ఎం కోటేశ్వరరావు
ఇనకులమున జనియించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిలిచి విడ్డూరమును చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ, విధి విధానమును తప్పించుటకు ఎవరు సాహసించెదరూ.. అంటూ కొసరాజు రాసిన పాటకు స్వరాలు సమకూర్చి స్వయంగా గానం చేసిన ఘంటసాల గీతాన్ని లవకుశ సినిమాలో చూసి కన్నీళ్లు కార్చేవారు ఇప్పటికీ వున్నారంటే అతిశయోక్తి కాదు. అది ఇతిహాస గాధ. ప్రపంచవ్యాపితంగా ఎందరినో కష్టాల పాలు చేసే, తప్పించటానికి అవకాశం వున్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పలు దేశాల మీద ప్రారంభించిన వాణిజ్య లేదా ఆర్ధిక యుద్దమనే దారుణాన్ని సహించాలా, ఎలా అడ్డుకోవాలన్నది ఇప్పుడు ప్రపంచం ముందున్న వాస్తవం. అమెరికాను మనకు మంచి స్నేహదేశంగా చిత్రించేందుకు నిక్కర్ల నుంచి పాంట్స్‌కు మారిన వారు నానా తంటాలు పడుతున్నారు. అలాంటి మిత్రదేశం దెబ్బకు తొలిసారిగా మన రూపాయి గురువారం వారం నాడు ఒక దశలో ఒక డాలరుకు మారకం విలువ 70.32కి పడిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క మన దేశమే కాదు ప్రపంచాన్నంతటినీ ట్రంప్ ప్రమాదపు అంచుల వరకు తీసుకుపోతున్నాడు. మరి ఈ దారుణాన్ని ఎవరు అడ్డుకోవాలి? జనం శ్రేణులుగా నిలిచి విడ్డూరంగా చూడాలా ?
తమ ఎగుమతులపై పన్ను విధించి కరెన్సీ లీరాను దెబ్బతీసిన అమెరికాపై ప్రతీకారంగా అమెరికా కార్లపై 120శాతం, మద్యంపై 160, పొగాకు వుత్పత్తులపై 60శాతానికి దిగుమతి పన్నును టర్కీ పెంచింది. మరోవైపు 15బిలియన్ డాలర్ల మేరకు టర్కీలో పెట్టుబడులు పెడతామని కతార్ ప్రకటించటంతో లీరా కొద్దిగా కోలుకుంది.ఏడాది క్రితం సౌదీ అరేబియా నాయకత్వంలో నాలుగు అరబ్ దేశాలు కతార్‌పై వాణిజ్య, దౌత్యపరమైన ఆంక్షలను విధించాన్ని టర్కీ వ్యతిరేకించింది. ఇపుడు కతార్ ఈ విధంగా బదులు తీర్చుకుంది. టర్కీ అవసరాలలో 15బిలియన్ డాలర్లు చిన్న మొత్తమే అయినప్పటికీ అమెరికాకు వ్యతిరేకంగా సాధించిన నైతిక విజయమిది.
దశాబ్దాల తరబడి ఆంక్షలతో క్యూబాను అతలాకుతలం చేసిన అమెరికా తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. గత కొద్ది సంవత్సరాలుగా వామపక్ష పాలనలో వున్న వెనెజులా, నయా పెట్టుబడిదారీ ఏలుబడిలో వున్న రష్యా, మతశక్తుల ఏలుబడిలో వున్న ఇరాన్, పొరుగునే వున్న మిత్రదేశాలు మెక్సికో, కెనడా, సోషలిస్టు దేశమైన చైనాపై ఆర్ధిక, వాణిజ్య దాడులను జరుపుతున్నది. ఐరోపా యూనియన్‌తో తాత్కాలిక రాజీకుదుర్చుకుంది. పాతికేండ్ల క్రితం సోవియట్ యూనియన్, ఇతర తూర్పు ఐరోపా దేశాలలోని సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత తమకిక ఎదురులేదని ప్రకటించుకున్న అమెరికా ఇప్పుడు బస్తీమే సవాల్ అంటూ తన, పరబేధం లేకుండా ఎందుకు కత్తులు దూస్తున్నది? పర్యవసానాలేమిటి? తాజాగా మన రూపాయి రికార్డు పతనానికి కారణం నాటో కూటమిలో కీలక సభ్యదేశమైన టర్కీపై అమెరికా ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఆదేశాన్ని ఏ క్షణంలో అయినా పతనంలోకి నెట్టే అవకాశం వుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా ఆర్ధిక, రాజకీయ, మిలిటరీ ఎత్తుగడులలో ఎంతో కీలకమైనది ఐరోపా కేంద్రంగా వున్న నాటో కూటమి.దానిని మరింతగా విస్తరించేందుకు ఒకవైపు పూనుకున్న అమెరికా మరోవైపు కీలకమైన భాగస్వామి టర్కీతో సంబంధాలను దెబ్బతీసేందుకు పూనుకుంది. తమను వెన్నుపోటు పొడిచేందుకు అమెరికా చూస్తున్నదని టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయిప్ ఎర్డోగన్ తాజా పరిణామాలపై వ్యాఖ్యానించాడు.ఆర్ధిక యుద్ధాల తూటాలు, ఫిరంగి గుండ్లు, క్షిపణులను ప్రయోగించినప్పటికీ తాము వెనక్కు తగ్గేది లేదని హెచ్చరించాడు. టర్కీ కరెన్సీ లీరా పతనమైన కారణంగానే తాము పన్నులను పెంచినట్లు ట్రంప్ తన చర్యను సమర్ధించుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు లీరా 41శాతం పతనమైంది. దీంతో టర్కీలో విదేశీ వస్తువుల ధరలు పెరిగిపోయి డిమాండ్ తగ్గిపోయింది. వీటిని సాకుగా చూపి గతవారంలో టర్కీ నుంచి దిగుమతి అయ్యే వుక్కుపై 50, అల్యూమినియంపై 20శాతం చొప్పున సుంకాన్ని విధించటంతో టర్కీ కరెన్సీ లీరా, స్టాక్ మార్కెట్ మరింతగా పతనమయ్యాయి, ద్రవ్యోల్బణం 15శాతానికి పెరిగింది. ఇవన్నీ ఆర్ధిక సంక్షోభానికి దారితీయవచ్చని భావిస్తున్నారు.దీనికి మతాధికారి ఆండ్రూ బ్రూసన్‌ను వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌ను కూడా ట్రంప్ సర్కార్ జోడించింది. టర్కీ యూరేసియా దేశం.ఐరోపాలో ఎక్కువ భాగం వుండటంతో అక్కడి ఏకైక ముస్లిం దేశంగా పరిగణిస్తారు. ఐరోపాలోని గ్రీస్, బల్గేరియా, యూరేసియాలోని జార్జియా, ఆర్మీనియా, అజర్బైజాన్, ఆసియాలోని ఇరాన్, ఇరాక్, సిరియాలు సరిహద్దుగా వుంది. ఈ ప్రాంతంలో అమెరికా తన ప్రయోజనాలకు పెద్ద పీట వేయటంతో విధిలేక కొన్ని సార్లు అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించుతున్నది, తాజా వివాదానికి నేపధ్యమిదే. నిజానికి అమెరికా చేసుకొనే దిగుమతుల్లో టర్కీ నుంచి వుక్కు 4.2, అల్యూమినియం ఒకశాతం లోపే వున్నది. అందువలన వీటి కంటే రాజకీయకారణాలే ప్రస్తుతం వుభయ దేశాల మధ్య విబేధాల పెరుగులకు కారణాలుగా చెప్పవచ్చు.
2003లో జార్జి డబ్ల్యు బుష్ నాయకత్వంలో ఇరాక్‌పై అమెరికా దాడి చేసింది. అది మొదలు ఆ ప్రాంతంలో అమెరికా ప్రమేయంతో జరుగుతున్న పరిణామాలలో టర్కీకి సమస్యలు తలెత్తుతూనే వున్నాయి. టర్కీ, ఇరాన్, సిరియా సరిహద్దు ప్రాంతంలో కుర్దులు పెద్ద సంఖ్యలో వున్నారు. ఇజ్రాయెల్ మాదిరి తమకు ప్రత్యేకంగా కుర్దిస్దాన్ ఏర్పాటు చేయాలన్నది ఎప్పటి నుంచో వారి డిమాండ్లలో ఒకటి. అది జరిగితే ఆ ప్రాంత దేశాల స్వరూపమే మారిపోతుంది కనుక ఎవరూ అంగీకరించటం లేదు. పశ్చిమాసియా వివాదాలలో అమెరికన్లు కుర్దులకు మద్దతు తెలిపి వారిని పావులుగా వాడుకుంటున్నారు. సిరియాలో అసాద్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఐఎస్ తిరుగుబాటుదార్లను ఎదుర్కోవటంలో కుర్దులది ప్రధాన పాత్ర. వారికి అమెరికా మద్దతు ఇస్తున్నది. ఇరాక్, టర్కీలలోని కుర్దులు తమకు ప్రత్యేకం దేశం కావాలంటూ చేస్తున్న సాయుధ చర్యలను అక్కడి ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి.
రెండు సంవత్సరాల క్రితం టర్కీలో ఒక విఫల తిరుగుబాటు జరిగింది. దానికి కుర్దిస్ధాన్ వర్కర్స్ పార్టీ, దానితో సంబంధాలున్న అమెరికా మతాధికారి ఆండ్రూ బ్రున్సన్ సంధానకర్తగా వున్నాడని భావించిన టర్కీ ప్రభుత్వం అతగాడిని అరెస్టు చేసి విడుదలకు తిరస్కరించింది. ప్రస్తుతం అధికారంలో వున్న ఎకెపి పార్టీ సహకారంతో రెండు దశాబ్దాల క్రితం టర్కీలో గులెన్ పేరుతో ఒక ఇస్లామిక్ సంస్ధ వునికిలోకి వచ్చింది. ప్రభుత్వ అండదండలతో దానితో సంబంధం వున్న అనేక మంది ప్రభుత్వ యంత్రాంగంలోకి చొరబడ్డారు. అది ఎంతవరకు వచ్చిందంటే పోలీసు, న్యాయవ్యవస్ధలోని గులెన్ సభ్యులు, ఆ సంస్ధను పెంచి పోషించిన ఎకెపి పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు తలెత్తింది. చివరకు అధ్యక్షుడు ఎర్డోగన్‌పై తిరుగుబాటుకు ఆ సంస్ధ పురికొల్పింది. అయితే దానిని కఠినంగా అణచివేశారు. దానికి సహకరించాడంటూ అమెరికా మతాధికారిని అరెస్టు చేసి గులెన్ ఒక వుగ్రవాద సంస్ధ అని ప్రకటించింది.తిరుగుబాటును ప్రోత్సహించిన ఫతుల్లా గులెన్ అమెరికాలోని పెన్సిల్వేనియాలో వుంటున్నాడు. అతడిని తమకు అప్పగించాలన్న టర్కీ డిమాండ్‌ను అమెరికా తిరస్కరించింది. వుగ్రవాదం పట్ల అమెరికా మెతకగా వుందంటూ టర్కీ విమర్శించింది. అప్పటి నుంచి వుభయ దేశాల మధ్య సంబంధాలు సజావుగా లేవు. ఒక దేశాన్ని లొంగదీసుకోవాలంటే దాని ఆర్ధిక మూలాలను దెబ్బతీయటం అమెరికా ఆయుధాల్లో ఒకటి. టర్కీ విషయంలో అదే జరుగుతోందా ? ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని పరిణామాలు అమెరికాకు మింగుడు పడటం లేదు.
అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వుపసంహరించుకున్న అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలను తాము ఖాతరు చేసేది లేదని టర్కీ ప్రకటించింది. ఇటీవలి కాలంలో అమెరికా ప్రత్యర్ధి అయిన రష్యాతో టర్కీ సంబంధాలు పెరుగుతున్నాయి. క్షిపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. అది అమెరికన్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తున్నది. సిరియాలో రష్యా మద్దతు వున్న ప్రభుత్వానిది పైచేయిగా వుంది. రష్యా, ఇరాన్, టర్కీలే సిరియా పరిణామాలను నిర్దేశించేవని ఇప్పటికే తేలిపోయింది. అమెరికన్లకు అది పరాభవమే. చైనా చొరవతో ప్రారంభమైన సిల్క్ రోడ్‌తో పాటు చైనా, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం, తదితర చర్యలు సిరియా పునర్నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఇరాన్ స్ధిరపడటానికి దోహదం చేసేవిగా వున్నాయి. ఇది అమెరికన్లకు ఏమాత్రమూ అంగీకారం కాదు. సిరియా తదితర పరిణామాలలో అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ నిలబడుతోంది. ఇరాన్‌తో వాణిజ్యాన్ని వదులుకొనేది లేదని చైనా స్పష్టం చేసింది. అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా తన వెసులుబాటు కోసం ఇరాన్ వంటి దేశాలతో సంబంధాల మెరుగుదలకు చమురురంగంలో పెట్టుబడుల వంటివాటితో పూనుకుంది.
ఒక మతాధికారిని అడ్డం పెట్టుకొని టర్కీని తమ కాళ్లముందు పడేసుకోవాలని చూస్తోందని ఎర్డోగన్ మండిపడ్డారు. అమెరికా గనుక తన పద్దతులను మార్చుకోనట్లయితే తాము కొత్త స్నేహితులు, కలసి వచ్చే వారికోసం చూడాల్సి వస్తుందని న్యూయార్క్‌టైమ్స్ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. గత ఆరుదశాబ్దాల కాలంలో అమెరికాతో కలసి తాము ఎలాపని చేసిందీ ఏకరువు పెట్టి అవన్నీ మరచిపోయి తమతో వ్యవహరిస్తున్నారని, తమ పౌరుల ఆందోళనను అర్ధం చేసుకోవటం లేదని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన తిరుగుబాటు మీద సంతృప్తికరంగా అమెరికా స్పందించలేదని, తిరుగుబాటకు కారకుడైన వ్యక్తిని తమకు అప్పగించలేదని పేర్కొన్నాడు. ఒక మతాధికారి కోసం మీరు నాటోలోని మీ వ్యూహాత్మక భాగస్వామిని మార్చేందుకు చూస్తున్నారు, బెదిరింపులతో మా దేశాన్ని మీదారికి తెచ్చుకోలేరు, మీకు డాలర్లు వుంటే మాకు అల్లా వున్నాడు, మేము స్వాతంత్య్రంతో పోరాడతాము అని హెచ్చరించాడు.అమెరికా స్వయంగా వుగ్రవాద గ్రూపుగా ప్రకటించిన సిరియా మద్దతు వున్న పికెకె సంస్ధకు అమెరికా ఐదువేల ట్రక్కులు, రెండువేల విమానాల ద్వారా ఆయుధాలను అందచేసిందని, ఆ సంస్ధ చేతిలో 1984 నుంచీ వేలాది మంది తమ పౌరులు మరణించారని పేర్కొన్నాడు. అమెరికా వాణిజ్య యుద్దం ప్రారంభించిన నేపధ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఎర్డోగన్ ఫోన్లో సంభాషించాడు.
టర్కీ పాలకుల విషయానికి వస్తే అమెరికా అనుచిత కార్యకలాపాలన్నింటిలో భాగస్వాములయ్యారు.దేశంలో భిన్నాభిప్రాయాన్ని అణచివేయటంలో పేరు మోశారు. వ్యూహాత్మక స్ధానంలో వున్న కారణంగా అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా ధనిక దేశాల మాదిరి ప్రాంతీయ పరిణామాలలో పాత్రవహించాలని సహజంగానే కోరుకుంటారు. అమెరికా బలంగా వున్నపుడు ఎర్డోగన్ వంటి వారు ఎలా తలొగ్గుతారో బలహీనపడినపుడు దాని నుంచి లబ్ది పొందేందుకు కూడా అదే మాదిరి తలెత్తుతారు. టర్కీ తీరుతెన్నులు ఇప్పుడు అలాగే వున్నాయి. ఇప్పుడున్న స్ధితిలో మరో అధికార కేంద్రం పెరగటాన్ని అమెరికా అంగీకరించదు. టర్కీ నాటో సభ్యురాలు, రష్యా ఆ కూటమికి ప్రధమ శత్రువు, తోటి సభ్యురాలిపై అమెరికా కత్తి గట్టింది. సిరియాకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నది. సిరియాపై గతంలో ఐఎస్ తీవ్రవాదులు దాడి చేసేందుకు టర్కీ ప్రాంతాన్ని అమెరికా వుపయోగించుకుంది. ఇప్పుడు మారిన పరిస్ధితులలో ఐఎస్ తీవ్రవాదులను ఎదుర్కొనేందుకు టర్కీలోని వైమానిక స్ధావరాన్ని నాటో వినియోగిస్తున్నది. అమెరికా తమపై కత్తి కట్టింది కనుక దాన్ని మూసివేయాలని కొందరు వత్తిడి తెస్తున్నారు. టర్కీ దిగుమతి చేసుకొనే చమురులో సగం ఇరాన్ నుంచే వస్తోంది. అమెరికా ఆంక్షలను టర్కీ తిరస్కరించింది. నాటో సభ్యురాలైనప్పటికీ రష్యా నుంచి టర్కీ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది. ఇవన్నీ ఒక సంక్లిష్ట పరిస్ధితికి నిదర్శనం.ఐరోపా యూనియన్ తక్షణమే అమెరికాతో ఘర్షణకు దిగటానికి సిద్ధం కాదు కనుకనే పన్నుల విషయంలో తాత్కాలిక రాజీకి వచ్చింది. అమెరికాకు అనేక షరతులు విధించింది. ఐరోపా కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బతగలనంత వరకే ఈ రాజీ. అమెరికా వత్తిడికి తలొగ్గిన టర్కీ సర్కార్ మతాధికారి బ్రున్స్‌న్‌ను జైలు నుంచి గృహనిర్భంధానికి మార్చింది. తాజా వివాదంలో బ్రున్సన్ ఒక తురుపు ముక్క మాత్రమే. నల్ల సముద్రం, మధ్యప్రాచ్చం, పసిఫిక్ సముద్రాల మధ్య వున్న టర్కీ ప్రాధాన్యత గురించి అమెరికన్లకు తెలియదనుకోవటం పొరపాటు. అందువలన తెగేదాక లాగకపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ రాజకీయాల పరిణామాలు మరో మలుపు తిరుగుతాయి.