Tags
Big Pharma Vaccine Profits, BJP Propaganda, China's vaccine diplomacy, Narendra Modi Failures, vaccination Policy, Vaccine Nationalism, WHO
ఎం కోటేశ్వరరావు
మన దేశంలో ఆక్సిజన్, ఇతర ఔషధాల ధరలు ముఖ్యంగా కరోనా చికిత్సలో వినియోగించే వాటి ధరలు ఎలా పెరుగుతున్నాయో, బ్లాక్ మార్కెట్ ఎలా ఉందో పదే పదే చెప్పనవసరం లేదు.బాధితులు, వారి బాధలు పంచుకున్నవారందరికీ అనుభవమే. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్దితిని విధించి ముఖ్యమైన ఔషధాలు,వాక్సిన్లకు కంపల్సరీ లైసెన్సింగ్ విధానం కింద అనుమతులు ఇచ్చి అవసరాల మేరకు ఉత్పత్తిని పెంచేందుకు, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవు. ఇదేం పనయ్యా బాబూ అని ఎవరైనా ప్రశ్నిస్తే బిజెపి ప్రతినిధులు ఆరోగ్యం రాష్ట్రాలకు సంబంధించింది అని ఎదురుదాడులకు దిగుతున్నారు. మరోవైపున తొలి దశలో కరోనాను జయించింది తమ ప్రధాని మోడీ అని ఆయన లేకపోతే అదుపుఅయ్యేది కాదని, జనం ప్రాణాలు నిలిచేవి కాదంటూ పాడిన భజన గీతాల సంగతేమిటి, ఇప్పుడు ఇలా తాళం మార్చారేమిటి అని అడిగితే కష్ట కాలంలో సహకరించాల్సింది పోయి దెప్పి పొడుపులు, విమర్శలా అంటూ విరుచుకు పడుతున్నారు. ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు అంటూ సుమతీ శతకకారుడు బహుశా ఇలాంటి వారి గురించే చెప్పి ఉంటాడు.
మన దేశంలో కరోనా వాక్సిన్ ధరల మీద కేంద్ర ప్రభుత్వం నియంత్రణ విధించలేదు. కేంద్రానికి ఇచ్చే వాక్సిన్లకు ఒక రేటు, రాష్ట్రాలకు ఇచ్చేదానికి ఒక రేటు, ప్రయివేటు ఆసుపత్రులకు అమ్మేది ఒక రేటు. ఒక వైపు సామాజిక మాధ్యమాలు, సాంప్రదాయ మాధ్యమాల్లో బిజెపి ప్రతినిధులు ఇప్పటికీ చైనా వైరస్ అంటూ దాడులు చేస్తూనే ఉన్నారు. ఇక్కడ జనానికి తెలియాల్సిందేమంటే చైనా వస్తువులను బహిష్కరిస్తాం, చైనాకు బుద్ది చెబుతాం, కాళ్ల దగ్గరకు రప్పిస్తాం అని ఏడాది నుంచి ప్రగల్భాలు పలుకుతున్న వారు తేలు కుట్టిన దొంగల మాదిరి అదే చైనా నుంచి చేసుకుంటున్న దిగుమతుల గురించి మాత్రం మాట్లాడటం లేదు. గుండెలు తీసిన బంట్ల సంగతేమోగానీ అలాంటి వారిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. కొద్ది రోజుల క్రితం రవాణా విమానాలు ఆపేసి మనలను దెబ్బతీసిందంటూ చైనాను నిందించారు. ఆ సమస్య పరిష్కారం అయిన విషయం మాత్రం జనానికి చెప్పకుండా ఇంకా అదే అభిప్రాయంతో ఉండాలని కోరుకొనే వారు మాత్రమే దాన్ని మూసిపెడతారు.
తాజా విషయానికి వస్తే భారత్ దిగుమతి చేసుకొనే వైద్యపరమైన వస్తువుల సరఫరా ఆగకుండా, ధరలు పెరగకుండా చూడండి సారో అని మన దేశం చైనా నాయకత్వాన్ని అభ్యర్ధిస్తున్నది. ఈ సమాచారం కొందరికి మింగుడు పడకపోవచ్చు. నరేంద్రమోడీ విఫల ప్రధాని అంటే మింగుడు పడుతోందా ! ఇదీ అంతే !! నిజం త్వరగా ఎక్కదు. చైనా ప్రత్యేక ప్రాంతంగా ఉన్న హాంకాంగ్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రియాంక చౌహాన్ అక్కడి నుంచి వెలువడే సౌత్ చైనా మోర్నింగ్ పోస్టు పత్రిక విలేకరితో మాట్లాడారు.” చైనా సరఫరా వ్యవస్ద తెరిచే ఉండాలని, ఉత్పత్తుల ధరలు స్ధిరంగా ఉండాలన్నది ఈ దశలో మా ఆకాంక్ష. సరఫరా గిరాకి వత్తిడి కొంత పెరిగినప్పటికీ ఉత్పత్తుల ధరలు స్ధిరంగా, అంచనాకు అందేట్లు ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వ స్ధాయిలో కూడా మద్దతు, ప్రయత్నాలు అవసరం. అయితే ఈ విషయంలో చైనా ప్రభుత్వ పలుకుబడి ఎంత ఉంటుందో, ఏమి చేయగలదో నాకు సమాచారం లేదు, అయితే వారు చేయగలరు, అలా చేస్తే మేము స్వాగతిస్తాం ” అని ప్రియాంక చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొన్నది. సూటిగా మన రాజకీయ నాయకత్వం అడిగేందుకు ముఖం చెల్లక తడిక రాయబారం చేశారన్నది స్పష్టం.
మనకు అవసరమైన ముఖ తొడుగులు, పిపిఇ కిట్లు అన్నీ మనమే తయారు చేసుకోగలుగుతున్నట్లు కాషాయ దళాలు ప్రచారం చేస్తున్నాయి. మంచిదే, ఇంతకంటే కావాల్సింది ఏముంది ? మేకిన్ ఇండియా కింద గత ఏడు సంవత్సరాలుగా ఇబ్బడి ముబ్బడిగా ప్రపంచానికే వస్తువులను ఎగుమతి చేస్తున్నాము కదా అని పగటి కలలు కంటున్న వారున్నారు. మే 14వ తేదీ హిందూ పత్రిక వార్త వారి కళ్లు తెరిపిస్తుందా ? దాని ప్రకారం మన దేశం చైనా కంపెనీలకు ఏప్రిల్ నుంచి 40వేల ఆక్సిజన్ కాన్‌సెంట్రేటర్లకు ఆర్డరు పెడితే 21వేలు మనకు వచ్చాయి. వీటితో పాటు ఐదువేల వెంటిలేటర్లు, రెండు కోట్ల పది లక్షల ముఖతొడుగులు( మాస్కులు), 3,800 టన్నుల ఔషధాలు భారత్‌కు ఎగుమతి చేసినట్లు చైనా కస్టమ్స్‌శాఖలో నమోదైనట్లు దానిలో పేర్కొన్నారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అని కొట్టి పారవేస్తే చేసేదేమీ లేదు. ప్రచారానికి – వాస్తవానికి ఉన్న తేడాను జనానికి చెప్పేందుకే ఈ విషయాలు తప్ప నరేంద్రమోడీని దెప్పాలని కాదు. ఇప్పటి వరకు విదేశీ పత్రికలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాయి. ప్రభుత్వమే కనపడటం లేదని మన దేశానికి చెందిన అవుట్‌లుక్ పత్రిక తాజా ముఖచిత్రంగా ప్రచురించినందున మోడీని వెతికి తెచ్చి ఎక్కడికి పోయారని ప్రశ్నించాలి తప్ప దెప్పి ప్రయోజనం ఏముంది ? ఒక వేళ ప్రశ్నించినా నోరు విప్పుతారా ?
కరోనా మహమ్మారి నుంచి రక్షణకు వినియోగించే వాక్సిన్లకు కొంత కాలం పాటు పేటెంట్ హక్కుల అమలు నిలిపివేయాలని ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటివో)లో దక్షిణాఫ్రికా, మన దేశం కూడా ప్రతిపాదించాయని, నరేంద్రమోడీ చొరవ ఎలాంటిదో చూడండి, చివరికి అగ్రరాజ్యం అమెరికా కూడా అంగీకరించింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.(మనకు అవసరమైన వాక్సిన్ ముడిపదార్దాలనే ఇచ్చేందుకు అంగీకరించని వారు పేటెంట్ల రద్దుకు అంగీకరిస్తారా ? ) దీనితో పాటు కంపల్సరీ లైసెన్సు విధానం కింద గతంలో నాట్కో కంపెనీకి కాన్సర్ ఔషధ తయారికి అనుమతి ఇచ్చినట్లుగా వాక్సిన్లకు సైతం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రజారోగ్య నిపుణులు, ఆ రంగంలో పని చేస్తున్నవారు ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందువలన మన ప్రభుత్వం ప్రపంచ సంస్ధలో అలాంటి ప్రతిపాదన చేయటం మంచిదే, ఎవరు చేసినా అభినందించాల్సిందే. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. రెండో వైపు ఏం జరుగుతోంది. ఇదే నరేంద్రమోడీ సర్కార్ మే తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో దానికి విరుద్దమైన వాదన చేసింది. సుప్రీం కోర్టు సూచించిన విధంగా కంపల్సరీ లైసెన్సు నిబంధనను ఈ దశలో ఉపయోగిస్తే, మేథోసంపత్తి హక్కుల ఒప్పందానికి విరుద్దంగా చర్యలు తీసుకుంటే ప్రతికూల ఫలితాలు వస్తాయని వాదించింది. ప్రచారం కోసం, జనాన్ని మభ్యపెట్టేందుకు ప్రపంచ వాణిజ్య సంస్దలో ఒక వైఖరి, తన అధికారాన్ని వినియోగించాల్సి వచ్చే సరికి కార్పొరేట్ కంపెనీల అనుకూల వాదనలు. ఎంత దగా ! పోనీ ఇప్పటి వరకు సానుకూలంగా వ్యవహరించి నరేంద్రమోడీ సర్కార్ సాధించింది ఏమిటి ? కోవిషీల్డ్ తయారీకి అవసరమైన ముడి పదార్ధాలు, పరికరాల ఎగుమతులపై అమెరికా ప్రభుత్వం నిషేధం విధించినపుడు దానికి రాని ప్రతికూల ఫలితాలు ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పూనుకుంటే మనకు వస్తాయా ? ఒక వేళ వస్తే ఏమిటి ? మిన్ను విరిగి మీద పడుతుందా ? చైనాకు వ్యతిరేకంగా మనం చతుష్టయం పేరుతో అమెరికాతో జతకట్టి బస్తీమే సవాల్ అన్నప్పటికీ వాటిని పక్కన పెట్టి వారు మనకు అవసరమైన వాటిని అందచేస్తున్నారా లేదా ? అమెరికా ఒక వైపు తమ జనం కోసం యుద్దసమయాల్లో వినియోగించే చట్టాలకు దుమ్ముదులిపి అమలు జరుపుతుంటే దాని భాగస్వామి అని చెప్పుకొనే మనం మన సార్వభౌమ అధికారాన్ని వినియోగించలేనంత దుర్బలంగా ఉన్నామా ? అసలు నరేంద్రమోడీ గారి సమస్య ఏమిటి ? ఇంత విపత్తు వస్తే కనీసం ప్రతిపక్షాలతో అఖిలపక్ష సమావేశం వేసి పరిస్ధితిని వివరించి సలహాలను కోరేందుకు తీరికలేనంతగా ఏం చేస్తున్నట్లు ? కేంద్రం చెబుతున్నట్లు ఆరోగ్య సమస్య రాష్ట్రాలదే అయినపుడు కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులకు గోళ్లు గిల్లు కుంటూ కూర్చోవటం తప్ప ఇప్పుడు మరొక పనేముంటుంది. తీవ్రత తక్కువ మొదటి దశలో మోడీ చేయించిన పళ్లాలు, గ్లాసుల మోత, దీపాలు వెలిగించటం వంటి చర్యలన్నింటినీ జనం పాటించారుగా, ఇప్పుడు ఆ చొరవ ఏమైనట్లు ? పిచ్చిదో ఎచ్చిదో ఏదో ఒకటి ఎందుకు చేయించటం లేదు ? ఏమీ లేదు, ఎంత హడావుడి చేస్తే అంతగా జనం కేంద్రం వైపు చూస్తారు. ఉచిత వాక్సిన్ సరఫరాకే చేతులెత్తేసి అధిక భారాన్ని రాష్ట్రాల మీద నెట్టింది. గతేడాది మాదిరి 27లక్షల కోట్ల ఆత్మనిర్భర వంటి బూటకపు ప్రకటనలు చేస్తే నమ్మే జనం లేరు. అందుకే ప్రజాస్వామ్యబద్దంగా రాష్ట్రాల నిర్ణయానికే వదిలేస్తున్నానంటూ బాధ్యత నుంచి తప్పుకుంటున్నారు.
కోవిషీల్డు లేదా కోవాగ్జిన్‌కు గానీ ప్రయోగాలు పూర్తిగాక ముందే అత్యవసర వినియోగం పేరుతో ముందుగానే అనుమతి ఇచ్చారు. దాదాపు అన్ని దేశాలూ అదే చేశాయి. కోవిషీల్డు మన స్వంత తయారీ కాదు. దాని మాదిరే రష్యా స్పుత్నిక్ వాక్సిన్ ఉత్పత్తికి రెడ్డీలాబ్స్ ఒప్పందం చేసుకుంది. ఈ రెండింటితో పాటు దానికి, ఇతర వాక్సిన్లకు అనుమతి ఇచ్చి ఉంటే ఇప్పుడు తలెత్తిన వాక్సిన్ గిరాకీని సులభంగా అధిగమించి ఉండేవారం కదా ? రెండు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనం కాపాడేందుకు చూపిన శ్రద్ద వేగంగా వాక్సిన్ తయారీ మీద ఎందుకు లేకపోయింది. మొదటి డోసు తీసుకున్న తరువాత నెల రోజుల్లోగా రెండవ డోసు తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వమూ, నిపుణులే. ఇప్పుడున్న నెలన్నర – రెండు నెలల వ్యవధిని పొడిగించి మూడు నుంచి నాలుగు నెలల్లోపు కోవిషీల్డు తీసుకోవచ్చు అంటున్నారు. జనం దేన్ని నమ్మాలి ?
ప్రపంచంలో 184 వాక్సిన్లను జంతువుల మీద ప్రయోగించి పరిశీలిస్తున్నారు. ఆరోగ్యవంతులైన యువతీయువకుల మీద 32 వాక్సిన్లు మొదటి దశ ప్రయోగంలోనూ, 35 వాక్సిన్లు వివిధ తరగతుల మీద రెండవ దశ, 25వాక్సిన్ల ప్రభావం గురించి మూడవ దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. పద్నాలుగు వాక్సిన్లను వినియోగిస్తున్నారు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి పొందినవే. ఎవరు ముందుకు వస్తే వాటి తయారీకి మన దేశం ఆహ్వానించి ఉంటే వెంటనే అన్ని వయస్సుల వారికి వాక్సిన్ పూర్తయ్యేది, రోజుకు నాలుగువేల మరణాలు తప్పి ఉండేవి కదా ? ఎందుకు ఇవ్వలేదు ?
ఔషధాల తయారీలో మన దేశం పురోగమించిన మాట వాస్తవం. అది చైనా కంటే ఎక్కువ అని కొందరు అనుకుంటారు, అనుకోనివ్వండి మనకు ఇబ్బంది లేదు. మన ఔషధ పరిశ్రమలకు అవసరమైన ముడి సరకు పూర్తిగా లేదా పాక్షికంగా తయారైన వాటిని మన ఫార్మారంగం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్న పచ్చినిజం తెలిసిందే. ఇప్పుడు చైనా నుంచి మన దేశం అత్యవసర ఔషధాలను తెచ్చుకుంటున్నది దానికి లేని అభ్యంతరం తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్ద ఆమోదించిన చైనా వాక్సిన్ తెచ్చుకొనేందుకు, జనం ప్రాణాలను కాపాడేందుకు ఇబ్బంది ఏమిటి ? చైనా వాక్సిన్లు అంతగా పని చేయవని ఆ దేశ నిపుణులే చెప్పారని కట్టుకధలు ప్రచారం చేశారు. చైనాలో ఏటా ఐదు వందల కోట్ల డోసులను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం ఉంది. మన దేశంలో ఐసిఎంఆర్‌తో కలసి భారత బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ పూర్తిగా వినియోగ అనుమతి మన దేశంలోనే ఉంది. మరో 14 దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతించారు. ఇదే సమయంలో చైనాలో తయారైన నాలుగు వాక్సిన్లలో ఒకటైన సినో ఫార్మ నాలుగు దేశాల్లో పూర్తి వినియోగం 50 దేశాల్లో అత్యవసర అనుమతి పొందింది. మరొకటి కరోనా వాక్సిన్ పూర్తి వినియోగం చైనాలో, మరో 35దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందింది. మరో రెండు పరిమితంగా అనుమతి పొందాయి. అందువలన మన దేశం వాక్సిన్ల రంగంలో ముందుంది అని చెప్పుకోవటం అతిశయోక్తి తప్ప మరొకటి కాదు.
నరేంద్రమోడీ ప్రపంచ ఫార్మా కంపెనీలను దెబ్బతీసినందున అవన్నీ కక్ష కట్టాయంటూ ఆయన భక్తులు మహిమలను అంటగట్టి ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో తయారయ్యే వాక్సిన్లు మన అవసరాలకే సరిపోని స్ధితి కళ్ల ముందు కనిపిస్తుంటే ఇలాంటి అతిశయోక్తులను చూసి నవ్వాలో ఏడవాలో అర్ధం కాదు. ఆపని చేసింది చైనా అన్నది పచ్చి నిజం. వాక్సిన్ మానవ హక్కు. ఎవరు జాతీయ వాదంతో సంకుచితంగా వ్యవహరిస్తున్నారు, ఎవరు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారో ప్రపంచం చూస్తూనే ఉంది. ఏప్రిల్ 25 నాటికి చైనా 41.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేసి 20 కోట్ల డోసులను ఎగుమతి చేసి మిగిలిన దాన్ని తన దగ్గర ఉంచుకుంది. అమెరికా 26.8 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం అంతర్గత వినియోగానికి ఉంచుకుంది. బ్రిటన్ కూడా అదే మాదిరి 2.3 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి మొత్తం ఉంచుకుంది. ఐరోపా యూనియన్ 22 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి తొమ్మిది కోట్ల డోసులు ఎగుమతి చేసి మిగిలింది తన సభ్య దేశాలకు వినియోగించింది. మన దేశం 19.6 కోట్ల డోసులు ఉత్పత్తి చేసి పన్నెండున్నర కోట్ల డోసులు మన దేశంలో వినియోగించి మిగతాది ఎగుమతి చేసింది. ఇప్పటి వరకు ఎవరు ప్రపంచ ఫార్మాను దెబ్బతీసినట్లు ? ఎవరు ప్రపంచాన్ని ఆదుకొనేందుకు ముందుకు వచ్చినట్లు ? నేడు ఆంగ్లో-శాక్జన్ (అమెరికా-బ్రిటన్) దేశాలు వాక్సిన్ల తయారీకి అవసరమైన ముడిపదార్దాలను దాచివేస్తున్నాయని కడుపు మండిన ఫ్రెంచి అధ్యక్షుడు మక్రాన్ వ్యాఖ్యానించాడు. మన ప్రధాని నరేంద్రమోడికి నోరు పెగల్లేదు.
చైనా వాక్సిన్ సినోఫార్మకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ అనుమతి ఇవ్వటంతో ఇప్పుడు పెద్ద ఎత్తున వాక్సిన్ పేద దేశాలకు అందేందుకు వీలు కలిగింది. త్వరలో చైనా మరో వాక్సిన్ సిన్‌వాక్ కూడా అనుమతి రాబోతున్నదని వార్తలు. మన కోవాగ్జిన్‌కు ఇంకా రాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్ధలోని సభ్య దేశాలలో 192 కోవాక్స్ పేరుతో వాక్సిన్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రాంతాలకు 2021 చివరి నాటికి 200 కోట్ల డోసుల వాక్సిన్ అందించాలన్నది లక్ష్యం. ఇప్పటి వరకు కోవాక్స్ పధకంలో భాగంగా 5.4 కోట్ల డోసులను 121 దేశాలకు అందించింది. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో వాక్సిన్ల ద్వారా ఫైజర్ కంపెనీ 350 కోట్ల డాలర్లు సంపాదించింది. మోడెర్నా కంపెనీ ఏడాదిలో 1900 కోట్ల డాలర్లను సంపాదించనుందని అంచనా. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం మహమ్మారిని దీర్ఘకాలం పొడిగిస్తున్నారా ? అంటూ ప్రపంచబ్యాంకు మాజీ అధిపతి, ఆర్ధికవేత్త జోసెఫ్ స్టిగ్లిజ్ మరొకరితో కలసి రాసిన వ్యాసంలో ప్రశ్నించారు. ఫైజర్, మోడెర్నా కంపెనీలు ఎంఆర్‌ఎన్‌ఏ వాక్సిన్ల తయారీలో గుత్తాధిపత్యం వహిస్తున్నాయి. వాటి తయారీకి ఇతరులను అనుమతించటం లేదు. ఎంతకాలం వీలైతే అంతకాలం మహమ్మారిని పొడిగించి సొమ్ము చేసుకోవాలన్నది వాటి ఎత్తుగడ. వైరస్ కొత్త రూపం సంతరించుకుంటున్న కారణంగా వాటికి అవసరమైన వాక్సిన్ల కోసం తమ వనరులను పదిలపరచుకోవాలని పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నాయన్నది స్పష్టం. కోవాక్స్ పధకానికి కోటి డోసులు ఉచితంగా సమకూర్చుతామని చైనా ఇప్పటికే వాగ్దానం చేసింది. వాక్సిన్‌తో పని లేకుండానే వైరస్‌ను అదుపు చేసిన చైనా పెద్ద ఎత్తునవాక్సిన్ తయారు చేస్తూ అత్యవసరమైన ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నది. మరోవైపు తన జనానికి తాపీగా వాక్సిన్ వేస్తున్నది. మరోవైపు దాని ఉత్పత్తిలో సగం కంటే తక్కువ ఉన్న మనం దేశం చైనా కంటే వేగంగా వాక్సిన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది.
మన దేశంలో ఆగస్టు -డిసెంబరు నాటికి మొత్తం 216 కోట్ల డోసుల వాక్సిన్ అందుబాటులోకి రానున్నదని నీతి ఆయోగ్ సభ్యుడు వికె పాల్ చెప్పారు. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు కూడ అత్యవసర వినియోగం కింద తయారీకి దరఖాస్తు చేసుకోవాలని కోరినట్లు పాల్ తెలిపారు. ఆయన చెప్పినట్లు, అనుకున్నట్లు సవ్యంగా జరిగితే డిసెంబరు నాటికి గాని మన జనాభాకు వాక్సిన్ వేసే అవకాశం లేదు. కొందరు చెబుతున్నట్లు ప్రతివారికీ బూస్టర్ మూడో డోసు వేయాల్సి వస్తే , మూడో తరంగంలో వస్తుందని చెబుతున్న కొత్త వైరస్‌కు పాత వాక్సిన్లు పనికి రాకపోతే పరిస్ధితి ఏమిటి ? చైనా వాక్సిన్ సిన్‌ఫార్మకు అనుమతి ఇస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్ధ చేసిన ప్రకటనలో చైనా మరో 15వాక్సిన్ల తయారీ పురోగమనంలో ఉన్నట్లు తెలిపింది. వాక్సిన్ల తయారీలో చైనా – రష్యా సహకరించుకోనున్నాయి. మరి మనం ఎక్కడ ? అది ఉత్పత్తి కావచ్చు, వాక్సిన్ దౌత్యం కావచ్చు ?