Tags
Bhumata Brigade, HAJ Restrictions, manuvadis, Shani Shingnapur, temples, Trupti Desai, Women decisive victory, women power
సత్య
శని శింగనాపూర్ శని ఆలయ ప్రవేశంపై మహిళల విజయంతో మహారాష్ట్రలోని పలు ఆలయాలలో మహిళల ప్రవేశంపై వున్న ఆంక్షలను స్వయంగా పాలక మండళ్లే స్వయంగా తొలగిస్తున్నాయి. శని శింగనాపూర్ ఆలయంపై బొంబే హైకోర్టు తీర్పుతో భీష్మించుకు కూర్చున్న ఛాందసవాదులు దిగిరాక తప్పటం లేదు. ఈ పరిణామాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో నిషేధం కొనసాగించాల్సిందేనంటూ హిందూ జన జాగృతి వంటి కొన్ని మితవాద సంస్ధలు ముంబైలో సోమవారం నాడు ఆందోళన ప్రారంభించాయి. కొల్లాపూర్‌లోని మరో పురాతన మహలక్ష్మి దేవాలయంలోకి సోమవారం నాడు ఎనిమిది మంది మహిళలు ప్రవేశించారు. పోలీసులు, ఆలయ యాజమాన్యం మధ్య జరిగిన చర్చల తరువాత ఈ పరిణామం చోటు చేసుకుంది. అంతకు వారం రోజుల ముందు ఈ దేవాలయంలో ప్రవేశించేందుకు ‘అవని’ అనే సంస్ధ నాయకత్వాన మహిళలు ఆలయ ప్రవేశం చేయబోగా దేవాలయ యాజమాన్యం కొందరు మహిళలను సమీకరించి వారిచేత అడ్డగింప చేసింది. హైకోర్టు తీర్పు వచ్చినప్పటికీ సాంప్రదాయాన్ని వుల్లంఘించటానికి వీలులేదని వారు వాదించారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. వున్నతాధికారుల నుంచి వుత్తరువులు లేవని చెప్పారు. తరువాత కొద్ది సేపటికి శాంతి భద్రతలను కాపాడే పేరుతో ఆలయ ప్రవేశానికి వచ్చిన మహిళలను అక్కడి నుంచి పంపివేశారు.ఆ తరువాత జరిగిన పరిణామాలలో కోర్టు తీర్పును వుల్లంఘిస్తే ముఖ్యమంత్రిపైనో కోర్టు ధిక్కరణ ఫిర్యాదు చేస్తామని భూమాత బ్రిగేడ్ నేత తృప్తి దేశాయ్ హెచ్చరించటం, శుక్రవారం నాడు శని శింగనాపూర్ ఆలయంలోకి అనుమతించిన అంశం తెలిసిందే. ఈ సందర్భంగానే ఈనెల 13న కొల్లాపూర్ మహలక్ష్మి ఆలయప్రవేశం చేస్తామని కూడా తృప్తి దేశాయ్ ప్రకటించారు. అయితే రెండు రోజులు ముందుగానే మహిళలు ప్రవేశించి పూజలు జరిపారు.
పూనాలోని పార్వతి హిల్‌పై వున్న కార్తికేయ దేవాలయం పాలకమండలి మహిళలు ఇష్టమైతే ప్రవేశించవచ్చు లేకుంటే వారిష్టమని పేర్కొన్నది. మహిళలకు ప్రవేశం లేదు అనే బోర్డును కూడా తొలగించారు. పురందర్‌లోని వీర్ గ్రామంలో వున్న మహాస్‌కోబా ఆలయ ప్రవేశంపై గ్రామసభ నిర్ణయం తీసుకుంది.తాము మహిళల ప్రవేశంపై నిషేధం విధించలేదని, అయితే కొన్ని సందర్భాలలో మాత్రమే ప్రవేశం కల్పించామని ఇపుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా వారు కోరుకున్న విధంగా ప్రవేశం కల్పిస్తామని దేవాలయ ట్రస్టు అధ్యక్షుడు బాలాసాహెబ్ ధుమాల్ ప్రకటించారు. సతారా జిల్లాలోని సోలాషి శనీశ్వర దేవాలయ నిర్వాహకులు కూడా ఇదే దారి పట్టారు.ఈ మేరకు ఏకంగా ఒక పత్రికా ప్రకటనే జారీ చేశారు. గతేడాది డిసెంబరులో 12 మంది ఈ ఆలయంలో ప్రవేశించటంతో అపవిత్రమైందంటూ వెంటనే పురోహితులు గోమూత్రంతో శుద్ధి చేశారు. నాటి ప్రవేశానికి నాయకత్వం వహించిన అడ్వొకేట్ వర్షా దేశపాండే తాజా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇది సానుకూల ప్రారంభమని వ్యాఖ్యానించారు. దేశం మొత్తంలో ట్రస్టులు ఇదే పని చేయాలని కోరారు. అఖిలభారతీయ జనవాది మహిళా సంఘటన నాయకురాలు కిరణ్ మోఘే మాట్లాడుతూ ఇది రాజ్యాంగ విజయమని, రాజ్యాంగం మహిళలకు హక్కులు ఇచ్చిందన్నారు.
మతోన్మాదుల చేతిలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దబోల్కర్ కుమార్తె ముక్తా మాట్లాడుతూ తన తండ్రి 1998 ప్రారంభించిన పోరాటం విజయం సాధించిందని, సమయం తీసుకున్నప్పటికీ సంస్కరణలను జనం ఆమోదిస్తారని అన్నారు. మార్పు కోసం ఎవరో ఒకరు ముందడుగు వేయాలని శని శింగనాపూర్ పరిణామాలు స్పష్టం చేశాయని, తొలుత ప్రతిఘటన వున్నప్పటికీ పోరాటాన్ని కొనసాగించాలని, చివరకు విజయం సాధిస్తామని ‘ ముక్త పేర్కొన్నారు.
హాజ్ కమిటీ ఆంక్షలపై ఆగ్రహం
గర్భవతులుగా వున్న మహిళలు హాజ్ యాత్ర చేయకూడదంటూ ఆంక్షలు ప్రకటించటంపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముస్లిం చట్ట ప్రకారం గర్భవతులపై ఆంక్షలు లేవని మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహల్ ప్రకటించారు. కమిటీ వున్నది యాత్రకు వెళ్లేవారికి సాయపడేందుకు తప్ప కూర్చుని ఆంక్షలు విధించటానికి కాదన్నారు. గర్భవతులకు అవసరమైన వైద్య సలహాలు ఇవ్వాలి తప్ప ఆంక్షలు జారీ చేయటం ఏకపక్షమని పేర్కొన్నారు. అనేక మహిళా బృందాలు కూడా ఈ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేశాయి. హాజ్ కమిటి చివరకు వైద్య విషయాలను కూడా చర్చిస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి ఆంక్షలకు ఏ విధమైన విలువ లేదని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్ధ ప్రతినిధి జకియా సోమన్ పేర్కొన్నారు. దరఖాస్తు సమయంలో గర్భవతులుగా వున్నవారు సెప్టెంబరులో వెళ్లు సమయానికి నాలుగు నెలలు నిండితే వారిని అనుమతించరని హాజ్ కమిటీ పేర్కొన్నది.
ముంబైలోని హాజ్ అలీ దర్గాలోకి మహిళలను అనుమతించే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ బొంబే హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. పదిహేనవ శతాబ్దికి చెందిన సూఫీ ఫకీరు హాజీ అలీ సమాధి దగ్గరకు మహిళలను అనుమతించరు. పురుష ఫకీరు సమాధి వద్దకు మహిళలను అనుమతించటం ఇస్లాం ప్రకారం పెద్ద పాపమని దర్గా ట్రస్టు వాదిస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ఒక ట్రస్టు తన కార్యకలాపాలను నిర్వహించుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నదని, మూడవ పక్షం దానిలో జోక్యం చేసుకోరాదని పేర్కొన్నది. అయితే దర్గాలో గతంలో అందరికీ ప్రవేశం వుందని 2012 నుంచి సమాధి వద్దకు వెళ్లటంపై ఆంక్షలు విధించారని ఫిర్యాదీలు పేర్కొన్నారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ దర్గాలో సమాధి వున్న ప్రాంత తలుపు వద్దకు తప్ప లోపలికి అనుమతించటం లేదు.