పేరు మార్చం, ఎర్రజెండాను వదలం అన్నఆస్ట్రియా కమ్యూనిస్టులు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సోవియట్‌ యూనియన్‌ పతనం కాగానే అనేక దేశాల్లో కమ్యూనిస్టులు కొందరు ఎర్ర జెండాలను పక్కన పడేశారు, మరికొన్ని చోట్ల పేర్లు మార్చుకున్నారు.కమ్యూనిస్టు గతానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అదే పేరును కొనసాగించిన వాటిలో మధ్య ఐరోపాలోని ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ ఒకటి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి వస్తున్న ఆదరణను చూసి పేరు మార్చుకుంటే ఇంకా ఎక్కువ మద్దతు పెరుగుతుందేమో అన్న ఆశతో కొందరు మరోసారి ఆ ప్రస్తావనను చేసిన పూర్వరంగంలో అలాంటి మార్పు అవసరం లేదని పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించాడు. ఆటుపోట్లను ఎదుర్కొన్న వాటిలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ (కెపిఓ) ఒకటి.ఐరోపాలో మరోమారు కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొడుతున్న నేపధ్యంలో ఎన్నికలలో ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టులు పొందిన విజయాలను చూసిన తరువాత పార్టీ పేరు మార్చాలని కొందరు కోరారు.2021లో జరిగిన ఎన్నికలలో దేశంలో రెండవ పెద్ద పట్టణమైన గ్రాజ్‌ మేయర్‌గా పార్టీ నాయకురాలు ఎకె కాహర్‌ ఎన్నికయ్యారు.ఆమె 2023 ప్రపంచ ఉత్తమ మేయర్‌గా ఎన్నికైంది. తాజాగా నాలుగో పెద్ద నగరమైన సాల్జ్‌బర్గ్‌లో కమ్యూనిస్టు అభ్యర్ది కే మైఖేల్‌ డాంకల్‌ ఉప మేయర్‌గా గెలిచాడు. అక్కడి నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికలలో 50శాతం పైగా ఓట్లు తెచ్చుకున్నవారు మేయర్‌గా, రెండోవారు ఉపమేయర్‌ అవుతారు. మార్చినెల పదిన జరిగిన ఎన్నికల్లో సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధికి 29.4, డాంకల్‌కు 28శాతం ఓట్లు వచ్చాయి. గెలుపుకు అవసరమైన 50శాతంపైగా ఓట్లను తెచ్చుకోవటంలో బహుముఖ పోటీలో ఎవరూ లేకపోవటంతో తొలి రెండు స్థానాల్లో ఉన్న వారి మధ్య మార్చి 24వ తేదీన తుది ఎన్నిక జరిగింది. దానిలో డాంకల్‌కు 36.9శాతం ఓట్లు వచ్చాయి. కమ్యూనిస్టు వ్యతిరేక పార్టీలు సోషల్‌ డెమోక్రటిక్‌ అభ్యర్దికి మద్దతు ఇవ్వటంతో 63.1శాతం ఓట్లతో మేయర్‌గా గెలిచాడు.ఆస్ట్రియా జనాభా 90లక్షలు.మితవాదశక్తులదే ఆధిపత్యం.అయినప్పటికీ కమ్యూనిస్టులకు మద్దతు పెరగటం ఒక మంచి పరిణామం.సాల్జ్‌బర్క్‌ రాష్ట్ర ఎన్నికలలో 2018లో కేవలం 0.4శాతం ఓట్లు తెచ్చుకున్న పార్టీ ఇటీవల 2023లో 11.7శాతానికి పెంచుకుంది. అదే సాల్జ్‌బర్గ్‌ నగరంలో చూస్తే 21.5శాతం వచ్చాయి. అక్కడ ఈ ఏడాది మున్సిపల్‌ ఎన్నికల్లో 28శాతానికి పెరిగాయి. రెండోదశ ముఖాముఖీ పోటీలో 36.9శాతం వచ్చాయి. అంతకు ముందు తొలిదఫా జరిగిన ఎన్నికల్లో నగర కౌన్సిల్లో అంతకు ముందు ఉన్న ఒక స్థానం నుంచి పదికి పెంచుకుంది. మేయర్‌గా గెలిచిన పార్టీకి వచ్చింది పదకొండు మాత్రమే. మరో రెండు చిన్న నగరాల్లో కమ్యూనిస్టులకు మూడు సీట్లు వచ్చాయి. ఆస్ట్రియాలో అందరికీ తెలిసిన పెద్దదైన వియన్నా నగరంతో సహా మొత్తం రాష్ట్ర రాజధానుల నగరాలు తొమ్మిది ఉన్నాయి. ఆస్ట్రియాలో ఇండ్లు పెద్ద సమస్యగా ఉన్నాయి. కమ్యూనిస్టులు దాని మీద ప్రధానంగా కేంద్రీకరించారు.ఈ ఏడాది జరిగే జాతీయ పార్లమెంటు ఎన్నికల్లో కనీసమైన ఐదుశాతానికి మించి ఓట్లు సాధించి 1959 తరువాత తొలిసారిగా ప్రాతినిధ్యం పొందేందుకు కమ్యూనిస్టులు కృషి చేస్తున్నారు.


ఈ క్రమంలోనే పేరు మార్చుకుంటే జనం ఆదరణ పెరుగుతుందనే సూచనలు ఎక్కువగా వస్తున్నాయి. కమ్యూనిస్టులంగానే ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేశామని తమ గురించి తెలిసే జనం తమకు ఓట్లు వేస్తున్నారని పార్టీ నేతలు స్పష్టం చేశారు.పార్టీ చరిత్రకారుడు మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ తాజాగా జాకోబిన్‌ పత్రిక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాల సారాంశం ఇలా ఉంది. ఎన్నికల్లో కమ్యూనిస్టులకు ఆదరణ పెరగటాన్ని కార్పొరేట్‌ మీడియా తీవ్రంగా పరిగణిస్తున్నది. కమ్యూనిస్టులు నియంతలను ఆరాధిస్తారని, ఎన్నికైన కమ్యూనిస్టులు తమకు వచ్చే వేతనాలను విరాళాలుగా ఇవ్వటం జనాకర్షకం తప్ప మరొకటి కాదని, గతంలో జరిగిన కమ్యూనిస్టు అకృత్యాలను సమర్దిస్తారంటూ విష ప్రచారం చేస్తున్నది. గ్రాజ్‌ కమ్యూనిస్టు మేయర్‌ కాహర్‌ను 2022లో ఇంటర్వ్యూ చేసిన ఒక ప్రధాన పత్రిక సంపాదకుడు సగం సమయాన్ని బెలారస్‌, పుతిన్‌, టిటో,లెనిన్‌ల గురించి అడగటానికే వెచ్చించాడు.దాన్ని ప్రసారం చేసిన తరువాత వీక్షకుల నుంచి వెల్లడైన నిరసనతో క్షమాపణలు చెప్పటాన్ని మరచిపోలేము. అయినప్పటికీ తరువాత కూడా అదే ధోరణి కొనసాగుతోంది. గతంలో పార్టీ అనుసరించిన వైఖరిని ఎక్కడా దాచుకోవటం లేదు. నాజీ నియంతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు చేసిన త్యాగాలను దాచలేరు.అయితే రెండవ ప్రపంచ యుద్దం తరువాత సోవియట్‌ యూనియన్‌, ఇతర తూర్పు ఐరోపా దేశాలతో కమ్యూనిస్టు పార్టీ సంబంధాల కారణంగా ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ త్యాగాలు జనం దృష్టిలో మరుగునపడ్డాయి.సోషలిస్టు వ్యవస్థలున్న దేశాల్లో జరిగిన పరిణామాల పట్ల ముఖ్యంగా సోవియట్‌ యూనియన్‌ గురించి విమర్శనాత్మక వైఖరిని తీసుకోకపోవటం ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీకి ఒక సమస్యగా మారింది. ప్రచ్చన్న యుద్ధకాలంలో జనం నుంచి దూరం చేసింది. కార్మిక, సామాజిక ఉద్యమాల్లో రోజువారీ పని చేయటం కూడా కష్టంగా మారింది.


1990 దశకం నుంచి (సోవియట్‌, ఇతర తూర్పు ఐరోపా సోషలిస్టు రాజ్యాల పతనం తరువాత) గతంలో అనుసరించిన వైఖరి మీద విమర్శనాత్మక సమీక్షలు జరిగాయి. దాని గురించి అన్ని అంశాలను పార్టీ ప్రచురించింది.వీటిని మితవాద శక్తులు, మీడియా పరిగణనలోకి తీసుకోకపోవటం అంటే వారికి బురద చల్లటం తప్ప వాటి పట్ల ఆసక్తి లేదు.పాత కమ్యూనిస్టు వ్యతిరేకత నుంచి బయటపడటం లేదు.ఇటీవలి ఎన్నికల విజయాల తరువాత పార్టీ గురించి ఆసక్తి వెల్లడిస్తున్న ”వామపక్ష ఉదారవాదులు ” కూడా పార్టీ ఆత్మవిమర్శను పరిగణనలోకి తీసుకోవటం లేదు. కమ్యూనిస్టు వ్యతిరేకత ప్రచ్చన్న యుద్దానికి ముందే అనేక మార్పులకు లోనైంది. ఇప్పుడు గ్రాజ్‌,సాల్జ్‌బర్గ్‌ నగరాల్లో 30శాతం జనం ” కమ్యూనిస్టు ” పేరు చూసి భయపడటం లేదని రుజువైంది. ఇప్పుడు ఆస్ట్రియన్‌ కమ్యూనిస్టు పార్టీ అనుసరిస్తున్న నిర్దిష్ట విధానాలు, అభ్యర్ధుల విశ్వసనీయతనే జనం చూస్తున్నారు. ప్రచ్చన్న యుద్ద కాలం నాటి కమ్యూనిస్టు వ్యతిరేక పడికట్టు పదాలు,దుర్భ్రమలు ఇప్పుడు లేవు. కమ్యూనిస్టులు జాతీయ పార్లమెంటులో అడుగుపెట్టిన తరువాత జర్నలిస్టులు, వ్యాఖ్యాతలు కూడా గుర్తించుతారు. అత్యంత కష్ట కాలంలోనే పార్టీపేరులో కమ్యూనిస్టు పదాన్ని తొలగించలేదు. గతంలో పార్టీలో కూడా అంతర్గతంగా పేరు మార్పు గురించి మాట్లాడిన వారు ఇప్పుడు మౌనంగా ఉన్నారు.చారిత్రక నేపధ్యం, అనేక అంశాలను చర్చించిన తరువాత పార్టీ పేరు మార్చాల్సిన అవసరం లేదని భావించుతున్నాము.కొన్ని సోషలిస్టు దేశాలతో కొన్ని సమస్యలున్నప్పటికీ పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం సోషలిజం తప్ప మరొక ప్రత్యామ్నాయం లేదన్న సానుకూల అభిప్రాయం జనంలో కూడా ఉంది, కమ్యూనిస్టులు దాన్నేమీ దాచటం లేదు అని మాన్‌ఫ్రెడ్‌ మగ్రార్‌ చెప్పాడు.


పలుచోట్ల రివల్యూషనరీ కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు !
దశాబ్దాల తర్జనభర్జనల తరువాత అనేక దేశాలలో రివల్యూషనరీ కమ్యూనిస్టు పేరుతో మరో కొత్త పార్టీ అవతరించింది.దాని విధానాలు, సిద్దాంత వైఖరులు ఎలా ఉండేది ఇంకా వెల్లడి కావాల్సి ఉన్నప్పటికీ కమ్యూనిజానికి కాలం చెల్లిందని ప్రచారం చేస్తున్న రోజుల్లో మరో పార్టీ ఉనికిలోకి రావటం చిన్న విషయమేమీ కాదు. ఈ పార్టీ గురించి పత్రికల్లో రాజకీయ, మీడియా వర్గాల్లో గందరగోళం, ఆగ్రహం వెల్లడైంది. కమ్యూనిస్టు పార్టీని ఆహ్వానిస్తే అనుమానించాలిగాని పాలకవర్గాలు వ్యతిరేకించాయంటే మంచిదే. ”అంతర్జాతీయ మార్క్సిస్టు ధోరణులు” (ఐఎండి) అనే సంస్థకు చెందిన వారు వివిధ దేశాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నారు.త్వరలో ప్రధమ మహాసభలు జరిపేందుకు నిర్ణయించారు. లెనిన్‌ బోధనలను తాము అధ్యయనం చేస్తున్నామని, వాటి ఆధారంగా విధానాలు, వైఖరులు నిర్ణయించకుంటామని చెబుతున్నారు. మీరు కమ్యూనిస్టా ? మనకు విప్లవం కావాలి అనే పేరుతో ఐఎండి నలభై దేశాలలో ఇంటర్నెట్‌ ద్వారా ప్రచారం చేసి యువతరాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నించింది. ఫ్రాజర్‌ సంస్థ బ్రిటన్‌,అమెరికా,ఆస్ట్రేలియా,కెనడాలలో ఒక సర్వే నిర్వహించిందని, ఆయా దేశాలలోని 18-34 సంవత్సరాల యువతను ప్రశ్నించగా వరుసగా 29,20,18,13శాతాల చొప్పున సరైన ఆర్థిక వ్యవస్థ కమ్యూనిజంలో ఉంటుందని భావించినట్లు వెల్లడైందని, ఇతర దేశాల్లో సర్వే చేసినా ఇదే మాదిరి ఉంటుందని, అన్ని ఖండాలలో మిలియన్ల మంది కమ్యూనిస్టులు ఉన్నట్లు దీని అర్ధమని ఐఎండి పేర్కొన్నది.కమ్యూనిస్టు భావజాలాన్ని అంగీకరించటంతో సరిపోదని కారల్‌ మార్క్స్‌ చెప్పినట్లు పెట్టుబడిదారీ విధానాన్ని తొలగించి కమ్యూనిస్టు వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒక పార్టీ అవసరమన్న అవగాహన మేరకు అలాంటి పార్టీని అనేక దేశాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఐఎండి పేర్కొన్నది.


సోషలిస్టు దేశాల్లో మత స్వేచ్చ !
సోషలిస్టు దేశాలు మతాన్ని అణచివేస్తాయన్నది ప్రపంచంలో ఒక తప్పుడు ప్రచారం. కమ్యూనిస్టులు ఏ దేశంలోనూ ఒక చర్చి, మసీదు, గుడిని కూల్చివేసిన చరిత్ర లేదు. మతాలకు చెందిన అనేక చారిత్రక కట్టడాలను ప్రతి చోటా పరిరక్షించుతున్నారు తప్ప పడగొట్టటం లేదు.దోపిడీ వర్గాలు మతాన్ని ఒక మత్తు మందుగా మార్చి జనాన్ని చైతన్య రహితంగా ఉంచుతాయని కమ్యూనిస్టులు నమ్ముతారు. ప్రచారం చేస్తారు, కమ్యూనిస్టులుగా ఉన్నవారు మతాలకు దూరంగా ఉండాలని చెబుతారు తప్ప జనం మీద బలవంతం చేయరు. శాస్త్రీయ ఆలోచనలను పెంపొందిస్తారు. పార్టీలో సభ్యులుగా చేర్చుకొనే అర్హతల్లో మతాన్ని పాటిస్తున్నారా లేదా అనేది ఉండదు. ఒకసారి పార్టీలో చేరిన తరువాత భౌతిక వాదులుగా వారిని మార్చేందుకు చూస్తారు. ఎక్కడైనా అలాంటిది జరగటం లేదంటే స్థానిక నాయకత్వాల లోపం తప్ప మరొకటి కాదు. కమ్యూనిస్టుల మీద ఉన్న అనేక తప్పుడు ప్రచారాలు, అపోహలను తొలగించుకుంటూ మత సంస్థలు కమ్యూనిస్టు దేశాలతో సంబంధాల కోసం చూస్తున్నాయి. తాజాగా వాటికన్‌ పెద్దలు సోషలిస్టు వియత్నాంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొనేందుకు పూనుకున్నారు. మత సంస్థల మీద అనేక నియంత్రణలు ఉన్న దేశాల్లో వియత్నాం ఒకటి. రాజ్యాన్ని కూలదోసే ఒక సాధనంగా మతాన్ని, మతావలంబలకును మార్చేందుకు, జనం మధ్య విభజనలు తెచ్చేందుకు చేసే యత్నాలను ఏ దేశమూ అంగీకరించదు.


వియత్నాం జనాభాలో ఆరుశాతం మంది కాథలిక్కులు ఉన్నారు. అక్కడ మతాన్ని అవలంభిస్తున్నట్లు చెప్పుకున్న మొత్తం జనాభా పన్నెండుశాతం ఉన్నట్లు 2019లెక్కలు వెల్లడించాయి. వాటికన్‌ విదేశాంగ మంత్రి ఆర్చిబిషప్‌ పాల్‌ రిచర్డ్‌ గలాఘర్‌ నాయకత్వంలో ఒక బృందం ఏప్రిల్‌లో ఆరు రోజుల పాటు పర్యటించింది. ఈ ఏడాది పోప్‌ ఫ్రాన్సిస్‌ కూడా పర్యటనకు వస్తారన్న వార్తల పూర్వరంగంలో వారు వచ్చారు. వియత్నాంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా క్రైస్తవమత పెద్దలు జపాన్‌, ఫ్రాన్స్‌, అమెరికాతో కలసి నిర్వహించిన ప్రజా వ్యతిరేక పాత్ర తెలిసిందే. ఈ కారణంగా వాటికన్‌ ప్రతినిధులను దశాబ్దాలుగా అక్కడికి అనుమతించటం లేదు. గతేడాది ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత వాటికన్‌ ప్రతినిధులు వచ్చారు.దశాబ్దాల తరువాత గత డిసెంబరులో వియత్నాంలో వాటికన్‌ తన శాశ్వత ప్రతినిధిని నియమించింది.ఈ ఏడాది జనవరిలో పోప్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. మత సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నమోదు చేయించుకొని అనుమతి పొందాలని 2018లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. మత సంస్థల ముసుగులో విదేశాలు జోక్యం చేసుకొనే అవకాశం ఉన్న కారణంగా నిబంధనలను పటిష్టం గావించింది.
గ్రీకు కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి దిమిత్రిస్‌ కౌట్‌సౌంపస్‌ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గం అమెరికాలోని ఆర్చిబిషప్‌ ఎపిడోఫరోస్‌ను ఏప్రిల్‌ 26న కలుసుకున్నారు. గ్రీకు అమెరికన్ల గురించి, గ్రీసులోని చర్చికి సంబంధించిన అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి.మతాధికారి అయిన కౌట్‌సౌంపస్‌ తాత 1944లో నాజీల ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాడిన తీరును, ఆ వారసత్వ కొనసాగింపుగా గ్రీకు దేశం కోసం పని చేయాలని అర్చిబిషప్‌ అభిలషించారు.

మోడీ 400+ మీద హిందూత్వ గుంపులోనే నమ్మకం లేదు !

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా బిజెపికి 370, దాని మిత్ర పక్షాలతో కలిపి 400కు పైగా లోక్‌సభ స్థానాలు వస్తాయా అన్న అనుమానాలు కరడుగట్టిన హిందూత్వ శక్తుల్లోనే తలెత్తాయి.” స్ట్రగుల్‌ ఫర్‌ హిందూ ఎగ్జిస్టెన్స్‌ ”( హిందూ ఉనికి కోసం పోరాటం) అనే వెబ్‌సైట్‌లో 2024 ఏప్రిల్‌ 25న వెలువడిన ఒక విశ్లేషణకు ”బిజెపి-ఎన్‌డిఏ 400 సీట్లకు పైగా అన్న దానికి దూరంగా ఉందా ” అనే శీర్షికను పెట్టారు. దాని రచయిత ఉపానంద బ్రహ్మచారి హరిద్వార్‌కు చెందిన ఒక స్వామి. ” హిందూత్వ ఉత్పాతన పూర్వరంగంలో లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 250కి మించి సీట్లు రావంటూ ఒక ఇంటిలిజెన్స్‌ నివేదిక జోశ్యం చెప్పింది ” అనే మాటలతో అది ప్రారంభమైంది.కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. ” బిజెపి,నోటుకు ప్రచార మీడియా,దాని ఐటి విభాగం నాలుగు వందల సీట్లకు మించి వస్తాయని చెప్పచూసేందుకు ఒక వ్యర్ధ మార్గంలో ప్రయత్నిస్తున్నాయి. కొన్ని గూఢచార సమాచారాలు దానికి భిన్నంగా ఉన్నందున కొన్ని వర్గాలు చెప్పినట్లుగా బిజెపిలోనే వణుకు ప్రారంభమైంది……ఎంతో ఆసక్తికరమైన అంశం ఏమంటే తొలి దశల్లో బిజెపి విజయానికి చోదక శక్తిగా హిందూత్వ ఉంది. ఇప్పుడు అనేక మంది హిందూత్వ ప్రవర్తకులైన పూజనీయ శంకరాచార్యలు, డాక్టర్‌ సుబ్రమణ్యస్వామి, ఎం నాగేశ్వరరావు, మధు కిష్వెర్‌, సందీప్‌ దేవ్‌ వంటి వారి విమర్శలతో మోడీ తన హిందూత్వ యోగ్యతా పత్రాన్ని కోల్పోయారు. ఈ హిందూత్వ ప్రముఖులు గతంలో మోడీ మరియు బిజెపికి మద్దతు ఇచ్చారు. రామసేతును జాతీయ కట్టడంగా ప్రకటించనందుకు, గోవధపై నిషేధం విధించనందుకు,మతమార్పిళ్లను నిషేధించనందుకు, ప్రభుత్వ నియంత్రణ నుంచి హిందూ దేవాలయాలను విముక్తం చేయనందుకు, కాశ్మీరులోయలో పండిట్లకు పునరావాసం కల్పించనందుకు, ముస్లిం పర్సనల్‌ లా, వక్ప్‌ చట్టాలను రద్దు చేయనందుకు, ప్రార్ధనా స్థలాల చట్టం 1991 రద్దు వంటి అనేక చర్యలను తీసుకోనందుకు వారు ఇప్పుడు మోడీని హిందూత్వ విరోధిగా చూస్తున్నారు.


ఈ హిందూత్వ ప్రముఖుల్లో అనేక మంది బిజెపికి సన్నిహితంగా ఉన్నారు.ఇప్పుడు పార్టీ, హిందూత్వలో మోడీ నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. నకిలీ హిందూత్వ ప్రతీకగా ప్రకటిస్తున్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సుప్రీం కోర్టు దారి చూపిందని వారిలో అనేక మంది భావిస్తున్నారు. మోసపూరితంగా, కపటంతో మోడీ అన్ని రకాల ఖ్యాతులను స్వంతం చేసుకున్నారు. హిందుత్వ కుటుంబంలో, దాని నాయకత్వంలో వచ్చిన అలాంటి విభజన వలన ఇప్పుడు బిజెపి హిందూ ఓటు బాంకు తీవ్రంగా దెబ్బతిన్నది. బిజెపి స్వయంగా అభిప్రాయపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు విశ్వసనీయమైన ఇంటెలిజన్స్‌ అందించిన సమాచారం ప్రకారం ఆందోళన కలిగించే అంతర్గత సర్వేలో మెజారిటీ సంఖ్య 272 బిజెపి సాధించలేదని తేలింది. 2024 ఏప్రిల్‌ 19కి ముందు ది ఇండియా ఇంటెలిజన్స్‌ ఇనీషియేటివ్‌, కొన్ని అధికారిక సమాచారాల సహాయంతో నిర్వహించిన సర్వే ప్రకారం పది సీట్లు అటూ ఇటూగా 227కి మించి రావని తేలింది. ఎలా చూసుకున్నప్పటికీ 250కి మించి బిజెపికి రావని పేర్కొన్నది. ఇది కనుక ఇండియా కూటమి సృష్టించిన నకిలీది కానట్లయితే ఆందోళన కలిగించేదిగా ఉంది. దిగువ విధంగా బిజెపికి సీట్లు వస్తాయని సర్వే పేర్కొన్నది.


రాష్ట్రం×××××× సీట్లు ×××× బిజెపికి వచ్చేవి
అండమాన్‌ ×× 1 ×××× 0
ఆంధ్రప్రదేశ్‌ ×× 25 ×××× 1
అరుణాచల్‌ ×× 2 ×××× 1
ఆసోం ×××× 14 ×××× 6
బీహార్‌ ×××× 40 ×××× 10
చండీఘర్‌ ×× 1 ×××× 1
చత్తీస్‌ఘర్‌ ×× 11 ×××× 7
దాద్రా ×××× 1 ×××× 1
ఢిల్లీ ×××× 7 ×××× 3
గోవా ×××× 2 ×××× 1
గుజరాత్‌ ×× 26 ×××× 20
హర్యానా ×× 10 ×××× 6
హిమాచల్‌ ×× 4 ×××× 2
కాశ్మీర్‌ ×××× 5 ×××× 2
ఝార్ఖండ్‌ ×× 14 ×××× 6
కర్ణాటక ×× 28 ×××× 12
కేరళ ×××× 20 ×××× 0
లడఖ్‌ ×××× 1 ×××× 1
లక్షద్వీప్‌ ×× 1 ×××× 0
మధ్యప్రదేశ్‌ ×× 29 ×××× 26
మహరాష్ట్ర ×× 48 ×××× 10
మణిపూర్‌ ×× 2 ×××× 1
మేఘాలయ ×× 2 ×××× 0
మిజోరం ×× 1 ×××× 0
నాగాలాండ్‌ ×× 1 ×××× 0
ఒడిషా×× ×× 21 ×××× 9
పుదుచ్చేరి ×× 1 ×××× 1
పంజాబ్‌ ×× 13 ×××× 2
రాజస్తాన్‌ ×× 25 ×××× 20
సిక్కిం ×××× 1 ×××× 0
తమిళనాడు ×× 39 ×××× 0
తెలంగాణా ×× 17 ×××× 5
త్రిపుర ×××× 2 ×××× 1
ఉత్తరాఖండ్‌ ×× 5 ×××× 3
ఉత్తర ప్రదేశ్‌ ×× 80 ×××× 50
పశ్చిమబెంగాల్‌× 42 ×××× 20
మొత్తం ×××× 543 ×××× 227
సర్వే చేసిన సంస్థలో అనేక మంది మాజీ ఇంటెలిజన్స్‌ అధికారులే ఉన్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి.బిజెపికి 370 సీట్లు, మొత్తం ఎన్‌డిఏకు 400కు పైగా రావన్న అంచనాలతో సామాన్య జనం ఎన్నికల ఫలితాలు, దేశభవిష్యత్‌ గురించి ఆందోళన పడుతున్నారు. అయితే ఏదైనా రాజకీయ కుట్రలో భాగంగా అతి అంచనా అదే విధంగా తక్కువ చేసి చెప్పటాన్ని కూడా వారు ఆమోదించరు. రాజకీయ వాస్తవం అన్నది అరుదుగా ఉన్నందున జూన్‌ నాలుగవ తేదీ ఫలితాలు వాస్తవాలను వెల్లడిస్తాయి.” అని ఉపానంద బ్రహ్మచారి వ్యాసంలో ఉంది. ఒక పచ్చి హిందూత్వ శక్తులు నడిపే వెబ్‌సైట్‌లో ఇలాంటి విశ్లేషణ రావటం గమనించాల్సిన అంశం.


ఎవరైనా కొత్తగా లేదా విరామం తరువాత అధికారానికి వచ్చినపుడు లేదా వస్తామనే ధీమా ఉన్నపుడు తొలి వంద రోజుల్లో ప్రణాళిక గురించి చెబుతారు. కానీ నరేంద్రమోడీ పదేండ్ల అధికారం తరువాత మూడవసారి అధికారానికి వచ్చినపుడు అమలు జరపాల్సిన వంద రోజుల ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను కోరటం మభ్యపరిచే క్రీడలో భాగమే. న్యాయ ప్రణాళిక పేరుతో కాంగ్రెస్‌ ముందుకు తెచ్చిన సంక్షేమ పథకాల గురించి బిజెపికి ఆందోళన పట్టుకున్నట్లు కనిపిస్తోంది.పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తరువాత నన్ను నమ్మండి గ్యారంటీ అంటూ నరేంద్రమోడీ ప్రచారం చేయటమే దానికి నిదర్శనం, బిజెపి బలహీనత. అన్ని మరుగుదొడ్లు కట్టించాం, ఇన్ని గాస్‌ కనెక్షన్లు ఇచ్చాం వంటి అభివృద్ధి అంకెలతో జనానికి బోరుకొట్టింది.మరోవైపు గ్యారంటీలను కూడా జనం నమ్మే పరిస్థితి కనిపించకపోవటంతో అలవాటైన మైనారిటీ వ్యతిరేక ప్రచారానికి పూనుకున్నారు.పులి స్వారీకి దిగిన వారు దాన్ని అదుపులోకి తెచ్చుకోవాలి లేదా దానికి బలి కావాలి.విద్వేష ప్రచార పులి కూడా అలాంటిదే.

తెగించిన వాడికి తెడ్డే లింగం :” సిగ్గులేనితనం, అసహ్యకరం ” విశ్వగురు మోడీ విద్వేష ప్రసంగంపై విదేశీ మీడియా !

Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశ వనరుల మీద తొలి హక్కుదారులు ముస్లింలని కాంగ్రెస్‌ చెప్పిందని, వారు చొరబాటుదారులు, కాంగ్రెస్‌ అధికారానికి వస్తే పుస్తెలతో సహా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని వారికి పంచుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సభల్లో ఆరోపించారు. ఎప్పుడో 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారంటూ నరేంద్రమోడీ వేసిన నిందల గురించి మోడీ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అభిమానులే అంటున్నారు. అసలింతకీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి గురించి మోడీకి అర్ధమైందా ? ప్రతి ఎన్నికలో ఏదో ఒక అంశాన్ని సంచలనంగావిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కదని, ఓట్లు రాలవని ఈ ఎన్నికల్లో దీన్ని ఎంచుకున్నారా ? మతాల వారీ జనాలను చీలిస్తే తప్ప గట్టెక్కలేననే భయం పట్టుకుందా ?ఇలా పరిపరి ఆలోచనలు. నిజం గడపదాటేలోగా అబద్దం ఊరంతా చుట్టి వచ్చి ఎదురుగా నిలుస్తుందన్న లోకోక్తి తెలిసిందే. నరేంద్రమోడీ చెప్పిన అంశాల్లో నిజానిజాలేమిటి అని ఎందరు జనం లోతుల్లోకి వెళతారు. రాందేవ్‌ బాబా క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చానని చెప్పారు. ఇచ్చారు సరే అవి ఎంత పెద్దవో, ఏ పత్రికల్లో ఇచ్చారో వివరాలు ఇవ్వండని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రధాని చెప్పిన మాటల నిజానిజాల గురించి కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం కదలదు. అలా జరుగుతుందా ?


విశ్వగురువుగా తనను తాను భావించుకుంటున్న లేదా భజన సమాజం చిత్రిస్తున్నప్పటికీ మోడీ పచ్చి అవాస్తవాలు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకొని ప్రచురించాయి. అసలు మోడీ ఏం చెప్పారు. ది క్వింట్‌ అనే పత్రిక వాస్తవాలను వెల్లడించింది.దాన్ని కాదని మోడీ చెప్పిందే నిజమని ఆధారాలతో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి ఉందా ? రాజస్తాన్‌లోని బన్స్‌వారా ఎన్నికల సభలో మాట్లాడుతూ ” దేశ వనరుల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ చెప్పింది. దీని అర్ధం ఏమంటే సంపదలన్నింటినీ వారు సమీకరించి ఎవరికి పంచుతారు.ఎవరికి ఎక్కువ మంది పిల్లలుండే వారికి, అక్రమంగా చొరబడిన వారికి వారు పంచుతారు. కష్టపడి సంపాదించుకున్నదానిని చొరబాటుదారులకు ఇవ్వాలా? మీరు దీన్ని అంగీకరిస్తారా ? కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక చెప్పింది ఇదే. మన తల్లులు, సోదరిమణుల దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటారు, వాటిని లెక్కించి పంపిణీ చేస్తారు ” అని చెప్పారు.దీనికి ఆధారంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని ఉటంకించారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మగవారిని సుత్తితో తల మీద మోది కొడవలితో గొంతు కోస్తారని, ఆడవారి మెడల మీద కాడి మోపి పొలాలు దున్నిస్తారంటూ కాంగ్రెస్‌ చేసిన తప్పుడు ప్రచారాన్ని మోడీ గుర్తుకు తెచ్చారు.


” వనరులను కోరే తొలి హక్కు ముస్లింలకే ఉండాలి: ప్రధాని ” అంటూ జాతీయ అభివృద్ది మండలి 52వ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక 2006 డిసెంబరు తొమ్మిదవ తేదీన తప్పుదారి పట్టించే శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. ఆ మరుసటి రోజే అది కావాలని చేసిన తప్పుడు భాష్యం, ఆధారాల్లేవంటూ ప్రధాని కార్యాలయం ఒక ఖండన ప్రకటన జారీ చేసింది. ప్రధాని మాట్లాడింది ఇది అంటూ ప్రసంగ పాఠాన్ని కూడా దానికి జత చేసింది.దాని ప్రకారం ” మన ఉమ్మడి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వ్యవసాయం, సాగునీరు, జలవనరులు,ఆరోగ్యం, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలకు అవసరమైన కీలక పెట్టుబడులు,దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు,మైనారిటీలు, మహిళలు, పిల్లల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ అత్యవసరమైన సాధారణ మౌలికవసతులు వీటిలో ఉన్నాయి.దళితులు, గిరిజనులకు ఉద్దేశించిన ఉప పథకాలను పునరుజ్జీవింప చేయాలి.మైనారిటీలు ప్రత్యేకించి ముస్లింలు అభివృద్ధి ఫలాలను సమంగా పొందేలా సాధికారత కల్పించేందుకు మనం కొత్త పధకాలను కనుగొనాల్సి ఉంది.వనరులను పొందే యోగ్యతను వెల్లడించే తొలి వారుగా ఉండాలి ” అని చెప్పారు.


దళితులు, గిరిజనుల ఉద్దరణకు ఉప ప్రణాళికలు ఉన్నట్లుగానే తమకూ ఉండాలని వెనుకబడిన తరగతులు, ముస్లింలూ ఎప్పటి నుంచో కోరుతున్నారు.మానవాభివృద్ధి సూచికలు, దారిద్య్ర వివరాలను చూసినప్పటికీ 2019లో మన దేశానికి సంబంధించి ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం 2018లో ప్రతి ఇద్దరు గిరిజనుల్లో ఒకరు, ప్రతి ముగ్గురు దళితులు, ముస్లిముల్లో ఒకరు పేదలుగా ఉన్నారని తేలింది.దేశ జనాభాలో 2011లెక్కల ప్రకారం 16.6శాతం దళితులు, 8.6శాతం గిరిజనులు, 14.2శాతం ముస్లింలు ఉన్నారు. మతాలు వేరు గావచ్చు తప్ప, పేదరికం, అన్ని రకాల వెనుకబాటులో వీరందరి పరిస్థితి ఒకే విధంగా ఉందని ప్రభుత్వ వివరాలే వెల్లడిస్తున్నాయి. ఇతర మైనారిటీలైన సిక్కులు, క్రైస్తవులు, జైనులు,బౌద్దులు ఇతరుల్లో పరిస్థితి ఇలా ఉందని ఎవరైనా చెప్పగలరా ? దేశంలో ఇప్పుడు 22 కోట్ల మంది పేదలున్నారని, వారందరినీ రానున్న పది సంవత్సరాల్లో ఉద్దరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది తప్ప మరొకటి కాదు.బిజెపి చెప్పే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌లో ముస్లింలను మినహాయిస్తామని చెప్పగలదా ?


ఇక ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కని జనాభాను పెంచేస్తున్నారని, ముస్లిం మెజారిటీ దేశంగా మార్చనున్నారనే విద్వేష ప్రచారం ఎప్పటి నుంచో దేశంలో సాగుతోంది.ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ముస్లింల పాలన, తరువాత ఆంగ్లేయుల ఏలుబడి దేశంలో ప్రారంభమైంది. నిజానికి మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లలను కన్నా, మతమార్పిడులు చేసినా ఎప్పుడో ముస్లిం, క్రైస్తవ దేశంగా మారి ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8, ముస్లింలు 14.2శాతమే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా కనటానికి కారణాల్లో దారిద్య్రం, విద్యలేమి వంటి అనేక అంశాలున్నాయి. కుటుంబ నియంత్రణ గురించి గడచిన ఆరున్నర దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ హిందువుల్లో 54.4శాతం ఉండగా ముస్లింలలో 45.3శాతం ఉంది. సగటున ముస్లింలు 2.36, హిందువులు 1.94 మందిని కంటున్నట్లు తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. రెండు మతాల వారి మధ్య పెద్ద తేడా ఏముంది. గణాంకాలను చూసినపుడు ముస్లింలలో జనాభా పెరుగుదల రేటు తగ్గుదల ఎక్కువగా ఉంది.1961-91 జనాభా పెరుగుదల రేటు వివరాలను చూసినపుడు మధ్యలో పెరిగినా, తగ్గినా హిందువుల్లో 20.7 నుంచి 22.7శాతం ఉండగా ముస్లింలలో 32.7 నుంచి 32.9శాతం ఉంది. తరువాత కాలంలో 2011 నాటికి హిందువుల్లో 16.7శాతం ఉండగా ముస్లింలలో 24.7శాతం ఉంది. తగ్గుదల రేటు ముస్లింలలో ఎక్కువగా ఉంది.


ఇక నరేంద్రమోడీ చేసిన ఎన్నికల ప్రసంగంపై అంతర్జాతీయ మీడియాలో దేశ పరువు తీసే విధంగా వార్తలు వచ్చాయి.గతంలో రాహులు గాంధీ విదేశాల్లో మోడీ విధానాల గురించి మాట్లాడి దేశ పరువు తీశారని విమర్శించిన బిజెపి ఇప్పుడు నరేంద్రమోడీ దేశంలో ఉండే చేసిన వ్యాఖ్యలు దేశపరువును ప్రశ్నార్ధకం చేసినందున ఏం చెబుతుంది ? ఫ్రాన్స్‌ 24 టీవీ, వెబ్‌సైట్‌ ” ఆశ్చర్యం కలిగించని అసహ్యకర ప్రసంగం ” అన్న శీర్షికతో వార్తను ప్రసారం చేసింది. ఈ ప్రసంగం తరువాత మోడీ మీద చర్య తీసుకోవాలని పదిహేడు వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్‌కు పంపిన వినతి మీద సంతకాలు చేసినట్లు పేర్కొన్నది. గత పది సంవత్సరాలుగా భారత్‌లో ఎన్నికలను పరిశీలిస్తున్నవారికి మోడీ ప్రసంగం ఆశ్చర్యం కలిగించలేదని, తన పునాదిని పెంచుకొనేందుకు విద్వేష ప్రసంగాలు చేయటంలో జయప్రదమైనట్లు పేర్కొన్నది. తాజాగా చేసిన అసహ్యకర ప్రసంగం గత పదిసంవత్సరాలలో చేసిన ప్రచారానికి అనుగుణంగా ఉందని, ప్రపంచ వేదికల మీద చెప్పే మాటలకు పూర్తి విరుద్దంగా స్వదేశంలో ప్రసంగాలు చేస్తున్నట్లు ఒక విశ్లేషకుడు చెప్పిన మాటలను ఉటంకించింది..


” భారతీయ ముస్లింలను చొరబాటుదారులని మోడీ ఎందుకు వర్ణించారు ?ఎందుకంటే అతను అనగలడు ” అంటూ అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వార్తకు శీర్షిక పెట్టింది.భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ సామాజిక తరగతిని నిందిస్తూ సిగ్గులేకుండా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడటానికి దేశంలో లేదా బయటా తన అధికారానికి ఆటంకాలు ఏర్పడతాయని ఆయనకు కనిపిస్తున్నట్లు స్పష్టం చేయటమే అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దేశంలో అధికారం,హిందూ ధోరణలు లోతుగా నాటుకున్న తరువాత ఆర్థికంగా, దౌత్య పరంగా భారత ఎదుగుదలను అవకాశంగా తీసుకొని ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా పాత్ర పోషించేందుకు దృష్టిసారించారు. ఆ క్రమంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు స్వంత పార్టీ చేస్తున్న మతపరమైన విభజిత కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కానీ స్వదేశంలో తన అధికారానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినట్లు మోడీకి కనిపిస్తున్నదని సిగ్గులేని తనం స్పష్టం చేసింది.స్వదేశంలో నిఘా సంస్థలు(మీడియా, అధికారిక, అనధికారిక నిఘా) మొత్తంగా భారతీయ జనతా పార్టీకి అనువుగా మారాయి.చైనాను నిలువరించేందుకు గాను భారత్‌ను నిలబెట్టాలని చూస్తున్నకారణంగా దేశంలో నరేంద్రమోడీ ఏం చేస్తున్నారో చూడనిరాకరణ విదేశీ భాగస్వాముల్లో పెరుగుతున్నదని పేర్కొన్నది.ప్రతిపక్షాలను అణచివేయటం, మైనారిటీలను లక్ష్యం చేసుకుంటున్న కొన్ని మోడీ చర్యల గురించి ఢిల్లీలోని పశ్చిమదేశాల దౌత్యవేత్తలు ప్రయివేటు సంభాషణల్లో దాచుకోవటం లేదు. చైనా, వాణిజ్య ఒప్పందాల గురించి కేంద్రీకరించటం తప్ప గతంలో మాదిరి సానుకూలంగా లేనప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవటాన్ని మోడీ సొమ్ము చేసుకుంటున్నారని రాసింది. అనేక కారణాలతో ప్రపంచ రాజకీయాల్లో చైనాకు పోటీగా నిలబెట్టేందుకు తన జాతీయ ప్రయోజనాల రీత్యా అమెరికా ప్రభుత్వం నరేంద్రమోడీ గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని అమెరికా విశ్లేషకుడు మార్కే అన్న మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ ఉటంకించింది.మోడీని విమర్శించటం అమెరికాలో ఉన్న భారత సంతతితో వివాదం తెచ్చుకోవటమే అవుతుందని, తమకు వ్యతిరేకంగా మారవచ్చని అమెరికా రాజకీయవేత్తలు భావిస్తున్నారని కూడా మార్కే అన్నాడు.మోడీ అంతర్గత రాజకీయాలతో తమ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదని ఎంతకాలం పాటు భారత్‌ను విశ్వసిస్తుందన్నదే ప్రశ్న అని కూడా చెప్పాడు.

మోడీ ప్రసంగాల గురించి అంతర్జాతీయ ఎపి ఇచ్చిన వార్తను ప్రపంచ పత్రికలన్నీ ప్రచురించాయి, టీవీలలో చెప్పారు. మనదేశంలోని ముస్లింలు, హిందువులందరి జన్యువులు ఒకటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గతంలో సెలవిచ్చారు.వసుధైక కుటుంబమని చెబుతారు.కుట్రతో విభజించారని అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతారు. మరి నరేంద్రమోడీ ముస్లింలను చొరబాటుదారులని ఎలా వర్ణించారు? సాధారణ పరిస్థితుల్లో అక్రమంగా వచ్చిన వారిని అలా వర్ణిస్తారు, అంత్యరుద్దాలు, ఇతర విపత్తులు తలెత్తినపుడు వచ్చేవారిని చొరబాటుదారులు అంటారా ? శ్రీలంకలో ఉగ్రవాదుల దాడులు, ప్రభుత్వ ప్రతిదాడులు సమయంలో అనేక మంది అక్కడి తమిళులు మనదేశానికి ఆశ్రితులుగా వచ్చారు. వారిని చొరబాటుదారులుగా వర్ణించే ధైర్యం నరేంద్రమోడీకి ఉందా ? ఆ మాటకు వస్తే మన పూర్వీకులందరూ ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే, రాజులు, రాజ్యాలు, సరిహద్దులు లేనపుడు జీవన పోరులో ఎక్కడో ఒక చోట స్థిరపడ్డారు. అంటే మోడీ భాష్యం ప్రకారం అందరూ చొరబాటుదారులే.

చిన్న దేశం – పెద్ద సందేశం : మాల్దీవుల ఎన్నికల్లో ” విజేత చైనా ” !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఆదివారం ఏప్రిల్‌ 19, 2024న జరిగిన మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల్లో విజేత చైనా అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక శీర్షిక పెట్టింది. దాదాపు అన్ని పత్రికలూ చైనా అనుకూల పార్టీ సూపర్‌ మెజారిటీ సాధించినట్లు నివేదించాయి.పీపుల్స్‌ మజ్లిస్‌ (పార్లమెంటు)లోని 93 స్థానాలకు గాను పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(పిఎన్‌సి), దాన్ని బలపరుస్తున్న వారికి 75, భారత అనుకూల మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీకి 15 స్థానాలు వచ్చినట్లు వార్తా సంస్థలు తెలిపాయి.పోటీచేసిన మహిళలు ముగ్గురూ విజేతలు కాగా వారు అధికార పార్టీకి చెందినవారే. మొత్తం 368 మంది పోటీ చేశారు. వారిలో 130 మంది స్వతంత్రులు కాగా మిగిలిన వారు ఏడు రాజకీయ పార్టీలకు చెందిన వారు. ఈ ఎన్నికల పర్యవసానాల గురించి సహజంగానే విశ్లేషణలు మొదలయ్యాయి.2019లో జరిగిన ఎన్నికల్లో మాల్దీవుల డెమోక్రటిక్‌ పార్టీ 45.83 శాతం ఓట్లతో 87 స్థానాలకు గాను 65 తెచ్చుకుంది. ఆ ఎన్నికల నాటికి నూతన పార్టీగా పిఎన్‌సి 6.63శాతం ఓట్లు, మూడు సీట్లు తెచ్చుకుంది.గతేడాది సెప్టెంబరు 9న జరిగిన ఎన్నికల్లో ఎవరికీ అవసరమైన 50శాతంపైగా మెజారిటీ రాకపోవటంతో 30న జరిగిన తుది దఫా ఎన్నికల్లో ఈ పార్టీ నేత మహమ్మద్‌ ముయిజ్జు 54.04శాతం ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు, నవంబరు 17న బాధ్యతలను స్వీకరించాడు.


అధ్యక్ష ఎన్నికలు, తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది.చిన్నదైనా పెద్దదైనా ఏ దేశంలోనూ విదేశాలతో సంబంధాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. చైనా – భారత్‌ మధ్య పోటీగా ఇక్కడ జరిగాయి. అందుకే అసలు విజేత చైనా అన్నట్లుగా వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ” అధ్యక్ష ఎన్నికలు తమ పౌరుల దేశ భక్తికి ఒక ప్రతిబింబమని, మా ఇరుగు పొరుగు వారు, భాగస్వాములు తమ స్వాతంత్య్రం, సర్వసత్తాకతను పూర్తిగా గౌరవించాలని ఇచ్చిన ఒక పిలుపు ” అని పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రతినిధి వ్యాఖ్యానించాడు.పార్లమెంటు ఎన్నికలు మరింత తీవ్రంగా జరిగాయి. చైనా బిఆర్‌ఐ పధకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిన గత ప్రభుత్వంలో గృహశాఖ మంత్రిగా ముయిజ్జు పని చేశాడు. తాను అధికారానికి వస్తే రెండు దేశాల మధ్య మరో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతానని ఎంతో ముందుగానే ప్రకటించాడు.చెప్పినట్లుగానే భిన్నమైన రీతిలో వ్యవహరిస్తున్నాడు.గతంలో మాల్దీవుల్లో ఎవరు అధికారానికి వచ్చినా తొలి విదేశీ పర్యటన భారత్‌తోనే ప్రారంభమయ్యేది. అలాంటిది ముయిజ్జు తొలుత టర్కీ, తరువాత యుఏయి, చైనా పర్యటించాడు.2019లో మనదేశంతో కుదుర్చుకున్న జలవాతావరణ(హైడ్రాలజీ) పరిశీలన పధకం నుంచి మాల్దీవులు వైదొలిగింది. అక్కడ ఉన్న కొద్ది మంది మన సైనికులను కూడా దశలవారీ మే 10వ తేదీలో వెనక్కు వెళ్లాలని కోరింది. రద్దీగా ఉండే తూర్పు-పశ్చిమ దేశాల నౌకా రవాణా మార్గంలో మాల్దీవులు కీలకమైన ప్రాంతంలో ఉంది. అమెరికా విశాల మిలిటరీ వ్యూహంలో హిందూ మహాసముద్రం ఎంతో ముఖ్యమైనది. బ్రిటీష్‌ ఆక్రమించిన మారిషస్‌కు చెందిన డిగోగార్సియా దీవులను అమెరికా తన ఆధీనంలోకి తెచ్చుకొని ఖాళీ చేసేందుకు మొరాయిస్తున్నది. అక్కడ ఒక సైనిక స్థావరాన్ని కూడా నిర్మించింది. మనదేశంలోని కన్యాకుమారికి ఆ దీవులు 1,796కిలో మీటర్ల దూరంలో ఉన్నాయి. అది మనదేశంతో పాటు పరిసరాల్లోని అన్ని దేశాలకూ ఆందోళన కలిగించే అంశమే. బంగాళాఖాతం,హిందూ మహాసముద్రం, అరేబియా సముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు అమెరికా పట్టునుంచి విడివడటం, అవి క్రమంగా చైనాకు సన్నిహితం కావటం పశ్చిమ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. తమ విదేశాంగ విధానంలో కొన్ని మార్పులు చేశాం తప్ప ఎవరివైపూ మొగ్గటం లేదని ముయిజ్జు ప్రకటించాడు.


మాల్దీవుల ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యత కారణంగా 1965లో బ్రిటన్‌ ఆక్రమణ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత మన దేశం అన్ని రంగాలలో దగ్గరయ్యేందుకు చూసింది. 1988లో దాదాపు రెండు వందల మంది తమిళ ఉగ్రవాదులు మాల్దీవులకు వెళ్లి నాటి అధ్యక్షుడు అబ్దుల్‌ గయూమ్‌ మీద తిరుగుబాటు చేసి కీలకమైన ప్రాంతాలన్నింటినీ పట్టుకున్నారు. తమను అదుకోవాలని అనేక దేశాలను గయూమ్‌ కోరినా ఎవరూ ముందుకు రాలేదు. భారత్‌ స్పందించింది, ఆపరేషన్‌ కాక్టస్‌ పేరుతో కుట్రను విఫలం చేసి అనేక మంది కుట్రదారులను కాల్చి చంపి, కొందరిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి సంబంధాలు మరింతగా బలపడ్డాయి. తరువాత జరిగిన పరిణామాల్లో దీవుల ఆర్థిక సమస్యలను, పౌరుల జీవితాలను మెరుగుపరచటంలో పాలకుల వైఫల్యం కారణంగా జనంలో అసంతృప్తి తలెత్తింది. సరిగ్గా అదే సమయంలో చైనా తన బిఆర్‌ఐ పధకాన్ని ముందుకు తెచ్చింది. ఐఎంఎఫ్‌, ప్రపంచబాంక్‌, అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాదిరి కఠినమైనవి కాకుండా సాధారణ షరతులతో ప్రాజెక్టులకు చైనా రుణాలు ఇచ్చింది. దాంతో 2013లో అధికారానికి వచ్చిన అబ్దుల్లా యామిన్‌ చైనాతో సంబంధాలను పెంచుకున్నాడు.2018లో గెలిచిన ఇబ్రహీం సాలి భారత్‌కు పెద్ద పీట అనే విధానంతో మన దేశానికి సన్నిహితంగా భాగస్వామ్య ఒప్పందాలను చేసుకున్నాడు. అది ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలుగా ఉన్న మాల్దీవుల ప్రోగ్రెసివ్‌ పార్టీ, పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ఒక కూటమిగా ఏర్పడి ” భారత్‌ను బయటకు పంపాలి( భారత్‌ అవుట్‌) ” అనే నినాదమిచ్చాయి. మనదేశం అనుసరించిన కొన్ని విధానాలు, అంతర్గత వ్యవహారాల్లో జోక్యంతో జనంలో ఉన్న భారత వ్యతిరేక మనోభావాలు కూడా దీనికి దోహదం చేశాయి. మనదేశానికి చెందిన జిఎంఆర్‌ కంపెనీ మాలెలోని విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణ బాధ్యతలు తీసుకుంది.విదేశీ ప్రయాణీకులతో పాటు మాల్దీవుల పౌరుల మీద అభివృద్ధి పన్ను విధించటంతో అక్కడ వ్యతిరేకత వెల్లడైంది. దాని వెనుక మాజీ అధ్యక్షుడు నషీద్‌ మద్దతు ఉందని జనం భావించారు. అవినీతి ఆరోపణల కేసులో అరెస్టు కాకుండా తప్పించుకొనేందుకు అతగాడు భారత రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందాడు. అది కూడా జనంలో మనదేశం మీద వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది.


మాల్దీవుల విదేశాంగ విధానంలో వచ్చిన మార్పులో చైనా వైపు మొగ్గుదల మననేతలకు సహజంగానే రుచించలేదు.ఒక స్వతంత్ర దేశం, అందునా కీలక ప్రాంతంలో ఉన్నందున దెబ్బతిన్న సంబంధాలను తిరిగి పునరుద్దరించుకొనేందుకు, కనీసం మరింత దిగజారకుండా చూసుకొనేందుకు ప్రయత్నించటం రాజనీతిజ్ఞుల లక్షణం.ఏ కారణంగానైనా దూరంగా జరిగినా, వైరం పెరిగినా ప్రత్యర్థుల ఆర్థిక మూలాను దెబ్బతీయటం ఒక ప్రధాన ధోరణిగా కనిపిస్తోంది.వాణిజ్య యుద్దాలు, దిగుమతులు, ఎగుమతులు, సాంకేతిక పరిజ్ఞానం అందచేత, పెట్టుబడులపై నిషేధాలు వాటిలో భాగమే. ఒక దేశం, దేశనేతలను కించపరిస్తే ఎవరూ సహించాల్సిన అవసరం లేదు. అధికారికంగా నిరసన తెలపటం అనేక ఉదంతాల్లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో మన ప్రధాని నరేంద్రమోడీని అవమానించినందుకుగాను మాల్దీవులకు తగిన బుద్ది చెప్పాలని, అందుకు మన విహార యాత్రీకులు అక్కడికి వెళ్లటం మానుకోవాలని మన దేశంలోని వారు సామాజిక మాధ్యమంలో పిలుపులు ఇచ్చారు. ఒక విమానయాన సంస్థ నిరవధికంగా ప్రయాణాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. మోడీ, భారత్‌ను సామాజిక మాధ్యమంలో కించపరుస్తూ వ్యాఖ్యానించినందుకు మల్షా షరీఫ్‌, మరియం షిహునా, అబ్దుల్లా మఝూన్‌ మజీద్‌ అనే ముగ్గురు ఉప మంత్రులను అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు సస్పెండ్‌ చేశారు. మోడీని వారు హాస్యగాడు, ఉగ్రవాది, ఇజ్రాయెల్‌ తొత్తు అని, మన దేశంలో పరిశుభ్రత తక్కువ అని పేర్కొన్నారు.అరేబియా సముద్రంలోని మన లక్షద్వీప్‌లో విహార యాత్రలను ప్రోత్సహించేందుకు గాను మోడీ ఒక బీచ్‌లో కూర్చున్న వీడియోను పోస్టు చేసిన తరువాత ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.తమ దేశానికి యాత్రీకులు రాకుండా చేసేందుకే ఇలా చేశారని అక్కడి కొందరు భావించారు. ప్రధానిని కించపరచటం గురించి మాలే లోని మన రాయబారి అక్కడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు అధ్యక్షుడి మీద అవిశ్వాస తీర్మానం పెడతామనేవరకు వెళ్లారు. సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలను తాము గమనించామని, అవి వారి వ్యక్తిగతం తప్ప అధికారిక వైఖరి కాదని అక్కడి ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. జరిగినదాని మీద అధ్యక్షుడు ముయిజ్జు విచారణకు ఆదేశించారని రాయిటర్స్‌ పేర్కొన్నది. కారణాలు ఏమైనప్పటికీ మనదేశం నుంచి మాల్దీవులకు వెళుతున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అక్కడి ప్రభుత్వం తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది జనవరి-మార్చి మాసాల మధ్య మన దేశం నుంచి 56,208 మంది మాల్దీవులకు వెళితే ఈ ఏడాది 34,847కు (38శాతం) తగ్గింది. అదే చైనా నుంచి వచ్చిన వారు 17,691 నుంచి 67,399 (281శాతం) పెరిగారు. అక్కడకు విదేశాల నుంచి వచ్చేవారిలో చైనా వాటా పది నుంచి అగ్రస్థానానికి చేరగా, మనదేశం మూడు నుంచి ఆరవ స్థానానికి తగ్గింది.


అధ్యక్షుడు ముయిజ్జు అనుసరిస్తున్న విధానాలతో విబేధించిన ప్రతిపక్షం పార్లమెంటులో తనకు ఉన్న మెజారిటీని ఆధారం చేసుకొని అభిశంసన తీర్మానం ద్వారా తొలగించేందుకు కూడా చూసింది. తాజా ఎన్నికల్లో అధికార పక్షం నాలుగింట మూడువంతులకు పైగా స్థానాలు సాధించటంతో అలాంటి ముప్పు తొలగటమే గాక అధ్యక్షుడికి మరింత పట్టుదొరికింది. జనవరిలో చైనా పర్యటన జరిపిన ముయిజ్జు అనేక ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలను జనం బలపరిచినట్లు ఫలితాలు స్పష్టం చేశాయి. ఇంతవరకు మనదేశ పర్యటనకు రాలేదు. మాల్దీవులకు భారత్‌ స్నేహ హస్తం చాచేందుకు విముఖత చూపితే చైనాపై మరింతగా ఆధారపడతారని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మాల్దీవులకు పర్యాటకులు వెళ్ల వద్దని అధికారికంగా మన ప్రభుత్వం చెప్పకపోయినా జరిగిన పరిణామాలను చూస్తే నష్టం జరిగిందన్నది స్పష్టం. దూరమౌతున్న ఇరుగు పొరుగు దేశాలను మరింత దూరం చేయచూస్తున్న మత విద్వేషకులు ఎలాగూ మారరు. దేశం ఏమైనా వారికి పట్టదు. హనైమధూ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో సహా అనేక మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాలలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వరకు మనదేశం పెట్టుబడులు ఉన్నాయి. వాటికి ఎలాంటి ముప్పు రాదు.మాల్దీవు ఎన్నికల్లో చైనా-భారత్‌లతో సంబంధాల గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంత మాత్రాన వెల్లడైన తీర్పును ఆ ఒక్క అంశానికే ఆపాదించటం, మనదేశానికి వ్యతిరేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. అభివృద్ది పథకాలకు పెట్టుబడులు కావాలని కోరినపుడు అనేక పశ్చిమ దేశాలు అక్కడ హక్కులకు భంగం కలిగించే పాలకులు ఉన్నారంటూ నిరాకరించాయి. ఆ సమయంలో చైనా ముందుకు వచ్చింది. హక్కులు, పాలన అనేది ఆయాదేశాల అంతర్గత వ్యవహారాలు, వాటికి పెట్టుబడులను ముడిపెడితే రాజకీయ పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉండేది చెప్పలేము..

పేదలకు మొండిచేయి ! మన్మోహన్‌ ధారాళంగా అప్పులిస్తే నరేంద్రమోడీ ఉదారంగా లక్షల కోట్లు రద్దు !! ఎవడబ్బ సొమ్మనీ రామచంద్రా !!!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పేదరికం, పేదల గురించి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చర్చ జరుగుతోంది. ” ఒక్క దెబ్బతో పేదరికాన్ని మాయం చేస్తానని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. ఇంతకాలం ఈ మహా మంత్రగాడు ఎక్కడున్నారు ” ఇది ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్న.ఈ మంత్రాన్ని ఎక్కడ నుంచి నేర్చుకున్నారు, పేదలను అవమానించటం కాదా అని కూడా అన్నారు. ఒక్క దెబ్బతో పేదరికం పోతుందని తాను చెప్పలేదని గట్టి ప్రయత్నం చేయాలని మాత్రమే అన్నట్లు రాహుల్‌ గాంధీ వివరణ. దేశంలో దారిద్య్రం ఉండటానికి కారణం కొంత మంది ఎంపిక చేసుకున్న వ్యక్తులకు నరేంద్రమోడీ సంపదలను కట్టబెట్టటమే అన్నారు. నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా 2030నాటికి ప్రపంచంలో మూడవ పెద్దదిగా మనదేశం అవతరించినప్పటికీ జనం పేదరికంలోనే ఉంటారని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పారు. ఇప్పటి వరకు చేసింది ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందు చూపుతా, పక్కా, నన్ను నమ్మండి అంటున్నారు నరేంద్రమోడీ. అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని పేదరికంలో జనాభా ఉన్నారని యుపిఏ సర్కార్‌ ఆహార భద్రతా పధకాన్ని తెచ్చింది.2011-12 వినియోగ సమాచారం ఆధారంగా గ్రామీణ ప్రాంత జనాభాలో 75శాతం, పట్టణాలలో 50శాతం మందికి కుటుంబానికి నెలకు 35కిలోల వంతున, వ్యక్తులుగా నెలకు ఐదు కిలోల చొప్పున ఇవ్వాలని పేదల్లో పేదలను గుర్తించి అంత్యోదయ అన్న యోజన కింద నాడు 81.34 కోట్ల మంది అర్హులని, వారిలో 80 కోట్ల మందిని గుర్తించి సబ్సిడీ ఆహార ధాన్యాల పధకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో 80 కోట్ల మందికి పూర్తి ఉచితంగా ఐదేసి కిలోల వంతున అందచేస్తామని నరేంద్రమోడీ ప్రకటించారు. దీని అర్ధం ఏమిటి ? దారిద్య్రం నుంచి బయటపడని వారు, లేదా బయటపడవేసిన వారు కూడా అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, మరో ఐదేండ్లు తమ అచ్చేదిన్‌ పాలనలో అలాగే ఉంటారని, పని కల్పించలేమని చేతులెత్తేయటమే కదా !


మనదేశ బహుముఖ దారిద్య్రం గురించి 2023లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2015-16లో దేశంలో 24.85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2019-21 నాటికి 14.96శాతానికి అంటే 13 కోట్ల 56లక్షల 61వేల 35 మందిని ఎగువకు తెచ్చినట్లు చెప్పారు. నరేంద్రమోడీ ఏలుబడిలో 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్‌ ఉంది. అంతకు ముందు ఆరు సంవత్సరాలు కూడా బిజెపి పాలనలోనే ఉంది. దేశానికి నమూనాగా పేర్కొన్న గుజరాత్‌లో 2015-16 నాటికి పేదరికం 18.47శాతం ఉంది. కమ్యూనిస్టులు అభివృద్ధికి దూరంగా ఉంచారన్న కేరళలో 0.7శాతమే ఉంది. పైన చెప్పుకున్న వ్యవధిలో దేశంలో 24.85శాతం దారిద్య్రాన్ని 14.96శాతానికి తగ్గించామని చంకలు కొట్టుకుంటున్న నరేంద్రమోడీ రెండింజన్ల గుజరాత్‌లో ఆ దామాషా ప్రకారం తగ్గించటంలో ఎందుకు విఫలమైనట్లు ? 18.47శాతంగా ఉన్న వారిని 11.66శాతానికి ఎందుకు పరిమితం చేశారు ? పోషకాహారం లేని వారు బీహార్‌లో 2019-21లో 42.2శాతం, రెండవదిగా ఉన్న జార్ఖండ్‌లో 40.32, మూడవదిగా ఉన్న గుజరాత్‌లో 38.09శాతం ఉన్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. గుజరాత్‌ జనాభాలో 2.44శాతానికి ఇప్పటికీ విద్యుత్‌, 23.3శాతానికి ఇండ్లు,11.37శాతానికి ఎలాంటి ఆస్తులు,4.4శాతానికి బాంకు ఖాతాలు లేవు. దేశంలో సగటున ఆరేండ్ల లోపు పిల్లల్లో 67.1, మహిళల్లో 15-49 ఏండ్ల మధ్యవయస్సుల వారిలో 57శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గుజరాత్‌లో దేశ సగటుకు మించి పిల్లల్లో 79.7, మహిళల్లో 65.1శాతం ఉన్నారు.దీనికి నరేంద్రమోడీ, ఆయనను పొగిడేవారు తలలెక్కడ పెట్టుకుంటారు.


నరేంద్రమోడీ ధరించే సూటు ధర రు.పదిలక్షలు. సాధారణ జనాల మాదిరి సంవత్సరాల తరబడి వేసుకుంటారా లేక తరచుగా మార్చివేస్తారో తెలియదు. 2016లో మోడీ ధరించిన ఒక సూట్‌ను వేలం వేస్తే సూరత్‌లోని ఒక ” పేదవాడు ” రు.4.3 కోట్లకు దక్కించుకున్నాడు. దాన్ని అహమ్మదాబాద్‌లోని జేడ్‌ బ్లూ అనే వస్త్రదుకాణ సంస్థలో కుట్టారని విలువ పది లక్షలని తేలింది. అప్పటి నుంచి మోడీ అంత ఖరీదుగల దుస్తులు ధరిస్తారని ప్రచారంలోకి వచ్చింది. పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీకి తన ప్రభుత్వం 60,80 ఏండ్లు దాటిన దారిద్య్రరేఖ దిగువన ఉన్న పేదలకు ఇస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మొత్తం తెలియదా ! లేక తన పాలనలో కనీసం కోడి గుడ్డంత బంగారం కూడా లేని పేదలు ఉండరన్న ధీమా కావచ్చు. యుపిఏ పాలనలో నిర్ణయించిన నెల పెన్షన్‌ రు.200,500 మాత్రమే ఇప్పటికీ నరేంద్రమోడీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడువేలు, తెలంగాణాలో రెండు వేలు, కేరళలో రు.1,600 ఇస్తున్నారంటే కేంద్రం ఇస్తున్న మొత్తాలకు అక్కడి ప్రభుత్వాలు తమ బడ్జెట్ల నుంచి అదనంగా జతచేసి ఇస్తున్నాయి. బిజెపి పాలనలోని మహారాష్ట్రలో రెండువందలకు మరో నాలుగు వందలు కలిపి ఇస్తున్నారు. వికీ పీడియా సమాచారం ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు అసోంలో 200-500, బీహార్‌ 400-500, గుజరాత్‌లో 750-1000, మధ్య ప్రదేశ్‌ 600-800, రాజస్తాన్‌లో 750-1000 ఇస్తున్నారు. పదేండ్ల అచ్చేదిన్‌ పాలనలో ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్క పైసా కూడా పెంచేందుకు మహానుభావుడు నరేంద్రమోడీకి చేతులు రాలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతలు రోడ్లు వేశాం, రేవులను అభివృద్ధి చేశాం అంటారు తప్ప పెన్షన్లు పెంచాం అనే మాట చెప్పరు..


పెన్షన్లు పెంచే ప్రతిపాదనేదీ లేదని 2023 డిసెంబరు ఆరవ తేదీన ఒక ప్రశ్నకు ( నం.429) కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. తాము ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని, కేంద్ర వాటా గురించి కూడా చెప్పాలని బిజెపి పెద్దలు కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దానికి తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెంత ఇస్తున్నారో జనానికి తెలియటం అవసరమేనని విజయన్‌ చెప్పారు. పెన్షన్‌ పధకాలకు 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు కేరళకు చెల్లించాల్సి 573 కోట్లను కేంద్రం నిలిపివేసినట్లు పైన పేర్కొన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరాలు చెబుతున్నాయి. పేదల పెన్షన్ల పట్ల ఇంత కఠినంగా ఉన్న మోడీ కావాలని రుణాలు ఎగవేసిన వారి పట్ల ఎంతో ఉదారంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో అడ్డగోలుగా రుణాలు ఇచ్చారని ఎదురుదాడి ఒకటి. వారి ఏలుబడిలో ఇస్తే తన పాలనలో వాటిని వసూలు చేయకూడదని ఎవరైనా అడ్డుపడ్డారా ? ఒక్క ముక్కలో చెప్పాలంటే యుపిఏ హయాంలో బాధ్యతారహితంగా కార్పొరేట్లకు అప్పులిస్తే మోడీ హయాంలో ఎగవేసిన వాటిని రద్దు చేసి వారి సేవలో తరించారు. అంతిమంగా జనం జేబులు గుల్ల. ఉచితాలకు తాను వ్యతిరేకం అని చెబుతున్న మోడీ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బాంకుల రుణాలను ఉదారంగా ఎలా రద్దు చేశారు ? ఇది ఖజానాను దెబ్బతీయదా ? రిజర్వుబాంకు సమాచారం ఆధారంగా బాంకుల్లో నిరర్ధక(బడా బాబులు ఎగవేసిన) ఆస్తులుగా పేర్కొన్న కొన్ని వివరాలు దిగువ చూడవచ్చు. అంకెలు రు.లక్షల కోట్లు.


పాలన××కాలం×××××× మొత్తం వాణిజ్య బాంకులు ×××××× ప్రభుత్వ రంగ బాంకులు
పాలన××××కాలం××××× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు ×× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు
యుపిఏ 1× 2004-09×× 1.55 ×× 1.39 ××0.08 ×× 1.08 ×× 1.12 ×× 0.02
యుపిఏ 2× 2009-14×× 5.76 ×× 3.24 ×× 0.55 ×× 4.80 ×× 2.64 ×× 0.32
మోడీ 1× 2014-19 ×× 19.79 ×× 5.99 ×× 6.40 ××15.90 ×× 4.52 ×× 5.05
మోడీ 2× 2019-21 ×× 7.79 ×× 2.74 ×× 4.46 ×× 5.17 ×× 1.74 ×× 3.12


ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? యుపిఏ పదేండ్లలో నిరర్దక ఆస్తులుగా తేలిన ప్రతి వంద రూపాయల్లో వసూలు రు.63.34 ఉండగా రద్దు చేసినది రు.8.62 కాగా, మోడీ ఏలుబడి 2014 నుంచి 2021వరకు వందకు వసూలు రు.31.65 కాగా రద్దు చేసిన మొత్తం రు.39.38. మొత్తం వాణిజ్య బాంకుల్లో రద్దు చేసిన మొత్తాలు 10.86 లక్షల కోట్లు కాగా వాటిలో ప్రభుత్వ బాంకుల వాటా 8.17లక్షల కోట్లు ఉంది. నరేంద్రమోడీ 2016లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంకరప్టసీ బోర్డు(ఐబిసి) అంటే దివాలా మరియు అప్పులు తీర్చలేని వారి కోసం ఏర్పాటు చేశారు.2022 జూన్‌ వరకు ఈ సంస్థకు నివేదించిన దానిలో ఆమోదించిన మొత్తాల విలువ రు.7.67లక్షల కోట్లు. దీనికి గాను వసూలు చేసింది 2.25లక్షల కోట్లు(30.6శాతం) మాత్రమే.దీన్ని జనం భాషలో చెప్పాలంటే ప్రతి లక్ష కోట్లకు బాంకులకు అయిన క్షవరం రు.67,000 కోట్లు.2014-15 నుంచి 2023 మార్చి నెల వరకు తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల 226 కోట్లని కేంద్ర మంత్రి గతేడాది ఆగస్టులో లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు.కాగా వసూలు చేసిన మొత్తం రు.7లక్షల 40వేల, 968కోట్లని కూడా వెల్లడించారు.ఇదంతా మోడినోమిక్స్‌లో భాగమే. నేను తినను ఇతరులను తిననివ్వను, ప్రతి పైసాకూ జవాబుదారీగా ఉంటానని చెప్పిన నరేంద్రమోడీ ఎవడబ్బ సొమ్మని లక్షల కోట్లు రద్దు చేసినట్లు రామచంద్రా ? స్వతంత్ర భారత చరిత్రలో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిన ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏముంది. అప్పనంగా రద్దు చేస్తే కార్పొరేట్లు కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది ? పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం. కొల్లగొడుతున్నది జనం సొమ్మేగా ! ఇంతగా సహకరిస్తున్నారు గనుకనే మూడో సారి కూడా మోడీనే రావాలని వేల కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించారు. తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. ఏ టీవీ ఛానల్లో అయినా ఈ తీరు తెన్నుల గురించి చర్చలను ఎవరైనా చూశారా ?


మోడీ పాలనలో బాంకుల అవినీతి వెల్లడైనా మీడియాకు పెద్దగా పట్టదు. తొలి ఎనిమిది సంవత్సరాల పాలనలో బాంకుల్లో జరిగిన అవినీతి కారణంగా మూడు లక్షల కోట్లు గల్లంతు కాగా వాటిలో ప్రభుత్వ రంగబాంకుల్లోనే 2.15లక్షల కోట్లు ఉంది, మూడు లక్షల కోట్లకు గాను తిరిగి వసూలు చేసింది కేవలం 33,646 కోట్లని 2021-22 సంవత్సరం వరకు ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారహక్కు సమాధానంలో చెప్పింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రు. 3.4లక్షల కోట్లు ప్రభుత్వ రంగబాంకులకు ఇచ్చి వాటిని నిలబెట్టింది. ఇదంతా జనం సొమ్ము కాదా ? 2008లో 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు సక్రమంగా వేలం వేయని కారణంగా రు.1.76లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్న కాగ్‌ నివేదిక దేశంలో ఎంత సంచలనం కలిగించిందో, కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఎలా తోడ్పడిందో తెలిసిందే. ఆ మొత్తం ఊహాజనితం, కేటాయింపు సక్రమంగా లేదు తప్ప అవినీతి జరగలేదని తరువాత కోర్టు ఆ కేసును కొట్టివేసింది.కానీ బాంకు రుణాల రద్దు అలాంటిది కాదు. వాస్తవం. ఒక సినిమాలో హీరోయిన్‌ రష్మిక మీకు అర్ధమౌతోందా అన్న ఊతపదాన్ని ఈ సందర్భంగా జనాలకు గుర్తు చేయాల్సి వస్తోంది.

కేరళ రాజకీయం : నరేంద్రమోడీ, రాహుల్‌ గాంధీ దిగజారుడు – పినరయి విజయన్‌ హుందాతనం !!

Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇతర ముఖ్యమంత్రులను వేటాడుతున్నట్లుగా బిజెపి కేరళ సిఎం పినరయి విజయన్‌ వెంట ఎందుకు పడటం లేదంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వయనాడు నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ప్రశ్నించారు. కాషాయ పార్టీని విమర్శించే దమ్ము సిపిఎంకు ఉందా అంటూ మాట్లాడారు.ఎల్‌డిఎఫ్‌-బిజెపి కుమ్మక్కై తమను దెబ్బతీసేందుకు చూస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఎల్‌డిఎఫ్‌-యుడిఎఫ్‌ మధ్య సంకుల సమరం సాగుతున్న కేరళలో గతంలో మాదిరి తమకు సీట్లు రావని భావిస్తున్న కాంగ్రెస్‌ ముందుగానే సాకులు వెతుకుతున్నట్లు ఈ ప్రచారం వెల్లడిస్తున్నది.నిజానికి సిపిఎంను దెబ్బతీసేందుకు గతంలో కాంగ్రెస్‌-బిజెపి అనేక చోట్ల కుమ్మక్కైన చరిత్ర ఆ పార్టీలకు ఉందని సిపిఎం అనేక సార్లు చెప్పింది. తమను విమర్శిస్తున్నంత తీవ్రంగా బిజెపిని వామపక్షాలు విమర్శించటం లేదని యుడిఎఫ్‌ ఆరోపిస్తోంది. ఇద్దరు మాజీ సిఎంల బిడ్డలు బిజెపిలో చేరి కాంగ్రెస్‌ను సవాలు చేస్తుంటే, అనేక మంది అటువైపు తొంగి చూస్తుంటే వారికి సమాధానం చెప్పలేని స్థానిక కాంగ్రెస్‌ నేతలు, రాహుల్‌ గాంధీ బిజెపిని వదలి సిపిఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నట్లు ? బిజెపి అభ్యర్ధిగా తన కుమారుడు పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారానికి వెళ్లటానికి మాజీ సిఎం ఎకె ఆంటోని ఆరోగ్యం బాగులేదని సాకు చెప్పారు. బిజెపిని గట్టిగా విమర్శిస్తే ఎవరి మీద ఏ ఇడి,ఐటి, సిబిఐని వదులుతారో అని కాంగ్రెస్‌ నేతలు భయపడుతున్నారు.మాజీ సిఎం కరుణాకరన్‌ కుమార్తె పద్మజ ఆ కారణంగానే బిజెపిలో చేరిన సంగతి తెలిసిందే.


” ఎవరైనా బిజెపిని విమర్శిస్తే వారు సిబిఐ, ఇడి,సభ్యత్వాల రద్దు, ఆస్తుల స్వాధీనాలతో ఎదురుదాడి చేస్తారని నాకు తెలుసు.ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే కేరళ సిఎం మీద బిజెపి ఎందుకు దాడి చేయటం లేదు. ఎందుకు ఆయన సంపదలను స్వాధీనం చేసుకోలేదు, ఎందుకు సిఎం పదవిని లాగివేయలేదు, కోర్టు కేసులు ఎందుకు పెట్టలేదు, ఇడి ద్వారా ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పటికే ఇద్దరు సిఎంలు జైల్లో ఉన్నతరువాత కూడా ఎందుకు అలా చేయలేదు ” అని బిజెపిని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. మతి తప్పి రాజకీయంగా దిగజారి మాట్లాడటం తప్ప మరొకటి కాదన్నది స్పష్టం.” ఇరవై నాలుగు గంటలూ తనను విమర్శిస్తున్న కేరళ ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న, ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న బిజెపిని ఎందుకు విమర్శించటం లేదు, కొద్ది సమయమైనా బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌, నరేంద్రమోడీని విమర్శించాలి కదా ” అని రాహుల్‌ ప్రశ్నించారు.రాహుల్‌ గాంధీ ఈ స్థాయికి దిగజారి ఎందుకు మాట్లాడారన్నది ప్రశ్న.పినరయి విజయన్‌ మీద తప్పుడు కేసులు పెట్టాలని మోడీకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది తప్ప మరొకటి కాదు.


కేరళ ఎన్నికలలో సిఏఏ, ఉమ్మడి పౌరస్మృతి అంశాల మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌ సిఏఏ అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు తిరస్కరించింది. ఈ రెండు అంశాలను ఎందుకు విస్మరిస్తున్నదని గురువారం నాడు మలప్పురం విలేకర్ల సమావేశంలో, అంతకు ముందు కూడా సిఎం పినరయి విజయన్‌ విమర్శించారు. సిఏఏ గురించి కాంగ్రెస్‌ న్యాయపత్రలో ప్రస్తావన లేదని చివరికి దీన్ని అమెరికా కూడా విమర్శించినా కాంగ్రెస్‌ మౌనంగా ఉందన్నారు. బిజెపిని సిపిఎం గట్టిగా విమర్శించటం లేదన్న కాంగ్రెస్‌ ఆరోపణ గురించి మాట్లాడుతూ ఈ అంశంలో తమకు కాంగ్రెస్‌ సర్టిఫికెట్‌ అవసరం లేదన్నారు. సిఏఏ వ్యతిరేక నిరసనల్లో ఎంత మంది కాంగ్రెస్‌ వారి మీద కేసులు నమోదయ్యాయో రాహుల్‌ గాంధీ చెప్పగలరా అని విజయన్‌ సవాల్‌ విసిరారు. సిఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కలసి కేరళ ప్రభుత్వం నిరసన తలపెడితే చివరిక్షణంలో కాంగ్రెస్‌ వెనక్కు తగ్గిందని, బహుశా అగ్రనేతల నుంచి వచ్చిన ఆదేశాల వల్ల కావచ్చని సిఎం అన్నారు.( జమ్మూలోని కథువాలో ఎనిమిదేండ్ల బాలిక మీద అత్యాచారం హత్య చేసిన ఉదంతం దేశంలో తీవ్ర సంచలన కలిగించిన సంగతి తెలిసిందే.) కథువా ఉదంతంలో నిందితులకు మద్దతుగా ప్రదర్శనలు చేసినవారిలో ఒకడైన బిజెపి నేత చౌదరి లాల్‌ సింగ్‌ను స్వయంగా రాహుల్‌ గాంధీ గత నెలలో కాంగ్రెస్‌లోకి ఆహ్వానించి ఇప్పుడు ఉధంపూర్‌ లోక్‌సభ అభ్యర్ధిగా నిలిపారని విజయన్‌ విమర్శించారు. సంఘపరివార్‌ను వ్యతిరేకించటంలో కాంగ్రెస్‌ గట్టి వైఖరి తీసుకోవటం లేదన్నారు. ఎన్నికల బాండ్ల కుంభకోణంలో బిజెపి ప్రధాన భాగస్వామిగా కాంగ్రెస్‌ రు.1,952 కోట్లు తీసుకొన్నదని అలాంటి పార్టీ నేత రాహుల్‌ గాంధీ ఇప్పుడు ఎన్నికల బాండ్ల గురించి లూటీ అంటూ కబుర్లు చెబుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ విమర్శించారు.వాటికి వ్యతిరేకంగా సిపిఎం కేసు వేసిన అంశాన్ని గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కుమార్తె వీణ నిర్వహిస్తున్న ఒక కంపెనీ అక్రమాలకు పాల్పడినట్లు ఒక కేసు నమోదైంది.దానిలో నిజానిజాలను ఆరోపించిన వారు వెల్లడించాలి, దాన్ని కోర్టు విచారించి తీర్పు చెప్పాలి. కానీ ఈ లోగానే దీన్ని రాజకీయం చేసేందుకు కాంగ్రెస్‌,బిజెపి చూస్తున్నాయి. మీడియా కూడా విజయన్‌న్ను రెచ్చగొట్టేందుకు చేయని యత్నం లేదు.” ఎన్నికల సమయం గనుక సిఎంను ఇబ్బంది పెట్టటం, మౌనంగా ఉండేట్లు చూడటం నరేంద్రమోడీ ఎత్తుగడ. కానీ సిఎం సవాలుగా తీసుకున్నారు.తన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తారని పినరయికి తెలుసు. కానీ పార్టీకోసం ఆయన సహించారు ” అని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడొకరు చెప్పినట్లు మళయాల మనోరమ పత్రిక రాసింది. తన కుమార్తె కంపెనీ మీద వచ్చిన ఆరోపణల గురించి త్రిసూరులో జరిపిన విలేకర్ల సమావేశంలో విజయన్‌ ఇచ్చిన సమాధానాలు విమర్శకుల నోటికి తాళం వేయటమే కాదు, ఆయన హుందాతనాన్ని వెల్లడిస్తున్నాయి.” ఒక కంపెనీ నుంచి సేవలు పొందినందుకు మరొక కంపెనీ ఇచ్చిన ఫీజు అంశమది. దాన్లో రహస్యమేమీ లేదు. అదంతా బాంకు ఖాతాల ద్వారానే జరిగింది.కంపెనీ దాఖలు చేసిన ఆదాయపన్ను పత్రాల్లో కూడా అది ప్రతిబింబించింది. దేశంలో కొత్త అంశమేమంటే పారదర్శకంగా జరిగిన లావాదేవీలను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవచ్చని నూతన సంప్రదాయాన్ని ప్రవేశ పెట్టారు. దాని గురించి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదు ” అన్నారు. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఆరోపణలు, చెప్పుకున్న గొప్పలను విలేకర్లు ప్రస్తావించగా వాటికి ఇచ్చిన సమాధానాలను చూద్దాం.


నరేంద్రమోడీ: డిపాజిటర్ల (కరువన్నూరు సహకార బాంకు) డబ్బు తిరిగి ఇచ్చినట్లు సిఎం అవాస్తవం చెబుతున్నారు.బాంకు నుంచి స్వాధీనం చేసుకున్న రు. 90 కోట్ల మొత్తాన్ని డిపాజిటర్లకు తిరిగి ఇవ్వటానికి అవకాశం ఉందా లేదా అని నేను ఇప్పటికే మాట్లాడాను.
విజయన్‌ : కరువన్నూరు డిపాజిటర్లకు రు.117 కోట్ల వరకు చెల్లించారు.డిపాజిటర్లు కోరితే ఇంకా ఇవ్వటానికి బాంకు సిద్ధంగా ఉంది.బిజెపి కోరుకుంటున్నట్లుగా బాంకు కుప్పకూలిపోలేదు.అది సాధారణ లావాదేవీలు నడుపుతున్నది.
నరేంద్రమోడీ : త్రిసూరు జిల్లా సిపిఎం కార్యదర్శికి వంద కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి.
విజయన్‌: స్థానిక శాఖల నుంచి జిల్లా కమిటీ కార్యాలయం వరకు జిల్లా అంతటా స్థలాలు, ఆఫీసులు ఉన్నాయి.వాటినే సిపిఎం జిల్లా కార్యదర్శి ఆస్తులని ప్రధాని చెప్పారు. ఇలాంటి అభాండాలు సిపిఎం వంటి పార్టీని దెబ్బతీయలేవు.
నరేంద్రమోడీ : సిపిఎం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది.
విజయన్‌: గత పది సంవత్సరాలలో బిజెపి నాయకత్వంలోని కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మీద అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి.తాజా అంశానికి వస్తే ఎన్నికల బాండ్ల కుంభకోణం. దీనికి అనేక కోణాలు ఉన్నాయి.ఇంత పెద్ద అవినీతి అసాధారణ రాజకీయ సంస్కృతిలో భాగం.
నరేంద్రమోడీ : పేదలకు మూడు కోట్ల ఇళ్లు మోడీ హామీ.
విజయన్‌ : 2022 నాటికి ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని 2019 ఎన్నికల ప్రణాళికలో బిజెపి చెప్పింది. ఈ హామీ ఏమైంది ? 2024 ప్రణాళికలో దీని గురించి మౌనం దాల్చారు. ఇక్కడ కేరళ పని తీరును చూడవచ్చు. ఇల్లులేని వారు ఎవరూ ఉండకూడదు అన్న లక్ష్యాన్ని చేరుకొనేందుకు దగ్గరగా ఉన్నాం. ఇప్పటికే 4.56 లక్షల ఇండ్లు పూర్తయ్యాయి. మరో 1.52లక్షల ఇళ్ల పని పురోగతిలో ఉంది.
నరేంద్రమోడీ : సాధించిన విజయాలుగా చెప్పుకొనేందుకు ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం దగ్గర ఏమీ లేదు. కేంద్ర పధకాలనే తన గొప్పలుగా చెప్పుకొంటోంది.
విజయన్‌ : గృహ నిర్మాణంలో కేంద్ర పాత్ర ఏమిటో విశ్లేషిద్దాం.పిఎంఏవై(గ్రామీణ) పధకం కింద 33,517 ఇళ్లకు ఒక్కోదానికి రు.72,000 మంజూరు చేసింది.పిఎంఏవై(పట్టణ) పధకం కింద ఒక్కోదానికి రు.1.5లక్షల చొప్పున 83,261 ఇళ్లకు మంజూరు చేసింది. కేరళ లైఫ్‌ మిషన్‌ పధకం కింద ఇప్పటికి దాదాపు ఐదు లక్షల ఇండ్లకు గాను రు.17,490 కోట్లు ఖర్చు చేశాము. వీటిలో కేంద్రం నుంచి వచ్చింది కేవలం రు.2,081 కోట్లు, మొత్తంలో కేవలం 11.9శాతం మాత్రమే.


కేరళ లోక్‌సభ ఎన్నికలు ఈనెల 26న జరగనున్నాయి.దేశమంతటా ముస్లింలు, క్రైస్తవుల మీద విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కాషాయ దళాలు కేరళలో క్రైస్తవుల ఓట్ల కోసం చర్చీల చుట్టూ తిరుగుతున్నాయి.లవ్‌ జీహాద్‌ పేరుతో ముస్లింల మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నాయి. 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు.వ్రతం చెడ్డా భంగపడ్డారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి 48.48శాతం, 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి 36.29శాతం, 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి 15.64శాతం, 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో కింగ్‌ మేకర్‌గా మారి తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్కసీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఈ సారి మరోసారి ఓటర్లను మభ్య పెట్టేందుకు పూనుకుంది.

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు : మధ్య ప్రాచ్యానికి యుద్ధ ముప్పు !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


సామ్రాజ్యవాదుల కుట్రల కారణంగా మధ్యప్రాచ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్థితి. గిల్లి కజ్జాలు పెట్టుకొని ఇరాన్ను రెచ్చగొట్టి యుద్దంలోకి లాగాలని చూస్తున్నారు. దానిలో భాగమే సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఏప్రిల్‌ ఒకటిన జరిపిన ఆకస్మికదాడి. ఇజ్రాయెల్‌ అక్కడ ఉన్న ఏడుగురు ఇరాన్‌ మిలిటరీ అధికారులను హత్య చేసింది.దానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్‌ ఏప్రిల్‌ 13 శనివారం రాత్రి మూడు వందల క్షిపణులు, డ్రోన్లతో దాడిచేసింది. దీనికి తగు సమయంలో స్పందిస్తామని, తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని సోమవారం నాడు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అలాంటి దాడులే జరిపితే క్షణాల్లో ప్రతిదాడులకు తెగబడతామని, గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆయుధాలను రంగంలోకి తెస్తామని ఇరాన్‌ హెచ్చరించింది. ఒకవేళ యూదు దురహంకారులకు మద్దతుగా అమెరికా ప్రత్యక్ష పోరులో పాల్గొంటే తాము కూడా దిగుతామని రష్యా హెచ్చరించింది. ఇరాన్‌ దౌత్యకార్యాలయంపై దాడి గురించి అసలు తమకు తెలియదని, దానితో సంబంధం లేదని ప్రకటించిన అమెరికా ఇజ్రాయెల్‌ దాడి గురించి భిన్నవైఖరి తీసుకుంది.ఇరాన్‌ ముందుగా ఎలాంటి హెచ్చరిక చేయలేదని, తాము ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తామని జో బైడెన్‌ వెంటనే ప్రకటించాడు. అయితే తాము నేరుగా దాడుల్లో పాల్గొనబోమని చెప్పినట్లు వార్తలు.అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అన్నట్లుగా అమెరికా, ఇతర పశ్చిమదేశాల మాటలను నమ్మలేము. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ దాడులను చూసినపుడు రాజకీయ కోణంతో పాటు ఆయుధపాటవాన్ని పరీక్షించుకోవటం కూడా కనిపిస్తున్నది. పశ్చిమ దేశాలను యుద్ధంలోకి దింపేందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు వలపన్నుతున్నాడని ఒక వైపు ఇరాన్‌పై పరిమిత దాడులకు ఇజ్రాయెల్‌ పధకం వేస్తున్నదని అమెరికా భావిస్తున్నట్లు మరోవైపు వార్తలు వచ్చాయి.


దాడులు, ప్రతిదాడుల వెనుక ఉన్న కారణాలు తెలిసినప్పటికీ ఇతర అంశాల మీద కూడా విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాలు ఆత్మరక్షణ, ఎదురుదాడుల బలాబలాలను సరి చూసుకుంటున్నట్లు చెప్పటం వాటిలో ఒకటి. ఇటు ఇరాన్‌ అటు అమెరికా కూడా పూర్తిస్థాయి పోరుకు సిద్దంగా లేవని, అయితే అమెరికా, ఇతర పశ్చిమ దేశాల నుంచి మరింత సాయం పొందేందుకు ఇజ్రాయెల్‌ వివాదాన్ని రెచ్చగొడుతున్నదని, నివారించలేని స్థితిలో అమెరికా ఉందని చెబుతున్నారు. తన సత్తాను చూపేందుకు ఇరాన్‌ గరిష్టంగా ఆయుధ ప్రయోగం చేయగా, వాటిని తట్టుకొనేందుకు పశ్చిమ దేశాలు తనకు కల్పించిన రక్షణ వ్యవస్థ ఎలా ఉందో ఇజ్రాయెల్‌ పరీక్షించుకుంది. రెండు దేశాలకూ ఉన్న పరిమితులను వెల్లడించాయి. మా దెబ్బేమిటో చూడండని కేవలం రుచిచూపేందుకు మాత్రమే ఇరాన్‌ దాడి పరిమితం కాలేదు. పశ్చిమ దేశాలు తమను కాపాడతాయని భావించినప్పటికీ కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్‌ ప్రాంతాలను తాకాయి. కనీసం తొమ్మిది క్షిపణులు రక్షణ వలయం నుంచి తప్పించుకున్నాయని, ఐదు నెవాటిమ్‌ అనే వైమానిక స్థావరం మీద పడి సి-130 రకం రవాణా విమానాన్ని, రన్‌వేను, ఖాళీగా ఉన్న గోదామును ధ్వంసం చేసినట్లు, మరో నాలుగు వేరే వైమానిక స్థావరం మీద పడినట్లు వార్తలు వచ్చాయి. సహజంగానే నష్టాన్ని తక్కువగా చూపేందుకు, అసలేమీ జరగలేదని చెప్పేందుకూ చూస్తారన్నది తెలిసిందే. క్షిపణులను మధ్యలోనే కూల్చివేసే ఏరో-3 అనే ఆధునిక వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేశారని, దాన్ని తప్పించుకొని తొమ్మిది క్షిపణులు రావటం ఇజ్రాయలీలను ఆందోళనకు గురిచేస్తున్నట్లు చెబుతున్నారు. దాడి గురించి తాము నాలుగు రోజుల ముందే అమెరికాతో సహా ఇరుగు పొరుగుదేశాలన్నింటినీ హెచ్చరించామని ఇరాన్‌ ప్రకటించింది. బహుశా ఈ కారణంగా విమానాలు, ఇతర ఆయుధాలను వైమానిక స్థావరాల నుంచి వేరే చోటికి ఇజ్రాయెల్‌ తరలించి ఉండవచ్చు.


ఇజ్రాయెల్‌ రక్షణ దళాల ప్రతినిధి వెల్లడించిన సమాచారం ప్రకారం ఇరాన్‌ ప్రయోగించిన వాటిలో 170డ్రోన్లు,120క్షిపణులు ఉన్నాయి, ఇరాన్‌, ఇరాక్‌, ఎమెన్‌,లెబనాన్ల నుంచి 350 రాకెట్లను వదిలారు. నాలుగు గంటల పాటు దాడి జరిగింది. రెండు దేశాల మధ్య 1,600 కిలోమీటర్ల దూరం ఉంది. తూర్పు మధ్యధరా సముద్రంలోని తమ యుద్ధ నౌకలు నాలుగు నుంచి ఆరు క్షిపణులు, 70డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా అధికారులు చెప్పారు.దాడి జరిగిన తరువాత జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ నేత నెతన్యాహుతో మాట్లాడుతూ మద్దతుగా ఉంటాం తప్ప ఇరాన్‌ మీద జరిపే ఏ దాడిలోనూ తాము ప్రత్యక్షంగా పాల్గనేది లేదని చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.ఆదివారం నాడు జి7 దేశాల ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సులో సమావేశమై ఇరాన్‌ దాడిని ఖండించారు. ఈ చర్య అదుపు చేయలేని పరిస్థితికి దారితీస్తుందని హెచ్చరించారు. ఆదివారం నాడు సమావేశమైన ఇజ్రాయెల్‌ యుద్ధ మంత్రివర్గం ఎలా స్పందించాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.సోమవారం నాడు కూడా తీవ్ర తర్జనభర్జనలు జరిపింది.పరిస్థితి మరింత విషమించకుండా చూడాలని బైడెన్‌ ప్రకటించటం, ప్రతి దాడికి అవసరమైన ఎత్తుగడలను రచించేందుకు సమయం తీసుకొనేందుకు, అమెరికా మీద మరింత వత్తిడి పెంచేందుకు వ్యవధి తీసుకుంటున్నట్లు, ఇజ్రాయెల్‌కు తాము కల్పించిన రక్షణ కవచం పనితీరును పశ్చిమదేశాలు సమీక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. నెపం ఎవరి మీద, ఎలా నెట్టాలన్నది కూడా ఆలోచించటం సహజమే.


ప్రధాని నెతన్యాహు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని ఇజ్రాయెల్‌ మిలిటరీ అధిపతి హెర్జీ హల్‌వెల్‌ చెప్పగా, ఏవైనా ప్రతిదాడులు జరిగితే క్షణాల్లో స్పందిస్తామని ఇరాన్‌ ఉపవిదేశాంగ మంత్రి అలీ బగేరీకాన్‌ చెప్పాడు. తన సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటూ పరిస్థితి చేయిదాటకుండా ఇరాన్‌ వ్యవహరించగలదని చైనా ఆశాభావం వ్యక్తం చేసింది.పరిస్థితి మరింతగా దిగజారటం ఎవరికీ మంచిది కాదని రష్యా పేర్కొన్నది. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవటం లేదని, ఎప్పుడు, ఎలా స్పందించాలన్నది నిర్ణయించుకోవాల్సింది ఇజ్రాయిలేనని అమెరికా చెప్పింది.సిరియాలోని ఇరాన్‌ రాయబారకార్యాలయంపై చేసిన దాడిని తాము సమర్దిస్తున్నట్లు బ్రిటన్‌ పేర్కొన్నది.ఇజ్రాయెల్‌పై దాడి తరువాత మరిన్ని ఆంక్షల గురించి ఆలోచిస్తున్నట్లు బ్రిటన్‌ విదేశాంగ మంత్రి చెప్పాడు. గత రెండు రోజులుగా ఇజ్రాయెల్‌ మీదుగా ప్రయాణించే విమానాలను అనేక సంస్థలు వేరే మార్గంలో నడుపుతున్నాయి.భద్రతా కారణాల రీత్యా ఇరాన్‌ తన అణుకేంద్రాలను ఆదివారం నాడు మూసివేసింది. వాటిపై ఇజ్రాయెల్‌ దాడి జరపవచ్చని అంతర్జాతీయ అణుఇంథన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెస్‌ గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా మధ్యవర్తిత్వంలో ఇరాన్‌-సౌదీ అరేబియా సాధారణ సంబంధాలను నెలకొల్పుంటున్న సంగతి తెలిసిందే. దాని చెడగొట్టేందుకు తప్పుడు సమాచారాన్ని వ్యాపింపచేస్తున్నారు. ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను మధ్యలో కొన్నింటిని సౌదీ అరేబియా అడ్డుకున్నదంటూ ఇజ్రాయెల్‌ మీడియా సంస్థలు కొన్ని వార్తలను అల్లాయి.ఈ వార్తలను సౌదీ వర్గాలు ఖండించాయి.


మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలను వ్లదిమిర్‌ పుతిన్‌ తనకు అనుకూలంగా మార్చుకోవచ్చని కొందరు విశ్లేషకులు పశ్చిమదేశాలకు హితవు చెప్పారు.బహుశా ఈ అంశం అమెరికా దృష్టిలో ఉన్న కారణంగానే తొందరపడవద్దని ఇజ్రాయెల్‌కు సలహా ఇచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పశ్చిమ దేశాల దృష్టి మధ్య ప్రాచ్యంవైపు మళ్లితే ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఉక్రెయిన్ను చావు దెబ్బతీయటం మరింత సులభం అవుతుంది.ఇప్పటికే ఉక్రెయిన్‌ విద్యుత్‌ వ్యవస్థ నాశనానికి రష్యా దాడులు జరుపుతున్నది. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తమ వనరులన్నింటినీ ఇరాన్‌ మీద కేంద్రీకరిస్తే అమెరికా నాటోలోని తన అనుయాయి దేశాలకు భద్రత కల్పించలేదన్న భావన మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు అందించాల్సిన అమెరికా సాయం ఆలశ్యం అయిందన్న అభిప్రాయం ఉంది.దాదాపు ఆరునెలల క్రితం ప్రకటించిన 60బిలియన్‌ డాలర్ల సహాయం గురించి ఇంతవరకు పార్లమెంటు ఖరారు చేయలేదు. మరోవైపు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్‌ బంధం మరింత పటిష్టం అవుతుంది. మధ్య ప్రాచ్యం, పశ్చిమాసియాలో రష్యా ప్రభావం మరింతగా పెరుగుతుంది. ఇప్పటికే రష్యా అందించిన సాంకేతిక పరిజ్ఞానంతో ఇరాన్‌ తయారు చేసిన డ్రోన్లను ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఎత్తుగడలు, లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ సమస్యలు కూడా ఉన్నాయి.బింకంగా మాటలు చెప్పవచ్చు, ప్రకటనలు ఎలా ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ వెంటనే స్పందించకపోవటానికి దాని మీద ఉన్న వత్తిడి ఒక కారణం. ఎన్నికల్లో ఉన్న బైడెన్‌కు ఇప్పుడు పూర్తిస్థాయి పోరు నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆరునెలలు దాటినా సాధారణ పౌరులపై మారణకాండ, గాజాలో విధ్వంసకాండ సాగించటం తప్ప బందీలుగా ఉన్న తమవారిని విడిపించుకోలేకపోయింది. రోజు రోజుకూ ఈ అంశం వత్తిడి పెంచుతున్నది. హమస్‌ సాయుధులను అణచివేస్తామన్న మాటలు ప్రగల్భాలుగానే ఉన్నాయి. యుద్ధం అంటూ మొదలైతే ఇజ్రాయెల్‌ మీద రెండు మూడు వైపుల నుంచి దాడులు జరుగుతాయి. ఇరాన్‌పై ప్రతిదాడుల అంశంలో ఇజ్రాయెలీ యుద్ధ మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయి.


ఉక్రెయిన్‌ సంక్షోభం నుంచి గౌరవ ప్రదంగా ఎలా బయటపడాలో తెలియని పశ్చిమ దేశాలు 194 రోజుల గాజా మారణకాండ తరువాత తదుపరి ఏమిటన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి.ఇప్పటి వరకు 33,843 మంది మరణించగా, 76,575 మంది గాయపడ్డారు. ఇరాన్‌ దాడులు జరిపిన వెంటనే ఇజ్రాయెల్‌ వైమానిక దళం దక్షిణ లెబనాన్‌లోని హిజబుల్లా స్థావరాలపై ప్రతిదాడులు జరిపింది. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న జోర్డాన్‌ పాలకులకు వ్యతిరేకంగా అక్కడ ప్రదర్శనలు జరుగుతున్నట్లు వార్తలు మొత్తంగా చూసినపుడు రెండు దేశాలూ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయి, వాటికి మద్దతుగా ఉన్న దేశాల పాత్ర ఎలా ఉంటుంది అనే అంశాలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.ఐరోపా దేశాలు కూడా ప్రతిదాడులు వద్దని ఇజ్రాయెల్‌ను కోరాయి. ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు రావాల్సిన అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌ వాయిదావేసుకున్నారు. తమ రాయబార కార్యాలయం మీద జరిగిన దాడికి ప్రతిగా ఇరాన్‌ స్పందించి ఒక దాడితో ముగించింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్‌ తెగబడితే అది అంతటితో ఆగదు అని వేరే చెప్పనవసరం లేదు.

కుక్క కాటుకు చెప్పుదెబ్బ : కేరళ స్టోరీకి పోటీగా మణిపూర్‌ చిత్రం !

Tags

, , , , , , ,


ఎం కోటేశ్వరరావు


కేరళలో ఈనెల 26న జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో సాధించిన విజయం కొనసాగింపుగా పైచేయి సాధించాలని సిపిఎం నాయకత్వంలోని ఎల్‌డిఎఫ్‌ చూస్తుండగా 2019 పార్లమెంటు ఎన్నికలలో వచ్చిన సీట్లను నిలుపుకోవాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ కూటమి ప్రయత్నిస్తోంది. ఏదో ఒక సీటు సాధించి రాష్ట్రంలో తమకూ స్థానం ఉందని పరువు నిలుపుకొనేందుకు బిజెపి చూస్తోంది. జనసంఘం తరువాత బిజెపిగా ఉన్న పార్టీకి గతంలో ఒకసారి ఒక అసెంబ్లీ స్థానం రావటం తప్ప కేరళ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభ ద్వారా కేరళ బిజెపి నేతలు ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఒక స్థానాన్ని కూడా కోల్పోయింది. ఈ ఎన్నికలలో అనూహ్యంగా కేరళ స్టోరీ పేరుతో వచ్చిన ఒక సినిమాను సంఘపరివార్‌ ప్రోద్బలంతో క్రైస్తవ మతాధికారులు ప్రదర్శిస్తున్నారు. లవ్‌ జీహాద్‌ పేరుతో కాషాయ దళాలు ముందుకు తెచ్చిన కుట్ర సిద్దాంతంతో కూడా కూడిన ఊహాజనిత చిత్రమే అది.ముస్లిం యువకులు హిందూ, క్రైస్తవ మతాలకు చెందిన యువతులకు వలపు వలవేసి మతమార్పిడికి చూస్తున్నారన్నదే ఆ చిత్ర కథ. ఇటీవల బిజెపి వైపు మొగ్గిన కొందరు క్రైస్తవ మతపెద్దలు తమ మతానికి చెందిన యువతులను హెచ్చరించే పేరుతో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీన్ని దూరదర్శన్‌లో కూడా ఇటీవల ప్రదర్శించారు. దీంతో ఎంత మంది బిజెపికి ఓటు వేస్తారో తెలియదు. దీనివెనుక ఉన్నవారు ఊహించని విధంగా అదే క్రైస్తవ మతానికి చెందిన వారు మణిపూర్‌లో క్రైస్తవ గిరిజనుల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాల ఉదంతాలతో రూపొందించిన ” అణచివేతకు గురైనవారి ఆక్రందన ”( క్రై ఆఫ్‌ ద అప్రెస్‌డ్‌) పేరుతో రూపొందించిన ఒక డాక్యుమెంటరీని పోటీగా ప్రదర్శిస్తున్నారు. కేరళలో 18శాతం మంది క్రైస్తవమతాన్ని అవలంభించే జనం ఉన్నారు. ముస్లింలు 26.6శాతం ఉన్నారు. మణిపూర్‌లో కుకీ తదితర గిరిజనుల మీద దాడులు జరుగుతున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ ఒక్కసారి కూడా ఆ రాష్ట్రాన్ని సందర్శించి బాధితులకు ఊరటగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి హిందూమతానికి చెందిన మెయితీలకు మద్దతుగా ఉందనే విమర్శలు ఉన్నాయి.


కమ్యూనిజం, కమ్యూనిస్టు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసి కేరళలో మెజారిటీ క్రైస్తవుల ఓట్లు పొందటంలో గతంలో కాంగ్రెస్‌ ఎత్తుగడలు పారాయి. తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. అనేక చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు బిజెపి కూడా రంగంలోకి దిగి వారిని సంతుష్టీకరించేందుకు చర్చీల చుట్టూ చక్కర్లు కొడుతున్నది.కేరళ స్టోరీ చిత్రాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటున్నది. అర్‌ఎస్‌ఎస్‌ అజెండాలో భాగంగానే అధికారాన్ని దుర్వినియోగం చేసి దూరదర్శన్‌లో కేరళ స్టోరీ చిత్రాన్ని ప్రదర్శించినట్లు సిపిఎం, కాంగ్రెస్‌ రెండూ విమర్శించాయి.తమకేమీ సంబంధం లేదని బిజెపి బుకాయించింది. ఓట్ల కోసం కమలనాధులు దేనికైనా సిద్దపడుతున్నారు. కేరళలో 2019లో ఇరవై స్థానాలకు గాను కేవలం ఒక్కచోటే సిపిఎం గెలిచింది. ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఎల్‌డిఎఫ్‌ సమర్ధించింది. దానికి తోడు కేంద్రంలో రెండవసారి నరేంద్రమోడీ అధికారంలోకి రాకుండా ఉండాలంటే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగింది కాంగ్రెస్‌ మాత్రమే అని జనం నమ్మటం, వయనాడు నుంచి పోటీ చేస్తున్న రాహుల్‌ గాంధీ గెలిస్తే ప్రధాని అవుతారన్న ప్రచారం కాంగ్రెస్‌ గెలుపుకు దోహదం చేశాయి. తరువాత 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల వివాదం ఎలాంటి ప్రభావం చూపలేదు. కేంద్రంలో బిజెపికి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో సిపిఎం, సిపిఐ కూడా భాగస్వాములుగా ఉండటంతో ఎవరు గెలిచినా బిజెపిని వ్యతిరేకించే వారే గనుక గతంలో మాదిరి బిజెపిని గట్టిగా వ్యతిరేకించే ముస్లింలు కాంగ్రెస్‌ వైపు మొగ్గుచూపే అవకాశం లేదని, ఎవరు గట్టిగా నిలబడతారని భావించే వారికి ఓటు వేయనున్నారని సాధారణంగా కమ్యూనిస్టులను వ్యతిరేకించే ప్రముఖ పత్రిక మళయాళ మనోరమ ఒక సమీక్షలో పేర్కొన్నది.


ముందే చెప్పినట్లు 2019లో జరిగిన ఎన్నికలలో శబరిమల వివాదం మీద కమ్యూనిస్టు వ్యతిరేకతను పెద్ద ఎత్తున రెచ్చగొట్టారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమికి (48.48శాతం) 96,29,030 ఓట్లు, 19 సీట్లు వచ్చాయి. ఎల్‌డిఎఫ్‌ కూటమికి (36.29శాతం) 71,56,387 ఓట్లు, ఒక సీటు వచ్చింది. బిజెపి కూటమికి (15.64శాతం) 31,71,792 ఓట్లు వచ్చాయి. తరువాత రెండు సంవత్సరాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్‌కు 1,05,55, 516 ఓట్లు(45.43శాతం), కాంగ్రెస్‌ కూటమికి 81,96,813 ఓట్లు(39.47శాతం) రాగా బిజెపి కూటమి ఓట్లు 23,54,468(12.41శాతం) వచ్చాయి. నరేంద్రమోడీ రెండవసారి మరింత బలంగా అధికారానికి వచ్చారని, తమ బలం పెరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో 35 సీట్లతో తాము అధికారానికి వస్తున్నట్లు బిజెపి ప్రచారం చేసుకుంది. అంతకు ముందు ఉన్న ఒక్క సీటూ పోయింది. 2016 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే 2.55శాతం, 2019 పార్లమెంటు ఎన్నికలతో పోల్చితే 3.23శాతం ఓట్లు కోల్పోయింది. ఇప్పుడు ఐదు సీట్లు తెచ్చుకుంటామని, పదేండ్లలో రాష్ట్రంలో అధికారానికి వస్తామని బిజెపి నేత ప్రకాష్‌ జవదేకర్‌ చెబుతున్నారు. గతంలో నరేంద్రమోడీ పలుకుబడి, శబరిమల వివాదంపై రెచ్చగొట్టుడు దానికేమీ లాభించలేదు.


శైలజా టీచర్‌పై ముగ్గురు శైలజల పోటీ ! సిఏఏ ప్రస్తావనకు భయపడిన కాంగ్రెస్‌ !!
కేరళ లోక్‌సభ ఎన్నికలు మొత్తంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ సిపిఎం అభ్యర్ధిగా వడకర స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రస్తుత ఎంఎల్‌ఏ కె కె శైలజ టీచర్‌ మీద అదే పేరు గలిగిన ముగ్గురు స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ తరఫున పాలక్కాడ్‌ ఎంఎల్‌ఏ షఫీ పరంబి రంగంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు చోట్ల ఎల్‌డిఎఫ్‌ ప్రతినిధులు గెలిచారు. కన్నూరు లోక్‌సభ పరిధిలోని మట్టనూర్‌ అసెంబ్లీ నుంచి కెకె శైలజ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 61వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తాము అధికారంలోకి వస్తే వివాదాస్పద సిఏఏ(చట్టం)ను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్‌ తన ఎన్నికల ప్రణాళికలో దాని ఊసెత్తలేదు. ప్రశ్నించిన విలేకర్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సతీశన్‌ ఇంకేదైనా ప్రశ్న ఉండే అడగండని సమాధానాన్ని దాటవేశారు. పిసిసి తాత్కాలిక అధ్యక్షుడు ఎంఎం హసన్‌ మాట్లాడుతూ మేము అ చట్టాన్ని రద్దు చేయాలని ఆసక్తితో ఉన్నాం అయితే సిపిఎంను మెప్పించేందుకు దాన్ని మానిఫెస్టోలో చేర్చాల్సిన అవసరం లేదు. మార్క్సిస్టులు చెప్పినట్లు మానిఫెస్టోను రాయాల్సిన అవసరం లేదన్నారు.


కుక్కలా మొరుగుతున్నారని తండ్రిని తూలనాడిన కొడుకు !
పత్తానంతిట్ట నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు ఓడిపోవటం ఖాయమని, అక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ గెలుస్తుందని కేరళ మాజీ సిఎం ఏకె ఆంటోనీ చెప్పారు.కుటుంబం-రాజకీయాలు వేరు వేరని తాను తొలి నుంచి చెబుతున్నానని తన పిల్లల గురించి ఎక్కువగా అడగవద్దని అన్నారు. కాంగ్రెస్‌ నేతల పిల్లలు బిజెపిలో చేరటం తప్పిదమన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా పత్తానంతిట్ట ప్రచారానికి వెళ్లటం లేదని అన్నారు. కేరళలో శబరిమల సమస్య ముగియటంతో బిజెపి స్వర్ణయుగం ముగిసిందని అన్నారు. తన తండ్రి చేసిన వ్యాఖ్యలపై కుమారుడు అనిల్‌ ఆంటోనీ స్పందిస్తూ గాంధీ కుటుంబం కోసం నిలబడుతున్నవారిని చూసి విచారిస్తున్నానని, కాలం చెల్లిన నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారని, చంద్రుడిని చూసి కుక్కలు మొరిగినట్లుగా ఈ నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తండ్రి పట్ల అనిల్‌ అంటోనీ కాస్త మర్యాదను చూపాలని తిరువనంతపురం కాంగ్రెస్‌ అభ్యర్ధి శశిధరూర్‌ సలహా ఇచ్చారు. బిజెపి నేతల భాషతో తాను పోటీపడలేనన్నారు.


బిజెపి ప్రచార తీరు ఇదా !
వయనాడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ పోటీ చేస్తుండగా ఎల్‌డిఎఫ్‌ అభ్యర్ధిగా సిపిఐ జాతీయ మహిళానేత అన్నీ రాజా బరిలో ఉన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు.తాను గెలిస్తే నియోజకవర్గంలోని సుల్తాన్‌ బాతరీ పేరును గణపతి వట్టం అని మారుస్తానని ప్రచారం చేస్తున్నారు. టిప్పు సుల్తాన్‌ ఈ ప్రాంతంలోని ఒక పాడుపడిన జైన ఆలయంలో తన ఫిరంగులను ఉంచి బ్రిటీష్‌ వారి మీద యుద్ధం చేశాడు. దాంతో బ్రిటీష్‌ వారు ఆ ప్రాంతాన్ని సుల్తాన్‌ బ్యాటరీ అని పిలిచారని తరువాత అదే సుల్తాన్‌ బాతరీగా మారిందని చెబుతున్నారు. అక్కడ ఒక చిన్న గణపతి ఆలయం ఉందని, అందువలన గణపతి వట్టం అని కూడా పిలిచారని కొందరు చెబుతారు. ఇది టిప్పు సుల్తాన్‌ ప్రాంతం కాదు గనుక గణపతివట్టంగా పేరు మార్చాలని బిజెపి నేత చెప్పారు. ఎన్నికల్లో చెప్పుకొనేందుకు ఏమీలేక బిజెపి జోకులు పేలుస్తోందని కాంగ్రెస్‌ నేతలు కొందరు అపహాస్యం చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ వివాదం : చైనా పేర్లు ఎందుకు మార్చుతున్నది, అమెరికా ఆడుతున్న నాటకం ఏమిటి ?

Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.

ఆరు నెలల ఇజ్రాయెల్‌ మారణకాండ ! పాలస్థీనియన్ల ప్రతిఘటన !!

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


2023 అక్టోబరు ఏడు నుంచి పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో యూదు దురహంకారులు జరుపుతున్న మారణకాండ, దానికి పాలస్థీనియన్ల ప్రతిఘటనకు ఆరు నెలలు దాటింది. అమెరికా, ఇతర పశ్చిమదేశాల దన్ను చూసుకొని గాజాలో సాగిస్తున్న హత్యలు, విధ్వంస కాండ ఎప్పుడు, ఎలా ముగుస్తుందో తెలియదు.ఈ దారుణాన్ని నివారించలేని పనికిమాలిన సంస్థగా ఐరాస పేరుతెచ్చుకుంది.ఎన్ని కబుర్లు చెప్పినా ఆచరణకు వచ్చేసరికి న్యాయం వైపు ఎవరు నిలిచారో, అన్యాయం, అక్రమాలను ఎవరు సమర్ధిస్తున్నారో లోకానికి వెల్లడైంది.ఇజ్రాయెల్‌ జరుపుతున్న మారణకాండకు మద్దతు ఇస్తున్న జర్మనీపై అత్యవసరంగా ఆంక్షలు విధించాలని అంతర్జాతీయ కోర్టులో వామపక్ష నేత డేనియల్‌ ఓర్టేగా అధ్యక్షుడిగా ఉన్న లాటిన్‌ అమెరికాలోని నికరాగువా దాఖలు చేసిన పిటీషన్‌పై హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. మారణకాండకు మద్దతు ఇవ్వటమేగాక పాలస్థీనా నిర్వాసితులకు సాయం చేస్తున్న ఐరాస సంస్థకు జర్మనీ నిధులను నిలిపివేసిందని కూడా నికరాగువా పేర్కొన్నది. తక్షణమే గాజాలో దాడులను విరమించాలని, యుద్ధం, నేరాలకు జవాబుదారీ ఎవరో తేల్చాలని తాజాగా ఐరాస మానవహక్కుల మండలిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే ఓటింగ్‌ నుంచి మనదేశం, మరోపన్నెండు తప్పుకున్నాయి.చైనాతో సహా 28 దేశాలు అనుకూలంగా, అమెరికాతో పాటు మరో ఆరు వ్యతిరేకంగా ఓటు వేశాయి. విశ్వగురువులం కదా ! మనం ఎటున్నట్లు ? మానవహక్కుల రక్షణకా భక్షణకా ? బేటీపడావో బేటీ బచావో అని చెప్పిన పెద్దలకు గాజాలో మరణిస్తున్నవారిలో 70శాతం మంది పిల్లలు, మహిళలు ఉన్న సంగతి తెలియదా ? ఈ దారుణాలకు పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను నిలదీసేందుకు ఎందుకు నోరు రావటం లేదు ? ముస్లిం వ్యతిరేకత తప్ప ఎవరిని సంతుష్టీకరించేందుకు ఈ వైఖరి ?


గాజాలో జరుగుతున్నదేమిటి ? తమ మాతృదేశ పునరుద్దరణ జరగాలన్న పాలస్థీనియన్ల అణచివేత తప్ప మరొకటి కాదు. ఎవరు చేస్తున్నారు ? సామ్రాజ్యవాదుల మద్దతుతో వారి చేతిలో పావుగా ఉన్న ఇజ్రాయెల్‌, అంటే సామ్రాజ్యవాదులే దాడి కారకులు.చరిత్రలో వారు చేసిన దాడులన్నీ దారుణాలుగా నమోదయ్యాయి. అందుకు అత్యంత దుర్మార్గ ఉదాహరణ 1968 మార్చి 15వ తేదీన వియత్నాంలోని మై లాయి ఊచకోత. విలియం కాలే అనే అధికారి ఉత్తరువుల మేరకు ఎర్నెస్ట్‌ మెదీనా అనే అమెరికన్‌ కెప్టెన్‌ కదులుతున్న ప్రతిదాన్నీ అంతం చేయమని ఆదేశాలు జారీ చేస్తే అమెరికా సైనికులు ఐదు వందల మందిని చంపివేశారు. ఇప్పుడు గాజాలో జరుగుతున్నదానికి దానికి తేడా ఏమైనా ఉందా ? ఆసుపత్రులు, స్కూళ్లు, నిర్వాసితుల కేంద్రాలు, సహాయ శిబిరాలు, అన్నదానం చేస్తున్నవారు ఎవరు కనిపించినా హతమార్చాలని నెతన్యాహు ఆదేశాలు జారీ చేస్తే ఇజ్రాయెల్‌ సైనికులు అమలు చేస్తున్నారు. గత ఆరునెలల్లో 33,482(ఏప్రిల్‌ 10వ తేదీ నాటికి) మందిని చంపివేశారు. మరో విధంగా చెప్పాలంటే గాజాలోని ప్రతి 70 మందికి ఒకరిని, రోజుకు 180మందిని చంపారు. వీరుగాక 75,815 మందిని, రోజుకు 400 మందిని, ప్రతి 30 మందిలో ఒకరిని గాయపరిచారు. విధ్వంసమైన భవనాల గురించి చెప్పనవసరం లేదు. ఇరవై రెండు లక్షల మంది జనాభాలో 19లక్షల మంది నిరాశ్రయులు కావటం లేదా నెలవులు తప్పారంటే ప్రభావితం కాని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు అమెరికా అన్ని రకాల ఆయుధాలను అందించటమే కాదు, ఎర్ర సముద్రంలోకి తన యుద్ధ నావలను దింపి బాసటగా నిలుస్తున్నది. ఆ ప్రాంత దేశాలు జోక్యం చేసుకోకుండా బెదిరిస్తున్నది.


సామ్రాజ్యవాదుల వర్తమాన రక్త చరిత్రలో విస్మరించరాని దుర్మార్గమిది. కొందరు సైనికులు చేసిన దారుణం కాదిది, వ్యవస్థాపూర్వకమైనది. ఎవరికి ఏది నేర్పితే దాన్నే పాటిస్తారు.ఇజ్రాయెల్‌ రక్షణ దళాల్లో ప్రతి యువకుడు కొంతకాలం విధిగా పని చేయాలి. ఆదేశించిన దుర్మార్గాలను అమలు చేయాలి.తిరస్కరిస్తే ఏం చేస్తారు ? ప్రజాస్వామిక హక్కని వదలి వేయరు. విదేశాల్లో ఉన్న ఒక యువ ఇజ్రాయెలీ కమ్యూనిస్టు ఈ దళాల్లో చేరేందుకు తిరస్కరించాడు. గాజా మారణకాండను నిరసిస్తూ జరిగిన ప్రదర్శనల్లో పాల్గొని అరెస్టయ్యాడనే కారణాన్ని చూపి అతని పౌరసత్వాన్ని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం రద్దు చేసింది. దేశంలోకి రావటాన్ని నిషేధించింది.రాజ్య అణచివేత, మిలటరీ విధానాలను నిరసించాలని, అణచివేతను వ్యతిరేకించాలని సోదర ఇజ్రాయెలీలకు అతను రాసిన లేఖలో పేర్కొన్నాడు. మధ్య ప్రాచ్య సోషలిస్టు ఫెడరేషన్‌లో భాగంగా ఇజ్రాయెల్‌-పాలస్తీనా సోషలిస్టు ఫెడరేషన్‌ ఏర్పాటు జరిగినపుడే ఈ ప్రాంతంలోని జనాలందరూ సుఖంగా ఉంటారని పేర్కొన్నాడు. గాజాలో మారణకాండను విమర్శించినందుకు ఇజ్రాయెల్‌ పార్లమెంటులోని కమ్యూనిస్టు పార్టీ సభ్యుడు ఒఫెర్‌ కాసిఫ్‌ను 2023 అక్టోబర్‌ 18న 45 రోజుల పాటు సస్పెండ్‌ చేస్తూ పార్లమెంటరీ నైతిక నియమాల కమిటీ తీర్మానించింది. అయినప్పటికీ ఖాతరు చేయని ఒఫెర్‌ అంతర్జాతీయ కోర్టులో దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసును సమర్దిస్తూ ఒక పిటీషన్‌పై సంతకం చేశాడనే సాకు చూపి ఏకంగా పార్లమెంటు సభ్యత్వాన్నే రద్దు చేసేందుకు పూనుకున్నారు.దానిలో భాగంగా 85 మంది ఎంపీలతో తీర్మానాన్ని ప్రతిపాదించారు.దాన్ని పార్లమెంటరీ కమిటీ జనవరి 30న 14-2 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. దక్షిణాఫ్రికా చర్య కుట్ర అని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సాయుధపోరాటాన్ని సమర్ధించటమేనని వర్ణించింది. ఫిబ్రవరి 19న పార్లమెంటులో ఓటింగ్‌ జరగ్గా అది వీగిపోయింది. నూట ఇరవై మంది సభ్యులకు గాను పదకొండు మంది వ్యతిరేకంగా, 24 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండగా 85 మంది అనుకూలంగా ఓటు వేశారు. ఒక సభ్యుడిని తొలగించాలంటే 90 మంది మద్దతు అవసరం. దేశంలో ఎవరూ వ్యతిరేకంగా ఉండకూడదనే దుర్మార్గం తప్ప దీని వెనుక మరొకటి లేదు.పార్లమెంటులోని ఇతర వామపక్ష వాదులకూ ఇదే జరుగుతుందని హెచ్చరించటమే.


ఆరునెలల మారణకాండ తరువాత వెనక్కు తిరిగి చూసుకుంటే గాజా సర్వనాశనమైంది. అక్కడ బతికి ఉన్నవారు తిరిగి సాధారణ జీవితాలను ప్రారంభించే అవకాశం ఉంటుందా ? ఇంకా ఎందరిని బలితీసుకుంటారనే ప్రశ్నలకు ఇప్పటికైతే సమాధానాలు లేవు. రంజాన్‌ మాసం తరువాత మరింత పెద్ద ఎత్తున దాడులు జరిపేందుకు ఇజ్రాయెల్‌ సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలు. అది ఒక్క గాజాకే పరిమితం అవుతుందా లేక మొత్తం మధ్య ప్రాచ్య దేశాలకు విస్తరిస్తుందా అన్నది చూడాల్సి ఉంది. గాజాలో మరణించిన వారందరూ హమస్‌ సాయుధులే అన్నట్లుగా ప్రపంచాన్ని నమ్మించేందుకు ఇజ్రాయెల్‌ చూస్తున్నది. ఒప్పందం ప్రకారం కొందరు బందీలను విడిపించుకోవటం తప్ప హమస్‌ వద్ద ఉన్న ఇతర బందీల జాడను కూడా తెలుసుకోలేకపోయింది. చీమ చిటుక్కుమన్నా కనుగొనే నిఘా వ్యవస్థను ఏమార్చి హమస్‌ సాయుధులు సరిహద్దులోని ఇజ్రాయెల్‌ ప్రాంతంపై ఎలా దాడి చేశారన్నది ఇప్పటికీ వీడని రహస్యంగానే ఉండిపోయింది. దాడులు, హత్యాకాండతో పాలస్థీనియన్లను లొంగదీసుకోలేమని గ్రహించిన ఇజ్రాయెల్‌ వారిని రోగాలు, ఆకలితో మాడ్చి చంపేందుకు పూనుకున్నట్లు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. గాజా మారణకాండను ఎలా ఆపాలన్నదాని కంటే అది కొనసాగితే ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో జో బైడెన్‌ భవితవ్యం ఎలా ఉండనున్నదో అంటూ అనేక మంది విశ్లేషణల్లో నిమగమయ్యారంటే వారి చర్మం ఎంత మందంగా తయారైందో అర్ధం చేసుకోవచ్చు. కొందరైతే హమస్‌ చేసిన దుర్మార్గాలంటూ ఇంకా చిలవలు పలవలుగా వర్ణిస్తూ గాజాలో జరుపుతున్నదారుణాలను తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు.


గత ఆరునెలల్లో జరిగిన పరిణామాల్లో ఎమెన్‌పై అమెరికా నేరుగా యుద్ధానికి దిగటం ఒక ముఖ్యాంశం.ఇది కూడా ఇజ్రాయెల్‌ సంబంధిత పరిణామాల్లోనే జరుగుతోంది. ఉగ్రవాదంపై పోరు ముసుగులో గతంలో సౌదీ అరేబియా ద్వారా దాడులు చేయించింది. అమెరికాలో తయారైన విమానాలతో అక్కడి నుంచే వచ్చిన బాంబులతో జరిపించిన దాడిలో వేలాది మంది యెమెనీలు మరణించారు. ఇరాన్‌తో సయోధ్య కుదరటంతో సౌదీ నిలిపివేసింది.ఇప్పుడు నేరుగా అమెరికా ఆ పని చేస్తున్నది. ఎమెన్‌ అంతర్యుద్ధంలో రాజధానితో సహా ఉత్తర ఎమెన్‌పై పైచేయి సాధించిన హౌతీలు లేదా అన్సరల్లా సాయుధులు గాజా మారణకాండకు నిరసనగా ఎర్ర సముద్రం ద్వారా ఇజ్రాయెల్‌ వైపు వెళ్లే నౌకల మీద దాడులను జరుపుతున్నారు. దానికి ప్రతిగా నౌకల రక్షణ పేరుతో అమెరికా రంగంలోకి దిగి ప్రతిదాడులు చేస్తున్నది.సూయజ్‌ కాలువ ద్వారా ఎర్ర సముద్రంలో ప్రవేశించి హిందూ మహాసముద్రంలోకి రాకపోకలు సాగించే నౌకల రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. అవి ఆఫ్రికా ఖండంలోని గుడ్‌హౌప్‌ ఆగ్రంను చుట్టి వస్తున్నాయి. దాంతో ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎర్ర సముద్రం నుండి ఏడెన్‌ జలసంధి ద్వారా అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలోకి నౌకలు ప్రవేశించే కీలక ప్రాంతం బాబ్‌ అల్‌ మాండెబ్‌. ఈ కారణంగా ఎమెన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని సామ్రాజ్యవాదులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. ఆసియలోని ఎమెన్‌కు ఎదురుగా ఆఫ్రికా ఖండంలోని జిబౌటీ ఉంది. ఈ కారణంగానే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్నట్లుగా అక్కడ అనేక దేశాలు తమ మిలిటరీ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి.


గాజా మారణకాండ నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు సామ్రాజ్యవాదం మార్గాలను వెతుకుతున్నది. మధ్యప్రాచ్యం, పశ్చిమాసియాకు వివాదాన్ని విస్తరించేందుకు అమెరికా చూస్తున్నది.ఇరాన్ను ఒంటరిపాటు చేసేందుకు దీర్ఘకాలంగా అనుసరిస్తున్న ఎత్తుగడలకు ఎదురుదెబ్బ తగిలింది.చైనా చొరవతో ఉప్పు నిప్పుగా ఉన్న సౌదీ అరేబియా-ఇరాన్‌ సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నాయి. సౌదీ-ఇజ్రాయెల్‌ మధ్య సయోధ్య కుదర్చాలని అమెరికా ఎంతగా చూసినా కుదరలేదు. పాలస్థీనా స్వతంత్రదేశం ఏర్పడే వరకు సాధారణ సంబంధాలు కుదరవని సౌదీ స్పష్టం చేసింది. గాజాపై దాడులతో అది మరింత వెనక్కు పోయింది. కీలకమైన మధ్య ప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలన్న ప్రయత్నాన్ని అమెరికా కొనసాగిస్తూనే ఉంది.ఐరోపాలో రష్యాకు వ్యతిరేకంగా నాటో కూటమిని ఏర్పాటు చేసినట్లే ఇరాన్ను దెబ్బతీసేందుకు అలాంటి మరోకూటమి ఏర్పాటు చేయాలని, దానిలో ఇజ్రాయెల్‌కు కీలకపాత్ర ఉండేట్లు చూడాలన్నది లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసి కూడా సౌదీ అరేబియా నేతలు ఇరాన్‌తో సయోధ్య కుదుర్చుకోవటం అమెరికా ఊహించినట్లు కనపడదు. ఇరాన్‌కు మద్దతుగా చైనా, రష్యా నిలవటం మరొక కొత్త పరిణామం. ఉక్రెయిన్‌ వివాదం, గాజా మారణకాండ దాన్ని మరింత పటిష్టం చేసిందని చెప్పవచ్చు. కొందరైతే ఈ కూటమితో అమెరికా ప్రచ్చన్న యుద్ధం చేస్తున్నదనే వర్ణిస్తున్నారు.