ఒక వైపు నిరంతరం మితవాదశక్తులు, వాటికి మద్దతు ఇచ్చే అమెరికా కుట్రలు, వాటిని ఎదుర్కొంటూ ముందుకు పోతున్న నికరాగువా వామపక్ష ప్రభుత్వం. గత పదిహేను సంవత్సరాలలో అది సాధించిన ప్రధాన విజయాలలో మహిళా సాధికారత, సమానత్వానికి పెద్ద పీట వేయటం అంటే అతిశయోక్తి కాదు. గతేడాది జరిగిన ఎన్నికల్లో 76శాతం ఓట్లతో వామపక్షం గెలుపుకు తోడ్పడిన అంశాలలో ఇదొకటి. గెలిచింది వామపక్షం, అందునా అమెరికాకు బద్ద విరోధి కనుక ఆరోపణలు, వక్రీకరణలు సరేసరి. 2007 నుంచి రెండవ సారి అధికారంలో ఉన్న శాండినిస్టా నేత డేనియల్ ఓర్టేగా సర్కార్ తన వాగ్దానాలను అనేకం నెరవేర్చింది. తన అజెండాలోని అనేక అంశాలకు నాందీ వాచకం పలికింది అప్పటి నుంచే. పార్లమెంటులో కుటుంబ, మహిళా, శిశు,యువజన కమిషన్ అధ్యక్షురాలిగా ఉన్న ఇర్మా డావిలియా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మంత్రివర్గంలో 50శాతం కంటే ఎక్కువ మంది మంత్రులున్న 14 దేశాల్లో స్పెయిన్ 66.7శాతంతో ప్రధమ స్ధానంలో ఉంటే ఫిన్లండ్ 61.1, నికరాగువా 58.8శాతంతో మూడవ స్ధానంలో ఉంది. ఇది లాటిన్ అమెరికాలో ప్రధమ స్ధానం. ఇదే విధంగా ఎక్కువ మంది మహిళలున్న పార్లమెంట్లు మూడు కాగా మూడవది నికరాగువా. ప్రపంచ ఆర్ధిక వేదిక రూపొందించిన లింగ భేదం సూచికలో ఐదవ స్దానంలో నికరాగువా ఉంది. 2007లో 90వ స్ధానంలో ఉంది. అంటే దీని అర్ధం పురుషులతో సమంగా అన్ని రంగాలలో మహిళలకు అవకాశాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. పార్లమెంటులోని 91 స్ధానాల్లో 46 మంది మహిళలు, 45 మంది పురుషులు. దీనికి అనుగుణంగానే మెజారిటీ కమిటీలు, కమిషన్లకు మహిళలే అధిపతులుగా ఉన్నారు. అన్ని ఎన్నికల్లో సగం స్ధానాల్లో మహిళలకు రిజర్వేషన్లు ఉండటమే దీనికి కారణం.వామపక్ష ప్రభుత్వం నిజమైన సమాన భాగస్వామ్యాన్ని చట్టపరంగా కల్పించింది. న్యాయ వ్యవస్ధలో సగానికి పైగా కార్యనిర్వాహక వ్యవస్ధలో 58శాతం మహిళలే ఉన్నారు. చట్టాలు చేయటమే కాదు అమలు వల్లనే ఇది జరిగింది.
1961లో ఏర్పడిన శాండినిస్టా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఎన్) 1979లో నియంత సోమోజా ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారాన్ని చేపట్టింది.1979 నుంచి 1990 వరకు పాలన సాగించింది. అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా తిరుగుబాటుదార్లతో పోరు తదితర కారణాలతో 1990 ఎన్నికల్లో ఫ్రంట్ ఓడిపోయింది.2006 వరకు ప్రతిపక్షాలు మితవాదశక్తులు అధికారంలో ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు ఎన్నికల్లో తిరిగి శాండినిస్టాలు గెలుస్తున్నారు.ఫ్రంట్‌లో చీలికలు, తిరుగుబాట్లు, విద్రోహాలు అనేకం జరిగాయి. లాటిన్ అమెరికాలో జరిగిన తిరుగుబాట్లలో మహిళలు పెద్ద ఎత్తున ఆయుధాలు చేపట్టిన పరిణామం నికరాగువాలో జరిగింది. విముక్తి పోరాటంలో పెద్ద పాత్ర పోషించటం ఒకటైతే ఆ పోరాటాన్ని ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు అమెరికా ఏర్పాటు చేసిన కాంట్రా విద్రోహులలో కూడా మహిళలు ఉన్నారు. శాండినిస్టాలలో 30శాతం మంది ఉండగా కాంట్రాలలో ఏడుశాతం ఉన్నట్లు కొందరు అంచనా వేశారు.
శాండినిస్టాల పాలనలో పురోగతి గణనీయంగా ఉన్నప్పటికీ మితవాద, సామ్రాజ్యవాదశక్తులు వామపక్ష పాలన మీద బురద జల్లుతున్నాయి. తొలిసారి శాండినిస్టాల పాలనలో చేపట్టిన సంక్షేమ, ఇతర చర్యలను తరువాత సాగిన మితవాద పాలనలో పూర్తిగా ఎత్తివేయటం సాధ్యం కాలేదు. రెండవసారి 2007 నుంచి పాలన సాగిస్తున్న శాండినిస్టాలు అనేక వాగ్దానాలను అమలు జరిపారు. మహిళలకు భూమి పట్టాలను ఇవ్వటమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా వారు రాణించి ఆర్ధిక సాధికారతను పొందేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దేశంలో 55శాతం మంది మహిళలు భూయజమానులుగా మారారు. దాంతో కుటుంబ ఆరోగ్యం మెరుగుపడింది, అన్నార్తులు లేకుండా పోయారు. దేశంలో 90శాతం ఆహార అవసరాలను తీర్చటంలో మహిళలు పెద్ద పాత్రను పోషించారు. ప్రపంచంలో మైక్రోఫైనాన్స్ వడ్డీ రేటు 35శాతం వరకు ఉండగా నికరాగువాలో అది కేవలం 0.5శాతమే ఉంది.2007 తరువాత 5,900 సహకార సంస్ధలను ఏర్పాటు చేశారు.దారిద్య్రనిర్మూలన 48 నుంచి 25శాతానికి తగ్గగా దుర్భర దారిద్య్రం 17.5 నుంచి ఏడు శాతానికి తగ్గింది. దీంతో మొత్తంగా ప్రత్యేకించి ఒంటరి మహిళలు ఎంతో లబ్దిపొందారు. గృహ హింసకూడా తగ్గింది. 2007 నాటికి పట్టణాల్లో 65శాతం మందికి మంచినీరు అందుబాటులో ఉండగా ఇప్పుడు 92శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 28 నుంచి 55శాతానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు 54 నుంచి 99శాతానికి పెరిగిగాయి. విద్య పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.
2018 ఏప్రిల్‌లో శాండినిస్టా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలో భాగంగా శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు అనేక శక్తులు చేతులు కలిపాయి. వీటిలో క్రైస్తవ మత సంస్ధలు, చర్చ్‌లు ప్రధాన పాత్రపోషించాయి. ఆందోళనకారులకు చర్చ్‌లలో ఆశ్రయం కల్పించటంతో సహా పలు రూపాల్లో ప్రభుత్వ వ్యతిరేకులకు సహకరించాయి. అప్పటి నుంచి ప్రభుత్వం స్వచ్చంద సంస్ధల ముసుగులో ఉన్న వారికి అందుతున్న నిధుల ఖర్చు తీరుతెన్నులను ప్రశ్నించటం, సరైన సమాధానం ఇవ్వని వాటి అదుపు వంటి చర్యలు తీసుకుంది. ఈ ఏడాది మార్చినెలలో వాటికన్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించింది.
లాటిన్ అమెరికాను తన పెరటితోటగా చేసుకొనేందుకు అమెరికా మొదటి ప్రపంచ యుద్దానికి ఎంతో ముందుగానే చూసింది. దాని లక్ష్యాలలో నికరాగువా ఒకటి. కరిబియన్ సముద్రం ద్వారా అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ ఓడల రవాణాకు ఒక కాలువ తవ్వాలనే ఆలోచన 1825 నుంచి ఉంది. పనామా కాలువ తవ్వకం తరువాత నికరాగువా కాలువను తవ్వేందుకు జపాన్ ముందుకు వచ్చింది. ఆ పధకం తనకు దక్కలేదనే కసితో దాన్ని ఎలాగైనా నిలిపివేయాలనే లక్ష్యంతో అమెరికా 1911 నుంచి అనేకసార్లు నికరాగువా మీద దాడి చేసింది. వాటిని గెరిల్లా నేత అగస్టో సీజర్ శాండినో నాయకత్వాన 1934వరకు తిరుగుబాటుదార్లు వాటిని ప్రతిఘటించారు. అమెరికా కుట్రలో భాగంగా శాండినోను శాంతి చర్చలకు పిలిచి నాడు మిలిటరీ కమాండర్‌గా ఉన్న అనాస్టాసియో సోమోజా గార్సియా అధికారాన్ని హస్తగతం చేసుకొని శాండినోను హత్యచేయించాడు. అమెరికా సామ్రాజ్యవాద ప్రతిఘటనకు మారుపేరుగా శాండినో మారారు. తరువాత సోమోజా ఇద్దరు కుమారులు నిరంకుశపాలన సాగించారు.రెండవ వాడైన సోమోజా డెబాయిల్‌ను 1979లో వామపక్ష శాండినిస్టా గెరిల్లాలు గద్దె దింపారు. సోమోజాలు ఏర్పాటు చేసిన నేషనల్ గార్డ్స్ మాజీలతో కాంట్రాలనే పేరుతో ఒక విద్రోహ సాయుధ సంస్ధను రూపొందించి శాండినిస్టా ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా కుట్రపన్నింది. పదేండ్లపాటు వారి అణచివేతలోనే శాండినిస్టాలు కేంద్రీకరించాల్సి వచ్చింది. దాంతో జనంలో తలెత్తిన అసంతృప్తిని ఆసరా చేసుకొని అమెరికా మద్దతుతో మితవాదశక్తులు ఎన్నికల్లో అధికారాన్ని స్వాధీనం చేసుకొని 1990 నుంచి 2006వరకు అధికారంలో ఉన్నాయి. 2007 నుంచి డేనియల్ ఓర్టేగా అధిపతిగా శాండినిస్టాలు తిరిగి అధికారంలో కొనసాగుతున్నారు.
2021లో జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా ఓర్టేగా ఐదవసారి భారీ మెజారిటీతో ఎన్నికయ్యాడు.లాటిన్ అమెరికాలో అమెరికా సామ్రాజ్యవాదులకు తగిలిన మరొక ఎదురుదెబ్బ ఇది.1985లో కమ్యూనిస్టు చైనాను గుర్తించి ఓర్టేగా సర్కార్ దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది. తరువాత 1990లో అధికారానికి వచ్చిన అమెరికా అనుకూలశక్తులు అంతకు ముందు మాదిరే తైవాన్నే అసలైన చైనాగా తిరిగి గుర్తించారు. 2021లో తిరిగి ఓర్టేగా తైవాన్ను తిరస్కరించి చైనాతో సంబంధాలను పునరుద్దరించాడు. స్వయంగా అమెరికా కమ్యూనిస్టు చైనాను గుర్తించినప్పటికీ తైవాన్ను ఉపయోగించి రాజకీయాలు చేసేందుకు లాటిన్ అమెరికాలో తనకు అనుకూలమైన దేశాల ద్వారా తైవాన్‌తో సంబంధాలతో కొనసాగించింది.2007లో కోస్టారికా, 2017లో పనామా, 2018లో ఎల్ సాల్వడార్ చైనాను గుర్తించాయి.హొండురాస్ కూడా అదే బాటలో ఉంది. ఇది లాటిన్ అమెరికాలో మారుతున్న పరిణామాలకు అద్దంపడుతున్నాయి. మితవాద, మిలిటరీలను ఉపయోగించుకొని అమెరికా తన లబ్ది తాను చూసుకోవటం తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఇటీవలి కాలంలో అనేక దేశాలు చైనా నుంచి పెట్టుబడులను ఆశించటంతో అమెరికన్ లాబీలకు దిక్కుతోచటం లేదు. చైనా పెట్టుబడులతో అభివృద్ధి పనులు జరిగితే తమ పట్టు మరింత సడలుతుందనే భయం అమెరికాకు పట్టుకుంది. దీంతో నికరాగువా, ఇతర దేశాల వామపక్షాల్లో ఉన్న విబేధాలను మరింత పెంచి కొంత మందిని చీల్చి తన పబ్బంగడుపుకోవాలని చూస్తున్నది. ఈ క్రమంలో అది మరిన్ని కుట్రలకు పాల్పడి వామపక్ష ప్రభుత్వాలను కూలదోసే యత్నాలను మరింత వేగిరం చేసేందుకు పూనుకుంది. నికరాగువా సర్కార్ ఎప్పటి కప్పుడు అలాంటి కుట్రలను ఛేదిస్తూ ముందుకు పోతున్నది.
మైకోల్ డేవిడ్ లించ్ అమెరికా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, యువ కమ్యూనిస్టు లీగ్ ప్రధాన కార్యదర్శి. 2012 సెప్టెంబరు పదవ తేదీన అమెరికా కమ్యూనిస్టు పార్టీ వెబ్‌సైట్‌లో రాసిన ఒక విశ్లేషణ ప్రపంచంలోని వామపక్ష, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ఉపయోగపడేదిగా ఉందని భావించి దాని అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాను. అమెరికా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తేడాలు ఉన్నాయి. అయితే పార్టీలలో, కొన్ని గ్రూపులు, వ్యక్తులలో ఉన్న కొన్ని వక్రీకరణలు, పెడధోరణులు, కొన్ని సమస్యలపై వైఖరులను సవరించుకొనేందుకు తోడ్పడవచ్చు. ఉదాహరణకు అగ్రవర్ణాలు లేదా ఆధిపత్య కులాలకు చెందిన వారు విప్లవోద్యమాలకు నాయకులుగా ఉండకూడదు, వారిని నమ్మలేము అని చెప్పేవారు, ఒక కులం వారు మొత్తం దొంగలే అని సూత్రీకరించిన ఒక ప్రొఫెసర్ భావజాలానికి మూలం ఏమిటి ? దళితులు మాత్రమే దళితులను విముక్తి చేసుకోగలరు వంటి సూత్రీకరణల నేపధ్యం వంటి కొన్ని అంశాలను సరైన కోణంలో చూసేందుకు ఈ విశ్లేషణ దోహదం చేయవచ్చు. నూరు పూవులు పూయనివ్వండి-వేయి ఆలోచనలను వికసించనివ్వండి అన్నదానిలో విశ్వాసం ఉన్నవారందరూ చదవాల్సిన అంశమిది. ” సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం ” అనే శీర్షికతో రాసిన విశ్లేషణ సమీక్షకు వేరే శీర్షికను నేను జత చేశాను. దాని పూర్తి పాఠం ఇలా ఉంది. ఆంగ్ల మూలపు లింక్‌ను కూడా కింద జతచేశాను.
సమూల మార్పు కోరుతున్న నేటి యువత దృక్కోణం ! మైకోల్ డేవిడ్ లించ్ విద్యార్ధులు,యువతను సంఘటిత పరచటం మొత్తగా ” సమయాన్ని వృధా ” చేయటమేనబ్బా ! వామపక్ష వాదులు నిర్వహిస్తున్న, నేను పని చేస్తున్న సమూహాలు కొన్నింటిలో ఇటీవల నేను వింటున్న మాట ఇది. ఇలా చెప్పటం సరైనదేనా అని నేను చర్చకు పెట్టినపుడు తొలుత ముందు చెప్పిన వైఖరిని తీసుకున్నవారు ” సరే యువ కార్మికులను సంఘటిత పరచటం గురించి కేంద్రీకరిద్దాం. వారిని మార్చగలము, విద్యార్ధుల కంటే మరింత విశ్వసనీయంగా మొగ్గుతారు ” అని తమ వైఖరిని మార్చుకున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే నేను ఒకప్పుడు కాలేజీ విద్యార్ధిని. మూడు ఉద్యోగాలు చేశాను, ఆసియన్ రెస్టారెంట్లలో రెండు, చిల్లర దుకాణంలో ఒకటి.చదువుకొనేందుకు నాకు సమయం ఉండేది కాదు, అయితే ఏదో విధంగా గ్రాడ్యుయేట్ కాలేజీలో కూడా అంగీకరించేందుకు అవసరమైన మంచి గ్రేడ్‌లు తెచ్చుకున్నాను. అయితే నేను ఎన్నడూ ఒక కార్మికుడిని అనుకోలేదు. మీరు విద్యార్ధా లేక కార్మికుడా అని అప్పుడు కొందరు నన్ను అడిగారు. తర్కబద్దమైన, ప్రత్యక్ష సమాధానంగా రెండూ అని ఉండేది. దాన్ని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మరింత స్పష్టమైన నా సమాధానంగా నేను పూర్తి కాలం పని చేస్తాను, పూర్తి కాలం చదువు కుంటాను అని చెప్పివుండే వాడిని. కరోనా మహమ్మారి మధ్యలో 2020డిసెంబరులో జరిగిన ఒక సర్వే ప్రకారం 70శాతం మంది కాలేజీ విద్యార్ధులు కూడా పని చేశారు. కనుక వారు చదువుకుంటూ పని చేస్తున్నందున విద్యార్ధులా కార్మికులా అన్న తేడాను చూడాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లో పని చేయని వారు డిగ్రీ తరువాత కార్మికశక్తిలో చేరతారు. నలభై ఒక్కశాతం కాలేజీ విద్యార్ధులు వారు కేంద్రీకరించిన డిగ్రీ- చేసిన పనికి సంబంధం లేదని తేలింది. అంతిమంగా వారు చదివిన డిగ్రీకి పని చేసే రంగానికి సంబంధం ఉండదు. కాబట్టి విద్యార్దులను సంఘటిత పరచటం సాధ్యం కాదు అని కొట్టిపారవేయటం మన కార్మికవర్గంలో గణనీయ భాగాన్ని విస్మరించటమే.
ఇప్పుడు మరొక వాదన గురించి చూద్దాం.” విద్యార్ధులు అంత విశ్వసనీయులు కాదబ్బా ”. కాలేజీ డిగ్రీలేని కార్మికుల గురించి కూడా అదే మాదిరి చెప్పవచ్చు.జనం జనమే. కమ్యూనిస్టు పార్టీలో, కమ్యూనిస్టు యువజన సంఘంలో గానీ కొందరు సభ్యులు వారు ఇరవైల్లో ఉన్నా అరవైల్లో ఉన్నా సమావేశాలకు రారబ్బా అని తరచూ చెబుతుంటారు. అది నిజం, ఒక ఇరవై ఏండ్ల వయస్కులకు కుటుంబం , స్కూలు, పని వంటి బాధ్యతలు ఎక్కువగా ఉండవచ్చు. దీని అర్ధం 60ఏండ్ల కామ్రేడ్లకు తమ పిల్లలు, మనవలు, పని వంటి బాధ్యతలు లేవని, నిర్వహించటం లేదని కాదు. మిలీనియల్స్‌లో అరవైశాతం మంది(24-39 ఏండ్ల వారు) పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక రకమైన సోషలిజంతో ఏకీభవిస్తున్నారు. ఈ తరం యువజన తరగతి నుంచి బయట పడటం ప్రారంభమైంది. వారిని మనం విస్మరించకూడదు, వారి మనోభావాలను మరింత పటిష్టపరచాలి. మనం ఒకటి గుర్తుకు తెచ్చుకోవాలి. పౌరహక్కుల ప్రదర్శనలు, బస్ బహిష్కరణలు, అహింసాత్మక బైఠాయింపులకు దారి తీసింది విద్యార్ధి ఉద్యమాలే. పచ్చి మితవాది ట్రంప్ పాలనలో కరోనా మహమ్మారి సమయంలో నల్లజాతీయుల సమస్యల ఆందోళనలు,వలస-కస్టమ్స్ నిబంధనల అమలు రద్దు ఉద్యమాలకు నాయకత్వం వహించింది యువతరమే అన్నది మరచిపోకూడదు. విప్లవ లక్ష్యాల సాధనకు గాను ప్రజాస్వామిక పోరాటాలు, కార్మిక పోరాటాలకు అవసరమైన భవిష్యత్ తరాలను సిద్దం చేయాలని లెనిన్ ఇచ్చిన పిలుపు ఇలాంటి యువతరం గురించే.( దీనిలో భాగంగా ఇటీవలనే యువకుల కోసం పార్టీ మార్క్సిస్టు తరగతులను విజయవంతంగా నిర్వహించింది).
కరోనా సమయంలో నిరుద్యోగులు, దారిద్య్రంలో కూరుకుపోయిన వారి కోసం పరస్పర సహాయ కార్యక్రమాలు, ఎన్నికలలో అక్రమాలు జరిగాయని డోనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన కమ్యూనిస్టు యువత పార్టీకి ఎలా దారిచూపిందో నేను గుర్తు చేస్తున్నాను. ఈ యువ కమ్యూనిస్టులు క్యూబాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించారు. నల్లజాతీయుల జీవన సమస్యల ప్రదర్శనల నిర్వహణకు వీరిని ఆహ్వానించారు. ఈ యువకార్యకర్తలలో ఎక్కువ మంది విద్యార్ధులు, మిగిలిన వారిలో కాలేజీ డిగ్రీలు లేని, నిరుద్యోగ లేదా ఉద్యోగాలు చేస్తున్న కార్మికులు ఉన్నారు. మరో మాటలో చెప్పాలంటే మార్పు కోరుకుంటున్న క్రమపు ఉత్పత్తే ఈ యువ కమ్యూనిస్టులు, అదే వీరిని కమ్యూనిస్టు పార్టీ , కమ్యూనిస్టు యువజన సంఘం వైపు నడిపించింది. వారు ఉద్యమంలోకి కాలేజీలు, పుస్తక క్లబ్‌లు, లేదా ఆన్‌లైన్‌లో చేరటం వంటి వాటి ద్వారా వచ్చారు, సమిష్టి విప్లవ క్రమంలో పోషించే తమ పాత్రను తెలుసుకుంటూ యువ కమ్యూనిస్టులు భాగస్వాములవుతున్నారు.మార్పు కోరుకొనే క్రమాలన్నీ భిన్నంగా ఉండవచ్చు. ఒక సమావేశానికి లేదా ఒక కార్యక్రమానికి రాలేదనో మరోకారణంతోనో యువ కార్యకర్తలను మనం వదలిపెట్ట కూడదు. సామాజిక మాధ్యమం, కరపత్రాలు, చిత్రాలు గీయటం వంటి ఏదో ఒక కార్యక్రమంలో వారు ఒక పాత్ర పోషించే విధంగా చూడాలి.
2020దశకంలో మార్పుకోరుకొనే క్రమంలో అనేక మంది యువకులు స్వీయ అధ్యయనం, ఆన్‌లైన్‌లో ఇతర వామపక్ష యువజన బృందాలతో చర్చల ద్వారా వామపక్షం వైపు వస్తున్నారు, ప్రత్యేకించి కరోనా సమయంలో క్వారంటైన్ లేదా ఇండ్లలోనే ఉన్నపుడు ఇది జరిగింది. ఈ మార్పు క్రమాన్ని అమెరికా కమ్యూనిస్టుపార్టీ, కమ్యూనిస్టు యువజన సంఘం ఆహ్వానిస్తున్నది. ఇది గందరగోళపరుస్తుందని కూడా మాకు అవగాహన ఉంది. ఉదాహరణకు ఇంటర్నెట్లో ఒక బహుళ ప్రచారం జరుగుతోంది. అదేమంటే ” తెల్లజాతి కార్మికులు విప్లవకారులు కాలేరు. ఎందుకంటే ప్రపంచ పేద దేశాలు, రంగుజాతి కార్మికుల దోపిడీ మీద వారు ఆధారపడతారు ”. నా అభిప్రాయం ఏమంటే ఇది తృతీయ ప్రపంచ సిద్దాంతాన్ని ముందుకు తెచ్చిన శ్వేతజాతి మావోయిస్టుల ప్రచారం.” మైథాలజీ ఆఫ్ ద వైట్ ప్రోలటేరియట్ ” అనే జె సాకాయి గ్రంధం చదవిన తరువాత ముందుకు తెచ్చారు. ఇది మార్క్సిస్టు వ్యతిరేకమైనదే కాదు, రంగు, జాతితో నిమిత్తం లేకుండా అన్ని ఖండాల కార్మికులు ఐక్యం కావాలని పిలుపు ఇచ్చి స్వయంగా ప్రయత్నించిన తెల్లవారైన ఐరోపాకు చెందిన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్‌కు వ్యతిరేకమైనది. రాజకీయ మార్పు విషయానికి వస్తే ఎలాంటి కార్యాచరణకు పూనుకోకుండా తెలివిగా తప్పించుకొనే సాకును ఇది అందిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే కమ్యూనిస్టు పార్టీల వంటి సంస్ధలు కార్మికులనందరినీ ఐక్యం చేయాలని చూస్తుంటే ఈ పుస్తకం చదివిన తరువాత నలుపు లేదా గోధుమవర్ణం విద్యార్ధి గానీ పోరాటంలో పాల్గొనేందుకు విముఖత చూపుతాడు. సాకీ ముందుకు తెచ్చిన నిరాశావాదం వారిని తాము మైనారిటీలమని, అమెరికాలో తెల్లజాతీయులు మెజారిటీ కనుక సోషలిజానికి అవకాశం లేదనే నిర్దారణకు వచ్చేట్లు చేస్తుంది.
వలసలుగా చేసుకోవటాన్ని, సామ్రాజ్యవాదాన్ని ఓడించాలని మార్క్సిస్టులు అంగీకరిస్తారు. అదే సమయంలో ఒక జాతి వారు విప్లవకారులు కాదని లేదా విప్లవ వ్యతిరేకులని మనం వేరు చేయకూడదు.శ్వేతజాతీయులను విప్లవ వ్యతిరేకులని, కార్మికవర్గం కాదనే స్వభావ చిత్రీకరణ చేయటం మధ్య తరగతి తీవ్రవాదంలో భాగం. దీనికి విప్లకారులు, కార్మికులు, మార్క్సిస్టు-లెనినిస్టు సిద్దాంతానికి సంబంధం లేదు. ఇప్పటికీ మీరు అంగీకరించటం లేదా ? రష్యన్లు స్లావిక్ జాతికి చెందిన వారు కనుక, స్లావ్‌లు చారిత్రకంగా ఆర్మీనియా, అజరబైజాన్, జార్జియన్లను, కాకసస్ పర్వత ప్రాంతాలను రష్యన్ సామ్రాజ్యంలో వలసవారిగా చేసుకున్నారు గనుక అక్టోబరు విప్లవాన్ని రష్యన్లు నిర్వహించకూడదని, లేదా దానికి విరుద్దంగా ఆర్మీనియన్లు, అజర్‌బైజానియన్లు,జార్జియన్లు మాత్రమే నడపగలరు అని లెనిన్ చెప్పి ఉంటే ఏమిజరిగేదో ఊహించుకోండి.ఈ మన:ప్రవృత్తిని బోల్షివిక్‌లు తలకు ఎక్కించుకొని ఉంటే ఏం జరిగేదో ఊహించుకోండి. ఎంతో దూరం అవసరం లేదు, నేను కచ్చితంగా చెప్పగలను. కార్మికవర్గ ఐక్యతను నిరోధించే ఏ ” విప్లవ ” వైఖరి అయినా అది ఏ విధంగానూ విప్లవకరమైనది కాదు.
ఇంటర్నెట్ యువ వామపక్ష వాదుల మరొక తిరోగామి వైఖరి గురించి చూద్దాం. అమెరికా కార్మికవర్గాన్ని సంఘటిత పరచేందుకు, మార్పును కోరేవారిగా మార్చేందుకు, ఐక్యపరిచేందుకు వివిధ ప్రజాస్వామిక పోరాటల్లో భాగస్వాములను చేయకుండా తక్షణ హింసాత్మక ( లేదా అంత తక్షణంగాకపోవచ్చు) మద్దతు ఇచ్చేవైపు మొగ్గుతున్నది.స్వయం ప్రకటిత యువ మావోయిస్టులు, ట్రాట్‌స్కీయిస్టులు, అరాచకవాదులు, చివరికి మార్క్సిస్టు-లెనినిస్టులమని స్వయంగా చెప్పుకుంటున్నవారు గానీ ఇలాంటి వైఖరిని తీసుకోవటాన్ని నేను గమనించాను. జనాలకు దూరంగా ఉండటం ఈ బృందాలు, వ్యక్తుల ఉమ్మడి లక్షణం, అంటే వాస్తవానికి దూరంగా ఉండటం. విప్లవ వాగాడంబరానికి ఆకర్షితులవుతున్న యువ విప్లవకారులు ఎలా ఉన్నారు? మన దేశ ప్రజాస్వామిక సంప్రదాయాలు, సంస్కృతి, సమాజం, భౌతిక పరిస్ధితుల పట్ల వారికి అవగాహన లేదు. తరువాత ఇంకొకటేమిటి, రోజాలక్సెంబర్గ్ చెప్పిన ” సంస్కరణ లేదా విప్లవం ” అవగాహనతో ప్రారంభమైతే ” విప్లవం లేదా మరింకేమీ లేదు” అనేదానికి దారి తీస్తుంది. ఎలాంటి కార్యాచరణ లేకుండా సాకులు చెప్పటానికి ఈ వైఖరి కూడా సిద్దంగా ఉంటుంది.” మన కార్మికవర్గం ఇంకా విప్లవకరంగా మారలేదు కనుక నేను కార్మికవర్గంతో చేరాల్సిన అవసరం లేదు లేదా మన కార్మికవర్గం సాయుధం అయ్యేంత వరకు మనమేమీ చేయలేము ” అనేట్లు చేస్తుంది. కానీ వాస్తవం ఏమంటే కార్మికవర్గం అంతర్యుద్దాన్ని కోరుకోవటం లేదు, లేదా మనం వారి మీద దాన్ని రుద్దుతున్నట్లు నటించాల్సిన పనిలేదు. మనం కార్మికులు, విద్యార్ధులను వారున్న చోట కలుస్తున్నాం తప్ప ఉండాలని మనం కోరుకున్న చోట కాదు. కాబట్టి రైతులు లేని ఒక దేశంలో హింసాత్మక రైతుల తిరుగుబాటు( మావోయిస్టులు వాంఛిస్తున్న) కోసం వేచి చూస్తూ మనం కూర్చునే బదులు చేయాల్సిందేమిటి ? స్ధానిక విద్యార్ధి సంఘాలు, కార్మికయూనియన్లు, కమ్యూనిస్టు పార్టీ క్లబ్ లేదా యువ కమ్యూనిస్టు సంఘం ద్వారా యువతను వర్గపోరాటాలకు ప్రోత్సహించుదాం. జనకట్టుతో కలసి పని చేసేందుకు నిరాకరించే కమ్యూనిస్టు ఒక కమ్యూనిస్టు కాదు.
ప్రజాస్వామిక పోరాటాలు అనేక రూపాల్లో ఉంటాయి. పౌరహక్కుల కోసం, యూనియన్ల కోసం, ఫాసిస్టు ప్రమాదానికి వ్యతిరేకంగా, ఇలా అనేకం. సోషలిజం కోసం జరిపే మొత్తం వర్గపోరాటాలకు ఈ పోరాటాలు తప్పనిసరి.ఈ పోరాటాలు మహిళల పౌరహక్కులు, ఎల్‌బిజిటిక్యు జనాలు, ఆఫ్రికన్ అమెరికన్స్, ఇతర అనేక అణచివేతకు గురైన సమూహాలకు సంబంధించి కావచ్చు. పెట్టుబడిదారీ వ్యవస్ధ విస్తృత దోపిడీలో ఈ బృందాలన్నీ ప్రత్యేక అణచివేతకు గురవుతున్నందున ఇవి తప్పనిసరి. ఉదాహరణకు ఒక బిలియనీరైన మహిళా సిఇఓ వివక్షకు లేదా తరచుగా కార్మికవర్గ మహిళల మాదిరి అదే విధమైన అణచివేతలో భాగంగా లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు. అందుకే మహిళా సమానత్వ సమస్య వర్గాలకు అతీతమైనది. జాత్యంహంకారానికి కూడా ఇదే వర్తిస్తుంది. నల్లజాతీయులైన కార్మికుల మాదిరే నల్లజాతీయులైన బాస్కెట్‌బాల్,ఫుట్‌బాల్ క్రీడాకారులు రోజువారీ జాతిపరమైన అణచివేతను ఎదుర్కొంటున్నారు. క్యూబా ఉదాహరణ చూపుతున్నదేమిటి ? విప్లవం తరువాత కార్మికవర్గం అక్కడ అధికారంలో ఉన్నప్పటికీ జాత్యంహంకారం అంతరించలేదు. వర్గాలకు అతీతంగా జాతి వివక్ష వ్యతిరేక పోరాటం జరుగుతుంది గనుక అది ప్రజాస్వామిక పోరాటమే. ఎల్‌బిజిటిక్యుల సమానత్వం కూడా ప్రజాస్వామ్య పోరాటాల మరో రంగమే. సోషలిస్టు దేశాలలో కార్మికులందరికీ స్వేచ్చకు హామీ ఉన్నప్పటికీ ఎల్‌బిజిటిక్యు కామ్రేడ్లు, కార్మికుల మాదిరి వారి హక్కుల విషయంలో ఎల్లవేళలా సానుకూల వైఖరితో ఉన్న రికార్డు ఉందని మనమూ మన ఉద్యమం నటిస్తే అది కపటత్వమే అవుతుంది. ఇది కూడా మనం అధిగమించాల్సిన అంశమే.
పెట్టుబడిదారీ వర్గాన్ని కూలదోసేంత వరకు ఆ తరగతికి చెందిన వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంటుంది. కనుక పెట్టుబడిదారీ విధానంలో ఈ సమస్యలపై పోరాటాలు ప్రారంభమౌతూనే ఉంటాయి. అది పికెటింగ్ కేంద్రం, పోలింగ్‌బూత్, నిరసన లేదా ధర్నా అడ్డాలు ఎక్కడైనా మనం ఈ ప్రజాస్వామిక పోరాటాల్లో పాల్గొంటాము.1960-70దశకాల్లో సాగిన పౌరహక్కుల ప్రజా ఉద్యమం గొప్ప విజయాలు సాధించింది. అది ఓటింగ్ హక్కుల కోసం లేదా ఏంజలా డేవిస్(కమ్యూనిస్టు నాయకురాలు) విడుదల కోసం కావచ్చు. ప్రజాస్వామిక ఉద్యమాలు విప్లవ వ్యతిరేకమైనవని విసిగిపోయిన యువకులు తమను తాము దూరంగా పెట్టుకుంటే ఫలితం లేదు. చివరికి మితవాద తిరోగామి శక్తులు వామపక్ష విప్లవ పదజాలాన్ని గుప్పిస్తున్నపుడూ మనం చూశాము ఇటీవల జనవరి ఆరవతేదీన అమెరికా రాజధాని( పార్లమెంట్)పై జరిగిన దాడిని ” కార్మికవర్గ – విప్లవాత్మకమైనదని ” వర్ణించినపుడు కూడా దూరంగా ఉండకూడదు. నల్లజాతీయులు, గోధుమవర్ణం వారు, మహిళలు, ఎల్‌బిజిటి వారి సమస్యలపై ఆందోళనలను విస్మరించినపుడు సమానత్వం కోసం జరిపే పోరాటాలను ప్రారంభించినపుడు కార్మికవర్గంలోని యావత్ తరగతులను విస్మరించినట్లే, ఆ తప్పిదం చేయవద్దు.
2021లో యువకులు, విద్యార్ధుల ఉద్యమాలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలలో వాతావరణ మార్పు ఒకటి. తమ తలిదండ్రులు, తాతల కంటే పర్యావరణం గురించి మరింతగా పట్టించుకోవాలి. ఎందుకంటే రానున్న ఐదు పది సంవత్సరాలలో భూ తలాన్ని రక్షించు కొనేందుకు కొట్టొచ్చినట్లుగా ఏదో ఒకటి చేయకపోతే మనం వృద్దాప్య వయస్సు వరకు చేరుకోలేము. ఈ కారణంగానే గ్రీన్ న్యూ డీల్ కోసం యువత ఆందోళనకు దిగింది, అది వాషింగ్ట్‌న్, డిసి, న్యూయార్క్, సియాటిల్ నగరాల్లో పెద్ద ఎత్తున పర్యావరణ రక్షణ ప్రదర్శనలకు దారితీసింది. పార్లమెంటులో పురోగామి సభ్యురాలు ఇల్హాన్ ఓమర్ కుమార్తె ఇస్రా హిరిసీ ఈ ప్రదర్శనలను నిర్వహించటంలో వహించిన పాత్ర కారణంగా, ఆన్‌లైన్‌లో కమ్యూనిస్టు అని చెప్పుకున్నందుకు గాను మితవాద మీడియా దారుణంగా ఆమె మీద దాడి చేసింది. అస్తిత్వ ఉద్యమాలను(ప్రజాస్వామిక పోరాటాలు) కొట్టిపారవేయకూడదనేందుకు ఇదొక పెద్ద ఉదాహరణ. హిరిసి మీద జరిగిన దానిని నల్లజాతీయులు, ముస్లింలు, యువత, కమ్యూనిజం, పర్యావరణ పరిరక్షణ ఉద్యమం మీద మొత్తంగా జరిగిన దాడిగా చూడాలి. భూగ్రహమే లేనట్లయితే వర్గపోరాటం ఎక్కడ చేస్తాము, అందువలన వీటన్నింటినీ సిద్దాంతంగా అధ్యయనం చేసేందుకు మాత్రమే సమయాన్ని వృధా చేయరాదు, ఆచరణలో పెట్టాలి.
ఈ ఏడాది యువత పాల్గొన్న మరొక ముఖ్యమైన కార్యరంగం ఉంది, చదువుకొనేందుకు తీసుకున్న రుణాల రద్దు సమస్య.కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న సమయంలో ఎన్నికల ప్రచారంలో రుణాల రద్దు గురించి జో బైడెన్ చెప్పారు. పాఠశాల, కాలేజీ ఖర్చులు, బీమా చెల్లింపులు, ఆహారం, అద్దెలు, ఇతర చెల్లింపుల కోసం విద్యార్దులు ఇబ్బందులు పడుతున్నారు. 2021 ఏప్రిల్ పీపుల్స్ వరల్డ్ (కమ్యూనిస్టు పార్టీ పత్రిక) వార్త ప్రకారం ” ఒక్కొక్కరికి జో బైడెన్ సర్కార్ గనుక 50వేల డాలర్ల రుణాన్ని రద్దు చేస్తే 84శాతం మంది పూర్తిగా రుణవిముక్తులౌతారు. మీడియా, రుణ విముక్తిని విమర్శించే వారి కేంద్రీకరణ అంతా అధిక సంపాదనా పరులకు సాయం చేయటం మీదనే కేంద్రీకృతమైంది. రుణం తీసుకున్న వారిలో నలభైశాతం మంది డిప్లొమాలు తీసుకోలేకపోయారు, తరచుగా కనీసవేతన ఉద్యోగాలలోనే ఉన్నారు.”. 2021 ఆగస్టులో ఒక్క కలం పోటుతో బైడెన్ 9.5బిలియన్ డాలర్ల విద్యార్ధి రుణాలను రద్దు చేయక ముందు పేర్కొన్న అంశమిది. ఉన్న అప్పులతో పోలిస్తే ఇది చిన్న మొత్తం, అనేక మందికి పెద్ద ఉపశమనం కలగకపోయినా కొంత మందికి విజయమే అనటంలో సందేహం లేదు. విద్యార్ధుల రుణాలను రద్దు చేసేందుకు బైడెన్‌కు అధికారం లేదు అని అమెరికన్ కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అబద్దం చెప్పిన నెల రోజుల తరువాత బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అందువలన పరిమితం కాకుండా పూర్తిగా రుణాలను రద్దు చేసేంతవరకు ఉద్యమం కొనసాగాల్సిందే. ఎందుకోసమో తెలియని యుద్దాన్ని ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు దశాబ్దాలు సాగించేందుకు ఖర్చు చేసిన మనం మన యువత వారి కాళ్ల మీద నిలిచేందుకు తోడ్పడలేమా ! యువ కార్మికులు, విద్యార్దులను మనం విస్మరించలేము. వారిని ఉద్యమాలు, మన సంఘటిత శ్రేణుల్లోకి తీసుకురావాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకొనేందుకు, విస్తృత పరచేందుకు మొత్తం మీద జరిగే పోరాటంలో యువజన సమస్య కీలకమైనది. అది సోషలిస్టు సమాజానికి పునాదులు వేస్తుంది. విప్లవకారులైన మన యువత లేకుండా సోషలిస్టు అమెరికాకు భవిష్యత్ ఉండదు.
అనువాదం, వ్యాఖ్య : ఎం కోటేశ్వరరావు. ఆంగ్లంలో మూల ఆర్టికల్‌ను చదవాలని కోరుకొనే వారికి దాని లింక్‌ను దిగువ ఇస్తున్నాను.