Tags
Bhakti, BJP, cast politics, caste discrimination, caste system, Manusmriti, manuvadis, Mohan Bhagwat, Narendra Modi, Narendra Modi Failures, RSS
ఎం కోటేశ్వరరావు
మహాశివరాత్రి సందర్భంగా దేశమంతటా భక్తులు జాగారం, పూజలు చేయటం సాధారణమే. రాజకీయపార్టీల నేతల భక్తి ప్రదర్శనలు చర్చనీయం అవుతున్నాయి. శనివారం నాడు శివరాత్రి సందర్భంగా వివిధ పత్రికలు, టీవీలు వివిధ అంశాలను జనం ముందుకు తెచ్చాయి. వాటిలో ఒక టీవీ సమీక్ష శీర్షిక ” భక్తి పోటీలో రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ , సిఎం యోగి పూజా విధి: రాజకీయాలను ప్రభువు శివుడు ఎలా ప్రభావితం చేస్తున్నాడు ” అని ఉంది.
అయోధ్యలో రామాలయ నిర్మాణం మీద చూపుతున్న శ్రద్ద, వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల ముందు జనం దృష్టికి తెచ్చేందుకు ప్రధాని నరేంద్రమోడీ, ఇతర బిజెపి నేతలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు అన్నది తెలిసిందే. నరేంద్రమోడీ 2022 అక్టోబరులో ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్‌ను సందర్శించారు. ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఇది ఆరవసారి. ఆ సందర్భంగా ” ఆయన (శివుడు) మహాపర్వతాల మీద గడిపినందుకు స్వయంగా ఎంతో సంతోషించారు. నిరంతరం ఆయనను గొప్ప మునులు పూజించారు. నేను ప్రభువు శివుడిని మాత్రమే ఆరాధిస్తాను. కేదార ప్రభువు చుట్టూ ఎందరో దేవతలు,రాక్షసులు, యక్షులు, మహాసర్పాలు, ఇతరులు ఉన్నారు.” అని మోడీ చెప్పారు. కొండల్లో నివసించే జనాల సాంప్రదాయ ధవళ దుస్తులపై స్వస్తిక్ గుర్తును ఎంబ్రాయిడరీ చేసిన దానిని ధరించి కేదారనాధ్ గుడిలో పూజలు చేశారు.నవంబరు నెలలో కాశీ తమిళ సంగం సమావేశాలను ప్రారంభించిన ప్రధాని మాట్లాడుతూ ” కాశీలో బాబా విశ్వనాధ్ ఉంటే తమిళనాడులో రామేశ్వరంలో ప్రభు దీవెనలు ఉన్నాయి. కాశీ, తమిళనాడు రెండూ శివమయం, శక్తిమయం ” అన్నారు. (న్యూస్ 18, ఫిబ్రవరి 18, 2022)
ప్రభుత్వాలు హాజ్ యాత్రకు సహకరించటాన్ని, సబ్సిడీలు ఇవ్వటం గురించి గతంలో బిజెపి పెద్ద వివాదాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అసోంలోని బిజెపి ప్రభుత్వం శివరాత్రి సందర్భంగా జారీ చేసిన ఒక ప్రకటనలో భక్తులు,యాత్రీకులు కామరూప్ జిల్లాలోని డాకిని కొండ మీద ఉన్న భీమేశ్వర దేవాలయాన్ని సందర్శించాలని కోరింది. ప్రభుత్వం ప్రతి మతానికి చెందిన పండుగల సందర్భంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటే అదొకదారి, కానీ హిందూ పండగలకే ఇవ్వటం వివాదాస్పదమైంది.దీనిలో మరొక మలుపు ఏమంటే భీమేశ్వర దేవాలయం పూనా జిల్లాలో ఉంది. దాన్ని పన్నెండింటిలో ఆరవ జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. కానీ ఈ దేవాలయం అసోంలో ఉన్నట్లు అక్కడి టూరిజం శాఖ పేర్కొన్నది. బిజెపి నేతలు దేన్నీ మహారాష్ట్రలో ఉంచకూడదని నిర్ణయించారా అని ఎన్‌సిపి నాయకురాలు సుప్రియ సూలే ప్రశ్నించారు. పరిశ్రమలు, ఉపాధిలో మహారాష్ట్ర వాటాను అపహరించారు, ఇప్పుడు సాంస్కృతిక,భక్తిపరమైన వారసత్వాన్ని కూడా హరిస్తారా అని ఆమె ప్రశ్నించారు.
పగటి వేషగాళ్లు లేదా తుపాకీ రాముళ్లు ఏ ఊరు వెళితే ఆ ఊరి గొప్పతనం గురించి పొగడి లబ్ది పొందేందుకు చూస్తారు. అది పొట్టకూటి కోసం, మరి అదే పని రాజకీయ నేతలు చేస్తే….ఓట్ల కోసమని వేరేచెప్పాలా ? శనివారం నాడు సిఎం యోగి ఆదిత్యనాధ్ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్నాధ్ ఆలయంలో శివరాత్రి పూజలు చేశారు. తమిళ కాశీ సంగం సమావేశాల్లో గతేడాది నవంబరులో మాట్లాడుతూ తమిళ భాష ఎంతో పురాతనమైనది, ఘనమైన సాహిత్యాన్ని కలిగి ఉంది అంటూనే రెండు భాషలూ శివుడి నోటి నుంచి వచ్చినవే అని చెప్పారు. దాన్ని అంగీకరించటానికి ఇబ్బంది లేదు. కానీ మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీ, తెలుగు, బెంగాలీ ఇతర భాషలెందుకు శివుడి నుంచి రాలేదన్నదే ప్రశ్న. శివుడికి ఎన్ని భాషలు వచ్చు అని గూగుల్‌ను అడిగితే ఏవేవో చెబుతోంది తప్ప సూటిగా ఇన్ని వచ్చు అని చెప్పటం లేదు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గుళ్లు గోపురాలు, సాధు సంతుల చుట్టూ తిరిగిన సంగతి తెలిసిందే. తమ నేత ఒక శివభక్తుడని రాజస్తాన్ సిఎం అశోక్ గెహ్లాట్ గతంలో చెప్పారు.రాజసమంద్ జిల్లాలోని నాధ్‌ద్వారా పట్టణంలో గతేడాది ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల శివుడి విగ్రహాన్ని విశ్వస్వరూపం పేరుతో ఆవిష్కరించిన సందర్భంగా చెప్పారు.ఈ ఏడాది శివరాత్రి సందర్భంగా రాహుల్ గాంధీ ఏ క్షేత్రాన్ని సందర్శించారో తెలీదు గాని శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన చేశారు.
చిత్రం ఏమిటంటే శివ శబ్దం చెవుల్లో పడటాన్నే సహించని త్రిదండి చిన జియ్యర్ స్వామి శివాలయాలను సందర్శించరని తెలిసిందే. ముచ్చింతల్ ఆశ్రమంలో 2022లో ఏర్పాటు చేసిన సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాన్ని శివుడిని మాత్రమే ఆరాధిస్తానని చెప్పిన నరేంద్రమోడీ చేత ఆవిష్కరింప చేయించారు. రామానుజాచార్యుల అంతటి సుగుణవంతుడని మోడీని పొగిడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒక శివభక్తుడితో ఆవిష్కరింప చేయించినందుకు తరువాత శుద్ది చేయించారేమో తెలీదు. అపవిత్రం అనుకున్నపుడు అలాంటివి బహిరంగంగానే చేస్తున్నారు. మోడీ, అందునా ప్రధాని గనుక చీకటి మాటున జరిపి ఉండవచ్చన్నది అనుమానం. ఇలాంటి స్వామీజీలు-నరేంద్రమోడీ ఒక దగ్గరకు ఎందుకు వస్తున్నారంటే ఎన్నికల ప్రయోజనం. అంతకు ముందు తెలంగాణా సిఎం కెసిఆర్‌కు చిన జియ్యర్ స్వామి ఎంతో దగ్గరగా ఉండేవారు. తరువాత ఆ బంధం తెగింది అనేకంటే బిజెపి తెంచింది అన్నది పరిశీలకుల భావన.మన దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు మతాన్ని, దేవుళ్లను వీధుల్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకు అన్నది కొంత మందికి ఒక చిక్కు ప్రశ్న. పూ విశ్లేషణ వివరాలు కొంత మేరకు సమాధానమిస్తాయి.
2021లో అమెరికా చెందిన ” పూ ” విశ్లేషణా సంస్థ మన దేశంలో ఒక సర్వే నిర్వహించింది. దానిలో వెల్లడైన కొన్ని అంశాలను చూస్తే ఎందుకు దేవుళ్ల కోసం రాజకీయ పార్టీలు వెంపర్లాడుతున్నదీ అర్ధం అవుతుంది. 2019 నవంబరు 17 నుంచి 2020 మార్చి 23వ తేదీ వరకు మన దేశంలో 29,999 మందిని సర్వే చేసింది. వారిలో 22,975 హిందువులు, 3,330 ముస్లింలు,1,782 సిక్కులు,1,011 క్రైస్తవులు, 719 బౌద్దులు, 109 జైనులు,67 మంది ఏమతం లేని వారు ఉన్నారు. 2019 ఎన్నికలు జరిగిన తరువాత, జమ్మూకాశ్మీర్ రాష్ట్రం, ఆర్టికల్ 370 రద్దు తరువాత జరిపిన సర్వే ఇది. విశ్లేషణలో కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. వీటిని పరమ ప్రమాణంగా తీసుకోవాలని చెప్పటం లేదు గానీ దేశంలో నెలకొన్న ధోరణులకు ఒక సూచికగా తీసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో పార్టీల వారీగా హిందువులు బిజెపికి 49శాతం, కాంగ్రెస్‌కు 13శాతం వేశారు. ముస్లింలలో కాంగ్రెస్‌కు 30, బిజెపికి 19శాతం, క్రైస్తవుల్లో కాంగ్రెస్‌కు 30, బిజెపికి పదిశాతం, సిక్కుల్లో కాంగ్రెస్‌కు 33, బిజెపికి 19, బౌద్దుల్లో బిజెపికి 29, కాంగ్రెస్‌కు 24శాతం మంది వేశారు. ఈ ధోరణి 2014 నుంచి ఉన్నదని చెప్పవచ్చు. అందువల్లనే ఎవరి ఓటు బాంకును వారు కాపాడుకొనేందుకు చూడటంతో పాటు హిందువుల ఓట్లకోసం కాంగ్రెస్ నేతలు, మైనారిటీల ఓట్లకోసం బిజెపి నేతలు వెంపర్లాడటం లేదా సంతుష్టీకరణకు పూనుకున్నారని చెప్పవచ్చు.
దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గుతున్నదని ఈ సర్వే అంకెలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రజాస్వామ్య నాయకత్వం కావాలని 46శాతం మంది చెప్పగా దానికి విరుద్దమైన బలమైన నేత కావాలని చెప్పిన వారు 48శాతం మంది ఉన్నారు. హిందువుల్లో మొదటిదానికి 45 శాతం మద్దతు పలకగా రెండవ దానికి 50శాతం మంది ఉన్నారు.మిగతా మతాల వారిలో ప్రజాస్వామిక వ్యవస్థ కావాలని కోరిన వారి శాతం 49 నుంచి 57శాతం వరకు ఉండగా బలమైన నేత కావాలని చెప్పిన వారు 37 నుంచి 47శాతం వరకు ఉన్నారు.బలమైన నేత కావాలని స్త్రీలు 48, పురుషులు 49శాతం మంది కోరుకోగా ప్రజాస్వామ్యం కావాలని చెప్పిన వారు 44, 47శాతాల చొప్పున ఉన్నారు. ఈ కారణంగానే గట్టి నిర్ణయాలు తీసుకోవటం నరేంద్రమోడీ వల్లనే జరుగుతుందని బిజెపి వ్యూహకర్తలు అలాంటి ప్రచారాన్ని ముందుకు తెచ్చినట్లు స్పష్టం అవుతోంది. సంస్కరణలను వేగంగా అమలు జరపటం గురించి తగ్గేదే లేదని, అదానీ కంపెనీల గురించి విచారణకు అంగీకరించేది లేదన్న వైఖరి, రాష్ట్రాలకు చెందిన సాగు రంగంపై వాటితో సంప్రదించకుండా మూడు చట్టాలను రుద్దేందుకు పూనుకోవటం. ఆర్టికల్ 370ని కాశ్మీర్ అసెంబ్లీతో చర్చించకుండా రద్దు వంటి వాటిని ” గట్టి నాయకుడి ”లో చూడవచ్చు. చరిత్రలో జర్మన్లు హిట్లర్‌లో గట్టి నేతను చూశారు.
తెలంగాణాలో బిజెపి నేతలు హైదరాబాద్‌లోని వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం(చార్మినార్ వద్ద ఒక మినార్ పక్కనే తెచ్చిపెట్టిన విగ్రహం) నుంచే దాదాపు ప్రతి కార్యకమాన్ని ప్రారంభిస్తారు, కర్ణాటకలో ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టటం తెలిసిందే. కేరళలో ముస్లిం, క్రైస్తవ విద్వేషం ఇలా దక్షిణాది రాష్ట్రాలలో మత ప్రాతిపదికన ఓటు బాంకు ఏర్పాటు చేసుకొనేందుకు బిజెపి ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నది. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఇప్పటికే రెచ్చగొట్టిన దానిని కొనసాగించేందుకు నిరంతరం కొత్త అంశాలను ముందుకు తెస్తున్నది. ఎందుకు అన్నది పూ సర్వే వివరాలను చూస్తే తెలుస్తుంది.ముందే చెప్పుకున్నట్లుగా 2019లో మొత్తంగా హిందువులలో బిజెపికి ఓటు వేసింది 49శాతమే. వాటిని దేశ జనాభాలో 80శాతం వరకు ఉన్నారు గనుక ఆ మేరకు ఓటు బాంకు ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నది. ప్రాంతాల వారీ చూస్తే ఉత్తరాదిన 68శాతం, మధ్యభారత్‌లో 65, పశ్చిమాన 56, తూర్పున 46, దక్షిణాదిన 19శాతం మాత్రమే. ఈ కారణంగానే దక్షిణాది మీద బిజెపి ఎంతగానో కేంద్రీకరిస్తున్నది. నిజమైన భారతీయుడు అంటే హిందూ అన్నట్లుగా హిందూ అంటే హిందీ, హిందీ మాట్లాడేవారంటే హిందువులే అన్న భావనను రేకెత్తించేందుకు కూడా చూస్తున్నారు.దానిలో భాగంగానే దేశం మొత్తం మీద హిందీని బలవంతంగా రుద్దాలన్న యత్నం. పూ సర్వే ప్రకారం నిజమైన భారతీయుడు హిందువుగా ఉండాలని భావిస్తున్నవారు 55శాతం, హిందీ మాట్లాడాలని చెప్పిన వారు 59, హిందూగా ఉండటం హిందీ మాట్లాడటం అనేవారు 60శాతం ఉన్నారు.
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రం తరువాత జనం మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల, నేతల జోక్యాన్ని సమర్ధించేవారు అన్ని మతాల్లో మూడింట రెండువంతుల మంది ఉండటం ఆందోళన కలిగించే అంశం.దీన్ని అవకాశంగా తీసుకొని కొన్ని శక్తులు నిస్సిగ్గుగా మతాన్ని-రాజకీయాన్ని మిళితం చేస్తున్నాయి. మత పెద్దలమని చెప్పుకొనే వారు రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. పూ సర్వే ప్రకారం మొత్తంగా చూసినపుడు 62శాతం మంది మత వ్యవహారాల్లో రాజకీయపార్టీల ప్రమేయాన్ని సమర్ధించారు.హిందూమతంలో సమర్ధించిన వారు 64శాతం కాగా వద్దన్న వారు 29శాతం ఉన్నారు. సమర్ధించిన వారు ఇతర మతాల్లో 59 నుంచి 42శాతం వరకు ఉన్నారు. రాజకీయపార్టీల ప్రమేయం ఉండకూడదని చెప్పిన వారు ఇతర మతాల్లో 35 నుంచి 52శాతం వరకు ఉన్నారు. ఈ కారణంగానే హిందూత్వశక్తులు తమ అజెండాను అమలు చేస్తున్నాయి. ముస్లింలలో రాజకీయపార్టీల ప్రమేయం ఉండాలన్న వారు 59శాతం వద్దన్నవారు 35శాతం. అంటే మెజారిటీ మైనారిటీ మతాల్లో మతాన్ని ఎంతగా ఎక్కించిందీ అర్ధం చేసుకోవచ్చు.మెజారిటీ మతతత్వం ఎంత ప్రమాదకరమో మైనారిటీ మతతత్వం కూడా అంతే ప్రమాదకరం. నిరుద్యోగం ప్రధాన సమస్య అని భావిస్తున్నవారు అందరిలో 84శాతం మంది ఉండగా అవినీతి అని 76, మహిళలమీద నేరాలని 75, మతహింస అని 65శాతం మంది భావించారు.హిందూ-ముస్లిం మతాలకు చెందిన వారు ఈ అంశాల గురించి దాదాపు ఒకే విధంగా స్పందించటం విశేషం.
ఇక ఏ దేవుడు, దేవత పలుకుబడి లేదా ప్రభావం ఎక్కువగా ఉందో కూడా పూ విశ్లేషణలో ఆసక్తికర అంశాలున్నాయి.శివుడు 44శాతంతో ఆలిండియా దేవుడిగా అగ్రస్థానంలో ఉండగా హనుమాన్ 35, గణేష్ 32,లక్ష్మి 28, కృష్ణ 21, కాళి 20, రాముడు 17,విష్ణు 10, సరస్వతి 8, ఇతరులు 22శాతంతో ఉన్నారు. చిత్రం ఏమిటంటే శ్రీరాముడి గురించి సంఘపరివార్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పటికీ మిగతా దేవుళ్లతో పోలిస్తే ఎక్కడా పెద్దగా ప్రభావం చూపటం లేదని పూ చెబుతోంది. మధ్య భారత్‌లో మాత్రమే పైన పేర్కొన్న తొమ్మిది మంది జాబితాలో రాముడు గరిష్టంగా 27శాతంతో ఐదవ స్థానంలో ఉన్నాడు. ఉత్తరాదిన 20,తూర్పున 15, దక్షిణాదిన 13,పశ్చిమాన 12, ఈశాన్యంలో ఐదుశాతం మంది అనుచరులతో ఉన్నాడు. ఉత్తరాదిన 43శాతంతో హనుమాన్ తరువాత 41శాతంతో శివుడు, గణేష్ ఉన్నారు.ఈశాన్యంలో కృష్ణుడు 46శాతం, తూర్పున 34శాతంతో కాళి, 32శాతంతో లక్ష్మి,పశ్చిమాన 46శాతంతో గణేష్ అగ్రస్థానంలో ఉన్నారు.దేశంలోని మిగతా ప్రాంతాల వారితో పోలిస్తే దక్షిణాదిన ప్రాంతీయ దేవతలు గణనీయంగా ప్రభావం కలిగి ఉన్నారు. మురుగన్ 14, అయ్యప్ప 13, మీనాక్షి ఏడు శాతం మందిని కలిగి ఉన్నారు.శివుడు 39శాతంతో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆర్ఎస్ఎస్ అనుకున్నట్లుగా లోకం నడవదు. రామచరిత మానస్‌లో వెనుకబడిన తరగతుల వారిని కించపరిచినట్లు వచ్చిన వివాదం తరువాత ఆ సామాజిక తరగతులను సంతుష్టీకరించేందుకు ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్ రంగంలోకి దిగారన్నది ఒక అభిప్రాయం. హిందూత్వ శక్తులు, వారిని అనుసరించేవారిలో ఒక వైరుధ్యం ఉంది. తాము చెప్పే హిందూత్వ సనాతనమైనదని దానిలో కులాలు లేవని జనాన్ని నమ్మించేందుకు బిజెపి చూస్తున్నది. గతేడాది అక్టోబరు ఎనిమిదవ తేదీన నాగపూర్‌లో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ వర్ణ, కుల వ్యవస్థలను హిందూయిజం నుంచి తొలగించాలని, అది పాపమని కూడా మోహన్ భగవత్‌చెప్పారు. ఆ సభ గురించి లోక్‌సత్తా పత్రిక రాసిన వార్తలో ఆర్ఎస్ఎస్ అధిపతి బ్రాహ్మల గురించి ప్రస్తావించినట్లు రాశారని ఆ పత్రిక సంపాదకుడు, నాగపూర్ విలేకరి మీద సంఘపరివార్‌కు చెందిన వారు కేసులు దాఖలు చేశారు. ఒక కులం గురించి భగవత్ ప్రస్తావించని మాట నిజమే అయినా కులవ్యవస్థను సృష్టించింది ఎవరు ? లేక దానికి అదే పుట్టిందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.వర్ణ వ్యవస్థ సృష్టి బ్రాహ్మణవాదులపనే అనే అభిప్రాయం బలంగా ఉండటంతో సదరు విలేకరి బ్రాహ్మణుల పేరు ప్రస్తావించి ఉండవచ్చు.
చిత్రం ఏమిటంటే అదే మోహన్ భగవత్ ఈ ఏడాది ఒక దగ్గర మాట్లాడుతూ కులాలను సృష్టించింది పండితులే అని సెలవిచ్చారు. వెనుకబడిన తరగతులు, దళితులు, మహిళలను కించపరుస్తూ తులసీదాస్ రామచరిత మానస్‌లో రాశారన్న విమర్శలను సమాజవాదీ, ఆర్జెడి నేతలు ముందుకు తెచ్చిన పూర్వరంగంలో భగవత్ ఈ మాటలు చెప్పారని అనుకోవచ్చు. ఈ దేశంలో పండితులు అంటే బ్రాహ్మలే కదా ! దాని మీద ఆర్ఎస్ఎస్లోని బ్రాహ్మలు, వెలుపల ఉన్న వారిలో కూడా గగ్గోలు తలెత్తటంతో నష్టనివారణగా ఒక వివరణ ఇచ్చారు. అదే మంటే పండిట్ అంటే ఆంగ్లంలో బ్రాహ్మలు కాదు, ఆంగ్లం, మరాఠీలో మేథావులు అని అర్ధం ఉంది కనుక ఆ భావంతో అన్నారు అని పేర్కొన్నారు. ఇక్కడ సమస్య మేథావులు అంటే ఎవరు. బ్రాహ్మలు కాని మేథావులను పండిట్ అని ఎందుకు పిలవటం లేదు ? కాశ్మీరీ బ్రాహ్మలకు ఉన్న మరోనామ వాచకమే కాశ్మీరీ పండిట్లు కదా ! కులవ్యవస్థ ఉనికిలోకి వచ్చిన నాటి నుంచి బ్రాహ్మణులు తప్ప వేదాలు చదివిన వారు ఇతర కులాల్లో ఎవరూ లేరు. వేదాల్లో ఉన్నదే చెబుతున్నారా అసలు వాటిలో ఉన్నదేమిటి అని తెలుసుకొనే ఆసక్తి కలిగిన వేళ్ల మీద లెక్కించగలిగిన వారు తప్ప వేదాలను చదివే ఇతర కులస్థులు ఎంతు మంది ఉన్నారు ? ఇటీవలి వరకు అసలు ఇతరులను చదవనివ్వలేదు. నిన్న మొన్నటి వరకు శూద్రులు, అంటరాని వారిగా ముద్రవేసిన వారికి కనీస చదువు సంధ్యలు కూడా లేవు కదా. అలాంటపుడు ఇతర కులాల్లోని ఏ పండితులు తమను తాము కించపరుచుకొనే విధంగా నిచ్చెన మెట్ల అంతరాలతో కులాలను సృష్టించినట్లు? చదువుకున్నది బ్రాహ్మల తరువాత క్షత్రియులు, వైశ్యులు మాత్రమే. అంటే ఈ కులాలకు చెందిన మేథావులు అనుకుంటే అందులో బ్రాహ్మల వాటా ఎంత ? ఇతరుల వాటా ఎంతో ఆర్ఎస్ఎస్ నిపుణులు వేదగణితంతో గుణించి చెప్పాలి.
కుల వ్యవస్థ పోవాలని ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్ చెప్పటం, మారుమనస్సు పుచ్చుకోవటం మంచిదే. అందుకోసం వారు చేసిందేమిటి ?మాటలకే పరిమితం, చిత్తశుద్ది ఎక్కడా కనిపించదు. గమనించాల్సిందేమంటే కులాల సృష్టి పండితులదే అని చెప్పటంతో హిందూ, బ్రాహ్మణ వ్యతిరేకం అంటూ హిందూత్వ అనుకూలురు మోహన్ భగవత్ మీద మండిపడుతున్నారు. పండితుల గురించి ఇచ్చిన వివరణను ఏ పండితులూ జీర్ణించుకోవటం లేదు. మరోవైపు పండితులుగా ముద్రవేసుకున్న వారు, ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు కులవ్యవస్థను సమర్ధించే మనుస్మృతి పుస్తకాలను అచ్చువేయించి ప్రచారం చేస్తున్నారు. పూరీ శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి భగవత్ మాటలపై స్పందిస్తూ కులవ్యవస్థను సమర్ధిస్తూ మాట్లాడారు.” తొలి బ్రాహ్మడి పేరు బ్రహ్మ. మీరు వేదాలను చదవాలి.ప్రపంచంలోని సైన్సు, ఆర్ట్స్‌ను బ్రహ్మ ఒక్కడే వివరించాడు. మనం సనాతన వ్యవస్థను ఆమోదించకపోతే దాని స్థానంలో ఏ వ్యవస్థ ఉండాలి ” అని ప్రశ్నించారు. శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మాట్లాడుతూ ” కుల వ్యవస్థను దేవుడు సృష్టించలేదని, వాటిని పండితులు సృష్టించి ఉండవచ్చని భగవత్ చెబుతున్నారు. తరువాత పండితులంటే మేథావులు తప్ప బ్రాహ్మలు కాదని వివరించారు.మేథావులు కొన్ని విషయాలను చెబితే మీ రెందుకు తిరస్కరిస్తున్నారు ” అని ప్రశ్నించారు. భగవత్ జాతి వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని ఇటీవల ప్రముఖంగా వార్తలకు ఎక్కిన నరసింగానంద ధ్వజమెత్తారు.
దక్షిణాదిలో మనువాదం, దానికి ప్రతినిధులుగా ఉన్న బ్రాహ్మణుల మీద ధ్వజమెత్తుతూ పెద్ద ఉద్యమం మాదిరి నడిచింది. బ్రాహ్మణులకు ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల కమ్మ బ్రాహ్మణులు వివాహతంతు వాటిని నిర్వహించిన రోజులు ఉన్నాయి. ఇటీవలి కాలంలో బ్రాహ్మణులు కాకున్నప్పటికీ బ్రాహ్మణవాదాన్ని తలకు ఎక్కించుకున్న అనేక మంది వర్ణ వ్యవస్థకు, హిందూత్వకు ముప్పు వచ్చిందంటూ వీధుల్లోకి వస్తున్నారు. ఇప్పటికీ తంతుల పేరుతో బ్రాహ్మణులు జనాన్ని దోచుకుతింటున్నారని, పరాన్న భుక్కులుగా ఉన్నారంటూ వ్యతిరేకతను వెల్లడించటాన్ని చూడవచ్చు. ఉత్తరాదిలో బిజెపి మద్దతుదార్లుగా ఉన్న అనేక మంది దళితులు,వెనుకబడిన తరగతుల వారు తమ పట్ల వివక్షను ప్రదర్శించే మనుస్మృతి, పురాణాల గురించి ప్రశ్నిస్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు అన్నది తెలిసిందే. అందుకే ఓటు బాంకుగా ఉన్న బలహీనవర్గాలు లేవనెత్తే సామాజిక వివక్ష, కించపరచటాన్ని ప్రశ్నిస్తున్న కారణంగా అసలైన హిందూత్వ అంటే కులాలు లేనిది అనే పల్లవిని ఆర్ఎస్ఎస్ అందుకుంది. ఇప్పటి వరకు ప్రధాన మద్దతుదార్లుగా ఉన్న బ్రాహ్మలు, బ్రాహ్మణవాదులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఒక విమర్శ చేసి దళిత, బహుజనులను , అబ్బే నా అర్ధం అది కాదు అంటూ బ్రాహ్మలను ఇతర అగ్రకులాలు అనుకొనే వారిని సంతుష్టీకరించేందుకు ఆర్ఎస్ఎస్ అధిపతి సాము గరిడీ చేస్తున్నారు.ఉత్తరాదిన బహుజనుల్లో ప్రారంభమైన ఈ ప్రశ్నించే, వివక్షను ఖండించేతత్వం మరింత పెరగటం అనివార్యం. అది హిందూత్వ అజెండాను, మనుకాలం నాటికి దేశాన్ని తీసుకుపోవాలనటాన్ని కూడా అంతిమంగా ప్రశ్నించకమానదు !