ఎం కోటేశ్వరరావు
ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్ ఓర్టేగా సర్కార్ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.
1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.
శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.
లాటిన్ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్ సముద్రం ద్వారా అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్ గార్డ్స్ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.
2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్ సాల్వడార్ చైనాను గుర్తించాయి.హొండురాస్ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.