ఒకే సారి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలు : మరోసారి నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడారు ?

Tags

, ,


ఎం కోటేశ్వరరావు


ప్రధాని నరేంద్రమోడీ మరోసారి ఒకే సారి పార్లమెంట్‌-అసెంబ్లీల ఎన్నికల ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రెండు దశాబ్దాల క్రితమే లా కమిషన్‌ ముందుకు తెచ్చిన ఈ అంశం సమాఖ్య వ్యవస్ధ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యతిరేకమని అనేక పార్టీలు, నిపుణులు తిరస్కరించినప్పటికీ 2014 నుంచీ ఒకే దేశం-ఒకే ఎన్నికలంటూ వదలకుండా చెబుతున్నారు.నవంబరు 26వ తేదీన సభాపతుల 80 జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ ఈ ప్రతిపాదన ఆలోచన కాదు దేశానికి అవసరం అని, ప్రతి నిర్ణయం జాతీయ ప్రయోజనాల లక్ష్యంగా ఉండాలని చెప్పారు. విడివిడిగా ఎన్నికలు జరగటం వలన అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతున్నందున ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి చర్చించాలని కోరారు. చట్ట సభలతో పాటు స్ధానిక సంస్ధలకూ ఉపయోగపడే ఒకే ఓటర్ల జాబితా తయారు చేస్తే సమయం, నిధులు ఆదా అవుతాయన్నారు. జనం మీద రాజకీయాలే పైచేయి సాధిస్తే జాతి ప్రతికూల మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు.


మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1967వరకు లోక్‌సభ,అసెంబ్లీ ఎన్నికలన్నీ ఒకేసారి జరిగాయి. కానీ ఆకాలంలో జరిగిందేమిటి దేశ ఆర్ధిక వ్యవస్ధ దెబ్బతినటం, అది రాజకీయ సంక్షోభాలకు కారణం కావటం తెలిసిందే. దాని ఫలితమే 1969లో కొన్ని అసెంబ్లీల రద్దు, తరువాత ముందుగానే 1970లోపార్లమెంట్‌ రద్దు, 1971 ప్రారంభంలో ఎన్నికలు అన్న విషయం తెలిసిందే. ఒక దేశవృద్ది రేటు ఎన్నికల ఖర్చు మీద, ఆ సమయంలో ప్రవర్తనా నియమావళి మీద ఆధారపడదు. ఆయా దేశాల జిడిపిలు, ఆదాయాలతో పోల్చితే ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వాల ఖర్చు నామమాత్రమే. పార్టీలు పెట్టే ఖర్చే దానికి ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటోంది. దాని నివారణకు ఒకేసారి ఎన్నికలు పరిష్కారం కాదు. ఏ స్ధానం అభ్యర్ధి ఆ ఓట్ల కొనుగోలు, ప్రచారానికి ఇప్పుటి మాదిరే డబ్బు ఖర్చు చేస్తారు తప్ప మరొకటి జరగదు. ప్రవర్తనా నియమావళి అంటే ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ ఓటర్లను ప్రలోభ పెట్టే కొత్త కార్యక్రమాల ప్రకటనలను నివారించటం తప్ప వాటితో నిమిత్తం లేకుండా ముందే ప్రారంభమై సాగే పధకాల అమలు నిలిపివేత ఉండదు. రైలు మార్గాల నిర్మాణం, విద్యుదీకరణ, ప్రభుత్వ గృహాలు, రోడ్ల నిర్మాణం, పెన్షన్ల చెల్లింపు, చౌకదుకాణాల్లో వస్తువుల సరఫరా వంటివి ఏవీ ఆగటం లేదే.


గతంలో గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ఉపాధి పధకం పనులకు విడుదల చేయాల్సిన నిధులకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. అయితే ఆ విషయాన్ని మీడియాలో ఎక్కడా వెల్లడించకూడదని షరతు పెట్టింది. అందువలన ఎన్నికలు జరిగితే పనులు ఆగిపోతాయన్నది ఒక ప్రచార అంశమే తప్ప మరొకటి కాదు. అంతెందుకు హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రకటన తరువాత కూడా అంతకుముందు నుంచి స్వీకరిస్తున్న వరద సహాయ దరఖాస్తులను తీసుకోవచ్చని ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిజెపి ఫిర్యాదు చేసిన తరువాతనే నిలిపివేసింది. అయితే తాము అలాంటి ఫిర్యాదు చేయలేదని, తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని బిజెపి నేత చెప్పారు.

కొన్నిదేశాల్లో ఒకేసారి జాతీయ, ప్రాంతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ విధంగా చేసి ఖర్చును ఆదాచేయటం వల్ల అభివృద్ధి సాధించినట్లు ఎక్కడా రుజువు లేదు. ఉదాహరణకు అమెరికాలో 1962-2019 మధ్య 57 ఏండ్లలో 26 సంవత్సరాలు తిరోగమన, 16 సంవత్సరాలు ఒక శాతంలోపు, ఐదు సంవత్సరాలు ఒకటి-రెండు శాతం మధ్య వృద్ది నమోదైంది.అమెరికాలో ఎన్నికల ప్రకటన నుంచి పోలింగ్‌ రోజువరకు డోనాల్డ్‌ ట్రంప్‌ మన దేశంలో మాదిరి ప్రవర్తనా నియమావళితో నిమిత్తం లేకుండా అనేక చర్యలు తీసుకోవటాన్ని చూశాము. అక్కడ రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికల కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగవు, ప్రవర్తనా నియమావళి లేదు. అయినా అక్కడ వృద్ధి రేటు తీరుతెన్నులు ఏమిటో చూశాము. కొన్ని ఐరోపా దేశాలలో నిర్ణీత కాలం వరకు చట్ట సభలు రద్దు కావు, ప్రభుత్వాలు మారుతుంటాయి. అలాంటి దేశాలూ అభివృద్ది సమస్యలను, సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి.


ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికల వాతావరణమే ఉంటోందని కొందరు పెద్దలు చీదరించుకోవటం చూస్తున్నాం. వీరు ఎన్నికలతో నిమిత్తం లేకుండా నిరంతరం కొనసాగుతున్న ఇతర ‘వాతావరణాల’ గురించి పట్టించుకోరు. మహా అయితే ఐదు సంవత్సరాల కాలంలో మూడు సార్లు ఎన్నికలు జరుగుతాయి. ఈ మాత్రానికే చీదరింపులైతే నిరంతరం కొనసాగుతున్న నిరుద్యోగం, దారిద్య్రం, ధరల పెరుగుదల వంటి ఈతిబాధల వాతావరణం సంగతేమిటి ? ఎప్పుడూ ఎన్నికల వాతావరణమే ఉంటోందని చిరాకు పడుతున్న కడుపు నిండిన వారు కార్మికులు, ఉద్యోగులు తమ సమస్యల మీద చేసే ఆందోళనలను కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తించాలి. సమ్మెలు, బంద్‌లు చేయటం ఎవరికీ సరదా కాదు, అనివార్యంగా చేస్తున్నవే. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కూడా అలాంటివే.


నిజానికి ఇప్పుడు కావాల్సింది ఒకే సారి ఎన్నికలు కాదు. ప్రజాస్వామ్యం మరింతగా వర్దిల్లే విధంగా, ధన ప్రలోభాలను గణనీయంగా తగ్గించి, ప్రజాభిప్రాయానికి చట్టసభల్లో తగు ప్రాతినిధ్యం లభించేందుకు ఉన్నంతలో మెరుగైన దామాషా పద్దతి ఎన్నికల సంస్కరణలు కావాలి. ఒకేసారి ఎన్నికలు జరపాలని సూచన చేసిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం నివేదికలో దక్షిణాఫ్రికా, స్విడ్జర్లాండ్‌లను ఉదహరిస్తూ నిర్ణీత తేదీకి అక్కడ ఎన్నికలు జరుపుతారని పేర్కొన్నారు. (అమెరికా కూడా అలాంటిదే.) అయితే ఈ రెండు దేశాల్లో పార్టీల జాబితాలతో దామాషా ప్రాతిపదికన చట్ట సభల్లో సీట్లు కేటాయిస్తారు. ఆ విషయం మాత్రం స్ధాయీ సంఘానికి పట్టలేదు. అమెరికాలో దేశాధ్యక్ష ఎన్నికల్లో 50రాష్ట్రాల్లో రెండు చోట్ల తప్పు మిగిలిన చోట్ల మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న పార్టీకి అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులను మొత్తంగా కేటాయిస్తారు. అందువలన గత ఎన్నికల్లో మొత్తంగా ఓట్లు తక్కువ తెచ్చుకున్నా అధ్య క్ష పదవిని ట్రంప్‌ గెలిచారు. మన మాదిరి నియోజకవర్గాల ప్రాతిపదిక విధానంలో డబ్బున్న పార్టీలే ప్రాతినిధ్యం పొందగలుగుతున్నాయి. కొన్ని పార్టీలకు వచ్చిన ఓట్ల మేరకు ప్రాతినిధ్యం ఉండటం లేదు. దామాషా ప్రాతినిధ్య విధానంలో డబ్బుతో ఓట్లు కొన్నప్పటికీ అలాంటివారు ఎన్నికయ్యే అవకాశం ఉండదు కనుక ఎవరూ డబ్బు పెట్టరు, నిజమైన ప్రజాభిప్రాయం వెల్లడి కావటానికి అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలు, వ్యక్తులు డబ్బున్నవారికే పెద్దపీట వేస్తూ అధికారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే దామాషా ప్రాతినిధ్యం(ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తే అన్ని సీట్లు) గురించి వామపక్షాలు తప్ప మిగిలిన పార్టీలేవీ మాట్లాడవు.


తరచూ ఎన్నికల వలన ప్రభుత్వాలు దీర్ఘకాలిక విధానాలను రూపొందించే అవకాశాలకు ఆటంకం కలుగతుందని కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో నేటి ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వాదించారు. ఒకే సారి ఎన్నికలు జరిగితే ఇలాంటి అవకాశం ఉండదని చెప్పారు. ఇంకా కొందరు ఇదే విధమైన వాదనలు చేస్తున్నారు. పాలకులు మారినా లక్ష్యాల నిర్దేశం, పధకాలు కొనసాగేందుకు ఏర్పాటు చేసిన ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసిన పెద్దలు దీర్ఘకాలిక విధానాల గురించి మాట్లాడటం హాస్యాస్పదం, జనాన్ని తప్పుదారి పట్టించే వ్యవహారమే.
ప్రతిదానికీ ప్రజాస్వామ్య జపం చేసే వ్యక్తులు, శక్తులూ అభివృద్ధి, ఖర్చు తగ్గించాలనే పేరుతో ప్రజాస్వామిక సూత్రాలకే విఘాతం కలిగించే ప్రతిపాదన ముందుకు తెస్తున్నారు. ఇది ఫెడరల్‌ సూత్రాలకు, రాజ్యాంగ మౌలిక స్వభావానికే విరుద్దం. ఏక వ్యక్తి ఆధిపత్యానికి దారి తీస్తుంది. అందువలన ఇది ఇక్కడికే పరిమితం అవుతుందన్న హామీ ఏముంది ? అసలు బిజెపి ఈ ప్రతిపాదనను పదే పదే ఎందుకు ముందుకు తెస్తున్నది ? దీన్ని మూడు దశలుగా చూడాలి. ఒకటి వాజ్‌పేయి హయాం, మరొకటి రెండవ సారి బిజెపికి కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం వచ్చిన తరుణం, కరోనా మహమ్మారి విస్తరిస్తున్న సమయం అని మూడు అంశాలుగా చూడాల్సి ఉంది. అతల్‌ బిహారీ వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న 1999లో లా కమిషన్‌ ద్వారా ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తరువాత యుపిఏ పాలనలో దాని ప్రస్తావన లేదు. తిరిగి నరేంద్రమోడీ వచ్చిన తరువాత దానికి దుమ్ముదులిపారు. నీతి ఆయోగ్‌ ద్వారా ముందుకు తెచ్చారు. తరువాత లా కమిషన్‌ నిర్మాణాత్మక అవిశ్వాసం పేరుతో మరొక ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టటానికి ముందు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని సభ విశ్వాసం పొందాలని చెప్పారు.


ఐడిఎఫ్‌సి అనే ఒక సంస్ధ 1999 నుంచి 2014వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పాటు జరిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమాచారాన్ని విశ్లేషించింది. ఒకేసారి జరిగితే కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ ఓటర్లు ఒకే పార్టీని ఎంచుకొనేందుకు 77శాతం అవకాశాలుంటాయని పేర్కొన్నది. ఐఐఎం అహమ్మదాబాద్‌ డైరెక్టర్‌గాగా ఉన్న జగదీప్‌ ఛోకర్‌ జరిపిన విశ్లేషణ కూడా దీన్నే చెప్పింది. 1989 నుంచి ఒకేసారి జరిగిన లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 24 ఉదంతాలలో ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో దాదాపు ఒకే విధమైన శాతాలలో ఓట్లు పొందాయి. కేవలం ఏడు సందర్భాలలో మాత్రమే ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఈ కారణంగానే గతంలో కాంగ్రెస్‌ మాదిరి ప్రస్తుతం దేశవ్యాపితంగా ఉన్న బిజెపి ఒకేసారి ఎన్నికలు జరిగితే తనకు ఉపయోగమని, ఉన్న అధికారాన్ని మరింతగా సుస్ధిరపరచుకోవచ్చని, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే అవకాశాలను తగ్గిస్తాయని గత ఆరు సంవత్సరాలుగా పార్టీ భావిస్తున్నది. ఒకేసారి ఎన్నికలు జరపాలంటే రాజ్యాంగ సవరణలు చేయాల్సింది ఉంది. అదే జరిగితే రాష్ట్రాలలో, కేంద్రంలో ఏ కారణాలతో అయినా ప్రభుత్వాలు కూలిపోతే నిర్ణీత వ్యవధి వరకు కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. దాని అర్ధం కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే దాని అధికారమే పరోక్షంగా ఉంటుంది.


ఇది కరోనాకు ముందున్న నేపధ్యం.ఈ మహమ్మారితో నిమిత్తం లేకుండానే వ్యవసాయ రంగంలో తలెత్తిన సంక్షోభం కారణంగా తలెత్తిన రైతాంగ ఉద్యమాలు, పదిహేనేండ్ల పాటు అధికారంలో కొనసాగిన రాష్ట్రాలలో బిజెపికి తగిలిన ఎదురు దెబ్బలు తెలిసిందే.కరోనా వ్యాప్తి ప్రారంభానికి ముందే దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది. ఈ కాలంలో మరింత దిగజారి వరుసగా రెండు త్రైమాస కాలాల్లో తిరోగమన వృద్ది నమోదై తొలిసారిగా దేశం మాంద్యంలోకి పోయింది. వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పరిస్ధితి పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవని పాలక పార్టీ పెద్దలకు ముందే తెలుసు. వచ్చే రెండు సంవత్సరాల కాలంలో కూడా పూర్వపు స్దాయికి చేరుకొనే అవకాశాలు కష్టమని అనేక మంది ఆర్ధికవేత్తలు అంచనాలు వేస్తున్నారు. అదే జరిగితే ఇంతకాలం దేశం వెలిగిపోతోందని బిజెపి చేస్తున్న ప్రచారం తుస్సుమంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత పెరగటం అనివార్యం. అందువలన ముందుగానే రాజ్యాంగ సవరణల వివాదాన్ని ముందుకు తెచ్చి అభివృద్ది నినాదం మాటున జమిలి ఎన్నికలకు పోవాలన్న ఆలోచన కనిపిస్తోంది. కరోనా ప్రభావం గురించి దేశమంతా ఆందోళన చెందుతోంటే ఆగస్టు 13న ప్రధాని కార్యాలయం స్దానిక సంస్ధలతో సహా అన్ని ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా తయారీ సాధ్యా సాధ్యాల గురించి చర్చించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అలా చేయాలంటే ముందుగా ఆర్టికల్‌ 243కె, 243జడ్‌, ఏ లకు సవరణలు చేయాల్సి ఉంటుందని చర్చ జరిగింది. దీనికి ప్రధాని ముఖ్యకార్యదర్శి పికె మిశ్రా అధ్యక్షత వహించారు. ఇప్పుడు ప్రధాని మరోసారి ముందుకు తెచ్చారు. పాలకపార్టీ, అధికార యంత్రాంగంలో జరుగుతున్న ఈ చర్చ, కదలికల కారణంగానే అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నాయి.


దేశ అభివృద్ది, ప్రయోజనాల గురించి తమకు తప్ప మరొకరికి పట్టవని, అలాగే దేశభక్తి ఇతరులకు లేనట్లుగా, దేశద్రోహులకు మద్దతు ఇస్తున్నట్లు గత ఆరున్నర సంవత్సరాలుగా ఒక పధకం ప్రకారం ప్రచారం చేస్తున్నారు. ఒక అవాస్తవాన్ని వందసార్లు చెబితే 101వసారి నిజంగా మారుతుందని సూత్రీకరణ చేసిన జర్మన్‌ నాజీ మంత్రి గోబెల్స్‌ తరహా ప్రచారం ఇదని కొందరు చెప్పటాన్ని కొట్టిపారవేయలేము. స్వాతంత్య్రమా-పరాయి పాలనా దేన్ని ఎంచుకోవాలన్నదాని మీద సాగిన స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపిని ఏర్పాటు చేసిన సంఘపరివార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర లేకపోగా సావర్కర్‌ వంటి కొందరు బ్రిటీష్‌ వారికి లొంగిపోయి ప్రభుత్వానికి సేవ చేస్తామని రాసి ఇచ్చిన చరిత్ర కళ్ల ముందు ఉంది. దాని కొనసాగింపుగానే క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారు. ద్విజాతి సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన ముస్లింలీగుతో కలసి రాష్ట్ర ప్రభుత్వాల్లో పాల్గొన్న హిందూమహాసభలోని వారు ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులే అన్నది తెలిసిందే. ప్రధాని మోడీ సభాధ్యక్షుల సమావేశంలో చెప్పిన దేశ అభివృద్ది, ప్రయోజనాల కబుర్లు రాజ్యాంగ మౌలిక స్వభావానికి తూట్లు పొడిచి జమిలి ఎన్నికలను రుద్దేందుకు పూనుకున్నారా అన్న అనుమానాలను ముందుకు తెస్తున్నాయి.


2022నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు నిండుతుంది. ఆ సమయానికి రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని ఆ బాటలో తీసుకున్న చర్యలేమీ లేవు. కానీ ఒకే దేశం ఒకే ఎన్నికలంటూ పదే పదే మాట్లాడుతున్నారు. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఉన్న మెజారిటీ, దేన్నయినా బలపరిచే ఇతర పార్టీలు కూడా ఉన్నందున ఒక్క రోజులోనే కాశ్మీర్‌ రాష్ట్రాన్నే రద్దుచేసినట్లు ఒకేసారి ఎన్నికల కోసం జనాభిప్రాయాన్ని తోసిపుచ్చి రాజ్యాంగ సవరణలు చేయటం నరేంద్రమోడీకి ఒక పెద్ద సమస్య కాదు. అలాంటి పరిణామం జరిగినా ఆశ్చర్యం లేదు. అందువలన ఈ నేపధ్యంలో అలాంటి ఎన్నికలకు వ్యతిరేకత తెలపటం తప్ప ఉన్న ఆటంకాలు, లాభనష్టాలు ఏమిటి అని తలలు బద్దలుకొట్టుకోవటం కంఠశోష తప్ప మరొకటి కాదు.

కాకమ్మ కథలు ఆపి నరేంద్రమోడీ ఇప్పటికైనా అభివృద్ధి చర్యలు తీసుకుంటారా ?

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు


ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి) నుంచి భారత్‌ వైదొలగటం సముచితమా కాదా అన్న చర్చ ఇప్పుడు ఇంటా బయటా ప్రారంభమైంది. జపాన్‌ తదితర దేశాలు కోరుతున్నట్లు దానిలో చేరితే ఒక సమస్య లేకపోతే మరొకటి కనుక ఆ గుంజాటనతో ఎంతకాలం గడుపుతారు ? అంతా నెహ్రూయే చేశారు అన్న సుప్రభాతం మాని నరేంద్రమోడీ సర్కార్‌ తాను చెప్పిన ముఖ్యంగా మేకిన్‌ ఇండియా లేదా ఆత్మనిర్భరత కార్యక్రమాలతో దేశాన్ని ఆర్ధికంగా ఎలా ముందుకు తీసుకుపోనుంది అన్నది కీలకం. మరో దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకో కూడదనే వ్రతం చెడి తాను మద్దతు ప్రకటించిన డోనాల్డ్‌ ట్రంప్‌ పరాజయం పాలయ్యాడు. అధికారానికి వచ్చిన జో బైడెన్‌ను సంతృప్తి పరచేందుకు లేదా ఆర్‌సిఇపి చర్చ నుంచి జనం దృష్టిని మళ్లించేందుకు గానీ కేంద్ర ప్రభుత్వం మరోసారి చైనా ఆప్‌ల మీద డాడి చేసిందని భావించవచ్చు. రాబోయే రోజుల్లో మరికొన్నింటి మీద కూడా నిషేధం విధించవచ్చు. చైనా మీద వత్తిడి పెంచి బేరమాడే ఎత్తుగడ కానట్లయితే ఆప్‌లన్నింటినీ ఒకేసారి ఎందుకు నిషేధించటం లేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. వాటి వలన చైనాకు తగిలిన దెబ్బ-మనకు కలిగిన ప్రయోజనం ఏమిటన్నది వేరే అంశం. ఆర్దిక వ్యవస్ధ లావాదేవీలను ఆప్‌లు సులభతరం చేస్తాయి తప్ప సంపదలను సృష్టించవు. అందువలన నిషేధాలను పట్టించుకోకుండా కరోనా కారణంగా తగిలిన దెబ్బలను మాన్చుకొని చైనా ముందుకు పోతుంటే తగిలిన దెబ్బలు ఎంత లోతుగా ఉన్నాయో ఇంకా తేల్చుకోలేని స్ధితిలో మనం ఉన్నామంటే అతిశయోక్తి కాదు.


ఆర్‌సిఇపిలో చేరాలా వద్దా ?
ఆర్‌సిఇపి నుంచి వైదొలగటం సరైన నిర్ణయమని కొందరు చెబుతుంటే కాదని మరికొందరు తమ వాదనలను వినిపిస్తున్నారు. దీనిలో చేరితే భాగస్వామ్య దేశాల నుంచి పారిశ్రామిక, వ్యవసాయ, పాడి ఉత్పత్తులు వెల్లువెత్తి నష్టం కలిగిస్తాయని మన పారిశ్రామికవేత్తలు, రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ రంగాలలో తలెత్తిన తీవ్ర సమస్యల నేపధ్యంలో 2019లో ఒప్పందం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు మన ప్రభుత్వం ప్రకటించింది. తిరిగి మనం ఏ క్షణంలో అయినా చేరేందుకు అవకాశం కల్పిస్తూ మిగిలిన దేశాలన్నీ 2020 నవంబరులో సంతకాలు చేశాయి. ఏ ఒప్పందం అయినా అందరికీ ఖేదం, మోదం కలిగించదు. ఇప్పుడు ఖేదం అనుకున్న లాబీ చేరకపోవటం సరైనదే అని చెబుతున్నది. మోదం పొందాలనుకున్న వారు వచ్చిన అవకాశం జారిపోయిందే అని ఎంత తప్పు చేశామో అని వాదిస్తున్నారు. నరేంద్రమోడీ సర్కార్‌ మీద ఎవరి వత్తిడి ఎక్కువగా ఉంటే రాబోయే రోజుల్లో అది అమలు జరుగుతుంది. అందువలన ఈ అంతర్గత పోరు ఎలా సాగుతుందో చూడాల్సి ఉంది.
ఒప్పందంలో చేరకపోవటం ద్వారా తక్షణ ప్రమాద నివారణ జరిగిందే తప్ప ముప్పు తొలగలేదని గ్రహించాలి. ఒక వైపు ప్రపంచీకరణ, మరింత సరళీకరణ, సంస్కరణలు అంటూ నరేంద్రమోడీ సర్కార్‌ కార్మికులు-కర్షకుల ప్రయోజనాలకు వ్యతిరేకమైన చర్యలను రుద్దుతున్నది. విదేశాల నుంచి వ్యవసాయ, పాడి ఉత్పత్తుల దిగుమతులను నివారించిందన్న సంతోషం రైతాంగంలో ఎక్కువ కాలం నిలిచేట్లు లేదు. సర్కార్‌ మరోవైపు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కనీస మద్దతుధరలు, సేకరణ బాధ్యతల నుంచి క్రమంగా తప్పుకొనేందుకు రైతాంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదలివేసే చర్యలకు సంస్కరణల ముసుగువేసి పార్లమెంట్‌లో చట్టసవరణలు చేసింది.


కబుర్లు కాదు, నిర్దిష్ట చర్యలేమిటి ?
చైనాతో సహా 15దేశాలు ఆర్‌సిఇపి ద్వారా ముందుకు పోతున్నాయి. లడఖ్‌ సరిహద్దు వివాదం జరగక ముందే ఆర్‌సిఇపి చైనాకు అనుకూలంగా ఉంటుంది, దాని వస్తువులన్నీ మరింతగా మన దేశానికి దిగుమతి అవుతాయి అన్న కారణంతో మనం దానిలో చేరలేదని ప్రభుత్వం చెబుతున్నది. దానితో ఎవరికీ పేచీ లేదు. అయితే ఎప్పుడూ ఆ కబుర్లే చెప్పుకుంటూ కూర్చోలేముగా ! చైనాతో పోటీ పడి మన దేశం ముందుకు పోయేందుకు నరేంద్రమోడీ సర్కార్‌ తీసుకుంటున్న చర్యలేమిటి అన్నది సమస్య. మనం తయారు చేసే వస్తువులను వినియోగించే శక్తిని మన జనానికి కలిగించే చర్యలేమిటి ? విదేశాలకు ఎగుమతి చేసేందుకు వ్యూహం ఏమిటి ?
చైనాకు సానుకూల హౌదా ఎందుకు రద్దు చేయటం లేదు ?

లడక్‌ ప్రాంతం గాల్వన్‌ లోయలో జరిగిన ఉదంతం తరువాత చైనాకు బుద్ధి చెప్పాలి, ఆర్ధికంగా దెబ్బతీయాలన్నట్లుగా ప్రభుత్వ చర్యలు, నేతల మాటలు ఉన్నాయి. పుల్వామా దాడి ఉదంతం తరువాత పాకిస్ధాన్‌కు అత్యంత సానుకూల హౌదా(ఎంఎఫ్‌ఎన్‌)ను మోడీ సర్కార్‌ రద్దు చేసింది. అంతకంటే ఎక్కువగా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నా చైనాకు ఆ హౌదాను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని మోడీ సర్కార్‌ చెప్పింది. దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. చైనాతో అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ల ప్రయోజనాలకు దెబ్బ తగల కూడదు, అదే సమయంలో చైనా వ్యతిరేకతను రెచ్చ గొట్టి జనంలో మంచి పేరు కొట్టేయాలన్న యావ తప్ప మరేమిటి ?
ప్రాంతీయ అభివృద్ధి అవకాశాలకు దూరంగా గిరిగీసుకున్న భారత్‌ అనే శీర్షికతో ఈ నెల 23వ తేదీన, అంతకు ముందు చైనా పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ రెండు విశ్లేషణలను ప్రచురించింది. వాటితో ఏకీభవించటమా లేదా అనే అంశాన్ని పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చూద్దాం. ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మాసాల మధ్య భారత్‌ చేసుకున్న మొత్తం దిగుమతులలో చైనా ఉత్పత్తుల వాటా 18.3శాతం ఉందని, గతేడాది ఇదే కాలంలో 14.6శాతమే అని భారత వాణిజ్యశాఖ వివరాలు వెల్లడించాయి. ఆత్మనిర్బర పేరుతో చైనా నుంచి దిగుమతులను తగ్గించాలన్న ప్రభుత్వ నిర్ణయం, ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య నెలకొన్న వివాద నేపధ్యంలో ఇది జరిగింది.(చైనా వస్తుబహిష్కరణ వ్రతం ఏమైనట్లు ?) ఆర్‌సిఇపి నుంచి వైదొలిగిన భారత్‌ రక్షణాత్మక చర్యల నేపధ్యంలో అది సిపిటిపిపి లేదా అమెరికా, ఐరోపాలతో ఒప్పందాలు చేసుకోవటం ఇంకా కష్టతరం అవుతుంది. తనకు తాను గిరి గీసుకుంటున్న భారత్‌ భవిష్యత్‌లో అవకాశాలను జారవిడుచుకుంటుందని ఆ పత్రిక పేర్కొన్నది.


చైనా ఎఫ్‌డిఐ ఆంక్షల నుంచి మోడీ సర్కార్‌ వెనక్కు తగ్గుతోందా
ఇటీవల హౌం,వాణిజ్య, పరిశ్రమల శాఖల సంయుక్త బృందం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డిఐ) నిబంధనలను సడలించాలని ప్రధాని నరేంద్రమోడీకి ఒక ప్రతిపాదన చేసినట్లు వార్తలు వచ్చాయి. మన దేశంతో భూ సరిహద్దులున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను కొన్ని రంగాలలో 26శాతం వరకు ప్రభుత్వ తనిఖీతో నిమిత్తం లేకుండా అనుమతించాలన్నదే దాని సారాంశం. అంతిమంగా ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ఈ సడలింపు అమల్లోకి వస్తే చైనా నుంచి పెట్టుబడులను అడ్డుకొనేందుకు గతంలో కొండంత రాగం తీసి చేసిన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవటమే. ఈ ప్రతిపాదనను ఎందుకు చేసినట్లు ? ముందుచూపు లేదా పర్యవసానాల గురించి ఆలోచించకుండా జనాల్లో చైనా వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు పూనుకున్నవారికి ఇది ఎదురు దెబ్బ అవుతుంది. చైనాను వ్యతిరేకిస్తే అమెరికా, ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని కలలు కన్న, చైనా మీద వీరంగం వేసిన వారికి అవి కనుచూపు మేరలో కనిపించకపోవటమే అసలు కారణం. ఏటికి ఎదురీదాలని ఉత్సాహపడేే ఎవరైనా ముందు తమ సత్తా, పరిస్ధితులు ఏమిటో ఒకసారి పరిశీలించుకోవాల్సి ఉంటుంది.
నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత భారత-చైనా వాణిజ్యం బాగా పెరిగింది. చైనా నుంచి దిగుమతులతో పాటు పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. ఆకస్మికంగా చైనా దిగుమతులను ఆపివేయలేని విధంగా మన పరిశ్రమలు చైనా మీద ఆధారపడ్డాయంటే అతిశయోక్తికాదు. రాజకీయ కారణాలతో ప్రత్యామ్నాయం చూసుకోవాలంటే అమెరికా, ఐరోపా ఇతర ఆసియా దేశాల నుంచి అధిక ధరలకు వస్తువులను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే మన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్లో పోటీని తట్టుకోలేకపోతుండగా ఉత్పత్తి ఖర్చు మరింతగా పెరిగితే పరిస్ధితి ఇంకా దిగజారుతుంది. మన ఆర్ధిక పరిస్ధితి దిగజారుతున్న నేపధ్యంలో చైనాతో వివాదం ప్రారంభమైంది. దీన్ని మన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు సహిస్తారా ?


ప్రపంచీకరణ జపం ఆచరణలో ఆంక్షలు !
చైనా మాదిరి మన దేశం ఎగుమతి కేంద్రంగా మారాలంటే రక్షణాత్మక చర్యలను విరమించి స్వేచ్చా వాణిజ్య పద్దతులను అనుసరించాలన్నది ఒక వాదన. దాని సారాంశం ఏమిటో చూద్దాం. గతంలో విఫలమైన విధానాలను తిరిగి అమలు జరిపితే లక్ష్యాలను చేరుకోలేము.2014 నుంచీ మోడీ సర్కార్‌ అనేక మార్లు దిగుమతి ఆంక్షలు, సుంకాలను, లైసన్సులు తీసుకోవాల్సిన చర్యలను పెంచింది. ఇది తిరిగి లైసన్సు రాజ్యం వైపు వెళ్లటమే. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం గురించి ఒక వైపు చెబుతారు, మరోవైపు అది అమలుకు అడ్డుపడే చర్యలు తీసుకుంటారు. దీనికి అవసరమైన సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల ధరలను పెంచారు.కొన్ని ఐఫోన్ల ధరలను చూస్తే విమానాల్లో దుబారు వంటి చోట్లకు వెళ్లి అక్కడ కొనుగోలు చేసి తెచ్చుకోవటం చౌక అని చెబుతున్నారు. అనేక వస్తువుల దిగుమతికి లైసన్సు తీసుకోవాలని నిర్ణయించారు. రక్షణాత్మక చర్యల వలన మన వస్తువుల నాణ్యత పెంచేందుకు, చౌకగా అందించేందుకు మన పారిశ్రామిక, వాణిజ్యవేత్తలు చర్యలు తీసుకోరు. పాత పద్దతులనే కొనసాగించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తారు. గతంలో ఇదే జరిగింది, ఇప్పుడూ అదే జరగబోతోంది. రూపాయి విలువను పడిపోయేట్లు చేయటం ద్వారా మన వినియోగదారులు దిగుమతి చేసుకొనే వస్తువుల ధరల పెరుగుదలకు, మన వస్తువులను విదేశీయులు చౌకగా పొందేందుకు వీలు కలిగిస్తున్నారు.
స్వయం సమృద్ధి లేదా మన కాళ్ల మీద మనం నిలిచే విధానాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. అందుకు అనువైన విధానాలను అనుసరించే చిత్త శుద్ది లేదనేదే విమర్శ. ప్రపంచానికి తన తలుపులు తెరిచే ఉంటాయని చైనా చెబుతోంది, అయితే అది తాను చెప్పినట్లు జరగాలని అది కోరుకుంటోంది అని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన ఒక వ్యాసశీర్షిక సారం. తన కాళ్ల మీద తాను నిలిచి ఇతరులు తమ మీద ఆధారపడేట్లు చేసుకొనే వ్యూహాన్ని చైనా అధినేత గ్జీ జింపింగ్‌ అనుసరిస్తున్నారని దానిలో పేర్కొన్నారు. అదే విధంగా ఇతర ఆర్ధిక వ్యవస్ధలతో సంబంధాలను తెంచుకోవటం లేదని గ్జీ చెబుతున్నారు గానీ చైనా అడుగులు చూస్తే అదే మార్గంలో పడుతున్నాయి అంటూ వ్యాసకర్తలు భాష్యంచెప్పారు. మన నరేంద్రమోడీ కూడా ఆ విధానాన్నే ఎందుకు అనుసరించరు ?


ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది !
ప్రతి దేశం ప్రపంచ రాజకీయాల్లో తన పాత్ర పోషిస్తోంది. అమెరికా, జపాన్‌, మన దేశంతో కలసి క్వాడ్‌ పేరుతో చైనాకు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా కూటమి కడుతోంది. మరోవైపు అదే చైనాతో కలసి ఆర్‌సిఇపిలో భాగస్వామిగా చేతులు కలిపింది. చైనాతో వాణిజ్య మిగులులో ఉన్న ఆస్ట్రేలియన్లు మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపధ్యంలో చైనా తన ఆయుధాలను బయటకు తీస్తోంది. వరుసగా బొగ్గు, మద్యం,బార్లీ, పత్తి వంటి ఉత్పత్తుల దిగుమతులను ఆస్ట్రేలియా నుంచి క్రమంగా తగ్గిస్తోంది. ఇది వత్తిడి పెంచి అమెరికా నుంచి విడగొట్టే ఎత్తుగడలో భాగమే అన్నది స్పష్టం. దీనికి ప్రధాన కారణం దాని ఆర్ధికశక్తే. ఆస్ట్రేలియా ఎగుమతుల్లో 38శాతం చైనాకే జరుగుతున్నాయి, అమెరికా వాటా నాలుగుశాతమే. మన దేశం చైనా నుంచి ఒక శాతం వస్తువులను దిగుమతి చేసుకుంటుంటే మన ఎగుమతుల్లో మూడుశాతం చైనాకు ఉన్నాయి. అందువలన చైనాకు మన తలుపులు మూస్తే నష్టం ఎవరికో చెప్పనవసరం లేదు. ఒక దేశాన్ని ఎవరైనా శత్రువుగా మారిస్తే అది శత్రువే అవుతుంది.
రక్షణాత్మక చర్యల ద్వారా మన ప్రగతికి మనమే అడ్డుపడటమే గాక ప్రపంచ భాగస్వామ్యాలను కూడా దెబ్బతీసినట్లు అవుతోందన్నది కొందరి అభిప్రాయం. ఇది విదేశీ కంపెనీలకు అవకాశాలు కల్పించాలనే లాబీల నుంచి కూడా వచ్చే మాట అన్నది స్పష్టం. పన్నుల విధింపు, నిబంధనలు ఎక్కువగా ఉండటం వంటి చర్యల వలన ప్రపంచంలో భారత్‌ తన ఆర్ధిక వ్యవస్ధను తెరవటం లేదనే అభిప్రాయానికి తావిస్తుందన్నది సారాంశం. నిజానికి అమెరికా సంస్ధలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ మన దేశంలోని ఆన్‌లైన్‌ షాపింగ్‌ మార్కెట్లో 70శాతం వాటాను చేజిక్కించుకున్నాయి.
ప్రతిష్ట, పలుకుబడి పెంచామన్నారు, ఫలితేమిటి ?
మేకిన్‌ ఇండియా పిలుపుతో ఆర్భాటం, ప్రపంచంలో దేశానికి ఎన్నడూ లేని ప్రతిష్టను, పలుకుబడిని పెంచానని చెప్పటం తప్ప వాటితో గత ఆరున్నర సంవత్సరాలలో మోడీ సర్కార్‌ సాధించిందేమిటో, చేసిందేమిటో తెలియదు.ఆచరణలో కనిపించకపోతే గప్పాలు కొట్టుకోవటం అంటారు. ఆర్‌సిఇపిలో చేరకూడదని ఏడాది క్రితమే నిర్ణయించిన కేంద్రం మన సరకులకు విదేశీ మార్కెట్ల కోసం చేసిందేమీ లేదు. మరోవైపున ఆ ఒప్పందంపై సంతకాలు చేసిన తరువాత 26దేశాలు, వాణిజ్య కూటములతో చైనా 19 స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొని తన వాణిజ్య విలువను 27 నుంచి 35శాతానికి పెంచుకుంది. దీన్ని విస్తరణవాదంగా చిత్రించి పబ్బంగడుపుతున్నారు. ఇలాంటి ఒప్పందాలు లేకుండా మన దేశంలో తయారు చేస్తామని చెబుతున్న సరకులను ఎక్కడికి ఎగుమతి చేస్తారు ? ఆర్‌సిఇపి ఒప్పందంలోని మిగిలిన 14భాగస్వామ్య దేశాలతో చైనా విదేశీ వాణిజ్యంలో 2019లో మూడోవంతు ఉంది, చైనాకు వస్తున్న మొత్తం విదేశీ పెట్టుబడుల్లో ఆ దేశాల వాటా పదిశాతం ఉంది. ఈ దిశగా నరేంద్రమోడీ ఇంతవరకు చేసిందేమిటి ? మన ఇరుగుపొరుగు దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలను మెరుగుపరచుకోలేదు, అవి చైనాతో సంబంధాలను పెంచుకున్నాయి.


మనం ప్రత్యామ్నాయ బిఆర్‌ఐని ఎందుకు రూపొందించలేదు ?
చైనా వాణిజ్య విస్తరణలో మరొక ప్రధాన అంశం బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌(బిఆర్‌ఐ). 2049లో (అప్పటికి చైనాలో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చి వంద సంవత్సరాలు అవుతాయి) పూర్తయ్యే ఈ పధకం ద్వారా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలలో పెట్టుబడులు, వాణిజ్య విస్తరణకు చైనా పూనుకుంది. దీనిలో రోడ్డు, సముద్ర మార్గాలు ఉన్నాయి. నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన సమయంలోనే ఇది రూపుదిద్దుకుంది. అదేమీ రహస్యం కాదు, అందరికీ తెలిసిందే, ముఖ్యమంత్రిగా ఎంతో అనుభవం ఉన్న మోడీ ఇలాంటి పధకాన్ని ఎందుకు రూపొందించలేకపోయారు ? చైనా గ్జీ జింపింగ్‌కు ఉన్న తెలివితేటలు మోడీకి లేవా ? నెహ్రూ అలా చేశారు, ఇలా చేశారు అని రోజూ అంతర్గతంగా ఆడిపోసుకోవటం, ఆర్‌సిఇపి, బిఆర్‌ఐ వంటి చర్యల ద్వారా చైనా విస్తరించటాన్ని అడ్డుకోవాలంటూ అమెరికా ఇతర దేశాలతో చేతులు కలిపేందుకు తాపత్రయం తప్ప మన దేశమే అలాంటి పధకాలను రూపొందించాలనే దూరదృష్టి ఎందుకు కొరవడింది?
చైనా లేదా మరొకటి మరొక దేశాన్ని ఆక్రమించుకుంటే దాన్ని వ్యతిరేకించాల్సిందే, అందరూ కలసి అడ్డుకోవాల్సిందే. గతంలో అలా ఆక్రమించుకున్న బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలన్నీ వెనక్కు తగ్గి స్వాతంత్య్రం ఇవ్వకతప్పలేదు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత వలసలు, ఆక్రమణలు లేవు. ఏదో ఒక సాకుతో అమెరికా, దానికి మద్దతు ఇస్తున్నదేశాలే ఇటీవలి కాలంలో ఇరాక్‌, లిబియా, ఆఫ్ఘనిస్తాన్‌లను ఆక్రమించుకుని తమ తొత్తు ప్రభుత్వాలను ఏర్పాటు చేసి పరోక్షంగా పెత్తనం చేస్తున్నాయి తప్ప చైనా అలాంటి చర్యలకు ఎక్కడా పాల్పడలేదు. వాణిజ్యం, పెట్టుబడుల విషయానికి వస్తే ప్రపంచ వాణిజ్య సంస్ధ(డబ్ల్యుటిఓ) 1995లో ఉనికిలోకి రాక ముందు 1948 నుంచి పన్నులు, వాణిజ్యంపై సాధారణ ఒప్పందం(గాట్‌) అమల్లో ఉంది. అమెరికా, ఐరోపా ధనిక దేశాలు దానిలోకి చైనాను ప్రవేశించనివ్వలేదు. దీన్ని మరో విధంగా చెప్పాలంటే తమ ప్రాబల్యంలో ఉన్న ప్రపంచ మార్కెట్‌లోకి చైనా ప్రవేశించకుండా అడ్డుకున్నాయి.(1971వరకు అసలు చైనాకు ఐక్యరాజ్యసమితిలో గుర్తింపే ఇవ్వలేదు.చైనా తిరుగబాటు రాష్ట్రమైన తైవాన్‌లో ఉన్న తొత్తు ప్రభుత్వమే అసలైన చైనా ప్రతినిధి అని దానికే ప్రాతినిధ్యం కల్పించాయి) 2001లో సభ్యత్వమిచ్చాయి.
మనం గమనించాల్సిన అంశం ఏమంటే చైనా ప్రారంభించిన సంస్కరణల్లో భాగంగా అది తన అపార మార్కెట్‌ను తెరిచింది.దానిలో ప్రవేశించాలన్నా, లబ్ది పొందాలన్నా చైనాను డబ్ల్యుటిఓలో భాగస్వామిని చేయకుండా సాధ్యం కాదు. అందుకే గతంలో అడ్డుకున్న అమెరికా వంటి దేశాలే ఐరాసలో, డబ్ల్యుటిఓలో చేరనిచ్చాయి. ఆ అవకాశాన్ని వినియోగించుకొని చైనా నేడు ఒక అగ్రశక్తిగా ఎదిగి ధనిక దేశాలను సవాలు చేస్తోంది. తమకు పోటీగా తయారైన చైనాను సహించలేని అమెరికా, ఇతర ఐరోపా ధనిక దేశాలు మన దేశం పోటీలో ఉండే విధంగా ప్రోత్సహిస్తాయా ? సహిస్తాయా ? చైనాను వ్యతిరేకిస్తే పశ్చిమ దేశాలు మనకేదో తవ్వితలకెత్తుతాయనే భ్రమల్లో ఉన్న మోడీ సర్కార్‌ అయినా ఎండమావుల వెంట పరుగెత్తినట్లుగా వాటిని నమ్ముకొని ఉంది తప్ప తాను చేయాల్సింది చేయటం లేదు, ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అసలే లేదు.2025 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపిని సాధించటం లక్ష్యంగా చెప్పింది తప్ప దానికి అనువైన పరిస్దితుల కల్పనకు పూనుకోలేదు. కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారింది.

గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ధి జాడెక్కడ ?
ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ధ (ఐఎంఎఫ్‌) ప్రధాన ఆర్దికవేత్తగా ఉన్న గీతా గోపీనాధ్‌ మరో ఆర్ధికవేత్త ఇక్బాల్‌ దహలీవాల్‌తో కలసి 2014 మేనెలలో దేశ ఆర్ధిక వ్యవస్ధ గురించి ఒక విశ్లేషణ చేశారు. ప్రస్తుతం భారత్‌ యవ్వనదశలో ఎదుగుతున్న మార్కెట్‌గా ఉంది. దీని అర్ధం రానున్న ఐదు సంవత్సరాలలో ఎలాంటి నాటకీయ పరిణామాలు లేకుండానే అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నారు. అదే జరిగింది, దానికి తోడు చమురు ధరలు పడిపోవటం ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నరేంద్రమోడీ సర్కార్‌ ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేమీ లేకుండానే అభివృద్ధి జరిగింది. తదుపరి చర్యలు లేకపోవటంతో ఐదేండ్ల తరువాత దిగజారింది. జిడిపిలో పరిశ్రమల విలువ వాటా 25శాతం దగ్గర అప్పటికే ఆగిపోయింది. తనకు అధికారమిస్తే గుజరాత్‌ తరహా పారిశ్రామిక వృద్ది దేశమంతటా అమలు చేస్తానని నరేంద్రమోడీ నమ్మబలికారు. ఐదు సంవత్సరాల తరువాత చూస్తే ప్రపంచబ్యాంకు సమాచారం ప్రకారం పరిశ్రమల వాటా 24.88శాతానికి పడిపోయింది. ఈ కాలంలో మెజారిటీ రాష్ట్రాలలో బిజెపిదే పాలన అన్న విషయం తెలిసిందే. ప్రయివేటు పెట్టుబడుల మీద ఆశలు పెట్టుకున్న సర్కార్‌కు కార్పొరేట్‌ కంపెనీలు ప్రభుత్వం ఇచ్చిన రాయితీలతో మూటలు కట్టుకోవటం తప్ప వాటిని పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను స్ధాపించటం లేదు. విదేశీ మదుపుదార్లు మన కార్పొరేట్ల వాటాలను కొనుగోలు చేయటం తప్ప కొత్త పరిశ్రమలు పెట్టటం లేదు. అభివృద్ధి లేకపోవటానికి ఇదొక ప్రధాన కారణం.
చైనాలో ఉత్పాదక ఖర్చులు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ సంస్ధలు ప్రత్యామ్నాయ ఉత్పాదక దేశాల కోసం చూస్తున్నాయని ఈ అవకాశాన్ని భారత్‌ వినియోగించుకుంటే పారిశ్రామిక వృద్ధి సాధించవచ్చని గీతా గోపినాధ్‌ చెప్పారు. చిత్రం ఏమిటంటే ఆరు సంవత్సరాల తరువాత కూడా నరేంద్రమోడీ అండ్‌కో అదే కబుర్లు చెబుతూ చైనా నుంచి ఉత్పాదక కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని చెబుతున్నది, భ్రమలు కల్పిస్తున్నది. 2013లో సులభతర వాణిజ్య సూచికలో మన దేశం 134వ స్ధానంలో ఉండగా 2020లో 63కు ఎదిగినా చైనా నుంచి, మరొక దేశం నుంచి కంపెనీలు వస్తున్న సూచనలేమీ లేవు. ఇప్పటికైనా చైనా గాకపోతే మరొక దేశాన్ని చూసి అయినా అభివృద్ధికి బాట వేస్తారా ? కాకమ్మ కబుర్లు చెబుతూ కాలం గడుపుతారా ?

నవంబరు 26 సార్వత్రిక సమ్మె – దేశాన్ని మాంద్యంలోకి నెట్టిన నరేంద్రమోడీ సర్కార్‌ !

Tags

, ,


ఎం. కోటేశ్వరరావు


ఒక వైపు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాలలో సంస్కరణల పేరుతో ప్రజావ్యతిరేక చర్యలను వేగిరపరచేందుకు, సమస్యల నుంచి జనాన్ని తప్పుదారి పట్టించేందుకు పూనుకుంది. మరోవైపు దానికి ప్రతిఘటన కూడా రూపుదిద్దుకుంటోంది. దానిలో భాగంగానే నవంబరు 26వ తేదీన దేశవ్యాపిత సమ్మెకు కార్మికులు-కర్షకులు సిద్దం అవుతున్నారు. దీనిలో ఎంత మంది పాల్గొంటారు, ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేదాని మీద ముందు లేదా తరువాత గానీ ఎవరికి తోచిన భాష్యం వారు చెప్పుకోవచ్చు. ప్రజావ్యతిరేక చర్యలకు జనం నిరసన గళం ఎత్తుతున్నారా లేదా అన్నది ప్రధాన అంశం. మహానదులు సైతం ప్రారంభంలో పిల్లకాలువల మాదిరే ఉంటాయన్నది తెలిసిందే. ప్రజా ఉద్యమాలైనా అంతే. రెండు సీట్లు ఉన్న స్దాయి నుంచి దేశంలో అదికారాన్ని సంపాదించే స్దితికి ఎదిగామని బిజెపి చెబుతున్నది. దీనికి పరిస్ధితులు అనుకూలించటమే కారణం. కేంద్రంలో, రాష్ట్రాలలో అదే పార్టీ పాలనలో జన జీవనం దిగజారటం ఎక్కువ అవుతున్న కొద్దీ ఇదే సూత్రం ప్రజా ఉద్యమాలకు మాత్రం ఎందుకు వర్తించదు ?
సంస్కరణలతో దిగజారిన పరిస్ధితులను మెరుగుపరుస్తామని బిజెపి చెబుతోంది. అవి రెండు రకాలు, ఒకటి సామాన్యులకు అనుకూలమైనవి, రెండవది కార్పొరేట్లకు ప్రయోజనం కలిగించేవి. ఇప్పటి వరకు అనుసరించిన విధానాలు జనానికి అనుకూలంగా లేవు కనుకనే కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందే దేశ అభివృద్ధి రేటు దిగజారింది, అంటే సామాన్యుల బతుకులు దెబ్బతిన్నాయి. జనం పేరుతో కార్పొరేట్లకు అనుకూల విధానాలను ఎంత త్వరగా గ్రహిస్తారన్నదాని మీద ప్రజా ఉద్యమాల ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.


నవంబరు 20వ తేదీ నాటికి విదేశీ సంస్ధాగత మదుపుదార్లు గత రెండు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత ఎక్కువగా నవంబరు మాసంలో పెట్టుబడులు పెట్టారని విశ్లేషకులు ప్రకటించారు. ఇవి మన విదేశీమారక ద్రవ్య నిల్వలను గణనీయంగా పెంచుతాయి. చూశారా నరేంద్రమోడీ గారు విదేశాల్లో మన ప్రతిష్టను పెంచిన కారణంగానే ఇది సాధ్యమైందని మరుగుజ్జు సైన్యం(ట్రోల్స్‌) సామాజిక మాధ్యమంలో ప్రచారం మొదలు పెట్టవచ్చు. అభివృద్ధి లేకుండా డాలర్లు పెరగటం అది కూడా రూపాయి విలువ పతనం అవుతున్న స్ధితిలో అది వాపా బలమా అన్నదానితో వారికి నిమిత్తం ఉండదు.
ఎప్పటికెయ్యది అప్పటికా మాటలాడి తప్పించుకు తిరుగువారు ధన్యుడు సుమతీ అన్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో బిజెపి పెద్దల మాటలు, వారి మరుగుజ్జుల సామాజిక మాధ్యమ ప్రచారంలో కొన్ని పదాలు వినిపించటం లేదు. రైతుల ఆదాయాల రెట్టింపు, ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి వాటిలో కొన్ని. కరోనాను సమర్దవంతంగా ఎదుర్కొన్నామని చెప్పుకొనేందుకు ఎలాంటి వెనుకా ముందూ చూడటం లేదు. ఎవరితో పోల్చుకొని అలా మాట్లాడుతున్నారో, అసలు ఎదుర్కోవటం అంటే ఏమిటో ఎంత మంది ఆలోచిస్తున్నారు ?

కరోనా ఉద్దీపన 3.0 ప్రకటన తరువాత నవంబరు 12న ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పినట్లుగా మొత్తం ఉద్దీపనల విలువ రూ.29,87,641 కోట్లు. అంటే 30లక్షల కోట్లు అనుకుందాం. ఇది జిడిపిలో 15శాతం, ఒక్క కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన విలువే జిడిపిలో 9శాతం అన్నారు. అయితే అంతర్జాతీయ సంస్ధ స్టాటిస్టా డాట్‌కామ్‌ వెల్లడించిన సమాచారం వేరుగా ఉంది. అక్టోబరు 12 నాటికి జి20 దేశాలు ప్రకటించిన ఉద్దీపనలు జిడిపిశాతాల్లో 21.1శాతంతో జపాన్‌ అగ్రస్ధానంలో ఉంది. మన దేశ ఉద్దీపన 6.9, చైనా ఏడుశాతాలుగా ఉన్నట్లు అది పేర్కొన్నది. తరువాత ప్రకటించిన మూడవ విడత ఉద్దీపనను కూడా కలుపుకుంటే ఒకటో రెండోశాతం పెరగవచ్చు తప్ప 15శాతం అయి ఉండే అవకాశం లేదు. అందువలన ఇక్కడ ఉద్దీపన అంటే మన పాలకులు చెబుతున్న భాష్యానికి, అంతర్జాతీయ సంస్దలు చెబుతున్న, పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు భిన్నంగా ఉన్నట్లు చెప్పవచ్చు.

మూడు సార్లు ఉద్దీపన ప్రకటించిన తరువాత ప్రపంచంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన దేశంగా భారత్‌ ఉండనున్నదని ఆక్స్‌ ఫర్డ్‌ ఎకనమిక్స్‌ ప్రకటించటమే చర్చించాల్సిన అంశం.2020-25 సంవత్సరాల మధ్య ఆర్ధిక వ్యవస్ధ పురోగతి గతంలో వేసిన అంచనా 6.5శాతానికి బదులు 4.5శాతం ఉంటుందని తన జోశ్యాన్ని సవరించింది. గతంలో అంతర్జాతీయ అర్ధిక సంస్ధలు చెప్పిన అనేకం నిజం కాలేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్ద వర్తమాన సంవత్సరంలో మన ఆర్ధిక వ్యవస్ధలో 4.5శాతం తిరోగమనాన్ని అంచనా వేస్తే కొందరు 15శాతం అని చెప్పారు. అంతిమంగా ఎంత ఉంటుందో చూడాల్సి ఉంది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో తిరోగమనం పదిశాతానికి అటూ ఇటూగా ఉండవచ్చని వివిధ తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి మోడినోమిక్స్‌ ద్వారా భారత ఆర్ధిక వ్యవస్ధను ఐదులక్షల కోట్ల డాలర్ల స్ధాయికి తీసుకుపోతానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది జరిగేనా ?


ఏడాదికి 11.6శాతం చొప్పున అభివృద్ధి రేటు ఉంటే 2021 నుంచి 2026-27 నాటికి ఐదులక్షల డాలర్ల స్ధాయికి జిడిపి చేరుతుందని కొందరు చెబుతున్నారు. దీనికి గాను ఈ కాలంలో 500లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరం. మరి అక్స్‌ఫర్డ్‌ అంచనా 4.5శాతం ప్రకారం ఎప్పటికి చేరేను ? ఇలాంటి అంచనాలు కొన్ని అంశాలు స్ధిరంగా ఉంటాయనే భావనతో తయారవుతాయి. ఉదాహరణకు 2018-19 సంవత్సర అంచనా ప్రకారం దేశ జిడిపి 2.7లక్షల కోట్ల డాలర్లు. దీన్ని ఐదు సంవత్సరాలలో ఐదులక్షల కోట్ల డాలర్లకు చేర్చాలని నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. దీనికి గాను ఐదు సంవత్సరాలలో ఉత్పత్తి 84శాతం లేదా పదమూడు శాతం చొప్పున పెరగాల్సి ఉంటుంది.వార్షిక ధరల పెరుగుదల నాలుగుశాతం ఉంటుందని, వృద్ధి రేటు 9శాతం చొప్పున ఉండాలని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధి రేటు 7.1శాతానికి మించలేదు. ఎన్నడూ తొమ్మిదిశాతానికి చేర లేదు. ఈ స్ధాయికి చేరాలంటే పొదుపు రేటు 39, పెట్టుబడి రేటు 41.2శాతం చొప్పున ఉండాలి. 1951-2019 మధ్య మన దేశ సగటు పొదుపు రేటు 18.6 శాతం. కనిష్టంగా 1954 మార్చినెలలో 7.9శాతం, గరిష్టంగా 2008లో 37.8శాతం ఉంది. 2018లో 32.4 శాతం ఉండగా మరుసటి ఏడాది 30.1శాతానికి పడిపోయింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఎంతకు దిగజారుతుందో ఇప్పుడే చెప్పలేము. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ సంస్ధ 2025 వరకు సగటు వృద్ది రేటు 4.5శాతం ఉంటుందని చెప్పింది. అంతకంటే ఎక్కువ ఉన్న సమయంలోనే పొదుపు రేటు పడిపోయింది కనుక రాబోయే రోజుల్లో దిగజారటం తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ అంచనా వెలువడిన తరువాత దాని మీద కేంద్రం వైపు నుంచి ఎలాంటి స్పందనలూ వెలువడలేదు.


మన ఆర్ధిక వ్యవస్ధ ప్రయివేటు వినియోగం, పెట్టుబడుల మీద ఆధారపడి ఉంది. గత ఏడాది తొలి మూడు మాసాల్లో ఈ మొత్తం రూ.43లక్షల కోట్లు కాగా ఈ ఏడాది అదే కాలంలో 14లక్షల కోట్లకు పడిపోయింది. మరోవైపు ప్రభుత్వ ఖర్చు రూ.1.2లక్షల కోట్లు మాత్రమే పెరిగింది. ఇది ఆర్ధిక వ్యవస్ధకు ఏ మాత్రం ఊతం ఇవ్వలేదు అన్నది వేరే చెప్పనవసరం లేదు. మన విదేశీమారక ద్రవ్యనిల్వలు రికార్డు స్ధాయికి పెరిగాయని కొందరు సంబర పడుతున్నారు. కరోనా కారణంగా మన ఎగుమతులతో పాటు ఎక్కువగా దిగుమతులు పెద్ద మొత్తంలో తగ్గాయి. ఈ కారణంగా కొంతమేర ఆదా జరిగి పెరిగినట్లు కనిపించవచ్చు.


విదేశీ సంస్ధాగత మదుపుదారులు నవంబరు మూడవ వారం నాటికి రికార్డు స్ధాయిలో రూ.43,732 కోట్ల రూపాయల విలువగల మన కంపెనీల వాటాలను స్టాక్‌ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఐరోపా ధనిక దేశాల్లో మరోసారి కరోనా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతుండటం, అమెరికాలో ఎన్నికలు ముగియటం, ఏప్రిల్‌ నుంచి డాలరు బలహీనపడుతున్న నేపధ్యంలో ఇది జరిగిందని చెబుతున్నారు. అక్కడ పరిస్ధితి కుదుటపడిన తరువాత లేదా డాలరు విలువ పెరిగితే వారంతా పొలోమని వెనక్కు వెళ్లిపోతారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.
మన జిడిపి ఈ ఏడాది పదిశాతంపైగా తిరోగమనంలో ఉంటుందని రేటింగ్‌ సంస్దలు ప్రకటించాయి. వచ్చే ఐదేండ్ల వరకు సగటున 4.5శాతానికి మించి వృద్ధి రేటు ఉండదని ఆక్స్‌ఫర్డ్‌ చెప్పింది. అయినా విదేశీ మదుపుదార్లు ఎగబడి మన కంపెనీల వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తున్నారు ? కరోనా కాలంలో మన కంపెనీలు ఎలా లాభాలు పొందాయో తెలుసుకుంటే అసలు కిటుకు అర్ధం అవుతుంది. సిఎంఐయి నివేదిక ప్రకారం సెప్టెంబరు నెలతో ముగిసిన త్రైమాస కాలంలో 1,897 కంపెనీలు రూ.1,33,200 కోట్ల రూపాయల మేరకు నిఖర లాభాలు ఆర్జించాయి. ఇవే కంపెనీలు 2019 జూన్‌తో ముగిసిన మూడు మాసాల కాలంలో ఆర్జించిన లాభాలు 1,06,600 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మార్చి నెలతో ముగిసిన త్రైమాస కాలంలో రూ.32,000 కోట్లు, జూన్‌తో ముగిసిన మూడు నెలల్లో 44,100 కోట్లు లాభాలను ఆర్జించగా గత నాలుగు త్రైమాస కాలాల్లో వాటి సగటు లాభం రూ.50,200 కోట్లు ఉంది. ఉద్దీపనల పేరుతో జనానికి ఏమూలకూ చాలని బియ్యం, కందిపప్పు, కొంత నగదు తప్ప మరేమీ లేదు. ఉపాధి కల్పన, ఆర్ధికవ్యవస్ధ పునరుద్దరణ వంటి అకర్షణీయమైన పేర్లతో ఉద్దీపనలన్నీ కార్పొరేటు సంస్దలకే ఇచ్చినందువల్లనే వాటికి ఆ లాభాలు వచ్చాయి. అందువలన తమ దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున విదేశీమదుపుదార్లు మన వాటాలు కొనుగోలు చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్య నిల్వల గురించి జనానికి చెప్పటానికి, ప్రచారం చేసుకోవటానికి తప్ప ఆ మదుపు సొమ్ము పెట్టుబడులుగా పెట్టేందుకు పనికిరాదు. పెట్టుబడిదారులు ఎప్పుడు వాటాలు అమ్ముకుంటే అప్పుడు వారికి లాభాలతో సహా అసలు సొమ్మును మనం డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచంలో బిలియనీర్ల సంపద కరోనా కాలంలో 27.5శాతం పెరిగితే, మన దేశంలో అది 35శాతం ఉంది. అందుకే విదేశీ కంపెనీల ఆసక్తి అని వేరే చెప్పనవసరం లేదు.

ఈ ఏడాది తిరోగమనంలో ఉన్నప్పటికీ వచ్చే ఏడాది పరిస్ధితి మరింతగా మెరుగుపడనుందనే అంచనాలు వెలువడటం కూడా ఒక కారణం. లాభాలను చూసి విదేశీ మదుపుదార్లు పెట్టుబడులు పెడుతుంటే మరోవైపు స్వదేశీ మదుపుదార్లు తమ వాటాలను విక్రయించుకొని లాభాలు తీసుకుంటున్నారు. ఇదే కాలంలో వారు 32వేల కోట్ల రూపాయల విలువైన వాటాలను విక్రయించారు.
ప్రపంచ బ్యాంకు సంస్కరణలకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ను కార్యస్దానంగా ఎలా మార్చారో అదే మాదిరి కార్మిక సంస్కరణలకు రాజస్దాన్ను ఎంచుకున్నారు. సంస్కరణలకు ముందు, తరువాత ఏమి జరిగిందో చూడండి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆర్ధి సర్వేలలో చెబుతున్నది. సరళీకృత కార్మిక చట్టాలు అమలు జరిగిన తరువాత, ముందు రాజస్ధాన్‌, సడలింపులు లేని రాష్ట్రాల తీరుతెన్నులను పోల్చి చూడమంటోంది. దాని ప్రకారం వంద మందికి పైగా సిబ్బంది ఉన్న ఫ్యాక్టరీలు రాజస్ధాన్‌లో 3.65 నుంచి 9.33శాతానికి పెరిగితే మిగతా దేశంలో 4.56 నుంచి 5.52శాతానికి పెరిగాయి. ఉత్పత్తి రాజస్ధాన్‌లో 3.13 నుంచి 12శాతానికి పెరిగితే దేశంలో 4.8 నుంచి 5.71శాతానికి పెరిగింది. కార్మికుల సంఖ్య విషయానికి వస్తే రాజస్ధాన్‌లో ఉండాల్సిన వారి కంటే 8.89 తక్కువ నుంచి 4.17శాతానికి పెరిగింది, దేశంలో అది 2.14 నుంచి 2.6 శాతానికి మాత్రమే పెరిగింది. అంటే రాజస్ధాన్‌లో కార్మిక చట్టాలను సరళీకరించినందువలన ఉపాధి 13.06శాతం పెరిగిందని చెబుతున్నారు. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే.ఇది నిజమైతే, దీనికి కారణాలేమిటో పరిశీలించవచ్చు. దాని కంటే ముందు మరోవైపున ఏమి జరిగిందో చూద్దాం.

2017లో విడుదల అయిన అంతర్జాతీయ కార్మిక సంస్ద నివేదిక ప్రకారం ఉత్పాదక రంగంలో ఉత్పత్తి, జత అయిన విలువలో వేతనాల శాతం 1980-81లో ఉన్న 43.9నుంచి 2012-13 నాటికి 23.6శాతానికి పడిపోయింది.రాజస్ధాన్‌లో ఇది 23 నుంచి 14.4శాతంగా ఉంది. అంటే అక్కడ వేతనాలు సంస్కరణలకు ముందే ఎంత తక్కువగా ఉన్నాయో వెల్లడి అవుతోంది. 2014-15కు ముందు వేతనాల పెరుగుదల శాతం 14-15శాతం ఉన్నట్లు పరిశ్రమల వార్షిక సర్వే వెల్లడించింది. బిజెపి పాలకుల సంస్కరణల తరువాత 2014-15లో 11.5శాతం ఉండగా తరువాత రెండు సంవత్సరాలలో 6.1, 3.5శాతాలకు పడిపోయాయి. యజమానుల దయాదాక్షిణ్యాలకు వదలి వేసి చట్టాలకు కోరలు లేకుండా చేయటంతో కార్మికులకు బేరమాడేశక్తి తగ్గిపోయినట్లు ఇది వెల్లడిస్తోంది. సంస్కరణల తరువాత కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది, దీనర్ధం ఏమిటి శాశ్వత కార్మికుడికి ఇచ్చే వేతనంలో సగంతో కాంట్రాక్టు కార్మికులు దొరుగుతున్నారు. వారికి అలవెన్సులు, ఇఎస్‌ఐ వంటి పరిమిత రక్షణలు ఉండవు, యజమానులు చెల్లించాల్సిన అగత్యమూ లేదు. అందువలన కార్మికుల సంఖ్యను పెంచుకొని ఉత్పత్తినీ పెంచుకొనేందుకు యజమానులకు అన్ని అవకాశాలు కల్పించారు. ఇంతగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెబుతున్న రాజస్ధాన్‌లో దేశ సగటు కంటే నిరుద్యోగం ఎందుకు ఎక్కువగా ఉన్నట్లు ? సిఎంఐయి సమాచారం ప్రకారం 2019 జూలైలో దేశంలో 7.5శాతం ఉంటే రాజస్ధాన్‌లో 10.6శాతం నిరుద్యోగం ఉంది. అందువలన ఒక వైపు పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల సంపదలు పెరుగుతుండగా కార్మికులు వారిమీద ఆధారపడుతున్నవారి జీవితాలు దిగజారుతున్నాయి. కొనుగోలు శక్తి పడిపోయేందుకు ఇది కూడా ఒక కారణం. వినిమయం మీద ఆధారపడి ఆర్ధిక వ్యవస్ధలను అభివృద్ధి చేయాలని చూసే విధానంలో అంతర్గతంగా ఉన్న ఈ వైరుధ్యం కారణంగా కరోనాతో నిమిత్తం లేకుండానే ఆర్ధిక వ్యవస్ధ దిగజారటం ప్రారంభమైంది.

కరోనా పూర్తిగా అంతరించిన తరువాత కూడా పూర్వస్ధాయి కంటే ఉత్పత్తి 12శాతం తగ్గుతుందని మన దేశం గురించి ఆక్స్‌ఫర్డ్‌ అంచనా కట్టింది. మరోవైపు మన దేశం నవంబరు 27న ప్రకటించే వివరాలతో సాంకేతికంగా మాంద్యంలో ప్రవేశించనున్నట్లు రిజర్వుబ్యాంకు ముందే ప్రకటించింది. నిజానికి ఇప్పుడు మనం మాంద్యంలోనే ఉన్నాం. సరైన వివరాలు లేని కారణంగా తొలి, రెండవ త్రైమాస వృద్ధి వివరాలను సకాలంలో ప్రకటించటంలో మోడీ సర్కార్‌ విఫలమైంది. ఏ దేశ ఆర్ధిక వ్యవస్ధలో అయినా ఆరునెలల పాటు తిరోగమన వృద్ధి నమోదు అయితే మాంద్యంలో ప్రవేశించినట్లు పరిగణిస్తారు. మూడవ త్రైమాసం కూడా డిసెంబరుతో ముగియనుంది.
వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం మోపే భారాలను మోసేందుకు సిద్దంగా ఉన్నారా లేక దిక్కుతోచక భరిస్తున్నారా ? పెట్రోలు, డీజిలు మీద పన్నులు, ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం ఆదాయవనరుగా మార్చుకుంది. గతంలో బిజెపి మరుగుజ్జులు కేంద్రం మోపుతున్న భారాల కంటే రాష్ట్రాలు మోపే పన్నుల భారం ఎక్కువ అని సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి భారాలను సమర్ధించారు. 2014 మార్చి నుంచి 2020 సెప్టెంబరు మధ్య పెట్రోలు మీద పన్ను భారం లీటరుకు రూ.10.38 నుంచి రూ.32.98( రెండువందల శాతానికి పైగా), డీజిలు మీద ఇదే కాలంలో రూ.4.58 నుంచి రూ.31.83కు(ఆరువందల శాతంపైగా) పెంచినా దేశభక్తిగా భావించి చెల్లిస్తున్నాము. రాష్ట్రాల పెంపుదల్లో తేడాలు ఉండవచ్చు గానీ ఏ రాష్ట్రమూ ఇంత భారీగా పెంచలేదు. ఉదాహరణకు ఢిల్లీలో పెట్రోలు మీద 60, డీజిలు మీద 68శాతం వ్యాట్‌ పెరిగింది.

2014-15 నుంచి 2019-20వరకు చూస్తే పెట్రోలు, డీజిల్‌ మీద కేంద్ర ప్రభుత్వానికి ఎక్సయిజు పన్ను ఆదాయం రూ. 1,72,000 కోట్ల నుంచి రూ.3,34,300 కోట్లకు పెరిగింది. ఇదే సయయంలో రాష్ట్రాల ఆదాయం రూ.1,60,500 కోట్ల నుంచి రూ. 2,21,100 కోట్లకు పెరిగింది. ఈ కారణంగానే బిజెపి మరుగుజ్జులు ఇటీవలి కాలంలో దీని గురించి నోరుమూసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరను బట్టి రోజు వారీ వినియోగదారులకు సవరిస్తామని చెప్పిన కేంద్రం దానికి విరుద్దంగా ప్రస్తుతం పెంచటమే తగ్గించటం లేదు. వినిమయం తగ్గినా కంపెనీల లాభాలు, కేంద్ర, రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూసేందుకే ఈ పని చేస్తున్నారు. అయినా వినియోగదారులు కిమ్మనటం లేదు.


2017-18 నాటి వివరాల ప్రకారం దేశంలో ఒక వ్యక్తి రోజువారీ సగటు జిడిపిలో 25శాతం మొత్తాన్ని పెట్రోలు మీద ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇది రాష్ట్రాలలో బీహార్‌లో 94శాతం, యుపిలో 50శాతం ఉండగా చైనాలో నాలుగు, వియత్నాంలో 8, పాకిస్ధాన్‌లో 17శాతం ఉంది. ఇది పెరిగే కొద్దీ వినియోగదారుల మీద భారం పెరుగుతుంది. ఆర్ధిక వ్యవస్ధ మీద ప్రతికూల ప్రభావం చూపి ఆర్ధిక వ్యవస్ధ పునరుద్దరణ మందగిస్తుంది. చమురు మీద పన్నును ప్రభుత్వం బంగారు బాతుగా పరిగణిస్తున్నది. ఎక్కువ గుడ్ల కోసం ప్రయత్నిస్తే ఏమౌతుందో తెలిసిందే.
నవంబరు 26వ తేదీ ఆందోళన నరేంద్రమోడీ ఆరున్నర సంవత్సరాల పాలనా కాలంలో ఐదవది. కష్టజీవులు ముందుకు తెచ్చిన అంశాలను నిర్లక్ష్యం చేసినకొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవు. మోడీ సర్కార్‌ వాటిని నివారిస్తుందా ? మరింతగా పెంచుతుందో తేల్చుకోవాలి.

అమెరికా సైనికకూటములలో భారత్‌ చేరవద్దు !

Tags

, ,


డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌


”సామాజిక అభ్యున్నతి కార్యక్రమాల కంటే సైనిక రక్షణ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్న దేశం ఆధ్యాత్మిక మరణానికి చేరుకుంటుంది” – మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌.
నవంబరు 6 న చుషుల్‌ లో జరిగిన 8 వ విడత కోర్‌ కమాండర్‌ స్ధాయి చర్చలలో, సరిహద్దులోని ఉద్రిక్తతలను తొలగించి, సైనిక ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు భారత-చైనా దేశాలు ఒక అంగీకారానికి వచ్చే అవకాశాలున్నాయని వార్తలు వచ్చాయి. ఇది ఆహ్వానించదగిన పరిణామం. మరొక పక్క రెండో దఫా మలబార్‌ సైనిక విన్యాసాలు నవంబరు 17 నుండి జరుగుతున్నాయి. అమెరికా నాయకత్వాన జరుగుతున్న ఈ విన్యాసాలలో భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియాలు పాల్గొంటున్నాయి. జపాన్‌ కొన్ని దీవుల విషయంలో చైనాతో వివాద పడుతోంది. అయితే వాటికోసం యుద్దానికి దిగేస్థితి లేదు. మరోవైపు అమెరికా ప్రభావం నుంచి బయటపడి స్వతంత్రశక్తిగా ఎదిగేందుకు, మిలిటరీశక్తిగా, మారాలని చూస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే అమెరికా అనుంగు దేశంగా మలబార్‌ సైనిక విన్యాసాలలో పాల్గొంటున్నది.

చైనాను చుట్టుముట్టాల
మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో చైనా కొత్త దారులను తొక్కి అమెరికా తో సహా ప్రపంచప్రజలందరికీ కావలసిన వినియోగ వస్తవులను, ఎలక్ట్రానిక్‌ సామానులనుతయారుచేసి తక్కువ ధరలకు అందిస్తున్నది. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ ద్వారా రవాణాసౌకర్యాలను అభివ ధి చేసి ఆఫ్రికా, యూరప్‌ లతో తన వాణిజ్య వ్యాపారాలలో పైచేయిసాధింటానికి అమెరికా తో పోటీపడుతోంది. ప్రత్యర్ధి ఆర్ధిక శక్తిగానే కాక సైద్దాంతిక శత్రువుగా కూడా అమెరికా పరిగణిస్తున్నది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సైనికంగా దిగ్బంధించాలని ప్రయత్నం చేస్తున్నది. అందుకు మన దేశాన్ని క్రమేపీ సైనిక కూటమిలో చేర్చుకోవటానికి కుట్ర పన్న్నుతోంది. సైనిక విన్యాసాలని, వాతావరణ, ప్రదేశిక సమాచారాన్ని పంచుకు నే ” బెకా ”అని రకరకాల ఒప్పందాలలో ఇరికించే ప్రయత్నాలలో వుంది.
1998 లో భారత దేశం అణుపరీక్షలు నిర్వహించటం , అమెరికాకు కోపం తెప్పించింది, ఆర్ధిక ఆంక్షలను విధించింది. సంవత్సరాల చర్చలు, సర్దుబాట్లు, ఒప్పందాలు, లొంగుబాట్ల వలన 2005 సం,లోఆంక్షలను క్రమంగా సడలించారు. పది సంవత్సరాల రక్షణ వ్యవహార సంబంధాల వ్యూహానికి సంబంధించిన ఫ్రేమ్‌ వర్క్‌ ను భారత-అమెరికాలు ఏర్పరచుకొని 2013 లో రక్షణ వ్యవహారాల సహకారం పై సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. . 2015 లో రక్షణ వ్యవహారాల వ్యూహ ఫ్రేమ్‌ వర్క్‌ ను మరో పదేళ్ళు పొడిగించారు.
2000 సం లో 20 బిలియన్‌ డాలర్లున్న భారత- అమెరికా వాణిజ్యం 2018 నాటికి 140 బిలియన్లకు చేరుకుంది .2005 సం . వరకు రక్షణ పరికరాలు 400 మిలియన్‌ డాలర్ల నుండి 18 బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

సోవియట్‌ పతనంతో అంతరిస్తున్నఅలీన విధానం ,

భారత ప్రభుత్వం 1947 నుండి 1991 వరకు అలీన విధానం కొనసాగించింది. ఆసియా, ఆఫ్రికా దేశాల విముక్తిపోరాటాలకు అలీన ఉద్యమం సహాయాన్నందించింది.పంచవర్ష ప్రణాళికలకు సోవియట్‌ సహాయం అందించింది.భారీ పరిశ్రమలైన ఉక్కు ఫ్యాక్చరీలకు, భారత మందుల పరిశ్ఱమలకు నిస్వార్ధంగా సహాయాన్నిందించింది. 1971 లో ఇందిరా గాంధీ తోశాంతి, స్నేహం, సహకార ఒప్పందం చేసుకుని సోవియట్‌కు దగ్గరయింది. అలీన ఉద్యమం బలహీన పడటం, అలీనోద్యమ నాయకులైన నెహ్రూ, నాజర్‌, టిటో, కాస్ట్రో, సిరిమావో లు అంతరించటం అమెరికా అనుకూల భావజాలానికి అడ్డు తొలగింది. సోవియట్‌ రష్యాను విచ్చిన్నం చేయటంలో అమెరికా సఫలమయ్యింది. సాంకేతికంగా ఆధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న అమెరికా సైనిక బలంలోనూ తన అధిపత్యాన్ని నిరూపిస్తూ ఏకధ వ ప్రపంచానికి నాయకత్వం వహించింది. కార్పోరేట్‌ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, ఆర్ధిక సంక్షోభాలను నివారించలేకపోయింది.అమెరికా దేశం అప్పులలో మునుగుతూంది. 906 బిలియన్‌ డాలర్ల అమెరికన్‌ ట్రెజరీ సెక్యూరిటీలు చైనా చేతిలో వున్నాయి., జపాన్‌ 877, ఆయిల్‌ ఎగుమతిదారులు213 బిలియన్‌ డాలర్ల ట్రెజరీ సెక్యూరిటీలనుస్వంతం చేసుకున్నారు.

సోషలిజం, కమ్యూనిజం చర్చలోకివచ్చింది

అమెరికాలో నిరుద్యోగం, అసమానతలు పెరిగిపోవటంతో సోషలిజం, కమ్యూనిజం . సోషల్‌ డెమోక్రసీ చర్చలోకివచ్చింది.ఆర్ధిక సంక్షోభాల సుడిగుండాలనుండి బయటపడటానికి మార్కెట్ల కోసం వెతుకులాటలో వుంది. అమెరికా విదేశాంగ విధానం ముఖ్యంగా మిలిటరీ రీత్యా ఘోరంగా విఫలమయింది. ఇరాక్‌, ఆఫ్గనిస్ధాన్‌ లలో ఎదురైన పరాజయంతో ప్రత్యక్షయుద్ధానికి వెనుకాడుతోంది. జనవరి3, 2020 న ద్రోన్‌ ద్వారా ఇరాన్‌ మేజర్‌ జనరల్‌ ఖాసిమ్‌ సొలేమాన్‌ని బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దొంగదెబ్బతీసి హతమార్చింది. భారతలాంటి దేశాలను తన వైపు చేర్చుకోవటానికి చైనాతో సరిహద్దు తగాదాను ఒక మంచి అవకాశంగా మలుచుకుంటున్నది. బిగుసుకుంటున్న బంధం ధ్రుతరాష్ట్ర కౌగిలి ని గుర్తుచేస్తున్నది. ప్రేమ నటిస్తూ దగ్గరకు తీసుకుంటూ ప్రాణాలుతీసే ప్రయత్నాన్ని ధ్రుతరాష్ట్ర కౌగిలి అంటారు.


ఇండో-పసిఫిక్‌ పాలసీ
ఇండో-పసిఫిక్‌ పాలసీ ని ముందుకు తెచ్చింది ట్రంప్‌ కాదు. ఒబామా , బిడెన్‌ అధికారంలో వుండగానే ఈ విధానాలకు శ్రీకారం చుట్టారు. చైనా ప్రభావాన్ని ఆసియా దేశాలపై నివారించటానికి 2015 లో ఢిల్లీలో ఒబామా భారత-అమెరికా ల విజన్‌ స్టేట్‌ మెంట్‌ పై సంతకం చేశారు. అదే విధానాలను ట్రంప్‌ కొనసాగించాడు.
నాటో సైనిక కూటమి మాదిరి క్వాడ్‌ సైనిక కూటమి
దక్షిణచైనా సముద్రాన్ని మరొక సైనిక కూటమికి కేంద్రంగా చేయాలని 1992 నుంచి కొనసాగుతున్న అమెరికా వ్యూహం ఫలించిందనే చెప్పాలి. ఆమెరికా ఆర్ధిక సంక్షోభం నుండి బయటపడాలంటే ఆయుధాలను అమ్ముకోవాలి. మలబార్‌ సైనిక విన్యాసాలు తొలిదశలో భారత-అమెరికా నౌకాదళాల శిక్షణాకార్యక్రమాలకు మాత్రమే పరిమితమని ప్రచారంచేశారు. 2015లో జపాన్‌ చేరింది. కొత్తగా ఆస్ట్రేలియాను భయపెట్టి, బతిమిలాడి చతుష్టయ కూటమిలోకి చేర్చుకొన్నారు. 2015 సం.లో జరిగిన మలబార్‌ విన్యాసాలకు భారత్‌ నౌకాదళం రెండు యుద్దనౌకలను మాత్రమే పంపింది, ఇపుడు 2020 లో విమానవాహక యుద్ద నౌక, సబ్‌ మెరైన్‌ లను కూడా పంపింది. బంగాళాఖాతంలో నవంబర్‌ 3న మలబార్‌ -2020 పేరున సైనిక విన్యాసాలు ప్రారంభించాయి.అరేబియా సముద్రంలో 17 వ తేదీనుండి 20వ తేదీ వరకు ఈ విన్యాసాలు జరిగాయి. చైనా ను చుట్టుముట్టి నిలవరించాలనే పధకం 2007లో నే మొదలయింది.అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు డిక్‌ చెనీ, అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబే ఈ పధకాన్ని ఆమోదించి ”చతుష్టయాన్ని” ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. అప్పటి ఆస్ట్రేలియా ప్రధాని జాన్‌ హౌవర్డ్‌, భారత ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ దీనిని ఆమోదించారు.

ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు
చైనా ను నివారించ్చాలన్న అమెరికా ప్రయత్నాలకు మనం ఎందుకుసహకరించాలన్నదే ముఖ్యమైన అసలుప్రశ్న. చైనాలో ఆర్ధిక అభివ ద్ధి జరిగిన స్థాయి లో ఆ దేశ సైనిక ,భౌగోళిక, రాజకీయ శక్తీ పెరగలేదు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో ఇప్పటికీ అమెరికా దే పైచేయి. సైనిక బడ్జెట్‌, సైన్యం, అణ్వస్త్రాలు, విదేశాల్లో సైనికస్తావరాలు మొదలైన వాటిలో ఏ దేశమూ అమెరికా దరిదాపుల్లోకూడా లేదు. చైనా బలమైనఆర్ధిక శక్తిగా ఎదగడం, ఇరుగు పొరుగు దేశాలలో పలుకుబడి పెరగటంవలన ఆసియా-పసిఫిక్‌ లో అమెరికా అధిపత్యానికి భంగం కలిగింది.అమెరికా భధ్రతకు ముప్పు లేకపోయినా సవాలు మాత్రం ఎదురైంది. దక్షిణచైనా సముద్రంలో అమెరికాకు ఉపయోగపడే నిఘాకు భారతదేశం అంగీకరించింది. సైనిక వ్యూహంలో భాగంగా అండమాన్‌ నికోబార్‌ దీవులను కీలక మిలిటరీ కేంద్రంగా చేస్తున్నారు. చైనా సముద్ర వాణిజ్య మార్గంలో కీలకంగా వుండే మలక్కా జలసంధికి అండమాన్‌ దీవులు సమీపంలో వున్నాయి. చైనా వ్యతిరేక సైనిక వ్యూహంలోఅండమాన్‌ దీవులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.ప్రశాంత సముద్రజలాలలో బలప్రదర్శనలు చేయటానికి మనదేశం అంగీకరించినందువలన సైనిక కూటములలో ప్రత్యక్షభాగస్వాములౌతున్నాము.
సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవటానికి ఉన్నత రాజకీయ , దౌత్య స్ధాయిలో చైనా తో భారత ప్రభుత్వ చర్చలు కొనసాగించటం వలన దాదాపు 40 సంవత్సరాలు భారత-చైనా దేశాలు తమ అభివ ద్ధిపై కేంద్రీకరించగలిగాయి.భారత-చైనా దేశ ప్రజల విశాల ప్రయోజనాల ద ష్ట్యా ఇరు దేశాల నాయకులు ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర్ణయాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి. బయటి వారెవరూ సైన్యాన్ని మనకు సహాయంగా పంపరు. ఆయుధాలను మనకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. ఆయుధపోటీని పెంచుతారు. అమెరికా అధ్యక్షుడు ఐసెన్‌ హౌవర్‌ చెప్పినట్లుగా అమెరికాను మిలిటరీ – ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ పరిపాలిస్తున్నది. అమెరికా లాగా మనం సైనిక-రక్షణ రంగ పరిశ్రమల (మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌) పరిపాలనలోకి వెళ్ళరాదు. మిలిటరీ-ఇండిస్టియల్‌ కాంప్లెక్స వలన పెరుగుతున్నప్రమాదాల గురించి హెచ్చరించాడు.కానీ ఆయుధ రేసు ను నివారించలేకపోయాడు.

” తయారైన ప్రతి తుపాకీ, ప్రతి యుద్ధ నౌక, ప్రయోగించిన ప్రతి రాకెట్‌ -ఆకలి బాధతో ఉన్నవారినుండి దొంగిలించినవే. ధరించటానికి దుస్తులు లేనివారుండగా ఆయుధాలకు డబ్బు మాత్రమే ఖర్చు చేయటంలేదు. ఆయుధాల తయారీలో కార్మికుల చెమట, శాస్త్రవేత్తల మేధావితనంతోపాటు మన పిల్లల ఆశలు కూడా ఖర్చు చేస్తున్నాము.” అని ఐసెన్‌ హౌవర్‌ చెప్పాడు.

ఈ యుధాలు ఎవరికోసం ?
రక్షణ పరిశ్రమలు నడవటంకోసం యుద్ధాలుకావాలి. ఆధునిక ఆయుధాలను తయారు చేయటానికి ప్రపంచంలోని మేధావులను , సైంటిస్టులను అమెరికా ఆహ్వానించి ఆధునిక సౌకర్యాలను, అవకాశాలను, పని చెసే వాతావరణాన్ని స ష్టిస్తున్నది. కొత్తకొత్త ఆయుధాలను తయారుచేసి ఇరుపక్షాలకు ఆయుధాలను అమ్ముకుంటున్నది. సోవియట్‌ పతనం తరువాత అమెరికా కు కొత్త శత్రువు అవసరం వచ్చింది. ఆ వెతుకులాటలో ఇరాన్‌, ఇరాక్‌,లిబియా, సిరియా, ఆఫెనిస్ధాన్‌ లు కొంత పని కల్పించాయి. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాన్ని తమ తదుపరి కార్యక్షేత్రంగా ఎంచుకుని పావులు కదుపుతున్నారు.

అమెరికాతో సైనిక ఒప్పందాలు
భారత్‌ దేశాన్ని అమెరికాకు రక్షణ భాగస్వామి గా చేసుకోవటం వలన భారత సైనిక స్ధావరాలను అమెరికా యుద్దవిమానాలు, యుద్దóనౌకలు వినియోగించుకోవచ్చు. అమెరికాలో ఆయుధాలు ఉత్పత్తి చేసే వారి నుండి భారత్‌ నేరుగా ఆయుధాలు కొనవచ్చు. అమెరికా తన రక్షణ భాగస్వాములతో నాలుగు ”ప్రాధమిక ” ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. ఈ ఒప్పందాలు ”భాగస్వామి-దేశాలతో సైనిక సహకారాన్ని పెంపొందించుకోడానికి అమెరికా ఉపయోగించే సాధారణ సాధనాలు” అని పెంటగాన్‌ అంటుంది. మనం ప్రాధమిక స్ధాయి ఒప్పందాలన్నీ చేసుకున్నాము.
ఈ నాలుగు ఒప్పందాలలో మొదటిది, జనరల్‌ సెక్యూరిటీ ఆఫ్‌ మిలిటరీ ఇన్ఫర్మేషన్‌ అగ్రిమెంట్‌, 2002 లో భారత అమెరికాలు సంతకం చేసిన ఒప్పందం ఇది. ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సైనిక సమాచారాన్ని పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. రెండవ ఒప్పందం, లాజిస్టిక్స్‌ ఎక్సేóంజ్‌ మెమోరాండం ఆఫ్‌ అగ్రిమెంట్‌ , 2016 ఆగస్టు 29 న ఇరు దేశాలు సంతకం చేశాయి. పునఃసరఫరాలు చేయడానికి, మరమ్మతు చేయడానికీ ఇతరుల స్థావరాలను ఉపయోగించడానికి ఇరు దేశాల సైన్యానికి వీలు కలుగుతుంది.
మూడవ ఒప్పందం, కమ్యూనికేషన్స్‌ ఇంటర్‌ ఆపరబిలిటీ అండ్‌ సెక్యూరిటీ మెమోరాండమ్‌ ఆఫ్‌ అగ్రిమెంట్‌ చైనా మరియు పొరుగు ప్రాంతాలపై నిఘా ఉంచడానికి, అమెరికా మిలిటరీ పరికరాలను కొనటానికి, టెక్నాలజీని ఇవ్వటానికి , ఆయుధాలను భారతదేశానికి అమ్మటానికి ద్వైపాక్షిక సదస్సులో సంతకాలు చేసారు.
నాల్గవ ఒప్పందం బేసిక్‌ ఎక్సేóంజ్‌ అండ్‌ కోఆపరేషన్‌ అగ్రిమెంట్‌ (బీకా). ఇది జియోస్పేషియల్‌ ఉత్పత్తులు, టోపోగ్రాఫికల్‌, నాటికల్‌, ఏరోనాటికల్‌ డేటా, యుఎస్‌ నేషనల్‌ జియోస్పేషియల్‌-ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్జిఎ) ఉత్పత్తులు సేవలను మార్పిడి చేయడానికి అనుమతిస్తుంది.

లండన్లోని కింగ్స్‌ కాలేజీలో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్‌ హర్ష్‌ వి. పంత్‌ అమెరికా వ్యూహాత్మక ప్రణాళికలో భారతదేశపు ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు: ”ఇండో-పసిఫిక్‌ లో శక్తి సామర్ధ్యాల సమతుల్యతకు అమెరికాకు భారతదేశం కీలకం. వనరుల పరిమితంగా ఉన్న ఈ సమయంలో, చైనా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో తన విశ్వసనీయతను పెంచుకోడానికి అమెరికాకు భారతదేశం వంటి భాగస్వాములు అవసరం.” ఈ ఒప్పందాలన్నిటిలో భారత్‌ చేరింది. ఐరోపా లోని భాగస్వామ్యదేశాలన్నీ ఈ విధంగా సంతకాలు చేసి నాటో సైనిక కూటమి లో చేరి ఇరుక్కు పోయి తీవ్రంగా నష్టపోయాయని గ్రహించాలి.

చైనానుండి, చైనా కమ్యూనిస్టుపార్టీ దోపిడీ, అవినీతి నుండి దేశాల ప్రజల రక్షణ కోసం క్వాడ్‌ ఏర్పడిందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ,టోక్యో లో బాహాటంగా ప్రకటించాడు. అమెరికా లో కమ్యూనిస్టువ్యతిరేకతను రెచ్చగొట్టిన ఘనత రిపబ్లికన పార్టీ సెనేటర్‌ మెకార్ధీకే దక్కుతుంది. ప్రభుత్వం లోవున్నప్రజాస్వామికవాదులందరినీ కమ్యూనిస్టులన్నాడు. సోవియట్‌ ఏజెంట్లు అంటూ వారందరిపై పై దాడి చేశాడు.వారిని పదవులనుండి తొలగించేదాకా కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారం చేశాడు. అమెరికన్‌ ప్రజలలో కమ్యూనిస్టలంటే భయాన్ని, వ్యతిరేకతలు స ష్టించాడు. అతను కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నిజమైన సాక్ష్యాలను చూపించటంలేదని అందరికూ తెలుసు. అయినా అతని అబద్ద ప్రచారాన్ని ఆపడానికి ఐసెన్‌ హౌవర్‌ లాంటి వారు కూడా భయపడ్డారు.” నేను ఆ వ్యక్తితో గొడవపడను” అని వెనక్కితగ్గాడు. 1950 లో ప్రారంభమయిన కమ్యూనిస్టు వ్యతిరేకత ఇంకా కొనసాగుతూనే వుంది. కమ్యూనిజాన్నినివారించాలనే పేరుతో కొరియా, వియత్నాం యుధాలనుండి ఇండో-పసిఫిక్‌ క్వాడ్‌ కూటమి వరకూ సైనిక కూటములను ఏర్పరుస్తున్నారు.
స్నేహంతో జీవించవలసిన ఇరుగు పొరుగు దేశాలమధ్య చిచ్చు పెట్టి ఇద్దరికీ ఆయుధాలను, ఫైటర్‌ విమానాలను, సబ్‌ మెరైన్లను అమ్ముకోవటమేకాకుండా ప్రపంచ ప్రజలనందరినీ పేదరికం లోకి నెట్టి అసమాన అభివ ద్ధిని స ష్టిస్తోంది. అమెరికా దేశం సంవత్సరానికి 732 బిలియన్‌ డాలర్లను , చైనా 261 బిలియన్‌ డాలర్లను, ఇండియా 71 బిలియన్‌ డాలర్లను మిలిటరీకి, ఆయుధాలకు ఖర్చు పెడుతున్నాయి.

చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము.
చైనా మనను జయించలేదు. మనం చైనాను జయించలేము. ఆధునిక సాంకేతిక జ్ఞానంతో ఆయుధాలను ప్రయోగించి ,అత్యంత శక్తివంతమైన అమెరికా ఏదేశంలోనూ విజయం సాధించలేదు. 2001 సెప్టెంబరు 11 న ప్రపంచవాణిజ్యసంస్ధపై దాడి జరిగినప్పడినుండీ 20 సంవత్సరాలుగా , ఆసియాలో ప్రతీకారయుధాలను అమెరికా సాగిస్తుంది. ఈ యుధాలకు 6.4 లక్షల కోట్ల డాలర్లు ( 475 లక్షల కోట్ల రూపాయలు ) ఖర్చయిందని అంచనా. గత 20 సంవత్సరాలుగా అమెరికా సాగించిన యుధాలలో చనిపోయిన వారి సంఖ్య 8,01,000. అందులో 3,35,000 మంది నిరాయుధ పౌరులన్నది మరింత బాధాకరం. కొరియా, వియత్నాం లలో చావు దెబ్బతిన్న అమెరికా పాఠాలు నేర్చుకోకుండా మిలిటరీ -ఇండిస్టియల్‌ కాంప్లెక్స్‌ అడ్డుపడింది. ప్రత్యక్షంగా సైనికులను ఆకాశంనుండి క్యూబా లో దించి అవమానాల పాలయ్యింది.ఇరాక్‌ లో సద్దామ్‌ హుస్సేన్‌, చిలీ లో అలెండీ, లిబియాలో కల్నల్‌ గద్దాఫీ, ఇరాన్‌ జనరల్‌ క్వాసిమ్‌ సొలేమాన్‌ లను దారుణంగా హత్య చేసింది. క్యూబా అధినేత ఫిడేల్‌ కాస్ట్రోను చంపటానికి 638 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయి. అటువంటి చరిత్ర కలిగిన అమెరికా ను నమ్ముకుని యుద్ధ కూటములలో చేరితే మన దేశం ఆర్ధికంగా నష్టపోయి అరబ్‌ దేశాలు, లాటిన్‌ అమెరికా, ఆసియా.ఆఫ్రికా దేశాలలోలాగా అభాసుపాలవుతాము. కుక్క తోక పట్ట్టుకుని గోదావరి ఈదటం సాధ్యంకాదు.
రాబోయే కాలానికి భారత-చైనా దేశాలే సాంకేతిక అభివ ధికి చిహ్నంగా వుంటాయని నిరూపించుకుంటున్నారు. అటువంటి సమయంలో సరిహద్దు ఘర్షణలు జరగటం అవాంఛనీయం. వలసరాజ్యాలువదిలి వెళ్ళిన సరిహద్దు వివాదాన్ని పరిష్కరించకోలేకపోవటం భారత – చైనాదేశాల రాజకీయ వైఫల్యం. భారత చైనాలు చిరకాలం శత్రుత్వంతో వుండలేవు. వేలాది సంవత్సరాల మైత్రిలో తగాదాపడిన కాలం చాలా తక్కువ. పరిష్కరించుకోలేని సమస్యలు లేవు. అతి పెద్ద దేశాలైన భారత- చైనా లతోనే ప్రపంచ ప్రజల సుస్ధిర శాంతి సౌభాగ్యాలు ముడిపడివున్నాయి. సైనిక కూటములలో చేరవలసిన అవసరం వున్నదా లేదా అని మనం ఆలోచించాలి. సైనిక కూటములలోచేరి చితికిపోయిన దేశాల చరిత్రను మరువరాదు. ఉన్నత స్ధాయిలో రాజకీయ నిర?యాలు తీసుకుని సరిహద్దు సమస్యను పరిష్కరించాలి.

వ్యాస రచయిత డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, భారత-చైనా మిత్రమండలి, ఆంధ్రప్రదేశ్‌, మాజీ అధ్యక్షుడు. (1982-1997)

ఆర్‌సిఇపి ఒప్పందం – అమెరికాకు భంగపాటు !

Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


ఎనిమిది సంవత్సరాల సంప్రదింపుల అనంతరం ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలోని పదిహేను దేశాలు ప్రాంతీయ సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం(ఆర్‌సిఇపి)పై నవంబరు 15వ తేదీన సంతకాలు చేశాయి. ఇదొక చారిత్రక పరిణామంగా భావిస్తున్నారు. రెండు సంవత్సరాల వ్యవధిలో ఆయా దేశాల చట్ట సభలు ఆమోదం తెలిపిన తరువాత ఇది అమల్లోకి వస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం జనాభా, మూడోవంతు జిడిపి ఉన్న దేశాలు కుదుర్చుకున్న ఈ ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. తొలి నుంచి ఈ ఒప్పంద చర్చలలో ఉన్న భారత్‌ తాను వైదొలుగుతున్నట్లు గతేడాది నవంబరులో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం తీసుకున్న ఏడాది కాలంలో అనేక అనూహ్య పరిణామాలు సంభవించాయి. ప్రపంచీకరణలో భాగంగా అనేక సంస్కరణలు చేపడతామని చెబుతున్న నరేంద్రమోడీ సర్కార్‌ మరోవైపు రక్షణాత్మక చర్యలు తీసుకోవటాన్ని మిగతా దేశాలు ఎలా చూస్తాయి ? అయితే భారత్‌ కోరుకుంటే ఎప్పుడైనా చేరవచ్చని, నిబంధనలను కూడా సడలిస్తామంటూ భాగస్వామ్య దేశాలు తలుపులు తెరిచే ఉంచాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల రక్షణ చర్యల్లో భాగంగా, ఇతర కారణాలతో మన దేశం ఈ ఒప్పందంలో చేరలేదు. చైనా కారణంగా దూరంగా ఉన్న అమెరికా కూడా దీనిలో చేరవచ్చనే ఆశాభావాన్ని జపాన్‌ వ్యక్తం చేసింది.


ఆస్ట్రేలియా,బ్రూనే, కంపూచియా, చైనా, ఇండోనేషియా, జపాన్‌, లావోస్‌, మలేషియా, మయన్మార్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా,థారులాండ్‌,వియత్నాం సభ్యులుగా ఉన్న ఈ ఒప్పందం ద్వారా ప్రతిదేశమూ లబ్ది పొందటంతో పాటు ప్రపంచ జిడిపి పెరుగుదలకూ దోహదం చేస్తుందని భావిస్తున్నారు. చైనాకు వ్యతిరేకంగా అవతరిస్తున్న చతుష్టయ కూటమిలో ఉన్న జపాన్‌, ఆస్ట్రేలియా దీనిలో భాగస్వాములు. దక్షిణ కొరియాతో సహా రాజకీయ అంశాలలో అవి అమెరికాకు మద్దతు ఇస్తూనే ఆర్ధిక రంగంలో చైనాతో సంబంధాలతో మరింత ముందుకు పోవాలనే నిర్ణయించాయంటే ఆర్ధిక అంశాలే ప్రధాన చోదకశక్తిగా ఉన్నాయన్నది స్పష్టం. ఈ ఒప్పందంతో చైనాకు ఎగుమతి అవుతున్న జపాన్‌ పారిశ్రామిక ఎగుమతులలో 86శాతం, దక్షిణ కొరియా నుంచి ఎగుమతి అవుతున్నవాటిలో 92శాతంపై పన్నులు రద్దువుతాయి. జపాన్‌ ఆటోవిడిభాగాల తయారీ పరిశ్రమ ప్రధానంగా లబ్ది పొందుతుంది. ఆస్ట్రేలియా కూడా ఇదే అంచనాతో ఒప్పందానికి సిద్దపడింది. చైనాతో వాణిజ్య సంబంధాలలో ఈ మూడు దేశాలూ మిగులులో ఉన్నాయి.


అనేక ఆసియన్‌ దేశాల వస్తూత్పత్తి చైనానుంచి చేసుకొనే కొన్ని వస్తువుల దిగుమతుల మీద ఆధారపడి ఉంది. ఒప్పందానికి అమెరికా, భారత్‌ దూరంగా ఉన్నాయి. చైనాను పక్కన పెట్టాలన్న అమెరికా ఆదేశాలు లేదా విధానాలకు అనుగుణ్యంగా నడవటానికి తాము సిద్దంగా లేమనే సందేశం ఈ ఒప్పందం పంపినట్లయింది. ఒక వైపు ప్రపంచీకరణ తమకు నష్టదాయకంగా మారిందని బహిరంగంగా చెప్పకపోయినా అమెరికాతో సహా అనేక పెట్టుబడిదారీ రాజ్యాలు రక్షణాత్మక చర్యలను నానాటికీ పెంచుకుంటూ పోతున్నాయి. ప్రపంచవాణిజ్య సంస్ధతో నిమిత్తం లేకుండా ద్విపక్ష ఒప్పందాలు చేసుకుంటున్నాయి.ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికాలేని ఈ అతిపెద్ద ఒప్పందం కుదరకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ జరిగాయి.పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో చైనాను చక్రబంధంలో బిగించాలని చూసిన ట్రంప్‌ యంత్రాంగానికి ఇది పెద్ద వైఫల్యం. అమెరికాకు అగ్రతాంబూలం అన్న వైఖరిని అనుసరిస్తున్న వైఖరితో ఆసియా దేశాల్లో తలెత్తిన అనుమానాల కారణంగా కూడా ఆర్‌సిఇపి ఉనికిలోకి రావటానికి దోహదం చేసింది.
కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ కుదేలవుతున్నాయి. ఇదే సమయంలో చైనా, తూర్పు ఆసియా దేశాలు అమెరికాాఐరోపాలతో పోల్చితే కరోనాను అదుపు చేశాయి. ఆర్దిక రంగంలో పురోగమనంలో ఉన్నాయి. మరోపది సంవత్సరాల వరకు వినిమయం ఎక్కువగా ఉండే మధ్యతరగతి ప్రజానీకం పెరుగుదల చైనా, ఆసియాలోనే ఉంటుందని విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి.ఆర్దికంగా పెద్ద రాజ్యాలలో ఒక్క చైనా వృద్ది మాత్రమే పురోగమనంలో ఉంది. అమెరికా, ఐరోపా దేశాలు కరోనా కట్టడితో పాటు ఆర్ధికంగా కూడా తీవ్ర సమస్యలతో ఉన్నాయి.

ఫసిపిక్‌ ప్రాంత దేశాల భాగస్వామ్యం(టిపిపి) పేరుతో అమెరికా ముందుకు తెచ్చిన ప్రతిపాదనలో చైనాతో సహా అనేక ఆసియా దేశాలకు అవకాశం లేకుండా చూశారు. ఈ ఒప్పందంపై 2016లో సంతకాలు చేసిన అమెరికా మరుసటి ఏడాది డోనాల్డ్‌ ట్రంప్‌ అధికారానికి రాగానే ఉపసంహరించుకుంది. దాంతో అది అమల్లోకి రాలేదు. దీనికి ప్రతిగా చైనా, మరికొన్ని దేశాలు ముందుకు తెచ్చిందే ఆర్‌సిఇపి. దీనిలోపి టిపిపిలో ఉన్న ఆసియా దేశాలు భాగస్వాములయ్యాయి. అమెరికాను కూడా తమతో చేరాలని కోరాయి.టిపిపి వెనక్కు పోయిన తరువాత అమెరికా తన రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఇండో-పసిఫిక్‌ వ్యూహం పేరుతో చైనాకు వ్యతిరేకంగా సరికొత్త సమీకరణకు పూనుకుంది. ఆర్‌సిఇపి నుంచి మన దేశం వైదొలగటానికి ఒక కారణం మన పారిశ్రామిక, వ్యవసాయ రంగాల నుంచి వెల్లడైన తీవ్ర వ్యతిరేకత అన్నది స్పష్టం. ఆ నష్టాల గురించి ప్రారంభం నుంచీ చర్చలలో ఉన్న మన ప్రతినిధులకు తెలియనివేమీ కాదు. అయినా ఆరు సంవత్సరాల పాటు ముందుకు పోయి 2019లో వెనక్కు తగ్గటానికి పైకి వెల్లడించని ఒక ప్రధాన కారణం ఈ కాలంలో అమెరికాతో పెనవేసుకున్న బంధం అన్నది స్పష్టమే. దానికి చక్కటి ఉదాహరణ ఇరాన్‌తో మనకు ఎలాంటి విబేధాలు లేవు. అయినా అమెరికా వత్తిడి మేరకు అక్కడి నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము.


ఆర్‌సిఇపిలోని 15దేశాలలో ప్రపంచంలోని 47.7శాతం మంది జనాభా, మూడోవంతు జిడిపి ఉంది. ప్రపంచ వాణిజ్యంలో 29.1, పెట్టుబడులలో 32.5శాతం వాటాను ఈ దేశాలు కలిగి ఉన్నాయి. ఇక దేశాల వారీగా చూస్తే కలిగే ప్రయోజనాలు కొన్ని ఇలా ఉన్నాయి. జిడిపి పెరుగుదల పసిఫిక్‌ ప్రాంతంలో 2.1, ప్రపంచంలో 1.4, చైనాకు 0.55, దక్షిణ కొరియాకు 0.41నుంచి 0.62, జపాన్‌కు 0.1శాతం చొప్పున పెరుగుదల ఉంటుందని అంచనా. చైనా వ్యవసాయ ఉత్పత్తులపై జపాన్‌ 56శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 49, ఇతర దేశాల ఉత్పత్తులపై 61శాతం పన్నులు తగ్గుతాయి. కొన్ని వస్తువుల విషయంలో వెంటనే పన్నులు తగ్గినా, మొత్తంగా ఒప్పందంలో అంగీకరించిన మేరకు తగ్గుదలకు పది సంవత్సరాలు పడుతుంది. ప్రాంతీయ సరఫరా వ్యవస్ధ స్దిరపడుతుంది. ఆయా దేశాలకు కలిగే ఆర్ధిక ప్రయోజనాలు ప్రపంచ రాజకీయాల్లో వాటి వైఖరుల మీద కూడా ప్రభావం చూపుతాయి. ఈ ఒప్పందంతో పాటు చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల మధ్య స్వేచ్చా వాణిజ్య ఒప్పందం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి.ఈ దిశగా మూడు దేశాలు పన్నులను తగ్గించేందుకు పూనుకోవచ్చు. చైనాాఅమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు కారణంగా తలెత్తిన నష్టాలలో ఈ ఒప్పందం కారణంగా చైనా, జపాన్‌, దక్షిణ కొరియాలకు 150 నుంచి 200 బిలియన్‌ డాలర్ల మేరకు తగ్గవచ్చని అంచనా. ఇది అమెరికా మీద వత్తిడి పెంచుతుంది.


ఒప్పందం కుదిరినంత మాత్రాన అంతా అయిపోయినట్లు భావించరాదు. దాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి.ఈ ఒప్పందం బహుపక్ష వాదానికి చారిత్రక విజయం, ప్రాంతీయ, ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలకు పెద్ద సహాయకారి అవుతుందని భావిస్తున్నారు.టిపిపి నుంచి అమెరికా తప్పుకున్న తరువాత దీనిని పసిఫిక్‌ ప్రాంత సమగ్ర మరియు పురోగామి భాగస్వామ్య ఒప్పందంగా(సిపిటిపిపి) సవరించారు.టిపిపి ఒప్పందంలో వాణిజ్యానికి పెద్ద పీట వేస్తే దీనిలో పెట్టుబడుల వంటి వాటిని కూడా చేర్చారు.అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ ఆర్‌సిఇపి ఒప్పందాన్ని అతిగా చూపి చైనా ముప్పు పేరుతో టిపిపిని మరోసారి ముందుకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. అయితే ఇది అంత తేలిక, వెంటనే జరిగేది కాదు. సిపిటిపిపిలో చేరి దాన్ని ఆర్‌సిఇపికి వ్యతిరేకంగా తయారు చేసేందుకు పూనుకోవచ్చు.

మన దేశం విషయానికి నరేంద్రమోడీ యంత్రాంగం ఆలోచనా ధోరణులు ఇలా ఉన్నాయని చెప్పవచ్చు. ట్రంప్‌ రెండో సారి కచ్చితంగా అధికారానికి వస్తాడు(ఈ కారణంగానే ప్రధాని నరేంద్రమోడీ అమెరికా వెళ్లి హౌడీమోడీ సభలో అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ అని ఎన్నికల ప్రచారం చేశారు). చైనాతో వాణిజ్య యుద్దాన్ని మరింత తీవ్రతరం చేస్తాడు. అది మేకిన్‌ ఇండియా కార్యక్రమం విజయవంతం కావటానికి దోహదం చేసే పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువస్తుంది. చైనా నుంచి ఇతర దేశాల సంస్దలు మన దేశానికి తరలివస్తాయి. తద్వారా త్వరలో ఎగుమతుల్లో చైనాను అధిగమించవచ్చు. ఇలాంటి భ్రమలకు గురైన కారణంగానే అమెరికా కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, ముఖ్యమంత్రులందరూ అవకాశాన్ని వినియోగించుకొనేందుకు సిద్దంగా ఉండాలని మోడీ చెప్పిన విషయం తెలిసిందే.
అమెరికా ఇచ్చిన ప్రోత్సాహంతో చైనా మీద ఆధారపడిన సరఫరా వ్యవస్దకు ప్రత్యామ్నాయంగా జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలసి నూతన వ్యవస్దను ఏర్పాటు చేయాలని మన దేశం ప్రతిపాదించి చర్చలు జరుపుతోంది. అవి ఒక కొలిక్కి రాకముందే ఆ చైనాతోనే వాటితో పాటు మరికొన్ని దేశాలు ఆర్‌సిపి ఒప్పందం చేసుకొని అమలుకు ముందుకు పోతున్నాయి. జపాన్‌ వంటి దేశాలు మనల్ని, రెండవ పెద్ద ఆర్దిక వ్యవస్ద ఉన్న చైనాను కూడా ఉపయోగించుకోవాలని చూస్తాయి తప్ప కేవలం మన మీదనే ఆధారపడే అవకాశాల్లేవని తాజా పరిణామాలు స్పష్టం చేశాయి.


ఏ నాయకత్వమైనా తమవైన స్వంత పద్దతులలో దేశాన్ని అభివృద్ధి చేయటానికి పూనుకోవచ్చు. అవి విజయవంతమౌతాయా లేదా అన్నది వేరే అంశం. కానీ మరొక దేశం మీద ఆధారపడి అంచనాలు రూపొందించుకోవటం మబ్బులను చూసి ముంతలో నీరు ఒలకపోసుకోవటం, గాలిమేడలు కట్టటం తప్ప మరొకటి కాదు. అనూహ్యంగా కరోనా వైరస్‌ సమస్య వచ్చింది. ట్రంప్‌ ఓడిపోయాడు. బైడెన్‌ చైనాతో వాణిజ్య యుద్దాన్ని కొనసాగిస్తాడో, రాజీపడతాడో తెలియదు. ట్రంప్‌ మాదిరి దూకుడు మాత్రం ఉండదు అంటున్నారు. అవి తేలేంతవరకు మేకిన్‌ ఇండియాను మన మోడీగారు ఏమి చేస్తారు ? వాయిదా వేస్తారా ? అనేక ఆసియా దేశాలు గతంలోనూ, ఇప్పుడు ఎగుమతి ఆధారిత విధానాలతోనే వేగంగా వృద్ధి చెందాయి. ఇప్పుడు ఆర్‌సిఇపి ద్వారా మన పొరుగునే ఒక పెద్ద స్వేచ్చా వాణిజ్య కేంద్రం ఏర్పడింది. దాన్ని విస్మరించి రక్షణాత్మక చర్యలు తీసుకొంటున్న మన దేశం వైపు పెట్టుబడులు వస్తాయా ? వాణిజ్య సంబంధాలు మెరుగుపడతాయా ? అసలు అమెరికా కూడా వాటిని అంగీకరిస్తుందా ? మన పారిశ్రామిక, వ్యవసాయ రంగ రక్షణ చర్యలు తీసుకోకపోతే పాలక పార్టీ పారిశ్రామికవేత్తలు, రైతాంగానికి దూరం అవుతుంది. వీటిని ఫణంగా పెట్టి ప్రపంచ కార్పొరేట్లు, ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయద్రవ్యనిధి సంస్ద, ప్రపంచ వాణిజ్య సంస్ధలు వత్తిడి తెస్తున్న ప్రపంచీకరణ గొలుసుకు మన దేశాన్ని కట్టకపోతే వాటికి కోపం వస్తాయి ? నరేంద్రమోడీ ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారు ?

ఫిరాయింపుల మీద డోనాల్డ్‌ ట్రంప్‌ ఆశపెట్టుకున్నాడా ?

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


కీలకమైన రాష్ట్రాలలో ఓటమి ఖరారు అయిన తరువాత కూడా డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఓటమిని అంగీకరించలేదు. తమ నేత రెండవ సారి పదవీ బాధ్యతలు చేపడతారు, అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రంప్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో చెప్పారు. కోర్టుల విచారణలో ఉన్న కేసులు, విజేతలకు ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవటం, పోస్టల్‌ బ్యాలట్ల వివాదం వంటి అంశాలలో తమకే అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తున్నారు. మరో వైపు ట్రంప్‌ మద్దతుదారులు వాషింగ్టన్‌ డిసిలో అతనికి మద్దతుగా ప్రదర్శనలు చేశారు. రక్షణశాఖలో ట్రంప్‌ తనకు అనుకూలమైన వారిని నియమిస్తూ ఎన్నికల ఫలితాలు స్పష్టమైన తరువాత నిర్ణయం తీసుకున్నారు. జనవరిలో జార్జియాలో జరగాల్సిన రెండు సెనెట్‌ స్దానాలను ఎలాగైనా సాధించి ఎగువ సభలో మెజారిటీ నిలుపుకొనే ఎత్తుగడలో భాగంగా అక్కడి ఓటర్లను ప్రభావితం చేసేందుకు తానే విజయం సాధించాననే ఎత్తుగడతో ముందుకు సాగుతున్నట్లు పరిపరి విధాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవేనా ఇంకా ఏమైనా కుట్రలు న్నాయా అన్న అనుమానాలు సహజంగానే ముందుకు వస్తున్నాయి. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నందున వాటిలో ఒకటి ఫిరాయింపులను పోత్సహించి తీర్పును తారు మారు చేసే ఎత్తుగడను కూడా కొట్టి పారవేయలేము.


ఎన్నికలు జరిగిన పది రోజుల తరువాత అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోసెఫ్‌ రోబినెట్‌ బైడెన్‌ జూనియర్‌ అలియాస్‌ జో బైడెన్‌ ఖరారు అయ్యారు. ఎలక్ట్రరల్‌ కాలేజీలోని 538కి గాను 306 ఓట్లతో ముందుండగా మెజారిటీకి అవసరమైన 270 తెచ్చుకోలేని డోనాల్డ్‌ ట్రంప్‌ 232తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలలో ట్రంప్‌కు 306 రాగా హిల్లరీ క్లింటన్‌కు 232 వచ్చాయి. డిసెంబరు 14న అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక జరగనుంది, జనవరి 20న పదవీ బాధ్యతలను చేపడతారు. ఇప్పటికీ ఓటమిని అంగీకరించేందుకు మొరాయిస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ నూతన అధ్యక్షుడికి అధికారాన్ని అప్పగించేందుకు రాకపోయినా పదవీ స్వీకార ప్రమాణం ఆగదు. అధికారంలో ఉండి ఓడిపోయిన అధ్యక్షుల జాబితాకు ఎక్కిన ట్రంప్‌ అధికార మార్పిడికి సహకరించపోతే మెడపట్టి గెంటించుకున్న వ్యక్తిగా చరిత్రకు ఎక్కనున్నాడు.


ప్రజాప్రతినిధుల సభ కాంగ్రెస్‌లో మెజారిటీకి అవసరమైన 218కి గాను డెమోక్రాట్లు 224 సీట్లు తెచ్చుకోగా రిపబ్లికన్లు 211 పొందారు. డెమోక్రాట్లు ఎనిమిది సీట్లు కోల్పోయారు. ఎగువ సభ సెనేట్‌లోని వంద స్ధానాలలో మెజారిటీకి 51రావాల్సి ఉండగా రిపబ్లికన్లు గతంలో ఉన్న 53కు గాను 50 తెచ్చుకోగా డెమోక్రాట్లు 45 నుంచి 46కు పెంచుకున్నారు. వారికి మరొక ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతు ఉంది. మరో రాష్ట్రమైన జార్జియాలోని రెండు సీట్లకు జనవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎగువ సభలో మెజారిటీకి రిపబ్లికన్లు ఒక సీటు దూరంలో ఉండగా డెమోక్రాట్లు రెండూ తెచ్చుకుంటే సమాన బలం కలిగి ఉంటారు. ఇది రాసిన సమయానికి దేశవ్యాపిత ఓట్లలో 97శాతం లెక్కింపు పూర్తయింది. విజేత బైడెన్‌కు 7,86,06,350(50.8శాతం) రాగా ట్రంపుకు 7,36,69,853(47.2శాతం) వచ్చాయి. ఎన్నికలకు ముందు సర్వేలలో వెల్లడైన దాని కంటే ట్రంపుకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. 1990 తరువాత రికార్డు స్ధాయిలో ఈ ఎన్నికల్లోనే ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతున్నందున 66.2 నుంచి 72శాతం మధ్య ఖరారు కావచ్చు. గత ఎన్నికలలో డోనాల్డ్‌ ట్రంప్‌ మెజారిటీ ఖరారైన ఒక రోజులోనే చైనా అధ్యక్షుడు జింపింగ్‌ అభినందనలు తెలిపాడు. ఈ సారి బైడెన్‌కు మెజారిటీ ఖరారు అయ్యేందుకు వ్యవధి ఎక్కువ తీసుకోవటం, మరోవైపు తానే ఎన్నికైనట్లు ట్రంప్‌ ప్రకటించుకున్న నేపధ్యంలో పది రోజుల తరువాత చైనా అధికారికంగా జో బైడెన్‌కు అభినందనలు తెలిపింది. భారత్‌తో సహా అనేక దే శాలు వెంటనే అభినందనలు తెలిపాయి.
అధికారికంగా డిసెంబరు 14న అధ్యక్ష ఎన్నికజరగాల్సి ఉంది. అనేక చోట్ల రిపబ్లికన్లు కోర్టులలో వేసిన కేసుల కారణంగా ఇది రాస్తున్న సమయానికి ఎలక్ట్రరల్‌ కాలేజీ విజేతలకు సర్టిఫికెట్ల జారీ ప్రక్రియముగియ లేదు. దీన్ని అవకాశంగా తీసుకొని డోనాల్డ్‌ ట్రంప్‌ తానే గెలిచినట్లు వాదన ఇంకా చేస్తూనే ఉన్నాడు. రెండోసారి పదవీ బాధ్యతల స్వీకరణకు సిద్దం అవుతున్నట్లు మద్దతుదారులతో ప్రకటనలు చేయిస్తున్నాడు. రక్షణశాఖలో తనకు అనుకూలంగా ఉండే అధికారుల నియామకం చేశాడు. జనవరి 20వ తేదీన కొత్త అధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేసే వరకు పూర్తి అధికారాలను కలిగి ఉన్నందున ట్రంప్‌ తాను చేయదలచుకున్నది చేసేందుకు పూనుకున్నట్లు పరిణామాలు వెల్లడిస్తున్నాయి.


సాధారణంగా అమెరికాలో ఫిరాయింపుల గురించి పెద్దగా జనానికి తెలియదు. దానికి కూడా అవకాశం లేకపోలేదు.2016 ఎన్నికలలో ట్రంప్‌కు 306, హిల్లరీ క్లింటన్‌కు 232 వచ్చినట్లు తెలిసిందే. అయితే ఎలక్ట్రరల్‌ కాలేజీలో ఎన్నిక సమయంలో ఏడుగురు సభ్యులు ఫిరాయించి వారికి ఓట్లు వేయలేదు. దాంతో వారి ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ట్రంప్‌కు ఇద్దరు, హిల్లరీకి ఐదుగురు ఓటు వేయలేదు. నవంబరు 3వ తేదీ ఎన్నికలలో విజేతలకు అనేక రాష్ట్రాలలో ఇంకా ధృవీకరణ పత్రాలు ఇవ్వలేదు. అటువంటి చోట్ల ఆయా రాష్ట్రాల చట్టసభలు ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులను నియమించుకోవచ్చు. రిపబ్లికన్లు అధికారంలో ఉండి చోట్ల డెమోక్రాట్లు గెలిచిన చోట ట్రంప్‌ ఇలాంటి అక్రమాలకు పాల్పడవచ్చని తద్వారా తనకు అవసరమైన 270 ఓట్లను సాధించి అధికారంలో కొనసాగాలనే పధకంతో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు అవకాశం లేదని కొందరు చెబుతున్నప్పటికీ అది జరిగితే ఏమిటన్నది ప్రశ్న. ఒక వేళ ట్రంప్‌ ఫిరాయింపులతో గట్టెక్కాలంటే పన్నెండు శాతం మంది అంటే బైడెన్‌కు వచ్చిన 306 ఓట్లలో పన్నెండు శాతం అంటే 38 మంది ఫిరాయిస్తేనే చెల్లుబాటు అవుతుందని కొన్ని వార్తలు సూచించాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో చట్టం ఉన్నందున అదే జరిగితే చట్టబద్దమైన వివాదం కూడా తలెత్తవచ్చు.
అమెరికాలో ఫిరాయింపులకు సంబంధించి దేశమంతటికీ వర్తించే ఒకే చట్టం లేదు. గతంలో ఫిరాయింపులు జరిగిన ఉదంతాలు ఉన్నప్పటికీ అధ్యక్ష ఎన్నికను ప్రభావితం చేయలేదు. ఇప్పటి వరకు 165 ఉదంతాలలో ఫిరాయింపులు చోటు చేసుకున్నాయి.1836లో 23 మంది వర్జీనీయా రాష్ట్ర ప్రతినిధులు అధ్యక్ష ఎన్నికలో తమ డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్దికి ఓటు వేసి ఉపాధ్యక్ష ఎన్నిక ఓటింగ్‌లో పాల్గొనలేదు. దాంతో తొలిసారిగా సెనెట్‌ ద్వారా ఎన్నుకోవాల్సి వచ్చింది. 1872లో పార్టీ అభ్యర్ధి ఎన్నికల తరువాత ఎలక్ట్రరల్‌ కాలేజీ సమావేశం జరగముందే మరణించాడు. దాంతో 63 మంది వేరే పార్టీకి ఓటు వేశారు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం 33 రాష్ట్రాలు, కొలంబియా జిల్లాలో గెలిచిన పార్టీకే ఎలక్ట్రరల్‌ కాలేజీ ప్రతినిధులు ఓటువేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కేవలం 14 రాష్ట్రాలలో మాత్రమే ఫిరాయింపులు చేస్తే అనర్హత వేటు వేసే అవకాశం ఉంది.నిర్ధిష్టమైన చట్టాలేవీ లేవు.


మరోవైపు విజయం ఖాయం కావటంతో డెమోక్రటిక్‌ పార్టీలోని మితవాదులు రంగంలోకి దిగారు. అధ్యక్ష స్ధానంలో విజయం సాధించినప్పటికీ ప్రజాప్రతినిధుల సభలో మెజారిటీ తగ్గటానికి, సెనెట్‌లో మెజారిటీ సాధించలేకపోవటానికి డెమోక్రటిక్‌ పార్టీలోని పురోగామి విధానాలు లేదా సోషలిజానికి మద్దతే కారణమని ఆ పార్టీలోని మితవాదులు, కార్పొరేట్ల ప్రతినిధులు సూత్రీకరణలు ప్రారంభించారు. వామపక్ష నినాదాలు, విధానాలను ముందుకు తెస్తే జనవరిలో జార్జియాలో జరిగే సెనెటు ఎన్నికలలో ఓటమి తప్పదని డెమోక్రటిక్‌ పార్టీలోని కార్పొరేటటు శక్తులు అప్పుడే సన్నాయి నొక్కులు ప్రారంభించాయి.వాటిని డెమోక్రటిక్‌ సోషలిస్టుగా ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ తిరస్కరించారు. అందరికీ వైద్య సదుపాయం,నూతన హరిత ఒప్పందానికి మద్దతు ఇవ్వటం వల్లనే దిగువ సభలో సీట్లు తగ్గాయని పార్టీలోని మితవాదులు విమర్శిస్తున్నారు. అయితే ఆ నినాదం లేదా విధానాలకు మద్దతు ఇచ్చిన వారెవరూ ఈ ఎన్నికల్లో ఓడిపోలేదు. అందరికీ వైద్యం అందించాలన్న తీర్మానాన్ని బలపరిచిన 112 మందికి గాను అందరూ ఈ ఎన్నికల్లో గెలిచారు. నూతన హరిత ఒప్పంద తీర్మానాన్ని బలపరిచిన 98 మందిలో ఒక్కరు మాత్రమే ఓడిపోయారు. కోట్లాది మంది జనాల జీవితాలను మెరుగుపరచాలన్న పురోగామి విధానాలను కార్మికులుగా ఉన్న అన్ని సామాజిక తరగతులకు చెందిన ఓటర్లు ఆమోదించారని, వారందరూ సాయం కోసం ఎదురు చూస్తున్నందున దానికి అనుగుణ్యంగా స్పందించాలని బెర్నీ శాండర్స్‌ చెప్పారు.

కీలక పాత్ర పోషించిన పోస్టల్‌ కార్మికులు
ఎన్నికల్లో కార్మికులు కీలక పాత్ర పోషించగలరా ? అవును. అమెరికా ఎన్నికలలో పోస్టల్‌ కార్మికులు పోషించిన కీలక పాత్ర విస్మరించరానిది. నిజానికి అమెరికా ప్రజాస్వామ్యం నిలిచిందంటే వారి పాత్ర లేకుండా సాధ్యమయ్యేది కాదంటే అతిశయోక్తి కాదు. 2016తో పోల్చితే రెట్టింపైన ఆరున్నర కోట్ల పోస్టల్‌ బ్యాలట్లను ఆరులక్షల 30వేల మంది కార్మికులు సకాలంలో అధికారులకు అందచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. తపాలా సేవలను ప్రయివేటీకరించాలన్న ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమకు మద్దతు ఇచ్చే శక్తులు అధికారంలో ఉండాలన్న చైతన్యం ఆ కార్మికులను దీనికి పురికొల్పిందని చెప్పవచ్చు. పోస్టల్‌ బ్యాలట్లలో తనకు వ్యతిరేకంగా ఎక్కువ పడినట్లు గ్రహించిన ట్రంప్‌ వాటిని సకాలంలో అందకుండా చేసేందుకు పన్నిన కుయుక్తులను కూడా కార్మికులు వమ్ముచేశారు.
ట్రంప్‌ తన మద్దతుదారైన లూయీస్‌ డెజోరును ఎన్నికలకు ఎంతో ముందుగానే పోస్టు మాస్టర్‌ జనరల్‌గా నియమించాడు. దీని వెనుక మూడు లక్ష్యాలు ఉన్నాయి. తపాలాశాఖను ప్రయివేటీకరించాలంటే ముందు అది అసమర్దంగా తయారైందని జనానికి చెప్పాలి. తపాలా అందచేతను ఆలశ్యం గావించి వినియోగదారుల ముందు సిబ్బందిని దోషులుగా నిలపటం, ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్లను సకాలంతో డెలివరీ చేయకుండా చూడటం ఇతర అంశాలు. గడచిన మూడు అధ్యక్ష ఎన్నికలను పరిశీలించినపుడు పోస్టల్‌ బ్యాలట్లలో అత్యధిక ఓట్లు డెమోక్రటిక్‌ పార్టీకే పడ్డాయి. ఈ అంశం గమనంలో ఉంది కనుక ఈ సారి కరోనా కారణంగా వాటి సంఖ్య మరింతగా పెరుగుతుందని ట్రంప్‌ యంత్రాంగం ముందుగానే ఊహించింది. పోస్టు మాస్టర్‌ జనరల్‌ డెజోరు తన పధకాలను వెంటనే అమలు చేశాడు.


పోస్టు మాస్టరు జనరల్‌ కుట్రను పసిగట్టిన ఒక యూనియను ఒక స్ధానిక కోర్టులో దాఖలు చేసిన పిటీషనుపై నిర్ణీత గడువులోగా తపాలా బ్యాలట్లను బట్వాడా చేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. దాన్ని అమలు చేసేందుకు అధికారులు తిరస్కరించారు. మూడు లక్షల బ్యాలటు కవర్లు ఎక్కడున్నాయో తెలియటం లేదని అధికారులు కోర్టుకు తప్పుడు సమాచారమిచ్చారు. సకాలంలో ముద్రపడిన బ్యాలట్లను వెతికి మరీ ఎన్నికల తరువాత కూడా అందచేయాలని న్యాయమూర్తి ఆదేశించాడు. అయినా అధికారులు అనేక చోట్ల బాలట్ల బట్వాడాను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు.


ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు డోనాల్డు ట్రంపు పాల్పడని తప్పుడు పని లేదు.చైనా, కమ్యూనిస్టు బూచిని చూపి ఓటర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించటం వాటిలో ఒకటి. దానిలో భాగంగానే జో బైడెను కమ్యూనిస్టు అని, అమెరికాను చైనాకు తాకట్టుపెడతాడు అని ప్రచారం చేశాడు. నిజానికి బైడెను పక్కా కార్పొరేటు మనిషి. గతంలో బరాక్‌ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా పని చేసిన సమయంలో చైనాకు ప్రత్యేకమైన అనుకూలతను ఎక్కడా వ్యక్తం చేయలేదు. ట్రంప్‌ మితవాది, ఫాసిస్టుశక్తులకు మద్దతుదారు, శ్వేతజాతి దురహంకారి, కార్మిక వ్యతిరేకి కనుక శ్వేతజాతీయులైన సాధారణ కార్మికులతో సహా అనేక మంది తక్కువ ప్రమాదకారి అనే భావనతో బైడెన్ను బలపరిచారు. వారిలో కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అనేక శక్తులు బైడెను మీద అభిమానం కంటే ట్రంపు మీద ఉన్న వ్యతిరేకత కారణంగా డెమోక్రాట్లకు ఓటువేశారు. ఈ శక్తులన్నీ ఉన్నాయి కనుకనే పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధ్యమైంది. అయితే గడచిన కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కార్పొరేట్లకే సేవ చేశారు, కార్మికులను విస్మరించారు. డెమోక్రటిక్‌ పార్టీలో ఇటీవలి కాలంలో పురోగామిశక్తులు సంఘటితం అవుతున్నాయి. అనేక స్ధానిక ఎన్నికలలో కార్పొరేట్‌ అనుకూల శక్తులను వెనక్కు నెట్టి పోటీకి దిగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎన్నికలు ముగిసిన వెంటనే తమ అజెండా అమలుకు వత్తిడి తేవాలని కూడా నిర్ణయించాయి.

బైడెన్‌ వచ్చినంత మాత్రాన జరిగిన అన్యాయాలన్నీ సరిదిద్దుతారని చెప్పలేము. మన యువతకు హెచ్‌1బి వీసాల గురించి ట్రంప్‌ ఎంత ప్రతికూలంగా వ్యవహరించిందీ చూశాము. నిజానికి ఆ వీసాలు మన మీదో మరొక దేశం మీదో ప్రేమతోనో ఇస్తున్నవి కాదు. అక్కడి కార్పొరేట్‌ కంపెనీలకు చౌకగా పని చేసే కార్మికులు అవసరం కనుక ఇస్తున్నారు. ఎన్నికలలో నిరుద్యోగుల ఓట్ల కోసం ట్రంప్‌ జిమ్మిక్కులు చేశాడు. ఇప్పుడు బైడెన్‌ ముందూ నిరుద్యోగం సమస్య ఉంది. అయినప్పటికీ వీసాల విషయంలో కార్పొరేట్ల వత్తిడి మేరకు సడలింపులు ఇస్తారని భావిస్తున్నారు. ఇస్తారా లేదా, చైనా ఇతర దేశాల పట్ల ట్రంపు అనుసరించిన దూకుడు ధోరణి మార్చుకుంటారా లేదా వంటి అనేక సమస్యల మీద జనవరి మూడవ వారంలోగానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు వ్యవహారం : న్యాయవ్యవస్ధ తీరుతెన్నులపై మరో వివాదం !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
వివాదాస్పద ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి బెయిలు మంజూరు తీరు తెన్నులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ విదూషకుడు(కమెడియన్‌) కునాల్‌ కమ్రా తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని శుక్రవారం నాడు ప్రకటించారు. మరోవైపున కుమ్రాపై చర్య తీసుకోవాలని కోరుతూ అనేక మంది న్యాయవాదులు, న్యాయ విద్యార్ధులు సుప్రీం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. దీంతో సర్వోన్నత న్యాయస్ధానం వాటిని ఏమి చేయనుందనే ఆసక్తి దేశంలోనూ, వెలుపలా నెలకొన్నది. కునాల్‌ చేసిన వ్యాఖ్యలపై కోర్టు దిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతించాలని కోరుతూ అనేక మంది చేసిన వినతికి అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ సమ్మతి తెలిపిన ఒక రోజు తరువాత కునాల్‌ తన వైఖరిని బహిరంగంగా వెల్లడించారు. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవటం లేదా క్షమాపక్షణ గానీ చెప్పేది లేదన్నారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో తెలియదుగానీ ఈ ఉదంతం మరోమారు సుప్రీం కోర్టు జనం నోళ్లలో నానేందుకు దారితీసింది. ఆర్నాబ్‌ వ్యవహారం వెనక్కు పోయి సుప్రీం కోర్టు-భావ ప్రకటనా స్వేచ్చ అంశం ముందుకు వచ్చింది. మీడియా విస్తరణ కారణంగా ఎన్నడూ లేని విధంగా సామాన్యులలో సైతం ఈ అంశాలు చర్చకు దారితీయనున్నాయి.


ఇటీవలి కాలంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, తీర్పుల గురించి వెలువడుతున్న వ్యాఖ్యలు, విమర్శల మీద సామాజిక, సంప్రదాయ మాధ్యమాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతున్నాయి. న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదించకూడదు గానీ వారిచ్చిన తీర్పులపై మంచి చెడ్డల చర్చ, విమర్శలు చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని అంశాలు, తీర్పులు, బెయిలు మంజూరు సందర్భాలలో కొందరు న్యాయమూర్తుల తీరుతెన్నులు, వ్యాఖ్యలు ఆ హద్దును కూడా చెరిపి వేస్తున్న నేపధ్యంలో ఈ అంశాలను చూడాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పరిధి,పరిమితుల మీద మరింతగా మరోమారు స్పష్టత రానుంది.
ఆర్నాబ్‌ గురించేగాక ఇతరుల వ్యక్తిగత స్వేచ్చ అంశాలపై సుప్రీం కోర్టు మౌనాన్ని విమర్శించకుండా వదలకూడదు కనుక నా వైఖరిలో ఎలాంటి మార్పులేదని కునాల్‌ మరోమారు స్పష్టం చేశారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు, జమ్మూ-కాశ్మీర్‌ ప్రత్యేక హౌదా రద్దు,ఎన్నికల బాండ్ల చట్టబద్దత లేదా ఇతర అనేక ముఖ్య అంశాలకు సమయాన్ని,దృష్టి సారించాల్సి ఉందని కూడా సుప్రీం కోర్టుకు సూచన చేశారు. సుప్రీం కోర్టు,న్యాయమూర్తులకు సంబంధించిన ధిక్కార అంశాలపై చర్యలు తీసుకోవాలని మూడవ పక్షం కోరేందుకు నిబంధనల ప్రకారం తొలుత అటార్నీ జనరల్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంది. భావ ప్రకటనా స్వేచ్చ పేరుతో ధైర్యంగా, అడ్డగోలుగా ఉన్నత న్యాయస్దానాన్ని, దాని న్యాయమూర్తులను విమర్శించవచ్చని జనాలు నమ్ముతున్నారు, అయితే అది ధిక్కార చట్టానికి పరిమితుల్లోనే ఉంటుందని వాటిని దాటితే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అర్ధం చేసుకోవాల్సిన సమయమిదని అటార్నీ జనరల్‌ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయంతో ఎవరికీ పేచీ లేదు, విబేధించటం లేదు. తీర్పులు, వాటిని వెలువరిస్తున్న న్యాయమూర్తుల తీరుతెన్నులు ఇటీవలి కాలంలో లేవనెత్తుతున్న అంశాల సంగతేమిటన్నది జనాల ప్రశ్న. ప్రజాస్వామ్యంలో ఈ అంశాన్ని విస్మరించగలమా ?


దేశ ఉన్నత న్యాయస్ధానం స్వతంత్రమైనది మరియు నిష్పాక్షికమైనది కాదు, కనుక దాని న్యాయమూర్తులు కూడా అంతే అనటం మొత్తం వ్యవస్ధ మీద తీవ్రమైన నింద మోపటమే, అయితే మరోవైపు అది పాలక బిజెపి కోర్టు అని, బిజెపి ప్రయోజనాలకే కోర్టు ఉన్నదని ఆరోపిస్తున్నారంటూ అటార్నీ జనరల్‌ కునాల్‌ ట్వీట్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో జస్టిస్‌ ఎన్‌వి రమణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల మీద తీవ్రమైన ఫిర్యాదులే చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి, సిఎం ప్రధాన సలహాదారు మీద కూడా కోర్టు ధిక్కార చర్యలు తీసుకొనేందుకు అనుమతి కోరిన న్యాయవాదికి రాసిన లేఖలో ఈ అంశం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉన్నందున తాను అనుమతి ఇవ్వటం లేదని, ఎవరైనా నేరుగా చర్యలకు ఉపక్రమించవచ్చని అటార్నీ జనరల్‌ చెప్పిన విషయం తెలిసిందే. అక్టోబరు ఆరవ తేదీతో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సలహాదారు అజరు కల్లం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఐదు వారాలు గడిచినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ లేఖను ఏమి చేసిందీ తెలియదు.దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటం, అది సంచలనం సృష్టించినదాని మీద ఏ చర్య తీసుకుంటారన్నది జనంలో సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది.

జర్నలిస్టు ఆర్నాబ్‌ గోస్వామి తన రిపబ్లిక్‌ టీవీ స్టూడియో కోసం చేయించుకున్న పనికిగాను డబ్బు ఎగవేశారన్న ఆవేదనతో ఆర్కిటెక్ట్‌ అనవ్‌ నాయక్‌ 2018లో ఆత్మహత్యచేసుకున్నాడు. ఆ సందర్భంగా రాసిన లేఖలో ఆర్నాబ్‌ చెల్లించాల్సిన డబ్బు గురించి ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. అందువలన ఆత్మహత్యకు ఆర్నాబే బాధ్యుడనే ఆరోపణను గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బిజెపి-శివసేన ప్రభుత్వం తిరస్కరించి కేసును మూసివేసింది. ఇటీవల శివసేన-కాంగ్రెస్‌-ఎన్‌సిపి సంకీర్ణ కూటమి ప్రభుత్వం దానిని తిరిగి విచారణకు చేపట్టి అర్నాబ్‌ను అరెస్టు చేసింది. బోంబే హైకోర్టు ఈ కేసులో బెయిల్‌ను తిరస్కరించి సెషన్స్‌ కోర్టుకు దరఖాస్తు చేసుకోవాలని సలహా ఇచ్చింది. అయితే ఆర్నాబ్‌ సుప్రీం కోర్టు తలుపు తట్టారు.వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఇద్దరు సభ్యులు సుప్రీం కోర్టు బెంచ్‌ విచారించి బెయిలు మంజూరు చేసింది.హైకోర్టును తప్పు పడుతూ వ్యక్తిగత స్వేచ్చ రక్షణకు హైకోర్టులు తమ పరిధిని వినియోగించాలని న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. తన జర్నలిజాన్ని లక్ష్యంగా చేసుకొని అరెస్టు చేశారని ఆర్నాబ్‌ కోర్టులో చేసిన వినతిని గమనంలో ఉంచుకొని చంద్రచూడ్‌ ఈ వ్యాఖ్య చేశారని భావిస్తున్నారు.


సుప్రీం కోర్టు తీరు తెన్నులపై సీనియర్‌ అడ్వకేట్‌ దుష్యంత దవే వ్యాఖ్యానిస్తూ వేలాది మంది పౌరులు జైల్లో ఉండి తమ కేసులను విచారించాలని వారాలు, నెలల తరబడి వేచి చూస్తుండగా ఆర్నాబ్‌ దరఖాస్తును వెంటనే చేపట్టటం తీవ్రంగా కలచివేసేదిగా ఉందని పేర్కొన్నారు. కునాల్‌ కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతి ఇచ్చిన అటార్నీ జనరల్‌ చర్య దురదృష్టకరం, ప్రతికూల ఫలితాలనిస్తుందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో న్యాయమూర్తులను బుద్ధిహీన వృద్దులు, ప్రజాశత్రువులు అని మీడియా వర్ణించినా అక్కడి సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. కమ్రా మీద కోర్టు ధిక్కరణ చర్యకు ఉపక్రమిస్తే సుప్రీం కోర్టు అపహాస్యం పాలవుతుంది.బలవంతంగా గౌరవాన్ని పొందలేరు అని పేర్కొన్నారు.
కునాల్‌ కమ్రా మీద చర్య తీసుకోనట్లయితే సామాజిక మాధ్యమంలో ఉన్న మిలియన్ల మంది తమకు లేదా అభిమానించే వారికి తీర్పులు అనుకూలంగా రానట్లయితే న్యాయమూర్తులు, కోర్టుల మీద బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయటం మొదలు పెడతారని ఏజి అనుమతి కోరిన వారిలో ఒకరైన న్యాయవాది రిజ్వాన్‌ సిద్ధికీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ పతాకం ఎగురుతూ కాషాయ రంగుతో ఉన్న సుప్రీం కోర్టు భవన చిత్రాన్ని పోస్టు చేస్తూ కోర్టు విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అటార్నీ జనరల్‌కు న్యాయవాదులు రాసిన లేఖల మీద కునాల్‌ కమ్రా వ్యాఖ్యానిస్తూ దీన్ని కోర్టు ధిక్కరణ అని వర్ణించవద్దు,భవిష్యత్‌లో రాజ్యసభ స్ధాన ధిక్కరణ అని చెప్పండి అంటూ ట్వీట్‌ చేశారు. ప్రధాన న్యాయమూర్తిగా రంజన్‌ గొగోరు పదవీ విరమణ చేసిన తరువాత రాజ్యసభకు నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.
ఈ దేశ సుప్రీం కోర్టు దేశంలో అత్యంత పెద్ద జోక్‌. ” జాతీయ ప్రాధాన్యత కలిగిన ” అంశాలపై సుప్రీం కోర్టు వేగంగా స్పందిస్తున్న తీరును చూస్తే కోర్టులలో మహాత్మాగాంధీ బొమ్మలను తొలగించి హరీష్‌ సాల్వే(అర్నాబ్‌ న్యాయవాది) చిత్రాలను పెట్టాలి. ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ముందుగా వచ్చిన మొదటి తరగతి ప్రయాణీకులకు తొలుత మద్యం అందించే విమాన సహాయకుడి మాదిరి డివై చంద్రచూడ్‌ ఉన్నారు. అసలు ఎప్పుడూ విమానం ఎక్కని వారు లేదా సీట్లలో కూర్చోనివారిని వదలివేస్తారు. వెన్నెముక ఉన్న న్యాయవాదులందరూ సుప్రీం కోర్టు లేదా దాని న్యాయమూర్తులను ఉద్దేశించి మాట్లాడేముందు గౌరవనీయ అని సంబోధించటం మానుకోవాలి. చాలాకాలం క్రితమే ఆ భవనం నుంచి గౌరవం నిష్క్రమించింది. అని కునాల్‌ చేసిన ట్వీట్లలో పేర్కొన్నారు.


అటార్నీ జనరల్‌ తీసుకున్న నిర్ణయం సామాజిక మాధ్యమంలో పెద్ద చర్చకు తెరలేపింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి మీద చర్యకు తిరస్కరించినపుడు ఇంత వివాదం కాలేదు. టీవీ యాంకర్‌గా అర్నాబ్‌ గోస్వామి అత్యంత వివాదాస్పదుడు, ఏకపక్షంగా వ్యవహరించటం గురించి తెలిసినవారందరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ చర్చలో అతని కంటే న్యాయవ్యవస్ధ మీద కేంద్రీకృతం కావటం గమనించాల్సిన అంశం. జర్నలిజానికి సంబంధం లేని ఒక నేరంతో ప్రమేయం ఉన్న కేసులో వ్యక్తిగత స్వేచ్చ గురించి సుప్రీం న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఈ స్పందనకు మూలం. సాధారణంగా ఒక బెయిలు దరఖాస్తును వేగంగా పరిష్కరిస్తే ప్రశంసలు సహజం, అర్నాబ్‌ విషయంలో దానికి భిన్నంగా జరిగింది.
హత్రాస్‌ అత్యాచారం, హత్య ఉదంతంలో వార్తలు సేకరించేందుకు ఆ గ్రామం వెళుతున్న జర్నలిస్టు సిద్దికీ కప్పన్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసుల అక్రమంగా నిర్బంధించారు. అతన్ని విడుదల చేయాలన్న హెబియస్‌ కార్పస్‌ పిటీషన్‌ను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. జర్నలిజానికి సంబంధం లేని కేసులో జర్నలిస్టు ఆర్నాబ్‌కు వెంటనే బెయిలు మంజూరు చేసింది. ఆర్నాబ్‌ పిటీషన్‌లో ఉన్న లోపాలను కూడా పట్టించుకోకుండా కోర్టు ప్రారంభమైన వెంటనే బెంచ్‌ మీద పెట్టారు.
సుప్రీం కోర్టులో బెయిలు దరఖాస్తులు ఎన్ని పరిష్కారం కాకుండా ఉన్నాయి ? ఒక దరఖాస్తు పరిష్కారానికి సగటున ఎంతవ్యవధి తీసుకుంటారు అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తానని ఒకరు ట్వీట్‌ చేశారు. కొందరు వ్యక్తుల దరఖాస్తులను అత్యవసరంగా తీసుకోవాల్సిన మరియు వ్యక్తిగత స్వేచ్చలకు రక్షణ కల్పించాల్సిన నేపధ్యంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు అవసరమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణుడైన ఆర్నాబ్‌ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ మనుస్మృతి ప్రకారం ఉద్దావ్‌ థాకరేను చంపివేయమని అదృష్టం కొద్దీ డివై చంద్రచూడ్‌ ఆదేశాలు జారీ చేయలేదు అంటూ మరొకరు ట్వీట్‌ చేశారు. బిజెపి+ఆర్‌ఎస్‌ఎస్‌+ఎన్నికల కమిషన్‌+సిబిఐ+ఐటి+ఇడి+న్యాయవ్యవస్ధ+ మీడియా+ఫేస్‌బుక్‌లతో మహాకూటమి ఉందని దీన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు ఒక ట్వీట్‌ ఉంది.


సుధా భరద్వాజ 807 రోజులు, ఆసిఫ్‌ సుల్తాన్‌ రెండు సంవత్సరాలు, షజ్రీల్‌ ఇమామ్‌ 286, మీరన్‌ హైదర్‌ 223, ఇష్రాత్‌ జహాన్‌ మరియు ఖాలిద్‌ షఫీ 255, ఆసిఫ్‌ తన్హా 178, దేవాంగ కలితా మరియు నటాషా నర్వాల్‌ 171, ఉమర్‌ ఖాలిద్‌ 58, కిషోర్‌ చంద్ర వాంగ్‌ఖెమ్‌ 30 రోజుల నుంచి జైల్లో బెయిలు దరఖాస్తులతో ఉన్నారు అని ఒకరు ట్వీట్‌ చేశారు. వీరంతా నేరాలు చేశారని, వీరిని ఆర్నాబ్‌ను ఒకే గాటన కట్టటం ఏమిటని కొందరు ప్రశ్నించారు. నేరం రుజువు కానంత వరకు ఎవరూ దోషులు కానప్పుడు కొందరికి సంవత్సరాల తరబడి బెయిలు నిరాకరణ, ఆర్నాబ్‌కు అంతవేగంగా ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. ఎనభైనాలుగు సంవత్సరాల పార్కిన్సన్‌ వ్యాధిగ్రస్తుడైన స్టాన్‌ స్వామి బెయిల్‌ పిటీషన్‌ ఇరవై రోజులు ఆలశ్యం చేసిన కోర్టు ఆర్నాబ్‌ విషయంలో అంతవేగంగా కదలటాన్ని ఎలా సమర్ధించుకుంటుంది ? రిపబ్లిక్‌ టీవీలో నిత్యం విద్వేష పూరిత ప్రచారం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న ఆర్నాబ్‌ వ్యక్తిగత స్వేచ్చకు ఇతరులకు వివక్ష ఎందుకు ?


ఇటీవలి కాలంలో కొన్ని బెయిలు ఉత్తరువుల తీరు తెన్నులు విమర్శకు గురికావటం ఆర్నాబ్‌ వ్యవహారంతో ఆరంభం కాలేదని గ్రహించాలి. బిజెపి మాజీ ఎంపీ అయిన సోమ్‌ మరాండీ మరొక ఐదుగురికి ఒక కేసులో బెయిలు మంజూరు చేస్తూ వారంతా 35వేల రూపాయల చొప్పున పిఎం కేర్‌ నిధికి జమచేయాలని, ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. పిఎం కేర్‌ నిధి వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్ర చెప్పటంతో వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. కరోనా పోరులో భాగంగా ఆరోగ్యసేతు యాప్‌ను కోట్లాది మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నది కూడా తెలిసిందే. ఇదే రాష్ట్రంలో సామాజిక మాధ్యమంలో ముస్లింలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన కేసులో అరెస్టయిన రిచా భారతి ఐదు గ్రంధాలయాలకు ఖురాన్‌ పంపిణీ చేయాలని బెయిలు షరతుగా ఒక మెజిస్ట్రేట్‌ ఆదేశించారు. బెయిలు రాజ్యాంగంలోని హక్కుల నిబంధనల మేరకు ఇవ్వాలా లేక న్యాయమూర్తుల విచక్షణ మేరకా అన్నది ప్రశ్న.

యావత్‌ దేశ దృష్టిని ఆకర్షించిన జెఎన్‌యు మాజీ విద్యార్ధి నేత కన్నయ్య కుమార్‌ మీద మోపిన కేసులో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ప్రతిభా రాణి 27పేజీల సుదీర్ఘ బెయిలు ఉత్తరువు జారీ చేశారు. సాధారణంగా బెయిలు ఉత్తరువులు చిన్నవిగా ఉంటాయన్నది తెలిసిందే. అతని మీద మోపిన నేరం రుజువుకాక ముందే తుది తీర్పు మాదిరి బెయిలు ఉత్తరువులో అసందర్భంగా అనేక అంశాలను పేర్కొన్నారు. కన్నయ్య కుమార్‌ మీద సంఘపరివార్‌ శక్తులు చేసిన ప్రచారంలోని అనేక అంశాలలోని జాతి వ్యతిరేక ధోరణులు, సరిహద్దులను సిపాయిలు కాపాడటం-వాటికి భావ ప్రకటనా స్వేచ్చను జోడించటం వంటివన్నీ బెయిలు ఉత్తరువులో చేసుకున్నాయి.అన్నింటికీ మించి పదివేల రూపాయలను జెఎన్‌యు చెల్లించాలని పేర్కొన్నారు. ఇదే విధంగా బిజెపి నేత స్వామి చిన్మయానందపై వచ్చిన అత్యాచార కేసులో బెయిలు సందర్భంగా కూడా అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి 25పేజీల ఉత్తరువులో బాధితురాలి మీద అవాంఛనీయమైన వ్యాఖ్యలు చేశారు.
ఆరు సంవత్సరాల క్రితం పూనాలో మోషిన్‌ షేక్‌ అనే ఐటి ఇంజనీర్‌ను ముగ్గురు హత్య చేశారు.వారికి బెయిలు మంజూరు చేసిన న్యాయమూర్తి వ్యాఖ్యలు ప్రమాదకరమైనవిగా ఉన్నాయి. హతుని తప్పిదం ముస్లిం కావటం, ఆకుపచ్చ రంగుచొక్కా ధరించటం, గడ్డం పెంచుకోవటం, నిందితులకు గతంలో ఎలాంటి నేర చరిత లేదు. మతం పేరుతో వారిని రెచ్చగొట్టినట్లుగా దాంతో వారు నేరానికి పాల్పడినట్లుగా కనిపిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.మేక పిల్లను తినదలచుకున్న తోడేలు కథ తెలిసిందే. దేశంలో ఫలానా రంగు చొక్కా ధరించకూడదని, గడ్డం పెంచుకోకూడదనే నిబంధనలేవీ లేవు. రెచ్చగొట్టటం లేదా రెచ్చిపోవటం అనేది ఎటు నుంచి ఎటు జరిగినా ఉత్తిపుణ్యానికే జరగవు. ఈ కేసులో నిందితులు వివాదాస్పద, విద్వేషాలను రెచ్చగొడుతుందన్న విమర్శలు ఉన్న హిందూ రాష్ట్రీయ సేన సభలో ఉపన్యాసాలు వినేందుకు వెళ్లారన్నది వెల్లడైంది.


మావోయిస్టు సానుభూతి పరులనే పేరుతో హత్యవంటి తీవ్రనేర ఆరోపణలు లేకపోయినా, కుట్ర ఆరోపణలతో చక్రాల కుర్చీ ఉంటే తప్ప కదల్లేని అనారోగ్యంతో ఉన్న సాయిబాబా వంటి వారితో పాటు ఎనిమిది పదుల వయసున్న వరవరరావు వంటి వృద్దులకు కోర్టులు బెయిలు నిరాకరిస్తున్నాయి. గుజరాత్‌ మారణకాండలో నరోదా పాటియా ఉదంతంలో శిక్ష పడిన బిజెపి నేత మాయా కొడయానీకి అనారోగ్యం పేరుతో బెయిలు మంజూరు చేశారు. ఆ మారణకాండలోనే 33 మందిని సజీవంగా దహనం చేసిన సరదార్‌పైరా ఉదంతంలో శిక్షపడిన 13మందికి అసాధారణరీతిలో బెయిలు మంజూరు చేస్తూ గుజరాత్‌ వెలుపల సామాజిక సేవ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఇలాంటి ఉదంతాలలో బెయిలు నిందితులు ఎవరో చెప్పనవసరం లేదు. ఆర్నాబ్‌ గోస్వామి వ్యవహారం బహిరంగ రహస్యం. అతని అరెస్టుకు నిరసనగా బిజెపి నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశ్మీరులో కథువా, హత్రాస్‌ ఉదంతాలలో నిందితులు నిర్దోషులు అంటూ అదే బిజెపి నేతలు వెనుక వేసుకు వచ్చిన సంగతి తెలిసిందే. కనుకనే కోర్టులు, న్యాయమూర్తులు ఎవరికోసం ఉన్నాయి, ఎవరికోసం పని చేస్తున్నారనే వ్యాఖ్యలు, విమర్శలు తలెత్తుతున్నాయి. న్యాయవ్యవస్ధ కూడా దోపిడీ వర్గపు కనుసన్నలలోనే నడుస్తుందని ప్రపంచంలోని కమ్యూనిస్టుల సాధారణ అభిప్రాయం. దీనితో ఏకీభవించవచ్చు, తిరస్కరించవచ్చు. ఐదు దశాబ్దాల క్రితం దేశ రాజ్యాంగం మీద తమకు విశ్వాసం లేదంటూ తుపాకి పట్టిన నగ్జల్స్‌ కోర్టుల మీద విశ్వాసం లేదని తమపై మోపిన కేసుల సందర్భంగా చెప్పారు. ఒక అయిడియా మీ జీవితాన్నే మార్చి వేస్తుందన్నట్లుగా నేడు వెలువడుతున్న తీర్పులు, వాటి తీరుతెన్నులు కమ్యూనిస్టులు చెప్పేపని లేకుండానే, వారితో విబేధించేవారితో సహా అనేక మందికి న్యాయవ్యవస్ధ మీద విశ్వాసం పోతోంది. అందువలన తిరిగి దాని మీద విశ్వాసాన్ని పునరుద్దరించాలంటే ఎక్కడ ప్రారంభించాలి? విత్తు ముందా -చెట్టు ముందా ? కునాల్‌ కమ్రా వంటి వారిని శిక్షించా లేక అలాంటి వారి వ్యాఖ్యలకు తావివ్వని తీర్పులు, న్యాయమూర్తుల తీరుతోనా ? కునాల్‌ మీద కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. గతంలో ప్రశాంత భూషణ్‌ మీద వచ్చిన కేసుకు దీనికి ఎంతో తేడా ఉంది. దాఖలైన కేసును విచారణకు చేపడితే మీడియా, ఇతర అన్ని రంగాలలో మరింత తీవ్రమైన చర్చకు దారి తీయటం అనివార్యం. ప్రశాంత భూషణ్‌ వ్యాఖ్యానించినట్లు అది ప్రతికూల ఫలితాల నిస్తుందా లేక అటార్నీ జనరల్‌ వంటి వారు చెబుతున్నట్లు సానుకూల ఫలితాలనిస్తుందా ? మరి కొంత మందికి న్యాయవ్యవస్ధల మీద విశ్వాసాన్ని పోగొడుతుందా ?

బీహార్‌ ఎన్నికల ఫలితాలు: ప్రధాని నరేంద్రమోడీ అసత్యాలు-వాస్తవాలు !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు
బీహార్‌లో జెడియు-బిజెపి కూటమి గెలుపు అక్కడి అభివృద్ది పనులకు విజయమని ప్రధాని నరేంద్రమోడీ వర్ణించారు. బీహార్‌ ప్రజాస్వామ్య గడ్డ అని ఎందుకు పిలుస్తామో ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు.కుటుంబ పాలన గురించి కూడా నరేంద్రమోడీ ప్రస్తావించారు. ఢిల్లీలో జరిగిన బీహార్‌ ఎన్నికల విజయోత్సవ సభలో ప్రధాని చేసిన ప్రసంగమంతా ఇదే ధోరణిలో కొనసాగింది.ప్రభుత్వ వ్యతిరేకత ఉందని ఎవరూ చెప్పలేదని, అనుకూలత కారణంగానే తమ కూటమి 125 స్ధానాలు సాధించిందని బీహార్‌ ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత సుశీల్‌ కుమార్‌ మోడీ చెప్పారు. ఇద్దరు యువరాజులు అధికారం కోసం పోటీ పడుతున్నారని. మరొక సారి అరాచక పాలనా కావాలో లేదో తేల్చుకోవాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని బీహారీలను కోరారు. నిజంగా బీహార్‌లో బిజెపి కూటమి సాధించినదాన్ని ” విజయం ” గా పరిగణించాలా ? ప్రధాని పేర్కొన్న ఇతర అంశాల్లో నిజమెంత ? అంకెలతో ఎలా అయినా ఆడుకోవచ్చు, భిన్న భాష్యాలు చెప్పవచ్చు తప్ప వాటిని మార్చలేము.


భారత ఎన్నికల చరిత్రలో తొలిసారిగా కొన్ని వేల ఓట్ల తేడాతో అధికారం దక్కటం బీహార్‌లోనే జరిగింది. గతంలో కేరళలో అలాంటి పరిణామం జరిగినప్పటికీ కొన్ని లక్షల ఓట్ల తేడా ఉంది. ఇది రాసిన సమయానికి ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు కాలేదు. వివిధ మీడియా సంస్దలు అందచేసిన వివరాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నపుడు 0.1 శాతం నుంచి 0.05శాతం మధ్య తేడాలు చూపాయి. ఓట్ల రీత్యా చూస్తే పదమూడు నుంచి 24 వేల ఓట్ల మెజారిటీతో అధిక సీట్లు తెచ్చుకొని ఎన్‌డిఏ కూటమి అధికారం సాధించటం బీహార్‌లో మాత్రమే జరిగింది. ఈ కారణంగానే చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. అసెంబ్లీలోని 243 సీట్లలో మెజారిటీకి అవసరమైన 122గాను ఎన్‌డిఏ 125 తెచ్చుకొన్నది. రాష్ట్రీయ జనతాదళ్‌ లేదా ఆర్‌జెడి-కాంగ్రెస్‌-మూడు వామపక్ష పార్టీల (ఎంజిబి) కూటమి 110, మూడవ కూటమిగా పోటీ చేసిన వాటిలో మజ్లిస్‌ 5, బిఎస్‌పి, విడిగా పోటీలో ఉన్న ఎల్‌జెపి 1, స్వతంత్రులు ఒకరు గెలిచారు. పార్టీల వారీగా చూసినపుడు గత అసెంబ్లీలో 81 స్ధానాలున్న జెడియు 43కు పరిమితం కాగా, బిజెపి 53ను 74కు పెంచుకుంది. ఈ రెండు పార్టీల మిత్రపక్షాలుగా ఉన్న రెండు పార్టీలు ఒకటి నుంచి ఎనిమిదికి పెంచుకున్నాయి. ఆర్‌జెడికి 80కిగాను 75, కాంగ్రెస్‌కు 27కు 19 వచ్చాయి. సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) మూడు నుంచి 12కు పెంచుకోగా ప్రాతినిధ్యం లేని సిపిఐ, సిపిఎం రెండేసి చోట్ల గెలిచాయి. మజ్లిస్‌ పార్టీ ఐదు, బిఎస్‌పి ఒకటి కొత్తగా సంపాదించాయి. స్వతంత్రులు నాలుగు నుంచి ఒకటికి తగ్గారు.


ఓట్ల వివరాలను చూస్తే వికీపీడియా ప్రకారం జెడియు కూటమికి 37.26శాతం (1,57,01,226), ఆర్‌జెడి కూటమికి 37.21(1,56,77,0320) వచ్చాయి. ఎల్‌జెపి పోటీ చేసిన 134 స్ధానాల్లో 5.66శాతం(23,83,457) ప్రజాస్వామ్య లౌకిక మహాకూటమి పేరుతో పోటీ చేసిన ఆరు పార్టీల కూటమికి 4.5శాతం ఓట్లు వచ్చాయి. బిజెపి పోటీ చేసిన చోట ఎల్‌జెపి తన అభ్యర్ధులను నిలపకుండా ఆ పార్టీకి మద్దతు ప్రకటించింది.అంటే 109 స్ధానాల్లో తన ఓట్లను బదలాయించింది. ఆ పార్టీ సాధించిన ఓట్ల సగటు ప్రాతిపదికగా 4.6శాతం ఓట్లను బిజెపికి వేయించిందని భావించవచ్చు. ఈ ఎన్నికలలో బిజెపికి 19.46శాతం, జెడియుకు 15.39 శాతం వచ్చాయి. ఎల్‌జెపి ఓట్ల బదలాయింపు బిజెపి సీట్లు, ఓట్ల సంఖ్య పెరిగేందుకు దోహదం చేసిందని అంకెలు చెబుతున్నాయి. కనీసం 30 స్ధానాల్లో జెడియు అవకాశాలను దెబ్బతీసిందని ప్రాధమిక సమాచారం వెల్లడించింది. 2019 మేనెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, జెడియు, ఎల్‌జెపి మూడూ కలసి 53.25శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. వామపక్షాలు లేని ఆర్‌జెడి-కాంగ్రెస్‌ కూటమికి 30.76శాతం ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీ చూస్తే జెడియు కూటమిలో బిజెపి 96, జెడియు 92, ఎల్‌జెపి 35, హిందూస్దానీ అవామ్‌ పార్టీ రెండు చోట్ల మొత్తం 225 స్ధానాల్లో ఆధిక్యత, 40కి గాను 39లోక్‌ సభ సీట్లును సాధించాయి. ఆర్‌జెడి 9, కాంగ్రెస్‌ 5 స్ధానాలకే పరిమితం అయ్యాయి.(కాంగ్రెస్‌ మాత్రమే ఒక లోక్‌సభ స్ధానంలో విజయం సాధించింది) విడిగా పోటీ చేసిన మజ్లిస్‌ రెండు, ఆర్‌ఎస్‌ఎల్‌పి, సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌) ఒక్కొక్క చోట ఆధిక్యత కనపరిచాయి.


లోక్‌సభ ఎన్నికలలో బిజెపి-జెడియు 17 చొప్పున, ఎల్‌జెపి ఆరు చోట్ల పోటీ చేసి వరుసగా 23.58, 21.81, 7.86శాతం తెచ్చుకున్నాయి.పై వివరాలన్నీ చూసినపుడు ప్రధాని నరేంద్రమోడీ ఎంతగా ప్రచారం చేసినా అసెంబ్లీ ఎన్నికలలో ఆ కూటమికి ఓట్లు, సీట్లు కూడా గణనీయంగా తగ్గాయి. మరోవైపు ఆర్‌జెడి కూటమి ఓట్లు, సీట్ల రీత్యా ఎంతో మెరుగుదల సాధించాయి.
ఏడాదిన్నర క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 40కిగాను 39 స్ధానాలు సాధించిన జెడియు-బిజెపి కూటమి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా 243కు గాను 125 స్ధానాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీహారీల తీర్పు సరికొత్త రాజకీయానికి తెరలేపింది.గత రెండు దశాబ్దాలుగా మూడు స్ధంభాలాటగా మారిన రాష్ట్ర రాజకీయాలలో బిజెపి, ఆర్‌జెడి, జెడియు పార్టీలలో ఏ రెండు కలిసినా అధికారాన్ని పొందే పరిస్ధితి తలెత్తింది. దీన్ని ఉపయోగించుకొని నితీష్‌ కుమార్‌ 15ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటమే గాక సీట్లు తగ్గినా తిరిగి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు కూడా ఇదే పొందిక తోడ్పడింది.


తొలిసారి నరేంద్రమోడీ పాలనా కాలంలో 2014-19 మధ్య బిజెపి బంధం నుంచి 15 పార్టీలు వైదొలిగాయి. రెండవ సారి అధికారానికి వచ్చిన తరువాత మూడు పార్టీలు గుడ్‌బై చెప్పాయి.ఈ నేపధ్యంలో బీహార్‌ పరిణామాలను చూడాల్సి ఉంది. మహారాష్ట్ర అనుభవనాన్ని చూసిన తరువాత దాన్ని పునరావృతం కానివ్వరాదని బిజెపి అధిష్టానవర్గం బీహార్‌లో జాగ్రత్త పడినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి ఇది అనివార్యస్ధితి. ఈ నేపధ్యంలోనే తమ కారణంగానే నితీష్‌ కుమార్‌కు మరోమారు ముఖ్యమంత్రి పదవి దక్కిందని శివసేన వ్యాఖ్యానించింది. ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే ఆ పార్టీ నేతలు ఒక వేళ మాట తప్పితే మా మాదిరే వ్యహరించాలని జెడియుకు హితవు చెప్పింది. ఈ కారణంగానే అనివార్య పరిస్ధితుల్లో బిజెపి వ్యవహరిస్తోంది. ఇది ఎంత కాలం కొనసాగుతుంది అన్న ప్రశ్న ఎలాగూ ఉండనే ఉంటుంది. మహారాష్ట్రలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా అధికారాన్ని రెండు భాగాలుగా పంచుకొనేందుకు అంతర్గతంగా అంగీకరించిన బిజెపి ఫలితాలు వచ్చిన తరువాత మాట తప్పిందని శివసేన చెప్పింది. తాము అలాంటి ఒప్పందం చేసుకోలేదని బిజెపి అడ్డం తిరిగింది. ఫలితంగా అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలు, పర్యవసానాల్లో బిజెపి భంగపడిన విషయం తెలిసిందే. తమకు సీట్లు ఎక్కువ వచ్చిన కారణంగా సిఎం పదవి తమకే అని బీహార్‌ బిజెపి అంటే శివసేన మాదిరి జెడియు బయటకు వచ్చి ఆర్‌జెడితో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే నితీష్‌ కుమార్‌ను గద్దెనెక్కించి చక్రం తిప్పాలని బిజెపి నిర్ణయించిందని చెప్పవచ్చు. మాన్‌ ఆఫ్‌ ది మాచ్‌ ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్‌, ఎన్‌డిఏ విజయోత్సవాలు చేసుకోవటం పెద్ద జోక్‌, జెడియు అవకాశాలను దెబ్బతీసిన చిరాగ్‌ పాశ్వాన్‌ ఇంకా ఎన్‌డిఏలోనే ఉన్నారు అని శివసేన నేత సంజయ రౌత్‌ వ్యాఖ్యానించారు.

రాజకీయాల్లో అందునా అధికారం కోసం దేనికైనా గడ్డి కరుస్తున్న ఈ రోజుల్లో తెల్లవారే సరికి అనూహ్య పరిణామాలు జరగవచ్చు. ఈ నేపధ్యంలో నితీష్‌ కుమార్‌ పదవి ఎంతకాలం ఉంటుంది అన్నది ఒక ప్రశ్న. వివాదాస్పద ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ అంశాలు ముందుకు వచ్చినపుడు బీహార్‌లో వాటిని అమలు జరిపేది లేదని నితీష్‌ కుమార్‌ చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు, దాన్ని బిజెపి వ్యతిరేకించలేదు. నాడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌, నేడు బిజెపి మీద నితీష్‌ కుమార్‌ ఆధారపడనున్నారు. అందువలన ఇప్పుడు కూడా బిజెపి దానికే కట్టుబడి ఉంటుందా ? ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో పార్లమెంట్‌లో జెడియు వ్యతిరేకించింది. తరువాత ఒకసారి పార్లమెంట్‌ ఆమోదించిన తరువాత బలపరచక చేసేదేమీ లేదని అడ్డం తిరిగింది. ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ఓటర్లను వేడుకున్న నితీష్‌ కుమార్‌ ఇప్పుడు పదవికోసం ఎన్‌ఆర్‌సి,ఎన్‌పిఆర్‌ విషయంలో గత వైఖరికే కట్టుబడి ఉంటారా ? పదవికోసం పై అంశాలలో తన వ్యతిరేకతను తానే దిగమింగి బిజెపి అజెండాకు జైకొడతారా ? అదే జరిగితే జెడియులో ఎలాంటి వ్యతిరేకత తలెత్తదా ?
తాత్కాలికంగా ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినప్పటికీ తరువాత వత్తిడి తెచ్చి కేంద్ర మంత్రిగా పంపటం లేదా తనంతట తానే పదవి నుంచి తప్పుకొనే విధంగా బిజెపి వ్యవహరించవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఒక వేళ అదే జరిగితే జెడియు ఎంఎల్‌ఏలు బిజెపి నాయకత్వాన్ని అంగీకరిస్తారా అన్నది కూడా ప్రశ్నార్దకమే. బిజెపి దయాభిక్షతో వచ్చే పదవులు ఆర్‌జెడి కూటమికి మద్దతు ప్రకటించినా వస్తాయన్నది స్పష్టమే. ఇక విజయోత్సవ సభలో ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఉపన్యాసంలోని కొన్ని అంశాల తీరు తెన్నులను చూద్దాం.తమ అభివృద్ధి పధకాలే విజయాన్ని చేకూర్చాయన్నారు. అసలు అభివృద్ధి అంటే ఏమిటి ? ఇప్పటికి సాధించినదానికే తమ భుజాలను తాము చరుచుకుంటే బీహార్‌ రాబోయే రోజుల్లో కూడా అధోగతిలోనే ఉంటుంది. పదిహేనేండ్ల నితీష్‌ కుమార్‌ పాలనలో మానవాభివృద్ధి సూచికలో 2018 యుఎన్‌డిపి నివేదిక ప్రకారం బీహార్‌ 36వ స్దానంలో ఉంది. దాని తరువాత మరొక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం లేదు. అయినా మోడీ అభివృద్ధి విజయమని చెప్పారు.


ప్రధాని అరాజకశక్తిగా వర్ణించిన ఆర్‌జెడి కూటమి గురించి చూద్దాం. గతంలో అక్కడ అరాజకం నెలకొన్నమాట నిజం. భూమికోసం, అణచివేతకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటాలు సాగించినపుడు వాటిని అణచివేసేందుకు భూస్వామిక శక్తులు వివిధ సేనల పేరుతో గూండా గుంపులను పెంచి పోషించాయి. వాటికి నాడు ఒకే పార్టీలో ఉన్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌, దివంగత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ అందరూ పరోక్షంగా మద్దతు ఇచ్చారు. తరువాత విడిపోయి వేర్వేరు దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికలలో జెడియు కూటమితో సమంగా బీహారీలు ఓటు వేయటం ప్రధాని నరేంద్రమోడీ, ఆ కూటమికి చెంపదెబ్బగా చెప్పవచ్చు. నితీష్‌ కుమార్‌ ఏలుబడిలో గూండాయిజం లేదన్నది మోడీ గారి భాష్యం. గూండాయిజం సాగిందని చెబుతున్న సమయంలో తేజస్వి యాదవ్‌ నిక్కర్లతో తిరిగిన బాలుడు. ఇప్పుడు 31సంవత్సరాల యువకుడు. అందువలన గతానికి అంటే తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఏలుబడికి ముడిపెట్టి చేసిన ప్రచారాన్ని ఓటర్లు పట్టించుకోలేదన్నది స్పష్టం. ఎన్నికలలో ఎక్కడా బూత్‌ల ఆక్రమణ, దౌర్జన్యం వంటివి నమోదు కాలేదు. రెండు కూటములకు సమానంగా ఓట్లు రావటాన్ని బట్టి నరేంద్రమోడీ చేసిన ప్రచారాన్ని ఓటర్లు తిప్పికొట్టారని చెప్పవచ్చు.
మూడుసార్లు అధికారంలో ఉన్నప్పటికీ బిజెపికి ప్రాధాన్యత పెరుగుతోందని దానికి అనుగుణ్యంగా బీహార్‌లో సీట్లు పెరిగాయని ప్రధాని విజయోత్సవ సభలో చెప్పారు. బీహార్‌ ఎన్నికలలో గత పాతిక సంవత్సరాలలో బిజెపి సాధించిన అసెంబ్లీ స్ధానాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్నికల సంవత్సరం—- సీట్లు
1995 ——- —— 41
2000 —————72
2005 ఫిబ్రవరి— 37
2005 అక్టోబరు— 55
2010—————- 91
2015 ————— 53
2020 ————— 74
ఈ అంకెలు నరేంద్రమోడీ చెప్పింది వాస్తవం కాదని వెల్లడిస్తున్నాయి. గతంలో గరిష్టంగా 72, 91స్ధానాలు తెచ్చుకున్న పార్టీ ఇప్పుడు 74తెచ్చుకుంటే దాన్ని ఆదరణగా చెప్పటం జనాల జ్ఞాపకశక్తిని అవమానించటం తప్ప వేరు కాదు. తమకు ఓటు వేస్తే కరోనా వైరస్‌ వాక్సిన్‌ ఉచితంగా ఇస్తామన్న వాగ్దానం, నరేంద్రమోడీ రామాలయ నిర్మాణం, గాల్వాన్‌ లోయలో మరణించిన బీహార్‌ రెజిమెంట్‌ సైనికులు, సినిమా సుశాంత సింగ్‌ రాజపుత్‌ ఆత్మహత్యను కూడా ఎన్నికల్లో వాడుకోవాలని చూసినా వాటి వలన పెద్దగా ప్రభావితులైనట్లు కనిపించలేదు.


గతంలో కాంగ్రెస్‌ అనుసరించిన అప్రజాస్వామిక, చివరికి అత్యవసర పరిస్ధితిని కూడా విధించిన నేపధ్యంలో దానికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు సమీకృతమయ్యాయి. జనతా పార్టీలో నేటి బిజెపి పూర్వ రూపమైన జనసంఘం కూడా ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన కారణంగా సిపిఎం, ఇతర వామపక్షాలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చాయి. ఇప్పుడు అత్యవసర పరిస్దితిని విధించకపోయినా రాజ్యాంగ వ్యవస్ధలను దిగజార్చటం, ప్రతిపక్షాలపై కేంద్ర సంస్ధలతో దాడులు చేయించటం వంటి చర్యలతో పాటు మతోన్మాదాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువస్తోంది. ఈ జంట ప్రమాదాల నేపధ్యంలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ద్వారా ఓట్ల చీలిక నివారించి ఆ పార్టీని ఎదుర్కోవాలనే అభిప్రాయం నానాటికీ బలపడుతోంది.


బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు దాని ప్రాధాన్యతను మరింత స్పష్టపరిచాయి.కాంగ్రెస్‌ లేదా ఆర్‌జెడి విధానాలు, అవగాహనలను వామపక్షాలు లేదా మరొక శక్తి ఆమోదించటం, అంగీకరించాల్సిన అవసరం లేదు. ఏది ప్రధాన సమస్య అన్నపుడు బిజెపి ముప్పు ముందుకు వస్తోంది. గతలోక్‌ సభ ఎన్నికలలో వామపక్షాలు విడిగా పోటీ చేశాయి. ఐక్యత అవసరాన్ని ఆర్‌జెడి, కాంగ్రెస్‌ గుర్తించాయి. దాని ఫలితమే వామపక్షాలు సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి. 2015 అసెంబ్లీ ఎన్నికలలో ఆర్‌జెడితో ఎలాంటి సర్దుబాటు లేకుండానే సిపిఐ(ఎంఎల్‌-లిబరేషన్‌,) సిపిఐ, సిపిఎంలకు కలిపి 3.5శాతం ఓట్లు వచ్చాయి. తాజా ఎన్నికలలో సర్దుబాటుతో 4.7శాతానికి పెరిగాయి. ఈ ఎన్నికల్లో మహాకూటమి గణనీయ సంఖ్యలో స్దానాలు సంపాదించేందుకు ఈ ఓట్లు ఎంతో దోహదం చేశాయన్నది స్పష్టం. గత లోక్‌ సభ ఎన్నికలు, అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి వ్యతిరేక ఓటు సంఘటితం కావాల్సిన అవసరాన్ని ఓటింగ్‌ తీరుతెన్నులు స్పష్టం చేశాయి. బీహార్‌ ఎన్నికలలో ఎన్‌డిఏ కూటమి ‘బి’ టీమ్‌గా రంగంలోకి దిగిన మజ్లిస్‌, బిఎస్‌పి కూటమి చీల్చిన ఓట్ల ద్వారా ఎన్‌డిఏ లబ్ది పొందిదన్నది తెలిసిందే. అందువలన అలాంటి శక్తులను దూరంగా ఉంచుతూ ఓటర్లలో చైతన్యాన్ని కలిగించాల్సిన అవసరాన్ని కూడా ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని చెప్పవచ్చు.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఘోర పరాజయం – నరేంద్రమోడీకి చెప్పుకోలేని దెబ్బ !

Tags

, , ,


ఎం కోటేశ్వరరావు
అమెరికా అధ్యక్షుడిగా డెమోక్రటిక్‌ పార్టీ నేత జో బైడెన్‌ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలక్ట్రరల్‌ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు 306 ఓట్లు వస్తాయని మీడియా విశ్లేషణలు తెలిపాయి. ఈ కారణంగానే మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు అభినందనలు పంపుతున్నారు.అమెరికా నగరాలలో డెమోక్రాట్ల విజయోత్సవాలు ప్రారంభమయ్యాయి. అమెరికా మిత్ర రాజ్యాలు లేదా అది శత్రువులుగా పరిగణిస్తున్న దేశాలూ బిడెన్‌ ఏలుబడిలో సంబంధాలు, సమస్యలూ ఎలా ఉంటాయా అన్న మధనంలో పడ్డాయి.ప్రపంచీకరణ, అందునా ఏకైక అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రతి పరిణామ పర్యవసానాలూ ప్రపంచం మీద ఉంటాయి కనుక ఇది సహజం.
అమెరికా చరిత్రలో అధికారంలో ఉండి ఓడిపోయిన వారిలో 11వ వ్యక్తిగా డోనాల్డ్‌ ట్రంప్‌ చరిత్ర పుటలకు ఎక్కాడు. ఈ ఎన్నికల గురించి ప్రపంచంలో చెప్పుకోలేని చోట దెబ్బతగిలింది ఎవరికయ్యా అంటే అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ (ఈసారి ట్రంప్‌ సర్కార్‌ ) అని నినాదమిచ్చిన ప్రధాని నరేంద్రమోడీ, దాని మీద ఎలాంటి అభ్యంతరమూ తెలపని సంఘపరివార్‌ లేదా బిజెపికి అన్నది స్పష్టం. గతంలో మన పాలకులు ఎవరూ మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. అంతర్గతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ దేశం ఎలా జోక్యం చేసుకున్నప్పటికీ అదంతా లోగుట్టు వ్యవహారం. బహిరంగంగా జోక్యం చేసుకొని ఒక పక్షానికి మద్దతు పలికింది నరేంద్రమోడీ మాత్రమే. అందువలన ఇబ్బంది పడేది కూడా మోడీ అండ్‌ కో మాత్రమే. ట్రంప్‌ మీద జోకులేసే వారు మోడీని కూడా కలిపి ఆడుకున్నా చేయగలిగిందేమీ లేదు.
అనేక సార్లు బిజెపి ఐటి విభాగం అభాసుపాలైంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. 2014 సెప్టెంబరులో ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన జరిపిన సందర్భంగా ఇచ్చిన విందులో నాడు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్‌ – మోడీ కలుసుకున్న ఫొటోను ఇప్పుడు విడుదల చేసి బైడెన్‌తో మోడీకి ఎంత సాన్నిహిత్యం ఉందో చూడండి అని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నించింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమెరికా పర్యటనకు నిరాకరించింది కూడా అదే బిడెన్‌, అదే పార్టీకి చెందిన బరాక్‌ ఒబామా అన్న విషయం తెలిసిందే. అయితే మోడీ ప్రధాని అవగానే బరాక్‌ ఒబామా స్వాగతం పలికారు. దానికి చూశారా మా మోడీ తడాఖా అని బిజెపి మరుగుజ్జులు సామాజిక మాధ్యమంలో ఎగిరెగిరి పడ్డారు. అక్కడ ఆహ్వానం నరేంద్రమోడీకి కాదు, భారత ప్రధానికి అన్నది అసలు వాస్తవం. ఇప్పుడు ప్రత్యేక పరిస్దితి తలెత్తింది. గుజరాత్‌లో జరిపిన మారణకాండలో మోడీ మీద వచ్చిన విమర్శల కారణంగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒబామా సర్కార్‌ అనుమతి ఇవ్వలేదు. తరువాత పరిస్ధితి మారింది కనుక ఒక దేశాధినేతగా ఆహ్వానం పలికారు. తాజా ఎన్నికలలో బైడెన్‌కు వ్యతిరేకంగా,ట్రంప్‌కు మద్దతుగా ప్రధాని హౌదాలో అమెరికా వెళ్లి మరీ ప్రచారం చేయటాన్ని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది.
అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన తీరులో మోడీ ప్రవర్తన చౌకబారుగా ఉందా, రాజనీతిజ్ఞుడిగా వ్యవహరించారా అన్నది వేరే అంశం. ఇప్పటి వరకు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకం, ప్రమాదకరమైన పోకడ. బిజెపి ఐటి విభాగపు నేత అమిత్‌ మాలవీయ ఒక ట్వీట్‌ చేస్తూ వామపక్ష శక్తులు ఆశాభంగం చెందుతారని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌ ఎన్నికైతే ఆయన ఏది చెబితే అది వినాల్సి రావటం మోడీకి పెద్ద దెబ్బ అవుతుందనే భ్రమల్లో దుష్ట వామపక్ష శక్తులు ఉన్నాయి, వారు చివరికి ఆశాభంగం చెందుతారు అని ట్వీట్‌లో పేర్కొన్నారు. బైడెన్‌ అయినా మరొకరు అయినా చక్రం తిప్పేది అమెరికా అధ్యక్షుడు తప్ప ప్రస్తుత పరిస్ధితిలో మోడీ లేదా మరొక దేశనేత కాదు.
మన భుజం మీద తుపాకిపెట్టి చైనాను కాల్చాలన్నది ట్రంప్‌ ఎత్తుగడ. అదే బైడన్‌ కూడా అనుసరిస్తే, ఆలోచన లేకుండా మనం భుజం అప్పగిస్తే ఉపయోగించుకుంటారు. చైనా మార్కెట్‌ను పూర్తిగా తమకు అప్పగించాలని, ప్రపంచంలో ఎక్కడా చైనా పోటీకి రాకూడదని అమెరికా కోరుకుంటోంది.అందుకు ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటున్నది. గతంలో మన మార్కెట్‌ కోసం మనకు వ్యతిరేకంగా పాకిస్ధాన్‌ను ఎగదోసి మన మీద వత్తిడి తెచ్చింది. మన పాలకులు లొంగిపోవటంతో ఇప్పుడు పాక్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఈ లోగా చైనా ఆర్ధికంగా ఎదుగుతుండటంతో దానికి వ్యతిరేకంగా మనలను ప్రయోగించేందుకు చూస్తున్నది. అమెరికాలో ఎవరు అధికారంలో ఉన్నా అమెరికా ప్రయోజనాలకే పెద్ద పీటవేస్తారు. అందువలన తమ అవసరం కోసం బిడెన్‌ కూడా మోడీని మరింతగా కౌగలించుకోవచ్చు, ట్రంప్‌ ఇచ్చిన దేశపిత మాదిరి మరొక అపహాస్యపు బిరుదును ఇవ్వవచ్చు. దాన్ని గమనించకుండా మన అవసరం అమెరికాకు ఉంది, ఇదే మన గొప్ప అని మన భుజాలు మనం చరుచుకుంటే నగుబాట్లు పాలుకావటం తప్ప మరొకటి ఉండదు. ట్రంప్‌కు మద్దతు ప్రకటించినపుడు చూపిన హావభావాలనే రేపు బిడెన్‌తో కౌగిలింతలలో కూడా నరేంద్రమోడీ ఎలా ప్రదర్శిస్తారు ? అప్పుడు అబ్‌కీ బార్‌ ట్రంప్‌ సర్కార్‌ నినాదం గుర్తుకు రాదా? వారు మానవ మాత్రులు కాదా?
ఈసారి ట్రంప్‌ ప్రభుత్వం అని చెప్పారు తప్ప ట్రంప్‌కు ఓటు వేయమని కోరలేదుగా అని బిజెపి నేతలు వాదించవచ్చు. హూస్టన్‌ నగరంలో హౌడీమోడీ కార్యక్రమం తరువాత ట్రంప్‌ చేసిన ట్వీట్‌లు ఏమిటి ? అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్రమోడీ సమ్మతి పొందారు.హూస్టన్‌లో 50వేల మందికి పైగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు, ట్రంప్‌తో చేతులు కలిపి నడిచారు అని ట్రంప్‌ పత్రికా కార్యదర్శి మెకెనీ ట్వీట్‌ చేశారు. తెలివిగా మద్దతు ప్రకటించామని మోడీ మద్దతుదారులు సంతోష పడ్డారు. ట్రంప్‌కు తన సమ్మతి ఉందని భారత అమెరికన్లకు చెప్పిన భారత ప్రధాని అన్న అర్ధం వచ్చే శీర్షికతో బ్లూమ్‌బెర్గ్‌ రాసింది. దానికి ఇద్దరూ కౌగలించుకున్న ఫొటోను సాక్ష్యంగా ప్రచురించింది. హూస్టన్‌లో ఇచ్చిన నినాదం మీద విమర్శలు తలెత్తటంతో అహమ్మదాబాద్‌లో మోడీ నోటి వెంట అబ్‌కీ బార్‌ అనే నినాదం వెలువడలేదు గాని అంతకంటే ఎక్కువ పొగడ్తలతో నింపివేశారు.భారతలో ట్రంప్‌ ఎన్నికల సభమాదిరిగా నిర్వహించారు.ఈ సభ వీడియోలను కూడా ట్రంప్‌ అమెరికన్‌-భారతీయులలో ప్రచారానికి వినియోగించుకున్నారు. అన్నింటికీ మించి హూస్టన్‌ సభకు పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరుకావటాన్ని చూసి ఇంకేముంది అమెరికన్‌-భారతీయుల మీద కూడా మోడీ ప్రభావం ఎలా పడిందో చూడండి అంటూ ఊదరగొట్టారు.
రెండు శిబిరాలుగా చీలిన అమెరికాలో ఒక శాతం ఓట్లు కూడా ఫలితాలను తారు మారు చేస్తాయి. అందువలన తన ఓటమిని ముందుగానే ఊహించిన ట్రంప్‌ భారతీయ ఓటర్లను ఆకట్టుకొనేందుకు నరేంద్రమోడీ పలుకుబడిని ఉపయోగించుకోవాలని చూశాడు కనుకనే పై వ్యవహారాలన్నీ నడిచాయి. ట్రంప్‌ ఎత్తుగడలకు ప్రతిగా భారత-ఆఫ్రికా వారసత్వం కలిగిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష స్ధానానికి నిలిపి డెమోక్రాట్లు దెబ్బతీశారు.ఎన్నికలకు కొద్ది వారాల ముందు జరిపిన ఒక సర్వేలో 72శాతం మంది భారత సంతతి డెమోక్రాట్లకు, 22శాతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు నిర్ణయించుకున్నారని తేలింది. ఎన్నికలు జరిగిన తరువాత వెల్లడైన వార్తలను చూస్తే తటస్ధంగా ఉన్న ఓటర్లు కూడా డెమోక్రాట్ల వైపే మొగ్గినట్లు కనిపిస్తోంది. అమెరికన్‌ భారతీయలలో నరేంద్రమోడీ తన పలుకుబడిని ఎక్కువగా ఊహించుకున్నారన్నది స్పష్టం. అందుకే వ్రతం చెడ్డా ఫలం దక్కలేదు. మెజారిటీ భారతీయులు ట్రంప్‌కు ఓటు వేయలేదు, మొత్తంగా పరాజయం, అంటే నరేంద్రమోడీకి రెండు దెబ్బలు అని చెప్పవచ్చు.
కాశ్మీరు, సిఎఎ, ఎన్‌ఆర్‌సి సమస్యల మీద డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీలు మోడీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. కాశ్మీరీలు ఒంటరిగా లేరు,మేమందరం చూస్తున్నాము, అవసరం అయితే జోక్యం చేసుకోవాలి అని తాజాగా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారిస్‌ గతంలో చెప్పారు.డెమోక్రటిక్‌ పార్టీ ఎంపీ ప్రమీలా జయపాల్‌ గతంలో నరేంద్రమోడీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. గతేడాది డిసెంబరుల్లో ఆమె సభ్యురాలిగా ఉన్న పార్లమెంటరీ బృందం భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆమెను మినహాయించాలని మన విదేశాంగ మంత్రి జై శంకర్‌ కోరగా అమెరికా నిరాకరించింది. దాంతో ఆ బృందంతో జరగాల్సిన సమావేశాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. ఇప్పుడు తిరిగి ఆమె పెద్ద మెజారిటీతో గెలిచారు. అలాంటి ఎంపీలు నరేంద్రమోడీ సర్కార్‌ గురించి ఇప్పుడు మౌనంగా ఉంటారా ? అదే ట్రంప్‌ విషయానికి వస్తే అహమ్మదాబాద్‌ పర్యటన సందర్భంగా విలేకర్ల సమావేశంలో సిఎఎ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు. కాశ్మీరు విషయంలో మధ్యవర్తిత్వం జరుపుతానన్నాడు. నరేంద్రమోడీ విధానాలకు మద్దతు పలికాడు. మన దేశాన్ని బెదిరించటం, కంపు దేశమని నోరు పారవేసుకోవటం గురించి మోడీ మౌనం దాల్చినా దేశ ప్రజలు తీవ్రంగానే స్పందించటాన్ని చూశాము.
బైడెన్‌ గెలుపు మన దేశానికి లాభమా నష్టమా అన్న చర్చ ప్రారంభమైంది. ఒకటి స్పష్టం అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉన్నా అమెరికన్‌ కార్పొరేట్ల ప్రయోజనాలే వారికి ముఖ్యం. మీ ఇంటికొస్తే మాకేం పెడతారు, మా యింటి కొస్తే మాకేం తెస్తారు అన్నట్లుగా ఉంటుంది. డెమోక్రాట్లు అందరికీ ఆరోగ్యం అనే ఎన్నికల వాగ్దానం చేశారు. దాన్ని ఆచరణలో పెడితే మన ఔషధ పరిశ్రమకు మరింత ఉపయోగం అని కొందరు లెక్కలు వేస్తున్నారు. అదే విధంగా హెచ్‌1బి వీసాలు మరిన్ని ఇవ్వొచ్చని కొందరు ఆశపడుతున్నారు. అమెరికా కార్పొరేట్‌ సంస్ధలకు చౌకగా పని చేసే వారు కావాలి. ఎన్నికల్లో ఓట్ల కోసం ట్రంప్‌ స్ధానిక యువతను ఆకట్టుకొనేందుకు విదేశీయులకు వీసాలు బంద్‌ అన్నట్లు హడావుడి చేశారు. నిజంగా అలాంటి ఆంక్షలను అమలు జరిపితే అక్కడి కార్పొరేట్లు సహించవు.
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించిన ట్రంప్‌ రెండు సంవత్సరాలు దాటినా సాధించిందేమీ లేదు. ఒక వేళ బైడెన్‌ దాన్ని కొనసాగించినా ఒరిగేదేమీ లేదు. ట్రంప్‌ ప్రచారం చేసినట్లు బైడెన్‌ కమ్యూనిస్టు కాదు, పక్కా కార్పొరేట్ల ప్రతినిధి. బరాక్‌ ఒబామా హయాంలో కూడా అమెరికా యుద్దాలు చేసిన విషయం మరచి పోకూడదు. అందువలన ట్రంప్‌ మాదిరి దురహంకారం, నోటి దురుసుతనం ఉండకపోవచ్చు తప్ప అమెరికా మౌలిక విధానాల్లో మార్పు వచ్చే అవకాశం లేదు. చైనాతో వైరం కంటే రాజీయే లాభం అనుకుంటే దూకుడు తగ్గించి, కొంత ఆలస్యం చేయవచ్చు తప్ప అమెరికా పెత్తందారీ వైఖరిలో మౌలిక మార్పు ఉండే అవకాశాలు లేవు.

డోనాల్డ్‌ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమి జరగనుంది !

Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ప్రపంచమంతా ఆసక్తితో ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఫలితాల గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. పెద్ద సంఖ్యలో పోస్టల్‌, మెయిల్‌ ఓట్లు పోలు కావటంతో లెక్కింపు పూర్తి కావటం ఆలస్యం కావచ్చు. తాను ఓడిపోతే కోర్టుకు ఎక్కుతానని డోనాల్డ్‌ ట్రంప్‌ బెదిరించిన నేపధ్యంలో ఏమి జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్‌ ఓడిపోతే ట్రంప్‌ మద్దతుదారులు అనేక చోట్ల వీధులకు ఎక్కటానికి సిద్ధం అవుతున్నారు. దానికి ప్రతిగా కార్మికులు కూడా సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావాలని పిలుపులు వెలువడ్డాయి.


చివరి ఎన్నికల సర్వేలను బట్టి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్ధి జోబిడెన్‌కు 52శాతం ఓట్లు, ప్రస్తుత అధ్యక్షుడైన రిపబ్లికన్‌ అభ్యర్ధి డోనాల్డ్‌ ట్రంప్‌కు 43శాతం వస్తాయని వెల్లడైంది. కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట కూడా బిడెన్‌ స్వల్ప మెజారిటీలో ఉన్నట్లు సమాచారం. మొత్తం ఓట్లలో మెజారిటీ బిడెన్‌కు వచ్చినా విజేత నిర్ణయం 538 మంది ఉండే ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ (270) తెచ్చుకున్నవారే పీఠమెక్కుతారు. అయితే గత ఎన్నికలలో మెజారిటీ ఓట్లు హిల్లరీ క్లింటన్‌కు ఎలక్ట్రొరల్‌ కాలేజీలో మెజారిటీ ట్రంప్‌కు వచ్చాయి. ఈ సారి కూడా అదే పునరావృతం అవుతుందన్నది ట్రంప్‌ శిబిరపు ప్రచారం. ఈ విశ్లేషణ పాఠకులకు చేరే సమయానికి పోలింగ్‌ చివరి దశలో ఉంటుంది. వెంటనే ఓట్లు లెక్కింపు ప్రారంభించినా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం లేదు.


ఇది రాసిన సమయానికి ముందస్తుగా వేసిన ఓటర్లు 9.95 కోట్ల మంది ఉన్నారు. పోలింగ్‌ ముగిసిన తరువాత కూడా అందే పోస్టల్‌, మెయిల్‌ ఓట్లను కలుపుకుంటే పది కోట్లు దాట వచ్చని అంచనా.ఇంకా 2.82 కోట్ల మెయిల్‌ బాలట్లు రావాల్సి ఉంది. అందువలన సరికొత్త రికార్డు నమోదు కానుంది. గత ఎన్నికల్లో పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇప్పటికే 73శాతం మంది ఓటు చేశారు. మొత్తం 15 కోట్ల మంది ఓటు హక్కువినియోగించుకోవచ్చని అంచనా. మంగళవారం నాడు వేసిన ఓట్లను తొలుత లెక్కిస్తారు. తరువాత ముందస్తు, పోస్టల్‌ ఓట్లను తీసుకుంటారు. ఇవి పెద్ద సంఖ్యలో ఉన్నందున లెక్కింపు పూర్తి కావటానికి చాలా రోజులు పట్టవచ్చని భావిస్తున్నారు. తొలి ఓట్ల లెక్కింపులో మెజారిటీ వస్తే తాను గెలిచినట్లే అని వెంటనే ప్రకటిస్తానని, పోస్టల్‌ బ్యాలట్లను పరిగణనలోకి తీసుకోనని, లేనట్లయితే ఫలితాలను న్యాయస్ధానంలో సవాలు చేసేందుకు వెంటనే న్యాయవాదులతో సమావేశమౌతానని ట్రంప్‌ ప్రకటించాడు. ఓటర్ల తీర్పును మీరు గౌరవిస్తారా అంటే ముందుగా తాను ఆమాట చెప్పలేనని సెప్టెంబరులోనే ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ఒక పెద్ద కుంభకోణమని, పోస్టల్‌ బ్యాలట్లలో అక్రమాలు జరుగుతాయని పదే పదే చెప్పాడు. ఓడిపోతే వివాదాన్ని రేపాలనే ఆలోచన ట్రంప్‌కు ముందు నుంచి ఉన్నట్లు స్పష్టం. ప్రజాతీర్పును వమ్ము చేసే పక్షంలో సమ్మెకు దిగేందుకు సిద్దంగా ఉండాలని డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన కార్మిక సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. అనేక చోట్ల ట్రంప్‌ మద్దతుదారులు అల్లర్లు,ఘర్షణలకు పాల్పడాలనే యత్నాల్లో కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. అందువలన ఫలితం తేలటం ఒకటైతే దాని పర్యసానాల గురించి యావత్‌ ప్రంచం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్ధితి గతంలో అమెరికాలో తలెత్తినట్లు లేదు.


ఒక వేళ ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోతే ఏమిటన్న ప్రశ్న ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పోలింగ్‌ తేదీన ఓటు వేయటానికి వచ్చేవారికంటే ముందుగానే ఓటు వేసే వారు ఎక్కువగా ఉంటారని ట్రంప్‌ ముందే గ్రహించాడు. కరోనాతో నిమిత్తం లేకుండా గత మూడు ఎన్నికల సర్వేలను చూసినపుడు ముందుస్తుగా ఓట్లు వేసిన వారిలో డెమోక్రాట్లకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ సారి కూడా వారిదే పైచేయి అని వార్తలు వచ్చాయి. అందుకే పోస్టల్‌ ఓట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్‌ చెబుతున్నాడు. పోలింగ్‌ రోజు వేసినవే అసలైన ఓట్లు అంటున్నాడు.అయితే పోలింగ్‌ తరువాత అందిన పోస్టల్‌ ఓట్లను కూడా పరిగణించాలని సుప్రీం కోర్టు చెప్పింది. వీటిని పరిగణలోకి తీసుకోవటాన్ని రిగ్గింగ్‌ అని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.
ట్రంప్‌ గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది. పెన్సిల్వేనియా, జార్జియా, మిషిగాన్‌, విస్కాన్సిన్‌, ఓరేగాన్‌ రాష్ట్రాలలో మితవాద మిలిటెంట్‌, సాయుధ గ్రూప్‌లనుంచి ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. ఆ గ్రూప్‌లు ఇప్పటికే ఆందోళనలు, దాడులు ఎలా చేయాలో, ఎలా పోలీసులను తప్పించుకోవాలో శిక్షణ ఇచ్చాయి. మొత్తం 80 అలాంటి బృందాలను గుర్తించినట్లు నివేదికను తయారు చేసిన సంస్ధలు పేర్కొన్నాయి. వారు ఓటర్లను బెదిరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి శక్తులు అడ్డుకున్న కారణంగానే శుక్రవారం నాడు టెక్సాస్‌ రాష్ట్రంలోని ఆస్టిన్‌ నగరంలో డెమోక్రాట్‌ అభ్యర్ధి జోబిడెన్‌ ప్రచారం రద్దయింది. రిపబ్లికన్ల కంచుకోటగా చెప్పుకొనే ఇక్కడ ట్రంప్‌ స్వల్ప మెజారిటీతో ఉన్నాడని సర్వేలు వెల్లడించటంతో మద్దతుదారులు తెగబడ్డారు. బిడెన్‌ ప్రయాణిస్తున్న బస్‌, ఇతర వాహనాలను సాయుధులైన వ్యక్తులు చుట్టుముట్టారు. మరోవైపు ట్రంప్‌ ప్రచార పతాకాలతో ఉన్న అనేక వాహనాలు కూడా చుట్టుముట్టాయి. పోలీసులు జోక్యంతో బిడెన్‌ ముందుకు సాగాల్సి వచ్చింది. ఈ ఉదంతాల వెనుక ట్రంప్‌ కుమారుడు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న డెమోక్రాట్‌ అభ్యర్ధి కమలా హారిస్‌ ప్రచారం సందర్భంగా ట్రంప్‌ మద్దతుదారులందరూ రావాలని అతగాడు ముందురోజు పిలుపునిచ్చాడు. టెక్సాస్‌ ఇప్పటికీ ట్రంప్‌ కంచుకోట అని రుజువు చేయాలన్నాడు. బిడెన్‌ను అడ్డుకున్న వీడియోను ట్వీట్‌ చేస్తూ ఐ లవ్‌ టెక్సాస్‌ అని ట్రంప్‌ వ్యాఖ్యానించాడు. అంతకు ముందు ఒక ఆస్ట్రేలియన్‌ టీవి బృందాన్ని కూడా ట్రంప్‌ మద్దతుదారులు బెదిరించారు.
ట్రంప్‌ శ్వేతజాతి దురహంకారి మాత్రమే కాదు, మహిళా వ్యతిరేకి కూడా. విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని కెనోషా ఎన్నికల సభలో డెమోక్రటిక్‌ పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్ధి కమలా హారిస్‌ గురించి మాట్లాడుతూ ఈ అద్బుతమైన మహిళ దేశ తొలి మహిళా అధ్యక్షురాలు కావాలని కోరుకొంటోది. అది జరుగుతుందని నేను అనుకోను. అందుకే మీరు అలసి నిద్రపోయే జోబిడెన్‌ కూడా ఓటు వేయవద్దు అని నోరుపారవేసుకున్నాడు.


ప్రతి పార్టీ తన స్వంత ఎన్నికల పరిశీలకులను ఏర్పాటు చేసుకోవటం తెలిసిందే. అయితే పరిశీలకుల పేరుతో ఏర్పాటు చేసే అనధికార శక్తులు ముఖ్యంగా అమెరికాలో మిలిటెంట్స్‌ బృందాలను ట్రంప్‌ పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. వారంతా ఎన్నికలను క్షుణ్ణంగా పరిశీలించాలని కూడా పిలుపునిచ్చాడు. పరోక్షంగా డెమోక్రాట్‌ మద్దతుదార్లను అడ్డుకోమని చెప్పటమే. అలాంటి బృందం ఒకటి మిషిగన్‌ రాష్ట్ర డెమోక్రటిక్‌ పార్టీ గవర్నర్‌ వైట్‌మర్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ప్రయత్నించి అరెస్టయింది. పోలింగ్‌ బూత్‌లలో ఆయుధాలతో ప్రవేశాన్ని నిషేధించటమే దీనికి కారణంగా చెప్పారు. అయితే కోర్టు ఆయుధాలకు అనుమతి ఇచ్చింది.
పోలింగ్‌ కొద్ది సేపట్లో ప్రారంభం కానుండగా సిఎన్‌ఎన్‌ చివరి జోశ్యంలో బిడెన్‌కు 279, ట్రంప్‌కు 163 ఎలక్ట్రోరల్‌ ఓట్లు వస్తాయని పేర్కొన్నది. ఆరు రాష్ట్రాలలోని 96ఎలక్ట్రోరల్‌ ఓట్ల విషయంలో పోటాపోటీగా ఉన్నట్లు పేర్కొన్నది. ఎన్నికలను విశ్లేషించే వెబ్‌సైట్లలో ఒకటైన 538 చెప్పిన జోశ్యంలో బిడెన్‌కు విజయావకాశాలు నూటికి 89శాతం, ట్రంప్‌కు పదిశాతం ఉన్నట్లు పేర్కొన్నది. సెనెట్‌లో డెమోక్రాట్స్‌ మెజారిటీ సాధిస్తారని తెలిపింది. ప్రముఖ పత్రిక ఎకనమిస్ట్‌ అంచనా ప్రకారం బిడెన్‌కు 96శాతం విజయాకాశాలు ఉన్నాయని, 350 ఎలక్ట్రొరల్‌ కాలేజీ ఓట్లు వస్తాయని తెలిపింది.


భారతీయ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు ఝామున(నాలుగవ తేదీ) 5.30కు తూర్పు రాష్ట్రాలైన జార్జియా, ఇండియానా, కెంటకీ, వర్జీనియా, సౌత్‌ కరోలినా, వెర్‌మౌంట్‌లో పోలింగ్‌ ముగుస్తుంది. పశ్చిమ తీరంలోని రాష్ట్రాలలో 9.30కు పూర్తి అవుతుంది.అలాస్కా, అడక్‌ వంటి చివరి చోట్ల తరువాత పూర్తి అవుతుంది. ఆ తరువాతే లెక్కింపు ప్రారంభం అవుతుంది.
మైనే,నెబరస్కాలలో మినహా మిగిలిన రాష్ట్రాలలో మెజారిటీ ఓట్లు తెచ్చుకున్న అభ్యర్ధికి ఆ రాష్ట్రానికి నిర్దేశించిన అన్ని ఎలక్ట్రరల్‌ ఓట్లు వస్తాయి. ఉదాహరణకు కాలిఫోర్నియాకు ఉన్న 55 ఓట్లు అక్కడ మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నవారికే మొత్తం జమ అవుతాయి. 2000 ఎన్నికలలో అల్‌గోర్‌, 2016లో హిల్లరీ క్లింటన్‌ దేశం మొత్తం మీద మెజారిటీ ఓట్లు తెచ్చుకున్నా ఎలక్ట్రరల్‌ ఓట్లు తెచ్చుకోవటంలో విఫలం కావటంతో ఓడిపోయారు.నవంబరు మూడున ఎన్నికలు జరిగిన తరువాత డిసెంబరు 14న ఎలక్ట్రరల్‌ కాలేజీ సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లు వేస్తారు. జనవరి ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్‌ సమావేశమై ఓట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.


తాను ఓడిపోయినట్లయితే అధికార మార్పిడి చేస్తానన్న హామీ ఇవ్వలేనని సెప్టెంబరు నెలలో ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసినదే. ఒక వేళ అదే జరిగితే ఏమిటి అన్న ప్రశ్న తలెత్తింది. ట్రంప్‌ ప్రకటన వివాదాస్పదం కావటంతో అధ్యక్ష భవనం పత్రికా అధికారి ఒక ప్రకటన చేస్తూ స్వేచ్చగా, న్యాయంగా జరిగిన ఎన్నికలను ట్రంప్‌ ఆమోదిస్తారు అని పేర్కొన్నది. డెమోక్రాట్లు మోసంతో మాత్రమే గెలుస్తారని ట్రంప్‌ పదే పదే ఆరోపించటం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఓటమిని తిరస్కరిస్తే, దానికొనసాగింపుగా నూతన అధ్యక్ష పదవీ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తే నిజానికి ఏమీ కాదు. దిగిపోతున్న అధ్యక్షుడు చివరి ఉపన్యాసం చేయటం ఒక సాంప్రదాయం తప్ప నిబంధనేమీ కాదు. అవినీతి జరిగిందని ఆరోపించిన వారు ప్రతి ఒక్క ఓటూ అక్రమంగా పడిందని నిరూపిస్తే అది అప్పుడు ఎన్నికల ఫలితాలు మారతాయి తప్ప ప్రకటనలతో జరిగేదేమీ ఉండదు. అయితే రిపబ్లికన్లు అధికారంలో ఉన్నచోట ఫలితాలను కోర్టుల్లో సవాలు చేయటం తప్ప చేసేదేమీ ఉండదని చెబుతున్నారు. ఒక వేళ ఫలితాన్ని ప్రకటించే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆపని చేయకపోతే వివాదం సుప్రీం కోర్టు ముందుకు వెళుతుంది.అది జరుగుతుందా ? అలాజరిగిన ఉదంతం గతంలో లేదు. అదే జరిగితే గనుక ఆసక్తికరమనే చెప్పాలి.