• About
  • Farmers

vedika

~ your forum for critical and constructive writings

vedika

Tag Archives: TRS government

హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాల విలీనాలు-భిన్న వైఖరులు ఎందుకు ? ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వంద్వ వైఖరి !

17 Thursday Sep 2020

Posted by raomk in AP, BJP, Communalism, Congress, CPI(M), Current Affairs, History, INDIA, Left politics, NATIONAL NEWS, Opinion, Political Parties, Telangana

≈ Leave a comment

Tags

BJP hypocrisy, Hyderabad liberation day, Razakars (Hyderabad), RSS - Hyderabad’s liberation, TRS government


ఎం కోటేశ్వరరావు


చరిత్ర నిర్మాతలు ప్రజలు. కానీ చరిత్రను ఎలా రాయాలో నిర్దేశించేది విజేతలు లేదా పాలకులు అన్నది ఒక అభిప్రాయం. ప్రతి దానికీ కొన్ని మినహాయింపులు ఉన్నట్లుగానే చరిత్ర నమోదులో కూడా అలాంటివి ఉండవచ్చు. చరిత్రలో మనకు నిరంకుశులు – ప్రజాస్వామ్య వాదులు, శ్రామికజన పక్షపాతులు – శ్రామిక జన వ్యతిరేకులు కనిపిస్తారు. ఆ రాణీ ప్రేమ పురాణం ఈ ముట్టడి కైన ఖర్చులు ఇవి కాదోయి చరిత్ర సారం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అందువలన చరిత్రను చూసే, రాసేవారి ఆసక్తి వెనుక ప్రయోజనాలు కూడా ఉంటాయి. అవి వ్యక్తిగతం కావచ్చు, భావజాల పరంగానూ ఉంటాయి.


చరిత్రను వర్గదృష్టితో పరిశీలిస్తే ఒక మాదిరి, కులం – మతం- ప్రాంతీయం వంటి కళ్లద్దాలతో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. స్వాతంత్య్ర ఉద్యమం, సంస్కరణ, అభ్యుదయ, వామపక్ష ఉద్యమాలతో ప్రభావితులైన తరం రాసిన చరిత్రలో ఆ భావజాల ప్రభావాలు కనిపిస్తాయి. అలాంటి శక్తులు పాలకులుగా ఉన్నారు కనుక దాన్ని వివాదాస్పదం కావించలేదు. ఆ చరిత్రకు ఆమోదం లభించింది. అయితే ఆ చరిత్ర మొత్తాన్ని కమ్యూనిస్టులు రాసిన చరిత్రగా వక్రీకరిస్తూ మన దేశంలోని మత శక్తులు ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు ఎప్పటి నుంచో చరిత్రను తిరగరాయాలని చూస్తున్నారు. వారి చరిత్ర మత ప్రాతిపదికగానే ఉంటుంది. ఆ ప్రాతిపదికతో జనాల మధ్య విభజన గోడలు కట్టాలనే ఎత్తుగడదాగి ఉంది. ఆ గోడలతో వారేమి చేసుకుంటారు అన్నది వెంటనే వచ్చే ప్రశ్న.


ఏ కులం, ఏ ప్రాంతం, మతం వారైనా కష్టజీవులుగా తాము దోపిడీకి గురవుతున్నామా లేదా అనే ప్రాతిపదికన ఆలోచించాలని కమ్యూనిస్టులు చెబుతారు. దానికి భిన్నంగా కులం, ప్రాంతం, మత ప్రాతిపదికన సమీకృతం కావాలన్నది ఆ శక్తుల వాంఛ. అదే జరిగితే నష్టపోయేది శ్రామికులు, లబ్ది పొందేది దోపిడీదార్లు. అందుకే ఏ దేశ చరిత్ర చూసినా పాలకులు, మతం మధ్య సఖ్యత, ఒకదాన్ని ఒకటి బలపరుచుకోవటం ముఖ్యంగా ఫ్యూడల్‌ సమాజాలలో కనిపిస్తుంది. దోపిడీదార్లకు మతం ఆటంకంగా మారినపుడు దాని పెత్తనాన్ని బద్దలు కొట్టి పక్కన పెట్టటాన్ని ఐరోపా పరిణామాల్లో చూస్తాము.


ఆసియా, ఆఫ్రికా వంటి వెనుకబడిన ఇంకా ఫ్యూడల్‌ వ్యవస్ధ బలంగా ఉన్న చోట్ల మతం ప్రభావితం చేస్తూనే ఉంది. మన దేశానికి వస్తే పెట్టుబడిదార్లు మతంతో, ఫ్యూడల్‌ వ్యవస్దతో రాజీపడటం కనిపిస్తుంది. బిర్లా వంటి పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద దేవాలయాల నిర్మాణం చేయటం (వారి పేర్లతో దేవాలయాలను పిలవటం-హైదరాబాద్‌ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని బిర్లా మందిర్‌ అనే పిలుస్తారు.) మతంతో రాజీ, దాన్ని ఉపయోగించుకొనే యత్నం తప్ప మరొకటి కాదు. అలాగే ఇతర మతాలకు చెందిన పారిశ్రామికవేత్తలు మసీదు, చర్చ్‌లు కట్టించినా లక్ష్యం ఒకటే.
బ్రిటీష్‌ వారి పాలనలో సంస్ధానాలు తిరుగుబాటు చేసిన చోట విలీనం చేసుకున్నారు. రాజీపడిన చోట సామంత రాజ్యాలుగా లేకా ప్రత్యేక అధికారాలు, రక్షణతో కొనసాగాయి. చరిత్రను మత ప్రాతిపదికన చూడటం ఎలా జరుగుతోందో చూద్దాం. స్వతంత్ర భారత్‌లో కలిసేందుకు హైదరాబాద్‌, కాశ్మీర్‌, జునాగఢ్‌ సంస్ధానాలు వ్యతిరేకించి బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులు పన్నిన వ్యూహంలో భాగంగా స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని ప్రకటించాయి. నిజానికి అవెన్నడూ స్వతంత్ర రాజ్యాలు కాదు, బ్రిటీష్‌ ఇండియాకు సామంత రాజ్యాలుగానే ఉన్నాయి. అవి స్వతంత్ర దేశాలుగా అవతరించటం అంటే మన తల మీద ఒక సామ్రాజ్యవాద తొత్తును, గుండెల మీద మరొకతొత్తును ప్రతిష్టించుకోవటం తప్ప వేరు కాదు. ఈ కుట్రను ఛేదిస్తూ నాటి కేంద్ర ప్రభుత్వం సంస్ధాలను విలీనం చేసుకున్నది.
హైదరాబాదులో సంస్ధానాధీశుడు ముస్లిం, మెజారిటీ జనాభా హిందువులు. కాశ్మీరులో మెజారిటీ జనాభా ముస్లింలు, పాలకుడు హిందువు. నిజాం నవాబు లొంగిపోయి ఒప్పందం చేసుకోవటాన్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులు విమోచన పొందినట్లుగా బిజెపి, దాని మాతృసంస్ధ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్ణిస్తుంది. కాశ్మీరు స్వతంత్ర రాజ్యంగా ఉండాలనటాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ సమర్దించింది. దాని వాంఛలకు భిన్నంగా కాశ్మీరు విలీనంగాక తప్ప లేదు. మరి దీన్నేమనాలి ? హిందూపాలకుల నుంచి ముస్లింలు విముక్తి పొందినట్లా ?


1921లో కేరళలోని మలబారు ప్రాంతంలో జరిగిన మోప్లా తిరుగుబాటును కూడా మత కోణంతో బిజెపి చూస్తోంది. బ్రిటీష్‌ వారు, స్ధానిక భూస్వాముల మీద ఆ ప్రాంతంలో గణనీయంగా ఉన్న ముస్లింలు, ఇతరులు జరిపిన తిరుగుబాటును హిందువుల మీద జరిగిన దాడులుగా చిత్రించి దాన్ని స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా నిరాకరిస్తూ పాఠ్యపుస్తకాల నుంచి తొలగించేందుకు నిర్ణయించింది.


ఆపరేషన్‌ పోలో పేరుతో సైనిక చర్య ద్వారా 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్దానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసుకున్న రోజు. నాలుగు రోజుల్లోనే యూనియన్‌ సైన్యాలను ప్రతిఘటించకుండానే నిజాం నవాబు సైన్యం చేతులెత్తేసింది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో తిలక్‌ వంటి వారు జనాన్ని సమీకరించేందుకు నాటి ముంబై ప్రావిన్సులో వినాయకచవితి పండుగలను ప్రోత్సహించారు. అలాగే నిజాం రాజు సంఘం పేరుతో కమ్యూనిస్టుల నాయకత్వాన ప్రారంభమైన పోరుతో తన అధికారానికి ఎసరు రావటాన్ని గమనించి మతం పేరుతో సంస్ధానంలో ఉన్న ముస్లింలను ఆ ఉద్యమానికి దూరం చేసేందుకు, అణచివేసేందుకు రజాకార్ల పేరుతో ప్రయివేటు మిలిటెంట్లను ప్రోత్సహించాడు. ఆ శక్తులు మతోన్మాదంతో ఉత్తేజం పొందినవి కావటంతో వారి చర్యల్లో ఎక్కడైనా కొన్ని మత ప్రాతిపదికన జరిగి ఉండవచ్చు తప్ప రజాకార్లు నాటి హిందూ, ముస్లిం మతాలకు చెందిన జాగీర్దార్లు, దేశముఖుల రక్షణకోసమే పని చేశారు. వారిని వ్యతిరేకించిన వారిలో ఎందరో సామాన్య ముస్లింలు ఉన్నారు. తెలంగాణా సాయుధ పోరాటానికి నాంది అయిన భూ సమస్యలో దేశముఖ్‌కు వ్యతిరేకంగా చట్టబద్దమైన పోరు సాగించిన సామాన్య ముస్లిం రైతు బందగీ కోర్టులో విజయం సాధించిన తరువాత హత్యకు గురికావటం ఉద్యమానికి నిప్పురవ్వను రగిలించిన ఉదంతం కాదా ?


నిజాం రాచరికపు దౌర్జన్యాలను ఎండగట్టిన కలం యోధుడు షోయబుల్లాఖాన్‌. నిజాం రజాకార్‌ మూకల దాడిలోనే కన్నుమూసిన వీరుడు. రాచరికపు నిర్బంధాన్ని లెక్కచేయక, 1938లోనే ఔరంగాబాద్‌లో శ్రామిక మహాసభలో పాల్గొని మఖ్దూం మొహియుద్దీన్‌, హబీబ్‌లు కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. భూస్వామ్య, పెట్టుబడిదారీ దోపిడీలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా 1939లో హైదరాబాద్‌లో కామ్రేడ్స్‌ అసోసియేషన్‌ ప్రారంభించిన వారిలో ఆలం ఖుంద్‌మిరీ ఒకరు. ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ తొలి అధ్యక్షుడు మఖ్దూం మొహియుద్దీన్‌. 1947 ఆగస్టు 15న ఆల్‌ హైదరాబాద్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ కార్యాలయం మీద త్రివర్ణ పతాకం ఎగురవేశారు. నిజాం కాలేజీలో విద్యార్థి నాయకుడు రఫీ అహ్మద్‌ కూడా జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీరంతా ఎవరు ?


విసునూరు దేశ్‌ ముఖ్‌ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఐలమ్మ భూమి రక్షణ కోసం జరిగిన పోరాటం రైతాంగానికి స్ఫూర్తి నిచ్చింది. 1946, జూలై 4న దొడ్డి కొమరయ్య నేలకొరగటంతో రైతాంగం తిరుగుబాటు ప్రారంభమైంది. పోరాటం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలోనే 1947, ఆగస్టు 15న స్వతంత్ర భారతదేశం ఆవిర్భవించింది. అప్పటికే చైనాలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సాగుతున్న లాంగ్‌ మార్చ్‌ అనేక ప్రాంతాలను విముక్తి చేసింది. తెలంగాణాలో కమ్యూనిస్టులు నిజాం సైన్యాలు, రజాకార్లను చావు దెబ్బతీస్తున్నారు. అక్కడ కూడా కమ్యూనిస్టులు ఆధిపత్యం వహిస్తే నైజాం సంస్ధానం మరో ఏనాన్‌గా మారుతుందేమో అని అమెరికా,బ్రిటన్‌ పాలకులు భయపడి దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అణచివేయాలని నెహ్రూ ప్రభుత్వాన్ని కోరారు.


కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలు సంఘటితంగా ముందుకు సాగటం తట్టుకోలేని భూస్వాముల పెద్దలైన బూర్గుల రామక్రిష్ణారావు, కెవి రంగారెడ్డి వంటి వారు ఢిల్లీ వెళ్లి అక్కడ నెహ్రూ, పటేల్‌ తదితర పెద్దలకు మొరపెట్టుకొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజంటు కె యం మున్షీ ని వివరాలు కోరారు. ఆయన ఇక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పాడు. నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో కమ్యూనిస్టులు బలంగా ఉన్న గ్రామాల్లోకి నైజాం పోలీసులు కానీ, రజాకారు మూకలు గానీ పోలేకపోతున్నాయి. ఇంతకుముందు గ్రామాల మీదే కేంద్రీకరించే వాళ్ళు, ఇప్పుడు పారిశ్రామిక ప్రాంతాలపై కూడా కేంద్రీకరిస్తున్నారు. వాళ్ళకు ప్రజామద్దతు రోజరోజుకు పెరిగిపోతోంది. ఇదంతా బెజవాడ కేంద్రంగా కమ్యూనిస్టులు ఏర్పాటు చేసుకున్న పట్టు అని రిపోర్టు ఇచ్చాడు. అసలే హైదరాబాద్‌ దేశానికి నడిబొడ్డున ఉంది. ఇది ఇలాగే ఉంటే కమ్యూనిస్టుల చేతికిపోతే మొత్తం దక్షిణ భారత దేశంపై దీని ప్రభావం పడుతుంది. ఆ తరువాత దేశం మొత్తానికి విస్తరించినా విస్తరించవచ్చు. ఇక మనం ఉపేక్షించటం మంచిది కాదని భావించిన కేంద్రం వెంటనే సైనికచర్యకు ఉపక్రమించింది. దానికే ఆపరేషన్‌ పోలో అని పేరు పెట్టారు. ఆ కారణంగానే కాశ్మీర్‌ను ఆక్రమించుకున్న పాకిస్ధాన్‌పై దాడి కంటే నెజాం సంస్ధాన విలీనానికి ఎక్కువ మంది మిలిటరీని దించారు. జనరల్‌ జెయన్‌ ఛౌదరి నాయకత్వలో సైన్యాలు వచ్చాయి. సెప్టెంబర్‌ 13న వచ్చాయి. 17కల్లా ఆపరేషన్‌ క్లోజ్‌ అయింది.


తెలంగాణలో కమ్యూనిస్టు నాయకత్వంలో రైతాంగ పోరాటం జరుగుతున్న కాలంలోనే కాశ్మీర్‌ రైతాంగం కూడా షేక్‌ అబ్దుల్లా నాయకత్వంలో పోరాడారు. భూమికోసం, ప్రజాస్వామ్యం కోసం, రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అక్కడ కూడా రైతాంగం కాశ్మీరు రాజు సైన్యం, తరువాత పాకిస్థాన్‌ సైన్యాలనూ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే కాశ్మీర్‌ కూడా ఇండియన్‌ యూనియన్‌లో విలీనమైంది.
రెండు చోట్లా ప్రజాపోరాటాలు ముందుకు తెచ్చిన భూ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. కొత్త సమస్యలు తలెత్తాయి. వాటిని పక్కన పెట్టి తెలంగాణా బీజేపీ, ఆరెస్సెస్‌ పరివారం విలీనమా? విమోచనమా? అన్న చర్చను ముందుకు తెస్తున్నది. విలీనం ప్రాధాన్యతను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ ముస్లిం ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ముస్లిం రాజు నుంచి హిందువుల విమోచనగా వక్రీకరిస్తున్నారు. కాశ్మీరు విలీనానికి అంగీకరించిన ప్రత్యేక రక్షణలను తొలగించటమే కాదు చివరకు ఆ రాష్ట్రాన్నే బిజెపి రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చివేసింది. హైదరాబాద్‌ రాజ్యం గానీ, కాశ్మీర్‌ సంస్థానం గానీ ప్రత్యేక చారిత్రక నేపథ్యంలో విలీనమైన విషయం బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. మెజారిటీ మత సంతుష్టీకరణ, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఈ అంశాల మీద ఆ పార్టీ వ్యవహరిస్తోంది అని చెప్పవచ్చు.


హైదరాబాద్‌, కాశ్మీర్‌ రాచరికాలను కూలదోయటం గొప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ. ఈ రెండు ప్రాంతాలలోనూ రైతాంగ పోరాటాలతో సాధించుకున్న ప్రజాస్వామ్య విలువలే, స్వాతంత్య్రోద్యమ సంప్రదాయాల ఫలితంగా ఏర్పడిన ఇండియన్‌ యూనియన్‌లో విలీనానికి పునాది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం సరైనదా కాదా అన్నది కాసేపు పక్కన పెడితే దాని ప్రకారం హిందువుల విముక్తి కోసం పోరాడే చిత్తశుద్ది దానికి నిజంగా ఉంటే బ్రిటీష్‌ ఇండియాలో ముస్లిం పాలకుడి పాలనలో అణచివేతకు గురైన మెజారిటీ హిందువులున్న హైదరాబాదు సంస్దానంవైపు అది ఎందుకు చూడలేదు. దానిలో 85శాతం హిందువులు, 12శాతమే ముస్లింలు ఉన్నారు. దేశ సగటు కంటే ఎక్కువ మంది హిందువులున్న ప్రాంతం. తెలంగాణా ఫ్యూడల్‌ శక్తుల వ్యతిరేక పోరాటంతో అణుమాత్రం కూడా ఆర్‌ఎస్‌ఎస్‌కు సంబంధం లేదు. కాశ్మీర్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌లో విలీనం కావద్దనీ, రాచరికమే కొనసాగాలనీ చెప్పిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. అంతే కాదు అక్కడి భూమిలో ఎక్కువ భాగం హిందూ భూస్వాముల చేతుల్లో ఉంది. ఆ భూమి కోసం పోరాటం నిర్వహించిన షేక్‌ అబ్దుల్లాను ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యతిరేకించి భూస్వాముల కొమ్ము కాచింది. అటు స్వాతంత్య్రోద్యమంతోనూ సంబంధం లేకపోగా తెల్లదొరల సేవలో తరించిన సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. మెజారిటీ పౌరులు ముస్లింలు, పాలకుడు, భూస్వాములు హిందువులు కావటంతో వారికి మద్దతుగా కాశ్మీరులో తన శాఖలను ఏర్పాటు చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రత్యేకంగా ప్రయత్నించింది. ప్రజాపరిషత్‌ అనే సంస్ధ ముసుగులో భూస్వాముల తరఫున పని చేసింది. అదే హైదరాబాదు సంస్ధానంలో రాజు ముస్లిం, 95శాతంపైగా భూస్వాములు హిందువులు, వారంతా రాజు మద్దతుదారులుగా ఉన్నందున ఆ ప్రాంతంలో తన మత రాజకీయాలకు చోటు ఉండదు,అన్నింటికీ మించి రాజు – భూస్వాములు కలసే జనాన్ని దోపిడీ చేస్తున్నందున భూస్వాములకు ప్రత్యేకంగా ఆర్‌ఎస్‌ఎస్‌ అవసరం కలగలేదు కనుకనే కేంద్రీకరించలేదని చెప్పవచ్చు.మహాత్మా గాంధీ హత్య కారణంగా నిషేధానికి గురైన ఈ సంస్ద భవిష్యత్‌లో రాజకీయాల్లో పొల్గొనబోమని, సాంస్కృతిక సంస్ధగా కొనసాగుతామని కేంద్ర ప్రభుత్వానికి హామీ పత్రం రాసి ఇచ్చింది. దాంతో రాజకీయ రంగంలో కార్యకలాపాల కోసం 1950దశకంలో జనసంఫ్‌ు అనే రాజకీయ పార్టీని ముందుకు తెచ్చింది.


” భారత రాజ్యాంగ సభలో చేరేందుకు తిరస్కరించిన సంస్థానాలలో కాశ్మీరు ఒకటి. మంత్రివర్గ పధకం కింద ఏర్పాటైన ఆ సభ 1946 డిసెంబరు నుంచి పని చేస్తున్నది. ఏ రాష్ట్రమైనా అలా తిరస్కరిస్తే దాన్ని శత్రుపూరిత చర్యగా పరిగణించాల్సి ఉంటుందని తాత్కాలిక ప్రభుత్వ ఉపాధ్యక్షుడిగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ హెచ్చరించినప్పటికీ మహరాజు తిరస్కరించారు. సంస్థానాధీశులకు స్వతంత్రంగా ఉండే హక్కుకు నిర్ద్వంద్వంగా ముస్లిం లీగు మద్దతు ప్రకటించటం రాజ్యాంగ సభలో చేరకూడదనే రాజు మూర్ఖత్వాన్ని మరింత బలపరించింది.1947 జూన్‌ 17న ముస్లింలీగ్‌ నేత మహమ్మదాలీ జిన్నా ఈ మేరకు ప్రకటించారు. జమ్ము -కాశ్మీరు గనుక స్వతంత్ర దేశంగా ఉండదలచుకుంటే పాకిస్తాన్‌ స్వాగతిస్తుందని, స్నేహపూరిత ఒప్పందాలు చేసుకుంటుందని 1947 జూలై 11న మరింత స్పష్టంగా వెల్లడించారు.


విడిపోవటం ఖాయమని స్పష్టమైన తరువాత మహరాజు(కాశ్మీర్‌) భారత్‌లో చేరే మానసిక స్థితిలో లేరు. జమ్ము మరియు కాశ్మీర్‌ పేర్కొంటున్నదానిని హిందూ రాజ్యంగా ఉంచాలని, లౌకిక భారత్‌గా గుర్తింపు ఉండకూడదని, విలీనం చేయకూడదని రాజుకు విధేయులుగా ఉన్న జమ్మూలోని హిందూ నేతలు రాజుకు మద్దతు ఇచ్చారు.ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ రాజ్య హిందూ సభ (ప్రస్తుత భారతీయ జనతా పార్టీ పూర్వ అవతారము) 1947 మే నెలలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మహారాజు పట్ల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తూ విలీనం గురించి ఇప్పుడు చేస్తున్నదానికి తరువాత చేయాల్సినదానికి తమ మద్దతు ఉంటుందని దానిలో పేర్కొన్నారు.1947 మే నెలలోనే ఆల్‌ జమ్మూ మరియు కాశ్మీర్‌ ముస్లిం కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు చౌదరి హమీదుల్లా ఖాన్‌ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. తక్షణమే కాశ్మీర్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించాలని, దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయాలని మహరాజును కోరారు. దీనికి ముస్లింలంతా సహకరిస్తారని, స్వతంత్ర మరియు ప్రజాస్వామిక కాశ్మీర్‌ దేశానికి తొలి రాజ్యాంగబద్ద పాలకుడిగా మహరాజుకు మద్దతు ఇస్తామని హామీని ప్రకటించారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాకిస్తాన్‌ ప్రభుత్వం కాశ్మీర్‌ మీద దాడికి వస్తే దేశంలోని ముస్లింలు దానికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపడతారు, అవసరమైతే భారత్‌ సాయం కూడా కోరతామని చెప్పారు. నాతో సహా భారత్‌కు అనుకూలంగా గళమెత్తిన వారందరినీ హిందూ వ్యతిరేకులు, ద్రోహులు అని హిందూ దురహంకారులు ఖండించారు.భారత్‌లో విలీనం కావాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని ముల్కరాజ్‌ సరాఫ్‌ సంపాదకత్వంలోని జమ్మూ దినపత్రిక రణవీర్‌ రాసినందుకు 1947 జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.”
ఈ వివరాలను ఎపిలోగ్‌ అనే పత్రిక 2010 నవంబరు సంచికలో ప్రత్యక్ష సాక్షి అనే శీర్షికతో 2005లో పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్న, జమ్మూకు చెందిన ప్రముఖ జర్నలిస్టు బలరాజ్‌ పూరీ రాశారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, హిందూత్వ వాదుల నిజస్వరూపం. ఇప్పుడు వారు దేశ సమగ్రత గురించి జనాలకు సుభాషితాలు చెబుతున్నారు. ఈ విద్రోహకర పాత్ర దాస్తే దాగేది కాదు. నేటి తరాలకు చరిత్రపట్ల ఆసక్తి లేదనే భావంతో పచ్చి అవాస్తవాలు, ద్రోహాన్ని కప్పి పుచ్చుకొనేందుకు దేశంలో మరింతగా సామాజిక విభజనను రెచ్చగొట్టేందుకు విషపు బీజాలు నాటారు. అవి ఇప్పుడు వృక్షాలుగా మారి విషఫలాలను ఇస్తున్నాయి.


సెప్టెంబర్‌ 17ను కొందరు విద్రోహ దినోత్సవం అంటు న్నారు. కొందరు విమోచన దినోత్సవం అంటున్నారు. కొందరు విలీన దినోత్సవం అంటున్నారు. దీనిని ఎలా చూడాలి? నైజాం వ్యతిరేక పోరాటం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో సంస్దాన విలీనం జరిగింది. నిజాం వ్యతిరేక పోరుకు నాయకత్వం వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీలో కొందరు యూనియన్‌ సైన్యాలు వచ్చినందున నెహ్రూ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుంది కనుక సాయుధ పోరాటాన్ని విరమించాలని చెప్పటమే కాదు, ఆయుధాలు పారవేశారు. అయితే కొద్ది రోజుల్లోనే నెహ్రు ప్రభుత్వ వర్గనైజం బయట పడింది. సాధించిన విజయాల రక్షణకు మరికొన్ని సంవత్సరాలు పోరు జరపాల్సి వచ్చింది.


నైజాం రాజు స్వాతంత్య్ర వ్యతిరేకి. విలీనానికి ముందు ఒక ఫర్మానా జారీ చేశాడు. ఎవ్వరూ ఎక్కడా సంస్ధానంలో త్రివర్ణ పతాకం ఎగురవేయగూడదనేది ఆ హుకుం. ఏ వ్యక్తి అయినా జాతీయ జండా ఎగురవేస్తే ఇతర దేశాల జండా ఎగరేసినట్టే. అందుకు 3ఏండ్లు జైలుశిక్ష గానీ, జరిమానా కానీ లేదా ఆ రెండూ కానీ అమలు చేస్తామనేది ఆ ఫర్మానా సారాంశం. కమ్యూనిస్టులు, యువత, విద్యార్ధులు ఈ ఫర్మానాను ధిక్కరించి ముందుకురికారు. హైదరాబాద్‌ స్టూడెంట్‌ యూనియన్‌ నాయకుడు రఫీ అహ్మద్‌ నిజాం కాలేజీలో త్రివర్ణ పతాకం ఎగరేశాడు. సుల్తాన్‌బజార్‌లో కాంగ్రెస్‌ నాయకుడు స్వామి రామానంద తీర్థ జాతీయ జెండా ఎగరేశాడు. బ్రిజ్‌రాణీ గౌర్‌ కోఠీ మహిళా మండలిలో జండా ఎగరేశారు. ఇలా అనేక చోట్ల పతాకావిష్కరణలు జరిగాయి. ఈ పరిస్థితులలో భారత ప్రభుత్వం, నైజాం నవాబు మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌తో యధాతధస్థితి ఒప్పందం (స్టాండ్‌ స్టిల్‌ ఎగ్రిమెంట్‌) 1947 నవంబర్‌ 29న చేసుకుంది.


ప్రజల మీద సాగించిన దాడులు, హత్యాకాండకు నిజాం రాజు, రజాకార్‌ మూకలు, వారికి మద్దతుగా ఉన్న దేశ ముఖ్‌లు, జాగిర్దార్లను విచారణ జరిపి శిక్షించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిజాంను విలీనం తరువాత రాజప్రముఖ్‌గా నియమించింది. అపార ఆస్తులు వదిలేశారు. ఆ రోజుల్లో సంవత్సరానికి 50లక్షల జీతం ఇచ్చారు. 1951 అక్టోబర్‌ 31వరకూ ఆయనను ఆ పదవిలో కొనసాగించారు. రాజాభరణాలు ఇచ్చారు. నవాబుకే కాకుండా, జమిందార్లు, జాగీర్‌దార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి పరిహారం చెల్లించారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ నవాబ్‌ ఫర్మానా జారీ చేశాడు. భారత రాజ్యాంగం అమలులోకి రాకముందు వరకు అంటే 1950 జనవరి 26 వరకు నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్‌ రాష్ట్రంలో పరిపాలన సాగింది. 1950 జనవరి 26న ఎం.కె వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించడం నైజాం చేతులమీదుగానే సాగింది.


యూనియన్‌ మిలిటరీ రావటంతో అంతకు ముందు గ్రామాల నుంచి పారిపోయిన జాగీర్దార్లు, దేశముఖులు తిరిగి గ్రామాలకు వచ్చి రైతాంగం చేతుల్లోని భూములను లాక్కోవటం ప్రారంభించారు. వాటిని రక్షించుకొనేందుకు కమ్యూనిస్టులు 1951వరకు సాయుధపోరాటాన్ని కొనసాగించారు. యూనియన్‌ సైన్యాలు రైతాంగం మీద విరుచుకుపడ్డాయి. నిజాం ప్రభుత్వ దాడిలో మరణించింది 1500మంది కాగా, నెహ్రూ సైన్యాలు 2500 మందిని పొట్టన పెట్టుకున్నాయి. అందువలన కమ్యూనిస్టులలో కొందరు సెప్టెంబరు 17ను విద్రోహదినంగా పరిగణించారు. ఇప్పటికీ అదే భావంతో ఉన్నవారు కూడా ఉన్నారు.
భూసంస్కరణలకు, కౌలుదార్ల హక్కులు కాపాడేందుకు కేంద్రం ఒప్పుకోవటంతో కమ్యూనిస్టులు సాయుధ పోరాటం విరమించారు. దీన్ని తరువాత నక్సల్స్‌గా మారిన వారు రివిజనిజంగా, తెలంగాణా రైతాంగానికి చేసిన ద్రోహంగా పరిగణించటమే కాకుండా పోరాటాన్ని కొనసాగించి ఉండాల్సిందని సూత్రీకరించారు. కొనసాగించి ఉంటే చైనాలో మాదిరి దేశంలో విప్లవానికి దారితీసేదన్నది వారి భావం.

సెప్టెంబరు 17ను తెలంగాణా విమోచన పేరుతో బిజెపి, సమైక్యతా దినంగా తెలంగాణా ప్రభుత్వం పాటిస్తున్నది. తెలంగాణా రైతాంగం సాధించుకున్న హక్కులను హరించిన విద్రోహ దినంగా పరిగణించిన కమ్యూనిస్టులు బిజెపి ఇతర కొన్ని శక్తులు చరిత్రను వక్రీకరిస్తున్న పూర్వరంగంలో వారు కూడా ఈ సందర్భంగా సభలు జరిపి జనాన్ని చైతన్య పరిచేందుకు, నైజాం సంస్థాన విలీనంలో చెరగని కమ్యూనిస్టుల పాత్రను వివరించేందుకు నిర్ణయించారు.


రైతాంగం, వృత్తుల వారిని అణచేందుకు హిందూ జమీందార్లూ, ముస్లిం రాజూ ఏకమయ్యారు. రైతాంగానికీ, జమీందార్లకు మధ్య సాగిన వర్గపోరాటం అది. ఈ వర్గ ఐక్యతను మరుగుపరచేందుకే బీజేపీ నేతలు ఇప్పుడు మతపరమైన ఘర్షణగా చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పోరాటంతో ఏ సంబంధమూలేని ఆ పార్టీ దీనిని హిందువుల విమోచనా దినోత్సవంగా జరపాలని అంటున్నది. 1947 అక్టోబరు 26న విలీనమైన కాశ్మీర్‌ దినోత్సవం లేదా సెప్టెంబరు 15న విలీనమైన జునాగఢ్‌ దినోత్సవాలను గానీ జరపాలని ఆ పార్టీ ఎన్నడూ చెప్పలేదు. సెప్టెంబర్‌ 17న నైజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేసింది వాస్తవం. ఈ నేపధ్యంలో విలీనాన్ని ఉత్సవంగా జరపాలా లేక ఆ రోజును స్మరించుకుంటూ కర్తవ్యాలను నిర్ణయించుకోవాలా అన్నది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.

గమనిక : 2020 సెప్టెంబరు 17న రాసిన ఈ విశ్లేషణను నవీకరించి తిరిగి పాఠకులకు అందించటమైంది

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

కాకమ్మ కథలు కాదు – సుదర్శన చక్రాలు, సమ్మోహనాస్త్రాలకు సమయమిదే !

21 Saturday Sep 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, History, INDIA, Literature., NATIONAL NEWS, Opinion, Others, STATES NEWS, Telangana, Uncategorized

≈ Leave a comment

Tags

BJP on Uranium, cock and bull stories, puranic weapons, saffron talibans, TRS government, Uranium

Image result for puranic weapons

ఎం కోటేశ్వరరావు

కుక్క పిల్లా, అగ్గిపుల్లా, సబ్బు బిళ్లా కాదేదీ కవితకనర్హం అన్నాడు మహా కవి శ్రీశ్రీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో , దేశంలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రతిదానినీ రాజకీయం చేస్తున్నారు, రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. అసలు సిసలు దేశభక్తులం మేమే అని చెప్పుకొనే వారి గురించి ఇక చెప్పనవసరం లేదు. మహాభారతంలో ఒక కధ వుంది. ద్రోణాచార్యుడు తన శిష్యుల కేంద్రీకరణ సరిగా వుందో లేదో పరీక్షించేందుకు ఒక రోజు పరీక్ష పెట్టాడు. ముందు కుమారుడు అశ్వధ్దామను పిలిచి చెట్టుమీద ఒక పక్షి వుంది,నీకేమి కనిపిస్తోంది అని అడగాడు. నాకు చెట్టు, దాని మీద పిట్ట, మీ పాదాలు కనిపిస్తున్నాయి అన్నాడు అశ్వధ్దామ. ఓకే, నీ బాణం కింద పెట్టు అని దుర్యోధనుడిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. గురువు గారూ నాకు చెట్టుమీద కొమ్మలు, వాటి మీద కూర్చున్న పిట్ట కనిపిస్తోంది, కొట్టమంటరా అన్నాడు, వద్దు వద్దు నీ ఆయుధాన్ని కింద పెట్టు అన్నారు. తరువాత వంతు అర్జునుడిది. నాకు పిట్ట తప్ప మరేమీ కనిపించటం లేదు అన్నాడు, అంతేనా అన్నాడు ద్రోణాచార్య. అంతే సర్‌ అన్నాడు అర్జునుడు. బిజెపి ఒక కంటికి అధికారమనే పిట్టమాత్రమే కనిపిస్తోంది. రెండో కంటికి యురేనియం వంటి సమస్యల మీద గుడ్డి సమర్దనకు అనేకం కనిపిస్తున్నాయి.

యురేనియం తవ్వకాలు, సర్వే గురించి సంప్రదాయ, సామాజిక మాధ్యమం రెండింటిలోనూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. అనేక మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఆందోళనలో పాల్గొంటామని ప్రకటిస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు పిల్లి మొగ్గలు వేస్తున్నాయి.. ముందేమి మాట్లాడుతున్నాయో వెనకేమి అంటున్నాయో చూడటం లేదు. తవ్వకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రకటించారు మరోవైపున శాసన మండలిలో మాట్లాడిన కెటిఆర్‌ యురేనియం అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు. బిజెపి నేతలు తమ వైఖరి ఏమిటో చెప్పకుండా గతంలో సర్వే, తవ్వకాలకు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌, మేము (కేంద్రం) తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు, కనుగొనేందుకు మాత్రమే, అయినా అది పనికి వస్తుందో లేదో తెలియదు అంటూ ఏవేవో చెబుతూ తాము తవ్వకాలకు అనుకూలమో కాదో చెప్పటం లేదు. యురేనియం అవసరం అంటూ పరోక్షంగా సర్వే, తవ్వకాలను సమర్ధిస్తున్నది.ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి కూడా భాగస్వామి అయ్యారు. అతని కంటే ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు ఆయన యురేనియం కంటే బొగ్గుతవ్వకమే ఎక్కువ ప్రమాదకరం అని చెప్పారు. ప్రమాదకరమైన వాటిన్నింటినీ ఆపివేయాలి, ఎవరు తవ్వమన్నారు. మరోవైపున సంఘపరివార్‌ శ్రేణులు సామాజిక మాధ్యమంలో యురేనియం తవ్వకం ఒక దేశభక్తి, దేశరక్షణ చర్యగా, పనిలో పనిగా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమంలో వారు వ్యాపింప చేస్తున్న ఒక సమాచారం దిగువ విధంగా వుంది. వూరూ పేరు లేకుండా ప్రచారం చేయటం అలాంటి వారి పద్దతి గనుక దానిలో వున్న భాష, భావాన్ని బట్టి అది వారి ప్రచారమే అని చెప్పాల్సి వస్తోంది.

Image result for sammohana astra

” యూరేనియం..ఇప్పుడు ఇదొక తర్కం..పర్యావరణం ఎంత ముఖ్యమో..దేశానికీ అణువిద్యుత్తు, అణ్వాయుధాల సమృద్ధి, అణ్వస్త్ర ప్రయోగశాల కార్యాచరణ కూడ అంతే ముఖ్యమన్న విషయ విజ్ఞానం మనం అర్ధంచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది..ప్రస్తుతం కేవలం రీసెర్చ్‌ స్థాయిలో ఉన్న ఈ అంశం పై ఇంతగా ఆందోళన అనవసరం.జంతు జీవాలు మృగ్యం అయిపోతై, పురాతన కట్టడాలు ధ్వంసం అయిపోతై, అక్కడ నివాసితుల జీవితాలు నాశనం అయిపోతై, వింతరోగాలు ప్రబలిపోతాయి అంటూ కమ్మీస్‌ చేస్తున్న ప్రచారం కేవలం చైనా ఎజండా మాత్రమే.నిజానికి అది కమ్మీల విషప్రచారం మాత్రమే. 30000 ఎకరాల విస్తీర్ణంలో వున్న నల్లమల అడవుల్లో కేవలం 1000 ఎకరాల భూభాగంలో మాత్రమే ఈ రీసెర్చ్‌ జరగబోతోంది.రీసెర్చ్‌ ముగిసిన తర్వాత యురేనియం అందుబాటు స్థాయిని అధ్యయనం చేశాక యురేనియం ప్రాసెసింగ్‌ జరగాలి.అప్పుడు రేడియేషన్‌ విడుదల అవుతుంది.విడుదలయ్యే రేడియేషన్‌ వలన పై చెప్పబడిన ఏ ఒక్క విభాగము భారీ విపత్తుకు లోను కాకుండా తగు చర్యలు పటిష్టంగా తీసుకుంటుంది. కేంద్రంలో ఉన్నది ఆషామాషీ ప్రభుత్వమో.అభాధ్యతతో కూడిన ఆలోచనలతో సాగే యంత్రాంగమో, కాసుల కోసం క్షుద్ర ప్రయోగాలు ఆవిష్కరించే నీచ సంస్కృతికి నిలయమో కాదు.అనునిత్యం దేశహితమే తన మతంగా,130 కోట్ల భారతీయులే తన కుటుంబం అంటూ సాగుతున్న రాజర్షి నమో సారథ్యంలో దూసుకెళ్తున్న భారత్‌.. మేము విశ్వగురు భారత్‌ సంతతి అని భావితరాలు సగర్వంగా చాటుకునే స్థాయిని ఆవిష్కరిస్తున్న ప్రయాణం..అది

యురేనియం ఐనా,త్రిపుల్‌ తలాక్‌ ఐనా, ఆర్టికల్‌ 370, జి ఎస్‌ టి,నోట్ల రద్దైనా, జమిలి ఎన్నికలయినా, మరో అంశమైనా దేశంకోసం,దేశప్రతిష్ఠ కోసం, భావి భారతీయుల ఉజ్వల భవిష్యత్తుకోసం,ప్రపంచపటంలో భారతావనిని అగ్రగామిగా నిలపడంకోసం చేసే ప్రయత్నాలే.చైనాలో దోమ కుడితే ఇక్కడ గోక్కునే కమ్మీలు.అణ్వస్త్ర విభాగంలో భారత్‌ ఎక్కడ తమను మించిపోతుందో అనే చైనా భయాందోళనల మధ్య పుట్టుకొచ్చిన కుట్రలో భాగమే ఈ యాంటి యూరేనియం స్లొగన్స్‌, మావోయిస్టుల గంజాయి సాగుకు ఆటంకం, వాళ్ళ ఆయుధసేకరణకు అవసరమయ్యే ఆదాయవనరులకు గండి పడతాయి.ఇలాంటి అనేక అంశాలు ఈ కమ్మీలను పట్టిపీడిస్తున్నాయి.ఈ కమ్మీల ట్రాప్లో పడకుండా ప్రజలు అప్రమత్తంగా వుండాలి.నాణానికి రెండువైపులా అధ్యయనం చేయాలి.పర్యావరణాన్ని కాపాడుకుంటూ,అవసరమైన యురేనియం సమృద్ధిని పెంచుకుంటూ చైనా, పాకిస్తాన్‌ వంటి శత్రుదేశాల ఆగడాలను తరిమికొట్టే అణ్వస్త్ర ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుని దేేశరక్షణ ప్రాముఖ్యతను గుర్తించి గౌరవించవలసిన బాధ్యత మనదే అనే ఆలోచన ప్రతి భారతీయ గుండెల్లో మారుమ్రోగాలి.జై భారత్‌. ”

ఇది కాషాయ తాలిబాన్ల వాదన తప్ప మరొకటి కాదు. మాకు సంబంధం లేదు అని వారు స్పష్టం చేస్తే అప్పుడు ఆలోచిద్దాం. అణు యుద్దం జరిగితే విజయం సంగతి తరువాత అసలు మానవాళిలో మిగిలేది ఎంత మంది, ఒకరూ అరా మిగిలినా వారు చేసేది ఏమిటి అన్నది సమస్య. అణుబాంబులు హిందువులను, ఆవులను వదలి, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర జంతుజాలాల మీదనే ప్రభావం చూపుతాయి అనుకుంటున్నట్లు కనిపిస్తోంది ! హిరోషిమా, నాగసాకి నగరాల్లో జరిగిన విధ్వంసాన్ని చూస్తే కాషాయ దళానికి తప్ప ప్రపంచానికి అంతటికీ వాటి ముప్పు ఏమిటో అర్ధం అయింది. అందుకే ఇప్పటికే ఒకసారి ప్రయోగించిన అమెరికా తప్ప తమంతట తాముగా ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమని మనతో సహా ప్రతి దేశం ప్రతిన పూనింది. ఈ విషయంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ప్రేరణ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ . అతగాడి ప్రేలాపనలను అవకాశంగా మార్చుకొని తమలోని యుద్దోన్మాదాన్ని బయట పెట్టుకొంటున్నారు. ముందుగా అణ్వాయుధాలను ప్రయోగించబోమనే దేశవైఖరిని తాము పునరాలోచించుకోవాల్సి వుంటుందని మన రక్షణ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ చెప్పటాన్ని ఏమనాలి? ఆయనకు ఇమ్రాన్‌ఖాన్‌కు తేడా ఏముంది?

అణువిద్యుత్‌ కేంద్రం కలిగిన ప్రతి దేశమూ అణ్వాయుధాలను తయారు చేసి పరిక్షించకపోయినా ఏ క్షణంలో అయినా వాటిని తయారు చేయగలిగిన పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్నాయనేది బహిరంగ రహస్యం. ఇక కాషాయ దళాల వున్మాదం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. మొదటి ప్రపంచ యుద్దం తరువాత జర్మనీకి ఏ కమ్యూనిస్టు లేదా పెట్టుబడిదారీ దేశం నుంచీ ముప్పు లేకపోయినా దేశాన్ని సమున్నతంగా నిలుపుతానంటూ జాతీయోన్మాదాన్ని, కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టిన హిట్లర్‌ గురించి అంతకంటే చెప్పాల్సిన పనిలేదు. వాడి వారసులే కాషాయ తాలిబాన్లు. ప్రతి దేశమూ తన రక్షణకు చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ తప్పు పట్టరు, అందుకు అవసరమైన ఆయుధాలను కలిగి వుండటమూ అభ్యంతరం కాదు. అయితే అణ్వాయుధాలు ఏ దేశాన్నీ రక్షించలేవు. అందుకోసం జనాన్ని, పర్యావరణాన్ని ఫణంగా పెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. విద్యుత్‌ కోసం అనే వాదనలో కూడా అర్ధం లేదు. అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. చెర్నోబిల్‌, పుకుషిమా ప్రమాదాలు జరిగిన తరువాత ఇంకా అణువిద్యుత్‌ గురించి మాట్లాడేవారిని ఏమనాలో అర్దం కాదు.

ఇక్కడ కాషాయ దళాలను జనం ఒక ప్రశ్న అడగాలి. మీరు చెబుతున్నట్లు కాసేపు యురేనియం తవ్వకాల వ్యతిరేక నినాదం చైనా కోసమే కమ్యూనిస్టులు చేస్తున్నారనే అనుకుందాం. మీరెందుకు విదేశాలను అనుకరించి యురేనియంతో ఆయుధాలు తయారు చేయాలని ఆరాటపడుతున్నారు. అసలు సిసలు అభినవ స్వదేశీ దేశభక్తులు కదా ! వేదాల్లోనే అన్నీ వున్నాయి, భారతీయ పురాతన విజ్ఞానం అంతా సంస్కృత గ్రంధాల్లో వుంది అని ప్రచారం చేస్తున్నది మీరు. ఈ గోబెల్స్‌ ప్రచారం ఎంతగా పెరిగిపోయిందంటే దీన్ని ప్రశ్నించేవారి పరిస్ధితి ఇప్పుడు నూరు కాకుల్లో ఒక్క కోకిల మాదిరి తయారైంది. అమెరికా,ఆస్ట్రేలియా, అనేక ఐరోపా దేశాలకు వెళ్లి వుద్యోగాలు, విదేశీ సంస్ధల్లో పరిశోధనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నవారు కూడా ఎవరేమనుకుంటే నాకేటి సిగ్గు అన్నట్లుగా వేదాల్లో అన్నీ వున్నాయష అనే అగ్రహారీకుల కబుర్ల్లే వల్లిస్తున్నారు.

విష్ణుమూర్తి సుదర్శన చక్రం అనే అస్త్రం నియంత్రిత క్షిపణి మాదిరి వ్యవహరించి లక్ష్యంగా చేసుకున్న శత్రువులను మాత్రమే హతమార్చి తిరిగి వస్తుందని కదా చెబుతారు. అంటే అది అణ్వాయుధాల కంటే అధునాతనం, సురక్షితమైనది. అమాయకుల జోలికిపోదు, సంస్కృత పండితులు, ఆర్‌ఎస్‌ఎస్‌ స్వదేశీ జాగరణ మంచ్‌ వారు, ఇతరులు కలసి మేకిన్‌ ఇండియా కింద స్వదేశీ సుదర్శన చక్రాలను తయారు చేయవచ్చు కదా ! విదేశీ అణ్వాయుధాలెందుకు, వాటికోసం యురేనియమో మరొకటో తవ్వినపుడు ప్రమాదకరమైన కిరణాలను విడుదల చేయటం ఎందుకు ? వాటితో క్యాన్సర్‌, ఇతర భయంకర జబ్బులు రావటం ఎందుకు? అన్నీ కాలుష్యం కావాల్సిన పనేముంది? సుదర్శన అస్త్రం, ఇతర మరికొన్ని పురాణ అస్త్రాలు హింసాత్మకమైనవి మనది శాంతిభూమి కదా ఎవరైనా అనవచ్చు. పురాణాలలో సమ్మోహనాస్త్రాలు కూడా వున్నాయి. వాటిని తయారు చేసి మనకు నిత్యం తలనొప్పిగా వున్న పాక్‌ పాలకుల మీద, వారు పంపే తీవ్రవాదుల మీద దేశంలో వున్న వుగ్రవాద మావోయిస్టులు, ఇతర తీవ్రవాదుల మీద ప్రయోగిస్తే మంచివారిగా మారిపోతారు కదా ! అప్పుడు వారికి డబ్బు అందకుండా చూసేందుకు మరోసారి నోట్ల రద్దు అనే పిచ్చిపని, సర్జికల్‌ స్ట్రైక్స్‌ అవసరం వుండదు, వాటితో శతృవులను హతమార్చామని చెప్పుకోపని లేదు, ప్రతిపక్షాలకు రుజువులు చూపమని అడిగే అవకాశం వుండదు. అన్నింటికీ మించి మన శాస్త్ర పరిశోధనా కేంద్రాలన్నింటినీ మూసివేసి లేదా వాటిలో పని చేస్తున్న శాస్త్రవేత్తలను కట్టగట్టి ఇంటికి పంపి వేదాలు, సంస్కృత పండితులు, బవిరి గడ్డాల యోగులు, యోగినులతో నింపి వేస్తే ఎంతో ఖర్చు కలసి వస్తుంది. కారుచౌకగా కావాల్సిన అస్త్రాలను తయారు చేయించవచ్చు. వందల కోట్లు పెట్టి కిరస్తానీ దేశాల నుంచి రాఫెల్‌ విమానాలు, ఇతర ఆయుధాలను కొనుగోలు చేయాల్సిన అవసరం వుండదు. అందుకు అవసరమైన విదేశీ డాలర్లతో అసలే పని వుండదు. ఇది కలి యుగం గనుక అస్త్రాల తయారీ కాస్త ఆలశ్యం అవుతుంది అనుకుంటే ప్రజ్ఞా సింగ్‌ వంటి సాధ్వులను రంగంలోకి దించి శత్రువుల మీద శాపాలు పెట్టించండి. వారి నోటి దూల తీరి శత్రువుల పీడ విరగడ అవుతుంది. వందల కోట్లు ఖర్చు చేసి ఇస్రో ప్రయోగాలు చేయటం ఎందుకు, వేదగణితంతో లెక్కలు, డిజైన్లు వేసి వుంటే ఈ పాటికి చంద్రుడి మీన వారు రియెలెస్టేట్‌ ప్రారంభించి ఎంతో లబ్ది చేకూర్చి పెట్టి వుండేవారు. చంద్రయాన్‌ రెండవ ప్రయోగం విఫలమైందని మన ప్రధాని శాస్త్రవేత్తల మీద విసుక్కున్నారని వార్తలు వచ్చి వుండేవి కాదు, దాన్ని దాచుకునేందుకు తరువాత వారిని అక్కున జేర్చుకొని ఓదార్పుల దృశ్యాలు చూసే ఖర్మ మనకు తప్పేది.

Image result for puranic weapons

కొన్ని పురాణ అస్త్రాలు రక్షణ, శత్రు సంహారానికి సంబంధించినవి. వాటిలో సమ్మోహనాస్త్రం అయితే బహుళ ప్రయోజనకారి. నరేంద్రమోడీ గత ఐదు సంవత్సరాలలో ఎన్ని విదేశాలు తిరిగినా, ఎంత మంది విదేశీ నేతలను కౌగిలించుకున్నా మన దేశానికి పెద్దగా పెట్టుబడులు వచ్చింది లేదు. పరిశ్రమలు, వాణిజ్యాలు పెరిగి వుంటే నిరుద్యోగం నాలుగున్నర దశాబ్దాల నాటి రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను స్దాపించేది కాదు. మన గడ్డమీద నుంచే సమ్మోహనాస్త్రాలను ప్రయోగించినా, విదేశాలకు వెళ్లినపుడు కొన్నింటిని వెంటబెట్టుకు వెళ్లి ప్రయోగించినా సినిమాల్లో మాదిరి గింగిరాలు తిరుక్కుంటూ అన్ని దేశాల వారూ ఈ పాటికి ఇక్కడ పడి వుండేవారు. ఇంకచాలు బాబోయ్‌ అనేవరకు మనకు కావాల్సినవన్నీ తెచ్చి పడవేశేవారు. అందువలన ఇప్పటికీ మించిపోయింది లేదు. పెద్ద నోట్లను, ఆర్టికల్‌ 370 రద్దు చేసినా వుగ్రవాద సమస్య పోలేదు, మొత్తం కాశ్మీర్‌లో ఆగస్టు ఐదు నుంచి విధించిన కర్ఫ్యూను ఇంతవరకు తొలగించలేదు. దేశం ఆర్దిక మాంద్యం నుంచి గట్టెక్కాలంటే నిర్మలమ్మ గారు ఎన్ని వుద్దీపన పధకాలు ప్రకటించినా ప్రయోజనం వుందనే ఆశ లేదు. కనుక రక్షణ కోసం, సుదర్శన చక్రాలు, పెట్టుబడులు, ఎగుమతుల కోసం సమ్మోహన అస్త్రాలు తయారు చేసేందుకు పూనుకొని కాషాయ దళాలు తమ దేశభక్తిని నిరూపించుకోవాలి. ప్రపంచానికి భారత సత్తా చాటాలి. కాకమ్మ కబుర్లు కాదు కార్యాచరణ ముఖ్యం !

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

తెలంగాణా రైతు బంధు లబ్దిదార్లపై 144 సెక్షన్‌ ఎందుకు ?

14 Thursday Feb 2019

Posted by raomk in BJP, Congress, Current Affairs, Economics, Farmers, History, INDIA, NATIONAL NEWS, Opinion, Others, Political Parties, Prices

≈ Leave a comment

Tags

farmers fate, Fertilizers subsidies, KCR, kisan samman, KTR, rythu bandhu beneficiaries, TRS government

Image result for why trs government imposed 144 section on rythu bandhu beneficiaries

ఎం కోటేశ్వరరావు

తెలంగాణా ‘రైతు బంధు ‘ సర్కార్‌ నిజామాబాద్‌ జిల్లాలో 13 మండలాల్లో రైతులు గుమి కూడకుండా 144వ సెక్షన్‌ విధించింది. పడిపోతున్న పసుపు, ఎర్రజొన్నల ధరలతో ఆందోళన చెందిన రైతన్నలు గత వారం రోజులుగా ఆందోళన హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఏడవతేదీ ఒక రోజు ఆందోళన చేసి 11వ తేదీలోగా పంటలకు గిట్టుబాటు ధరలకు చర్యలు తీసుకోకపోతే పన్నెండున ఆందోళన చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం కదిలింది, ఎలా? ధరలకు హామీ ఇచ్చికాదు, పోలీసు శాఖ ద్వారా 144వ సెక్షన్‌, ముఖ్యనాయకులు అనుకున్నవారిని అరెస్టులు చేయించింది. అయినా రైతులు పెద్ద సంఖ్యలో ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి చౌరాస్తాలో ధర్నా చేశారు. వారంతా రైతు బంధు పధకం కింద ఎకరానికి నాలుగు వేలు తీసుకున్నవారే, అందుకు కృతజ్ఞతగా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసిన వారే. ముఖ్య మంత్రి సచివాలయానికి రాకపోతే ఏమైతది అని కెసిఆర్‌ ప్రశ్నిస్తే అవును నిజమే ఏమైతది,ఏం కాలేదు రానవసరం లేదంటూ ఆయనకు మద్దతుగా గుండుగుత్తగా ఓట్లు వేసిన వారే. అసెంబ్లీ ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటింది, అయినా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయకపోతే ఏమైతది అని ఇంకా అదే కెసిఆర్‌ అనలేదు గానీ ఒక వేళ అన్నా నిజమే ఏమైతది అని మద్దతు ఇవ్వటానికి సిద్దంగా వున్నవారే వారంతా. నిజామాబాద్‌ ఎంపీ కవితక్క వారి దగ్గరకు రాలే, ప్రతి వారి దగ్గరకు వెళ్లి నే వున్నా, మీ వాడినే అని చెబుతున్న తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ ఆ వైపు చూడలే. ఎంఎల్‌ఏలంతా తమకు అత్యవసరమైన, దరొక్కపోతే ప్రాణాలు పోయే మంత్రిపదవులు ఇతర అవసరాల కోసం తిరగటానికే ఖాళీ లేకపోవటంతో రైతుల గురించి పట్టించుకోలా. అయితే ఎవరూ పట్టించుకోనపుడు మనం చూస్తూ వూరుకోకూడదు కదా అని పోలీసులు 144వ సెక్షన్‌ ప్రయోగించి, కొందరిని అదుపు లేదా అరెస్టు చేసి తమకు చేతనైన సాయం చేశారు. దిక్కులేక, దరితోచక రైతులు ఆంక్షలను ధిక్కరించి రోడ్డెక్కారు.పదహారవ తేదీలోగా ధరల సంగతి చూడకపోతే తిరిగి ఆందోళన చేస్తామని ప్రకటించారు. రైతు బంధువు ఎలా స్పందిస్తారో !

రైతు బంధుపేరుతో కెసిఆర్‌ ఎకరానికి నాలుగు లేక ఐదు వేలు ఇస్తేనో, కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఐదెకరాలలోపు రైతులకు నరేంద్రమోడీ ఆరువేలు ఇస్తేనో దేశంలో రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం పరిష్కారం కాదని నిజామాబాద్‌ రైతాంగ ఆందోళన వెల్లడిస్తోంది. ఇవాళ నిజామాబాద్‌ పసుపు రైతులైతే రేపు గుంటూరు జిల్లా దుగ్గిరాల, కడప పసుపు రైతులు కావచ్చు. రైతు బంధు లేదా కిసాన్‌ సమ్మాన్‌ పేరుతో ఇచ్చే సాయాన్ని తప్పు పట్టనవసరం లేదు. నిర్దాక్షిణ్యంగా బలి ఇవ్వబోయే ముందు పశువులకు పూజలు చేసి అలంకరణలు చేయటం తెలిసిందే. ఈ బంధులు, సమ్మాన్‌లు కూడా అలాంటివే అని నమ్మేవారి నమ్మకాన్ని, అనుభవాన్ని కూడా కొట్టిపారవేయలేము. మార్కెటింగ్‌తో సహా వ్యవసాయరంగాన్ని తమకు పూర్తిగా అప్పగించి, ప్రత్యక్ష సాయం పేరుతో నాలుగు రూకలు వెదజల్లి రంగం నుంచి ప్రభుత్వాలు తప్పుకోవాలని ప్రయివేటు వాణిజ్య బకాసురులు ఎప్పటి నుంచో మనదేశం మీద వత్తిడి తెస్తున్నారు. నయా వుదారవాద విధానాలు లేదా సంస్కరణలు, నూతన ఆర్ధిక విధానాల వంటి ముద్దు పేర్లతో పిలుస్తున్న విధానాల సారం ఏమంటే సరిహద్దులు, మిలిటరీ, కరెన్సీ, పోలీసు, న్యాయవ్యవస్ధ వంటివి మినహా మిగిలిన అన్ని అంశాలను మార్కెట్‌ శక్తులకు అంటే పెట్టుబడిదారులు, పెట్టుబడిదారీ పద్దతుల్లో వ్యవసాయం చేసే వారికి అప్పగిస్తే అభివృద్ధి ఫలాలు కిందికి వూటమాదిరి దిగుతాయి. అన్నింటినీ తెల్లవారేసరికి అమలు జరపటం సాధ్యం కాదు గనుక ముందు వున్న వ్యవస్ధల లోపాలను చూపి కించపరచటం, పనికిరానివిగా చిత్రించటం, తరువాత వాటిని క్రమంగా కూల్చివేయటం.

స్వయం సమృద్ధి అన్నది స్వాతంత్య్ర వుద్యమ లక్ష్యం. అందుకే తొలి రోజుల్లో జై జవాన్‌ జైకిసాన్‌ పేరుతో హరిత విప్లవానికి శ్రీ కారం చుట్టి ఒక మేరకు జయప్రదం అయ్యాం. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తరణ సేవలు, దిగుబడులను పెంచేందుకు సంకర విత్తనాలు, రసాయనికి ఎరువులు, పురుగుమందుల వినియోగం వంటిని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. రైతుల వద్ద తగిన పెట్టుబడులు లేని కారణంగా సబ్సిడీలను అందచేశారు. నయా వుదారవాద విధానాల బాట పట్టగానే సబ్సిడీలు ఇవ్వటం అంటే సోమరితనాన్ని ప్రోత్సహించటమే అని, లక్షిత ప్రయోజనాలకు బదులు ఇతర వాటికి వినియోగిస్తున్నారంటూ తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించి ఇప్పటికీ పెద్దఎత్తున కొనసాగిస్తున్నారు. దుర్వినియోగం, సద్వినియోగం అన్నది ఎప్పుడూ వుంటాయి. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తీసుకొనే చర్యలను ఎవరూ తప్పు పట్టటం లేదు. ఇంట్లో ఎలుకలున్నాయని ఎవరైనా ఇంటికే నిప్పుపెట్టుకుంటారా?

వ్యవసాయానికి ఇచ్చే సబ్సిడీలు రైతాంగ జేబులు నింపేవి మాత్రమే అని ఎవరైనా అనుకుంటే అది తెలియని తనమే. అవి మొత్తం సమాజానికి ఇచ్చే రాయితీలు. వుదాహరణకు కాలువల ద్వారా , విద్యుత్‌ మోటార్ల ద్వారా వరిసాగు ఖర్చును పోల్చుకుంటే రెండవది రైతులకు గిట్టుబాటు కాదు. తాము పెట్టిన ఖర్చుకు అనుగుణంగా ఎక్కువ ధరకు అమ్ముతామంటే కొనే వారు వుండరు. అందువలన ప్రభుత్వాలు విద్యుత్‌ రాయితీ ఇస్తున్నాయి. అది రైతులకు మాత్రమే ఇస్తున్నట్లా లేక ఆ పొలాల్లో పని చేసే కార్మికులకు, బియ్యాన్ని ఆహారంగా వాడే అందరికీ ఇస్తున్నట్లా ? మొత్తం నీటి వనరులను పూర్తిగా వినియోగంలోకి తెచ్చి జనాభా అవసరాలకు సరిపడా పంటలను పండించే విధానాలను అనుసరిస్తే విద్యుత్‌తో వరిసాగు చేసే అవసరం వుండదు, రాయితీలతో పని లేదు. నీరు లేని చోట మరొక పంటను ప్రోత్సహించి రైతులకు గిట్టుబాటు కలిగిస్తే వారిలో అసంతృప్తి వుండదు.

Image result for nizamabad farmers agitation

నయా విధానాలు రైతాంగానికి గిట్టుబాటుగా లేవు, అందుకే వారు పదే పదే రుణగ్రస్తులౌతున్నారు. ఒకవైపు వారికి రుణమాఫీలు చేస్తాం, సాగు చేసినా చేయకపోయినా భూయజమానులకు నేరుగా వ్యవసాయ ఖర్చుల సాయం పేరుతో నేరుగా నగదు అందిస్తాం అని పార్టీలు వాగ్దానాలు చేస్తున్నాయి, పరిమితంగా అయినా కొన్ని రాష్ట్రాలలో అమలు జరుపుతున్నాయి. సబ్సిడీలు దుర్వినియోగం అవుతున్నాయని ప్రచారం చేసే వారు వీటిని వ్యతిరేకించకపోగా మద్దతు ఇస్తున్నారు. ఇవి దుర్వినియోగం అయ్యే అవకాశం లేదా ? తెలంగాణాలో వాస్తవంగా సాగు చేస్తున్న కౌలుదార్లకు మొండిచేయి చూపి, వ్యవసాయం చేయని భూ యజమానులకు నగదు ఇవ్వటం ఏమిటన్న విమర్శలు వచ్చాయి కదా ! ఆ లోపాన్ని సవరించాలి తప్ప ఆ పేరుతో సాయాన్ని వ్యతిరేకించనవసరం లేదు. రాబోయే రోజుల్లో ఈసాయాన్ని సాకుగా చూపి పంటలకు గిట్టుబాటు ధరల ప్రకటన, మార్కెట్‌ మాయాజాలం నుంచి రక్షణ చర్యలకు ప్రభుత్వాలు మంగళం పలుకుతాయని కొందరు చెబుతున్నదానిని కొట్టి పారవేయగలమా, నిప్పులేనిదే పొగ వస్తుందా ?

Image result for nizamabad farmers agitation

రైతాంగానికి వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావటం లేదు అంటే సాగు పెట్టుబడులు పెరగటం, తగిన ఆదాయం లేకపోవటం తప్ప మరొకటి కాదు. ఒకవైపు అమెరికా వంటి ధనిక దేశాలు ప్రపంచ వాణిజ్య నిబంధనల పరిమితులకు మించి మన రైతాంగానికి సబ్సిడీలు ఇస్తున్నారంటూ దాడి చేస్తున్నాయి. మరోవైపు మన దేశంలోనే కొంత మంది పెద్దలు ఇప్పటికే మనం ఆహార ధాన్యాలు, పత్తి వంటి పంటల విషయంలో మిగులు సాధించి ఎగుమతులు చేసే దశకు చేరుకున్నాం గనుక వ్యవసాయ సబ్సిడీలు ఇవ్వనవసరం లేదు, ఎఫ్‌సిఐ, సిసిఐ, మార్క్‌ఫెడ్‌ వంటి ప్రభుత్వ సంస్ధల అవసరం ఇంకేమాత్రం లేదని చెబుతున్నారు. అమెరికా వంటిదేశాలు తమ కార్పొరేట్‌ బకాసురుల కోసం మన వ్యవసాయ మార్కెట్‌ను చేజిక్కించుకొనేందుకు వత్తిడి తెస్తుంటే, మన మేథావులు కొందరు వారి ఏజంట్లుగా రంగంలోకి దిగితే మరికొందరిలో సమగ్రదృష్టి లోపించి వారికి తెలియకుండానే అవే వాదనలను బుర్రలకు ఎక్కించుకుంటున్నారు. మన దేశంలో ఆహార ధాన్యాల వుత్పత్తి గణనీయంగా పెరిగిన మాట నిజం, అయితే అది దేశ అవసరాలకు అనుగుణంగా పెరిగిందా అంటే లేదు. ఒక వైపు మన దేశం 2018 ఆకలి సూచికలో 119 దేశాల జాబితాలో 103వ స్ధానంలో, ఆక్స్‌ఫామ్‌ ఆహార లభ్యత 125 దేశాల సూచికలో 97వ స్ధానంలో వున్నాం అని చెబుతుండగా మనం ఆహారాన్ని ఎగుమతి చేస్తున్నామంటే మన దగ్గర కొనుగోలు చేయలేక కడుపు మాడ్చుకుంటున్నవారు గణనీయంగా వున్నారన్నది చేదు నిజం. అందుకే పోషకాహార లేమి, రక్తహీనతతో బాధపడుతున్నవారు, వాటితో వచ్చే జబ్బులతో జేబు గుల్ల చేసుకుంటున్నవారు గణనీయంగా వుంటున్నారు. భరించలేని వైద్య ఖర్చు కూడా రైతాంగాన్ని రుణవూబిలోకి దించే అంశాలలో ఒకటిగా వుందని తెలిసిందే.

మన సినిమా హీరోలు కంటి చూపుతో కాల్చి చంపుతుంటే, నరేంద్రమోడీ సర్కార్‌ అంకెలతో జనాన్ని పిచ్చివాళ్లను చేస్తోంది. దేన్ని గురించి ప్రశ్నించినా మన దగ్గర అంకెలు సరైనవి కాదు అంటోంది. దాన్ని పక్కన పెడదాం వున్న అంకెల సమాచారం ప్రకారం 1903-08 సంవత్సరాల మధ్య బ్రిటీష్‌వారి పాలనలో మన తలసరి ఆహార ధాన్యాల లభ్యత 177.3కిలోలు. నూతన అర్దిక విధానాలు లేదా సంస్కరణలు ప్రారంభమైన 1991లో 186.2కిలోలు వుండగా పాతిక సంవత్సరాల తరువాత 2016లో 177.7కిలోలుగా వుంది. మనది ప్రజాస్వామ్యం కనుక కమ్యూనిస్టు చైనాతో పోల్చవద్దని కొందరు చెబుతుంటారు. అక్కడ 2015లో తలసరి లభ్యత 450, మన కంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో 200, అమెరికాలో 1,100కిలోలు వుంది. ప్రజాస్వామ్యం అంటే జనాన్ని కడుపు మాడ్చటమా ? ఈ పరిస్దితుల్లో మన వుత్పత్తిని ఇంకా పెంచాలంటే ప్రభుత్వ ప్రోత్సహకాలు లేకుండా సాధ్యమా ?

మన ఆహార వుత్పత్తి పెరగటానికి దోహదం చేసిన వాటిలో రసాయన ఎరువుల వినియోగం ఒక ముఖ్యపాత్రపోషించింది. రైతులకు తగినంత ఆదాయం లేదు కనుక ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చాయి. సంస్కరణల పేరుతో అమలు జరుపుతున్న నయా వుదారవాద విధానాలు వాటికి మంగళం పాడమని వత్తిడి చేసి విజయం సాధించాయి. పోషకాల ప్రాతిపదికన(ఎన్‌బిఎస్‌) సబ్సిడీ విధానం మరొక పేరు ఏదైనా పెట్టనివ్వండి, ఒక్క యూరియా మినహా మిగిలిన అన్ని మిశ్రమ, ఇతర రకాల ఎరువుల ధరలపై నియంత్రణ ఎత్తివేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సమాచారం ప్రకారం 2017 నవంబరు నుంచి 2018నవంబరు మధ్యకాలంలో మనం దిగుమతి చేసుకొనే యూరియా, డిఏపి, ఎంఓపి, ఫాస్పారిక్‌ యాసిడ్‌, రాక్‌ ఫాస్ఫేట్‌, అమోనియా, సల్పర్‌లలో మొదటి ఐదు రకాల ధరలు సగటున 21.47శాతం పెరిగాయి. చివరి రెండింటి ధర 8.51శాతం తగ్గింది. అంటే ఒక కిలో ధర వంద రూపాయలు అనుకుంటే ఏడు కిలోల ఎరువులు కొంటే ఏడాది కాలంలో ఐదింటికి అదనంగా చెల్లించింది రు.107 .35, రెండింటికి తగ్గిన ధర రు 17.02 నికరంగా రైతుమీద పడిన భారం 90రూపాయలకు పైమాటే. 2010-11లో డిఏపి క్వింటాలు ధర రు.1075, ఎంఓపి రు.505రులు వుండగా, మరుసటి ఏడాదికి అవి రు.1775, రు.1036కు పెరిగాయి.2018 నవంబరులో గరిష్ట ధరలు రు.2,862, రు.1799గా వున్నాయి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే 2011-12 నుంచి 2016-17 మధ్యకాలంలో ఎరువుల సబ్సిడీ రు.74570 కోట్లనుంచి 70100 కోట్లకు తగ్గాయి. ఆరు సంవత్సరాల సగటు రు.73,024 కోట్లు అంటే ధరల పెరుగుదలతో నిమిత్తం లేకుండా సబ్సిడీ మొత్తం స్ధిరంగా వుందంటే పెరుగుతున్న ధరల భారాన్ని రైతాంగమే మోస్తోంది. ఈ కాలంలో రూపాయి విలువ పతనమై అదనపు భారాన్ని మోపింది. ఇది యుపిఏ మన్మోహన్‌ సింగ్‌-బిజెపి మోడీ పాలనా కాలం.పాలకులు మారినా సబ్సిడీ మొత్తం మారలేదు.

2002ా03 నుంచి 2008ా09 నాటికి ఎరువుల మీద ఇచ్చిన సబ్సిడీల మొత్తం జిడిపిలో 0.48 నుంచి 1.51శాతానికి పెరిగాయి. అప్పటి నుంచి క్రమంగా తగ్గుతూ 2018ా19నాటికి 0.43శాతానికి తగ్గింది. రైతులకు ఎంతో మేలు చేస్తానని చెప్పిన నరేంద్రమోడీ హయాంలో 2014ా15లో 0.62శాతం వుండగా అది 0.43శాతానికి పడిపోయింది.నరేంద్రమోడీ సర్కార్‌ ఐదేండ్ల లోపు రైతాంగానికి ఏడాదికి ఆరువేల రూపాయలు, చంద్రబాబు నాయుడు దానికి మరో నాలుగువేలు కలిపి పదివేలు చెల్లించేందుకు నిర్ణయించటం తాజా వార్త. ఈ విధంగా సబ్సిడీలను తగ్గిస్తూ రైతుల మీద భారాలు మోపుతుంటే సాగు సాగేదెట్లా ? గత్యంతరం లేని రైతాంగం రోడ్డెక్కకుండా ఎలా వుంటుంది?

Share this:

  • Tweet
  • More

Like this:

Like Loading...

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Social

  • View mannem.koteswararao’s profile on Facebook
  • View mannemkoteswara’s profile on Twitter

Recent Posts

  • బికినీతో చేతులు కాల్చుకున్న కాషాయ దళం : రు.600 కోట్ల క్లబ్బులో బ్లాక్‌బస్టర్‌ ” పఠాన్‌ ” సినిమా, కంగన , అసోం సిఎం పైసా ఖర్చులేని ప్రచారం !
  • దేశమంతటా మోడీ డాక్యుమెంటరీ ప్రదర్శనలకు పిలుపు, ఏక్షణమైనా నిషేధం విధించే అవకాశం ?
  • జిన్‌, జియాన్‌, ఆజాదీ – నాడు షా, నేడు అలీ ఖమేనీ పట్ల వ్యతిరేకత, ఇరాన్‌లో చరిత్ర పునరావృతం కానుందా !
  • చివరకు మిగిలేది ఆయాసమే : నిషేధంతో మరింత కిక్కిస్తున్న బిబిసి డాక్యుమెంటరీ, రంగంలో మోడీ సేన !
  • సంచలనాత్మక బిబిసి డాక్యుమెంటరీ – బ్రిటన్ను ఖండించలేని నిస్సహాయ స్థితిలో నరేంద్రమోడీ !

Recent Comments

raghuveer on తైవాన్‌కు మరిన్ని అమెరికా అస్త…
Raghuveer on గుజరాత్‌ ఘనత మోడీదైతే హిమచల్‌…
Raghuveer on అమెరికా సబ్సిడీలు – ఐరోప…
Raghuveer on అదానీ కోసం కేరళలో బిజెపితో సిప…
Hanumantha Reddy San… on ప్రపంచాధిపత్యం కోసం అమెరికా త‌…

Archives

  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • January 2022
  • December 2021
  • November 2021
  • October 2021
  • September 2021
  • August 2021
  • July 2021
  • June 2021
  • May 2021
  • April 2021
  • March 2021
  • February 2021
  • January 2021
  • December 2020
  • November 2020
  • October 2020
  • September 2020
  • August 2020
  • July 2020
  • June 2020
  • May 2020
  • April 2020
  • March 2020
  • February 2020
  • January 2020
  • December 2019
  • November 2019
  • October 2019
  • September 2019
  • August 2019
  • July 2019
  • June 2019
  • May 2019
  • April 2019
  • March 2019
  • February 2019
  • January 2019
  • December 2018
  • November 2018
  • October 2018
  • September 2018
  • August 2018
  • July 2018
  • June 2018
  • May 2018
  • April 2018
  • March 2018
  • February 2018
  • January 2018
  • December 2017
  • November 2017
  • October 2017
  • September 2017
  • August 2017
  • July 2017
  • June 2017
  • May 2017
  • April 2017
  • March 2017
  • February 2017
  • January 2017
  • December 2016
  • November 2016
  • October 2016
  • September 2016
  • August 2016
  • July 2016
  • June 2016
  • May 2016
  • April 2016
  • March 2016
  • February 2016
  • January 2016
  • December 2015
  • November 2015
  • October 2015

Categories

  • AP
  • AP NEWS
  • BJP
  • CHINA
  • Communalism
  • Congress
  • COUNTRIES
  • CPI(M)
  • Current Affairs
  • Economics
  • Education
  • employees
  • Environment
  • Farmers
  • Filims
  • Greek
  • Gujarat
  • Health
  • History
  • imperialism
  • INDIA
  • International
  • INTERNATIONAL NEWS
  • Japan
  • Latin America
  • Left politics
  • Literature.
  • Loksabha Elections
  • NATIONAL NEWS
  • Opinion
  • Others
  • Pensioners
  • Political Parties
  • Politics
  • Prices
  • Readers News Service
  • RELIGION
  • Religious Intolarence
  • RUSSIA
  • Science
  • Social Inclusion
  • Sports
  • STATES NEWS
  • Telangana
  • Telugu
  • UK
  • Uncategorized
  • USA
  • WAR
  • Women
  • Women

Meta

  • Register
  • Log in
  • Entries feed
  • Comments feed
  • WordPress.com

Blog at WordPress.com.

Privacy & Cookies: This site uses cookies. By continuing to use this website, you agree to their use.
To find out more, including how to control cookies, see here: Cookie Policy
  • Follow Following
    • vedika
    • Join 234 other followers
    • Already have a WordPress.com account? Log in now.
    • vedika
    • Customize
    • Follow Following
    • Sign up
    • Log in
    • Report this content
    • View site in Reader
    • Manage subscriptions
    • Collapse this bar
%d bloggers like this: