
ఎం కోటేశ్వరరావు
నవంబరు ఆరవ తేదీన అమెరికా పార్లమెంట్‌కు జరిగిన మధ్యంతర ఎన్నికల ఫలితాలు సెనెట్ విషయంలో తప్ప ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్) విషయంలో సర్వేల విశ్లేషణకు దగ్గరగానే వచ్చాయి. ఎగువ సభ సెనెట్‌లో ఎలాగైనా సరే మెజారిటీ సాధించాలనే పట్టుదలతో కేంద్రీకరించిన అధ్యక్షుడు డ్రోనాల్డ్ ట్రంప్‌కు సభలోని వందకు గాను చావుదప్పి కన్నులట్టపోయి రిపబ్లికన్ పార్టీకి 51వచ్చాయి. డెమోక్రాట్లకు 44, స్వతంత్రులకు రెండు రాగా తిరిగి ఓట్ల లెక్కింపు జరుగుతున్న మరో మూడు స్ధానాల ఫలితాలను ఖరారు చేయాల్సి వుంది. ప్రజాప్రతినిధుల సభలో ట్రంప్ బక్కబోర్లా పడ్డారు, డెమోక్రటిక్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ట్రంప్ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా భావించబడిన ఈ ఎన్నికలలో దిగువ సభలోని మొత్తం 435 స్ధానాలకు గాను ఆ పార్టీకి 227, రిపబ్లికన్లకు 198 రాగా మరో పదింటి ఫలితాలను ప్రకటించాల్సి వుంది. ఈ ఫలితాలతో అమెరికాలో విప్లవాత్మక మార్పులేవో జరుగుతాయని కాదు గానీ డెమోక్రటిక్ పార్టీలో అంతర్గతంగా ప్రారంభమైన మధనానికి ఎంతో ప్రాధాన్యత వుంది. ఫలితం, పర్యవసానాల గురించి వామపక్ష,పురోగామి శక్తులు తరువాతేంటి అనే ఆలోచన చేస్తున్నాయి. రెండు సంవత్సరాల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే అనేక తరగతుల వారు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తమ సమస్యలపై వీధుల్లోకి వచ్చారు. అధికార పార్టీ అక్రమాలు, ప్రలోభాలను తట్టుకొని వుద్యమించిన వారి ఆకాంక్షలకు ప్రతిబింబంగా తాజా ఫలితాలు వచ్చాయని చెప్పవచ్చు.ఈ ఎన్నికల్లో కార్మికులు, మహిళలు, ఆఫ్రికన్ అమెరికన్లు, లాటినోలు, గిరిజనులు మొత్తంగా డెమోక్రాట్లు విజయం సాధించారు. అన్నీ తానై వ్యవహరించినందున రిపబ్లికన్ల ఓటమి అంటే అది వాస్తవానికి డోనాల్డ్ ట్రంప్‌కే వర్తిస్తుందని చెప్పవచ్చు. మన పదజాలంలో చెప్పాలంటే అమెరికాలోని సకల అణగారిన తరగతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఓట్లు వేసి ట్రంప్‌కు చుక్కలు చూపించారు. గమనించాల్సిన ముఖ్యఅంశాలు ఇలా వున్నాయి.
అనేక దశాబ్దాల చరిత్ర చరిత్రలో తొలిసారిగా డెమోక్రటిక్ పార్టీలో అనేక మంది పురోగామి వాదులు(అమెరికా ప్రమాణాల ప్రకారం) ఎక్కువగా ఎన్నికయ్యారు. డోనాల్డ్ ట్రంప్, ఆ పెద్దమనిషి ప్రాతినిధ్యం వహిస్తున్న మితవాద రిపబ్లికన్ పార్టీ సాగించిన మహిళా వ్యతిరేక, శ్వేతజాతి మెజారిటీ నినాదాలకు చెంపపెట్టుగా అసాధారణ రీతిలో మహిళలు, రంగు వివక్షకు, జాతిపరంగా వివక్షకు గురయ్యేవారు, ఇతరులు డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కరడు గట్టిన ఐదుగురు రిపబ్లికన్ గవర్నర్లను(మన ముఖ్యమంత్రులకు సమానం) ఓటర్లు ఇంటికి పంపారు. అతి పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియాలో, ప్రపంచ ఆర్ధిక రాజధాని వంటి న్యూయార్క్ రాష్ట్రంలోనూ డెమోక్రాట్లదే పైచేయి. గవర్నర్లుగా వారే ఎన్నికయ్యారు. వర్గరీత్యా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు మౌలికంగా పెట్టుబడిదారీ విధాన ప్రతినిధులే. అందువలన అధికారంలోకి వచ్చిన తరువాత సహజంగానే ప్రజావ్యతిరేకతను వ్యతిరేకతను ఎదుర్కొంటారు. ఆ రీత్యా చూసినపుడు గతంలో ఒబామా ఎనిమిదేండ్లు అధికారంలో వున్న సమయంలో వివిధ రాష్ట్రాల చట్ట సభలలో వెయ్యి మంది వరకు డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ ట్రంప్ రెండు సంవత్సరాల ఏలుబడిలోనే 323 మంది రిపబ్లికన్లు ఇంటిదారి పట్టారు. గెలిచిన రాష్ట్రాల నియోజకవర్గాలలో పురోగామివాదుల నుంచి వంద చోట్ల మితవాదులవైపు మొగ్గగా 300చోట్ల తిరోగామి వాదులను ఓడించి పురోగామివాదుల వైపు ఓటర్లు నిలిచారు.కొన్ని చోట్ల పురోగామి అభ్యర్ధులు ఓటమి పాలైనా మొత్తం మీద ఆశక్తులతో నిండిన బృందాలు ఈ ఎన్నికలను తీవ్రంగా తీసుకోవటం మంచి పరిణామం. గతంలో ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన శివారు పట్టణాలలోని శ్వేతజాతి మహిళలు అనేక మంది ఈసారి రిపబ్లికన్లకు దూరమయ్యారు.గత రెండు సంవత్సరాలలో వివిధ సమస్యల మీద సాగించిన ఆందోళనల ఫలితాలు ఈ ఎన్నికల్లో ప్రతిబింబించాయి.ఎన్నికలకు ముందు కొన్ని చోట్ల కనీస వేతనాల పెంపుదల జరిగింది. నేరాలు చేశారనే సాకుతో ఫ్లోరిడా రాష్ట్రంలో ఓటు హక్కు తొలగించిన 14లక్షల మందికి ఈ ఎన్నికల్లో పునరుద్దరించారు.
ప్రజాప్రతినిధుల సభలో, వివిధ రాష్ట్రాల గవర్నర్ల ఎన్నికలో గణనీయ విజయాలు సాధించిన డెమోక్రాట్లు సెనెట్‌లో ఎందుకు మెజారిటీ సాధించలేకపోయారు అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. సెనెట్ ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్ధుల కంటే డెమోక్రాట్లకు కోటీ ఇరవై లక్షల ఓట్లు అదనంగా వచ్చాయి. సెనెట్ రాష్ట్రాల ప్రతినిధుల సభ. జనాభా ఎంత మంది అనేదానితో నిమిత్తం లేకుండా ప్రతి రాష్ట్రం నుంచి ఇద్దరు చొప్పున యాభై రాష్ట్రాల నుంచి ఎన్నిక అవుతారు. యోమింగ్ రాష్ట్ర జనాభా ఆరులక్షలు లోపు, అదే కాలిఫోర్నియా జనాభా దానికి 60రెట్లు ఎక్కువ, అయినా రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరిద్దరిని మాత్రమే ఎన్నుకోవాల్సి వుంది. సాంప్రదాయకంగా గ్రామీణ ప్రాంతాలలో రిపబ్లికన్లవైపే ఓటర్లు మొగ్గు వుంటోంది. ఇది కూడా సెనెట్ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది.ఈ విధానంలో రాష్ట్రాల సమాన ప్రాతినిధ్యం అనే ప్రజాస్వామిక అంశంతో పాటు, జనాభాతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య వ్యతిరేక లక్షణం కూడా వుంది. ఇదొక్కటే కాదు, ఇంకా ఇలాంటివి వున్నాయి. ట్రంప్ గత ఎన్నికలలో ఎలక్ట్రొరల్ కాలేజ్‌లో మెజారిటీ తెచ్చుకొని అధ్యక్షుడు అయినప్పటికీ సాధారణ ఓటర్ల తీర్పు ప్రకారం ప్రత్యర్ధి హిల్లరీ క్లింటన్ కంటే 30లక్షల ఓట్లు తక్కువ వచ్చాయి. ప్రజాప్రతినిధుల ఓట్ల వివరాలను చూస్తే డెమోక్రాట్లకు ఏడు శాతం అధికంగా వచ్చాయి.

అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్
ప్రజాప్రతినిధుల సభకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిగితే సెనెట్‌కు ప్రతి రెండు సంవత్సరాలకు మూడోవంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఇది రాస్తున్న సమయానికి ఖరారైన ఫలితాల ప్రకారం డెమోక్రాట్లు గతంలో ప్రాతినిధ్యం వహించిన సీట్లలో రెండు చోట్ల ఓడిపోగా రిపబ్లికన్లు వున్న చోట్ల 29 గెలిచారు. సెనెట్‌లో రెండు చోట్ల డెమోక్రాట్లను రిపబ్లికన్లు ఓడించి (100కు 51) ఒక సీటు మెజారిటీ తెచ్చుకున్నారు.ఎన్నికలు జరిగిన 35 సీట్లలో డెమోక్రాట్లు 26చోట్ల రిపబ్లికన్లు తొమ్మిది చోట్ల గతంలో ప్రాతినిధ్యం వహించారు. తాము అధికారంలో రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాలను తమకు అనుకూలంగా రిపబ్లికన్లు పునర్విభజన చేశారని కూడా వెల్లడైంది.అయినా కొన్ని చోట్ల డెమోక్రాట్లు విజయం సాధించారు. 2020లో జరిగే ఎన్నికల నాటికి డెమోక్రాట్లు కూడా అదే ఎత్తుగడలను అనుసరించే అవకాశం వుంది. తాజా ఎన్నికల్లో కొన్ని చోట్ల రిపబ్లికన్లు కుంటి సాకులతో డెమోక్రాట్లకు పడే ఓటర్లను అడ్డుకున్నారు. దానికి సుప్రీం కోర్టు మద్దతు కూడా తోడైంది. అమెరికాలోని అడవులలో నివసించే గిరిజన ప్రాంతాలలో ఓటర్లకు పోస్టు బాక్సు నంబర్లే చిరునామాలుగా వుంటాయి. ఓటరు గుర్తింపు కార్డుకు, ఓటర్ల జాబితాలో పేర్లకు అన్నీ సరిపోలి వుండాలనే ఒక నిబంధన వుంది. పేర్లలో కామాలు, పులుస్టాప్‌లు, పేరులో మధ్యనామం సరిగా లేదు, వుచ్చారణ సరిగా లేదు అనే కుంటిసాకులను చూపి వేల ఓట్లను తిరస్కరించారు. వుత్తర డకోటా ప్రాంతంలో గిరిజన ప్రాంతాలలో వీధుల వివరాలు లేవనే సాకుతో వేలాది మంది ఓటర్లను తిరస్కరించారు. ఈ కారణం కూడా తోడై గతంలో ఆ నియోజకవర్గం నుంచి ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధిని ఈసారి ఓడిపోయారు.

రషీదా లాయిబ్
అమెరికా చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్ పదవికి నల్లజాతి మహిళ స్టాసీ అబ్రామ్స్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా జార్జియా రాష్ట్రానికి ఎన్నికయ్యారు. పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా వందమందికి పైగా మహిళలు ఎన్నికవ్వటం ఒక విశేషం. ఎన్నికైన మహిళల్లో 29 ఏండ్ల పిన్న వయస్కురాలు అలెగ్జాండ్రియా కాసియో కార్టెజ్, ఆమె ఒక బార్‌లో వెయిట్రెస్( మద్యం, ఆహారపదార్దాల అందచేసే పని)గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. న్యూయార్క్ నగరంలోని బ్రాంక్స్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తాను డెమోక్రటిక్ సోషలిస్టునని స్వయంగా ప్రకటించుకున్న యువతి. సోమాలియా నుంచి నిర్వాసితురాలిగా అడుగుపెట్టి అమెరికా పౌరసత్వం పొంది మినియా పోలీసు నుంచి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికైన తొలి సోమాలి-అమెరికన్ మహిళ ఇహాన్ ఓమర్. మైనారిటీల సమస్యల మీద పని చేస్తూ ట్రంప్ సర్కార్ వలసదార్ల వ్యతిరేక వైఖరిని ఎండగట్టటంలో ముందున్నారు.డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధిగా మసాచుసెట్స్ నగరంలోని ఒక నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా తొలిసారిగా ఎన్నికయ్యారు అయనా ప్రెస్లే. అంతకు ముందు బోస్టన్ నగరపాలక సంస్ధ సభ్యురాలిగాను, పదహారు సంవత్సరాల పాటు పార్లమెంట్ కార్యాలయంలో పని చేశారు. డెమోక్రటిక్ సోషలిస్టుగా ప్రాచుర్యం పొందిన రషీదా లాయిబ్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ముస్లిం మహిళ. ఆమె పోటీ లేకుండా గెలిచారు. కాన్సాస్ నుంచి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధులుగా గిరిజన మహిళలు షారైస్ డేవిడ్స్, డెబ్రా హాలాండ్ కాన్సాన్, న్యూ మెక్సికో నుంచి ఎన్నికయ్యారు. ఇరవై తొమ్మిది సంవత్సరాల మరో పిన్న వయస్సురాలైన అబీ ఫిన్‌కెనౌర్ లోవా నియోజకవర్గం నుంచి ఎన్నికైన తొలి మహిళ, డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి.
యాభై సంవత్సరాల క్రితం మధ్యంతర ఎన్నికల్లో 49శాతం పోలింగ్ కాగా తాజా ఎన్నికల్లో దానికి దగ్గరగా 47శాతానికి మించి పోలు కావటం ఓటర్లలో పెరిగిన ఆసక్తి, వుత్సాహానికి నిదర్శనం. కొన్ని చోట్ల 60శాతం వరకు నమోదైంది. ఎనిమిది సంవత్సరాల క్రితం 41శాతం, నాలుగు సంవత్సరాల నాడు 36.7శాతమే నమోదైంది. ట్రంప్‌పై తీవ్ర వ్యతిరేకతతో పాటు గెలిచిన అభ్యర్ధులను పరిశీలిస్తే పురోగామి వాదులను గెలిపించాలన్న తపన పలు తరగతుల ఓటర్లలో వుందనటానికి ఇది ఒక సూచిక. గత నాలుగు సంవత్సరాలలో అనేక ఓట్లను జాబితా నుంచి తొలగించటంతో అనేక మంది పట్టుదలగా ఓట్లు నమోదు చేయించుకొని పోలింగ్‌కు వచ్చారు. గుర్తింపు కార్డుమీద పూర్తి చిరునామా వుండాలన్న నిబంధన కొద్ది వారాల ముందే విధించటంతో గిరిజనులు పెద్ద ఎత్తున కొత్త గుర్తింపుకార్డులు అచ్చువేయించుకొనేందుకు రావటంతో తొక్కిసలాట పరిస్ధితి ఏర్పడింది. చాలా మంది సమగ్రగుర్తింపు కార్డు లేకపోవటంతో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. అయినా నాలుగు సంవత్సరాలతో పోల్చితే గిరిజనులు రెట్టింపు మంది ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు.
కార్మిక సంఘాలను, ఆందోళలను వ్యతిరేకించే రిపబ్లికన్లు ఓడించి పలువురు కార్మిక నేతలు ఎన్నికయ్యారు. వారిలో ఆండీ లెవిన్, రోజా డెలారో డి కాన్, బాబీ స్కాట్, జోహనా హేస్, కేంద్రా హారన్(తొలి గిరిజన మహిళ)ఎన్నికయ్యారు. అనేక మంది కార్మిక ప్రతినిధులు స్వల్పతేడాతో ఓడిపోయారు. ముఖ్యమైన విజయంగా విస్కాన్‌సిన్ రాష్ట్రంలో కార్మిక సంఘాలను తీవ్రంగా వ్యతిరేకించిన రిపబ్లికన్ గవర్నర్‌ను టోనీ ఎవర్స్ ఓడించారు. ఏడు సంవత్సరాల క్రితం రాష్ట్ర అసెంబ్లీని దాదాపు లక్ష మంది కార్మికులు ముట్టడించి నిరసన తెలపటానికి రిపబ్లికన్ గవర్నర్ వైఖరే కారణం. పార్లమెంట్, అసెంబ్లీలకు 743మందికార్మిక సంఘాల నేతలు ఎన్నికయ్యారు. మొత్తం శాసనసభ్యులలో దాదాపు పదో వంతు. మినెసోటా గవర్నర్‌గా టిమ్ వాల్జ్ (అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ నేత) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలలో తాము 23.5లక్షల ఇండ్లకు వెళ్లామని, పని కేంద్రాలలో 50లక్షల కరపత్రాలు, కోటీ ఇరవైలక్షల ఇమెయిల్స్, 2,60,094 ఎస్‌ఎంఎస్‌లు, సామాజిక మీడియాలో 6.9కోట్ల పోస్టింగులతో ప్రచారం నిర్వహించినట్లు అమెరికా కార్మిక సంఘాల సమాఖ్య ఎఎఫ్‌ఎల్-సిఐఓ ప్రతినిధి తెలిపారు.
ఈ ఎన్నికలలో ప్రవాస భారతీయులు, వారి సంతతికి చెందిన వారు డెమోక్రటిక్ పార్టీ తరఫున అనేక మంది చట్టసభలకు ఎన్నికయ్యారు. డాక్టర్ అమీ బెరా వరుసగా నాలుగవ సారి కాలిఫోర్నియా నుంచి ఎన్నికయ్యారు. ఇలినాయిస్ నుంచి రెండవ సారి రాజా కృష్ణమూర్తి, సిలికాన్ వాలీ నుంచి రో ఖన్నా, ప్రమీలా జయపాల్ సియాటిల్ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వివిధ రాష్ట్రాల శాసనసభలకు విస్కాన్సిన్ నుంచి అటార్నీ జనరల్ స్ధానానికి జోష్ కౌల్, కెంటకీలో నీమా కులకర్ణి, అరిజోనా నుంచి అమిష్ షా, న్యూయార్క్ సెనేట్‌కు కెవిన్ ధామస్, వుత్తర కరోలినా సెనేట్‌కు మజతాబా మహమ్మద్, జయా చౌధురి డెమోక్రటిక్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఇంకా నీరజ్ అతానీ(ఓహియో), మంకా ధింగ్రా( వాషింగ్ట్‌న్), సబీకుమార్(టెనెసీ), ఆషా కార్లా(కాలిఫోర్నియా) కుమార్ భారవే(మేరీలాండ్), జూలీ మాథ్యూ, కెపి జార్జి(టెక్సాస్), షాలినీ (మసాచుసెట్స్) ఎన్నికయ్యారు.
సోషలిజం పట్ల ఓటర్లలో డెమోక్రటిక్ పార్టీలో వెల్లడౌతున్న సానుకూల వైఖరి, ఈ ఎన్నికలలో అణగారిన వర్గాలుగా వున్నవారు గణనీయంగా విజయం సాధించటంతో అమెరికాలోని వామపక్ష శక్తులలో తదుపురి ఏమిటి అన్న చర్చ మరింతగా పెరుగుతున్నది. మరింత విశాలంగా ఆలోచించాలి, పెద్ద ఎత్తున సమీకరించాలన్నది ఒక అభిప్రాయం. రిపబ్లికన్ పార్టీ లేదా ట్రంప్ మద్దతుదారులందరూ జాత్యంహకారులు, వలసకార్మికులకు, మహిళలకు వ్యతిరేకం కాదని అందువలన మితవాదులు కాని వారిని ఆకర్షించటం ఎలా అన్నది మధిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీలో పెట్టుబడిదారీవర్గాన్ని బలపరిచే శక్తులదే పైచేయి అయినప్పటికీ పార్టీలోని పురోగామిశక్తులలో సోషలిస్టు తిరుగుబాటు రాజుకుంటున్నది. కొంత కాలం క్రితం ఆ పార్టీలో సోషలిస్టులుగా వున్నవారు తమ వైఖరికి కట్టుబడి పోరాడాలా వద్దా అనే గుంజాటనలో వుండేవారు. అయితే 2008తలెత్తిన తీవ్ర మాంద్యం, వాల్‌స్ట్రీట్ ఆక్రమణ వుద్యమం, నల్లజాతీయుల జీవన్మరణ సమస్య, పర్యావరణ సమస్యలు తీవ్రతరం గావటం, సెనెటర్ బెర్నీ శాండర్స్ తాను సోషలిస్టును అని బహిరంగంగా ప్రకటించుకొని ప్రచారం చేయటం వంటి పరిణామాలతో ఇప్పుడు లక్షల మంది మేం కూడా సోషలిస్టులమే అని ప్రకటించుకున్నారు. ఈ పరిస్ధితుల్లో సోషలిస్టులేమి చేయవచ్చు అన్న చర్చ ప్రారంభమైంది.
బెర్నిశాండర్స్ వంటి కొంత మంది కార్మికవర్గం, సామాజిక వుద్యమాల గురించి మాట్లాడటం ఒక ముందడుగు. వారు అంతవరకే పరిమితం గాకుండా కార్మికుల ఆందోళనల దగ్గరకు వెళ్లేందుకు కూడా సిద్ధ పడుతున్నారు. ఒక విధంగా సోషల్ డెమోక్రాట్స్ మాదిరి వ్యవహరిస్తున్నారు. అంటే డెమోక్రటిక్ పార్టీ నాయకత్వంలోకి సోషల్ డెమోక్రాట్లను తీసుకు వచ్చి పురోగామి శక్తులను ఎన్నికలలో నిలబెట్టి కార్మికవర్గ సమస్యలను పరిష్కారించాలనే వైఖరికి అలాంటి వారు ప్రతినిధులు. అంటే పెట్టుబడిదారీ వ్యవస్ధను సంస్కరించగలమనే నమ్మకం వున్నవారు, సంస్కరిస్తే చాలు సమస్యలు పరిష్కారమౌతాయనే భ్రమలు కలిగిన వారు. మరో రెండు సంవత్సరాలలో జరిగే ఎన్నికలలో ఈ పరిస్ధితి బెర్నీశాండర్స్ అభ్యర్ధిత్వం మీద ఎలా పని చేస్తున్నందన్నది ప్రశ్న.
డెమోక్రటిక్ పార్టీని సంస్కరించటం జరిగేది కాదు, ఆ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులుగా వున్న అలెగ్జాండ్రా కాసియో కోర్టెజ్, రషీదా లాయిబ్ వంటి విజయం సాధించిన వారి మాదిరి గాకుండా సోషలిస్టులే ప్రత్యక్షంగా పోటీ పడాలన్నది మరొక వాదన. ఎన్నికైన పురోగామి వాదులు వర్గపోరాటాలను ప్రోత్సహించేందుకు ముందుగా సోషలిస్టు బృందంగా ఏర్పడే అవకాశాలున్నాయని కొందరి అంచనా. ఇప్పుడు ఎన్నికైన సోషలిస్టులు సమన్వయంతో పని చేస్తూ కార్మిక పోరాటాలు, పార్లమెంటరీ, పార్లమెంటేతర కార్యక్రమాలలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవటం ద్వారా మరింత బలమైన శక్తిగా రూపొందేందుకు అవకాశం వుంటుందన్న సూచనలు కూడా వెల్లడయ్యాయి.
ఈ ఎన్నికలలో వామపక్ష అభ్యర్ధులు ఓటమి పొందినప్పటికీ వారు చేసిన డెమోక్రటిక్ సోషలిస్టు ప్రచారం, కార్యాచరణ వృధాకాదు. బెర్నీశాండర్స్ వంటి వారు చేసిన ప్రచారం, భావజాలం కార్మికవర్గ జీవితాలలో కొద్ది మార్పు చెందేందుకు దారితీసేదిగా వుంటుంది, అయితే అందరికీ ఆరోగ్యం, కాలేజీ విద్య వుచితం, విద్యార్ధి రుణాల రద్దు వంటి డిమాండ్లకు బహిరంగంగా మద్దతు ప్రకటించేందుకు కొందరు డెమోక్రాట్లను పురిగొల్పింది. రాష్ట్రాల అసెంబ్లీలలో తాము డెమోక్రటిక్ సోషలిస్టులం అని చెప్పుకున్న వారు కేవలం ముగ్గురే వుండగా ఈ సారి అలాంటి వారు పది మంది ఎన్నికయ్యారు.మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్యతో పోలిస్తే లెక్కలోకి తీసుకోవాల్సిన సంఖ్యగాక పోయినా సోషలిస్టులమని చెప్పుకొని పోటీ చేసే వారు ముందుకు రావటం గమనించాల్సిన అంశం. ఇలాంటి వారిని నిరుత్సాహపరిచేందుకు, దెబ్బతీసేందుకు డెమోక్రటిక్ పార్టీలోని మితవాదులు, సోషలిస్టు వ్యతిరేకులు అడుగడుగునా ప్రయత్నిస్తారని వేరే చెప్పనవసరం లేదు.
అమెరికాలో ఇప్పుడు రెండు రకాల సోషలిస్టులు, డెమోక్రటిక్ పార్టీలో అంతర్భాగంగా( గతంలో మన స్వాతంత్య్రవుద్యమ సమయంలో కాంగ్రెస్ సోషలిస్టుల మాదిరి) పని చేస్తున్న డెమోక్రటిక్ సోషలిస్టులు, విడిగా పని చేస్తున్న సోషలిస్టు శక్తులు, కమ్యూనిస్టు పార్టీగా పని చేస్తున్నవారు వున్నారు. ఈ శక్తుల మధ్య ఎలాంటి సంబంధం వుండాలో కూడా చర్చ ప్రారంభించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధుల సభలో డెమోక్రటిక్ సోషలిస్టులుగా పక్కాగా ప్రకటించుకొని గెలిచిన ఇద్దరు మహిళలు వున్నారు.రానున్న రోజుల్లో డెమోక్రటిక్ పార్టీలో వున్న సోషలిస్టులతో మిగతావారందరూ కలసి ఒక ప్రత్యేక పార్టీగా ఏర్పడేందుకు, స్వతంత్ర వైఖరి, కార్యాచరణ, సిద్ధాంత ప్రచారానికి, జరుగుతున్న కార్మిక, వుద్యోగ, వుపాధ్యాయ, సామాజికోద్యమాలతో సమన్వయానికి సిద్ధంగావాలన్న ప్రతిపాదన ఒకటి వుంది. దీనిలో వుండే నష్టాలూ, లాభాల గురించి కూడా ఆలోచించాలని చెబుతున్నారు. అమెరికాలో ప్రారంభమైన ఈ మధనం అక్కడి రాజకీయాలలో గణనీయమైన మార్పులకు, అది మరింత పురోగమనం దిశగా వుంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. విప్లవాలు మనం కోరుకున్నట్లుగా, ఆశించినంత వేగంగా, ఊహించిన చోట రావు అని ఎలా చెబుతామో రావని కూడా చెప్పలేము !
Like this:
Like Loading...