Tags
'Socialist' Bernie Sanders, Bible, communist manifesto, Democratic party, Lenin a saint, Pavel Grudinin, russian elections, Soviet communist ideas, v.i.lenin, Vladimir Putin
ఎం కోటేశ్వరరావు
గత వారంలో కమ్యూనిస్టులకు, ఇతరులకు ఆసక్తి కలిగించే రెండు వుదంతాలు జరిగాయి. ఒకటి మార్చి18న జరిగే ఎన్నికలలో మరోసారి పీఠం ఎక్కేందుకు పోటీ పడుతున్న రష్యన్ అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ కమ్యూనిస్టు భావజాలం బైబిల్ నుంచే వచ్చిందని, లెనిన్ దేవదూత వంటి వ్యక్తి అని చెప్పాడు. అమెరికాలోని అమీ హరోవిట్జ్ అనే ఒక మితవాద వీడియో గ్రాఫర్ న్యూయార్క్ విశ్వవిద్యాలయ విద్యార్ధులకు చదివి వినిపించిన నాలుగు ప్రకటనలు ఎవరివి అంటే కమ్యూనిస్టులవి అనే దిమ్మతిరిగే సమాధానం రావటం రెండో వుదంతం.
న్యూయార్క్ విశ్వవిద్యాలయం వుదారవాద భావాల నిలయంగా ప్రసిద్ధి. హారోవిట్జ్ తాను నాలుగు వాక్యాలను చదివి వినిపిస్తానని అవి కమ్యూనిస్టులవో డెమోక్రటిక్ పార్టీవో చెప్పాలని విద్యార్ధులను కోరాడు. మొదటిది ‘మేము సామాజిక మార్పునే పురికొల్పుతాము’. సమాధానం చెప్పిన నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టోలో భాగం అని ఏక కంఠంతో చెప్పారు. ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అది ఎక్కువగా కమ్యూనిస్టు ప్రకటనగానే కనిపిస్తోంది అని చెప్పగా ఒక్కరు మాత్రమే డెమోక్రటిక్ పార్టీ ప్రకటన అని సరిగా చెప్పారు.
‘మేము నూతన వర్గాలను, అణచివేత నూతన పరిస్దితులను, పాతవాటిని తొలగించేందుకు నూతన పోరాట పద్దతులను పాదుకొల్పాము’ అనే ప్రకటన డెమోక్రటిక్ పార్టీదే అని అందరూ సమాధానం చెబుతారని నేను అనుకొంటున్నాను అని ఒక యువతి చెప్పగా ఇద్దరిలో ఒకరు అది కమ్యూనిస్టుమానిఫెస్టోలో భాగం అని చెప్పారు.
‘ ప్రజలపట్ల వివక్షను చూపే విధానాల ఫలితమే జాతి, సంపద, ఆదాయ అసమానతలు ‘ అన్న ప్రకటన డెమోక్రటిక్ పార్టీది అని ముగ్గురిలో ఇద్దరు సరిగానే చెప్పారు. అయితే కొందరు ఇది నిజంగా కమ్యూనిస్టు పార్టీ ప్రకటన కాదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘స్వేచ్చామార్కెట్ పద్దతుల ద్వారా సంపద అసమానతలను పరిష్కరించలేము’ ఈ ప్రకటనపై నలుగురూ అది కమ్యూనిస్టు మానిఫెస్టో చెప్పిన అంశ మే అన్నారు. ఇది డెమోక్రటిక్ పార్టీ ప్రకటనలో భాగం. చిత్రంగా వుందే అది కమ్యూనిస్టు మానిఫెస్టో అంశం మాదిరి ధ్వనిస్తోందే అని ఆశ్చర్యపోయారు ఒకరు.
‘ఈ వ్యవస్ధ పని చేయటం లేదు, ఆర్ధికానికి బంధనాలు వేశాము’ అన్న వ్యాక్యం డెమోక్రటిక్ పార్టీది అని ఇద్దరిలో ఒకరు చెప్పారు. అమెరికన్ విద్యార్ధులు కమ్యూనిస్టు ప్రణాళిక-డెమొక్రటిక్ పార్టీ 2016 ఎన్నికలలో చెప్పినదానికి తేడాను గుర్తించటంలో ఎందుకు గందరగోళపడుతున్నారు అన్నది ఒక ప్రశ్న. అమెరికా పరిణామాలను గమనిస్తున్న వారికి ఇది సహజంగా కనిపిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తరువాత కాలంలో అమెరికాలో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన విషయం తెలిసిందే. కమ్యూనిస్టు ప్రణాళిక-డెమోక్రటిక్ పార్టీ చెబుతున్న అంశాలకు తేడాను జనం గుర్తించలేని కారణంగా, డెమోక్రటిక్ పార్టీని ఒక తీవ్రవాద వామపక్ష సంస్ధగా పరిగణించినందున 2010 నుంచి ఇప్పటి వఅసరకు రాష్ట్రాలు, కేంద్రంలోని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వెయ్యింటిలో, మెజారిటీ రాష్ట్రాల గవర్నర్ ఎన్నికలలో ఆ పార్టీ ఓడిపోయిందని ఒక విశ్లేషణ తెలిపింది. బరాక్ ఒబామా పదవిలో వున్న ఎనిమిది సంవత్సరాల పాటూ అతనొక కమ్యూనిస్టు అనే ప్రచారం సాగుతూనే వుంది. డెమోక్రటిక్ పార్టీని కొందరు కమ్యూనిస్టు లేదా తీవ్రవాద వామపక్ష సంస్ధగా చిత్రించటాన్నీ చూశాము. 2008లో ప్రారంభమైన ఆర్ధిక సంక్షోభం తరువాత అమెరికా కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న స్ధితి, అమెరికాను, యావత్ పెట్టుబడిదారీ వ్యవస్ధను కుదిపిన 2011 సెప్టెంబరు వాల్‌స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం వంటి పరిణామాల పూర్వరంగంలో డెమోక్రటిక్ పార్టీ నినాదాలు, నాయకుల ప్రసంగాలలో పెద్ద మార్పు వచ్చింది. దానికి పరాకాష్టంగా అవును నేను సోషలిస్టును అంటూ డెమోక్రటిక్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు బెర్నీ శాండర్స్ ఆర్ధిక అసమానతల గురించి ఎండగట్టిన తీరు, సోషలిస్టును నన్ను బలపరచండి అంటూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిత్వంకోసం హిల్లరీ క్లింటన్‌తో పోటీపడి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన తీరును చూశాము. లక్షలాది మంది యువత శాండర్స్‌తో గొంతు కలుపుతూ అవును మేమూ సోషలిస్టులటే అంటూ ప్రచారం చేసిందీ విదితమే. అందుకే నేడు అమెరికాలో సోషలిజం అంటే తిట్టుపదం కాదు. డెమోక్రటిక్ పార్టీ అస్ధిత్వరాజకీయాలు ఆ పార్టీని రాడికల్ నినాదాలు చేయిస్తున్నాయి. అయితే దాని స్వభావం అది కాదని సదా గుర్తుంచుకోవాలి. రెండు ప్రధాన పార్టీలలో ఏది ఎక్కువ హానికరమైనది అని ఎంచుకోవాల్సి వచ్చినపుడు డెమోక్రటిక్ పార్టీ కూడా కార్పొరేట్లకే అనుకూలం అయినప్పటికీ ఇంతవరకూ కార్మికవర్గం, నల్లజాతీయుల మొగ్గు ఆ పార్టీవైపే వుంది. అలాంటి వారంతా రోజువారీ, ఆందోళనల సందర్భంగా కమ్యూనిస్టులు మాట్లాడినట్లే దోపిడీ,జాతి వివక్షకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడుతుంటారు. అందువలన యువత డెమోక్రటిక్ పార్టీ – కమ్యూనిస్టు ప్రణాళిక చెప్పిన అంశాల గురించి గందరగోళపడుతున్నారు. ఇది ఒక విధంగా మంచిదే. కమ్యూనిస్టు వ్యతిరేకత నరనరానికి ఎక్కి వున్న స్ధితిలో దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా ఎంతవరకు కలసి అంత మేరకు వామపక్ష భావజాలం వ్యాప్తి చెందినట్లే, సోషలిజం, కమ్యూనిజాలకు ఆమేరకు వ్యతిరేకత తగ్గుతుంది.
అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ రాడికల్ నినాదాల కారణంగా సోషలిస్టు, కమ్యూనిస్టు పదజాలం యువతకు పరిచయం కావటం అక్కడి పాలకవర్గానికి ఆందోళన కలిగించే అంశం. రష్యాలో పాతిక సంవత్సరాల క్రితం కూల్చివేసిన సోషలిస్టు వ్యవస్ధ గురించి 56శాతం మందిలో బెంగ తలెత్తిందని ఒక సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే స్టాలిన్, లెనిన్ పట్ల జనంలో క్రమంగా సానుకూల అభిప్రాయాలూ పెరుగుతున్నాయని కూడా సర్వేలు తెలుపుతున్నాయి. మార్చినెలలో జరగబోయే ఎన్నికలలో అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ నిలబెట్టిన పార్టీ సభ్యుడు కాని లెనిన్ వ్యవసాయ క్షేత్ర అధిపతి పావెల్ గ్రడినిన్ దేశవ్యాపితంగా ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పుతిన్ మినహా మరొకరెవరూ గెలిచే అవకాశం లేదని ఎన్నికల పట్ల నిరాసక్తతతో వున్న వారిలో కూడా వుత్సాహం నింపుతున్నట్లు, నెల రోజుల క్రితంతో పోల్చితే మద్దతు ఇచ్చేవారు రెట్టింపు అయినట్లు మీడియా పేర్కొన్నది. ప్రజల సొమ్ము తస్కరించటాన్ని ఆపండి, జనం మంచిజీవితాలను గడుపుతున్నారనే అబద్దాలకు సమాధికట్టండి, విద్య, వైద్యం వుచితంగా అందచేయాలని, పెన్షనర్లు గౌరవ ప్రద జీవితం గడపాలని కోరుతున్న రష్యన్ రాజ్యాంగాన్ని అమలు చేయటం ప్రారంభించండి అని వుపన్యాసాలలో అడుగుతున్న గ్రడినిన్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది.ఆయన వుపన్యాసం తరువాత తన ఆధ్వర్యంలోని లెనిన్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారి జీవన పరిస్ధితులపై రూపొందించిన వీడియోను ప్రదర్శి ంచి రష్యన్లందరికీ అలాంటి పరిస్థితులు వుండాలని, తనకు అవకాశం ఇస్తే అమలు చేస్తానని చేస్తున్న ప్రచారతీరు కొత్తగా వుంది. గతంలో సహకార వ్యవసాయ క్షేత్రంగా వున్నదానిని ప్ర యివేటీకరించిన సమయంలో దానిలో పనిచేస్తున్న గ్రడినిన్ 1995లో దాదాపు సగం వాటాలను కొనుగోలు చేశారు. గతేడాది నాలుగువందల కోట్ల రూబుళ్ల మేర స్ట్రాబెర్రీ ఇతర తాజా పండ్లను మాస్కో మార్కెట్లో విక్రయించారు. వచ్చిన లాభాలలో ఎక్కువ భాగం తిరిగిదానిలోనే పెట్టుబడి పెట్టటం, కార్మికుల సంక్షేమ చర్యలకు వినియోగిస్తూ ఎడారిలో ఒయాసిస్ మాదిరి సోషలిజాన్ని కాలదన్నుకున్న రష్యాలో సోషలిస్టు పద్దతులలో క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఆధునిక నివాస గృహాలతో పాటు వుచిత పాఠశాలలు, ఆరోగ్య, ప్రసూతి కేంద్రాల నిర్వహణ, పెన్షన్ సదుపాయాలను కలిగిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధ లేకపోయినా కార్మికులకు సంక్షేమ చర్యలు అమలు జరపటం సాధ్యమే అని నిరూపించారు. ప్రభుత్వం అందచేస్తున్న సంక్షేమపధకాల కంటే ఎక్కువ లబ్ది చేకూరుతోంది. వ్యవసాయక్షేత్రంలో పని చేసే కార్మికులకు రష్యన్ సగటు కంటే రెట్టింపుగా 78వేల రూబుళ్ల మేరకు నెలవారీ వేతనం ఇస్తున్నారు. అక్కడ పనిచేసే డ్రైవర్లు నివశించే భవనంలోనే గ్రడినిన్ కూడా వుంటున్నారు. మీరు ఇలా ఎందుకు నిర్వహిస్తున్నారు అని తరచూ అనేక మంది నన్ను అడుగుతూ వుంటారు. రష్యాలో అందరూ ఇలానే వుండాలని నేను కోరుకుంటున్నాను, అది సాధ్యమే అని చెబుతాను అని గ్రడినిన్ చెప్పారు. ఆయన మీసాలు, జుట్టు, రూపు రేఖలు స్టాలిన్‌ను పోలివుండటంతో కొంత మంది ఆయనలో స్టాలిన్‌ను చూస్తున్నారని ఫైనాన్సియల్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యా నించింది. యజమానిగా ఆయన వేతనం లెనిన్ క్షేత్రంలో పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్ల కంటే 26రెట్లు ఎక్కువ అని ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన వివరాలు వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది.
గ్రడినిన్ పట్ల ఓటర్లలో ఆసక్తి జనించిన పూర్వరంగంలో లెనిన్ ఒక దేవదూత అని, బైబిల్ నుంచే సోవియట్ కమ్యూనిస్టు భావన వచ్చిందని పుతిన్ చెప్పటం దానిని ప్రభుత్వరంగంలోని టీవీ ప్రసారం చేయటం ఎన్నికల ప్రచారంలో భాగమే అని చెప్పవచ్చు. ఫిన్లండ్ సరిహద్దులోని వాలమ్ మొనాస్టరీ పునరుద్దరణ సందర్భంగా తీసిన డాక్యుమెంటరీ కోసం పుతిన్ మాట్లాడుతూ ఈ మాటలు చెప్పారు. గతంలో పుతిన్ అనేక సందర్భాలలో చర్చిని సమర్దించారు. ‘కమ్యూనిజం-క్రైస్తవం భావనలు ఒకదానికి ఒకటి పొసగదు అని నేను నమ్మటం లేదు. నేను చెబుతున్నది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు కానీ నేను అనుకుంటున్నది నేను చెబుతాను’ అన్నారు. ‘ముందుగా ఒకటి చెప్పాలి, ఎల్లవేళలా విశ్వాసం మనతోనే వుంటోంది. మన దేశ ప్రజలకు కష్టాలు వచ్చినపుడు అది బలపడింది.ఆ చర్యలు ఎంతో కఠినంగా వున్నాయి. దేవునితో యుద్ధం చేసిన సంవత్సరాలలో చర్చ్‌లను నాశనం అయ్యాయి, పూజారులను లేకుండా చేశారు. అయితే అదే సమయంలో సోవియట్‌లు ఒక నూతన మతాన్ని సృష్టించాయి.నిజంగానే కమ్యూనిస్టు భావజాలం క్రైస్తవానికి చాలా దగ్గర పోలిక వుంది. క్రైస్తవం, కమ్యూనిజం రెండూ కూడా స్వేచ్చ, సోదరత్వం, సమానత్వాన్ని ప్రబోధించాయి. లెనిన్ భౌతిక కాయ్యాన్ని మసోలియంలో వుంచారు. ఆర్ధడాక్స్ లేదా క్రైస్తవుల దేవదూతల అవశేషాలకూ దానికి తేడా ఏముంది’ అని పుతిన్ డాక్యుమెంటరీ నిర్వాహకులతో ప్రశ్నించారు.
రష్యాలో లెనిన్, స్టాలిన్, సోషలిజం, కమ్యూనిజాల పట్ల ఇప్పటికీ అక్కడి జనంలో వున్న అభిమానాల పూర్వరంగంలో వాటిపై మొరటుగా దాడిచేస్తే ఫలితం లేదని గ్రహించిన వ్యక్తిగా ఓటర్లలో గందరగోళం కలిగించేందుకు, తాను లెనిన్, కమ్యూనిజాలను వ్యతిరేకించినప్పటికీ వాటిపట్ల గౌరవం వుందని చెప్పుకొనేందుకు చేసిన ఒక ప్రయత్నంగా చెప్పవచ్చు. తాను అధికారంలో వున్నంత వరకు లెనిన్ భౌతిక కాయాన్ని మసోలియంలోనే వుంచుతానని గతంలో చెప్పాడు. ఎన్నికల సమయం గనుక లెనిన్ గురించి సానుకూలంగా మాట్లాడి దానిని ప్రచారంలోకి పెట్టారు. గతంలో అనేక సందర్భాలలో కమ్యూనిస్టు వ్యతిరేకతను వ్యక్తం చేసిన పుతిన్ ఒక బూర్జువారాజకీయవేత్త. అవసరం కొద్ది అలాంటి వారు ఏమైనా చెబుతారు.