Tags
Anti-Communist Massacre, cia, Indonesian Communist Party (PKI)., PKI, Suharto’s Purge, Sukarno, US hand in 1960s Indonesia Anti-Communist Massacre
ఎం కోటేశ్వరరావు
పీడకుల నుంచి పీడితులను కాపాడి సమసమాజాన్ని స్ధాపించే మహత్తర కృషిలో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు అభిమానులు ప్రపంచంలోని అనేక దేశాలలో చిందించిన రక్తం, చేసిన ప్రాణత్యాగాలు మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి వారిలో ఇండోనేషియా కమ్యూనిస్టులకరు. దేశంలో అంతర్యుద్ధం చెలరేగి కమ్యూనిస్టులు ఆయుధాలు చేపట్టి పీడకులపై పోరు సల్పినపుడు వారిని చంపివేశామని కమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రకటించుకుంటే దాన్ని కొంత మేరకు అర్ధం చేసుకోవచ్చు.ఎలాంటి తిరుగుబాటు, పోరు లేకుండానే యాభై రెండు సంవత్సరాల క్రితం ఇండోనేషియాలో దాదాపు పదిలక్షల మంది కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, వారి కుటుంబసభ్యులు, సానుభూతిపరులని అనుమానం వున్న వారిని అక్కడి సైన్యం వూచకోత కోసింది. సైన్యానికి మహమ్మదీయ పేరుతో వున్న ఒక సంస్ధను కూడా తోడు చేసి వారికి ఆయుధాలిచ్చి హత్యాకాండకు కమ్యూనిస్టులను గుర్తించటం, హత్య చేయటానికి వుపయోగించుకున్నారు. ప్రపంచంలో అతి పెద్ద మానవహక్కుల పరిరక్షకులమని చెప్పుకొనే అమెరికన్లకు ఈ దారుణ మారణకాండ వారి ఎరుకలోనే జరిగిందని, హత్యాకాండ పట్ల హర్హం వ్యక్తం చేస్తూ నివేదికలు పంపిన విషయాన్ని మంగళవారం నాడు అమెరికా ప్రభుత్వమే స్వయంగా వెల్లడించిన పత్రాలు తెలిపాయి. ఆ వూచకోతలో అమెరికా, దాని మద్దతుదారుగా వున్న బ్రిటన్ వూచకోతను సాగించేందుకు ఇచ్చిన తోడ్పాటును ఈ పత్రాలు నిర్ధారించాయి. ఇవి అమెరికాకు ఇబ్బందిలేని రీతిలో జాగ్రత్తగా ఎంపిక చేసి బహిర్గతపరచినవని గమనించాలి. పూర్తి సమాచారం తెలియాలంటే సిఐఏతో సహా మిగిలిన అన్ని పత్రాలను విడుదల చేయాల్సి వుంది. ఆ సమయంలో కమ్యూనిస్టుల తిరుగుబాటు, అధ్యక్షుడిగా వున్న ఇండోనేషియా జాతీయవాది సుకర్ణో ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు జరిపిన తప్పుడు ప్రచార బండారాన్ని ఇవి బయట పెట్టాయి. కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టే పధకంలో భాగంగా అమెరికా కనుసన్నలలో జరిగిన కుట్రలో మిలిటరీ జనరల్ సుహార్తో నాయకత్వంలో సుకర్ణోను బందీని చేసి ఆయన పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
1965ా66 సంవత్సరాలలో జరిపిన ఈ వూచకోతకు సంబంధించి జకర్తాలోని అమెరికా రాయబారకార్యాలయంలో వున్న 39 రహస్య పత్రాలను విడుదల చేశారు. ఇండోనేషియా వూచకోత వాస్తవాలను వెల్లడించాలని అక్కడి పౌరహక్కుల సంస్దలు, చరిత్రకారులు గతకొద్ది సంవత్సరాలుగా చేస్తున్న డిమాండ్‌కు ఇవి కొంత మేరకు వుపయోగపడతాయి. అసలైన నిందితులను బోనులో నిలబెట్టేందుకు ఇంకా ఎంతో చేయాల్సి వుంటుంది. తన ప్రయోజనాలకు హానిలేవు అనుకున్న పత్రాలను మాత్రమే అమెరికా విడుదల చేస్తుంది అనే విషయాన్ని సదా గమనంలో వుంచుకోవాలి. నేషనల్ సెక్యూరిటీ అర్కైవ్స్ పేరుతో వున్న ఒక సంస్ధ ద్వారా ఇలాంటి పత్రాలను విడుదల చేస్తారు.
‘1965ా66లో ఇండోనేషియాలో జరిగిన సామూహిక హత్యల గురించి అమెరికా అధికారులకు వివరంగా తెలుసునని కొత్తగా విడుదల చేసిన పత్రాలు స్పష్టం చేశాయి. ‘ ఇది 20శతాబ్దంలో జరిగిన ఒక దారుణమైన కిరాతకాన్ని చరిత్రగా నమోదు చేయటానికే కాదు, ఎప్పుడో జరగాల్సిన బాధితుల బాధానివారణ దిశగా కూడా అన్ని పత్రాలను విడుదల చేయాలని’ నేషనల్ సెక్యూరిటీ సంస్ధ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ ఫెలిమ్ కినే వ్యాఖ్యానించారు. 1965 నుంచి 1968 వరకు జరిగిన పరిణామాలకు సంబందించి దాదాపు 30వేల పేజీలున్న 39 పత్రాలను విడుదల చేశారు. వాటిలో టెలిగ్రాములు, లేఖలు, రహస్య వర్తమానాలు, పరిస్ధితి గురించి మదింపు నివేదికల వంటివి వున్నాయి.
గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా నియంత సుహార్తో మరణించిన తరువాత అక్కడ పౌర ప్రభుత్వాలు ఏర్పడి నప్పటి నుంచి కమ్యూనిస్టులపై జరిపిన మారణకాండ వివరాలను బయటపెట్టాలని ఏదో ఒక రూపంలో అక్కడ ఆందోళన కొనసాగుతున్నది. అదే సమయంలో ఆవివరాలను ఏమైనా సరే బయటపెట్టకూడదని మిలిటరీ తీవ్ర వత్తిడి తెస్తున్నది. సుహార్తో మరణానంతరం పౌరపాలకులే అధికారంలో వున్నప్పటికీ తెరవెనుక మిలిటరీదే అధికారం. నిషేధిత కమ్యూనిస్టు పార్టీని తిరిగి పునరుద్దరించే యత్నాలు జరుపుతున్నారనే పేరుతో మిలిటరీ ప్రోద్బలంతో గతం నుంచి మిలిటరీతో సంబంధాలున్న మహమ్మదీయ సంస్ధ వారసులు కొత్త పేరుతో ఇప్పుడు రెచ్చిపోతున్నారు. ఎర్రరంగు టీ షర్టు వేసుకున్నా కమ్యూనిస్టు అనే అనుమానంతో పోలీసులు పట్టుకొని విచారణ జరుపుతున్నారు. కమ్యూనిస్టు సాహిత్యం అమ్మేవారిని కూడా పోలీసు స్టేషన్లకు తీసుకువెళ్లి వేధిస్తున్నారు. నాటి వూచకోతకు సంబంధించి బంధువులకు న్యాయ సహాయం అందించేందుకు ఒక హాలులో ఏర్పాటు చేసిన సమావేశం కమ్యూనిస్టుల మీటింగ్ అంటూ ముస్లిం మతోన్మాదులతో దానిపై దాడి చేయించారు. అదే విధంగా కమ్యూనిస్టుపార్టీని పునరుద్దరించకూడదనే పేరుతో తలపెట్టిన ప్రదర్శనలో జనం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పాతికవేల మంది వరకు పోలీసులు రక్షణగా పాల్గన్నారు. యువతరానికి చరిత్రను తెలియ చెప్పాలనే పేరుతో కమ్యూనిస్టులను హత్యచేయటాన్ని సమర్ధిస్తూ మిలిటరీ తరఫున తీసిన చిత్రాన్ని ప్రతిఏటా సెప్టెంబరు 30 టీవీలు, ఇతర చోట్ల ప్రదర్శించేవిధంగా మిలిటరీ చర్యలు తీసుకొంటోంది. వాస్తవాలను చెప్పే డాక్యుమెంటరీల ప్రదర్శనలను అడ్డుకుంటోంది. ఈ పూర్వరంగంలో పరిమితమైన సమాచారాన్నే వెల్లడించినప్పటికీ ఈ పత్రాల విడుదల హక్కుల వుద్యమానికి మరింత వూపు తెస్తాయి. ఇప్పటికీ కమ్యూనిస్టులను హతమార్చటాన్ని అధికారికంగా సమర్ధిస్తూనే వున్నారు. మరణించిన వారు కనీసంగా ఐదు నుంచి పదిలక్షల మంది వరకు వుంటారని అంచనా. ఇంతకాలం గడిచినా తమవారి అదృశ్యం గురించి ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులకు రక్షణ లేదు.ఇండోనేషియాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తిరుగుబాటులో భాగంగా 1965 సెప్టెంబరు 30న ఆరుగురు మిలిటరీ జనరల్స్‌ను కమ్యూనిస్టులు హత్య చేశారనే ఆరోపణతో మిలిటరీ మారణకాండకు పాల్పడింది. నిజానికి ఆ జనరల్స్‌ను కుట్రలో భాగంగా సుహార్తోయే చంపించారన్నది బహిరంగ రహస్యం. వారు కమ్యూనిస్టు అనుకూల మిలిటరీ అధికారులనే అభిప్రాయం కూడా వుంది.
సిఐఏ ద్వారా పధకాన్ని రూపొందించటం ఐదువేల మంది ప్రముఖ కమ్యూనిస్టుల వివరాలు, మిలిటరీకి ఆయుధాలు,ముస్లింమతోన్మాదులకు శిక్షణ, నిధులు అందచేసిన అమెరికా ప్రభుత్వ పాత్ర వివరాలు ఇంకా బయటకు రావాల్సి వుంది. 1990లో ఒక ప్రశ్నకు సమాధానమిచ్చిన అమెరికా రాయబారకార్యాలయం ఒక అధికారి తనంతటతానే ఒక జాబితాను రూపొందించి ఇచ్చినట్లు అంగీకరించింది. సామూహిక మారణకాండ గురించి నాటి అమెరికా అధికారులు ఎంత సంతోషంగా వర్తమానం పంపారో మచ్చుకు చూడవచ్చు.’ రెండున్నర వారాలలో లక్షమందిని నమ్మశక్యంగాని రీతిలో ఆమీట వూచకోత కోసింది’ అని జకర్తాలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రధమ కార్యదర్శి మారీ వాన్స్ ట్రెంట్ పంపిన వర్తమానంలో వుంది. 1966లో సిఐఏ అధికారి ఎడ్వర్డ్ మాస్టర్స్ ఒక వర్తమానంలో ‘బందీలుగా పట్టుకున్న కమ్యూనిస్టుల’ సమస్య గురించి చర్చించారు. ‘ కమ్యూనిస్టు ఖైదీలను వురితీయటం లేదా పట్టుకోక ముందే వారిని చంపివేయటం ద్వారా అనేక ప్రాంతాలు ఈ సమస్యను విజయవంతంగా అధిగమించాయి. దానిలో ముస్లిం యువజన బృందాల కర్తవ్యం ఏమంటే వారికి సహాయం అందచేయటం’ అని పేర్కొన్నాడు. నిజానికి ఈ పత్రాలను 2001లోనే సిద్ధం చేశారు గాని, 16 సంవత్సరాల తరువాత మంగళవారం నాడు విడుదల చేశారు. ‘ మాకు నిజంగా తెలియదు వాస్తవ సంఖ్య లక్షో పదిలక్షలో తెలియదని పేర్కొన్న 1966 ఏప్రిల్ నాటి ఒక వర్తమానం విడుదల చేసిన వాటిలో వుంది. సుకర్ణోను గద్దె దించితే ఇండోనేషియాకు అమెరికా సాయం అందచేస్తుంది అనే ఒక వర్తమాన పత్రం కూడా వీటిలో వుంది. మిలిటరీ నియంత సుహార్తో తన అధికారాన్ని సుస్ధిరం చేసుకున్నారని నిర్ధారించుకున్న తరువాత 1966 మార్చి నెల నుంచి అమెరికా సాయం ప్రారంభమైంది.
ఈ పత్రాలను విడుదల చేయాలంటూ 2015లో అమెరికా సెనెట్‌లో ఒక బిల్లును ప్రతిపాదించిన టామ్ వుడాల్ పత్రాల విడుదల గురించి వ్యాఖ్యానిస్తూ ‘ దారుణమైన నేరాలకు పాల్పడిన సమయంలో ఇండోనేషియా ప్రభుత్వానికి తోడ్పడిన తీరును కూడా ఎంతగానో ఇవి వెల్లడిస్తాయి. ఇండోనేషియాలో ఈ హత్యల వెనుక వున్న వారు అనేక మంది ఎలాంటి శిక్షలు లేకుండా ఇప్పటికీ జీవించి వున్నారు. బాధితులు, వారి వారసులను వెనక్కు నెట్టారు, గుర్తింపు లేకుండా పోయింది.దీనిలో అమెరికా తన పాత్ర గురించి ఘర్షణ పడాలి, దాన్ని అంగీకరించటం ద్వారానే భవిష్యత్ మానవహక్కుల రక్షణ గురించి గట్టిగా మాట్లాడగలం ‘ అన్నారు. మహమ్మదీయ సంస్ధ పేరుతో వ్యవహరించిన మతోన్మాదులు మిలిటరీతో చేతులు కలిసి మసీదులలో ప్రార్ధనల సందర్భంగా కమ్యూనిస్టులు దైవ ద్రోహులని వారిని ఎక్కడ బడితే అక్కడ కోడి మెడ కోసినట్లు కోసి చంపాలని పిలుపు ఇచ్చారంటూ అమెరికన్లు పంపిన వర్తమానాలలో వున్నాయి. ‘ మాకు ఈ విషయాల గురించి బాధితుల మౌఖిక సంభాషణల ద్వారా సాధారణంగా తెలుసు, కానీ ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసిన సమాచారం మంచి చెడ్డలన్నింటినీ వెల్లడించటం గొప్ప విషయం అని బ్రిటీష్ కొలంబియా విశ్వవిద్యాలయ చరిత్ర అసోసియేట్ ప్రొఫెసర్ జాన్ రోజా వ్యాఖ్యానించారు.
నెదర్లాండ్స్ వలస రాజ్యంగా వున్న ఇండోనేషియా స్వాతంత్య్ర వుద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సుకర్ణో ఒకరు. ఆయన జాతీయవాదులు, కమ్యూనిస్టుల అనుకూల వైఖరిని కలిగి వుండేవారు.1945లో ఏర్పడిన స్వతంత్ర ఇండోనేషియాకు ఆయన తొలి అధ్యక్షుడు. అలీనోద్యమ నేతల్లో ఒకరు. తొలిరోజుల్లో జాతీయవాదిగా వున్నప్పటికీ 1960 దశకం నాటికి ఆయన కమ్యూనిస్టుల పట్ల మరింత సానుకూల వైఖరిని తీసుకున్నారు. ఇది అమెరికాకు కంటగింపు అయింది. అప్పటికే అమెరికన్లు వియత్నాంపై దాడులు చేస్తూ మారణకాండ సాగిస్తున్నారు. ఇండోనేషియాలో అతి పెద్ద కమ్యూనిస్టుపార్టీ వుంది. ఇస్లామిక్ దేశాలలో పెద్దదైన ఇండోనేషియా ఏ క్షణంలో అయినా కమ్యూనిస్టు దేశంగా మారిపోయే అవకాశం వుందని అమెరికా భయపడింది. అదే అక్కడి కుట్రలకు నాంది. దానిలో భాగంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ముస్లిం మతోన్మాదులను రెచ్చగొట్టేందుకు తెరలేపారు. దీనితో పాటు ఇతర విద్రోహ చర్యలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు రైతాంగ గెరిల్లాల వ్యవస్ధను కూడా తయారు చేసేందుకు పూనుకున్న తరుణంలో సిఐఏ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులసామూహిక హత్యాకాండకు పధకరచన సాగిందని, దాని గురించి సూచాయగా తెలిసినప్పటికీ అధ్యక్షుడు సుకర్ణో మద్దతు వున్నందున కమ్యూనిస్టులు తీవ్రతను వూహించలేక, తగిన సన్నద్దులు కాలేకపోయారని,కుట్రను తిప్పికొట్టలేకపోయారని కూడా ఒక అభిప్రాయం వుంది. సుకర్ణోకు కమ్యూనిస్టుల నుంచి ముప్పు ఏర్పడిందనే పేరుతో ఆయనను గృహనిర్బంధం చేసి మిలిటరీ జనరల్ సుహార్తో అధ్యడిగా ప్రకటించుకొని హత్యాకాండను సాగించాడు. 1970లో సుకర్ణో కిడ్నీ వ్యాధితో మరణించినట్లు ప్రకటించారు.
అమెరికా వెల్లడించిన పత్రాలలో సమాచారం వూచకోత దోషులను వెల్లడించకపోయినప్పటికీ అనేక విషయాలను అధికారికంగా నిర్ధారించింది. ఇండోనేషియా సామాజిక, రాజకీయ వ్యవస్ధలో సంభవించబోయే మార్పులను ఇవి ఎంతో కొంత మేరకు ప్రభావితం చేస్తాయి. మిలిటరీ, సామ్రాజ్యవాదుల పాత్ర గురించి వాస్తవాలను తెలుసుకొనే ఆసక్తిని కలుగచేస్తాయి. ప్రజాస్వామిక, ఇప్పటికీ రహస్యంగానే వున్న వామపక్ష శక్తులు మరింత చురుకుగా పని చేస్తాయనటం నిస్సందేహం.