Tags
ap special asistance, ap special status, cia, fake news, fake stories, fake stories in media, FBI, journalism, journalist, Police agents as journalist, pope on journalism, popefrancis
జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్ ఫ్రాన్సిస్
కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్ ప్రాన్సిస్ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.
ఎం కోటేశ్వరరావు
జర్నలిజం, జర్నలిస్టుల పాత్ర, తీరు తెన్నుల గురించి ప్రపంచ వ్యాపితంగా ప్రతి రోజూ ఏదో ఒక మూల చర్చ జరుగుతూనే వుంది. ప్రసార మాధ్యమాల విస్తృతితో వారి సంఖ్య, కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మీడియాలో అనేక అవాంఛనీయ ధోరణులు కూడా రోజు రోజుకూ పెరిగిపోతున్నాయంటే అతిశయోక్తి కాదు. అవాంఛనీయ శక్తులు మీడియా రంగాన్ని క్రమంగా ఆక్రమిస్తున్నాయి. ప్రపంచాన్ని చాపమాదిరిగా చుట్టి తమ చంకన పెట్టుకోవాలని చూస్తున్న అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి సామ్రాజ్యవాద శక్తులు ప్రపంచ పౌరులను తప్పుదారి పట్టించేందుకు తమ అజెండాను అమలు జరిపేందుకు కట్టుకధలు, విద్వేషాలను రెచ్చగొట్టేందుకు మీడియాలో కట్టుకథలను చొప్పించటం, అందుకు గాను గూఢచారులు, పోలీసులకు జర్నలిస్టుల ముసుగు వేయటం, జర్నలిస్టులను డబ్బుతో లొంగదీసుకొని వారి పేర్లతో కట్టుకధలను ప్రచారంలో పెట్టటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి పరిణామాలపై విహంగ వీక్షణమిది.
దర్యాప్తు సమాయాలలో ఎఫ్బిఐ(మన సిబిఐ మాదిరి) ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో పని చేయవచ్చని ఆ సంస్ధ ఇన్సపెక్టర్ జనరల్ తాజాగా ప్రకటించారు. ప్రధాన స్రవంతి మీడియా, ఇతర సామాజిక మాధ్యమాలలో కూడా పోలీసు ఏజంట్లు ప్రవేశించి పని చేయటం కొత్త కాదని, ఎప్పటి నుంచో జరుగుతున్నదని కూడా వెల్లడించారు. అయితే ఎవరు జర్నలిస్టుల ముసుగులో వున్న పోలీసులో ఎవరు కాదో తెలియటం అంత సులభం కాదు. వివిధ దేశాలలో ముఖ్యంగా అమెరికా వంటి చోట్ల పెద్ద సంఖ్యలో పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో మీడియాలో తిష్ట వేశారు.లేదా జర్నలిస్టులను తమ ఏజంట్లుగా మార్చుకొని తమ అజెండా, కార్యకలాపాలను వారితో నిర్వహిస్తున్నారు. కాబట్టి వార్త లేదా వాస్తవాలు పవిత్రం, వ్యాఖ్యలు మీ ఇష్టం అనేది ఇంకే మాత్రం చెల్లదు. పోలీసు ఏజంట్లు, అవాంఛనీయ శక్తులు మీడియాలో ప్రవేశించిన తరువాత వార్తలకున్న పవిత్రత ఎప్పుడో గంగలో కలిసింది. కనుక వాస్తవాల పేరుతో పచ్చి అవాస్తవాలు, వ్యాఖ్యల పేరుతో తమకు అనుకూలమైన కథనాలను ప్రచారంలో పెడుతున్నారన్నది జనం గ్రహించాలి. ఈ పని పోలీసులే కాదు, అధికారంలో వున్న రాజకీయ పార్టీలు కూడా గుండుగుత్తగా మీడియా సంస్ధలతో కుమ్మక్కు, కొనుగోలు చేసి తమ బాకాలుగా మార్చుకోవటం తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పార్టీ, ఏ వ్యక్తులు ఈ పని చేశారని ప్రశ్నించే వారికి చేయని ప్రధాన పార్టీ, వ్యక్తులు ఎవరు అందరూ చేశారన్నదే సమాధానం !
రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా గూఢచార సంస్ధ సిఐఏ ‘ఆపరేషన్ మోకింగ్ బర్డ్ ‘ పేరుతో మీడియాలో తన ఏజంట్లను ప్రవేశపెట్టటానికి తెరతీసింది. అది నిధులిచ్చి వివిధ సంస్ధల పేరుతో కొన్ని పత్రికలను కూడా నడిపించింది. ఒక్క సిఐఏ మాత్రమే కాదు, ఎఫ్బిఐ కూడా అదే పనిచేసిందని కొద్ది రోజుల క్రితం ఆ సంస్ధ స్వయంగా ఏకంగా ఒక నివేదికనే విడుదల చేసింది. ఆసక్తి వున్న వారు ఆ లింక్‌లో పూర్తి నివేదిక చదవచ్చు.https://oig.justice.gov/reports/2016/o1607.pdf తన చర్యలను సమర్ధించుకొనేందుకు, నిజమే కదా అలాంటి సందర్బాలలో వాస్తవాలను బయట పెట్టటం, నిందితులను పట్టుకొనేందుకు ఏ పద్దతి అనుసరించినా తప్పేముంది అని జనం అనుకొనేందుకు వీలు కలిగించే అంశాలనే ఎఫ్బిఐ ఆ నివేదికలో పొందుపరచిందని వేరే చెప్పనవసరం లేదు. మచ్చుకు ఆ నివేదిక నుంచి అలాంటి వుదాహరణనే చూడవచ్చు.
2007 జూన్‌లో ఒక 15 ఏండ్ల హైస్కూలు బాలుడు సియాటిల్ పట్టణ సమీపంలోని ఒక హైస్కూలు సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగానికి వారం రోజుల పాటు ఇమెయిల్స్ పంపుతూ బాంబు బెదరింపులకు పాల్పడ్డాడట. ప్రతి రోజూ స్కూలును ఖాళీ చేయించటం తనిఖీ చేసి బాంబులేవీ లేవని నిర్ధారించుకోవటం జరిగింది. ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి పంపుతున్నదీ పసిగట్టకుండా వుండేందుకు ఒక సారి ఒక దగ్గర నుంచి పంపిన మెయిల్‌ను మరొకసారి అక్కడి నుంచి కాకుండా వేరే చోటు నుంచి పంపాడట.దీంతో అతడిని పట్టుకోవటం పెద్ద సవాలుగా మారింది. ఎవరైనా ఏ కంప్యూటర్ నుంచి పని చేస్తున్నారో, అది ఎక్కడ వుందో తెలుసుకొనే ఒక రహస్య సాప్ట్‌వేర్‌ను జత చేసి అసోసియేటెడ్ ప్రెస్ (మన పిటిఐ, యుఎన్ఐ మాదిరి వార్తా సంస్ధ) ఎడిటర్ పేరుతో ఒక తప్పుడు వార్త, ఫొటోల లింక్‌లను సామాజిక మాధ్యమాలలోకి వదిలాడు. వాటిపై క్లిక్ చేసిన వారి చిరునామా ఆ లింక్‌లను పంపిన వారికి వెంటనే చేరి పోతుంది. ఆ వుచ్చులో పడిన ఆ కుర్రాడు దొరికిపోయి నిజాన్ని ఒప్పుకున్నాడట. ఆ నిందితుడిని ఎలా పట్టుకుందీ మీడియాకు చెప్పలేదు. అయితే దానిని పసిగట్టిన ఒక వెబ్సైట్ కొద్ది రోజుల తరువాత ఎలా పట్టుకుందీ వెల్లడించిందట. ఏడు సంవత్సరాల తరువాత సియాటిల్ టైమ్స్ అనే పత్రిక ఎఫ్బిఐ ఏజంటు జర్నలిస్టు ముసుగులో బాంబు బెదరింపులకు పాల్పడ్డ విద్యార్ధిని పట్టుకున్నట్లు వెల్లడించింది. తమ వార్తా సంస్ధ జర్నలిస్టు ముసుగులో ఎఫ్బిఐ ఏజంట్లు దర్యాప్తు చేయటాన్ని నిరసిస్తూ ఏపి వార్తా సంస్ధ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాంతో అనేక పత్రికలు ఎఫ్బిఐ ఎత్తుగడలను ప్రశ్నిస్తూ వార్తలు రాశాయి. ఒక వారం తరువాత ఎఫ్బిఐ డైరెక్టర్ న్యూయార్క్ టైమ్స్ పత్రికకు రాసిన లేఖలో సంస్ధ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలాంటి పని చేయవచ్చని తమ చర్యను సమర్ధించుకున్నారు.
దేశ రాజధాని, రాష్ట్ర రాజధానులు, ఇతర పెద్ద నగరాలలో అనేక మంది పోలీసు ఏజంట్లు జర్నలిస్టుల ముసుగులో విలేకర్ల సమావేశాలకు హాజరవుతుంటారు. ఎవరైనా అభ్యంతర పెడితే మౌనంగా వెళ్లిపోతారు. లేదా విలేకర్ల సమావేశాలు జరిగే చోట బయట వేచి వుండి విలేకర్ల వెంటపడి ఎవరేం చెప్పారో తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తారు.అమెరికన్ ఎఫ్బిఐ చర్యలను నిరసిస్తూ రిపోర్టర్స్ కమిటీ ఫర్ ప్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ( పత్రికా స్వేచ్చ కోసం పని చేసే విలేకర్ల కమిటి ) మరో 25 సంస్ధల తరఫున ఒక లేఖ రాస్తూ ఎఫ్బిఐ చర్య జర్నలిస్టుల విశ్వసనీయతను దెబ్బతీస్తుందని, స్వతంత్రకు భంగం కలిగిస్తుందని అభ్యంతరం తెలిపింది. అయితే ఎఫ్బిఐ ఇలాంటి వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జర్నలిస్టుల ముసుగులో తన ఏజంట్లు పనిచేసేందుకు వున్నతాధికారుల అనుమతి తీసుకోవాలంటూ ఒక చిన్న నిబంధన చేర్చి 2016 మార్గదర్శ సూత్రాలను తయారు చేసింది. అంటే తాను చేసే తప్పుడు పనులకు అధికారిక ముద్ర వేయటం, మరింత బరితెగించి చేయటం తప్ప మరొకటి కాదు.
ఇది ఒక్క అమెరికాకే పరిమితం కాలేదు. పోలీసులు, గూఢచారులు అల్లే కట్టుకధలు, వక్రీకరణలు, తప్పుడు సమాచారానికి విశ్వసనీయత కలిగించేందుకు జర్నలిస్టుల పేర్లను వాడుకోవటం కూడా జరుగుతోంది. జర్మనీలోని అతి పెద్ద పత్రికలలో ఒకటైన ఫ్రాంక్‌ఫర్టర్ అల్‌జెమినీ జీటుంగ్ పత్రికకు రెండు దశాబ్దాలకు పైగా సంపాదకుడిగా వున్న జర్మన్ జర్నలిస్టు డాక్టర్ యుడో అల్ కొటే రష్యాకు చెందిన ఆర్టి న్యూస్ అనే టీవీలో ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించి వుద్యోగం పోగొట్టుకున్నాడు. గూఢచారులు తయారు చేసిన కధనాలను తన పేరుతో ప్రచురించాలని వత్తిడి చేశారని, దానిని తిరస్కరించినందుకు యాజమాన్యం వుద్యోగం నుంచి తొలగించింది. తనకు పిల్లలు లేనందున ఎవరూ తనను బెదిరించలేరంటూ అనేక విషయాలు వెల్లడించిన ఆ జర్నలిస్టు మాటల్లోనే ఏం జరిగిందో చూడండి.’ నేను పాతికేండ్లుగా జర్నలిస్టుగా వున్నాను. జనానికి నిజం చెప్పకుండా మోసం చేసేందుకు, అబద్దాలు చెప్పేందుకు నాకు శిక్షణ ఇచ్చారు. రష్యాతో యుద్ధానికి తలపడేందుకు గాను ఐరోపా పౌరుల ముంగిటికి కూడా యుద్ధాన్ని తెచ్చేందుకు జర్మన్, అమెరికన్ మీడియా గత కొద్ది నెలలుగా ప్రయత్నించటాన్ని చూశాను.గతంలో నేను చేసింది సరైంది కాదని ఇంకే మాత్రం దీనిని సహించకూడదని, ప్రతిఘటించాలని నిర్ణయించుకున్నాను. రష్యాకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు, తిమ్మిని బమ్మిని చేసి జనాన్ని నమ్మించేందుకు గతంలో ప్రయత్నించాను. ఒక్క జర్మన్లనే కాకుండా యావత్ ఐరోపా వాసులను మోసం చేసేందుకు ముడుపులు తీసుకున్న నా సహజర్నలిస్టులు చేసింది కూడా సరైంది కాదని , తాను స్వయంగా సిఐఏ కధనాలను తన పేరుతో అందించానని తెలిపారు.ప్రధాన మీడియా సంస్ధలలోని జర్నలిస్టులను అవినీతి పరులుగా చేయటం పశ్చిమ దేశాల మీడియాలో అందరూ అంగీకరించే సిఐఏ రోజువారీ వ్యవహారం. ఎవరైనా అందుకు అంగీకరించకపోతే వారికి మరో చోట ఎక్కడా వుద్యోగాలు రానివ్వరు లేదా అర్ధంతరంగా ముగిసిపోతాయి. సిఐఏ అవినీతి గురించి బట్టబయలు చేస్తూ ‘జర్నలిస్టుల కొనుగోలు’ పేరుతో రాసిన పుస్తకానికి సంబంధించి సమీక్షలను జర్మనీలోని ప్రధాన పత్రికలలో రాకుండా అడ్డుకున్నారని కూడా తెలిపారు. తనకు ఎదురైన అనుభవాల గురించి వెల్లడిస్తూ లిబియా అధ్యక్షుడు గడాఫీ విషవాయువుల ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నట్లు కట్టుకధలు ప్రచురించాలని 2011లో తనను అదేశించారని, ఇరాన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో వార్తల సేకరణకు వెళ్లిన తాను విషవాయు దాడిలో గాయపడ్డానని సద్దాం హుస్సేన్ వుపయోగించిన విషవాయువుల గురించి రాయవద్దని కూడా చెప్పారని, ఆ సమయంలో సద్దాం అమెరికాకు స్నేహితుడిగా వుండటమే కారణమని పేర్కొన్నారు. అమెరికా నుంచి వెలువడై టైమ్స్ పత్రిక యాజమాన్య స్ధాయిలోనే సిఐఏ మనుషులు వున్నందున దశాబ్దాల తరబడి దానిలో సిఐఏ కధనాలు వెలువడేవని జర్మన్ జర్నలిస్టు వెల్లడించారు.
కొన్ని సార్లు సమాచారాన్ని వక్రీకరించటానికి లేదా ఎంపిక చేసిన సమాచారాన్ని వార్తలుగా ఇచ్చేందుకు తమకు అమెరికా ప్రభుత్వం, విదేశీ ప్రభుత్వాలు డబ్బు చెల్లించేవని, ఆ సమాచారాన్ని వీక్షకులు, చదువరులకు ఎలా అందచేయాలో కూడా ప్రభుత్వాలే ఎడిట్ చేసి ఇచ్చేవని మూడు సార్లు ఎమ్మీ అవార్డు పొందిన జర్నలిస్టు అంబర్ లేయాన్ వెల్లడించారు.’ అనేక అంశాలకు సంబంధించి ఏం జరుగుతోందన్న మన అవగాహనను అనేక సార్లు పూర్తిగా అదుపు చేశారు. అందుకు పెద్ద వుదాహరణ ‘వుగ్రవాదంపై పోరు’ ఇంకా స్పష్టంగా అయితే వుగ్రవాదం గురించి తప్పుడు చిత్రీకరణ. వీటన్నింటికీ ఇస్లామిక్ తీవ్రవాదులే అనే దానికి అనుగుణంగా మా బుర్రలను తయారు చేశారు.అందుకు 9/11 మంచి వుదాహరణ. సామూహిక మారణాయుధాల పేరుతో మధ్యప్రాచ్యంపై దాడి చేయటాన్ని సమర్ధించుకొనేందుకు ఎవరైతే ఈ వుదంతాన్ని వుపయోగించుకొనేందుకు ప్రవర్తించారో వారే దానిని సృష్టించారు. జన్యుమార్పిడి ఆహారం, ఔషధాలు, పండిత చర్చలు మొదలైన వాటన్నింటికీ సంబంధించి వాటికి అనుగుణ్యంగా మన అవగాహనను మలిచారు ‘ అని ఆమె చెప్పారు. ప్రపంచ కార్పొరేట్, సామ్రాజ్యవాదుల చేతులలో మీడియా పురోగామి, సోషలిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక సైద్ధాంతిక, ప్రచారదాడి అస్త్రంగా తయారైంది. లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదుల విధానాన్ని వ్యతిరేకిస్తున్న వెనెజులా వామపక్ష ప్రభుత్వం, అక్కడి అధికార సోషలిస్టు పార్టీకి వ్యతిరేకంగా మీడియా జరిపిన విషపు దాడి, వ్యాపింప చేసిన అవాస్తవాల గురించి స్పెయిన్‌కు చెందిన లాయర్, విశ్లేషకుడైన ఫెర్నాండో కసాడో ఒక గ్రంధమే రాశాడు. వెనెజులా మాజీ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్, ఆయన భావజాలమైన 21వ శతాబ్దపు సోషలిజాన్ని ప్రపంచ మీడియా ప్రధమ శత్రువుగా ఎందుకు పరిగణిస్తోంది, నిజమైన వెనెజులాకు, మీడియా చిత్రిస్తున్నదానికి తేడా వుందేమిటి అన్న ఆలోచన ఫెర్నాండోకు కలిగి వివరాల్లోకి వెళ్లారు. అది ఒక పెద్ద పుస్తకంగా తయారైంది. దాని గురించి స్పుత్నిక్ అనే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ మీడియా తరచూ వాస్తవాలను వక్రీకరించి వాటినే ‘నిజాలు’గా జనం ముందుంచేందుకు పని చేస్తోంది. దీనికి అనేక కారణాలున్నాయంటూ వాటిలో మొదటిది, ముఖ్యమైనది 21వ శతాబ్దపు సోషలిజంతో మీడియా సైద్ధాంతిక దాడికి పూనుకోవటం. బడా మీడియా అంతా కంపెనీల చేతుల్లో వుంది, వాటి ప్రధాన ప్రేరణ లాభాలు. ఈ కంపెనీలకు ఇతర కంపెనీలకు వున్న తేడా ఏమిటంటే ఇవి వస్తువులకు బదులు సమాచారాన్ని విక్రయిస్తాయి. బడా మీడియా సంస్ధలు తరచూ తమ సిద్ధాంతాలు, వాణిజ్య ప్రయోజనాలకు అదే విధంగా తమకు ప్రకటనలు ఇచ్చే వారి ప్రయోజనాలకు ముప్పు వచ్చినపుడు దాడులకు తెరతీస్తాయి. ‘ ఇరాక్ కంటే మరింత ప్రమాదకరమైనది వెనెజులా అంటే ఆశ్చర్యం ఎందుకు ?’ అనే శీర్షికతో న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన వ్యాసాన్ని చూడండి, ఇతర విషయాలతో పాటు ఇరాక్‌లో కంటే వెనెజులాలో ఎక్కువ మంది జనాన్ని చంపినట్లు దానిలో రాశారు. మీడియా సాయంతో అబద్దాలు నిజాలుగా మారిపోతున్నాయి. అటు వంటి తిమ్మిని బమ్మిని సమాచారం తరచుగా ప్రచురితమైతోంది. అత్యంత దారుణమైన విషయం ఏమంటే ఇటువంటి ప్రచారం పశ్చిమ దేశాల మీడియాతో పాటు లాటిన్ అమెరికా పత్రికలు కూడా చేస్తున్నాయి. కొంత మంది జర్నలిస్టులకు ఎలాంటి పక్షపాతం వుండదు, వారికి వాస్తవ పరిస్థితి తెలుసు, మంచి వేతనాలు, మెప్పు పొందాలంటే ఎడిటర్లు కోరుకున్నది తప్ప వాస్తవాలను రాసే అవకాశం వుండటం లేదు. ఇలాంటి ప్రచురణ సంస్ధల దృష్టి మరిన్ని లాభాలు, అందుకోసం సంచలనాత్మకతకు పాల్పడటం తప్ప తాము ప్రచురిస్తున్నది వాస్తవమా కాదా అనే దానితో వాటికి నిమిత్తం లేదు ‘ అని ఫెర్నాండో వ్యాఖ్యానించారు.
కట్టు కథలు, సత్యదూరమైన అంశాలు పత్రికలు, టీవీలలోనే కాదు, సామాజిక మాధ్యమాలలో కూడా పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి.ప్రముఖ వ్యక్తుల బొమ్మలు పెట్టి వారి పేర్లతో కొటేషన్లు పెడతారు. వాటిలో వాస్తవం ఎంతో కూడా ఆలోచించ కుండా అనేక మంది వాటిని లైక్ చేస్తూ షేర్ చేస్తుంటారు. అంతవరకైతే అదొక తీరు, దాని మీద వ్యాఖ్యానాలు, సంస్కార రహితమైన బూతు, తిట్లు విపరీతం. వుదాహరణకు అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 1861-65 మధ్య పదవిలో వున్నారు. ఆయనను 1965లో హత్య చేశారు. ఆయన బొమ్మతో ఒక కొటేషన్ పెట్టి వదిలారు. దానిలో ఇంటర్నెట్లో ఒక కొటేషన్, దాని పక్కనే ఒక బొమ్మ పెట్టిన వాటన్నింటినీ నమ్మ వద్దు అని రాసి వుంది. అది వాస్తవమే. అయితే ఆ విషయాన్ని అబ్రహాం లింకన్ చెప్పారని ఆయనకు ఆపాదించటమే నకిలీ. ఎందుకంటే ఆయన మరణించిన వంద సంవత్సరాల తరువాత ఇంటర్నెట్కు అంకురార్పణ జరిగింది. పాపం లింకన్‌కు ఇంటర్నెట్ అనే పదమే తెలిసి వుండదు. ఇలా అనేకం వున్నాయి. మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో ఇలాంటి నకిలీ ప్రయోగాలు అనేక జరుగుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నరేంద్రమోడీ గొప్పతనాన్ని గురించి చెప్పేందుకు ఒక ఫొటోను ప్రయోగించారు. ఆర్ఎస్ఎస్ సమావేశాల సందర్బంగా గదులను శుభ్రం చేసిన ఒక నిరాండంబర వ్యక్తిగా చిత్రించే ప్రయత్నంలో భాగంగా అది జరిగింది. ఇలా చాలా చెప్పుకోవచ్చు.
జర్నలిస్టులు నోటి మాటతో చంపగలరు: పోప్ ఫ్రాన్సిస్
కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్న నందమూరి బాలకృష్ణ సినిమా డైలాగ్ తెలిసిందే. జర్నలిస్టులు నోటి మాటతో ఓ వ్యక్తిని చంపగలరు అని సాక్షాత్తూ పోప్ ప్రాన్సిస్ అన్నారంటే మీడియా మీద అంతకంటే తీవ్ర విమర్శ ఇంకేమి కావాలి.సెప్టెంబరు 23న ఇటలీ జర్నలిజం గిల్డ్ జాతీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్పిత కధనాలు, గాలి వార్తలపై ఆధారపడి ఐరోపాకు వస్తున్న శరణార్ధుల వంటి మానవత్వ సంక్షోభ సమయాలలో వారికి వ్యతిరేకంగా రాస్తున్న వార్తలు ఒక రకమైన వుగ్రవాదం తప్ప మరొకటి కాదన్నారు. విమరశ న్యాయమైనదే,దుర్నడతలను ఆక్షేపించటానికి అది అవసరం కూడా అని నేను అంటాను, అయితే జర్నలిజం కొంత మంది వ్యక్తుల లేదా దేశాల మానవ వినాశకర ఆయుధం కాకూడదు. గాలి కబుర్ల అలవాటు వుగ్రవాదపు అలవాట్లలో ఒకటి. వుగ్రవాదుల మాదిరి నాశనం చేయటానికి గాలి కబుర్ల వారు మాటల బాంబులు వేస్తారు ‘ అని కూడా చెప్పారు.
మీడియా ఒకసారి విశ్వసనీయత కోల్పోతే దాని పర్యవసానాలు ముందుగా ఫీల్డ్‌లో పని చేసే విలేకర్లు అనుభవిస్తారన్నది అనేకసార్లు రుజువైంది. దాడుల వుదంతాలు పెరగటం కూడా వాటిలో ఒకటి. యురి సైనిక కేంద్రంపై వుగ్రవాదుల దాడి తరువాత సెప్టెంబరు 20వ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కొంత మంది జర్నలిస్టులు ఇళ్లకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న వాహనంపై మీడియా అని రాసి వుండటాన్ని చూసిన కొందరు నిరసనకారులు వాహనంపై దాడికి దిగారు. మీడియా రాజ్య ప్రచార సాధనంగా మారిందని, జర్నలిస్టులు నిజాలు దాస్తున్నారని జనం భావించటమే దీనికి కారణం తప్ప వేరు కాదు. కాశ్మీర్లో జర్నలిస్టులు అటు జనం ఇటు సైనిక, పోలీసుల మధ్య నలిగిపోతున్నారంటే అతిశయోక్తి కాదు. అటు భద్రతా దళాలు జర్నలిస్టులను పాకిస్తానన లేదా వేర్పాటు వాద హురియతన ఏజంట్లని, ఇటు జనం ప్రభుత్వ ఏజంట్లని నిందిస్తున్నారు.మన రాష్ట్రంలో కూడా అనేక సందరా&భలలో తమ న్యాయమైన సమస్యలపై పోరాడుతున్నపుడు మీడియాలో వాటిని విస్మరించినా లేదా అప్రాధాన్యంగా ఇచ్చినా జర్నలిస్టులు కుమ్మక్కయ్యారని ఆరోపించటం లేదా విమరి&శంచటం చూస్తున్నాం.
అవాంఛనీయ ఘటనలు ముఖ్యంగా వుగ్రవాద దాడులు, మత ఘర్షణలు జరిగినపుడు కొంత మంది వుగ్రవాదులను కాల్చి చంపామనో, విద్రోహులను పట్టుకున్నామనో పోలీసులు కల్పిత కథలు, సంఘటనలను ప్రచారంలో పెట్టటం తెలిసిందే.అధికార యంత్రాంగం, అధికారంలో వున్న వారి పరువు పోకుండా చూడటం కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. కొంత మంది అమాయకులను కాల్చి చంపి వుగ్రవాదులను హతమార్చామని చెప్పిన వుదంతాలు కూడా వున్నాయి. తమ రేటింగ్లను పెంచుకొనేందుకు చిలవలు పలవలుగా కొన్ని వుదంతాలపై మీడియా స్పందించటం కూడా తెలిసిందే. తమకు ఇష్టం లేని వార్తలను తొక్కి పెట్టటం అన్నది లేదా వివిధ కారణాలతో కొన్ని వార్తలకు ప్రాముఖ్యత కల్పించటం మన దేశంలో కూడా జరుగుతున్నది. దీనికి తాజా వుదాహరణ జమ్మూ-కాశ్మీర్లో యురి సైనిక స్ధావరంపై వుగ్రవాదులు దాడి జరిపి నిద్రమంచాల మీద వున్న 18 మంది సైనికులను చంపిన ఘటన గురించి తెలిసిందే. ఇలాంటి సమయాలలో దేశ పౌరుల్లో మనో నిబ్బరం కల్పించే పేరుతో ప్రభుత్వం పైన చెప్పిన మాదిరి కొన్ని కట్టుకధలను ప్రచారంలో పెట్టటం చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే చేస్తుంది కనుక అంత వరకు ఆగటం ఎందుకు మనమే అలాంటి కట్టుకధలను ప్రచారంలో పెట్టి రేటింగ్స్ పెంచుకోవాలని కొన్ని మీడియా సంస్ధలు అలాంటి కట్టుకథనే వండి వడ్డించాయి.
మన సైన్యంలోని ప్రత్యేక దళాలు ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి రహస్యంగా ప్రవేశించి వుగ్రవాద స్ధావరాలపై దాడి చేసి 20 మంది వుగ్రవాదులను హతమార్చి బదులుకు బదులు తీర్చుకున్నాయంటూ టీవీ ఛానల్స్, పత్రికలు ఒక వార్తను ప్రచారంలో పెట్టాయి. నిజానికి అలా జరిగి వుంటే అదొక పెద్ద సమస్యగా మారి వుండేది. తామలాంటి దాడులు చేయలేదని మన సైన్యం ఒక ప్రకటన చేసింది. అయితే ఒక వెబ్సైట్ మాత్రం తాను రాసిన కథనం వాస్తవమేనని, వాస్తవాలను నిర్ధారించుకున్నానని చెప్పుకుంది. అదే వార్తను ప్రసారం చేసిన ఇతర మీడియా మాత్రం మిన్నకుండి పోయింది తప్ప అలాంటి దుస్సాహసానికి పాల్పడలేదు. యురి ఘటనతో మధ్యతరగతి, యువత ఆగ్రహంతో స్పందించటాన్ని అవకాశంగా తీసుకొని వారిని సంతృప్తిపరచే అనేక కథనాలను బడా మీడియా సంస్ధలు ప్రచారంలో పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం దాని గురించి మల్లగుల్లాలు పడుతోంది తప్ప అసలు ఎలా జరిగిందో కూడా ఇంతవరకు స్పష్టంగా చెప్పలేకపోయింది. సైనిక శిబిరంలో గడ్డి దుబ్బులుగా పెరిగిందని, పక్కనే వున్న నది ద్వారా సరిహద్దులు దాటిన వుగ్రవాదులు దానిలో దాగి వుండి దాడులకు పాల్పడ్డారనే ఒక కథనాన్ని కూడా ప్రచారంలో పెట్టారు.
మీడియా ఇటీవలి కాలంలో మరొక బాధ్యతను కూడా పుచ్చుకుంది. ఎవరు దేశ భక్తులో,ఎవరు దేశ ద్రోహులో, ఏది దేశ ద్రోహుల కేంద్రంగా వుందో కూడా ప్రకటించేస్తోంది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ(జెఎన్‌యు) విద్యార్ధి యూనియన్ మాజీ అధ్యక్షుడు కన్నయ్య, మరికొందరు విద్యార్ధులు, కొన్ని సంస్ధలను అలాగే జమ కట్టి నకిలీ వీడియోలను కూడా తయారు చేసి ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆ విశ్వవిద్యాలయం దేశద్రోహులకు మద్దతు ఇచ్చే శక్తులకు నిలయంగా మారిందని, దానిని మూసివేయాలని, అక్కడి విద్యార్ధినీ, విద్యార్ధులు మద్యం తాగుతూ, వ్యభిచారానికి పాల్పడుతున్నారని అందుకు నిదర్శనంగా మద్యం సీసాలు, నిరోధ్‌లు పెద్ద సంఖ్యలో కనిపించాయని బిజెపి, ఆర్ఎస్ఎస్ వాటి అనుబంధ సంస్ధల నేతల ఆరోపణలకు విశ్వసనీయత కలిగిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయటంలో మీడియాలోని మెజారిటీ సంస్ధలు తమ పంతు పాత్ర పోషించాయి. పాటు అనేక మంది విద్యార్దులపై తప్పుడు కేసులు పెట్టించిన విషయం తెలిసిందే. ఆ కేసులలో వున్న విద్యార్ధులను కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా వార్తలను సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్టులపై బిజెపి మద్దతుదారులైన లాయర్లు దాడికి పాల్పడిన వుదంతం కూడా తెలిసిందే. జాతి వ్యతిరేకులకు మద్దతు ఇస్తున్నారంటూ మహిళాజర్నలిస్టులను కూడా వదల కుండా అవమానించిన ఘటనలు ఇంకా కళ్ల ముందున్నాయి.
అలాంటి వుదంతానికి కేంద్ర బిందువుగా వున్న జెఎన్‌యు విశ్వవిద్యాయ విద్యార్ధి సంఘానికి సెప్టెంబరులో జరిగిన ఎన్నికలలో దేశభక్తులకు ప్రతినిధులుగా వున్నామని చెప్పుకున్న ఎబివిపి అభ్యర్ధులను విద్యార్ధులు చిత్తు చిత్తుగా ఓడించారు. వేర్పాటు వాదులు, వుగ్రవాదులకు మద్దతు ఇచ్చే దేశద్రోహులుగా ముద్రవేసిన ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ విద్యార్ధి సంఘాల కూటమికి ఘన విజయం చేకూర్చారు. ఈ వార్తను మీడియా మొత్తంగా తొక్కి పెట్టింది లేదా ఎవరూ గమనించని విధంగా అప్రాధాన్యంగా ఇచ్చింది. అదే అక్కడ ఎబివిపి గెలిచి వుంటే ఎంత హంగామా జరిగి వుండేదో వూహించుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వుమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా వాగ్దానం చేసిన ప్రత్యేక తరగతి హోదా కల్పన విషయాన్నే చూద్దాం. దీనికి సంబంధించి కొన్ని పత్రికలలో, ఛానల్స్‌లో ఎన్ని కట్టుకధలు ప్రచురితం, ప్రసారమయ్యాయో చూశాము. కొన్ని రోజులు ప్రత్యేక హోదా గురించి కసరత్తు జరుగుతోందని, ప్రకటన వెలువడటమే తరువాయని కొన్ని కధలు. ప్రత్యేక హోదా ప్రకటించకపోతే తెలుగుదేశం పార్టీ బిజెపితో తెగతెంపులు చేసుకుంటుందని, ఏదో ఒకటి తేల్చుకోవాలని, తానిక ఢిల్లీ రానని చంద్రబాబు నాయుడు అల్టిమేటం ఇచ్చారని మరికొన్ని కథలు. ఇవన్నీ ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి లేదా కొందరికి ప్రయోజనం కలిగించేందుకు వండి వార్చిన కధలన్నది జనానికి బాగా అర్ధమైంది. ప్రత్యేక హోదా వలన వచ్చే లాభాల గురించి చెప్పిన వారే తీరా దాన్ని ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరువాత హోదా వలన ప్రయోజనం లేదని అంతకంటే మెరుగైనా పాకేజి వల్లనే ఎక్కువ ప్రయోజనమనే వార్తలు, వాదనలకు పెద్ద ఎత్తున చోటు కల్పించటాన్ని ఏమనాలి?
మీడియాలో ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకూ పెరిగి పోతున్న కారణంగానే అది అందచేసే వార్తలకు విశ్వసనీయత వుండటం లేదు. ఒక కొత్త వార్తను ఒక ఛానల్ లేదా ఒక పత్రికలో చూసి నమ్మే పరిస్ధితులు అంతరించాయి. ఇది మీడియా సంస్ధల విశ్వసనీయతనే కాదు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టుల విశ్వసనీయతనే దెబ్బతీస్తున్నాయి. కిరాయి రాతగాళ్లుగా జనం భావించే రోజులు దాపురించాయి. ఏ మీడియా సంస్ధలో పని చేస్తే దాని యాజమాన్య వైఖరికి అనుగుణంగా ఆ జర్నలిస్టుల రాతలూ, వాదనలూ మారిపోతుండటమే దీనికి కారణం అని వేరే చెప్పనవసరం లేదు. స్వతంత్ర భావాలు, తాము చూసిన దాన్ని వీక్షకులు, చదువరులకు అందించే పరిస్థితి లేదు. ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే వుద్యోగానికి వుద్వాసన. అధికార తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం పట్ల విమర్శనాత్మక వ్యాఖ్యలు, వైఖరిని ప్రదర్శించిన కారణంగా ఒక సీనియర్ జర్నలిస్టును ఆ సంస్ధ నుంచి తొలగించేదాకా అధికారంలో వున్న పెద్దలు వత్తిడి చేశారన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మీడియాను ఒక లాభదాయకమైన వ్యాపారంగా భావించి పెట్టుబడులు పెట్టిన యాజమాన్యాలు ప్రభుత్వంతో వైరం తెచ్చుకొని తమ లాభాలను వదులుకోవటానికి సిద్ధంగా వుండవని వేరే చెప్పనవసరం లేదు. అందువల్లనే మీడియాలో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీతో మిలాఖత్ అవుతున్న యాజమాన్యాలు చట్టాలను, వేతన సిఫార్సులను అమలు జరపకపోయినా,అసలు వేతనాలు చెల్లించకపోయినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజకీయ నేతలు తమకు అనుకూలమైన వార్తలు రాయకపోతే యజమానులకు ఫిర్యాదులు చేస్తామనే బెదిరింపులు రాజధాని నుంచి మండల కేంద్రం వరకు వున్న విలేకరులకు ఏదో ఒక సందర్భంగా ఎదురై వుంటుందన్నది కాదనలేని సత్యం.
గమనిక:ఈ వ్యాసం అక్టోబరు నెల ‘వర్కింగ్ జర్నలిస్టు సమాచార స్రవంతి’లో ప్రచురణ నిమిత్తం రాసినది.