి. ప్రధాన మంత్రి కార్యాలయంలో లేదా ఇంటి వద్ద పని చేసే అధికార యంత్రాంగానికి రోడ్ల నిర్వహణ అధికార వ్యవస్ధ గురించి తెలిసి వుండకపోవటం, లేదా పని వత్తిడిలో ఆపరేటర్‌కు రాంగ్ నంబరు ఇచ్చి వుండాలి లేదా విసిగిపోయిన ఆపరేటర్ కనపడిన నంబర్‌కు కలిపి వుండాలి లేదా నానా ఇక్కట్లు పడుతున్నది త్రిపుర జనం కనుక ఆ రాష్ట్ర అధికారికి కలిపారా అన్నది అది బుర్రవున్నవారు అడగ కూడని ప్రశ్న. లేదా ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే అసోంలో ఇప్పటికే బిజెపి అధికారంలో వుంది కనుక మరో మరో నాలుగున్నర సంవత్సరాల వరకు పట్టించుకోనవసరం లేదు. త్రిపురలో పాగా వేయాలని చూస్తున్న బిజెపికి ఏదైనా మేలు చేయాలంటే ఇబ్బందులు పడుతున్న త్రిపుర జనానికి పాలక సిపిఎం పై ఆగ్రహం కలగాలి. రాష్ట్రం పట్ల ప్రధాని ఎంత శ్రద్ధ చూపుతున్నారో చూడండి, ఆయన స్వయంగా పట్టించుకున్న తరువాతనే రోడ్డు బాగుపడింది, అధికారంలో వున్న సిపిఎం నాయకత్వంలోని వామపక్ష సంఘటన ప్రభుత్వం ఏమీ చేయించలేకపోయింది, బిజెపి ఆ పని చేసిందనే సానుభూతి అక్కడి జనానికి కలగాలని ఆ పని చేశారా ? ఏమో ?
మన అధికార వ్యవస్ధలో ఒక వూరి ముససబు మరోవూరిలో వెట్టి కంటే హీనం అన్న సామెత గురించి తెలిసిందే. ఒకే ప్రభుత్వంలో ఒక శాఖకు సంబంధించి మరో శాఖ జోక్యం చేసుకుంటే దిగువ స్ధాయి గుమస్తా కూడా ఎందుకు చేయాలని ప్రశ్నించే పరిస్ధితి వుంది. అటువంటిది ప్రధాని ఒక జిల్లా అధికారికి ఫోన్ చేసి మరో రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన అధికారులతో పని చేయించి రోడ్డు మరమ్మతుల పని పురమాయించటం ఏమిటి ? అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోడీకి ఈ చిన్న విషయం కూడా తెలియదా ? రంజుగా చెబుతున్న కథను వినాలే తప్పరామాయణంలో పిడకల వేటలా ఇలాంటివి అడగకూడదేమో ?
తాను ఇప్పటికే అసోం, త్రిపుర ప్రభుత్వాలతో మాట్లాడానని కావాల్సిన సాయం అందుబాటులో వుంటుందని ఐఏఎస్ అధికారితో ప్రధాని చెప్పినట్లుగా కధనం వుంది. అంటే ఎవరి చేత పనిచేయించాలో నిర్ణయించేది ప్రధాని కార్యాలయమా? రాష్ట్ర ప్రభుత్వాలా, జాతీయ రహదారుల సంస్ధా ? నిజంగా ప్రధాని కార్యాలయం ఆ రోడ్డు గురించి అంతకు ముందే సంబంధిత రాష్ట్రాల లేదా జాతీయ రహదారుల సంస్ధ అధికారులతో మాట్లాడినపుడే పని చేయించాల్సిన అధికారిని కూడా నిర్ణయిస్తారా ? పోనీ నిర్ణయించిన తరువాత సంబంధిత రాష్ట్ర, సంస్ధ వున్నతాధికారులు తెలియచేసే లోపే ప్రధాని కార్యాలయం సంబంధిత ఐఏఎస్‌ను కాంట్రాక్టు చేసిందా ? రోజూ ఇలాగే ప్రధాని కార్యాలయం ప్రధానితో అందరితో మాట్లాడిస్తుందా ? తెల్లవారి ఐఏఎస్ అధికారి కార్యాలయానికి వెళ్లే సరికి ఆ సమాచారం అక్కడ వుందట. అదెలా సాధ్యం. అంతకు ముందు రోజు పని వేళల్లో వచ్చి వుంటే తప్ప తపాలాను తెరిచి చూసే వారే వుండరు కదా ? లేదా తెరిచి చూసిన వుద్యోగి అంతటి ముఖ్యమైన సమాచారాన్ని సంబంధిత అధికారికి ఎందుకు చెప్పలేదు ? మరుసటి రోజు సిబ్బందిని తీసుకొని త్రిపుర అధికారి అసోంలో దెబ్బతిన్న రోడ్డు మరమ్మతులు చేయించేందుకు వెళ్లే సరికే అక్కడ అసోం సర్కార్ జెసిబిలను సిద్ధం చేసిందట. కాశీ మజిలీ కధల్లో రాజకుమారులకు, గంధర్వులో ,తపస్సంపన్నమునులో, మారు వేషాలలో వున్న దేవతలు సమకూర్చినపుడు తప్ప ఈ రోజుల్లో అధికార యంత్రాంగానికి ఇలాంటివి సాధ్యమా ?
మొత్తానికి మూడు వందల ట్రక్కుల్లో పరికరాలు, సామాగ్రి వచ్చి నాలుగో రోజుకల్లా రోడ్డు మరమ్మతు పూర్తి అయిందట. కేంద్ర మంత్రి గడ్కరీ ఆ అధికారికి ఫోన్ చేసి ఢిల్లీ వచ్చినపుడు ప్రధాని కార్యాలయానికి రమ్మని ఆహ్వానించారట. ఇదొక ట్విస్టు. పోనీండి సుఖాంతం అయింది. ప్రధాని ఫోన్ చేసింది జూలై 21న అంటే 26వ తేదీ నాటికి రోడ్డు మరమ్మతు పూర్తి అయింది. వెంకయ్య నాయుడికి ఈ సమాచారం తెలిసి వుంటే నరేంద్రమోడీ రెండు సంవత్సరాల పాలనలో సాధించిన విజయాల జాబితాకు దీనిని కూడా జత చేసి సమాచార, ప్రసార శాఖల మంత్రి కనుక వూరూ వాడా టాంటాం చేయించి వుండేవారు.యధాలాపంగా ఈ సమాచారం తెలిసినట్లు దీనిని ఒక నెల రోజుల తరువాత ఒక వెబ్ సైట్ తన కధనంగా రాసింది. అయితే ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరిగిందో కూడా చూడకపోతే ఎలా !
దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన వస్తువులు, ప్రయాణీకుల రవాణాకు కీలకమైన ఈ రహదారికి మరమ్మతులు చేయాలని ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వానికి,అసోం ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేకపోయిందని త్రిపుర రవాణాశాఖ మంత్రి మాణికే డే జూన్ 25న విలేకర్ల ముందు వాపోయారు. అంతకు ముందు త్రిపుర గవర్నర్‌గా వున్న బిజెపి నేత తధాగతరాయ్, త్రిపుర బిజెపి నేతలు కూడా కేంద్ర మంత్రి గడ్కరీ, అసోం ముఖ్యమంత్రితో స్వయంగా మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. కేంద్ర మంత్రి, ప్రభుత్వానికి వందలాది ఇ మెయిల్స్ పంపినా ఒక్కదానికీ సమాధానం రాలేదని డివైఎఫ్‌ఐ నేత చెప్పారు. పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మూడు నెలలుగా రవాణాకు పనికి రాకుండా రోడ్డు చెడి పోయిందని త్రిపుర పిడబ్ల్యుడి శాఖ మంత్రి బాదల్ సరోజ్ చెప్పారు. ఇంకా అనేక సంస్ధలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి.పెట్రోలు, డీజిలు, ఇతర నిత్యావసర వస్తువుల కొరతతో పాటు రోజుల తరబడి వందలాది వాహనాలు నిలిపోవటం గురించి మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.
సరైన రోడ్డు సౌకర్యం లేక కొల్‌కతా రేవు నుంచి బంగ్లాదేశ్‌కు సరకులను రవాణా చేసి అక్కడి నుంచి త్రిపురకు చేర్చిన వుదంతాలు అనేక వున్నాయి. ఇంతటి కీలకమైన రోడ్డు మరమ్మతు గురించి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై త్రిపుర ప్రజలలో తీవ్ర నిరసన వ్యక్తమైన తరువాతే రోడ్డు మరమ్మతు పూర్తయింది.
ప్రధాని ఫోను కధనాన్ని నమ్మేవారు అంతకంటే తీవ్రమైన విషయాల మీద అధికార యంత్రాంగాన్ని కదిలించాలని కోరుతూ ప్రధాని కార్యాలయానికి లేఖలు రాస్తే వుపయోగం, అది ఎలా స్పందిస్తుందో, పనులు ఎంత త్వరగా తెలుస్తాయో స్వానుభవం పొందవచ్చు.