Tags
అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.
ఎం కోటేశ్వరరావు
ఎత్తుగడ, వ్యూహం ఏదైనా వుందా, లేక కొందరు అంటున్నట్లు దుర్బుద్ధి లేకపోవచ్చు, కారణం ఏదైనా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పధకాల పేర్లన్నింటికీ ముందు ‘ప్రధాని’ అని తగిలిస్తున్నారు. ఆ పధకం సఫలమైనా, విఫలమైనా ప్రధానికే ఆ పేరు దక్కుతుంది. ప్రధాని ఎవరంటే నరేంద్ర మోడీ అన్న సులభ తర్కం సామాన్యులకు కూడా తెలుసనుకున్నారేమో వ్యూహకర్తలు. ఇప్పుడు అణు సరఫరా బృందం(ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం పొందటంలో భారత్ ఘోరవైఫల్యం చెందింది అన్న తీవ్ర విమర్శలు ఎక్కువగా వచ్చాయి. అవి ప్రతిపక్షం నుంచేగాక స్వపక్షం, ఏ పక్షానికి చెందినవారి నుంచి కూడా వున్నాయి. ఈ లెక్కన ఈ వైఫల్యాన్ని ఎవరి ఖాతాలో వేయాలి? ప్రధాన మంత్రా, నరేంద్రమోడీనా ?
నరేంద్రమోడీ గద్దె నెక్కిన రెండు సంవత్సరాల తరువాత ప్రభుత్వ విదేశాంగ విధానం కారణంగా అంతకు ముందుతో పోలిస్తే ప్రపంచంలో భారత్ స్ధానంలో మార్పు స్పష్టంగా చూడవచ్చని బిజెపి ప్రతినిధి నలిన్ కోహ్లి ప్రకటించారు. ఒక్క విదేశాంగ విధానంలోనే కాదు అన్ని రంగాలలో స్పష్టమైన మార్పుంన్నారు.ఎన్‌ఎస్‌జిలో భారత్‌కు ఎప్పుడు సభ్యత్వం వస్తుందనేదే మౌలిక సమస్య అని కూడా ఆయన చెప్పారు. పుణ్యం చేసిన వారికి మాత్రమే రాజుగారు వేసుకున్న దేవతా వస్త్రాలు కనిపిస్తాయి మిగతావారికి మరేవో కనిపిస్తాయన్న కధ మాదిరి వుందని ఎవరైనా భావిస్తే అది వేరే విషయం. మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన వైఫల్యం గురించి బిజెపి నేత, వాజ్‌పేయి మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన యశ్వంత సిన్హా చేసిన విమర్శలను కోహ్లీ తోసి పుచ్చారు. అణుసరఫరా బృందంలో సభ్యత్వం ఇవ్వాలనే దరఖాస్తుతో మనం వారి దగ్గరకు వెళ్ల కూడదని, మనకు ఇస్తామన్నది ద్వితీయ శ్రేణి ప్రాతినిధ్యం అంటూ అసలు దానిని మనం అంగీకరించకూడదంటూ ఇప్పటికే భారత్ పొందాల్సిందేదో పొందిందని యశ్వంత సిన్హా చెప్పారు. పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరపకూడదని, మన దౌత్య గుడ్లన్నింటినీ అమెరికా బుట్టలో పెట్టకూడదని కూడా సిన్హా వ్యాఖ్యానించటం విశేషం.
ఎన్‌ఎస్‌జి సభ్యత్వ విషయంలో మోడీ ప్రభుత్వం మరింత మెరుగ్గా సంప్రదింపులు జరిపి వుండాల్సిందని అణుశక్తి సంస్ధ మాజీ అధ్యక్షుడు ఎంఆర్ శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. ఆ సంస్ధలో వ్యతిరేకతను వ్యక్తం చేసే వారి బహిరంగ వైఖరి తెలిసిందేనని, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి)పై సంతకం చేసిన వారికే సభ్యత్వం ఇవ్వాలన్న చైనాతో పాటు అసలు అణుశక్తిపై ఏమాత్రం ఆధారపడనివి కూడా ఆ సంస్ధలో సభ్యులుగా వున్నాయని చెప్పారు. ఈ బృందంలో ఒక్క చైనా తప్ప మిగతా దేశాలన్నీ సానుకూలంగా వున్నందున చైనా దిగిరాక తప్పదని ఎక్కువగా ఆశలు పెట్టుకున్నట్లున్నదని శ్రీనివాసన్ వ్యాఖ్యానించారు. పేకాటలో మన తురుపు ముక్కలను ఎదుటివారికి చూపి చెత్త ఆట ఆడినట్లుగా వుందన్నారు. అణ్వస్త్రవ్యాప్తి నిరోధం విషయంలో మన ఎగుమతుల అదుపు, అణు రక్షణ చర్యలు తిరుగులేనివి అయినప్పటికీ సభ్య దేశాలను ఎంతో ముందుగానే ఒప్పించి వుండాల్సిందని, సభ్యత్వం లేకపోతే సమీప భవిష్యత్‌లో మన పౌర అణుశక్తి కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది వుండదంటూ, 2008లో ఒక దఫాకు పొందిన మినహాయింపుల కారణంగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్,కజకస్తాన్, ఆస్ట్రేలియా వంటి అణు సరఫరా దేశాలతో విజయవంతంగా ఒప్పందాలు చేసుకున్నామని శ్రీనివాసన్ చెప్పారు.
అసలు అణు సరఫరా బృందం ఏమిటి ? అది ఎందుకు, ఎప్పుడు ఏర్పడింది? దానిలో భారత్ సభ్యత్వం పొందటానికి అమెరికా వంటి దేశాలు ఎందుకు సరే అంటున్నాయి, చైనా మరికొన్ని దేశాలు నిబంధనల అమలు గురించి ఎందుకు పట్టుబడుతున్నాయి? మనకు సభ్యత్వం వస్తుందా ? మన అణు కార్యక్రమానికి ఎవరు వ్యతిరేకులు వంటి అనేక ప్రశ్నలు రావటం సహజం.
1974 మే 18వ తేదీన రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్ద మన దేశం తొలి అణుపరీక్ష జరిపింది. దీంతో ప్రపంచం ఒక్కసారిగా వులిక్కి పడింది. కట్టె కొట్టే తెచ్చే అన్నట్లుగా చెప్పుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్ధం చివరి రోజుల్లో జపాన్ లొంగిపోయి చేతులెత్తేసిన స్ధితిలో హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్లు అణు బాంబులను వేసి ప్రపంచాన్ని బెదిరించారు. దాంతో అనేక దేశాలు తాము కూడా అణ్వాయుధాలను సమకూర్చుకొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దీంతో 1958లో ఐర్లండ్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందాన్ని ప్రతిపాదించింది. పది సంవత్సరాల తరువాత 1968లో దానిని అంగీకరించిన దేశాలు సంతకాలు చేయటం ప్రారంభించాయి. వాటిలో నాటి సోవియట్ యూనియన్, అమెరికా, బ్రిటన్, అసలు అణుకార్యక్రమంలేని అనేక దేశాలు వున్నాయి. చైనా, ఫ్రాన్స్ 1992లో మాత్రమే సంతకాలు చేశాయి. అణుకార్యక్రమం కలిగి వుండి అణ్వాయుధ పరీక్షలు చేసిన దేశాలు ఇవి. అయితే ఈ ఒప్పందంపై సంతకాలు చేసే సమయానికి అనేక దేశాలు అణుకార్యక్రమాన్ని కలిగి వున్నాయి. అణువిద్యుత్ కేంద్రాలు కలిగిన ప్రతి దేశం వద్ద అణ్వస్త్రాలు తయారు చేయగలిగిన పరిజ్ఞానం వుంటుందన్నది ఒక గట్టి నమ్మకం. అణుపరీక్షలు జరిపి ఈ ఒప్పందంలో చేరని దేశాలు పాకిస్థాన్, భారత్ మాత్రమే. వుత్తర కొరియా పరీక్షలు జరిపింది, ఒప్పందంపై సంతకాలు చేసింది. అయితే అమెరికా తమతో చేసుకున్న ఒప్పందాన్ని సక్రమంగా అమలు జరపలేదనే కారణంతో అది ఒప్పందం నుంచి వైదొలగింది. ఇజ్రాయెల్ వద్ద కూడా అణుపరిజ్ఞానం వుంది, దీనితో పాటు దక్షిణ సూడాన్ ఎన్‌పిటిపై సంతకాలు చేయలేదు.
1974లో మన దేశం జరిపిన అణుపరీక్షతో అణు సరఫరాలపై ఆంక్షలు విధించాలనే ఆలోచన తలెత్తింది. దాంతో 1975 నవంబరులో లండన్ కేంద్రంగా పలు దేశాలు చర్చలు ప్రారంభించి 1978నాటికి ఒప్పందానికి వచ్చాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలకు అణు సరఫరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయరాదన్నది దానిలోని కీలక షరతు. అయితే ఎన్‌పిటి వునికిలోకి రాకముందే మన దేశానికి కెనడా, అమెరికా అణుసరఫరాలు చేశాయి. 1962లో చైనాతో సరిహద్దు వివాదం తరువాత మన దేశంలో అణుకార్యక్రమం ముమ్మరమైంది. 1968,69 సంవత్సరాలలో మన శాస్త్రవేత్తలు సోవియట్ యూనియన్‌లోని అణు కేంద్రాలను సందర్శించి వచ్చారు. తరువాత 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం,బంగ్లాదేశ్ విముక్తికి పూర్తి తోడ్పాటు ఇచ్చిన కారణంగా మన దేశాన్ని బెదిరించేందుకు అమెరికా తన నౌకా దళంలోని యుఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్ అనే యుద్ధ నౌకను బంగాళాఖాతంలోకి పంపింది. దాంతో మన దేశం సోవియట్ యూనియన్‌తో రక్షణ ఒప్పందం చేసుకొని అమెరికా బెదిరింపులను అడ్డుకుంది. అదే సమయంలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ అణ్వస్త్ర పరీక్ష జరపాలని మన శాస్త్రవేత్తలను ఆదేశించారు. దాని ఫలితమే 1974లో తొలి పరీక్ష. మన పరీక్షలో వుపయోగించిన ప్లుటోనియం అంతకు ముందు మనకు కెనడా అందచేసిన సైరస్ రియాక్టర్‌లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న భార జలాన్ని వుపయోగించి తయారు చేసింది. దాంతో ఆ రెండు దేశాలు మన పరీక్ష పట్ల వ్యతిరేకంగా స్పందించాయి. మనలను అభినందిస్తూ ప్రాన్స్ తొలుత టెలిగ్రాం పంపి తరువాత వుపసంహరించుకుంది. మనదేశం జరిపిన పరీక్షను అణు బ్లాక్‌మెయిల్‌గా పాకిస్థాన్ పరిగణించి తరువాత తన కార్యక్రమాన్ని ముమ్మరం చేసి చివరకు పరీక్ష చేసింది. మన పరీక్ష తరువాత తారాపూర్ అణువిద్యుత్ కేంద్రానికి భార జలసరఫరాలో ఇబ్బందులు పెట్టటం, రెండవసారి వాజ్‌పేయి ప్రధానిగా వుండగా మనం రెండవ పరీక్ష జరిపినపుడు అమెరికా మనపై ఆంక్షలు విధించటం వంటి విషయాలన్నీ తెలిసినవే.
సోవియట్ యూనియన్ కూలిపోయిన తరువాత క్రమంగా మన దేశ విదేశాంగ విధానంలో చోటు చేసుకున్న మార్పులతో అమెరికాకు జూనియర్ భాగస్వాములుగా చేరి లబ్దిపొందాలని మన పాలకవర్గం నిర్ణయించింది. దాని ఫలితమే అమెరికన్లు మనపై ఆంక్షల ఎత్తివేత, యుపిఏ ప్రభుత్వం అమెరికాతో మనకు హానికరమైన ఒప్పందం కుదుర్చుకోవటం, దానిని వ్యతిరేకించిన వామపక్షాలు యుపిఏకు మద్దతు వుపసంహరించుకున్నాయి. వ్యతిరేకించిన బిజెపి ఒప్పంద ఆమోదానికి సహకరించటమే కాదు, ఇప్పుడు అది మరింత గట్టిగా అమలు జరిపేందుకు పూనుకుంది, అనేక రంగాలలో మరింత దగ్గరైంది. గతంలో మనపై ఆంక్షలు విధిస్తూ అమెరికన్ పార్లమెంట్ తీర్మానించింది. మన ప్రభుత్వం అమెరికాకు లబ్ది కలిగించే అణు ఒప్పందం చేసుకొనేందుకు సిద్ధం కావటంతో 2006 దానిని సవరించింది.అంతటితో ఆగలేదు, భారత్‌కు ఒకసారికి అణు సరఫరాలకు మినహాయింపు ఇవ్వాలని స్వయంగా మిగతా దేశాలతో లాబీయింగ్ జరిపి 2008లో ఆమేరకు ఎన్‌ఎస్‌జిలో ఆమోదముద్ర వేయించింది. తరువాత ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం రాబోయే రోజులలో కూడా అణుసరఫరాలు జరపవచ్చు. మన దేశం మరికొన్ని దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. ఆ దేశాలన్నీ ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి మద్దతు ఇస్తామని ఎప్పటి నుంచో చెబుతున్నాయి. ఒకసారి భారత్ సభ్యురాలైన తరువాత ఆ మినహాయింపులను రద్దు చేయటానికి అవకాశం వుండదు. వుదాహరణకు 2010లోనే బరాక్ ఒబామా మన దేశ పర్యటనలో మద్దతు గురించి చెప్పారు. అదే ఏడాదిఫ్రెంచి అధ్యక్షుడు సర్కోజీ కూడా అదే చెప్పాడు. రష్యా కూడా కొన్ని షరతులతో మద్దతు ప్రకటించింది.నరేంద్రమోడీ ప్రధాని అనే అంశం వూహా మాత్రంగా లేనపుడే ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ ఈ రెండు సంవత్సరాలలో మా మోడీయే ఇదంతా చేశారని భక్తులు ఎవరైనా చెప్పుకుంటే చేయగలిగిందేమీ లేదు. మెయ్యబోతే ఎద్దుల్లో దున్నబోతే దూడల్లో అన్నట్లు కాకుండా సభ్యత్వానికి రంగం సిద్ధం చేశారని గొప్పలు చెప్పుకోవటమే కాదు, వైఫల్యానికి కూడా బాధ్యత వహించాలి. శ్రీనివాసన్ చెప్పినట్లు చైనా, మరికొన్ని దేశాల వైఖరి మోడీ కంటే ముందే ప్రపంచానికి సువిదతం. మనకు సభ్యత్వం రాకుండా అడ్డుకుందని ఆరోపణలకు గురైన చైనా ఎన్‌ఎస్‌జిలో చేరింది 2004లోనే, అంతకు ముందు మనకు ఎందుకు సభ్యత్వం తెచ్చుకోలేకపోయాం అని కూడా ఆలోచించాలి. ఓడలో వున్నంత వరకు ఓడ మల్లయ్య దిగిన తరువాత బోడి మల్లయ్య అన్నట్లు 2008లో తనకు అవసరం గనుక మనకు మినహాయింపులు రావటానికి అమెరికా తన శక్తి మొత్తాన్ని వినియోగించింది. ఇప్పుడు అలాంటి ప్రయత్నం దానివైపు నుంచి రాలేదు, మేం సిద్దం మిగతా అందరి మద్దతు మీరే కూడగట్టుకోండి, మేం ఓటింగ్ సమయంలో మాత్రమే వస్తాం అన్నట్లుగా వుంది. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లుగా ఒక వేళ చైనా, ఇతర దేశాలు అంగీకరిస్తే అది తమ ఘనతే అని చెప్పుకొనేందుకు లేకపోతే వారే కారణం అంటూ మనలో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు ఈ అవకాశాన్ని అమెరికా వినియోగించుకుంది.తమ ప్రధాని భారత్‌కు సభ్యత్వం ఇవ్వరాదని 17దేశాలకు లేఖలు రాసిన కారణంగానే రాలేదని పాక్ ప్రధాని సలహాదారు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు.చైనాతో పాటు అభ్యంతరం తెలిపిన వాటిలో బ్రెజిల్, టర్కీ, దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్, మెక్సికో కూడా వున్నాయి. ఇవేమీ చిన్నా చితకా దేశాలు కాదు, మనతో శతృత్వం వున్నవీ కాదు.
పోనీ నరేంద్రమోడీ అంతా రంగం సిద్దం చేస్తే చివరి క్షణంలో చైనా, మరికొన్ని దేశాలు అడ్డుపడ్డాయనుకుందాం. వాటిని ఒప్పించేందుకు మోడీ ఎందుకు ప్రయత్నించలేదు, ప్రయత్నిస్తే ఈ భంగపాటు ఎందుకు కలిగేది, లేదా ముందే తెలిసి వుంటే దాదాపు సభ్యత్వం వచ్చినట్లే అనే హంగామా ఎందుకు సృష్టించారు.లేదా యశ్వంత సిన్హా చెప్పినట్లు సలహాదారులు తప్పుదారి పట్టించారా? దేశానికి మోడీ లేదా ఆయన మద్దతుదార్లు వివరించాలి.
సియోల్ సమావేశంలో చైనా అడ్డుకుంది గనుక కొద్దిలో తప్పిందిగానీ తదుపరి మనకు రావటం ఖాయం అన్న పద్దతుల్లో మన ప్రభుత్వం ఇప్పుడు వుంది. నిజానికి ఆ సమావేశంలో అసలు మన సభ్యత్వం అజెండాలోనే లేదు. భారత దరఖాస్తు గురించి చర్చించరాదని చైనా అభ్యంతర పెట్టింది, మరో ఏడు దేశాలు పాకిస్తాన్ కూడా దరఖాస్తు చేసుకుంది దానిపట్ల ఎటువంటి వైఖరి తీసుకోవాలి,ఎన్‌పిటిపై సంతకం చేయని దేశాల పట్ల అనుసరించాల్సిన వైఖరి ఏమిటనే మౌలిక సమస్యలను లేవనెత్తాయి. దీంతో చివరకు ఎలాంటి నిర్ణయం జరగకూడదనే షరతుతో భారత దరఖాస్తును అజెండాలో చేర్చేందుకు చైనా, మిగతా దేశాలు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇది జరిగింది కనుక తదుపరి సభ్యత్వం రావటమే తరువాయి అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు.
నాలుక నాది కాదు కనుక తాటి పట్టెతో గీసుకోమన్నట్లుగా చైనా వైఖరి తెలిసి వుండి కూడా మన దేశాన్ని అమెరికా ముందుకు నెట్టిందా ? అంతర్జాతీయ రాజకీయాలు అందునా ఇరుగు పొరుగుదేశాలతో సమస్యలు వున్నపుడు ఎలా వ్యవహరించాలో, ఎన్‌పిటిపై సంతకం చేయని దేశానికి సభ్యత్వం ఇవ్వకూడదనే నిబంధన అమలులో వుండగా మన దేశానికి లేదా పాకిస్థాన్‌కు రెండు దేశాలకు ఇవ్వటంలో వున్న సంక్లిష్టతలను మన విధాన నిర్ణేతలు పరిగణనలోకి తీసుకోలేదా ? లేదా అమెరికా వంటి దేశాలు మద్దతు ఇచ్చిన తరువాత నల్లేరు మీద బండి మాదిరి అందరూ దారిలోకి వస్తారనే ధీమాతో వున్నారా ?
చైనా పట్ల ఇటీవలి కాలంలో ముఖ్య ంగా గత రెండు సంవత్సరాలలో నరేంద్రమోడీ సర్కార్ వ్యవహరించిన తీరు తెన్నుల గురించి మన మాజీ రాయబారి, విదేశీ వ్యవహారాల విశ్లేషకుడు ఎంకె.భద్ర కుమార్ కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఏడాది కాలంగా ఏ మాత్రం పట్టించుకొని నరేంద్రమోడీ చివరి నిమిషంలో చైనా అధ్యక్షుడు గ్జీ జింపింగ్‌ను కలుసుకొనేందుకు తాష్కెంట్ ఎందుకు వెళ్లారన్నదానికి ఎలాంటి వివరణ లేదు. చైనా పట్ల సౌత్ బ్లాక్(ప్రధాని, విదేశాంగ శాఖ, రక్షణ వంటి ముఖ్యశాఖలున్న భవనం) అసహ్యకర విధానాలు అనుసరించిందని భద్రకుమార్ వ్యాఖ్యానించారు. కొన్ని వుదాహరణలను ఆయన పేర్కొన్నారు. శ్రీలంకలో అధికార మార్పిడి, మోడీ-బరాక్ ఒబామా సంయుక్తంగా ఆసియా పసిఫిక్ సంయుక్త ప్రకటన, జపాన్ ప్రధాని షింజేతో మోడీ సయ్యాటలు, వియత్నాంకు ఆయుధాలు, మలబార్ తీరంలో జపాన్‌తో కలసి సైనిక విన్యాసాల విస్తరణ, విదేశాంగ మంత్రుల స్ధాయిలో అమెరికా-భారత్-జపాన్ త్రిపక్ష చర్చలు, చైనాలోని అఘిర్ ఇస్లామిక్ వేర్పాటువాదులకు వీసాలు ఇవ్వటం, దక్షిణ, తూర్పు చైనా సముద్రంలో భారత నౌకాదళాన్ని కొనసాగించటం, వియత్నాంకు బ్రహ్మూెస్ క్షిపణులు అందచేస్తామని బెదిరించటం వంటి చైనాకు ఇష్టం లేని చర్యలకు గత ఏడాదిన్నరకాలంగా అనుసరించారని భద్రకుమార్ పేర్కొన్నారు. చైనా కీలకమైన ప్రయోజనాలపై దాడి చేయటం ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల కారణంగా చైనా వైఖరి కఠినతరమైందని, తాష్కెంట్‌లో మోడీ ప్రత్యక్షంగా దానిని రుచి చూశారన్నారు. అమెరికాతో కలసి 21వ శతాబ్దంలోనిర్ణయాత్మక భాగస్వామ్య సమావేశాలకు హాజరవుతున్నంత కాలం దేవుడు తన స్వర్గంలోనే వున్నాడని, అంతా మంచే జరుగుతుందనే ప్రగాఢ భావనలోకి భారత్ వెళ్లిపోయిందని, ఏక ధృవ ప్రపంచ భావన నుంచి విడగొట్టుకోవటానికి రెండు సంవత్సరాల క్రితం నరేంద్రమోడీ ప్రధాని వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవటమే గాక తానే దానికి బలయ్యారు.మోడీ విశ్వసించిన ఆయన సిబ్బంది ద్వారా అమెరికన్లు భారత విదేశాంగ విధానాలను నిర్ణయిస్తున్నారంటే అది అమెరికన్ల తప్పుకాదు, అలా జరగటానికి ఆయనే అవకాశం ఇచ్చారు.అమెరికన్ల బలం గురించి వున్న విశ్వాసం మనల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది, ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం గురించి ముందుగా ప్రతిపాదించి మనలను 2010 ముందుకు నెట్టిన అమెరికా ఇప్పుడు దానిని భారత-చైనా వివాదంగా మార్చటంలో జయప్రదమైంది, హిమాలయాన్ని అధిరోహించేందుకు ఏర్పాట్లు చేసే బాధ్యతను భారత్‌పైనే పెట్టింది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనేక మంది చేసిన విమర్శలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని అందుకు అనుగుణ్యంగా మన ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ ఇరుగు, పొరుగు , ఇతర అన్ని దేశాలతో సఖ్యతగా వ్యవహరించినపడే ఇలాంటి ఎదురుదెబ్బలు తప్పుతాయి. తన ప్రయోజనాలకు మాత్రమే పెద్ద పీట వేసే అమెరికా దౌత్యపరంగా అనేక ఎదురు దెబ్బలు తింటున్నది. దాని వెనుక నడిస్తే మనకూ తప్పవు.