Tags

, ,

ఐరోపాలోని పోర్చుగీసులో సోషలిస్టు, కమ్యూనిస్టు, వామపక్ష కూటమితో కూడిన త్రిపక్ష సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ మేరకు ఆ పార్టీల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీంతో పదకొండు రోజుల క్రితం ఏర్పడిన మితవాద మైనారిటీ సర్కార్‌ను కూలద్రోసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వామపక్ష కూటమికి పార్లమెంట్‌లో మెజారిటీ సీట్లు వున్నాయి.అక్టోబరు మొదటి వారంలో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ప్రభత్వ ఏర్పాటు, అనుసరించాల్సిన విధానాల గురించి తలెత్తిన వివాదాల కారణంగా సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో మితవాద శక్తులు మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే పొదుపు చర్యలకు వ్యతిరేకంగా వున్న శక్తులందరూ ఏకంకావాలని దేశంలోని వివిధ తరగతుల నుంచి వచ్చిన వత్తిడి కారణంగా తాజాగా సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. పార్లమెంట్‌లోని 230 స్థానాలకు గాను మితవాదులకు 99 మాత్రమే వున్నాయి. కమ్యూనిస్టుపార్టీకి 18, వామపక్ష కూటమికి 19, సోషలిస్టుపార్టీకి 85 స్థానాలతో కలిసి 122 వుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. మంగళవారం నాడు పార్లమెంట్‌ విశ్వాస పరీక్షలో మితవాద ప్రభుత్వాన్ని ఓడించి వామపక్ష పార్టీలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది. స్పీకర్‌ ఎన్నికలో వామపక్ష కూటమి అభ్యర్ది ఇప్పటికే ఎన్నికయ్యారు.

పొదుపు చర్యల పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న తరుణంలో ఐరోపాలో మితవాద శక్తులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటిని వ్యతిరేకించే శక్తులవైపు జనం చూస్తున్నారు. ఈ పూర్వరంగంలో పోర్చుగల్‌ పరిణామాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో అప్పులు ఇచ్చిన వారి షరతులకు కట్టుబడి వుంటామని సోషలిస్టు పార్టీ ప్రకటించింది. అయితే కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పూర్వరంగంలో వాటి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రభుత్వ విధానాల ఖరారుకు ఆదివారం నాడు ఈ కూటమి నేతలు సమావేశం కానున్నారు. ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించని పక్షంలో గ్రీస్‌లో మాదిరి మరోసారి ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదు.