Tags
#Pinarayi Vijayan, Arif Mohammed Khan, BJP, Kerala LDF, Narendra Modi, Pinarai Vijayan, RSS, Subramanya swamy
ఎం కోటేశ్వరరావు
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తనకు పదవి ఇచ్చిన కేంద్ర పెద్దలను సంతుష్టీకరించేందుకుగాను నానా పాట్లు పడుతున్నారు. దానిలో భాగంగానే ఎవరేమనుకుంటే నాకేటి అన్నట్లుగా పేట్రేగుతూ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంతో ఘర్షణకు దిగుతున్నారు. పచ్చి అవాస్తవాలు కూడా చెబుతున్నారు. ఈ పూర్వరంగంలో అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి కేంద్ర నేత సుబ్రమణ్య స్వామి మరింతగా రెచ్చిపోయారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ వెంట్రుకను ముట్టుకున్నా ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని నరేంద్రమోడీని ఒక ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు.” రాజ్యాంగం ప్రకారం కేరళ గవర్నర్ అంటే భారత రాష్ట్రపతి ప్రతినిధి అని కేరళలోని వెర్రి కమ్యూనిస్టులు తెలుసుకొనేట్లు చేయండి. ఒక వేళ గవర్నర్ వెంట్రుకను ముట్టుకున్నా మొత్తం ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు సిద్దం కావాలని మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను ” అని ఒక ట్వీట్ చేశారు. తాజా వివాదానికి వస్తే రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో యుజిసి నిబంధనలను పాటించని కారణంగా వారంతా రాజీనామా చేయాలని గవర్నర్ ఆదేశించారు. దీని గురించి పరోక్షంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి కెఎన్ బాలగోపాల్ చేసిన సాధారణ విమర్శ తన గురించే అని ఊహించుకొని ఏకంగా మంత్రిని తొలగించాలని లేఖ రాశారు.
కేరళ విశ్వవిద్యాలయంలో జరిగిన సభలో బాలగోపాల్ మాట్లాడుతూ ” ఉత్తర ప్రదేశ్ వంటి చోట్ల ఉన్న పరిస్థితులకు అలవాటు పడి అక్కడి నుంచి వచ్చిన కొందరికి కేరళ విశ్వవిద్యాలయాలు ప్రజాస్వామికంగా పని చేస్తున్న తీరును అర్ధం చేసుకోవటం కష్టం. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ భద్రతా సిబ్బంది ఐదుగురు విద్యార్దుల మీద కాల్పులు జరిపారు. నేను అప్పుడు ఎంపీగా ఉండి అక్కడికి వెళ్లాను. వైస్ ఛాన్సలర్‌కు 50 నుంచి 100 మంది వరకు భద్రతా సిబ్బంది ఉన్నారు.అక్కడి అనేక విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి అది.” అన్నారు. గవర్నర్ ఖాన్ పేరు ప్రస్తావించినట్లుగా ఏ పత్రిక కూడా వార్తలు ఇవ్వలేదు. కానీ ఆమాటలను తనకు వర్తింప చేసుకొని, మంత్రిగా బాలగోపాల్ చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించినందున తాను ఇచ్చిన సమ్మతిని వెనక్కు తీసుకుంటున్నానని, దానికి అనుగుణంగా వ్యవహరించాలని అక్టోబరు 25న ఒక లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. దాన్ని విజయన్ తిరస్కరించుతూ, గవర్నర్‌కు అలాంటి అధికారం లేదని, బాలగోపాల్ మంత్రిగా కొనసాగటానికి గవర్నర్ అనుమతి అవసరం లేదు కనుక ఎలాంటి చర్య అవసరం లేదని అన్నారు. తొలగించాలన్న పదాన్ని గవర్నర్ పేర్కొనకపోయినా మంత్రిని తొలగించాలన్నదే దాని తార్కిక ముగింపు.
ముఖ్యమంత్రి గనుక మంత్రిని తొలగించకపోతే ఎవరో ఒకరు కోర్టుకు వెళతారని శుక్రవారం నాడు ఢిల్లీలో గవర్నర్ ఖాన్ ది ప్రింట్ పత్రిక ప్రతినిధితో చెప్పారు. ఆర్ధిక మంత్రి బాలగోపాల్‌ను తొలగించాలని తాను కోరలేదని, తన సమ్మతి లేకుండా పదవిలో కానసాగే అవకాశం లేదని రాజ్యాంగం చెప్పిన దానిని కేవలం వివరించానని గవర్నర్ వివరించారు. తన లేఖ మీద నిర్ణయం ముఖ్యమంత్రి విచక్షణకు సంబంధించిందని, అయితే ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ప్రమాణం చేయించాల్సింది గవర్నర్,నేనాపని చేశాను. దేశ ఐక్యత సమగ్రతలను కాపాడతానని అతను ప్రమాణం చేశాడు. అతను( బాలగోపాల్ ) దాన్ని ఉల్లంఘించారు. విద్యావ్యవస్థను ఉత్తర దక్షిణాలుగా విభజిస్తే అది ఉల్లంఘన కాదా ! అతనికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఒక కేంద్ర విశ్వవిద్యాలయం అని కూడా తెలియదు, అంతేకాదు దాని వైస్ ఛాన్సలర్లను ఉత్తరాది నుంచి గాక దక్షిణాది నుంచి నియమిస్తారు అని గవర్నర్ చెప్పారు.( ఆ విశ్వవిద్యాలయ ప్రస్తుత వైస్ ఛాన్సలర్ సుధీర్ కె జైన్.2000 సంవత్సరంలో తెలుగువాడైన విసి సింహాద్రి, 2003లో పచ్చా రామచంద్రరావు పనిచేశారు. వారికి ముందు 1952 వరకు-తరువాత జాబితాను చూస్తే ఉత్తరాది, ఇతర ప్రాంతాల వారు, ఒకరిద్దరు తప్ప దక్షిణాది వారు కనిపించరు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు ఈ అంశాలు తెలియవనుకోవాలా ? లేక బుకాయించారా. జాబితాను ఎవరైనా చూడవచ్చు. ) తనకు కేరళలోని ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తున్నారని గవర్నర్ చెప్పుకున్నారు.
వైస్ ఛాన్సలర్లు రాజీనామాలు సమర్పించాలని తాను సూచించానే తప్ప ఉత్తరువులు ఇవ్వలేదని, తన సూచనలను నిర్ణీత గడువులో ఖాతరు చేయనందున సంజాయిషి కోరుతూ నోటీసులు జారీ చేశానని గవర్నర్ చెప్పారు. తన మార్గదర్శకాలను కోర్టు పక్కన పెట్టిందని చెప్పటం తప్పని గవర్నర్ అన్నారు. కేసు విచారణ రోజున విసిలకు పదకొండు గంటల వరకు గడువు ఇచ్చానని ఎలాంటి స్పందన లేకపోవటంతో 11.30 నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. అదే రోజు కోర్టు సాయంత్రం నాలుగు గంటలకు విచారించిందని అప్పటికే నోటీసులు జారీ చేశానని అన్నారు. సమాధానం చెప్పేందుకు వారికి నవంబరు మూడవ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు చెప్పారు.
గవర్నర్ చేస్తున్న పనులన్నీ సంఘపరివార్ అజెండా మేరకే ఉన్నాయని, తన పదవిని దుర్వినియోగం చేస్తున్నందున నవంబరు 15న రాజభవన్ ఎదుట, జిల్లా కేంద్రాలలో ఎల్‌డిఎఫ్ నిరసన తెలుపుతుందని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ప్రకటించారు. రాజభవన్ వద్ద సిఎం కూడా పాల్గొంటారని వెల్లడించారు. విశ్వవిద్యాలయాల స్వతంత్ర ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని, విసిలను తరచూ బెదిరిస్తున్నారని అన్నారు. ఏదో విధంగా సెనెట్, సిండికేట్లలో ఆర్‌ఎస్‌ఎస్ వారిని దూర్చేందుకు చూస్తున్నారని, వాటిని సాగనివ్వబోమని అన్నారు. నవంబరు రెండవ తేదీన భావ సారూప్యత కలిగిన వారితో పెద్ద సభ నిర్వహిస్తామని, పదవ తేదీలోగా జిల్లాల్లో సభలు, పన్నెండవ తేదీన కాలేజీల్లో జరుగుతాయని చెప్పారు.
గవర్నర్ విధుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదని, అంతకు మించి ఇతర అధికారపరిధిలోకి ఒక్క అంగుళం మేర ప్రవేశం గురించి కూడా ఊహించుకోవద్దని, తలదూర్చుదామనుకుంటే కుదరదని ముఖ్యమంత్రి పినరయి విజయన్ హితవు చెప్పారు.వ్యక్తిగత హౌదాతో పని చేసేందుకు గవర్నర్లకు అధికారాలు లేవని స్పష్టం చేశారు. వైస్ ఛాన్సలర్ల రాజీనామా కోరటం లేని అధికారాన్ని చెలాయించ చూడటమే అన్నారు. కెటియు వైస్ ఛాన్సలర్ నియామకాన్ని కోర్టు కొట్టివేయటాన్ని అవకాశంగా తీసుకొని తొమ్మిది మంది విసీలను తప్పు కోమని కోరుతున్నారని, ఒక వేళ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగితే నియమించే అధికారర ఉన్న గవర్నర్‌దే దానికి దానికి ప్రాధమిక బాధ్యత అవుతుందని అన్నారు. కెటియు విసి ఉదంతంలో అకడమిక్ అర్హతలు లేవని సుప్రీం కోర్టు చెప్పలేదని, అనుసరించిన పద్దతిని మాత్రమే పరిగణనలోకి తీసుకుందని, ఈ వివాదం హైకోర్టులో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, సుప్రీం తీర్పును సమీక్షించాలని పిటీషన్ వేసే అవకాశం ఉందని, ఈ లోగా దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నర్ రాష్ట్రం మొత్తంలో యంత్రాంగాన్ని అస్థిరపచేందుకు చూస్తున్నారని సిఎం చెప్పారు. సుప్రీం తీర్పు ఒక్క కెటియుకే పరిమితమని అన్నారు.
వైస్ ఛాన్సలర్లను తొలగించేందుకు రెండు కారణాలుండాలని వాటిలో నిధుల దుర్వినియోగం, చెడునడతకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తే వాటి మీద హైకోర్టు లేదా సుప్రీం కోర్టు జడ్జి విచారణ జరిపి నిర్దారిస్తేనే తొలగించాలి తప్ప ఛాన్సలర్లకు తొలగించే అవకాశం లేదని ముఖ్యమంత్రి విజయన్ చెప్పారు. గవర్నర్ తీరు ప్రజల తీర్పునే అవమానించేదిగా ఉంది.అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించకుండా నిలిపివేయటం, రాజ్యాంగమిచ్చిన అధికారాల మేరకు ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌లను సకాలంలో ఆమోదించకపోవటంతో పదకొండింటికి గడువు ముగిసింది.2019లో గవర్నర్‌గా వచ్చిన దగ్గర నుంచీ ఏదో ఒక వివాదాన్ని గవర్నర్ ముందుకు తెస్తున్నారు. మంత్రి వర్గం రూపొందించిన ప్రసంగాన్ని చదివేందుకు తిరస్కరించి తన స్వంత ప్రసంగం చేశారు. తాను కోరిన అధికారిని విధుల నుంచి మార్చకపోతే గవర్నర్ ప్రసంగ ప్రతిపై సంతకాలు చేసేది లేని భీష్మించారు. మంత్రుల నియామకం, తొలగింపులో గవర్నర్లకు విచక్షణ అధికారాలు లేవు. గవర్నర్ ఖాన్ విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంపై ప్రారంభించి, సెనెట్, సిండికేట్ మెంబర్స్, చివరికి విసీలను కూడా రచ్చ చేస్తున్నారు. పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సంఘపరివార్ శక్తులు అడుగుపెట్టిన జెఎన్‌యు, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో జరిగిందేమిటో తెలిసిందే, కేరళ సంస్థలను కూడా అలాంటి వారితో నింపేందుకు చూస్తున్నారని ఎల్‌డిఎఫ్ విమర్శిస్తోంది.
గవర్నర్ తీరుతెన్నులను కాంగ్రెస్ కూడా విమర్శించింది. ప్రశ్నించటానికి వీల్లేని దేవుడేమీ కాదు అంటూ ప్రతిపక్ష నేత విడి సతీషన్ చెప్పారు. మంత్రిని తొలగించాలనే అధికారం గవర్నర్‌కు లేదన్నారు. దేశ చరిత్రలో ఇంతవరకు ఎక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. మంత్రి తొలగింపు కోరుతూ గవర్నర్ రాసిన లేఖకు పూచికపుల్లకున్న విలువ కూడా లేదని మాజీ మంత్రి, సిపిఎం నేత థామస్ ఐజాక్ అన్నారు. ఈ వివాదం చివరకు ఏమౌతుంది, ఎలా ముగుస్తుందన్నది చూడాల్సి ఉంది.
.