Tags
CPI(M), National Family Health Survey 2015-16 (NFHS-4, NFHS_4 Tripura, Tripura, Tripura Left Front
అవిభక్త ఆంధ్రప్రదేశ్ లేదా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో గానీ పాలకులు ఎంచుకున్న అభివృద్ధి మార్గాలలో ప్రభుత్వరంగంలోని ఆసుపత్రులను నిర్వీర్యం చేసి ప్రయివేటు రంగాన్ని పెంచి పోషించటం. పేదలకు ఆధునిక వైద్యం అందించే పేరుతో ప్రవేశపెట్టిన పధకాలన్నీ ఆచరణలో కార్పొరేట్ ఆసుపత్రుల యంత్రాలు వాటి యజమానులు, యంత్రాల వంటి వైద్యుల జేబులు నింపటానికి తోడ్పడుతున్నాయన్నది కాదనలేని సత్యం. అందుకే ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడులో ప్రభుత్వ ఆసుపత్రులలో 38,48 శాతాల చొప్పున కాన్పులు జరుగుతుంటే త్రిపురలో 69శాతం వున్నాయి. మేఘాలయను పాలించిన వారు ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల శ్రద్ధ తీసుకోలేదు, కార్పొరేట్లు అక్కడికి వెళ్లవు గనుక అసలు ఆసుపత్రులలో జరిగే కాన్పులే 51శాతం వుండగా ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగేవి 39శాతం మాత్రమే వున్నాయి. కుటుంబ ఆరోగ్యం, సంక్షేమం విషయాలలో త్రిపుర ఎంతో పురోగమించింది.
ఎం కోటేశ్వరరావు
కమ్యూనిస్టులు అనగానే అభివృద్ధి చేయరు,తమ వుద్యమాలను కొనసాగించేందుకు పేదలను, పేదరికాన్ని అలాగే వుంచాలని కోరుకుంటారు అన్నది కమ్యూనిస్టు వ్యతిరేకులు చేసే తప్పుడు ప్రచారాలలో ఒకటి. దశాబ్దాల తరబడి ఏనుగువంటి అమెరికా అష్టదిగ్బంధనం చేసినా ఎలుకపిల్లంతటి క్యూబాలో కమ్యూనిస్టుల నాయకత్వాన వైద్యరంగంలో సాధించిన విజయాలేమిటో ప్రజలందరికీ తెలిసిందే. మన దేశంలో రాష్ట్రాలు అంటే మున్సిపాలిటీల కింద లెక్క. అందునా త్రిపుర వంటి గిరిజన ఈశాన్య ప్రాంత రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే గ్రాంట్లు తప్ప స్ధానికంగా ఆదాయం వచ్చే అవకాశాలు నామమాత్రం. అయినా త్రిపుర కుటుంబజీవన పరిస్ధితులను మెరుగు పరచటంలో అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం సాధించిన విజయాలేమిటో ఒక్కసారి చూడండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోల్చుకుంటే అక్కడ జరుగుతున్నదేమిటో చూద్దాం. ఏడుగురు సోదరీ మణులుగా పిలిచే ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటి.అదీ వెనుకబడిన కొండ ప్రాంతమే. అక్కడ ఏ పార్టీ అయినా కమ్యూనిస్టులు కాని వారే పాలకులుగా వున్నారు.అక్కడి పరిస్ధితులు ఎలా వున్నాయో పోల్చుకుంటే కమ్యూనిస్టుల ప్రత్యేకత, జనం పట్ల జవాబుదారీతనం ఏమిటో తెలుస్తుంది. ఈనెల 19న కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16కు సంబంధించి కొన్ని రాష్ట్రాల వివరాలను ప్రకటించింది.
గతంలో కొన్ని వివరాలు సేకరించలేదు కనుక కొన్నింటితో పోల్చుకోలేము కనుక ఆ పరిమితులను గమనంలో వుంచుకోవాలి. గత సర్వే 2005-06లో జరిగింది. వుమ్మడి ఆంధ్రప్రదేశ్ వివరాలు పదేళ్లనాటి సర్వే వివరాలని గమనించాలి. (వు.అ-వుమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపి-ప్రస్తుత ఆంధ్రప్రదేశ్)
ఏపి త్రిపుర తమిళనాడు
1.ఆరేళ్లకు పైబడిన పురుషులలో స్కూళ్లకు వెళ్ళిన వారు 62.0 81.9 77.2
2. పదిహేనేళ్ల లోపు జనాభా 23.7 24.5 23.3
3వెయ్యిమంది పురుషులకు మహిళలు 1020 998 1033
4.గత ఐదేళ్లలో పుట్టిన వెయ్యిమంది పురుషులకు మహిళలు 914 966 954
5.అయోడిన్ వుప్పు వాడుతున్నవారు 81.6 99.1 82.8
6.మెరుగైన మరుగుదొడ్డి వున్నవారు 53.6 61.3 52.2
7.మంచినీటి సౌకర్యం వున్నవారు 72.7 87.3 90.6
8 వంటకు గ్యాస్, విద్యుత్ వాడుతున్నవారు 62.0 31.9 73.0
9.మహిళా అక్షరాస్యులు 62.9 80.4 79.4
10.పురుష అక్షరాస్యులు 79.4 89.5 89.1
11. పదేళ్లకు పైగా చదువుకున్న మహిళలు 34.3 23.4 50.9
12. పద్దెనిమిదేళ్లకు ముందే వివాహమైన యువతులు 32.7 32.2 15.7
13.21ఏళ్లకు ముందే వివాహిత యువకులు 23.5 22.2 17.0
14.ప్రసవ సమయంలో పిల్లల మరణాలు 35 27 21
15.ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 41 33 27
16.ఏదో ఒక కుటుంబనియంత్రణ 69.5 64.1 53.3
17.మహిళలకు ఆపరేషన్లు 68.3 13.9 49.4
18.ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి అదనపు ఖర్చు రు. 2,138 4,412 2496
19.ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు 38.3 69.1 48.1
20.సిజేరియన్ ఆపరేషన్లు 40.1 20.5 34.1
21.ప్రభుత్వ ఆసుపత్రులలో సిజేరియన్లు 25.5 18.1 26.3
22.ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్లు 57.0 73.7 51.3
23.ఎత్తుకు సరిపడా బరువులేని మహిళలు 17.6 18.9 14.6
24.ఎత్తుకు సరిపడా బరువులేని పురుషులు 14.8 15.7 12.4
25.అధిక బరువున్న మహిళలు 33.2 16.0 30.9
26.అధిక బరువున్న పురుషులు 33.5 15.9 28.2
27.పిల్లలలో రక్త హీనత 58.6 48.3 50.7
28.మహిళలలో రక్త హీనత 60.0 54.5 55.1
29.పురుషులలో రక్త హీనత 26.9 24.7 20.6
30.స్త్రీలలో మద్యపానం 0.4 4.8 0.4
31.పురుషులలో మద్యపానం 34.9 57.6 46.7
32.స్త్రీలలో పొగతాగేవారు 2.3 42.2 2.2
33.పురుషులలో పొగతాగేవారు 26.8 67.8 31.7
34.మహిళలలో స్వంతంగా సెల్ వున్నవారు 36.2 43.9 62.0
35.బ్యాంకు ఖాతా వున్న మహిళలు 66.3 59.2 77.0