Tags
#latin american left, Bishop Rolando Álvarez, Daniel Ortega, FSLN, Hugo Chávez, Nicaragua, Nicaraguan Catholic Church, Sandinista National Liberation Front
ఎం కోటేశ్వరరావు
లాటిన్ అమెరికాలోని నికరాగువాలో మానవహక్కులకు భంగం వాటిల్లిందంటూ తాజాగా ఐరాస మానవహక్కుల సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది.తటస్థంగా ఉండాల్సిన సంస్థలు తాము ఇచ్చిన వివరాలను, జరిగిన ఉదంతాలను పట్టించుకోకుండా ఏకపక్షంగా తమ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు నికరాగువా వామపక్ష శాండినిస్టా ప్రభుత్వం ఆ నివేదికను తోసిపుచ్చింది. డేనియల్ ఓర్టేగా అధిపతిగా ఉన్న ప్రభుత్వం కాథలిక్ బిషప్ రోలాండో అల్వారెజ్‌కు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన 26 సంవత్సరాల శిక్ష విధించి జైల్లో పెట్టిందంటూ అనేక క్రైస్తవ మత సంస్థలు గగ్గోలు పెడుతున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆ ఉదంతం పట్ల విచారం, ఆందోళన ప్రకటించారని, సదరు బిషప్ కోసం ప్రార్ధనలు జరపాలని ఎసిఎన్ (ఎయిడ్ టు ద చర్చ్ ఇన్ నీడ్) సంస్థ పిలుపునిచ్చింది.మతపరమైన ఊరేగింపుల మీద కూడా ప్రభుత్వం ఆంక్షలను విధించినట్లు ఆరోపిస్తూ అందువలన గుడ్‌ఫ్రైడే వంటి వాటిని కూడా చర్చ్‌లకే పరిమితం చేసినట్లు మత సంస్థలు పేర్కొన్నాయి.బిషప్ రోలాండో అల్వారెజ్ వంటి వారు అమెరికాతో చేతులు కలిపి 2018 ఓర్టేగా సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర చేశారు. అలాంటివారు 222 మందిని కోర్టులలో విచారించి శిక్షలు వేశారు. వారి పౌరసత్వాలను రద్దు చేశారు.వారందరికీ ఆశ్రయం కల్పించేందుకు అమెరికా ముందుకు రావటంతో ఒక విమానంలో వారిని పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది.తాను అమెరికా వెళ్లేది లేదని బిషప్ తిరస్కరించాడు. దాంతో అతన్ని జైల్లో పెట్టి అంగీకరించిన వారిని ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విమానంలో అమెరికా పంపారు.వారిలో పదకొండు మంది మతాధికారులు కూడా ఉన్నారు.
నికరాగువాలో అసలే జరుగుతోంది ? తప్పుడు ప్రచారాలకు ఎందుకు పూనుకున్నట్లు ? ముందుగా గమనించాల్సింది, ఇది మొదటిసారి కాదు. అక్కడ తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం ఏర్పడినపుడు, కొంత కాలం తరువాత తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ప్రచారం సాగుతూనే ఉంది. అమెరికా దేశాల సంస్థ(ఓఎఎస్) సంస్థతో కలసి ఐరాస మానవహక్కుల కమిషన్ ప్రతినిధులు తాజాగా ఒక నివేదిక ఇచ్చారు. ఏకపక్షంగా ప్రపంచం ముందు నికరాగువాను చెడుగా చూపేందుకు చూసింది. భారత్‌ను కనుగొనేందుకు బయలు దేరిన కొలంబస్ తన నాలుగవ యాత్రలో 1502లో పసిఫిక్ సముద్రం వైపు నుంచి నికరాగువాలో అడుగుపెట్టాడు.తరువాత 1523 నుంచి ఆ ప్రాంతం మొత్తాన్ని అక్రమించి 1821వరకు స్పెయిన్ వలసగా మార్చారు. 1821లో గౌతమాలా స్వాతంత్య్రం ప్రకటించుకుంది.అదే ఏడాది మెక్సికోలో భాగంగా మారింది. రెండు సంవత్సరాలకే మెక్సికో రాజరికాన్ని కూలదోసి మిగతా ప్రాంతాలతో కలసి కొత్త రిపబ్లిక్‌ను ఏర్పాటు చేశారు. దానిలో భాగమైన నికరాగువా 1838లో స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. అప్పటి నుంచిఅంతర్యుద్దానికి లోనైంది.1848లో కాలిఫోర్నియాలో బంగారాన్ని కనుగొన్న తరువాత తూర్పు అమెరికా నుంచి అక్కడికి కార్మికులను చేర్చేందుకు అమెరికన్లు నికరాగువా మీదుగా ప్రయాణించటం దగ్గరిదారిగా భావించి లక్షలాది మంది అటుగా వచ్చారు. నికరాగువాపై ఆధిపత్యం కోసం పోటీపడిన అక్కడి మితవాద, ఉదారవాద వర్గాలలో రెండవది అమెరికన్లను ఆహ్వానించి వారి మద్దతు తీసుకుంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఎన్నికల పేరుతో 1856లో ఫిలిబస్టర్ విలియం వాకర్ అనేవాడు తాను నికరాగువా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ప్రకటించుకున్నాడు. 1857లో వాకర్‌ను తరిమివేసి మితవాద శక్తుల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.1909 వరకు నికరాగువా స్వతంత్ర దేశంగా ఉంది.1893 నుంచి 1909వరకు నికరాగువా అధ్యక్షుడిగా ఉన్న జోస్ శాంటోస్ జెలయాపై అమెరికా మితవాద శక్తులతో తిరుగుబాటు చేయించింది. తమ పౌరులను రక్షించే పేరుతో 1909 నవంబరు 18 నికరాగువా తీరానికి అమెరికా తన యుద్ద నౌకలను పంపింది. దాంతో జెలయా పదవి నుంచి తప్పుకున్నాడు. తరువాత అమెరికా అనుకూల ప్రభుత్వం ఏర్పడింది.దానిలో కుమ్ములాటలు తలెత్తాయి. 1912 నుంచి 1933 వరకు అమెరికా మిలిటరీ స్వాధీనంలో నికరాగువా ఉంది. కాలువ తవ్వకంతో సహా అనేక ఒప్పందాలను తనకు అనుకూలంగా చేసుకుంది.
1927 నుంచి 1933 వరకు తిరుగుబాటు మిలిటరీ అధికారి అగస్టో సీజర్ శాండినో గెరిల్లా పద్దతిలో మితవాద ప్రభుత్వం, అమెరికా మిలిటరీ మీద సాయుధ పోరాటం సాగించాడు. దాంతో 1933లో ఒక తొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. శాండినో తిరిగి తిరుగుబాటు చేయవచ్చన్న జనరల్ అంటాసియా సోమోజా గార్సియా సలహామేరకు శాండినోను హతమర్చాలని పధకం వేశారు. దానిలో భాగంగా శాంతి ఒప్పందం మీద సంతకాలు చేసే పేరుతో 1934 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి విందుకు ఆహ్వానించారు, విందు తరువాత తిరిగి వెళుతున్న శాండినోను సోమోజా హత్య చేయించాడు. తరువాత తానే గద్దెనెక్కాడు.1956లో సోమోజాను ఒక యువకవి కాల్చి చంపాడు. సోమోజా పెద్ద కుమారుడు లూయిస్ సోమోజాను గద్దె నెక్కించారు. 1967లో సీనియర్ సోమోజా చిన్న కుమారుడు ఆంటాసియో సోమోజాను గద్దెనెక్కించారు. శాండినోలు 1979 కూల్చేంతవరకు అధికారంలో ఉన్నాడు. సోమోజాపాలన మీద తిరుగుబాటు చేసిన శక్తులు ఆగస్టో సీజర్ శాండినో పేరుతో శాండినిస్టా విముక్తి దళాన్ని ఏర్పాటు చేశారు. దాని నేతగా డేనియల్ కార్టేగా 1979లో అధికారానికి వచ్చాడు. అనేక సంక్షేమ పధకాలను అమలు చేశాడు. దేశంలో అస్థిర పరిస్థితలను సృష్టించి ఓర్టేగాను దోషిగా చూపి 1990 ఎన్నికల్లో ఓడించారు.తిరిగి 2007 నుంచి ఇప్పటి వరకు వరుసగా ఓర్టేగాను జనం ఎన్నుకుంటున్నారు.
2018లో ఓర్టేగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విఫల తిరుగుబాటు కుట్ర జరిగింది.ఏప్రిల్ 18 నుంచి జూలై 17వరకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు అమెరికా తదితర దేశాలు,సంస్థలు ఇచ్చిన మద్దతు, డబ్బు, ఆయుధాలతో హింసాకాండకు పాల్పడ్డాయి. ఇరవైరెండు మంది పోలీసు అధికారులు ఆ దాడుల్లో మరణించగా 400 మందికి పైగా తుపాకి గాయాలయ్యాయి. అరవై మంది అధికార శాండినిస్టా పార్టీ కార్యకర్తలు లేదా మద్దతుదార్లను చంపివేశారు. వందలాది మంది గాయపడ్డారు. ఏప్రిల్ 19,20,21 తేదీల్లో అనేక చోట్ల ప్రతిపక్ష సాయుధమూకలు పోలీస్ స్టేషన్లు, శాండినిస్టా ఆఫీసులపై జరిపిన దాడుల్లో పెట్రోలు బాంబులు, తుపాకులను వినియోగించిన తీరు వీడియోల్లో ఉంది. వీటిని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. వాటికి సంబంధించి స్థానిక పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఐరాస కమిషన్‌కు కనిపించలేదు.శాంతియుతంగా ప్రారంభమైన ప్రదర్శనలపై పోలీసులు దాడులకు పాల్పడినట్లు, తొలుత జరిగిన నిరసనల్లో అసలు ప్రతిపక్షాలకు చెందిన వారెవరూ పాల్గొనలేదని ఐరాస కమిషన్ చెప్పింది.
ఎవరెన్ని కుట్రలు చేసినా వాటన్నింటికీ ఇప్పటి వరకు ఓర్టేగా సర్కార్ తిప్పికొడుతున్నది. జన విశ్వాసం పొందుతున్నది.ముందే పేర్కొన్న 2018 విఫల కుట్ర తరువాత జరిగిన 2019 కరీబియన్ ప్రాంతీయ ఎన్నికలు,2021జాతీయ ఎన్నికలు, 2022 మున్సిపల్ ఎన్నికల్లో అధికార శాండినిస్టా నేషనల్ ఫ్రంట్ భారీ మెజారిటీలతో గెలిచింది. జనాభాలో 85శాతం మంది క్రైస్తవులే, వారిలో సగానికి పైగా రోమన్ కాథలిక్‌లు. పదిహేనుశాతం జనాభా మతం లేని వారు. లాటిన్ అమెరికా అంతటా చర్చి ఎప్పుడూ నిరంకుశ శక్తులు, మితవాదులు కనుసన్నలలోనే పనిచేసింది. వారికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమాలలో ప్రజల పక్షం వహించే మతపెద్దలు అనేక మంది మమేకమయ్యారు. అలాంటి దేశాలలో నికరాగువా ఒకటి.వారికి నియంతలను వ్యతిరేకించటం, పేదల సంక్షేమం ప్రధానం తప్ప పోరు చేస్తున్న వారు పురోగామి వాదులా,కమ్యూనిస్టులా ? మతం పట్ల వారి వైఖరి ఏమిటన్నది ప్రధానంగా కనిపించలేదు.వామపక్ష, కమ్యూనిస్టు గెరిల్లాలకు కూడా మతపెద్దలని గాక వారేవైపు ఉన్నారన్నదే గీటురాయి. అక్కడి వాస్తవ పరిస్థితుల నుంచే ఈ పరిణామం. అందుకే లాటిన్ అమెరికా దేశాల్లో జరిగిన, జరుగుతున్న పరిణామాలు పడక కుర్చీ మార్క్సిస్టు సిద్దాంతవేత్తల చట్రంలో జరగటం లేదు. ఒక చేత్తో బైబిల్ మరో చేత్తో ఎర్రజెండా పట్టుకున్న వెనెజులా నేత హ్యూగో ఛావెజ్‌ను ” అమెరికా క్రీస్తు ” అని అనేక మంది జనం నమ్మారు.”నేను క్రీస్తును ప్రేమిస్తాను. నేను క్రైస్తవుడిని. పిల్లలు ఆకలితో మరణిస్తున్నపుడు, అన్యాయాన్ని చూసినపుడు నేను ఏడ్చాను ” అని ఛావెజ్ ఒకసారి చెప్పారు.నికరాగువాలో కూడా అదే జరుగుతోంది. అమెరికాతో చేతులు కలిపిన క్రైస్తవమతాధికారులు వామపక్ష ప్రభుత్వాన్ని కూలదోసేందుకు చర్చీలను ఆయుధాలు, కిరాయిమూకల కేంద్రాలుగా మార్చారు. ఆదివారం ప్రార్దనల్లో ప్రభుత్వ కూల్చివేత సుభాషితాలు వల్లించారు.చర్చ్‌కు వచ్చిన వారిలో ఎవరైనా శాండినిస్టాలు(కమ్యూనిస్టులు) ఉన్నారా అని మరీ పిలిచి నిలబడిన వారిని చర్చికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి చర్యలు, 2018 కుట్రలో అనేక మంది ఫాదర్లు స్వయంగా హింసాకాండలో పాల్గొనటాన్ని చూసిన అనేక మందికి చర్చ్‌లు, ఫాదర్ల మీద విశ్వాసం పోయింది. తమకు మేలు చేస్తున్న పాలకులను కూల్చివేసి నిరంకుశ, దోపిడీదార్లను బలపరుస్తున్న చర్చి ఉన్నతాధికారుల తీరును చూసి నివ్వెరపోయారు. దాంతో క్రీస్తును ఆరాధించాలంటే చర్చ్‌లకే పోనవసరం లేదని అనేక మంది భావించారు. ఇండ్లకే పరిమితం కానివారు సామూహిక ప్రార్ధనలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలను చూశారు. అవే ప్రజా చర్చ్‌లుగా ఉనికిలోకి వచ్చాయి.
” మేం సంప్రదాయ కాథలిక్కులం కాదు. ఎందుకంటే మాకు ఇక్కడ పూజార్లు ఉండరు.ఇందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి.” అని రాజధాని మనాగువాలోని సెయింట్‌పాల్ ప్రాంతానికి చెందిన అపోస్తల్ క్రిస్టియన్ బేస్ కమ్యూనిటీకి చెందిన యామిల్ రియోస్ విలేకర్లతో చెప్పాడు. ఒక రూములో ప్రార్దనల కోసం వచ్చిన వారందరూ మడత కుర్చీల్లో కూర్చున్నారు. రూము వెలుపల ప్రార్ధనగీతాలు పాడేవారు సంగీత వాద్యాలతో సిద్దంగా ఉన్నారు. మత పెద్దల కుట్రలు వెల్లడైనకొద్దీ పేదలు, కార్మికులతో ఇలాంటి ప్రజా చర్చ్‌లు పెరుగుతున్నాయి.సంప్రదాయ చర్చ్‌లకు వెళ్లేవారు తగ్గుతున్నారు. ఇలాంటి ప్రజాచర్చ్‌లు 1970దశకంలో ప్రారంభమైన 1979లో నియంత పాలన అంతంతో మరింతగా పెరిగాయి. ఇవి క్రైస్తవం-విప్లవం మధ్య ఎలాంటి వైరుధ్యాలు లేవన్న క్రైస్తవ విముక్తి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన పూజారుల ప్రచార కేంద్రాలుగా కూడా పని చేశాయి. వారిలో ఒకరైన ఫాదర్ మిగుయెల్ డి స్కోటో ప్రస్తుతం నికరాగువా విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు.” నీవు జీసస్‌ను అనుసరించకపోతే విప్లవకారుడు కారుడివి కూడా కాలేవు ” అంటారాయన.ఇలాంటి వారు అనేక మంది ఇప్పుడు ఓర్టేగా సర్కార్‌లో పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు.వారు క్రైస్తవులే గానీ శాండినిస్టాపాలనను ప్రతిఘటించే అధికార మతపెద్దల తెగకు చెందిన వారు కాదు.1990లో తాము కాథలిక్కులమని చెప్పుకున్నవారు 94శాతం ఉండగా ఇటీవల అది 50శాతానికి తగ్గి ఇప్పుడు 37శాతం ఉన్నట్లు సర్వేలు వెల్లడించాయి. లాటిన్ అమెరికాలో ఒక చిన్న దేశమైన నికరాగువా(జనాభా 70లక్షల లోపు) ఐరాస మానవహక్కుల సంస్థను శిఖండిగా చేసుకొని అమెరికా, దాని కూటమి చేస్తున్న ప్రచారదాడికి గురవుతోంది. కరీబియన్-దక్షిణ పసిఫిక్ సముద్రాల మధ్య వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న దేశాలలో అదొకటి. అందువల్లనే ఆ ప్రాంత దేశాలను ఆక్రమించుకొనేందుకు, వీలుగాకుంటే తన తొత్తు ప్రభుత్వాలను రుద్దేందుకు అమెరికా నిరంతరం చూస్తూ ఉంటుంది.దానిలో భాగమే ఇటీవలి పరిణామాలు.