Tags
Amith shah, BJP, Dharma Danda, Jawaharlal Nehru, Narendra Modi, Narendra Modi Failures, Raja Danda, RSS, Sengol, vd savarkar
ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద అంశాలను ముందుకు తేవటం ప్రతిపక్షాలను, జనాన్ని వాటి చుట్టూ తిప్పటంలో కొంత మంది సిద్దహస్తులు. వారిలో నరేంద్రమోడీకి సాటి రాగల వారెవరూ కనిపించటం లేదు. గతాన్ని కాసేపు పక్కన పెడితే నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని ప్రధమ పౌరురాలు, రాజ్యాంగ అధిపతిగా ఉన్న రాష్ట్రపతి పదవిని అగౌరవపరచి, ఆ పదివిలో ఉన్న ద్రౌపది ముర్మును విస్మరించి తానే ప్రారంభించి చర్చకు తెరలేపారు. అదే విధంగా రాజ్యాంగం. అధికారంతో సంబంధంలేని ఒక రాజ దండాన్ని ముందుకు తెచ్చి మరో పనిలేని చర్చను ముందుకు తెచ్చారు. పురాతన సంప్రదాయాలకు ప్రాణ ప్రతిష్ట చేయాలనే నాన్నగారి తాతగారి భావాలకు దాసులైన వారికి వెనుక చూపు తప్ప వర్తమానం, ముందు చూపు ఉండదు. అలాంటి వారు కుహనా గతాన్ని అమలు జరపాలని చూస్తారు. లేని చరిత్రను, ఉదంతాలను సృష్టించటంలో, చిన్న వాటిని బూతద్దంలో చూపటంలోనూ పేరు మోసిన మన వాట్సాప్ విశ్వవిద్యాలయం స్వర్గంలో ఉన్న గోబెల్స్‌కు సదరు అంశాలపై తమకు మార్గదర్శకుడిగా ఉన్నందుకు గౌరవడాక్టరేట్ ప్రదానం చేసిందట.
ఫలానా చోట ఫలానా ఉదంతం జరిగింది. మీడియాలో మొత్తం హిందూ వ్యతిరేకులే ఉన్నందున ఏ టీవీ, పత్రికలోనూ రాలేదు, రాదు. కనుక మీరు దీనిని అందరికీ పంపించండి అన్న తప్పుడు వర్తమానం ఒక్కటైనా వాట్సాప్‌ను వాడే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు అందే ఉంటుంది. పెద్దలు చెప్పిన ఒక హితవును కాషాయ దళాలు పక్కాగా పాటిస్తున్నాయి . అదేమంటే ఒక అబద్దం చెబితే గోడ కట్టినట్లు ఉండాలి తప్ప తడికలా ఉండకూడదు. ప్రాణ, విత్త, మాన భంగములందు అబద్దం చెప్పవచ్చనే మినహాయింపు ఇచ్చారు మన పెద్దలు. దీనీలో ఎన్నికలను కూడా చేర్చి పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వీటిని చూసి, విని గోబెల్స్ కూడా సిగ్గుపడుతున్నట్లు సమాచారం. తాజాగా దేశమంతటా పెద్ద చర్చ జరిగిన, పార్లమెంటులో ప్రతిష్టించిన రాజదండం గురించి కేంద్ర హౌంమంత్రి అమిత్ షా తడిక కథ చెప్పారు. దేవుడు ప్రసాదం తినడని పూజారికి మాత్రమే తెలుసు. అదే మాదిరి నరేంద్రమోడీకి రాజకీయ ఇబ్బందులు వస్తున్నట్లు అమిత్‌షాకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. ఆడిన మాట తప్పని తెగకు చెందినవారం అని చెప్పుకుంటారు గనుక చెప్పింది వాస్తవం కాదు అని తేలిన తరువాత కూడా తన ప్రకటనను వెనక్కు తీసుకోలేదు, సవరించుకోలేదు. చరిత్రలో అత్యంత దుర్మార్గమైన రెండవ ప్రపంచ యుద్ధం తప్పుడు ప్రచారంతోనే నాజీలు ప్రారంభించారు. అదేమిటంటే జర్మనీ రేడియో ట్రాన్స్‌మిటర్ మీద పోలాండ్ చేసిన దాడికి ప్రతీకారం పేరుతో హిట్లర్ మూకలు పోలాండ్ మీద టాంకులతో దాడికి దిగాయి. ఒక ట్రాన్స్‌మిటర్‌ను ధ్వంసం చేస్తేనే మరొక దేశం మీద దాడికి దిగాలా ? ఏదో ఒక సాకు కావాలి. తరువాత నిజానిజాలు వెల్లడైనా అప్పటికే జరగాల్సిన మారణ హౌమం జరిగింది. మహా జర్మనీ నుంచి నినాదం నుంచి కాపీ కొట్టిందే అఖండభారత్,అలాంటి అనేక పోలికలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గతమెంతో ఘనం అన్న జాతీయవాదం రోజు రోజుకూ ఊపందుకుంటోంది. ఏ దేశ చరిత్రలోనైనా ఘనమూ, హీనమూ రెండూ ఉంటాయి. ఘనాన్ని దాచుకొని రెండవ దాన్ని చరిత్ర చెత్తబుట్టలోకి నెడుతుంది. దాన్నుంచి కూడా లబ్ది పొందాలని చూసే వారు చరిత్రలో కోకొల్లలుగా కనిపిస్తారు.
నూతన పార్లమెంటు భవనంలో గత ఘనం, సంస్కృతి పరిరక్షణలో భాగంగా రాజ దండానికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నామంటూ మన ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ప్రతిష్టించారు. అంతకు ముందు హౌమంత్రి అమిత్ షా విలేకర్లతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినపుడు బ్రిటీష్ చివరి వైస్రాయి మౌంట్ బాటన్ అధికార మార్పిడి చిహ్నంగా రాజదండాన్ని నెహ్రూకు అందచేస్తే దాన్ని పక్కన పెట్టేసి మన సంస్కృతిని అవమానపరిచారు, ఆ చారిత్రాత్మకమైన రాజదండాన్ని ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంటు భవనంలో ప్రతిష్టించి గౌరవాన్ని నిలబెడతారు అని సెలవిచ్చారు. దేశ ప్రజలందరూ దీన్ని చూసి ఈ చారిత్రాత్మక ఉదంతం గురించి తెలుసుకోవాలని, అందరికి గర్వకారణము అని కూడా చెప్పారు. ఆ రాజదండం మన దేశంలోని అనేక రాజవంశాలలో ఏదో ఒకరు వాడినది అనుకుందామా అంటే అదేమీ కాదు. అది శైవ మతాన్ని అవలంభించిన వారు రూపొందించిన దండం, వైష్టవులు, బౌద్ద, జైనాలను ఆదరించిన రాజులు వాడిన దండాలు వేరుగా ఉంటాయి. వర్తమాన ప్రభుత్వం అంగీకరించాలంటే ఏ రాజదండాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ? అసలు అది రాజదండం కాదు, చరిత్రలో వర్ణించిన చోళ రాజరిక దండ నమూనా మాత్రమే. స్వాతంత్య్ర తరుణంలో అధికార మార్పిడి గురుతుగా ఏదైనా క్రతువు నిర్వహించుతారా అని మౌంట్ బాటన్ నాడు నెహ్రూను అడిగారట. దాని గురించి రాజాజీగా సుపరిచితులైన సి రాజగోపాలచారిని నెహ్రూ సంప్రదించగా చోళ రాజుల పద్దతిని పాటిద్దామని చెప్పారట. ఈ పూర్వరంగంలో తమిళనాడులోని తిరువదుత్తురై అనే ఒక మఠానికి చెందిన వారు 1947 ఆగస్టు 14 రాత్రి నెహ్రూకు నమూనా రాజదండాన్ని పూజా పునస్కార తంతుతో బహుకరించారు తప్ప దానికి మౌంట్‌బాటన్‌కు ఎలాంటి సంబంధమూ లేదు. నమూనా రాజదండాన్ని ఉమ్మిడి బంగారు చెట్టి రూపొందించగా ఉమ్మిడి ఎతిరాజులు(96),ఉమ్మిడి సుధాకర్(88) తయారు చేశారు. వారు చెన్నైలో నివసిస్తున్నారు. క్రీస్తు పూర్వం 300సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1279 వరకు చోళ రాజుల పాలన సాగింది. అంటే తరువాత వారి రాజదండాన్ని ఎవరికిచ్చినట్లు ? తరువాత వచ్చిన రాజులు దాన్ని పక్కన పెట్టి కొత్త రాజదండాలను వాడారా అసలు సిసలు దండం ఎక్కడ ఉన్నట్లు అన్న ప్రశ్నకు సమాధానం లేదు.
అసలు పురావస్తుశాలలోని రాజదండం ఎలా వెలుగులోకి వచ్చిందన్నది ఆసక్తికరం. దీనికోసం చెప్పిన ” కత ” విన్న తరువాత సందేహాలు తలెత్తటం సహజం. దీన్ని చారిత్రాత్మక రాజదండం అని వర్ణించటంతోనే పురాతన వస్తువు పేరుతో నకిలీలను అంటగట్టే మోసగాళ్లను గుర్తుకు తెచ్చారు. చోళుల నాటి ఈ రాజదండాన్ని బ్రిటీష్ వారికి అందచేయగా వారి చివరి ప్రతినిధి మౌంట్‌బాటన్ అధికార మార్పిడి సూచికగా దాన్ని దాని నెహ్రూకు అందచేశారన్నది కూడా మోసగాళ్ల కథలో భాగమే. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌గా మారిన పూర్వపు అలహాబాద్ నగరంలో నెహ్రూ నివాసం ఆనంద భవన్‌ను ఒక పురావస్తుశాలగా మార్చారు. దానిలో తనకు బహుమతిగా ఇచ్చిన నమూనా రాజదండాన్ని కూడా ఉంచారు. దాన్ని బంగారు చేతి కర్రగా నమోదు చేశారు. ఇది చోళ రాజవంశం నాటిదని చివరికి అమిత్ షా కూడా నమ్మారు.లేదా నమ్మినట్లు నటించి చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనం ప్రకారం దాన్ని తయారు చేసిన ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబీకులు కూడా దాని గురించి మరచిపోయారు.నిజానికి దానికి అంతటి ప్రాధాన్య ఉంటే దాన్ని తయారు చేసిన ఆ కుటుంబీకులు ఇప్పటికీ సజీవులుగా ఉన్నప్పటికీ గడచిన 75 సంవత్సరాలుగా తమ వారికి చెప్పలేదంటే తాము తయారు చేసిన అనేక వస్తువుల్లో ఒకటిగా చూశారు తప్ప మరొకటి కాదన్నది స్పష్టం. ఆ కుటుంబానికి చెందిన ఉమ్మిడి అమరేంద్రన్ చెప్పినదాని ప్రకారం 2018లో ఒక పత్రికలో దాని గురించి చదివారట. మరుసటి ఏడాది పురావస్తు శాలలో చూశారట. దాని గురించి ఒక పత్రికా గోష్టి పెడదామనుకుంటే కరోనా (2020లో కరోనా బయటపడింది) కారణంగా కుదరలేదట. దాంతో ఒక నిమిషము నిడివి గల వీడియో తీస్తే అది నరేంద్రమోడీ కంటబడటంతో వెలుగులోకి వచ్చిందట. దాన్ని ఎప్పుడు తీశారు, నరేంద్రమోడీ ఎప్పుడు చూశారు, ప్రధానికి వీడియోలు చూసే తీరిక ఉందా అని సందేహం కలగవచ్చు.
ఉమ్మిడి కుటుంబం దాన్ని వంద సావరిన్(సవర్లు)ల బంగారంతో తయారు చేసి ప్రభుత్వం నుంచి రు.15వేలు తీసుకున్నదట. దీని గురించి ప్రధాని మోడీ కార్యాలయం పంపిన బృందంలోని జర్నలిస్టు ఎస్ గురుమూర్తి ఉమ్మిడి కుటుంబాన్ని సంప్రదించారు. వారి కోరిక మేరకు దాని ప్రతిరూపాన్ని రూపొందించారు. వెండితో చేసిన దానికి బంగారు పూత పూశారు. అసలైన బంగారు వస్తువును శాశ్వతంగా పార్లమెంటు భవనంలో, దాని ప్రతి రూపాన్ని జనం కోసం ప్రదర్శిస్తారని చెప్పారు. గవర్నర్ జనరల్‌గా ఉన్న రాజగోపాల చారి అనేక పుస్తకాలను చదివి చివరికి చోళుల రాజదండం గురించి తెలుసుకొని కొత్త రాజులకు అధికారిక మార్పిడి సూచికగా రాజదండాలను అందచేసే వారని తెలుసుకొన్నారు. తరువాత తికెవదుత్తురై మఠానికి చెందిన స్వాములను సంప్రదించి బంగారు రాజదండాన్ని తయారు చేయించి వారి ద్వారానే నెహ్రూకు అంద చేయించారు. దీనికి నెహ్రూ అంగీకరించారని చెబుతున్నారు. అదే గనుక వాస్తవమైతే అదే నెహ్రూ దాన్ని ఎందుకు పక్కన పడవేసినట్లు ? తన తరువాత అధికారానికి వచ్చేవారికి దాన్ని అందచేసేందుకు ఎందుకు ఏర్పాట్లు చేయలేదు ? ఈ విషయాలన్నీ తరువాత అధికారానికి వచ్చిన లాల్‌బహదూర్ శాస్త్రికి ఎవరూ ఎందుకు చెప్పలేదు ? నెహ్రూకు అందచేసిన మఠాధిపతులైనా తరువాత ప్రధానులుగా చేసిన వారికి కూడా ఎందుకు ఈ ఘనమైన సంప్రదాయం, సంస్కృతి గురించి ఎందుకు గుర్తు చేయ లేదు ? ఇలా ఆలోచించటం కూడా జాతి వ్యతిరేకం అంటారేమో ? రాజదండ ప్రహసనం వచ్చే ఎన్నికల్లో తమిళుల ఎన్నికల కోసమే అన్న విమర్శ ఉంది.
ద్రావిడ నాడు అనే పత్రికలో 1947 ఆగస్టు 24వ తేదీ సంచికలో తరువాత డిఎంకె స్థాపకుడిగా, సిఎంగా పని చేసిన సిఎన్ అన్నాదురై రాజదండం బహుకరించిన వారి ఉద్దేశం ఏమిటో గ్రహించాలని నెహ్రూను హెచ్చరిస్తూ రాశారు. దానిలో ఎక్కడా అది చోళుల నాటి రాజదండం అని గానీ పరంపరగా అధికార బదిలీ గురించిగానీ లేదు. అన్ని రకాలుగాను జనాన్ని దోచుకుంటున్న మఠాలు, స్వాములు కేంద్ర ప్రభుత్వాన్ని మంచి చేసుకొనేందుకు, తమ ఆస్తుల జోలికి రాకుండా, ఎదురులేకుండా చేసుకొనేందుకు గాను దాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు.దాని గురించి తమిళనాడు ప్రభుత్వ పత్రాల్లో ప్రస్తావించారు.అధికారానికి చిహ్నంగా రాజముద్రికలు ఉండేవి.రాజ ఫర్మానాల మీద ఆ ముద్రిక ఉంటేనే దాన్ని రాజాధికారిక పత్రంగా పరిగణించారని తెలుసు. రాజులుగా అధికారం స్వీకరించినపుడు కిరీటం ధరించటం అధికారిక చిహ్నంగా ఉండేది. రాజదండం అనేది ఒక అలంకార ప్రాయం తప్ప అధికారిక గుర్తు కాదు. అధికార మార్పిడి అంటే ఒక పత్రం మీద సంతకం చేసి కరచాలనం చేసుకోవటమే కాదు, స్థాుక సంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలని అమిత్ షా గారు చెప్పారు. మన దేశంలో అనేక రాజవంశాలు, సంప్రదాయాలు ఉండేవి. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సంప్రదాయాల ప్రకారం అధికారానికి చిహ్నంగా పరిగణించారని చెబుతున్న రాజదండం, రాజముద్రికలు, కిరీటం రాజుగారి కనుసన్నలలోనే ఉంటాయి.
అలాంటి దాన్ని లోక్‌సభ స్పీకర్ స్థానం పక్కనే ప్రతిష్టించారు. ఆడా మగా కాని ఈ కొత్త పరంపర ఏమిటి ? స్పీకర్ దేశ సర్వాధికారి అని అర్ధమా? ఉప రాష్ట్రపతి ఉండే రాజ్యసభ సంగతేమిటి ? స్థానిక సంప్రదాయాల గురించి వాటికి అసలు సిసలు వారసులుగా చెప్పుకొనే వారి పరంపరకు చెందిన వాజ్‌పాయి, నరేంద్రమోడీ పదవీ స్వీకారం చేసినపుడు వారికి, లేదా ఆర్‌ఎస్‌ఎస్ హిందూత్వ, బిజెపినేతలకు వాటి గురించి గుర్తులేదా ? ఆధునిక రాజ్యాంగం ప్రకారం అధికారాన్ని అనుభవిస్తూ మనుధర్మశాస్త్ర కాలానికి జనాన్ని తీసుకుపోవాలని చూస్తున్న వారికి సంప్రదాయాలను, ఆధునికతను మేళవించాలనే అందమైన మాటలను చెప్పటం కష్టం కాదు. పోనీ అలా చేస్తే నష్టం ఏమిటి , గతాన్ని ఎందుకు వదులు కోవాలి అని గొర్రెదాటు కబుర్ల చెప్పేవారు మపకు ఎక్కడబడితే అక్కడ దొరుకుతారు, వాటిని సమర్ధించటమూ తెలిసిందే. కనిపించిన ప్రతి రాయికి రప్పకూ మొక్కి ఒక నమస్కారమే కదా పోయేదేముంది అనే వారికి కొదవ లేదు. ఆ తర్కం ప్రకారమే సమర్ధన. రాజదండంతో పాటు కిరీటం, పట్టపురాణి, రాజ గురువు, రాజనర్తకి తదితర సాంప్రదాయాల సంగతేమిటి ? ఇపుడు అధికారిక పురోహితులు, స్వాములు లేరు. ఏ ప్రాతిపదికన రాజరిక చిహ్నమైన రాజదండాన్ని పట్టుకొని నరేంద్రమోడీ ఒక మతానికి చెందిన 20 మఠాల వారిని పార్లమెంటులో నడిపించినట్లు ?
ఇదంతా నూతన పార్లమెంటు భవనం బదులు ఒక రాజు కొత్త కోటను ప్రారంభించినట్లుగా ఉంది. అందుకే కొల్‌కతా నుంచి వెలువడే టెలిగ్రాఫ్ దినపత్రిక పతాక శీర్షికలో క్రీస్తు పూర్వం 2023 అని ప్రముఖంగా ప్రచురించింది. రాజరికాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ రాజదండం అన్నది 1300 సంవత్సరాల నుంచి మాత్రమే ఉనికిలోకి వచ్చిందని, దాని అసలు పేరు నంది ధ్వజము అని ఆరియాలజిస్టులు సిహెచ్ బాబ్జీరావు, ఇ శివనాగిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వాములుగా చెలామణిలో ఉన్న కొందరు రాజ దండాన్ని ధర్మ దండం అని పిలిచేవారని చెబుతున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షాకు మద్దతుగా సాంప్రదాయాల గురించి స్వామీజీలు, మరి కొందరు రంగంలోకి దిగారు. రాజు కోరుకుంటే ఇలాంటి వారికి కొదవా ? వారి వాదనలసారం ఇలా ఉంది.
పట్టాభిషేకం జరిగినపుడు మంత్రాల ద్వారా ” నా రాజదండంతో పరిపాలన చేసేందుకు పూనుకున్నాను. నా అధికారంతో నేను పాలన-దండన చేస్తాను ” అని ప్రమాణం చేసిన తరువాత రాజ గురువు రాజును రాజదండంతో తాటించి ధర్మ దండంతో పాలించాలని అందచేస్తాడట.( వేదాల్లోనే అన్నీ ఉన్నాయష అని చెప్పే వేదకాలం నాటి వారు ప్రతి తరంలోనూ ఉంటారు.) రాజదండం అంటే ధర్మ ప్రతీక అని, దానికి వృషభం ప్రతినిధి అని, దానికి ఉండే నాలుగు కాళ్లను సత్య, సౌచ(శుచి), బహుతాద్య,(భూత దయ), నిష్మామకర్మలుగా చెప్పారు. పూర్వీకులు చెప్పిన ధర్మం నాలుగు పాదాలతో నడుస్తుందంటే అర్ధమిదేనట.
నంది ఒక పాదాన్ని ఎందుకు ముడవకుండా కూర్చుంటుందటా !. ఎందుకంటే సత్యం కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు లేచి వెళ్లటానికట. ధర్మాన్ని కాపాడే శివుడి ముందే కూర్చుంటుంది గనుక అది లేవాల్సిన అవసరం ఉండదట. అలాగే నరేంద్రమోడీ ధర్మ పరీక్షకు కూడా పరిగెత్తనవసరం లేదట. అంటే మోడీ శివుడితో సమానం అని చెప్పటం. సంస్కృత పదాలకు అర్ధాలకోసం కూడా వెతుక్కోవాల్సిన పని లేదట. భారత అంటే సత్యం, సెక్యులర్ ఇండియా అంటే మాయ, విశ్వగురువు అంటే దక్షిణామూర్తి (నరేంద్రమోడీ అవతారానికి అర్ధం అదే అని చెప్పలేదుగానీ భావం అదే ). వసుధైక కుటుంబం అంటే స్వచ్చ భారత్, స్మార్ట్ సిటీస్,జాతీయ రహదారులు, కొత్తగా నిర్మించిన రైల్వే స్టేషన్లు, వందే భారత్ తదితరాలు శుచిలో భాగమట. భూత దయ అంటే నమామి గంగ, పునరుత్పాదక శక్తి, ఎల్‌ఇడి లైట్లు, ఉజ్వల పధకం, ఆయుష్మాన్ భారత్, నేరుగా నగదు బదిలీ, గోవధ నిషేధం, ఆవు పేడతో సేంద్రీయ సాగు, నిష్కామకర్మ అంటే అగ్నివీర్, అవినీతి రహిత పాలన, అధికారయంత్రాంగ ప్రక్షాళన, కిసాన్ సమ్మాన్ యోజన, ముద్ర యోజన తదితరాలట. అమృత కాలం నూతన పార్లమెంటు భవనంతో ప్రారంభమౌతుందట. (అంటే ఇప్పటి వరకు చెప్పిన అచ్చేదిన్, ఇతర వాగ్దానాలన్నీ వచ్చే రోజుల్లో అమలు చేస్తారని, గతం గురించి ప్రశ్నించకుండా నోర్మూసుకోవాలని చెబుతున్నారు ధర్మ మూర్తులు) ధర్మ విజయాన్ని పున:ప్రతిష్టించే అవకాశం నరేంద్రమోడీకి వచ్చింది. ధర్మాన్ని కాపాడే ధర్మ దండాన్ని నరేంద్రమోడీ ప్రతిష్ఠిస్తున్నారు గనుక కాంగ్రెస్ వణికి పోతోందని కూడా చెప్పారు.
వీటిని చూస్తే మేం కూడా ఇంతగా పొగడలేదని పూర్వపు భట్రాజులు కూడా సిగ్గుపడిపోతారు( ఒక కులాన్ని కించపరచటంగా భావించవద్దని మనవి) రాజు దైవాంశ సంభూతుడని చిత్రించిన వారు, నిరంకుశ రాజరికాలను ప్రోత్సహించిన వారు రాజదండాన్ని ఆ దేవుడే పంపాడు, దేవు ప్రతినిధులం తాము గనుక రాజులకు అందించే తంతు తమదని పూజారులు చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ భావనలను, హిందూత్వను ముందుకు తెచ్చిన విడి సావర్కర్ కూడా నమ్మారు, అతగాడిని ఆరాధించే శక్తులు గనుకనే సావర్కర్ జన్మదినం రోజునే పార్లమెంటులో రాజదండం ప్రతిష్టాపన, భవన ప్రారంభోత్సం జరిపారు. అదేమీ కాదు, ఏదో ఒక తేదీని ఎంచుకోవాలి కదా అలా చేస్తే ఏదో అలా కలసి వచ్చిందని చెబితే ఎవరూ నమ్మరు. రాజరికాలను తిరిగి ప్రతిష్టించాలనే కోరిక, తిరిగి సమాజాన్ని వెనక్కు నడపాలనే , ప్రజస్వామ్యాన్ని పాతిపెట్టి హిందూత్వ పాలన రుద్దాలన్న ప్రగాఢవాంఛ నరనరాన ఉన్నవారే దీనికి పాల్పడతారని వేరే చెప్పనవసరం లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆలోచనలు అనే గ్రంధంలో బిఆర్ అంబేద్కర్ రాసిన ఒక పేరాలో ఏముందో చూద్దాం.” ఒక బ్రాహ్మణుడు స్వతంత్ర దేశ తొలి ప్రధాని ఐన సందర్భంగా పండుగ చేసుకొనేందుకు బనారస్ బ్రాహ్మలు చేసిన యజ్ఞంలో ప్రధాని నెహ్రూ పాల్గొనలేదు. ఆ బ్రాహ్మలు అందించిన రాజదండాన్ని ధరించలేదు, గంగ నుంచి తెచ్చిన జలాన్ని తాగలేదు ” అని రాశారు. అధికార మార్పిడి జరిగిన మరుసటి రోజు యజ్ఞం జరిగింది. అధికార మార్పిడి చిహ్నంగా రాజదండం, దాన్ని మౌంట్‌బాటన్ అందచేశాడనటాుకి ఎలాంటి రుజువులు, ఆధారాలు లేవు.
గోద్రా ఉదంతం తరువాత గుజరాత్‌లో జరిగిన మారణకాండ సందర్భంగా రాజధర్మం పాటించాలని ప్రధానిగా ఉన్న వాజ్‌పాయి నరేంద్రమోడీకి హితవు చెప్పిన సంగతి తెలిసిందే. దాన్ని పాటించిన దాఖలాల్లేవు. రాజులు దండాన్ని దుష్టుల మీద ప్రయోగించాలని చెప్పారు. ్ల ఎంపీ బ్రిజ్ భూషణ్ తమ మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుమేరకు విధిలేక కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. పోక్సో కేసు పెట్టిన వారిని అరెస్టు చేస్తారన్న సంగతి తెలిసిందే. కానీ తన పార్టీకి చెందిన సదరు ఎంపీ బ్రిజ్ భూషణ్‌కి మద్దతుగా కొందరు ప్రదర్శనలకు దిగుతున్నారు. గుజరాత్‌లో అత్యాచారాలకు పాల్పడి రుజువైన కేసులో శిక్షలను పూర్తిగా అమలు జరపకుండా నేరగాండ్లను విడుదల చేసి వారికి గౌరవ మర్యాదలు చేసిన బిజెపి ఘనులను నరేంద్రమోడీ పల్లెత్తు మాట అనలేదు. బ్రిజ్ భూషణ్ను కాపాడుతూ అరెస్టు డిమాండ్ చేస్తున్న రెజ్లర్ల మీద దండాన్ని ఝళిపించి అధికారాన్ని దేనికి, ఎలా ఉపయోగించేదీ బేటీ పడావో బేటీ బచావో అని చెప్పిన నరేంద్రమోడీ లోకానికి వెల్లడించారు. ఇది మన గతం, సంప్రదాయం అని మనం నమ్మాలి, ఏమి చేసినా కిమ్మన కూడదు ? రాజదండ సందేశమిదే !