Tags

, , , , , ,


ఎం కోటేశ్వరరావు


పేదరికం, పేదల గురించి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా చర్చ జరుగుతోంది. ” ఒక్క దెబ్బతో పేదరికాన్ని మాయం చేస్తానని రాహుల్‌ గాంధీ చెబుతున్నారు. ఇంతకాలం ఈ మహా మంత్రగాడు ఎక్కడున్నారు ” ఇది ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్న.ఈ మంత్రాన్ని ఎక్కడ నుంచి నేర్చుకున్నారు, పేదలను అవమానించటం కాదా అని కూడా అన్నారు. ఒక్క దెబ్బతో పేదరికం పోతుందని తాను చెప్పలేదని గట్టి ప్రయత్నం చేయాలని మాత్రమే అన్నట్లు రాహుల్‌ గాంధీ వివరణ. దేశంలో దారిద్య్రం ఉండటానికి కారణం కొంత మంది ఎంపిక చేసుకున్న వ్యక్తులకు నరేంద్రమోడీ సంపదలను కట్టబెట్టటమే అన్నారు. నరేంద్రమోడీ చెబుతున్నట్లుగా 2030నాటికి ప్రపంచంలో మూడవ పెద్దదిగా మనదేశం అవతరించినప్పటికీ జనం పేదరికంలోనే ఉంటారని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్‌ డి సుబ్బారావు చెప్పారు. ఇప్పటి వరకు చేసింది ట్రైలర్‌ మాత్రమేనని అసలు సినిమా ముందు చూపుతా, పక్కా, నన్ను నమ్మండి అంటున్నారు నరేంద్రమోడీ. అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని పేదరికంలో జనాభా ఉన్నారని యుపిఏ సర్కార్‌ ఆహార భద్రతా పధకాన్ని తెచ్చింది.2011-12 వినియోగ సమాచారం ఆధారంగా గ్రామీణ ప్రాంత జనాభాలో 75శాతం, పట్టణాలలో 50శాతం మందికి కుటుంబానికి నెలకు 35కిలోల వంతున, వ్యక్తులుగా నెలకు ఐదు కిలోల చొప్పున ఇవ్వాలని పేదల్లో పేదలను గుర్తించి అంత్యోదయ అన్న యోజన కింద నాడు 81.34 కోట్ల మంది అర్హులని, వారిలో 80 కోట్ల మందిని గుర్తించి సబ్సిడీ ఆహార ధాన్యాల పధకాన్ని అమలు చేస్తున్నారు. వచ్చే ఐదు సంవత్సరాలలో 80 కోట్ల మందికి పూర్తి ఉచితంగా ఐదేసి కిలోల వంతున అందచేస్తామని నరేంద్రమోడీ ప్రకటించారు. దీని అర్ధం ఏమిటి ? దారిద్య్రం నుంచి బయటపడని వారు, లేదా బయటపడవేసిన వారు కూడా అవసరమైన ఆహారాన్ని కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నారని, మరో ఐదేండ్లు తమ అచ్చేదిన్‌ పాలనలో అలాగే ఉంటారని, పని కల్పించలేమని చేతులెత్తేయటమే కదా !


మనదేశ బహుముఖ దారిద్య్రం గురించి 2023లో వెల్లడించిన నివేదిక ప్రకారం 2015-16లో దేశంలో 24.85 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన ఉంటే 2019-21 నాటికి 14.96శాతానికి అంటే 13 కోట్ల 56లక్షల 61వేల 35 మందిని ఎగువకు తెచ్చినట్లు చెప్పారు. నరేంద్రమోడీ ఏలుబడిలో 2001 అక్టోబరు 7 నుంచి 2014 మే 22 వరకు గుజరాత్‌ ఉంది. అంతకు ముందు ఆరు సంవత్సరాలు కూడా బిజెపి పాలనలోనే ఉంది. దేశానికి నమూనాగా పేర్కొన్న గుజరాత్‌లో 2015-16 నాటికి పేదరికం 18.47శాతం ఉంది. కమ్యూనిస్టులు అభివృద్ధికి దూరంగా ఉంచారన్న కేరళలో 0.7శాతమే ఉంది. పైన చెప్పుకున్న వ్యవధిలో దేశంలో 24.85శాతం దారిద్య్రాన్ని 14.96శాతానికి తగ్గించామని చంకలు కొట్టుకుంటున్న నరేంద్రమోడీ రెండింజన్ల గుజరాత్‌లో ఆ దామాషా ప్రకారం తగ్గించటంలో ఎందుకు విఫలమైనట్లు ? 18.47శాతంగా ఉన్న వారిని 11.66శాతానికి ఎందుకు పరిమితం చేశారు ? పోషకాహారం లేని వారు బీహార్‌లో 2019-21లో 42.2శాతం, రెండవదిగా ఉన్న జార్ఖండ్‌లో 40.32, మూడవదిగా ఉన్న గుజరాత్‌లో 38.09శాతం ఉన్నట్లు సదరు నివేదిక వెల్లడించింది. గుజరాత్‌ జనాభాలో 2.44శాతానికి ఇప్పటికీ విద్యుత్‌, 23.3శాతానికి ఇండ్లు,11.37శాతానికి ఎలాంటి ఆస్తులు,4.4శాతానికి బాంకు ఖాతాలు లేవు. దేశంలో సగటున ఆరేండ్ల లోపు పిల్లల్లో 67.1, మహిళల్లో 15-49 ఏండ్ల మధ్యవయస్సుల వారిలో 57శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గుజరాత్‌లో దేశ సగటుకు మించి పిల్లల్లో 79.7, మహిళల్లో 65.1శాతం ఉన్నారు.దీనికి నరేంద్రమోడీ, ఆయనను పొగిడేవారు తలలెక్కడ పెట్టుకుంటారు.


నరేంద్రమోడీ ధరించే సూటు ధర రు.పదిలక్షలు. సాధారణ జనాల మాదిరి సంవత్సరాల తరబడి వేసుకుంటారా లేక తరచుగా మార్చివేస్తారో తెలియదు. 2016లో మోడీ ధరించిన ఒక సూట్‌ను వేలం వేస్తే సూరత్‌లోని ఒక ” పేదవాడు ” రు.4.3 కోట్లకు దక్కించుకున్నాడు. దాన్ని అహమ్మదాబాద్‌లోని జేడ్‌ బ్లూ అనే వస్త్రదుకాణ సంస్థలో కుట్టారని విలువ పది లక్షలని తేలింది. అప్పటి నుంచి మోడీ అంత ఖరీదుగల దుస్తులు ధరిస్తారని ప్రచారంలోకి వచ్చింది. పేద కుటుంబం నుంచి వచ్చిన మోడీకి తన ప్రభుత్వం 60,80 ఏండ్లు దాటిన దారిద్య్రరేఖ దిగువన ఉన్న పేదలకు ఇస్తున్న వృద్ధాప్య, వితంతు, వికలాంగ పెన్షన్ల మొత్తం తెలియదా ! లేక తన పాలనలో కనీసం కోడి గుడ్డంత బంగారం కూడా లేని పేదలు ఉండరన్న ధీమా కావచ్చు. యుపిఏ పాలనలో నిర్ణయించిన నెల పెన్షన్‌ రు.200,500 మాత్రమే ఇప్పటికీ నరేంద్రమోడీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడువేలు, తెలంగాణాలో రెండు వేలు, కేరళలో రు.1,600 ఇస్తున్నారంటే కేంద్రం ఇస్తున్న మొత్తాలకు అక్కడి ప్రభుత్వాలు తమ బడ్జెట్ల నుంచి అదనంగా జతచేసి ఇస్తున్నాయి. బిజెపి పాలనలోని మహారాష్ట్రలో రెండువందలకు మరో నాలుగు వందలు కలిపి ఇస్తున్నారు. వికీ పీడియా సమాచారం ప్రకారం వృద్ధాప్య పెన్షన్లు అసోంలో 200-500, బీహార్‌ 400-500, గుజరాత్‌లో 750-1000, మధ్య ప్రదేశ్‌ 600-800, రాజస్తాన్‌లో 750-1000 ఇస్తున్నారు. పదేండ్ల అచ్చేదిన్‌ పాలనలో ధరల పెరుగుదలకు అనుగుణంగా ఒక్క పైసా కూడా పెంచేందుకు మహానుభావుడు నరేంద్రమోడీకి చేతులు రాలేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బిజెపి నేతలు రోడ్లు వేశాం, రేవులను అభివృద్ధి చేశాం అంటారు తప్ప పెన్షన్లు పెంచాం అనే మాట చెప్పరు..


పెన్షన్లు పెంచే ప్రతిపాదనేదీ లేదని 2023 డిసెంబరు ఆరవ తేదీన ఒక ప్రశ్నకు ( నం.429) కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది. తాము ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని కూడా ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోందని, కేంద్ర వాటా గురించి కూడా చెప్పాలని బిజెపి పెద్దలు కేరళ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దానికి తమకేమీ అభ్యంతరం లేదని, ఎవరెంత ఇస్తున్నారో జనానికి తెలియటం అవసరమేనని విజయన్‌ చెప్పారు. పెన్షన్‌ పధకాలకు 2021, 2022 ఆర్థిక సంవత్సరాలకు కేరళకు చెల్లించాల్సి 573 కోట్లను కేంద్రం నిలిపివేసినట్లు పైన పేర్కొన్న ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరాలు చెబుతున్నాయి. పేదల పెన్షన్ల పట్ల ఇంత కఠినంగా ఉన్న మోడీ కావాలని రుణాలు ఎగవేసిన వారి పట్ల ఎంతో ఉదారంగా ఉన్నారు. కాంగ్రెస్‌ ఏలుబడిలో అడ్డగోలుగా రుణాలు ఇచ్చారని ఎదురుదాడి ఒకటి. వారి ఏలుబడిలో ఇస్తే తన పాలనలో వాటిని వసూలు చేయకూడదని ఎవరైనా అడ్డుపడ్డారా ? ఒక్క ముక్కలో చెప్పాలంటే యుపిఏ హయాంలో బాధ్యతారహితంగా కార్పొరేట్లకు అప్పులిస్తే మోడీ హయాంలో ఎగవేసిన వాటిని రద్దు చేసి వారి సేవలో తరించారు. అంతిమంగా జనం జేబులు గుల్ల. ఉచితాలకు తాను వ్యతిరేకం అని చెబుతున్న మోడీ కార్పొరేట్లకు ప్రభుత్వ రంగ బాంకుల రుణాలను ఉదారంగా ఎలా రద్దు చేశారు ? ఇది ఖజానాను దెబ్బతీయదా ? రిజర్వుబాంకు సమాచారం ఆధారంగా బాంకుల్లో నిరర్ధక(బడా బాబులు ఎగవేసిన) ఆస్తులుగా పేర్కొన్న కొన్ని వివరాలు దిగువ చూడవచ్చు. అంకెలు రు.లక్షల కోట్లు.


పాలన××కాలం×××××× మొత్తం వాణిజ్య బాంకులు ×××××× ప్రభుత్వ రంగ బాంకులు
పాలన××××కాలం××××× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు ×× ఎన్‌పిఏ ×× వసూలు×× రద్దు
యుపిఏ 1× 2004-09×× 1.55 ×× 1.39 ××0.08 ×× 1.08 ×× 1.12 ×× 0.02
యుపిఏ 2× 2009-14×× 5.76 ×× 3.24 ×× 0.55 ×× 4.80 ×× 2.64 ×× 0.32
మోడీ 1× 2014-19 ×× 19.79 ×× 5.99 ×× 6.40 ××15.90 ×× 4.52 ×× 5.05
మోడీ 2× 2019-21 ×× 7.79 ×× 2.74 ×× 4.46 ×× 5.17 ×× 1.74 ×× 3.12


ఈ అంకెలు వెల్లడిస్తున్నదేమిటి ? యుపిఏ పదేండ్లలో నిరర్దక ఆస్తులుగా తేలిన ప్రతి వంద రూపాయల్లో వసూలు రు.63.34 ఉండగా రద్దు చేసినది రు.8.62 కాగా, మోడీ ఏలుబడి 2014 నుంచి 2021వరకు వందకు వసూలు రు.31.65 కాగా రద్దు చేసిన మొత్తం రు.39.38. మొత్తం వాణిజ్య బాంకుల్లో రద్దు చేసిన మొత్తాలు 10.86 లక్షల కోట్లు కాగా వాటిలో ప్రభుత్వ బాంకుల వాటా 8.17లక్షల కోట్లు ఉంది. నరేంద్రమోడీ 2016లో ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంకరప్టసీ బోర్డు(ఐబిసి) అంటే దివాలా మరియు అప్పులు తీర్చలేని వారి కోసం ఏర్పాటు చేశారు.2022 జూన్‌ వరకు ఈ సంస్థకు నివేదించిన దానిలో ఆమోదించిన మొత్తాల విలువ రు.7.67లక్షల కోట్లు. దీనికి గాను వసూలు చేసింది 2.25లక్షల కోట్లు(30.6శాతం) మాత్రమే.దీన్ని జనం భాషలో చెప్పాలంటే ప్రతి లక్ష కోట్లకు బాంకులకు అయిన క్షవరం రు.67,000 కోట్లు.2014-15 నుంచి 2023 మార్చి నెల వరకు తొమ్మిది ఆర్థిక సంవత్సరాల్లో రద్దు చేసిన రుణాల మొత్తం రు.14లక్షల 56వేల 226 కోట్లని కేంద్ర మంత్రి గతేడాది ఆగస్టులో లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో చెప్పారు.కాగా వసూలు చేసిన మొత్తం రు.7లక్షల 40వేల, 968కోట్లని కూడా వెల్లడించారు.ఇదంతా మోడినోమిక్స్‌లో భాగమే. నేను తినను ఇతరులను తిననివ్వను, ప్రతి పైసాకూ జవాబుదారీగా ఉంటానని చెప్పిన నరేంద్రమోడీ ఎవడబ్బ సొమ్మని లక్షల కోట్లు రద్దు చేసినట్లు రామచంద్రా ? స్వతంత్ర భారత చరిత్రలో ఏకంగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగిన ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏముంది. అప్పనంగా రద్దు చేస్తే కార్పొరేట్లు కుంభకోణానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది ? పళ్లూడగొట్టుకొనేందుకు ఏ రాయి అయితేనేం. కొల్లగొడుతున్నది జనం సొమ్మేగా ! ఇంతగా సహకరిస్తున్నారు గనుకనే మూడో సారి కూడా మోడీనే రావాలని వేల కోట్ల రూపాయలను ఎన్నికల బాండ్ల రూపంలో సమర్పించారు. తమ చేతుల్లో ఉన్న మీడియా ద్వారా ఊదరగొడుతున్నారు. ఏ టీవీ ఛానల్లో అయినా ఈ తీరు తెన్నుల గురించి చర్చలను ఎవరైనా చూశారా ?


మోడీ పాలనలో బాంకుల అవినీతి వెల్లడైనా మీడియాకు పెద్దగా పట్టదు. తొలి ఎనిమిది సంవత్సరాల పాలనలో బాంకుల్లో జరిగిన అవినీతి కారణంగా మూడు లక్షల కోట్లు గల్లంతు కాగా వాటిలో ప్రభుత్వ రంగబాంకుల్లోనే 2.15లక్షల కోట్లు ఉంది, మూడు లక్షల కోట్లకు గాను తిరిగి వసూలు చేసింది కేవలం 33,646 కోట్లని 2021-22 సంవత్సరం వరకు ఆర్‌బిఐ ఇచ్చిన సమాచారహక్కు సమాధానంలో చెప్పింది. ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రు. 3.4లక్షల కోట్లు ప్రభుత్వ రంగబాంకులకు ఇచ్చి వాటిని నిలబెట్టింది. ఇదంతా జనం సొమ్ము కాదా ? 2008లో 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపు సక్రమంగా వేలం వేయని కారణంగా రు.1.76లక్షల కోట్ల మేర నష్టం జరిగిందన్న కాగ్‌ నివేదిక దేశంలో ఎంత సంచలనం కలిగించిందో, కాంగ్రెస్‌ను అధికారం నుంచి తొలగించేందుకు ఎలా తోడ్పడిందో తెలిసిందే. ఆ మొత్తం ఊహాజనితం, కేటాయింపు సక్రమంగా లేదు తప్ప అవినీతి జరగలేదని తరువాత కోర్టు ఆ కేసును కొట్టివేసింది.కానీ బాంకు రుణాల రద్దు అలాంటిది కాదు. వాస్తవం. ఒక సినిమాలో హీరోయిన్‌ రష్మిక మీకు అర్ధమౌతోందా అన్న ఊతపదాన్ని ఈ సందర్భంగా జనాలకు గుర్తు చేయాల్సి వస్తోంది.