Tags

, , , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఒకేసారి పలు లక్ష్యాలను దెబ్బతీసే ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అగ్నిా5 తరం క్షిపణి తొలి ప్రయోగం జయప్రదంగా జరిగినట్లు ప్రధాని నరేంద్రమోడీ 2024 మార్చి 11న ప్రకటించారు. దాన్ని దివ్యాస్త్రంగా వర్ణించారు. ఈ విజయానికి కారకులైన డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.ఈ ప్రకటనతో మీడియా, సామాజిక మాధ్యమంలో పలు రకాల స్పందనలు వెలువడ్డాయి. ఒక్క క్షిపణితో చైనాలోని పలు లక్ష్యాలను దెబ్బతీయవచ్చు అని కాషాయ దళాలు నడిపే పత్రిక స్వరాజ్య ఒక విశ్లేషణను ప్రచురించింది. మిలిటరీ ఉన్మాదంతో ఊగిపోయే వారికి అలా కనిపించటంలో ఆశ్చర్యం లేదు. పరస్పర అనుమానాలు, కుట్ర సిద్దాంతాలు పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్న నేపధ్యంలో ఏ దేశానికి ఆ దేశం తన రక్షణకు అవసరమైన పాటవాన్ని సమకూర్చుకుంటున్నది, అది ప్రతిదేశానికి ఉన్న హక్కు. అందుకే మనదేశం అణుపరీక్షలు జరిపినా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పిటి) మీద సంతకం చేయకపోయినా కమ్యూనిస్టులతో సహా అందరూ మనదేశ వైఖరిని సమర్ధించారు. సరిగ్గా ఎన్నికల ముందు పరీక్ష నిర్వహించటం, దాని గురించి ప్రధాని ప్రకటించటం, దానికి చైనా వ్యతిరేకతను నూరిపోస్తూ మీడియా స్పందించటం అర్ధం కానంత బ్రహ్మవిద్యేమీ కాదు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన విజయాలు తమ ఘనతే అని రాజకీయపార్టీలు చెప్పుకోవటం ఓట్ల రాజకీయమే. ప్రధాని నరేంద్రమోడీ లాగులు లేదా నిక్కర్లు వేసుకొని తిరుగుతున్న వయస్సులోనే 1958లో అంతకు ముందు విడిగా ఉన్న కొన్ని సంస్థలను కలిపి డిఆర్‌డిఓ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సమిష్టి కృషితో అనేక విజయాలను మన శాస్త్రవేత్తలు సాధించారు, అదే క్రమం కొనసాగుతోంది. మన జాగ్రత్తలో మనం ఉండటం సమర్ధనీయమే, బస్తీమే సవాల్‌ అని ఎదుటివారి మీద తొడగొట్టటం వేరు. రెండవది ప్రమాదకరం అని ప్రపంచ చరిత్ర చెబుతున్నది.


ఓట్ల కోసం మనోభావాలను ముందుకు తేవటం, విద్వేషాన్ని నూరిపోయటం గత పది సంవత్సరాలు, అంతకు ముందు నుంచీ చూస్తున్నదే. కొన్ని వాస్తవాలను గమనించాల్సిన అవసరం ఉంది. ఐదవతరం అగ్ని క్షిపణితో నిజంగా పాకిస్థాన్‌, చైనాలను దెబ్బతీయగలమా ! కచ్చితంగా తీయగలం, ఎప్పుడు ? వాటి దగ్గర అలాంటివి లేనపుడు, ఉన్నా సన్నద్దంగా లేనపుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా ? ప్రతి దేశమూ పోటా పోటీగా ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నాయి. మనం జరిపింది తొలి పరీక్ష మాత్రమే, ఇది ఐదువేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను దెబ్బతీయవచ్చునని చెబుతున్నారు. ఇలాంటి క్షిపణులను మనకంటే ఎంతో ముందుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ సమకూర్చుకున్నాయి. మన క్షిపణి ఒకేసారి ఎన్ని బాంబులను మోసుకుపోగలదో తెలియదు, నాలుగు అంటున్నారు. మిగతా దేశాల(రష్యా శాటన్‌-2) దగ్గర 16 బాంబులు(అదే సంఖ్యలో లక్ష్యాలు) మోసుకుపోగలవి ఉన్నట్లు మీడియాలో వెతికితే వివరాలు ఉన్నాయి.మనం తొలిపరీక్ష ఇప్పుడు చేస్తే చైనా 2016నాటికే ఏడు పరీక్షలు జరిపింది, తరువాత కూడా చేస్తున్నది. చైనా వద్ద ఆధునిక డిఎఫ్‌-41క్షిపణి 12 నుంచి 15వేల కిలోమీటర్లు అంటే అమెరికాలో ఉన్న లక్ష్యాలను కూడా తాకగలదు.మనం గనుక ఎదురుదాడికి దిగి క్షిపణిని వదిలితే ఎవరూ పసిగట్టలేరని చెబుతున్నారు. ఇదే సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఏ దేశం ఎదురుదాడికి దిగినా అదే జరుగుతుంది. మనకు ఇతరులెంత దూరమో వారికి మనమూ అంతేదూరంలో ఉంటాం. దక్షిణాసియాలో తొలిసారిగా ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో పాకిస్థాన్‌ అబాబీల్‌ క్షిపణిని రూపొందించిందని గమనంలో ఉంచుకోవాలి. దాని పరిధి 2,200కిలోమీటర్లని వార్తలు. ఒకసారి పరీక్షలు మొదలైన తరువాత విస్తరించటం పెద్ద కష్టమేమీ కాదు. మీడియాలో వచ్చినట్లుగా మనమే ఎదురుదాడికి దిగితే మనకంటే బలంగా ఉన్న చైనా ఊరుకుంటుందా ? ఇప్పటికే అది భూమి,మోటారు వాహనాలు, రైళ్ల మీద నుంచి ప్రయోగించే ఎంఐఆర్‌వి క్షిపణులను కలిగి ఉంది.2019లోనే అలాంటి వాటిని మిలిటరీకి అందచేసింది. మనం పరీక్షించిన తాజా క్షిపణిని మిలిటరీకి అందించాలంటే మరికొన్ని సంవత్సరాలు పడుతుంది.


గ్లోబల్‌ ఫైర్‌ పవర్‌ అనే సంస్థ ప్రతిదేశానికి సంబంధించి 60అంశాలను పరిగణనలోకి తీసుకొని 145 దేశాలకు 2024 సంవత్సర సూచికలను ఇచ్చింది.దాని ప్రకారం 0.0000 పాయింట్లు వస్తే ఆ దేశం పక్కాగా ఉన్నట్లు. ఈ ప్రాతిపదికన మొదటి స్థానంలో ఉన్న అమెరికాకు 0.0699, రెండవదిగా ఉన్న రష్యాకు 0.0702, మూడవది చైనాకు 0.0706 రాగా నాలుగవ స్థానంలో ఉన్న మనదేశానికి 0.1023 మార్కులు వచ్చాయి. అంటే చైనా కంటే ఎంతో దిగువన ఉంది. తొలి పది స్థానాల్లో మన తరువాత దక్షిణ కొరియా, బ్రిటన్‌,జపాన్‌, టర్కీ, పాకిస్థాన్‌, ఇటలీ ఉన్నాయి. ఒక వేళ యుద్దమే వస్తే ఇప్పుడున్న ప్రపంచ రాజకీయాలు, సమీకరణల్లో చైనా, పాకిస్థాన్‌ ఒక్కటయ్యే అవకాశం, రష్యా పరోక్షంగా చైనాకు సహరించే పరిస్థితి ఉందని యుద్దం గురించి రంకెలు వేసేవారు గమనించాలి. మన దేశానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు పాకిస్థాన్ను అమెరికా ప్రోత్సహించిన కారణంగానే అది ప్రపంచ మిలిటరీలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మిలిటరీ ఖర్చుకు వెనకాడటం లేదు. దాని ఆర్థిక స్థితి దిగజారటానికి ఇది కూడా ఒక కారణం.చైనా జిడిపి, దాని విదేశీమారక ద్రవ్యనిల్వల వంటి అంశాలు మిలిటరీకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టేందుకు వీలు కల్పిస్తున్నది, మనమాపరిస్థితిలో ఉన్నామా ? మనకు వచ్చే ముప్పు గురించి స్వంత నిఘా, సమాచారాన్ని బట్టి వ్యవహరించాల్సి ఉంటుంది. అమెరికా చెప్పేదాన్ని నమ్ముకుంటే నట్టేటమునుగుతాం. గాల్వన్‌ ఉదంతాల తరువాత చైనా దళాల కదలికల గురించి అమెరికా చెప్పిన మాటలను నమ్మి ముందుగానే మన మిలిటరీ లడక్‌ పర్వతాల మీదకు వెళ్లి కూర్చున్నది.తరువాతే చైనా దళాలను మోహరించినట్లు వెల్లడైంది. ఇప్పుడు మనం కొండలనుంచి దిగిరాలేని స్థితి, ఖర్చు విపరీతంగా అవుతున్నది.చైనా వైపునుంచి కొత్తగా దురాక్రమణ యత్నాలు ఉన్నట్లు మన ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు.అరుణాచల్‌ సరిహద్దులో చైనా కొత్తగా గ్రామాలను కడుతున్నట్లు కూడా కొన్ని బొమ్మలను చూపి అమెరికా మనలను తప్పుదారి పట్టించేందుకు చూసిన సంగతి తెలిసిందే. ఆధునిక ఆయుధాలు, నిధులతో ఉక్రెయిన్‌లో రష్యా సేనలను ఒక్కదెబ్బతో వెనక్కు కొట్టగలమని అమెరికన్లు ఇతర నాటో దేశాలను నమ్మించారు. రెండు సంవత్సరాలు గడిచినా అలాంటి పరిస్థితి కనిపించటం లేదు. మధ్యలో ఇరుక్కున్న ఉక్రెయిన్‌ చావుదెబ్బలు తింటున్నది.


అంతరిక్షంలో అమెరికా మిలిటరీ ఆధిపత్యాన్నే సవాలు చేసే స్థితికి చైనా చేరుకుందనే అంశం మనదేశంలో యుద్ధం గురించి కలలు కనేవారికి తెలుసా? ఇటీవలి కాలంలో ఈ రంగంలో అమెరికాకు దగ్గరగా చైనా వచ్చిందని, అమెరికా నిశ్చింతగా లైటార్పి పడుకున్నట్లుగా కనిపిస్తోందని ఆ రంగంలో నిపుణుడు డీన్‌ చెంగ్‌ చెప్పినట్లు 2023 డిసెంబరు 13న అమెరికా ఎన్‌బిసి న్యూస్‌ పేర్కొన్నది. ప్రపంచమంతటా అంతరిక్ష ఉపగ్రహాల ద్వారా మిలిటరీ నియంత్రణలో అమెరికా ముందున్నది.వాటిని దెబ్బతీసే, పనికిరాకుండా చేసే, ఆయుధాలను చైనా తయారు చేస్తున్నదని అమెరికా రక్షణశాఖ పెంటగన్‌ నివేదికలు గగ్గోలు పెడుతున్నాయి. చైనా 2019-21 సంవత్సరాలలో తన ఉపగ్రహాల సంఖ్యను 250 నుంచి 499కి పెంచుకుందని రక్షణ నిఘా సంస్థలు పేర్కొన్నాయి. ఆధునిక నిఘా బెలూన్లు,హైపర్‌సోనిక్‌ క్షిపణులను ఉపగ్రహాలకు దిగువన, విమానాలు ఎగిరే ఎత్తుకు ఎగువన చైనా మోహరించింది. ఇటీవల ఉపగ్రహాలకు తిరిగి ఇంథనాన్ని నింపే ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించింది.భూమి లేదా గగనతలం నుంచి క్షిపణులను, లేజర్లను ప్రయోగించి అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను ధ్వంసం చేసే పరిశోధనలు కూడా చేస్తున్నదని అమెరికా నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వనికంటే కనీసం 20రెట్ల వేగంతో ప్రయాణించే క్షిపణులు భూమిని చుట్టివచ్చి లక్ష్యాలను దెబ్బతీసేవాటిని చైనా పరీక్షిస్తున్నదని కూడా అమెరికా భయపడుతోంది. అందువలన మన అగ్ని క్షిపణితో చైనాను దెబ్బతీయగలమని ఎవరైనా కలగన్నా, చెప్పినా అది వాస్తవ విరుద్దం తప్ప మరొకటి కాదు. భూతలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణుల అంశంలో రెండు దేశాల మధ్య ఉన్న తీవ్ర అంతరం కొంత మేర తగ్గుతుంది.నౌకా దళ బలాబలాల్లో మన దేశం ఎంతో వెనుకబడి ఉంది. జలాంతర్గాములు చైనా వద్ద 61 ఉండగా మనకు 18 మాత్రమే ఉన్నాయి.


ప్రతి దేశమూ తన మిలిటరీ పాటవాన్ని పెంచుకొనేందుకే చూస్తున్నది. ఈ విషయంలో పాకిస్థాన్‌ కూడా వెనుకబడిలేదు.మనకంటే ముందే 2023 అక్టోబరు చివరిలో ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానంతో అబాబీల్‌ అనే క్షిపణి ప్రయోగం జరిపినట్లు డిప్లోమాట్‌ పత్రిక నవంబరు 18న ఒక విశ్లేషణ వెలువరించింది.మనదేశం బాలిస్టిక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థ(బిఎండి)ను ఏర్పాటు చేస్తున్నందున దానికి విరుగుడుగా ఎంఐఆర్‌వి క్షిపణులను పాకిస్థాన్‌ రూపొందించినట్లు దానిలో పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ సమీపంలో నిర్మిస్తున్న బిఎండి రాడార్‌ కేంద్రం 2024లో అందుబాటులోకి వస్తుందని, మరో కేంద్రాన్ని మధ్య ప్రదేశ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా డిప్లొమాట్‌ రాసింది. నౌకల మీద కూడా ఇలాంటి రాడార్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఐఎన్‌ఎస్‌ అన్వేష్‌ అలాంటి నౌకే. ఇవి రెండు నుంచి ఐదువేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణులను పసిగట్టి మధ్యలోనే కూల్చివేస్తాయి. తొలిదశలో న్యూఢిల్లీ, ముంబై నగరాలకు రక్షణ కల్పిస్తారు.


మార్చి 11-16 తేదీల మధ్య ఎప్పుడైనా తాము మూడున్నర వేల కిలోమీటర్ల పరిధిలో క్షిపణి ప్రయోగం జరపవచ్చని ఆ పరిధిలోకి వచ్చేవారు తగు జాగ్రత్తలు పాటించాలని మన రక్షణశాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేయటం తెలిసిందే. ఆ సంగతి తెలిసే అగ్ని – 5 క్షిపణి ప్రయోగాన్ని చూసి భయపడిన చైనా తన గూఢచారి నౌకను విశాఖపట్టణానికి 260 నాటికల్‌ మైళ్ల దూరంలో లంగరు వేసినట్లు ఒక పత్రిక రాసింది.చైనా తాను జరుపుతున్న ప్రయోగాల గురించి కూడా ముందుగానే ప్రకటిస్తుంది. మనం కూడా చైనా సమీపంలోని అంతర్జాతీయ జలాల్లోకి నౌకలను పంపి నిఘావేయవచ్చు. ఎంఐఆర్‌వి సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపాదించుకొనేందుకు 2012 నుంచి మన శాస్త్రవేత్తలు పని చేస్తున్నది, మన అగ్ని క్షిపణుల సామర్ధ్యం బహిరంగ రహస్యం.గతంలో ఒక చైనా నౌక శ్రీలంకకు వచ్చినపుడు,ప్రస్తుతం మాల్దీవుల సమీపంలో ఉన్న మరొక నౌక గురించి కూడా ఇలాగే రాశారు. ఇతరుల బలాబలాలను తెలుసుకొనేందుకు మనదేశం ఎలా ప్రయత్నిస్తుందో ప్రతిదేశమూ అదే చేస్తుందన్నది కూడా అందరికీ తెలిసిందే.మనకే అలాంటి హక్కు ఉండాలి, ఇతరులకు కూడదు అంటే కుదురుతుందా ! అమెరికా విమానవాహక యుద్ధ నౌకలు, ఇతర మిలిటరీ నౌకలు నిత్యం ప్రపంచమంతటా తిరుగుతుంటాయి, అనేక ప్రాంతాల్లో లంగరు వేయటం తెలిసిందే. అవి విహారయాత్రలు చేస్తున్నట్లు చెప్పగలమా ?