Tags
Free press, India press freedom, Indian media, media bias, press, press freedom, world press freedom day
ఎం కోటేశ్వరరావు
కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రపంచ మీడియా స్వేచ్చలో మన దేశ ర్యాంకు అంతకు ముందున్న 140 స్ధానం నుంచి మెరుగు పడి 136కు వచ్చిందని ప్రకటించగానే అనేక మంది దానికి కారణం నరేంద్రమోడీయే అని అనేక మంది తమ జబ్బలను తామే చరుచుకున్నారు. మరుసటి ఏడాది 133కు పెరగటంతో ఆహా ఓహో అంటూ వీరంగం వేశారు. తాజాగా మే మొదటి వారంలో మన ర్యాంకు 136కు పతనం కావటంతో నరేంద్రమోడీకేమీ సంబంధం లేనట్లు, అది పెద్ద వార్త కానట్లుగా దాదాపు విస్మరించారు. రాజుగారి విజయాలను స్తుతించటానికే వంది మాగధులు తప్ప పరాజయాలకు వుండరన్న విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి నేర్పింది మేమే అని చెప్పుకొనే బ్రిటన్, స్వేచ్చ అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిందే అనే అమెరికా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చంకలు కొట్టుకొనే మన దేశం కూడా ఈ ఏడాది ర్యాంకులు, పాయింట్లలో దిగజారాయి. అనేక ఐరోపా దేశాల ర్యాంకులు కూడా పతనమయ్యాయి.అమెరికా 41 నుంచి 43కు, బ్రిటన్ 40 నుంచి 38కి పడిపోయింది. ‘మీడియా స్వేచ్చకు భద్రత లేకపోతే ఇతర స్వేచ్చలకు ఎలాంటి హామీ వుండదు అని భావించే వారికి ప్రజాస్వామిక వ్యవస్ధలుగా భావించే చోట పడిపోతున్న పాయింట్లు ఆందోళన కలిగిస్తున్నాయని, అధోముఖానికి మనల్ని తీసుకుపోతున్నాయని సరిహద్దులు లేని విలేకర్ల సంస్ధ (రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్-ఆర్ఎస్ఎఫ్) సెక్రటరీ జనరల్ క్రిస్టోఫీ డెలోయిర్ వ్యాఖ్యానించారు.
‘ప్రజాస్వామ్య క్షయంతో బలహీనపడిన జర్నలిజం’ అనే పేరుతో ఆర్ఎస్ఎఫ్ సంస్ధ 2017 నివేదికను విడుదల చేసింది. ప్రతి ఏటా మే మూడవ తేదీన ప్రపంచ పత్రికా పరిరక్షణ దినం సందర్భంగా అంతకు ముందు ఏప్రిల్ చివరిలో విడుదల చేసే ఈ నివేదికలలో అంతకు ముందు సంవత్సరాలలో జరిగిన పరిణామాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అందువలన 2017 ర్యాంకు అంటే 2016 పరిస్ధితికి అద్దం పడుతుంది. ఈ రీత్యా చూసినపుడు 2002,03,04 సంవత్సరాలలో బిజెపి ఏలుబడిలో మన ర్యాంకులు వరుసగా 80,128,120గా వున్నాయి. తరువాత 2005-2012 మధ్య 106-131 మధ్య కదలాడి 2013,14లో మాత్రం 140కి పతనమైంది. 2015లో 136కు పెరిగి, 133కు పెరిగి, తిరిగి ఈ ఏడాది 136కు పతనమైంది. అందువలన ప్రతి ఒక్కరూ గతాన్ని ఒక్కసారి నెమరువేసుకోవటం అవసరం.
ఈ నివేదికను రూపొంచిన ఆర్ఎస్ఎఫ్ ‘అటువంటి జాతీయ వాదులు జాతీయ వ్యతిరేకమైన వనే పేరుతో వ్యక్తమౌతున్న అభిప్రాయాలన్నింటినీ జాతీయ చర్చ నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని’ పేర్కొన్నది. ఇక్కడ వారిని హిందూ జాతీయ వాదులు అని వర్ణించింది. హిందుస్తాన్ టైమ్స్ అసోసియేటెడ్ ఎడిటర్ జతిన్ గాంధీ ఈస్ట్రన్ ఐ అనే పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ‘ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) నుంచి హింసాకాండ బెదిరింపులు చిత్రంగా వుంటాయి. వాటిని టిటర్ ఇతర సామాజిక మీడియా వేదికల నుంచి పంపుతారు. బిజెపి అధికారానికి వచ్చిన తరువాత చాలా ఎక్కువగా పెరిగాయి. తాము జీర్ణించుకోలేని గుర్తించిన వార్తలు రాసినందుకు లేదా కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారికి భూతాల వంటి మరుగుజ్జు సేనలు(ట్రోల్స్) వున్నాయి. ఆ పని చేసినందుకు కొందరికి డబ్బు చెల్లిస్తారు. మరి కొందరు వారి భావజాలంతో ప్రభావితమై చేస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కొద్ది రోజులైనా జర్నలిస్టుల జీవితాలను దుఖ:పూరితం చేస్తారు. అంతకు ముందు ప్రభుత్వ హయాంలో వారు లేరని నేను చెప్పలేను, అయితే మితవాద హిందూ మతశక్తులు అధికారంలో వున్న పార్టీ మద్దతు పొందారు. కాబట్టే వారు అధికారంలో వున్న వారు తమకు మద్దతు ఇస్తున్నారనే ధైర్యం తెచ్చుకున్నారు.’ అన్నారు.
ఒకవైపు భూతాల మరుగుజ్జుసేనలను నిర్వహించే ఆర్ఎస్ఎస్లో సభ్యుడైన నరేంద్రమోడీ మరోవెపు ప్రధానిగా ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినం సందర్బంగా విడుదల చేసిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు.’ఈ రోజు మరియు కాలంలో సామాజిక మీడియా ఒక చురుకైన మాధ్యమంగా ముందుకు వచ్చి పని చేస్తోంది.పత్రికా స్వేచ్చకు మరింత పరిపుష్టిని చేకూర్చింది. ప్రపంచ పత్రికా స్వేచ్చ దినం సందర్భంగా ఎలాంటి వూగిసలాటలు లేని మద్దతును పునరుద్ఘాటిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యానికి అత్యవసరం’ అని పేర్కొన్నారు.
నివేదిక వివరాల ప్రకారం ఒక ఏడాది కాలంలో ఏ దేశాలలో అయితే మీడియా పరిస్ధితి మెరుగు లేదా మొత్తం మీద మెరుగ్గా వుంది అన్న తరగతి దేశాలలో 2.3 శాతం పడిపోయింది.ఈ సంస్ధ పరిగణనలోకి తీసుకున్న 180 దేశాలలో కెనడా, పోలాండ్, న్యూజిలాండ్, నమీబియా వరుసగా 4,7,8,7 పాయింట్ల చొప్పున గతేడాది కంటే పతనమయ్యాయి.వుత్తర ఐరోపా, వుత్తర అట్లాంటిక్ ప్రాంతంలో వుండి నార్డిక్ లేదా స్కాండినేవియా దేశాలుగా పిలువబడేవి మీడియా స్వేచ్చలో ప్రధమ స్ధానాలలో వుంటున్నాయి. చివరికి అలాంటి చోట్ల కూడా స్వేచ్చకు భంగం వాటిల్లి కొన్ని పాయింట్లు పతనమయ్యాయి.గత ఆరు సంవత్సరాలలో ఫిన్లండ్ తన ప్రధమ స్ధానాన్ని తొలిసారిగా కోల్పోయింది, నెదర్లాండ్స్ రెండు పాయింట్లు పతనమైంది.
ఈ నివేదికను చూస్తే నరేంద్రమోడీని అభిమానించే వారు ఆశాభంగానికి గురిగాక తప్పదు. ఎందుకంటే వారికి వారికి పాకిస్ధాన్ జపం చేయకుండా రోజు గడవదు. పత్రికా స్వేచ్చ విషయంలో గత మూడు సంవత్సరాలలో తన స్దానాన్ని అదెంతో మెరుగుపరుచుకుంది. ఏకంగా 159 నుంచి 139కు పెంచుకొని మనకంటే రెండు దేశాల దిగువనే వుంది. ఆర్ఎస్ఎఫ్ను పాకిస్ధాన్ పాలకులు మేనేజ్ చేశారేమో అని ఎవరైనా అనే ప్రమాదం లేకపోలేదు. అది నిజమే అనుకుంటే అంతర్జాతీయ మీడియాను కూడా మేనేజ్ చేయగల మన నరేంద్రమోడీ, చంద్రబాబు, వెంకయ్య వంటి వారు విఫలమైనట్లు అంగీకరించటమే.
ప్రపంచానికి ప్రజాస్వామ్యం నేర్పామని చెప్పుకొనే బ్రిటన్‌లో గతేడాది ఒక సిరియన్ జర్నలిస్టు పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. బ్రిటన్ చరిత్రలో పరిశోధనాత్మక జర్నలిజానికి సమాధి కట్టే నిఘా చట్టాన్ని అమోదించారు. అంతకంటే దారుణం ఏమంటే ఎవరైనా ఒక జర్నలిస్టును గూఢచర్య చట్టం కింద ఒక జర్నలిస్టు లీకు చేసిన సమాచారాన్ని సేకరిస్తే అతడు లేదా ఆమెకు 14 సంవత్సరాల జైలు శిక్షను విధించవచ్చు.ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై నియంతృత్వ చర్యలు అమలు జరపటమే బ్రిటన్ ర్యాంకు పతనానికి కారణమని లండన్ విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్ రాయ్ గ్రీన్ స్లేడ్ వ్యాఖ్యానించారు. ఐరోపా యూనియన్ నుంచి బయటకు రావాలనే ప్రజాభిప్రాయ సేకరణ(బ్రెక్సిట్) సందర్భంగా మీడియాపై జరిగిన దూషణ భూషణలు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు కూడా అక్కడి పత్రికా స్వేచ్చను దిగజార్చాయి.
విషపూరితమైన ప్రచారం, ఇతర రాజకీయ వతిళ్లు అనే శీర్షికతో అమెరికా గురించి నివేదికలో అక్కడి పరిణామాలను విశ్లేషించారు. భూమ్మీద అత్యంత నీతి నిజాయితీలు లేని వారెవరైనా వున్నారంటే జర్నలిస్టులే అని, మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని స్వయంగా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన అంశాన్ని ప్రస్తావించి, ట్రంప్ చేసిన ఈ దాడితో ప్రపంచ వ్యాపితంగా చివరికి ప్రజాస్వామిక దేశాలుగా పరిగణించబడేచోట్ల కూడా మీడియాపై దాడులు పెరిగాయని తెలిపింది. భావప్రకటనా స్వేచ్చను కాపాడే అమెరికా సంప్రదాయంతో ట్రంప్ యంత్రాంగం రాజీపడిందని కూడా పేర్కొన్నది.
ట్రంప్ తన తొలి వందరోజుల పాలనా ప్రదర్శన సందర్భంగా పెన్సిల్వేనియాలో మాట్లాడుతూ మీడియా నకిలీ వార్తలను అందిస్తోందని మరోసారి ఆరోపిస్తూ వార్తల పరీక్షలో మీడియా తప్పిందని అన్నాడు. అధ్యక్ష భవన మీడియా ప్రతి ఏటా ఇచ్చే వార్షిక విందును బహిష్కరించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా చరిత్రకెక్కాడు.
ఇండియా స్వేచ్చ నివేదిక
ప్రపంచ మీడియా స్వేచ్చా దినం సందర్భంగా ఇండియా స్వేచ్చ నివేదిక పేరుతో సెవంతీ నైనన్, గీతా శేషు, శిల్పి గోయల్ విడుదల చేసిన నివేదిక హూట్ అనే వెబ్సైట్ ప్రచురించింది.దాని సారాంశం ఇలా వుంది. గత పదహారు నెలల కాలంలో పత్రికా స్వేచ్చ, భావ ప్రకటనా స్వేచ్చ, ఆన్లైన్ స్వేచ్చ, వ్యక్తిగత స్వేచ్చ సమస్యల విషయానికి వస్తే ఇటీవల ఎన్నడూ లేని విధంగా మొత్తం మీద తగ్గుతున్న భావన కలుగుతోంది. కుంగి పోతున్న సమాచార, ఇంటర్నెట్, భావ ప్రకటనా స్వేచ్చ హక్కులు లేకుండా మీడియా నిజమైన స్వేచ్చతో వుండలేదు. నివేదిక కాలంలో దేశంలోని మీడియాలో ప్రచురితమై హుట్ వెబ్సైట్ సేకరించిన వివరాల ప్రకారం దేశవ్యాపితంగా 54 దాడులు జరిగాయి. వాస్తవంగా ఇంకా పెద్ద సంఖ్యలోనే దాడులు జరిగి వుంటాయి. ఎందుకంటే 2014-15లో జర్నలిస్టులపై 142 దాడులు జరిగినట్లు హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ అహిర్ లోక్‌సభలో వెల్లడించారు. ఏడుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. అయితే వారి హత్యలకు జర్నలిజమే అనే సహేతుకమైన కారణం కేవలం ఒక్క కేసులోనే లభ్యమైంది. ప్రతి దాడి వెనుక వున్న కథనాలను చూస్తే ఒక స్పష్టమైన, స్ధిరనిశ్చయమైన పద్దతి కనిపిస్తోంది. అదేమంటే పరిశోధనాత్మక జర్నలిజం రోజు రోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. జర్నలిస్టులు ఎవరైనా ఏ కథనం కోసమైనా పరిశోధనకు పూనుకుంటే అది ఇసుక తవ్వకం, రాళ్ల గనులు, అక్రమ నిర్మాణాలు, పోలీసు దౌర్జన్యాలు, వైద్యపరమైన నిర్లక్ష్యం, దేని నుంచైనా తొలగించే ప్రయత్నం, ఎన్నికల ప్రచారం లేదా పౌరపాలనా యంత్రాంగ అవినీతి ఏదైనా దాడులకు గురవుతున్నారు.
క్షేత్ర స్ధాయిలో ఏం జరుగుతోందన్నది పక్కన పెడితే దానితో పోల్చుకుంటే కాస్త రక్షణ వుండే టివీ స్టూడియోలలో చర్చలునిర్వహించే లేదా సామాజిక మీడియాలో అభిప్రాయాలను వెల్లడించే వారు రకరకాల బెదిరింపులకు గురవుతున్నారు.ఈ వుదంతాల వెనుక వున్న వారిని చూస్తే రాజకీయవేత్తలు, నిఘా బృందాలు, పోలీసు మరియు భద్రతా దళాలు, లాయర్లు ( జెఎన్‌యు వుదంతం సందర్భంగా పాటియాల కోర్టు వుదంతమే గాక కేరళలో అనేక దాడులు చేశారు.) కొందరు బాలీవుడ్ హీరోలు, ఎక్కువగా అక్రమ వ్యాపారాలు, గనుల తవ్వకాలు సాగించే మాఫియాలు లేదా నేరగాళ్లు స్ధానిక రాజకీయ నేతలు, చట్టాన్ని అమలు చేసే సంస్ధల ఎరుకలోనే దాడులకు పాల్పడుతున్నారు. దాడులకు పాల్పడుతున్నవారెవరో స్పష్టంగా తెలిసినప్పటికీ వారు స్వేచ్చగా తిరుగుతున్నారు. హూట్ దగ్గర వున్న సమాచారం ప్రకారం దాడులలో చట్టాలను చేసే వారు, అమలు చేసే వారే ప్రధాన నిందితులుగా వున్నట్లు వెల్లడి అవుతోంది.
54 దాడుల వివరాలు
దాడులకు పాల్పడిన వారు సంఘటనలు
మాదకద్రవ్య స్మగ్లర్లు 1
సినిమా నటులు, సిబ్బంది 2
ఎబివిబి సభ్యులు 3
అక్రమ నిర్మాణదారులు 3
నిర్ధారణ కాని వుద్ధేశాలు 3
లిక్కర్ మాఫియా 2
గుజరాత్ దాడుల నేరగాడు సురేష్ 3
పోలీసులు 9
అవినీతి అధికారులు 2
రాజకీయనేతలు, మద్దతుదారులు 8
లాయర్లు 4
గోరక్షకులు 1
సైన్యం, పారామిలిటరీ 2
ఇసుక మాఫియా 1
వైద్యులు 1
మీడియా వార్తలను నిరసించిన వారు 9
విద్యార్ధులు 2
అక్రమ గనుల తవ్వకదారులు 1
జర్నలిస్టులను బెదిరించిన 25 వుదంతాలకు బాధ్యులు
రాజకీయనేతలు, సభ్యులు 6
మైనింగ్ మాఫియా 2
మిలిటెంట్స్ 1
పోలీసు 4
నిఘాబృందాలు 2
ట్విటర్ ట్రోల్స్ 5
ఎబివిపి 1
లాయర్లు 3
ఆధార్ 1
ప్రభుత్వం వివిధ స్థాయిలలో సెన్సార్షిప్ను అమలు జరిపే యత్నాలు చేస్తోంది, అదే మాదిరి ప్రయివేటు రంగ మీడియా యజమానులు కూడా చేస్తున్నారు. ఈ సమీక్షా కాలంలో మీడియా సెన్సార్షిప్, వార్తలను తొక్కిపెట్టటం, మరియు స్వయం నియంత్రణకు సంబంధించి కొన్ని కొట్టొచ్చినట్లు కనిపించే వుదంతాలను చూద్దాం. 2016 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపుల ఆందోళనకు సంబంధించిన వార్తలను చూపిన తీరు తెన్నులపై సాక్షి మరియు నం 1 న్యూస్ ఛానల్స్ ప్రసారాలను కేబుల్ ఆపరేటర్లద్వారా నిలిపివేయించింది. మాజీ మంత్రి, కాపుల నాయకుడు ముద్రగడ పద్మనాభం తన డిమాండ్లకు మద్దతుగా నిరవధిక దీక్ష ప్రారంభించాడు, దాంతో కోస్తా ప్రాంతంలో వుద్రిక్త పరిస్ధితులు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జగన్మోహన్రెడ్డికి చెందిన సాక్షి టీవీ ఈ పరిణామాలను విస్తృతంగా చూపగా మిగతా ఛానల్స్ ఆచితూచి వ్యవహరించాయి. తరువాత ఆకస్మికంగా సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. తమ ఛానల్ ప్రసారాలను అడ్డుకున్నారని సాక్షి గ్రూపు పేర్కొన్నది.
బుర్హాన్ వనీ హత్య తరువాత కాశ్మీర్ మీడియా సెన్సార్షిప్ మరియు వేధింపులకు గురైంది. జూలై మాసంలో అక్కడి రెండు పెద్ద పత్రికల కార్యాలయాలపై దాడులు జరిగాయి, వాటి పత్రికలను స్వాధీనం చేసుకున్నారు, వారి ముద్రణా యంత్రాలను మూసివేశారు. ఆగస్టు నెలలో వివిధ ఆదిమ తెగల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ స్వతంత్ర జర్నలిస్టు నేహా దీక్షిత్, ఆమె పిల్లల అపహరణ గురించి ఆమెరాసిన వార్తను ప్రచురించిన అవుట్‌లుక్ పత్రిక ముద్రాపకుడు, సంపాదకులు అయిన ఇంద్రనీల్‌రాయ్, కృష్ణ ప్రసాద్‌లపై 2016 జూలై 29న క్రిమినల్ కేసు దాఖలు చేశారు.
అక్టోబరు నెలలో కేత్రస్ధాయిలో జరుగుతున్న సమాచారాన్ని ప్రచురించి కాశ్మీర్ రీడర్ పత్రికను నిషేధించి చివరికి మూడునెలల పాటు అమలు జరిపారు. రాజ్యం ఎందుకు తమ పట్ల అసహనంతో వ్యవహరించిందో దాని సంపాదకుడు తెలిపారు. పఠాన్‌కోట్ దాడి సందర్భంగా సైనిక చర్య వ్యూహాత్మక సమాచారాన్ని వెల్లడించిందనే పేరుతో నవంబరు నెలలో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎన్‌డిటీవిపై ఒక రోజు నిషేధాన్ని విధించింది. సదరు ఛానల్ ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మంత్రిత్వశాఖ నిషేధాన్ని నిలిపివేసింది. డిసెంబరులో తమిళనాడు ముఖ్యమంత్రిగా వున్న జయలలిత మరణించినపుడు టీవీ ఛానల్స్ అ వార్తను సాయంత్రమే ప్రసారం చేయగా యాజమాన్యం ఏడుగంటలపాటు తొక్కి పెట్టింది.
పార్లమెంట్ సభ్యుడు, వాణిజ్యవేత్త అయిన రాజీవ్ చంద్రశేఖర్ ప్రస్తావన రెండు వ్యాసాలను వెనక్కు తీసుకోవాలని బెంగలూరు కోర్టు ఏకపక్షంగా ది వైర్ న్యూస్ పోర్టల్‌ను ఆదేశించింది. ఇదెంతో ఆసక్తిని కలిగించింది, ఎందుకంటే ఆయన మద్దతు ఇచ్చే రాజకీయ సిద్ధాంతాలు, ఆయన స్వంతమైన మీడియా గురించి సంబంధాలను, లేదా మిలిటరీతో సంబంధాలు కలిగిన అతని వాణిజ్య ప్రయోజనాల గురించి, సాయుధ బలగాల కేంద్రంగా ఆయన బహిరంగ కార్యకలాపాల గురించి వెల్లడించిన తొలి వెబ్సైట్ అది కాదు.
ప్రపంచ వ్యాపితంగా 2016లో 102 మంది జర్నలిస్టుల హత్య
ప్రపంచ వ్యాపితంగా 2016లో కనీసం 102 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా వెల్లడించారు. ప్రపంచ మీడియా పరిరక్షణ దినం సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టులను హత్య చేయటం ఏ మాత్రం అంగీకారం కాదని, ప్రపంచం వారికి రక్షణగా ముందుకు రావాలని కోరారు. శాంతి, న్యాయాలకు పత్రికా స్వేచ్చను పరిరక్షించుకోవాలని కోరారు. వాస్తవ, విమర్శనాత్మకమైన, సమగ్రంగా పరిశోధించిన జర్నలిజం కావాలని కోరారు. పౌర జర్నలిస్టులు జర్నలిజం సరిహద్దులను పున:నిర్ణయిస్తున్నారు, మీడియా జవాబుదారీతనం, విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోంది,ఆన్లైన్ మీడియాలో ప్రకటనల సమాచారం, సంపాదక సమాచారానికి గీతలు చెరిగి పోతున్నాయి, నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని యునెస్కో డైరెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయమైన సమాచారానికి వనరుగా మాత్రమే గాక భిన్న గళాలకు వేదికగా వుండాలని, సహనం, చర్చలకు నూతన శక్తులను సమీకరించాలని కోరారు.