Tags
'Socialist' Bernie Sanders, anti communists, Bernie Sanders, Communists, french communist party, french left party, post communist mafia state, Socialist
ఎం కోటేశ్వరరావు
సోషలిజం, కమ్యూనిజాలకు కాలం చెల్లింది అన్న తీవ్ర ప్రచార దాడికి గురైన అనేక మంది కమ్యూనిస్టులు దానిని తట్టుకోలేక, కోలుకోలేక నిజమే అనుకున్న మాట వాస్తవం. కావమ్మ మొగుడని అందరూ అంటే కామోసని ఇన్నేళ్లూ కాపురం చేశాను, ఇప్పుడు కాదంటున్నారు గనుక నా కర్రా బుర్రా ఇస్తే నా దారి నే చూసుకుంటాను అన్న సామెత తెలిసిందే. అలాగే అంతగా సైద్ధాంతిక అవగాహన లేని వారు, కమ్యూనిస్టు అనుకూల పరిణామాలతో వుత్తేజితులై వచ్చిన వారు అనేక మంది దూరమయ్యారు. కొత్తవారిలో వుత్సాహం తగ్గిపోయింది. అయినా అనేక మంది అచంచల విశ్వాసంతో ఎత్తిన జెండా దించకుండా కొనసాగుతున్నవారున్నారు. పాతికేండ్ల తరువాత యువతలో సోషలిస్టు అనుకూల భావాలపై ఆసక్తి పెరగటాన్ని చూసి పశ్చిమ దేశాలలోని కమ్యూనిస్టు వ్యతిరేకులు బెంబేలెత్తుతున్నారు.
ఏప్రిల్ 23న ఫ్రాన్సు అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో ఇంకేముంది కమ్యూనిస్టు అభ్యర్ధి దూసుకు వస్తున్నాడు బహుపరాక్ అని కమ్యూనిస్టు వ్యతిరేక మీడియా, వ్యతిరేక శక్తులు ప్రచారం చేశాయి. తుది విడత పోటీకి అర్హత సంపాదిస్తాడనుకున్న కమ్యూనిస్టులు బలపరిచిన వామపక్ష అభ్యర్ధి మెలెంచన్ కొద్ధి శాతం ఓట్ల తేడాతో అవకాశాన్ని కోల్పోయాడు. అధికారానికి దగ్గర దారులు లేవు, పోరాటాన్ని కొనసాగిస్తామంటూ ఈ ఫలితాన్ని కమ్యూనిస్టులు సాధారణంగానే స్వీకరించారు. కమ్యూనిజం అంతరించిందన్న ప్రచారాన్ని నిజంగానే నమ్మిన ఫ్రాన్స్‌లోని కమ్యూనిస్టు వ్యతిరేకులు కొందరికి ఇప్పుడు మనోవ్యాధి పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇది ఒక్క ఫ్రాన్స్‌కే కాదు, అమెరికాలో కూడా తీవ్రంగానే విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలే అందుకు నిదర్శనం. కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచార దాడి సైనికులు, కమాండర్లు ఇప్పుడు కొట్టబోతే కడుపుతో వుంది, తిట్టబోతే అక్క కూతురు అన్న స్ధితిని ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది.
తొలి విడత ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత ఒక ఫ్రెంచి పత్రికలో వచ్చిన వ్యాఖ్యానం ఇలా సాగింది.’ ఫ్రాంకోయిస్ ఫిలన్(మితవాద రిపబ్లికన్ పార్టీ) దేశాన్ని సంస్కరించేందుకు కట్టుబడి వుంటానని ప్రకటించిన వైఖరి ఎంతో ప్రభావం చూపినప్పటికీ ఆయనకు లభించిన మద్దతు చూసి ఆశాభంగం చెందాను. దానికి నేను చేయగలిగింది లేదు గానీ తుది విడత పోటీలో లీపెన్-మెలాంచన్ మధ్య పోటీ జరగనందుకు నాకు ఎంతో భారం తీరింది. ఇమ్మాన్యుయెల్ మక్రాన్ సోషలిస్టు కాదు, ప్రచారంలో చెప్పినదానికంటే పెద్ద స్వేచ్చా మార్కెట్ వాది, అయితే తన అధ్యక్ష పదవితో దేశాన్ని మెరుగుపరిచేందుకేమీ చేయలేడు….. ఎన్నికలలో 55శాతం మంది ఓటర్లు తీవ్రవాద భావాలున్న వారికి ఓటు చేసిన దాని గురించి నేను చెప్పాలి…. దాని కంటే ఎక్కువగా మిలియన్ల మంది మరణాలకు కారణమైంది కమ్యూనిస్టు సిద్ధాంతం అనే అబేధ్యమైన ప్రచారాన్ని బద్దలుకొట్టి కమ్యూనిస్టు మెలంచన్‌కు ఫ్రెంచి జనాలు ఓటు వేయటం నా బుర్రను బద్దలు చేస్తున్న అంశం…. ఫిలన్ సంపాదించినన్ని ఓట్లు దాదాపు 20శాతానికి దగ్గరగా మెలంచన్ సాధించాడు.ఇదొక వెర్రి. హ్యూగో ఛావెజ్ ఇతర కమ్యూనిస్టు నియంతలను మెలంచన్ తిరుగులేని విధంగా సమర్ధించాడు. అంతకంటే హీనమైనది ఏమంటే ఒక్క ఫ్రాన్సే కాదు -ఫెడల్ కాస్ట్రో ఎట్టకేలకు మరణించాడు. జనం ఏమి ఆలోచిస్తున్నారు ? నేను జీవించి వున్నంత వరకు ఫ్రాన్స్‌లో, వెలుపలా కమ్యూనిజం కళంకానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వటం లేదో, 2017లో ఈ సిద్ధాంతం ఎందుకు పెరుగుతోందో నేను ఎన్నడూ అర్ధం చేసుకోలేను.’ అని పోయాడు.http://www.nationalreview.com/corner/446992/france-marine-le-pen-presidential-election-normalization-extremes ఇలాంటి వారెందరో కనిపిస్తున్నారు.
పాతిక సంవత్సరాల క్రితం సోషలిస్టు వ్యవస్ధలు కూలిపోయినందుకు కమ్యూనిస్టులు విచారిస్తే తిరిగి కమ్యూనిజం పట్ల జనం సానుకూలత వ్యక్తం చేయటాన్ని చూసి కమ్యూనిస్టు వ్యతిరేకులలో ఆందోళన ప్రారంభమైందన్నది స్పష్టం. కమ్యూనిస్టు భూతం గురించి ఐరోపాను వెన్నాడుతోందని 1848 నాటి కమ్యూనిస్టు ప్రణాళిక ముందు మాటలోనే మార్క్స్-ఎంగెల్స్ రాశారు. అంటే అంత కంటే ముందే ఐరోపాలో తత్వవేత్తలు సోషలిజం, కమ్యూనిజాల గురించి చర్చించటం, ఆ భావజాలం తమ దోపిడీ వ్యవస్ధను కూల్చివేస్తుందని పెట్టుబడిదారీ వర్గం అప్పుడే గుర్తించటం, నిరోధించటానికి నాటి నుంచే ప్రయత్నించటం దాస్తే దాగేది కాదు. కమ్యూనిజం గురించి నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక రూపంలో జనాన్ని భయపెడుతూనే వున్నారు. ఏదైనా ఒక వ్యవస్ధ సమాజంలోని మెజారిటీ వర్గం ముందుకు పోవటానికి ఆటంకంగా మారినపుడు దానిని కూల్చివేసి నూతన సామాజిక వ్యవస్ధను ఏర్పాటు చేసుకోవటమే ప్రపంచ మానవాళి చరిత్ర. దారుణంగా వున్న భూస్వామిక వ్యవస్ధతో పోల్చితే పారిశ్రామిక విప్లవంతో ప్రారంభమైన పెట్టుబడిదారీ వ్యవస్ధ తొలినాళ్లలో జనానికి మెరుగ్గా కనిపించింది.’ అరే ఒరే అన వీల్లేదంటా, వారం వారం బట్వాడంటా ….బస్తీకి పోదాము’ పాటను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. భూస్వామిక వ్యవస్ధ ఆటంకంగా మారింది కనుకే దానికంటే మెరుగైన వ్యవస్ధ కోసం జనం దానిని నాశనం చేసేందుకు పెట్టుబడిదారులకు సహకరించారు. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్లు గ్రహించగానే పెట్టుబడిదారీ వ్యవస్ధను నాశనం చేయటం గురించి ఆలోచించటం మొదలు పెట్టారు. కారల్ మార్క్సు-ఫెడరిక్ ఎంగెల్స్ పుట్టక ముందే సమసమాజం, సోషలిజం, కమ్యూనిజం గురించి చర్చ ప్రారంభమైందంటే అది ఒక సహజ పరిణామం తప్ప మరొకటి కాదు. వారు గాక పోతే మరొకరు కమ్యూనిస్టు ప్రణాళికను రచించి వుండేవారు.
ఇంటర్నెట్ యుగంలో సమాచారాన్ని దాచటం అసాధ్యం. అత్యంత పకడ్బందీగా దాచే అమెరికా రహస్యాలనే అసాంజే లోకానికి అందించిన విషయం తెలిసినదే. పిల్లలకోసం కమ్యూనిజం అనే పుస్తకాన్ని ప్రచురించిన అమెరికా విశ్వవిద్యాలయ ముద్రణ సంస్దపై అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేకులు విరుచుకుపడుతున్నారు. మన దేశంలో జెఎన్‌యు, హైదరాబాదు యూనివర్సిటీల వంటివి బిజెపి సర్కారుకు కంటగింపుగా మారి వాటిని దెబ్బతీయాలని చూస్తున్నట్లే తాజాగా తూర్పు ఐరోపాలోని హంగరీలోని సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ(సిఇయు)ను మూసివేయాలని ప్రజాస్వామ్య ముసుగు వేసుకున్న అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆ విశ్వవిద్యాలయం చేసిన తప్పిదం ఏమిటి ? ‘ కమ్యూనిస్టు అనంతర మాఫియా రాజ్యం-హంగరీ వుదంతం ‘( పోస్ట్ కమ్యూనిస్టు మాఫియా స్టేట్ – ఏ కేస్ ఆఫ్ హంగరీ) అనే పేరుతో 2016లో ఒక పుస్తకాన్ని ప్రచురించింది. రచయిత కమ్యూనిస్టు కాదని ముందు తెలుసుకోవాలి. సోషలిస్టు వ్యవస్ధను కూల్చివేసిన తరువాత హంగరీ ఎదుర్కొంటున్న సమస్యలకు అసలు కారణాలను దాచి పెట్టేందుకు అక్కడి నిరంకుశ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దానిలో భాగంగా గత రెండు సంవత్సరాలుగా ఐరోపాకు పదిలక్షల మంది వలస రావటానికి జార్జి సోరెస్ ప్రధాన కారణమని, అలాంటి వారి కేంద్రంగా విశ్వవిద్యాలయం వుందంటూ ప్రభుత్వ పత్రిక ద్వారా జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు. పైన పేర్కొన్న పుస్తకాన్ని సదరు విశ్వవిద్యాలయం ముద్రించిన కారణంగా దానిని మూసివేయాలనే యత్నాలను 63శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది.మాఫియా శక్తులకు ఆశ్రయమిచ్చిన పాలకుల నిజస్వరూపాన్ని ఆ పుస్తకంలో ఎండగట్టటమే అసలు కారణం. సోషలిస్టు వ్యవస్ధ స్ధానంలో ప్రజాస్వామిక సమాజాన్ని ఏర్పాటు చేస్తామని నమ్మబలికిన కమ్యూనిస్టు వ్యతిరేకులు గత పాతిక సంవత్సరాల కాలంలో నిరంకుశ పాలనను రుద్దేందుకు అనుసరిస్తున్న నూతన పద్దతులను దానిలో వివరించారు. గొర్రెల గోత్రాలు కాపరులకే ఎరుక అన్నట్లుగా ఆ పుస్తకాన్నిరాసింది ఒక మాజీ మంత్రి కావటంతో దానికి విశ్వసనీయత పెరిగింది. ప్రజాస్వామ్యం గురించి పంచరంగుల్లో చూపిన వారు దాన్ని ఏడునిలువుల లోతున పాతిపెట్టటాన్ని గమనించిన జనం ఎలా ఆలోచించేది చెప్పనవసరం లేదు. సాంప్రదాయక మాఫియా బహిరంగంగా ఎలా సంపదలను బలవంతంగా లూటీ చేస్తుందో తెలిసిందే. అదే కమ్యూనిస్టు పాలన అనంతర రాజకీయ మాఫియా చట్టాలను అడ్డం పెట్టుకొని ఎలా లూటీ చేస్తుందో ఒక్క హంగరీకే గాక ఎక్కడైతే ఇతర కమ్యూనిస్టు అనంతర రాజ్యాలలో నిరకుశపాలకులు వున్నారో ఆ దేశాల వారందరూ తెలుసుకోవాల్సిన అంశాలున్న ఈ పుస్తకం సమయోచితంగా వెలువడిందని ఒక విశ్లేషకుడు పేర్కొన్నారు.ఈ పుస్తకం గురించి అడిగితే గూగులమ్మ తల్లి ఎంతో సమాచారాన్ని మన ముందు ప్రత్యక్షం చేస్తోంది. అలాంటపుడు మన కంటే ఎక్కువ చదువుకున్న, సమస్యలను ఎదుర్కొంటున్న ఫ్రెంచి యువతరానికి తమ పొరుగునే వున్న తూర్పు రాజ్యాలలోని ఈ మంచి చెడ్డలన్నీ తెలియకుండా వుంటాయా? ప్రజాస్వామ్యం పేరుతో ఇంతకాలం ఇతర పార్టీల ప్రజావ్యతిరేక పాలన చూసిన తరువాత రెండవ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ వ్యతిరేక పోరాటంలో ఘనమైన గత చరిత్ర వున్న కమ్యూనిస్టులకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దాం అనే ఆలోచన ఫ్రెంచి వారిలో కూడా ఏ మూలన అయినా ప్రారంభమైందేమో ? ఏమీ లేకుండా 20శాతం ఓట్లు ఎలా వస్తాయి?
అమెరికా అంటే ప్రపంచ దోపిడీ పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల, యుద్దోన్మాదుల, కమ్యూనిస్టు వ్యతిరేకుల నిలయంగా అందరికీ తెలిసిందే. మరి అలాంటి రాజ్యంలో ‘ సోషలిజం అంత జనరంజకంగా ఎలా తయారైంది ?’ అనే ప్రశ్నతో ఒక విశ్లేషణ చేశారు.https://www.thetrumpet.com/15721-how-did-socialism-become-so-popular-in-america అక్కడి కమ్యూనిస్టు వ్యతిరేక, తటస్ధ, సానుకూల ఏదో ఒక రూపంలో మీడియాలో ఇటీవలి కాలంలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గతేడాది ఎన్నికల సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.’ ప్రచ్చన్న యుద్ధ సమయంలో కమ్యూనిజం గురించి అమెరికాలో ఎంతో భయం వుండేది. కమ్యూనిజం వ్యాప్తి గురించి అతిశయోక్తులు చెప్పారని ఇప్పుడు ఎక్కువ మంది అమెరికన్లు నమ్ముతున్నారు. ప్రధాన స్రవంతి సోషలిస్టు భావజాలం గురించి నేడు ఎంత విస్తృతంగా ప్రచారంలో వున్నాయో చూడండి. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో దాదాపు ఒక బహిరంగ సోషలిస్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్దిత్వాన్ని గెలుచుకున్నారు. మూడు పదుల లోపు వయసు వారు మాత్రమే ఓటు వేసి వున్నట్లయితే ఆ వ్యక్తి నేడు అమెరికా అధ్యక్షుడు అయి వుండేవాడు. ప్రభుత్వ అధికారం మరియు పాత్రను ఎంతో పెంచాలన్న ఆయన విప్లవాత్మక పధకాలు ఇప్పటికీ బహుళఆదరణ పొందుతున్నాయి. ఆరోగ్య సంరక్షణతో పాటు ఆర్ధిక వ్యవస్ధలోని ప్రధాన రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్నారు. మన సమాజం ఆలోచనలో ఇది పెద్ద మార్పు, అది ఎంతో వేగంగా జరుగుతోంది…….ఈ రోజు అమెరికాను కమ్యూనిజం ప్రభావితం చేస్తోంది అన్న రుజువు కోసం మీరు పెద్దగా కష్టపడనవసరం లేదు……..సగటు కాలేజీ ఫ్రొఫెసర్‌ను మీరు సోషలిస్టా లేక మార్క్సిస్టా అని అడిగితే అతడు లేక ఆమె అవును నేను అదే అని చెప్పే అవకాశాలున్నాయి……అమెరికన్లు నేడు మన జాతిపితలు లేదా మన స్వంత తండ్రులు నిర్మించిన దేశంలో నివశించటం లేదు. అనేక మంది గుర్తించిన దానికంటే ఎక్కువ విప్లవ భావాలవైపు మొగ్గుతున్నారు. సోషలిస్టు మరియు కమ్యూనిస్టు ఆలోచనా వివేచనను మనం ఈ క్షణంలో స్వతహాగా గుర్తించటం కాదు. ఒక పధకం ప్రకారం ఆశ్చర్యకరంగా ఈ స్వేచ్చా భూమిని మరియు ధైర్యవంతులకు నిలయమైన దీనిని కూల్చివేసేందుకు విజయవంతంగా అనుసరించిన వ్యూహం ఫలితంగానే ఈ భావ జాలం ఇంతగా జనంలో ప్రచారమైందన్నది వాస్తవం.’ అని జోయెల్ హిలికర్ అనే రచయిత వాపోయాడు.
చిత్రం ఏమిటంటే సోవియట్ యూనియన్ కూలిపోయిన తరువాత కూడా అమెరికన్ కమ్యూనిస్టు పార్టీకి సోవియట్ కమ్యూనిస్టుపార్టీ నిధులు అందచేసిందని అలవాటులో భాగంగా చెడరాసి పడేశాడు. సోవియట్ కమ్యూనిస్టు పార్టీ అనేక దేశాలలో కమ్యూనిస్టు వుద్యమాలకు తోడ్పాటు అందించేందుకు అనేక రూపాలలో సాయం చేసింది. భావజాల ప్రచారంలో భాగంగా ఎక్కువ భాగం పుస్తకాల రూపంలోనే జరిగిందన్నది బహిరంగ రహస్యం.ఆ మాటకు వస్తే కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేయటానికి అమెరికన్లు ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు చేశారో, పెట్టుబడులు పెట్టారో లోకవిదితమే. మొదటిది పధకం అయితే రెండవదీ వ్యూహమే, దానికి అనుగుణ్యంగా పధకమే. భావజాల ప్రచారానికి పధకం వేయటం ద్వారా అమెరికాలో వ్యాప్తి చెందిందన్నది పెట్టుబడిదారీ వ్యవస్ధ, తమ కమ్యూనిస్టు వ్యతిరేక పధకాల, వ్యూహాల వైఫల్యాన్ని కప్పి పుచ్చుకొనే కుంటి సాకు తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టు భావజాల ప్రచారాన్ని అడ్డుకొనేందుకు ఇంతకాలం అమెరికన్లు చేయని ప్రయత్నం లేదు. అరచేతిని సూర్యకాంతిని ఆపే విఫలయత్నం చేసినట్లుగానే కమ్యూనిస్టు భావజాల వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికన్లు అసహజ చర్యలకు పాల్పడ్డారు. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించారు. దాన్ని సామాన్య జనంపై మోపిన కారణంగానే అమెరికాతో పాటు ఇతర ధనిక దేశాలలో సంక్షోభం తలెత్తింది. ఇండో చైనా దేశాలపై దశాబ్దాల పాటు చేసిన యుద్దం ఒకటైతే ఆప్ఘనిస్తాన్‌లో కమ్యూనిస్టు ప్రభావాన్ని అరికట్టే పేరుతో అమెరికన్లు చేసిన ప్రయోగం అమెరికా సైనికులను ఫణంగా పెట్టటం ఒకటైతే అంతకు మించి ఒక్క కమ్యూనిస్టులకే గాక యావత్ స్వయంగా తనతో పాటు యావత్ ప్రపంచానికి ముప్పుగా తాలిబాన్లు అనే వుగ్రవాదులను తయారు చేసింది. అక్కడ 16లక్షలకు పైగా తన సైన్యాన్ని మోహరించి కూడా తాలిబాన్లను అణచలేక చేతులెత్తేసింది.
ఇలాంటి పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయి? పెట్టుబడిదారీ వ్యవస్ధలో అనేక సంక్షోభాలు ఎందుకు వస్తున్నాయి? 2008లో అన్ని పెట్టుబడిదారీ ధనిక దేశాలలో ప్రారంభమైన మాంద్యం ఎప్పుడు అంతరిస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అమెరికా సమాజంలో ఎన్నడూ లేని విధంగా ఆర్ధిక అసమానతలు పెరిగిపోయాయని, అది మంచిది కాదని పెట్టుబడిదారీ ఆర్ధిక నిపుణుడు పికెటీ చేసిన విశ్లేషణను ఇంతవరకు ఎవరూ సవాలు చేయలేదు. వీటన్నింటి గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నపుడు అమెరికా, ఫ్రాన్స్ ఇలా ఏ దేశ యువత అయినా మెదళ్లకు పదును పెట్టకుండా, ఎందుకు అని ప్రశ్నించకుండా ఎలా వుంటుంది?
కమ్యూనిస్టు బూచిని ఎంతకాలం మమ్మల్ని మభ్యపెడతారు, భయపెడతారు రాబోయే కమ్యూనిజంతో వచ్చే ప్రమాదం ఏమిటో తెలియటం లేదుగానీ పెట్టుబడిదారీ విధానం తమ జీవితాలను నాశనం చేస్తోందని పశ్చిమ దేశాల వారు భావిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధలను కాలదన్నుకున్న పూర్వపు సోవియట్ రిపబ్లిక్లు, తూర్పు ఐరోపా దేశాలు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజల సంపదలను లూటీ చేసే వారి చేతులలోకి పోయాయి. ప్రజాస్వామ్యం అంటే నేతి బీరలోని నెయ్యి మాదిరి అని తేలిపోయింది. దాదాపు అన్ని దేశాలలో నిరంకుశ పాలకులదే పెత్తనం. అక్కడ అంతకు ముందులేని దారిద్య్రం, నిరుద్యోగం, సకల అవలక్షణాలు వచ్చాయి. వాటిని చూసిన ప్రపంచంలోని ఇతర దేశాల యువత సోషలిజం గురించి పునరాలోచనలో పడదా ? గత నాలుగు దశాబ్దాలుగా సోషలిస్టు చైనా అప్రతిహత విజయాలు సాధిస్తున్నది. అక్కడ పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించినట్లు పెట్టుబడిదారులకు ప్రాతినిధ్యం వహించే ప్రపంచ బ్యాంకు,ఐఎంఎఫ్ స్వయంగా అనేక సార్లు స్పష్టం చేశాయి. మరోవైపు ధనిక దేశాలలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు పెరుగుతున్నాయని అవే సంస్ధలు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పటం లేదు.
అటువంటపుడు అమెరికాలోగాని మరొక ధనిక దేశంలో గాని పేదలు,యువత తమకూ సోషలిస్టు వ్యవస్తే మంచిదేమో అన్న ఆలోచన వైపు మళ్లకుండా ఎలా వుంటారు. పెట్టుబడిదారీ విధాన అమానుష స్వభావం కారణంగా దానికి వ్యతిరేకత పెరుగుతుండటంతో కొంత మంది బయలు దేరి తోడేలుకు ఆవు వేషం వేసినట్లుగా దానిని మానవతా ముఖంతో వుండే విధంగా మార్చుతామని చెప్పిన వారు ఎక్కడ వున్నారు. మరింత అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. సంస్కరణల పేరుతో సామాన్య జనం అనుభవిస్తున్న వాటికి కోతపెడుతున్నారు తప్ప పెట్టుబడిదారులకు ఇచ్చే రాయితీలు ఏమాత్రం తగ్గకపోగా పోటీని ఎదుర్కొనే పేరుతో మరింతగా పెంచుతున్నారు. దానికి దేశ భక్తి, జాతీయవాదం అని ముద్దు పేర్లు పెడుతున్నారు, పెంచుతున్నారు.http://www.theepochtimes.com/n3/2237411-why-a-gospel-of-envy-is-gaining-traction-in-america/ అమెరికాలో సోషలిజం ఎందుకు వ్యాపిస్తున్నది అన్నదే ఈ వ్యాసకర్త ప్రశ్న.
అమెరికాలోని పెద్ద వారిలో 37శాతం మంది పెట్టుబడిదారీ విధానానికి బదులు సోషలిజానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అమెరికన్ ఫెయిత్ అండ్ కల్చర్ అనే సంస్ధ ఫిబ్రవరిలో జరిపిన ఒక సర్వేలో వెలుగు చూడటమే సదరు వ్యాసకర్తను పురికొల్పింది. ఇది మేలుకొలుపు పిలుపు అని వ్యాఖ్యానించాడు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బెర్నీ శాండర్స్ చేసి ప్రచారం ద్వారా సోషలిజం ప్రజాదరణ పొందటం ఆశ్చర్యార్ధకమైంది…..అమెరికాలో ఎందుకు అనేక మంది సోషలిజం పట్ల సానుకూల వైఖరిని కలిగి వున్నారు.’ అని ప్రశ్నించుకొని వ్యాసకర్త తన అభిప్రాయాలను వెల్లడించాడనుకోండి. వాటితో ఏకీభవించటమా లేదా అన్నది పక్కన పెడదాం. అవే ఎత్తుగడలు లేదా కారణాలతో గతంలో అమెరికన్లు సోషలిజం గురించి దురభిప్రాయం ఏర్పరుచుకున్నారని కూడా భాష్యం చెప్పవచ్చు. దీనిని అంగీకరిస్తే రచయిత అభిప్రాయపడినట్లు అవే కారణాలతో అమెరికన్ యువత సోషలిజం గురించి ఆసక్తి , పెట్టుబడిదారీ విధానంపై వ్యతిరేకత పెంచుకుంటున్నారు అన్న తర్కాన్ని కూడా అంగీకరించవచ్చు. ‘కాలేజీలు, విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక యుద్ధ భూములుగా మారటం విచారకరమని’ అంటూ ‘లెనిన్ ఏం చెప్పారో విందాం ‘పిల్లలకు బోధించటానికి నాకు నాలుగు సంవత్సరాల వ్యవధి ఇవ్వండి, ఎన్నటికీ పెకలించలేని విధంగా విత్తనాలు నాటతాను ‘ అని చెప్పారని సదరు వ్యాసకర్త వుక్రోషం వెలిబుచ్చటాన్ని చూస్తే ఆర్ఎస్ఎస్ సంఘపరివారం ఎందుకు చిన్న పిల్లల విద్యాలయాలను ఏర్పాటు చేస్తోందో అక్కడేమి బోధిస్తున్నారో, జెఎన్‌యు వంటి విశ్వవిద్యాలయాల గురించి ఎందుకు నానా యాగీ, దాడులు చేస్తున్నారో అర్ధం చేసుకోవటం కష్టం కాదు. ఇది భావజాల పోరు. ఒకరు విషబీజాలు నాటితో మరొకరు ప్రయోజనకరమైన వాటిని విత్తేందుకు ప్రయత్నం. ఎవరిది పై చేయి అయితే అవే ఫలితాలు వస్తాయి.విద్యా సంస్ధలలో ఒక పద్దతి ప్రకారం సోషలిస్టు భావజాలాన్ని ఎలా అభ్యాసం చేయిస్తున్నారో ‘ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్కాలర్స్(ఎన్ఏఎస్) జనవరి నివేదిక వెల్లడించిందని, వున్నత విద్యా సంస్ధలలో ఒక వుద్యమంగా 1960 దశకపు విప్లవాత్మక కార్యక్రమంతతో ఒక పురోగామి రాజకీయ చురుకుదనంతో ‘నూతన పౌర శాస్త్రాన్ని ‘ బోధిస్తున్నారని’ కూడా సదరు రచయిత ఆరోపించారు. మన పిల్లలు ఏమై పోతున్నారో చూడండి అంటూ రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. అంటే రెండు రెళ్లు నాలుగు, భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, అసమాన సమాజాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్పటం కూడా సోషలిస్టు భావజాల ప్రచారంగానే కమ్యూనిస్టు వ్యతిరేకులు చూస్తున్నారు. ఈ ఆరోపణ చేసేవారిని ఒక ప్రశ్న అడగాలి. పడకగదుల్లో సైతం ఎప్పుడేం జరుగుతోందో ప్రత్యక్ష ప్రసారం చేయగల నిఘా వ్యవస్ధ వున్న అమెరికా భద్రతా సంస్ధలు ఒక వుద్యమంగా అమెరికా విద్యా సంస్ధలలో జరుగుతున్న ఈ బోధనను చూడకుండా ఎలా వున్నాయి ? ఒక వేళ అదే నిజమైతే అమెరికాకే కాదు ప్రపంచానికే మంచి రోజులు వస్తాయి. యుద్దోన్మాదులు, తాలిబాన్లను సృష్టించే నేతలకు బదులు వాటికి దూరంగా వుండే సమాజాన్ని నెలకొల్పే నేతలు అమెరికాలో అధికారానికి వస్తారు. ఇవన్నీ చూస్తుంటే కమ్యూనిస్టు వ్యతిరేకుల విశ్వాసం సడలుతున్నట్లు, వారు కోరుకున్న విధంగా సమాజం నడవటం లేదని అర్ధం కావటం లేదూ ! ఆలోచించండి !!
పశ్చిమ దేశాలలో అలా వుందేమో గానీ భారత్‌లో తిరిగి కమ్యూనిస్టులు కోలుకోలేరు అని ఎవరైనా అన వచ్చు. ఎవరి నమ్మకం వారిది. ప్రకృతి ధర్మం ప్రకారం ప్రపంచ వ్యాపితంగా అన్ని ప్రాంతాలలో ఒకేసారి వేసవి, వర్షాలు, ఆకురాల్చి మొగ్గతొడగటం జరగదు. చక్రభ్రమణంలో ఇప్పుడు కింద వున్న వారు కొద్ది సేపటి తరువాత పైకి వస్తారు. కమ్యూనిస్టులూ అంతే. ఒక దగ్గర ప్రారంభమై అన్ని ప్రాంతాలకూ విస్తరించినట్లే తిరిగి కోలుకోవటం కూడా అదే మాదిరి జరుగుతుంది.