
ఎం కోటేశ్వరరావు
చైనా ! నూట నలభై కోట్ల జనాభా !! వారికి అవసరమైన తిండి, బట్ట, విద్య, వైద్యం, గూడు కల్పన సామాన్యమైన విషయం కాదు.తిండి కలిగితే కండ కలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్న మహాకవి గురజాడ వాక్కులు సార్వజనీనమైనవి. చైనాలో ప్రపంచ జనాభాలో 22శాతం, సాగుకు లాయకీ అయిన భూమిలో ఏడుశాతమే వుంది. మొత్తం భూమిలో వ్యవసాయానికి పనికి వచ్చేది 10-15శాతం మధ్య వుంది. అదే భారత్‌లో 50, ఫ్రాన్స్‌లో 32, అమెరికాలో 22, సౌదీ అరేబియాలో ఒకశాతం చొప్పున వుంది. ఈ పూర్వరంగంలో అక్కడి జనాభా అవసరాలను తీర్చటానికి ఎంతటి మహాయజ్ఞం చేయాల్సి వుందో వూహించుకోవాల్సిందే.అది ఒకరోజుతో ఆపేది కాదు. నిరంతర ప్రక్రియ. అలాంటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ గత ఏడుదశాబ్దాల విప్లవ కాలంలో అనేక విజయాలను సాధించింది. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను తీర్చటం ఒక ఎత్తయితే, దాన్ని సమకూర్చే రైతాంగ మంచి చెడ్డలను చూసుకోవటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. రైతుకు గిట్టుబాటు కాకుండా, ఇతర రంగాలతో పోల్చితే ఆదాయం తగ్గినా, ప్రభుత్వం సమన్వయం చేయకపోతే వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుంది. భౌగోళికంగా తలెత్తే సహజ సమస్యల నుంచి ఎలా అధిగమించాలనేది ఒక సవాలు.చైనా గురించి మీడియాలో అనేక వక్రీకరణలు వస్తుంటాయి గానీ అక్కడి రైతాంగానికి లేదా మొత్తం వ్యవసాయ రంగానికి మన మాదిరి సంక్షోభ సమస్యలు, రుణ భారం, బలవన్మరణాల వంటివి కానరావు. మార్కెట్లలో ఆకస్మికంగా ధరలు పెరగటం, అదే విధంగా పతనం కావటం వంటి సమస్యలు అసలే లేవు. చైనా దిగుమతులు తగ్గించినా, నిలిపివేసినా ఇతర దేశాల మార్కెట్లు, రైతులు ప్రభావితం కావటం తప్ప చైనా రైతాంగానికి వాటి నుంచి అన్ని రకాల రక్షణలు వున్నాయి. సబ్సిడీలు, ఇతర రక్షణ పధకాలు ఎప్పటికప్పుడు మారుతున్నప్పటికీ అవి మరింత మెరుగుదలకే తోడ్పడతాయి.
రెండు కోట్ల పదిలక్షల మంది రైతుల చిన్న కమతాల సాగు తీరుతెన్నుల గురించి పది సంవత్సరాల అధ్యయనంతో శాస్త్రవేత్తలు సూచించిన మెరుగైన యాజమాన్య పద్దతులను ఆచరించిన రైతులు తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయంతో 12.2 బిలియన్ డాలర్ల మేరకు లబ్ది (ఎరువుల ఖర్చులో తగ్గుదల ద్వారా) పొందారని నేచర్ అనే పత్రిక తాజాగా ఒక విశ్లేషణలో పేర్కొన్నది. 2005-2050 మధ్య ప్రపంచ ఆహార అవసరాలు రెట్టింపు అవుతాయనే అంచనా పూర్వరంగంలో చైనా అధ్యయనం అంతర్జాతీయ శాస్త్రవేత్తలను అబ్బురపరచింది. అధ్యయన అంశాలను ఇతర దేశాలకు వర్తింప చేయవచ్చని ఆశిస్తున్నారు. బ్రిటన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన జనాభా బయాలజిస్ట్ చార్లెస్ గాడ్‌ఫ్రే మాట్లాడుతూ ‘ 140కోట్ల జనాభాకు అవసరమైన ఆహారాన్ని వుత్పత్తి చేయటం ద్వారా వ్యవసాయ అద్బుతాన్ని సాధించింది. అయితే పర్యావణాన్ని ఫణంగా పెట్టారు, భూమి ఆమ్లీకృతమైంది, నీరు కలుషితమై ప్రపంచ తాపం పెరగటానికి దోహదం చేసింది. తాజా అధ్యయనం పెద్ద మొత్తంలో ఆర్ధిక ఫలితాలను రాబట్టటంతో పాటు ఎరువుల వాడకాన్ని తగ్గించటం సాధ్యమే అని సూచించింది.’ అన్నారు. ఏటా ఒక హెక్టారుకు చైనా రైతులు 305కిలోల నత్రజని వాడుతున్నారు. ఇది ప్రపంచ సగటుకు నాలుగు రెట్లు ఎక్కువ. పంటల దిగుబడులు తగ్గకుండా నత్రజని వినియోగాన్ని తగ్గించటం ఎలా అనే దిశగా బీజింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన పధకం 2005 నుంచి 2015వరకు సాగింది.ఈ వ్యవధిలో 13,123 క్షేత్రాలలో మొక్కజన్న, వరి, గోధుమల గురించి దిగుబడులు, పంటల రకాలు, నాటు పద్దతులు, ఎరువులు, నీరు, ఎండతీవ్రత ప్రభావం వంటి అనేక అంశాలను వారు పరిశీలించారు. ఈశాన్య చైనా రైతులు గరిష్టంగా 20శాతం నత్రజని వాడకాన్ని తగ్గించారు. అధ్యయనం, పరిశోధనా కాలంలో సగటున ధాన్య వుత్పత్తి 11శాతం పెరిగింది, 15శాతం నుంచి 18శాతం ఎరువుల వాడకం తగ్గింది. తద్వారా 12లక్షల టన్నుల నత్రజని పొదుపైంది. ఈ పధకంలో పది సంవత్సరాలలో 14వేల కార్యశాలలను నిర్వహించారు. చైనా అంతటి నుంచి 1200పరిశోధకులు, 65వేల మంది ప్రభుత్వ అధికారులు, సాంకేతిక నిపుణులు, లక్షా 40వేల మంది వ్యవసాయ వాణిజ్య సంస్ధల ప్రతినిధులు, 37.7 మిలియన్ హెక్టార్లలో రెండు కోట్ల పదిలక్షల మంది రైతులు వివిధ స్ధాయిలలో భాగస్వాములయ్యారు. ఐదుకోట్ల నలభైలక్షల డాలర్లు ఖర్చయింది.ఈ ప్రయోగం నుంచి మన దేశం కూడా నేర్చుకోవాల్సింది వుంది.ఈ ప్రయోగానికి ముందు గ్రీన్ హౌస్ గ్యాస్ గోధుమల్లో 549 నుంచి 434కు, వరిలో 941 నుంచి 812, మొక్కజన్నలో 422 నుంచి 328కి తగ్గాయని తేలింది.
పరిశోధనా అంశాలను అన్ని ప్రాంతాలకు వర్తింప చేయటంలో సమస్యలు తలెత్తవచ్చు, ఎంచుకున్న విధానాలను అమలు జరిపేందుకు చైనాలో కేంద్రీకృత ప్రభుత్వం వుంది కనుక సాధ్యం అవుతుంది, ఇతర దేశాలలో అలావుండదు అనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఇతర దేశాలు ఇలాంటి ప్రయోగాలు చేయటానికి సవాళ్లు ఆటంకం కారాదని, తమ జనాభా కడుపు నింపటానికి కలుషిత, సరస్సులు, నదులు, సముద్రాలను తయారు చేయాల్సిన అవసరం లేదని చైనా అధ్యయనం నిరూపించిందనే అభిప్రాయం కూడా వెల్లడైంది. వేల యకరాల కమతాలతో భారీ యంత్రాలతో అమెరికాలో వ్యవసాయం జరుగుతోంది. అత్యంత చిన్న కమతాలుతో చైనా తన సాగు పద్దతులను మెరుగుపరచుకుంటోంది. అమెరికాతో పోలిస్తే దిగుబడులలో వెనుకబడిన చైనా మన దేశంతో సహా అనేక దేశాలతో పోల్చితే ఎంతో ముందుందని మరచిపోరాదు. అగ్గిపుల్లా, సబ్బుబిళ్ల, తలుపు గొళ్లెం, హారతి పళ్లెం కాదేదీ కవిత కనర్హం అన్నట్లుగా కొండలు, గుట్టలు, ఫ్యాక్టరీ, రోడ్లపక్క ఖాళీ స్దలాలు, ఇండ్లపై కప్పులు వేటినీ వదల కుండా తమకు అవసరమైన పంటలను అక్కడి జనం సాగు చేస్తున్నారు.1980దశకంలో పెద్ద ఎత్తున రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని ప్రోత్సహించారు. తలెత్తిన దుష్పరిణామాలను గ్రహించి వాటిని అరికట్టేందుకు, దెబ్బతిన్న పర్యావరణాన్ని సరి చేసేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు. చైనాలో భూమి ప్రభుత్వానిదే. రైతులు సాగు చేసుకొనేందుకు 30 సంవత్సరాల వరకు కౌలుకు తీసుకోవచ్చు. తాకట్టు పెట్టటానికి, కొనుగోలు, అమ్మకం చేయటానికి లేదు. భూమి హక్కులను బదలాయించే అవకాశం వుంది. పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవచ్చు. సగటున ఒక్కో కుటుంబం 1.2 ఎకరాలు కౌలుకు తీసుకుంది. దేశ జనాభాలో ఇప్పటికీ 35శాతం మంది వ్యవసాయ మీద ఆధారపడుతున్నారు. పది సంవత్సరాల క్రితం 60శాతం వరకు వున్నారు.

చైనా వ్యవసాయ విజయ గాధ కమ్యూనిస్టు పార్టీ లేదా ప్రభుత్వ నివేదికలలో చెప్పినదానిని కొంత మంది నమ్మకపోవచ్చు. మనీలా టైమ్స్ (ఫిలిప్పీన్స్) ప్రతినిధి జిల్ హెచ్ ఏ శాంటోస్ 2018 మార్చి 18,19 తేదీలలో చైనా వ్యవసాయ విజయం వెనుక నిజాలు అనే శీర్షికతో రాశారు. దానిలో ప్రపంచ వ్యవసాయ సంస్ధ(ఎఫ్‌ఏఓ) విస్తరణ మరియు విద్య అధికారి డాక్టర్ టిటో కాంటాడో మార్చినెల మొదటి వారంలో ఫిలిప్పీన్స్ అధికారి బెన్‌కు పంపిన ఒక మెయిల్‌లో పేర్కొన్న అంశాలను వుటంకించారు. వాటి సారాంశం ఇలా వుంది.
1982 నుంచి 1995 వరకు చైనాలో ఎఫ్‌ఏఓ కార్యక్రమాలు, చైనీయుల నుంచి అనేకం నేర్చుకోవచ్చు.1983లో నాటి చైనా వ్యవసాయ మంత్రి హె కాంగ్ రోమ్‌లోని ఎఫ్‌ఏఓ కార్యాలయానికి వచ్చారు. తమ ఎనభై కోట్ల రైతాంగానికి విస్తరణ సేవలు అందించేందుకు సాయం చేయాలని కోరారు. నాటి ప్రధాని డెంగ్ గ్జియో పింగ్ చైనా ముందుకు పోవటానికి చెప్పిన నాలుగు అంశాల విషయమై కాంగ్ వచ్చారు. అదేమంటే 1. పిల్లి రంగు ఏమిటన్నది కాదు అది ఎలుకలను పడుతుందా లేదా అన్నదే ముఖ్యం.2. బహిరంగ మార్కెట్, చైనీయుల అన్ని జీవన రంగాల నవీకరణ, జవాబుదారీ వ్యవస్ధ. బహిరంగ మార్కెట్ వ్యవస్ధను అభివృద్ధి చేయాలంటే వ్యవసాయం, ఇతర ఆర్ధిక రంగాన్ని నవీకరించాలి. అందువలన వ్యవసాయానికి రైతులు జవాబుదారీగా వుండాలి. మంత్రి కాంగ్ చెప్పినదాని ప్రకారం 80కోట్ల మంది రైతులు సగటున ఒకటిన్నర హెక్టార్ల వ్యక్తిగత కమతాలను పొందుతారు. ఏమి పండించాలో వారే నిర్ణయించుకుంటారు. వ్యవసాయ వుత్పత్తి పెంచటానికి, నిర్దేశిత లక్ష్యాలను చేరుకొనేందుకు, ఆదాయాన్ని మరింతగా పెంచేందుకు వారికి మంచి విస్తరణ సేవలు అవసరం. మంత్రి కోరిన వెంటనే నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని ఎఫ్‌ఎఓ పంపింది. అది చేసిన సిఫార్సులు ఇలా వున్నాయి. కౌంటీ(మన జిల్లాల వంటివి) ప్రాతిపదికన విస్తరణ ప్రాజెక్టులను రూపొందించాలి.(చైనాలో 19 పెద్ద రాష్ట్రాలు వుంటే 2,300 కౌంటీలు వున్నాయి. ఒక్కొక్కదానిలో ఐదు నుంచి పదిలక్షలకు పైబడి జనాభా వున్నారు) కౌంటీ ఆగ్రో టెక్నలాజికల్ ఎక్స్‌టెన్షన్ సెంటర్‌ను(కాటెక్) ప్రతి కౌంటీకి ఏర్పాటు చేయాలి. ఆ కేంద్రం ప్రయోగాలు, శిక్షణ మరియు సమాచార చేరవేత, విస్తరణ, సలహా సేవలను అందించాలి. ప్రయోగాలకు అవసరమైన ప్రయోగశాలలు, సంబంధిత ప్రత్యేక నిపుణులు, వారికి అవసరమైన ప్రయోగ క్షేత్రం, వాటికి వున్నత స్ధాయిలో వున్న వ్యవసాయ పరిశోధనా సంస్ధలతో సంబంధాలుండాలి. కాటెక్‌లో ఐదుగురు అధికారులుండాలి. జిల్లా ప్రభుత్వ ప్రతినిధి, జిల్లా వ్యవసాయ అధికారి, స్ధానిక ప్రభుత్వ కమ్యూనిస్టు పార్టీ ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధి, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రతినిధులుండాలి. అయ్యే ఖర్చులో సగం కౌంటీ, 30శాతం రాష్ట్రం, 20శాతం కేంద్రం భరించాలి. ఎఫ్‌ఏఓ మరియు చైనా ప్రభుత్వ నిధులతో 6.8కోట్ల జనాభా వున్న జయింగ్‌షో, 11కోట్ల జనాభా వున్న సిచువాన్ రాష్ట్రాలలో పైలట్ ప్రాజెక్టులను అమలు జరపాలని ఎఫ్‌ఏఓ బృందం సిఫార్సు చేసింది. ఒకేడాది ఈ పధకాలు అమలు జరిగిన తరువాత పది సంవత్సరాల వ్యవధిలో దేశమంతటా అన్ని రాష్ట్రాలలో ఈ నమూనాను విస్తరించాలని మంత్రి ఆదేశించారు.1995 నాటికి 85శాతం కౌంటీలలో కాటెక్ కేంద్రాలు ఏర్పడ్డాయి. ఇందుకు గాను ప్రపంచబ్యాంకు నుంచి 12కోట్ల డాలర్ల రుణం తీసుకున్నారు. వ్యవసాయ వుత్పత్తి పెరిగింది, వ్యవసాయరంగంలో పనిచేసే వారి శాతం 73 నుంచి 37కు తగ్గింది. 2000 సంవత్సరంలో పదిశాతం వ్యవసాయ కార్మికుల లేదా రైతుల శాతం తగ్గిందని ప్రకటించారు. దీని అర్ధం పదిశాతం మంది రైతులకు పెద్ద కమతాలు అందుబాటులోకి వచ్చాయి, అది యాంత్రీకరణకు, అధిక ఆదాయానికి దోహదం చేసింది. వనరులు తక్కువగా వుండి, ఆసక్తి చూపని జనం వున్న రాష్ట్రాలు, కౌంటీలలో తప్ప వ్యవసాయంపై ఆధారపడిన వారిలో దారిద్య్రం మాయమైంది.
ఒక విషయాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. చైనా పురోగమనానికి ప్రధాని డెంగ్ పేర్కొన్న నాలుగు అంశాలలో అంతర్లీనంగా వున్న పారిశ్రామికీకరణ, నిర్మాణం, వాణిజ్యం, సేవలు, రవాణా తదితర ఆర్ధిక రంగాలు దేశవ్యాపితంగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయంలో అదనంగా వున్న 63శాతం కార్మిక శక్తిని వేగంగా జరిగిన అభివృద్ది ఇముడ్చుకుంది. కాబట్టి చైనా విషయంలో వ్యవసాయ ఆధునీకరణ, రైతులకు అదనపు ఆదాయం మరియు వ్యవసాయ రంగంలో వున్న దారిద్య్రంలో అత్యధిక భాగాన్ని లేకుండా చేయటం దేశవ్యాపిత ఆర్ధిక అభివృద్ధిలో భాగంగా చూడాలి. చైనా నుంచి ఇతర పాఠాలను కూడా నేర్చుకోవాల్సి వుంది.1. వారు ఎంపిక చేసిన జాతీయ, రాష్ట్ర, కౌంటీ స్ధాయి ప్రతినిధులు జవాబుదారీ, గౌరవం కలిగిన వారు మరియు వారి సహచరులు, భాగస్వాములు వారిని అనుసరించారు. చైనా ముందుకు పోవటానికి నాలుగు సూత్రాలను జాతీయ నాయకత్వం ఒకసారి ప్రకటించిన తరువాత అవి చైనా అభివృద్దికి నూతన భావజాలమైంది, దానిని సమాజంలోని అన్ని తరగతులు అనుసరించి మరింత విస్తృత పరిచాయి. నాతో పాటు పని చేసిన అధికారులు, ఇతర జనాలు నిష్కపటంగా వున్నారు. ఇతర దేశాల నుంచి కొత్త అంశాలను, ఆలోచనలను నేర్చుకొనేందుకు ఆతృత పడేవారు, నిజాయితీ, అవసరమైన మేరకు పరిమితం కావటం, పురోభివృద్ధి, బాధ్యతలకు అంకితమైన వారు. వ్యవసాయేతర రంగాలలో ప్రత్యేకించి పారిశ్రామికీకరణలో(వ్యవసాయ యంత్రాల తయారీ సహా) పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టటం అంటే అది వ్యవసాయాభివృద్ధికి పెట్టుబడే. చైనాలో వ్యవసాయ విస్తరణ సేవల ఏర్పాటు సంక్లిష్టమైనది కాదు. ఖర్చు తక్కువ, అమలు జరిపేందుకు, పర్యవేక్షించేందుకు సులభమైనదే. జాతీయ ఆహార భద్రత సాధించేందుకుగాను ప్రభుత్వం నుంచి భూమిని కౌలుకు తీసుకున్న ప్రతి రైతు నిర్ణీత కోటా గోధుమలు,బియ్యాన్ని ప్రభుత్వ సంస్ధ డబ్బు చెల్లించి సేకరిస్తుంది. నిర్ణీత కోటాను అందచేయటంలో ఎవరైనా రైతులు పదే పదే విఫలమైతే సదరు భూమి నుంచి రైతులను మార్చ వచ్చు. అయితే అధికంగా పండించిన మొత్తాన్ని రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకోవచ్చు. రైతులకు అప్పగించిన భూమిలో సగం గోధుమలు, వరి సాగు చేసి కోటా చెల్లించి మిగిలిన సగంలో కూరగాయలు, వాణిజ్య పంటలు సాగు చేసిన రైతాంగాన్ని 1980దశకంలో పురోగామి రైతులుగా గుర్తించారు.’ అని డాక్టర్ టిటో కాంటాడో పేర్కొన్నారు.
కొన్ని దేశాలలో అమెరికా వ్యవసాయశాఖ రూపొందించిన కొన్ని పంటల తాజా దిగుబడుల వివరాలు ఇలా వున్నాయి.( హెక్టారుకు టన్నులలో, పత్తి కిలోలు, 2019 ఫిబ్రవరి అంచనా )
దేశాలు వరి గోధుమ పత్తి చమురు గింజలు మొక్కజన్న
ప్రపంచ సగటు 4.55 3.39 779 2.31 5.81
అమెరికా 8.66 3.20 939 3.21 11.07
ఐరోపా యూనియన్ 6.89 5.39 – 2.64 7.54
చైనా 7.03 5.42 1787 2.49 6.11
భారత్ 3.8 3.32 480 0.97 2.83
గతంలో బ్రిటన్ సామ్రాజ్యవాదులు వలస దేశాలను తమ పరిశ్రమలకు అవసరమైన ముడిసరకు సరఫరా దేశాలుగా పరిమితం చేసేందుకు ప్రయత్నించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత అమెరికా సామ్రాజ్యవాదం లాటిన్ అమెరికాలో అదేపని చేసింది. ఒక్కొక్క దేశంలో ఒక వుత్పత్తి మీద కేంద్రీకరించి ఇతర అవసరాల కోసం తన మీద ఆధారపడే విధంగా చేసుకుంది. వుదాహరణకు క్యూబాలో ఇతర పంటలు పండేందుకు అవకాశం వున్నా కేవలం పంచదారనే ఎక్కువగా ప్రోత్సహించటం, వెనెజులాలో చమురునిల్వల వెలికి తీత తప్ప వ్యవసాయాన్ని, పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయటం, ఇదే విధంగా ఇతర దక్షిణ అమెరికా దేశాలన్నింటా ఏదో ఒక వాణిజ్య పంటల వుత్పత్తికి లేదా గనులకే పరిమితం చేయటంతో అవి అని వార్యంగా ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వచ్చింది. ఆ బలహీనత ఆధారంగా క్యూబా పంచదార ఎగుమతుల మీద ఆంక్షలు పెట్టి అక్కడి సోషలిస్టు వ్యవస్ధను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వెనెజులా చమురు ఆదాయాన్ని మదురో సర్కార్‌కు అందనివ్వకుండా ఆర్దికంగా ఇబ్బందుల పాల్జేసేందుకు పూనుకున్నారు. చైనా జనాభా అవసరాలను కూడా అందుకు వినియోగించుకొనే అవకాశం లేకుండా చైనా తీసుకున్న జాగ్రత్తలలో ఆహార స్వయం సమృద్ధి సాధన ఒకటి. జనాభా అవసరాలన్నింటినీ తీర్చే సోషలిస్టు కార్యక్రమం అమలు జరుపుతున్నందున చైనాలో సంభవించే పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అక్కడ ప్రకృతి వైపరీత్యాల రీత్యా పంటల దిగుబడి, వుత్పత్తి తగ్గితే దిగుమతులు కారణంగా ప్రపంచ మార్కెట్లో వ్యవసాయ వుత్పత్తుల ధరలు పెరుగుతాయి, అదే బాగా పండి దిగుమతి అవసరాలు తగ్గితే ధరలు పడిపోతాయి. పత్తి విషయంలో మన దేశంలో ధరలపై ప్రభావం చూపిన విషయం తెలిసిందే. అందువలన పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణ్యంగా చైనాలో వ్యవసాయం గురించి నిరంతరం అక్కడి ప్రభుత్వం జాగరూకత ప్రదర్శిస్తోంది.2030 నాటికి జనాభా 150కోట్లకు చేరితే ప్రతి ఏటా పదికోట్ల టన్నుల ఆహార ధాన్యాలను అదనంగా వుత్పత్తి చేయాల్సి వుందని అంచనా. చైనాలో బియ్యం ప్రధాన ఆహారం. వరిసాగుకు నీరు అవసరం. ప్రపంచ తలసరి సగటు అందుబాటులో కేవలం నాలుగోవంతు మాత్రమే చైనా నీటి లభ్యత వున్నందున దాన్ని అధిగమించటం నిజంగా పెద్ద సవాలే. చైనాలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా పందిమాంసం, చేపలు, కోడి మాంస వినియోగం వేగంగా పెరుగుతోంది. వాటి వుత్పత్తిని కూడా పెంచాల్సి వుంది. అందుకు అవసరమైన దాణా కూడా ధాన్య అవసరాలు పెరుగుతున్నాయి. ఒక కిలోమాంసం కావాలంటే రెండు, పందిమాంసానికి నాలుగు నాలుగు, గొడ్డు మాంసానికి ఏడు కిలోల ధాన్యం కావాల్సి వుంది. అందువలన అమెరికా ఇతర దేశాల నుంచి సోయా, మొక్కజన్న, జన్నల వంటి వాటి దిగుమతులలో ఎక్కువ భాగం దాణాకే వినియోగిస్తున్నారు.

ఫిబ్రవరి ఆరున ఈ ఏడాది చైనా నూతన సంవత్సరాది వేడుకలు ప్రారంభమయ్యాయి. సూకర(పంది)నామ సంవత్సరంగా పాటిస్తున్నారు.చైనాలో మాంస వినియోగం ఏటేటా పెరుగుతోంది. 2011లో సగటున తలకు 43.8కిలోలుండగా ఈ ఏడాది 53.3కిలోలుగా వుంటుందని అంచనా వేశారు. దీనిలో సగం పంది మాంసం. ప్రపంచ తలసరి ప్రొటీన్ల వినియోగం రోజుకు 46 గ్రాములుండాలని ఆరోగ్య సంస్ధలు సిఫార్సు చేశాయి. ప్రస్తుతం ప్రపంచ సగటు 80గ్రాములుండగా మన దేశంలో 60 వుంది. 1990-2011 మధ్య వినియోగంలో పెద్ద మార్పు లేదు. అదే చైనాలో 75 నుంచి 95కు పెరిగింది. అమెరికా సగటు వినియోగదారుడికి అవసరమైన వాటిని సమకూర్చాలంటే అక్కడ ఒక ఎకరం అందుబాటులో వుంటే అదే చైనాలో 20సెంట్లు మాత్రమే వుంది. అందువలన వ్యవసాయ అభివృద్ధి చైనాకు ఎంత ముఖ్యమో చెప్పనవసరం లేదు. అందుకే పెద్ద ఎత్తున పరిశోధనలు చేస్తున్నారు. వాటిలో ఎలక్ట్రో కల్చర్ పరిశోధనలు ఒక భాగం గోబీ ఎడారి నుంచి పసిఫిక్ సముద్ర తీరం వరకు కూరగాయల సాగును పరిశోధించారు. మొక్కల పెరుగుదలకు విద్యుత్ ఎలా తోడ్పడుతుందనేది ముఖ్యాంశం. కొద్ది వారాల క్రితం విద్యుత్ వినియోగం ద్వారా 20 నుంచి 30శాతం వుత్పాదకత పెరిగితే, 70 నుంచి 100శాతం వరకు పురుగుమందులు, 20శాతం ఎరువుల వినియోగం తగ్గినట్లు తేలిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కూరగాయ మొక్కల మీద పది అడుగుల ఎత్తులో గ్రీన్ హౌస్‌లో రాగితీగల ద్వారా గరిష్టంగా 50వేల ఓల్టుల వరకు విద్యుత్‌ను ప్రసారం చేసి ఫలితాలను పరిశీలించారు. దీని వలన మొక్కలకు, సమీపంలోని మనుషులకు ఎలాంటి హాని జరగలేదు. ఎలక్ట్రోకల్చర్ సాగును క్రమంగా పెంచుతున్నారు. ఈ రంగంలో తాము ఇతర దేశాల కంటే ఒకడుగు ముందున్నామని, తమ సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను అమెరికాతో సహా మరికొన్ని దేశాలకు అందచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మొక్కలపై విద్యుత్ ప్రభావం గురించి ఆలోచన, ప్రయోగాలు కొత్తవి కాదు. చైనా రెండు వందల సంవత్సరాల తరువాత ఈ పరిశోధనల్లోకి దిగిందని చరిత్ర వెల్లడిస్తోంది.1990లో సేంద్రీయ వ్యవసాయ పరి శోధనల్లో భాగంగా చైనా సర్కార్ పరిశోధనలను ప్రోత్సహించింది.2014 నుంచి ఈ పరిశోధనల్లో భాగస్వామి అయిన ఒక ప్రయివేటు కంపెనీ ఎలక్ట్రో కల్చర్ ద్వారా రెండు సంవత్సరాలో పన్నెండు లక్షల యువాన్లను అదనంగా ఆదాయాన్ని పొందినట్లు పేర్కొన్నది. ఒక హెక్టారు గ్రీన్ హౌస్‌కు రోజుకు 15కిలోవాట్ గంటల విద్యుత్ అవసరం. అయితే అవసరమైన యంత్రాల ఏర్పాటుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని, ప్రభుత్వ తోడ్పాటు లేకుండా సాధ్యం కాదని ఆ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నాడు. ప్రతి కుటుంబం ఇంట్లో ఒక గదిలో ఎలక్ట్రో కల్చర్ సాగుచేసే విధంగా ఖర్చు తగ్గించే దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఒకరు చెప్పారు. నిజంగా అదే జయప్రదమైతే మరో వ్యవసాయ విప్లవం వచ్చినట్లే.
Like this:
Like Loading...