Tags
ANDHRA PRADESH Politics, BJP, CHANDRABABU, Janasena, P&K, pavan kalyan, tdp, Ycp, YS jagan
ఎం కోటేశ్వరరావు
కొత్త సర్కార్‌కు ఈ మధ్యనే ఆరు నెలలు నిండాయి. అసాధారణ పరిస్ధితులు ఏర్పడితే తప్ప ఇప్పుడప్పుడే ఎన్నికలు రావు. అయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో వేడి పుడుతోంది. ఇది ప్రకటనలకు ఆవేశ, కావేషాలకే పరిమితం అవుతుందా ? అంతకు మించుతుందా ? ఆంధ్రప్రదేశ్ రాజకీయ చదరంగంలో ఎలా గెలవాలా అని ప్రతిపక్షాలు చూస్తుంటే ప్రత్యర్ధులను ఎలా కట్టడి చేయాలా అని సహజంగానే అధికారపక్షం ప్రయత్నిస్తుంది.ఈ క్రమంలో ఎత్తులు పై ఎత్తులు సహజం.
ఆరునెలల క్రితం జరిగిన ఎన్నికలకు ముందు వైసిపి-బిజెపి బంధం గురించి తెలుగుదేశం మైండ్ గేమ్ ఆడింది. ఇప్పుడు వైసిపి నాయకత్వం ఆడుతున్న ప్రతి క్రీడలో భాగంగా బిజెపి-తెలుగుదేశం-జనసేన బంధాన్ని ముందుకు తెస్తోంది. గత ఎన్నికల్లో జనసేన-వామపక్షాలు సర్దుబాట్లతో ఐక్యంగా పోటీ చేశాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఏ పార్టీతోనూ కలసి కార్యాచరణ చేపట్టకూడదని జనసేన నాయకత్వం నిర్ణయించినపుడే ఆ పార్టీ వామపక్షాలకు దూరంగా ఉండదలచుకున్నదని తేలిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో ఏమి జరగనున్నది అనే చర్చకు తెరలేచింది. వైసిపికి తామే అసలైన ప్రతిపక్షమని బిజెపి నేతలు ప్రకటించారు.బిజెపితో తెలుగుదేశం పార్టీ సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వాటి ఆధారంగా నిర్ధారణలకు రావటం, జోశ్యాలు చెప్పాల్సిన అవసరం లేదు.అవి కలసినా, విడిగా వున్నా సంఖ్యా పరంగా వైసిపికి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. ఇక బిజెపితో పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ సంబంధాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు వచ్చినా వారే చెబుతున్నారు గనుక తలలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు.
‘బిజెపికి నేను ఎప్పుడు దూరమయ్యాను? దగ్గరగానే ఉన్నా. రాష్ట్రానికి ప్రత్యేక హౌదా కోసం కేండ్రంతో విభేదించాను. అమిత్‌షా అంటే నాకు అమితమైన గౌరవం. వైసిపి వాళ్లకు ఆయనంటే భయం.’ అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుపతి విలేకర్ల సమావేశంలో చెప్పారు. దేశ ప్రజలు బిజెపిని మంచి మోజార్టీతో రెండోసారి అధికారంలో కూర్చోబెట్టారు. మోడీ అమిత్‌షా దేశ ప్రయోజనాలు, దేశ రక్షణ కోసం పాటుపడుతున్నారు. నేను సెక్యులరిస్టును. ఓట్లు వచ్చినా, రాకపోయినా నేను నమ్మే హిందూ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను. జగన్ నివాసానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా పుష్కర ఘాట్‌లో సామూహిక మత మార్పిడి చేస్తుంటే ఆయనకు తెలియదా? ఎవరి అండ చూసుకొని 40 మందిని సామూహిక మతమార్పిడి చేశారో చెప్పాలన్నారు. హిందూధర్మ పరిరక్షణ గురించి నేను మాట్లాడితే, దాన్ని వక్రీకరించి వైసిపి అసత్య ప్రచారం చేసింది. ఎవరైనా సరే మత విశ్వాసాలను గౌరవించి తీరాల్సిందే అన్నారు. ‘మీరు టిడిపి, బిజెపితో పొత్తు పెట్టుకుంటారా?’ అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘చెప్పలేం… ఉండొచ్చు ఏమో…’ అంటూ సమాధానం దాటవేశారు. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి దళిత, బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని, రెండోసారి అధికారం కోసం ఎవరిని పక్కన పెట్టి పార్టీని స్థాపించించారో ఆ బ్రాహ్మణులను అక్కున చేర్చుకున్నారని. రాజకీయాలు ఇలా ఉంటాయంటూ సమాధానం చెప్పారు.
జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎన్నికలకు ముందే పవన్ కల్యాణ్‌ని అడిగామని, అప్పుడు ఆయన ఒప్పుకోలేదని భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు. ఇప్పుడు ఏమైనా పవన్ కల్యాణ్ మనసు మారి ‘జనసేన’ను భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే ఆలోచన ఉంటే తప్పనిసరిగా స్వాగతిస్తామని చెప్పారు.’మా నాయకత్వం కొత్త ఒరవడిని తీసుకురావడానికి ఇష్టపడుతోంది. కేవలం రాజకీయ కారణాలతో ఆరడుగుల బుల్లెట్ (పవన్ కల్యాణ్)ను మా భుజాలపై నుంచి సంధించాలని వేరే వారు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఎందుకంటే, పొత్తులు పెట్టుకునే సమయం కాదు ఇది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగడానికి ఇంకా నాలుగున్నర సంవత్సరాల వ్యవధి వుంది. మాతో కలిసి పనిచేయదలచుకున్న పార్టీలు ఏవైనా విలీనం కాదలచుకుంటే స్వాగతిస్తాం.లేదా కలిసి పనిచేసేలా ప్రయత్నిస్తాం’ అని జీవీఎల్ పేర్కొన్నారు.
తిరుపతి వెంకన్న సాక్షిగా పవన్ చెప్పిన మాటలు, బిజెపి నేత జివిఎల్ నరసింహారావు స్పందన గురించి వేరే వ్యాఖ్యానాలు అవసరం లేదు. గతంలో సినిమా సమీక్షలు రాసేవారు కథంతా వివరించి చిత్ర ముగింపు ఎలా ఉంటుందో చెప్పకుండా ఆసక్తిని కలిగించేందుకు ప్రయత్నించేవారు. ఇప్పుడు బిజెపి-జనసేన మధ్యలో తెలుగుదేశం అన్నట్లుగా ఉంటుందా ? బిజెపి-జనసేన విలీనం అవుతాయా, మిత్రపక్షాలుగా ఉంటాయా అన్నది కూడా త్వరలోనే స్పష్టం అవుతుంది. అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలైన కాంగ్రెస్-బిజెపిలతో సఖ్యతను చూస్తే కాంగ్రెస్ నుంచి విడిపోయిన శక్తులు తిరిగి దానితో సర్దుబాటు చేసుకున్నా ప్రత్యేక పార్టీలుగానే కొనసాగి బేరసారాలు జరుపుతున్నాయి.
చిన్న పార్టీలను కాంగ్రెస్ ఎలా మింగివేసిందో గత అనుభవం ఉంది గనుక బిజెపి విషయానికి వస్తే ప్రాంతీయ పార్టీలు ముందు నుంచి తగుజాగ్రత్తలతో వ్యహరిస్తున్నాయి. రెండు పెద్ద జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలు విలీనం అయితే ముద్రవేయించుకొని మందలో కలవటం తప్ప చేసేదేమీ ఉండదని ప్రజారాజ్యం నేత చిరంజీవి అనుభవం తెలిసిందే. అన్నింటికీ మించి విడిగా ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు బేరసారాలాడే శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతకు మించి ఎప్పుడు ఎటుకావాలంటే అటు సులభంగా దూకే సౌలభ్యం ఉంటుంది. అందుకు మహారాష్ట్ర శివసేన చక్కటి ఉదాహరణ. హిందూత్వ విషయంలో విడదీయలేని బిజెపితో పోటీ పడిన ఆ పార్టీ అధికారం విషయంలో పేచీకి దిగి ఎన్‌సిపి-కాంగ్రెస్ కూటమితో ఎలా చేతులు కలిపిందో చూశాము. దీన్ని చూసిన తరువాత ఏ పార్టీ ఎప్పుడు దేనితో చేతులు కలుపుతుందో చెప్పలేని స్ధితి ఏర్పడింది. ఎవరి తురుపు ముక్కలను వారు తమ దగ్గరే పెట్టుకొని జూదం ఆడతారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ జనసేన నేత పవన్ కల్యాణ్‌ను తెలుగుదేశం పార్టీనేత చంద్రబాబు నాయుడు వెనుక తిరిగే హచ్ కుక్క వంటి వాడని వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి కొడాలి నాని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లుచ్చాగాడు అని సంబోధించారు. గతంలోకి వెళితే 2016 రైతు భరోసా యాత్రలో వైఎస్జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నవనిర్మాణ దీక్షల గురించి చంద్రబాబు చెప్పింది నిజంగా జరగాలంటే చంద్రబాబు నాయుడిని ఎక్కడ కనపడితే అక్కడ చెప్పులతో కొట్టాలన్నారు. చంద్రబాబు సిగ్గుమాలిన మనిషి, నారాసురుడు అని జగన్ అంటే, వైఎస్ఆర్ దొంగలు అని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా విన్నారు, కన్నారు. ఇవన్నీ చూసినపుడు రాష్ట్ర రాజీకీయాల్లో నోరుబట్టని బూతులు, కూతలు నిత్యకృత్యమయ్యాయి.రాబోయే రోజుల్లో బూతులతో పాటు మత,కులాల అంశాలను మరింతగా ముందుకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
బూతులు ఎవరు మొదలు పెట్టారు, ఎవరు ఎంత సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు అన్నది నేడు గ్రామాలలో రచ్చబండ చర్చల్లో రచ్చ అవుతోంది. ఏ పార్టీ అభిమానులు ఆ పార్టీ నేతల బూతులను నిస్సిగ్గుగా సమర్ధిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల ఉన్మాదంతో ఊగిపోతున్నారు. దాన్నింకా పెంచేందుకు నేతలు బూతుల పంచాంగాలను మరింత శ్రావ్యంగా వినిపిస్తున్నారు. ఇలా బూతులు మాట్లాడటం తప్పనే జ్ఞానం ఎక్కడా కనిపించటం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆయన అనుయాయుల మీద తమ అనుచరుల నోటి దురుసుతనాన్ని విని ఆనందిస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ మీద తన మంత్రులు, ఇతర నేతల బూతులు, కూతలను చూసి వైఎస్ జగన్మోహనరెడ్డి మహదానందం పొందుతున్నట్లు కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రంలో ఇలాంటి వాతావరణం ఉందంటే మన నేతలకు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో ఎలాంటి గౌరవం దక్కుతుందో చెప్పనవసరం లేదు. తెలుగు సమాజం ఇలాంటి వారిని ఎలా భరిస్తున్నదని ప్రశ్నించే రోజులు రాబోతున్నాయి. ఎవ్వరేమనుకుంటేనేమి నాకేటి సిగ్గు అనుకుంటే చేసేదేముంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకీ పరిస్ధితి, ఎందుకీ దిగజారుడు ? గతంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, స్వతంత్రపార్టీ వంటివి అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నపుడు ఇలాంటి దిగజారుడుతనం లేదు. రాజకీయ వైరం తీవ్రంగా ఉన్నప్పటికీ పరస్పర నిందలు లేవు. ఎన్‌టి రామారావు రాజకీయ రంగంలోకి వచ్చినపుడు కుక్కమూతి పిందెలు అని చేసిన విమర్శకు మమ్మల్ని ఇంతలా నిందిస్తారా అని కాంగ్రెస్ వారు నొచ్చుకున్నారు. ఇప్పుడు వెలువడుతున్న పదజాలంతో పోల్చితే నిజానికి ఆ విమర్శ పార్లమెంటరీ సంప్రదాయాలకులోబడిందే తప్ప నింద కాదు.
1991 నుంచి అమల్లోకి వచ్చిన నయావుదారవాద విధానాలను అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలు(కొన్ని అంశాలలో పరిమితంగా వామపక్షాలు మినహా) ఒకే రకమైన ఆర్ధిక విధానాలను అమలు జరుపుతున్నాయి. అందువలన తెలుగుదేశం, వైసిపి, కాంగ్రెస్, జనసేన, బిజెపి వంటి పార్టీలేవీ విధానాల గురించి చట్ట సభల్లో లేదా వెలుపలా ఎక్కడా ప్రస్తావించవు, ఘర్షణ పడవు. వాటి పంచాయతీ అల్లా అధికారం, దాన్ని అడ్డం పెట్టుకొని ఆస్ధులు కూడబెట్టుకోవటం గురించి మాత్రమే. అందువల్లనే అధికారం కోసం ఎంత ఖర్చు పెట్టటానికైనా వెనుదీయరు, ఏమి చేయటానికైనా సిద్దం అవుతారు.
గతంలో అంటే నూతన ఆర్ధిక విధానాలు రాకముందు భూమి దాని మీద పట్టు, గ్రామీణ ప్రాంతాలలోని వనరుల మీద ఆధిపత్యం కోసం పాలెగాళ్లు, భూస్వాములు, ధనిక రైతులు వెంపర్లాడేవారు. గడచిన మూడు దశాబ్దాలుగా వ్యవసాయం గిట్టుబాటు గాకపోవటం, దాని మీద వచ్చేదాని కంటే పరిశ్రమలు, వ్యాపారాలు, రియలెస్టేట్ మీద వచ్చే ఆదాయం ఆకర్షణీయంగా మారటంతో రాయలసీమ ఫ్యాక్షనిస్టులు, ఇతర ప్రాంతాల్లోని భూస్వాములు, ధనిక రైతులు వాటి వైపు మొగ్గుచూపారు. రాయలసీమలో ఇప్పటికీ ఫ్యాక్షనిజం ఉన్నప్పటికీ వాటి నేతలకు గ్రామీణ ప్రాంతాలలో వచ్చే ఆదాయాల కంటే పట్టణాలు ఆకర్షణీయంగా ఉండటంతో వారి మధ్య సర్దుబాట్లకు తెరలేచింది. ఒకరి సంపాదనకు మరొకరు అడ్డుపడకుండా ఎవరి సంపాదన వారు చూసుకుందామనే పెట్టుబడిదారీ ఆలోచనలు అందుకు దోహదం చేస్తున్నాయి.అందువల్లనే పేరు మోసిన వైరి ఫ్యాక్షనిస్టులు అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసిపిలో ఒకేవరలో ఇమిడిపోగలుగుతున్నారు.
నయావుదారవాద విధానాలు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెరలేపాయి.ప్రపంచ బ్యాంకు విధానాల అమలు ప్రయోగశాలగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మారింది. దీనిలో ప్రభుత్వరంగ సంస్ధల ఆస్ధులను ఆశ్రితులకు అయినకాడికి తెగనమ్మటం ద్వారా లబ్ది చేకూర్చటం. విలువైన భూములను కారు చౌకగా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు కట్టబెట్టి వారి నుంచి రాజకీయనేతలు లబ్ది పొందటం తెలిసిందే. అది అపరిమిత లాభాలు చేకూర్చటంతో ఎన్నికలు వ్యాపారంగా మారాయి. పదుల కోట్ల రూపాయలు అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలలో ఖర్చు చేయటానికి కారణమిదే. దీనికి అనుగుణ్యంగానే స్ధానిక సంస్ధల ఎన్నికలు కూడా డబ్బుమయంగా మారాయి.
ఇదే సమయంలో రాజకీయ వైరం తీవ్రంగా ఉన్న సందర్భాలలో ఎదుటి వారికి ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం చేస్తున్నారు. అది కేంద్రంలోనూ, రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్నవారూ చేస్తున్నారు. కాంట్ట్రాక్టర్లుగా ఉన్నవారికి దీర్ఘకాలం పాటు బిల్లులు నిలిపివేయటం, కొర్రీలు వేయటం, గనులు పొందిన వారి మీద దాడులు చేయించటం. గతంలో పొందిన కాంట్రాక్టులను రద్దు చేస్తామని బెదిరించటం ఇలా రకరకాల పద్దతులను రంగంలోకి తీసుకువస్తున్నారు. తెలుగుదేశం హయాంలో గ్రామాల్లో కాంట్రాక్టులు పొంది పనులు చేసిన వారు పార్టీ మారి వైసిపిలోకి వెళితే వెంటనే బిల్లులు మంజూరు చేయటం, మారని వారిని సతాయించటం గురించి వస్తున్న ఫిర్యాదుల సారమిదే.
ఎన్నికల్లో డబ్బు ప్రమేయం పెరుగుదల రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సర్దుబాట్లకు-కక్షలకు తెరలేపింది. ఎవరు బిస్కెట్ వేస్తే లేదా కర్ర చూపితే వారి వైపు తోకాడించుకుంటూ వెళ్లి చంకనెక్కే బొచ్చుకుక్కల మాదిరి వెళుతున్న వాణిజ్య రాజకీయనేతలను చూస్తున్నాము. డబ్బు, ఓట్లను రాబట్టగలిగిగే సామాజిక తరగతిని బట్టి నిన్నటి వరకు అధికారంలో ఉన్న పార్టీలో పదవులు వెలగబెట్టిన వారు తెల్లవారే సరికి వాటంగా ఉంటుందనుకొంటే మరొక పార్టీలోకి సులభంగా మారిపోతున్నారు. చేర్చుకొనే వారికి, చేరేవారికి ఎలాంటి విలువలు, వలువలు ఉండటం లేదు. ఒక పార్టీలో గెలిచి ప్రజాప్రతినిధిగా ప్రమాణ స్వీకారం కూడా చేయక ముందే మరో పార్టీలో చేరిన వారిని చూశాము. ఫిరాయింపుదార్లను కాపాడేందుకు స్పీకర్ల వ్యవస్ధను దుర్వినియోగం చేస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఎవరు అధికారంలో వుంటే వారికి వ్యతిరేకంగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు ప్రతిపక్షంగా ఉన్న ప్రతి పార్టీ ప్రయత్నిస్తుంది.దానిలో తప్పులేదు. ఇప్పుడు ప్రతిపార్టీ అధికారంలోకి వచ్చేందుకు సంక్షేమ చర్యల విషయంలో పోటీపడుతున్నది తప్ప వేరే అంశాలే లేవు. సంక్షేమ చర్యలను విమర్శించేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయంగా వేడి పుట్టించాలంటే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని బూతులతో రక్తి కట్టిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కటం లేదు. ఇప్పుడు బిజెపితో స్నేహం కారణంగా మతాన్ని కూడా ముందుకు తెస్తున్నారు. ఆరు నెలల క్రితం బిజెపికి వ్యతిరేకంగా పని చేస్తా అని చెప్పిన పవన్ కల్యాణ్ అప్పటికీ ఇప్పటికీ ఆ బిజెపిలో వచ్చిన మార్పేమిటో, రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో, ఎందుకు తన వైఖరిని మార్చుకున్నారో జనసేనాని జనానికి చెప్పాలి.