
ఎం కోటేశ్వరరావు
మతోన్మాద, ప్రజావ్యతిరేక విధానాల వ్యతిరేక పోరులో హేతువాద, వామపక్ష వాదిగా గళమెత్తి, కలంతో కదనరంగంలోకి దూకిన షీరో(వీర నారి) జర్నలిస్టు గౌరీ లంకేష్. తన ప్రాణాలను తృణపాయంగా అర్పించింది. తనను ఎప్పుడైనా మతోన్మాదులు అంతం చేస్తారని తెలిసినా ఏనాడూ వెన్ను చూపని ధీశాలి. దుండగుల తూటాలు ఆమె దేహాన్ని చీల్చాయి తప్ప భావాలను కాదని దేశవ్యాపితంగా వెల్లడైన నిరసన వెల్లడించింది. నేనూ గౌరినే ఏం చేస్తారో చేయండి అంటూ ఎలుగెత్తి చాటారు. గౌరి నివాసం ముందున్న సిసిటీవీలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సెప్టెంబరు ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల సమయంలో తన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన ఆమెపై మోటారు సైకిల్‌పై వచ్చిన దుండగుడు తుపాకితో కాల్చిచంపాడు. సమీపంలో ఇంకా ఎవరైనా వున్నారా అన్నది విచారణలో తేలాల్సి వుంది. మతోన్మాద వ్యతిరేక, హేతువాద, సంస్కరణవాదం, వామపక్ష భావాల నరేంద్ర దబోల్కర్, గోవింద పన్సారే, కలుబుర్గి సరసన గౌరి చేరింది. అభ్యుదయం, హేతువాదం, ప్రజానుకూల జర్నలిస్టు కలం, గళం పరంపరలో దేశంలో మతోన్మాదుల తూటాలకు బలైన తొలి మహిళగా చెప్పవచ్చు. తన ప్రాణాలకు ఏక్షణంలో అయినా ముప్పు వుందని, కొద్ది రోజులుగా ఎవరో వెంటాడుతున్నారని పసిగట్టినప్పటికి ప్రభుత్వంవైపు నుంచి ఎలాంటి సాయం ఆమె కోరలేదు. అలాంటి రక్షణలు ప్రాణాలను కాపాడలేవు అనే లోకానుభవంతో ఆమె ఆ నిర్ణయానికి వచ్చి వుండవచ్చు.
కాషాయ పరివారం, వారితో అంటకాగుతున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు తప్ప గౌరి హత్యపై దేశవ్యాపితంగా జర్నలిస్టు, ప్రజా సంఘాలు, వామపక్ష, అభ్యుదయ పార్టీలు, సంస్ధలు, శక్తులు తీవ్రనిరసన తెలిపాయి. నిందితులను గట్టిగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. అనేక మంది సీనియర్ జర్నలిస్టులు దేశంలో నెలకొన్న పరిస్ధితుల తీరుతెన్నుల పట్ల నిరసన, ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో జర్నలిస్టుల ప్రాణాలు తీయటం కొత్త కాదు. మన దేశంలో కూడా అనేక మంది బలయ్యారు.రాజకీయ నేతల, గూండాల, మాఫియాల అవినీతి అక్రమాలను బయట పెట్టే క్రమంలో జర్నలిస్టులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని స్ధితిలో గడుపుతున్నారు. గత నాలుగు సంవత్సరాలలో (2013 నుంచి) ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలలో 22 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు.అనేక మందిపై హత్యాయత్నం జరిగింది. దేశమంతా గౌరీ లంకేష్ హత్యకు నిరసన తెలుపుతున్న సమయంలోనే బీహార్‌లో పంకజ్ మిశ్రా అనే జర్నలిస్టుపై అధికారపక్ష ఎంఎల్‌ఏ అనుచరులు తుపాకులతో కాల్పులు జరిపారు.

జర్నలిస్టులపై జరిగిన దాడుల కేసులను పరిశీలిస్తే అవి కాంగ్రెస్, బిజెపి,జెడియు, ఎస్‌పి,టిడిపి మరొకటా అన్నది పక్కన పెడితే ఏ పార్టీ అధికారంలో వున్నప్పటికీ దుండగులు చెలరేగిపోతున్నారు. వత్తిడి కారణంగా కేసులు నమోదు చేయటమే తప్ప వాటిలో ఎలాంటి పురోగతి వుండటం లేదు. డేరా బాబా గుర్మీత్ హత్య చేయించిన సిర్సా జర్నలిస్టు రామచంద్ర ఛత్రపతి కేసు పదిహేను సంవత్సరాలుగా నడుస్తూనే వుంది. ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు. అనేక వుదంతాలలో చార్జిషీట్లు పెట్టటంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండు సంవత్సరాల క్రితం కర్ణాటకలో మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురైన కలుబుర్గి కేసులో ఇంతవరకు నిందితులెవరో తేలలేదు, దబోల్కర్, గోవింద్ పన్సారే కేసులలో నిందితులు గోవా కేంద్రంగా పనిచేసే హిందూత్వ సనాతన సంస్ధకు చెందిన వారని సిబిఐ కేసులు దాఖలు చేసింది. ఇలాంటి వుదంతాలలో నేరగాళ్లకు శిక్షలు పడటం ఎంత అవసరమో అంతకంటే ఇటువంటి ధోరణులను ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలు, శక్తులను ఎదుర్కోవటానికి సంఘటితం కావటం అంతకంటే ముఖ్యం. అసహనం, విమర్శలను తట్టుకోలేని ధోరణి, భిన్నాభిప్రాయాలను సహించకపోవటం దేశంలో క్రమంగా మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెరుగుతున్నాయి. అసమ్మతి, భిన్నాభిప్రాయాన్ని గౌరవించటం ప్రజాస్వామ్య లక్షణం. నిత్యం భావ ప్రకటనా స్వేచ్చ హక్కు గురించి పారాయణం చేసే వారు తమ దాకా వచ్చే సరికి హరిదాసు-ధర్మపత్ని-వుల్లిపాయ కథలో మాదిరి వ్యవహరిస్తున్నారు.నేతి బీరలో నెయ్యి మాదిరి తయారవుతున్నారు.

వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు బలహీనంగా వున్న కర్ణాటకను దక్షిణాదిలో మతోన్మాద శక్తులు ఒక ప్రయోగశాలగా చేసుకున్నాయి. అక్కడి ప్రాంతీయ పార్టీల అవకాశవాదం, అనేక హిందూ మతసంస్ధల మద్దతు కారణంగా కారణంగా బిజెపి ఆ రాష్ట్రంలో బలపడాలని చూస్తోంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల పూర్వరంగంలో అనేక వివాదాస్పద, రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఆ పార్టీ రూపకల్పన చేసింది. ఈ పూర్వరంగంలో గౌరీ వంటి అనేక మంది మతోన్మాదశక్తులకు వ్యతిరేక గళం విప్పుతూ కంట్లో నలుసుగా మారారు. వాటన్నింటిని ఆమె తన పత్రికలో ఎప్పటి కప్పుడు రాస్తూ హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆమెను కొంత మంది అనుసరించారని, రాకపోకలను నిర్ధారించుకున్నారని ఆమె హత్య అనంతరం వెల్లడైన సమాచారాన్ని బట్టి సరిగ్గా ప్రముఖ రచయిత ఎంఎం కలుబర్గిని హత్య చేసిన రోజే గౌరిని కూడా చంపివేయాలని పధకం వేశారా అనిపిస్తోంది. సరిగ్గా రెండు సంవత్సరాల ఐదు రోజుల తరువాత వారి పధకం నెరవేరింది. ఇద్దరి హత్యలకు అనేక సామీప్యాలున్నాయి.కుటుంబ సమస్యల కారణంగా కలుబర్గిని హత్య చేశారని వెంటనే ప్రచారం జరిగింది. గౌరిని నక్సలైట్లు చేసి వుండవచ్చని ప్రచారం చేశారు.
అనేక ప్రాంతాలలోని కోర్టులలో తప్పుడు కేసులు బనాయించటం మతోన్మాద శక్తులు అనుసరించే ఎత్తుగడలలో ఒకటి. ఎవరైనా పదులకొద్దీ కేసులకు హాజరుకావటం మామూలు విషయం కాదు. అయితే కోర్టులున్న ప్రతిచోటా అలాంటి కేసులను వుచితంగా చేపట్టటానికి మతశక్తులకు లాయర్లు వున్నారు. లుబుర్గి హత్య జరిగే నాటికి ఆయనపై ఇరవై వరకు వివిధ ప్రాంతాలలో పరువు నష్టం కేసులు దాఖలై వున్నాయి. అదే విధంగా గౌరి మీద కూడా(15) వున్నాయని ఆమె న్యాయవాది వెంకటేష్ హూట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె కోర్టు కేసులకు వెళ్లిన ప్రతి చోటా కోర్టు వెలుపల సభలు, సమావేశాలు జరపటానికి అ అవకాశాలను వినియోగించుకొనే వారని ఆయన తెలిపారు. గోవింద్ పన్సారే, నరేంద్ర దబోల్కర్, కలుబర్గిని ఎలాంటి నాటు తుపాకితో కాల్చి చంపారో సరిగ్గా అలాంటిదానితోనే గౌరిని కూడా చంపారు.నాలుగు వుదంతాలలోనూ దుండగులు మోటారు సైకిళ్లనే వుపయోగించి దగ్గరినుంచి కాల్చారు.పన్సారే, దబోల్కర్ కేసులలో ముద్దాయిలుగా తేలి పరారీలో వున్న ఒకడు 2009 గోవా పేలుళ్ల వుదంతంలో కూడా వున్నాడు.పన్సారే కేసులో ప్రధాన నిందితుడిగా వున్న సమీర్ గైక్వాడ్ బాల్యస్నేహితుడైన రుద్రపాటిల్ కలుబుర్గి కేసులో అనుమానితుడు, పరారీలో వున్నాడు.

హిందూత్వ శక్తులు 2004 నుంచి గౌరిని బెదిరిస్తున్నాయి. కేసులు బనాయిస్తున్నాయి.2016 నవంబరు 28న హుబ్లి జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆమెకు పరువు నష్టం కేసులో ఆరునెలల జైలు, జరిమానా విధించారు. అదే రోజు ఆమె బెయిల్ తీసుకొని సెషన్స్ కోర్టుకు అప్పీలు చేయాలని నిర్ణయించారు. తప్పు చేస్తే జర్నలిస్టులైనా మరొకరైనా శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతర జర్నలిస్టులు దీనిని గమనంలో వుంచుకోవాలంటూ బిజెపి ఐటి విభాగ ప్రతినిధి జర్నలిస్టులను ఆ సందర్భంగా బెదిరించాడు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే 2008లో లంకేష్ పత్రికలో ప్రచురించిన ఒక వ్యాసం తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిందంటూ సంపాదకురాలిపై ధార్వాడ బిజెపి ఎంపీగా వున్న ప్రహ్లాద్ జోషి, బిజెపి స్ధానిక నేత వుమేష్ దుషి క్రిమినల్ పరువు నష్టం కేసులు దాఖలు చేశారు. కోర్టు తీరు తెన్నుల గురించి తాను ఎలాంటి ఆందోళనకు గురికాలేదని, ఆ కేసును బిజెపి నేతలు, మద్దతుదార్లు వుపయోగించుకున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగించిందని గౌరీ వ్యాఖ్యానించారు. తాను జైలుకు పోతానని ఆశించిన వారందరికీ నిరాశ ఎదురైందని అన్నారు. ‘అదొక పెద్ద అంశమని నేను భావించలేదు, బిజెపి ఐటి విభాగం దీనినొక ఆయుధంగా చేసుకొని జర్నలిస్టులను బెదిరించటమే విభ్రాంతి కలిగించింది’ అన్నారు. భావ ప్రకటనా స్వేచ్చ దేశంలో ఏ స్ధితిలో వున్నదో తన వుదంతం వెల్లడించిందన్నారు. అధికారంలో వున్న వారి భావజాలాన్ని వ్యతిరేకించిన లేదా విబేధించిన వారి నోరు నొక్కేందుకు చట్టాన్ని వినియోగించుకోవటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఈ ధోరణి ఎంఎం కలుబుర్గి హత్య అనంతరం పెరుగుతోందని చెప్పారు. ఈ హత్యను సమర్ధిస్తూ భజరంగ్ దళ్ కార్యకర్త భువిత్ షెట్టి హిందూయిజాన్ని విమర్శించిన వారు కుక్క చావు చస్తారంటూ ట్వీట్ చేశాడన్నారు. గతేడాది హరీష్ పూజారి అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు, హరీష్‌ను ఒక ముస్లింగా పరిగణించి హత్య చేశారు.
గౌరీ లంకేష్‌పై కేసు వివరాల్లోకి వెళితే బిజెపి కార్యకర్తలు తనను మోసం చేశారంటూ ఒక నగల వ్యాపారి బిజెపి ఎంపీ జోషీ దగ్గరకు వెళ్లారు. ఆయన తమ కార్యకర్తలను సమర్ధించి న్యాయం చేయకపోవటంతో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వ్యాపారి హెచ్చరించాడు. ప్రచురించిన వార్త సారాంశం ఇది. దీనిలో జోషి పరువుకు నష్టం కలిగించే అంశమేదీ లేదని, ఇదే వార్తను ఇతర పత్రికలు కూడా ప్రచురించాయని, అయినప్పటికీ తనను మాత్రమే లక్ష్యంగా చేసుకొని కేసు దాఖలు చేసినట్లు గౌరీ అన్నారు. తాను వార్తను ప్రచురించిన తరువాత జరిగిన ఎన్నికలలో జోషీ విజయం సాధించారని అలాంటపుడు పరువు పోవటం అనే ప్రశ్న ఎక్కడుందని అన్నారు. దుషీ విషయానికి వస్తే అతని మీద అనేక కేసులు దర్యాప్తులో వున్నాయని, పోవాల్సిన పరువేదో ఇప్పటికే పోయిందని, తమ పత్రికలో రాసిన వార్తతో అదనంగా పోయేదేమీ లేదని ఆమె వ్యాఖ్యానించారు.
అంతకు ముందు 1994లో హుబ్లీ ఈద్‌గాలో జాతీయ జెండాను ఎగురవేసి మతకొట్లాటలను రెచ్చగొట్టిన వుమాభారతిపై పెట్టిన కేసును వుపసంహరించేందుకు గౌరి తిరస్కరించారు.గత కొంత కాలంగా కర్ణాటకలో ఒక బలమైన సామాజిక తరగతిగా వున్న లింగాయత్‌లు తాము బసవన ధర్మాన్ని పాటించేవారం తప్ప హిందువులం కాదని, తమను ఒక ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానాలు చేసి సభలు జరుపుతున్నారు. గౌరి ఒక హేతువాది అయినప్పటికీ బసవన చెప్పిన అనేక అంశాలు తన భావాలకు దగ్గరగా వున్నందున తాను వారి అభిప్రాయాన్ని సమర్ధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది కూడా ఆర్‌ఎస్‌ఎస్ మత శక్తులకు కంటగింపుగా మారింది. కొన్ని పార్టీలను నిషేధించాలని కోరుతూ బిజెపి చలో మంగళూరు పేరుతో సెప్టెంబరు ఐదవ తేదీన ఒక రెచ్చగొట్టే కార్యక్రమం చేపట్టింది. దానికి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమాన్ని గౌరి తీవ్రంగా విమర్శించారు.(అదే రోజు ఆమెను దుండగులు బలిగొన్నారు) అంతకు ముందు నెలలోనే బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా కర్ణాటకలో పర్యటించి వెళ్లారు.

రెండు సంవత్సరాల క్రితం కలుబర్గిని హత్య చేసిన తరువాత కర్ణాటకలోని అనేక మందికి అదే గతి పడుతుందనే బెదిరింపులు వచ్చాయి.ఆ సందర్భంగా గౌరి,మరికొందరు ఒక జాబితాను తయారు చేసి ఎవరెవరిపై ఎన్నిసార్లు మతశక్తులు విద్వేష ప్రచారం, దాడులు చేశాయో, ఎవరికి ప్రాణహాని వుందో వెల్లడించారు.వారిలో మొదటి వ్యక్తిగా హేతువాది కెఎస్ భగవాన్,రచయితలు యోగేష్ మాస్టర్,బంజగారే జయప్రకాష్, తాను నాలుగవదానినని వెల్లడించారు. మతశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కర్ణాటక కోము సౌద్ర వేదికను ఏర్పాటు చేయటంలో గౌరి ముఖ్యపాత్ర పోషించారు.
నీ స్నేహితులను చూస్తే నువ్వు ఎలాంటి వాడివో చెప్పవచ్చన్నది ఒక నానుడి. దాన్ని కొద్దిగా మార్చి నువ్వు సామాజిక మీడియాలో ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తే నీవెలాంటి వాడివో చెప్పవచ్చన్నది న్యూ నుడిగా చెప్పవచ్చు. ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్న కొంత మంది ట్వీట్లు గౌరి హత్యను సమర్ధించేవారిగా వున్నట్లు తేలటంతో, అసలు నరేంద్రమోడీని అనుసరించటం మానివేయాలనే ప్రచారం ప్రారంభమైంది. అసలే అన్ని రంగాలలో నరేంద్రమోడీ సర్కార్ విఫలం అయినట్లు అనేక అంశాలు వెల్లడిస్తున్నాయి. మీరు కన్న కలలను నిజం చేసేందుకు చేపట్టిన ఈచర్యకు యాభై రోజులు ఓపిక పట్టండి, ఫలితాలు కద్దనిపించకపోతే నన్ను వురి తీయండి అని మోడీ చెప్పిన పెద్ద నోట్ల రద్దు ఘోరంగా విఫలమేగాక దేశానికి నష్టదాయకంగా మారిందని రుజువైంది. దాని గురించి తేలు కుట్టిన దొంగ మాదిరి ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. ఈలోగా నరేంద్రమోడీ ఎలాంటి వారిని అనుసరిస్తున్నదీ వెల్లడి అయింది. దాంతో నష్ట నివారణ చర్యగా బిజెపి ఐటి విభాగం రంగంలోకి దిగింది. మోడీ ఎవరినైనా అనుసరిస్తున్నారంటే అర్ధం వారందరి ప్రవర్తన సరైనదే అని నిర్ధారణ పత్రం ఇవ్వటంగా భావించరాదని, ఎవరేం చేస్తారో ముందుగా ఎవరు వూహిస్తారంటూ, అనేక అవినీతి ఆరోపణలున్న రాహుల్ గాంధీని కూడా మోడీ అనుసరిస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు. గౌరి హత్యను సమర్ధించేవారి వైఖరి తప్పని ఒక్క ముక్క కూడా ఆప్రకటనలో లేకపోవటం గమనించాల్సిన అంశం.
గౌరీ హత్య వార్త ఇంకా లోకానికి పూర్తిగా తెలియక ముందే దానితో తమకేమీ సంబంధం లేదని హత్య జరిగిన కొద్ది నిమిషాలలోనే ఆర్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. ఎవరు చంపారో తెలియకుండా హిందుత్వ సంస్ధలకు దానిని ఆపాదించవద్దని కొందరు ప్రచారం ప్రారంభించారు. కొందరు చేసిన పనులకు మొత్తం హిందువులకు ఆపాదించటం ఏమిటి అని మరి కొందరు, కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ వారిని హత్యచేసినపుడు ఈ మాదిరి స్పందన ఎందుకు వ్యక్తపరచరని మరి కొందరు, ఆ కోవకు చెందిన వారే నక్సలైట్ల అంతర్గత తగాదాలలో భాగంగా ఆమెను హత్య చేశారని, కర్ణాటక ముఖ్య మంత్రి సిద్దరామయ్య అవినీతిపై కథనాన్ని రూపొందిస్తున్న సమయంలో హత్యకు గురయ్యారని, ఇలాంటి ప్రచారం మొదలు పెట్టిన వారందరూ విషయాన్ని పక్కదారి పట్టించే యంత్రాంగంలో భాగం లేదా వారి వలలో పడ్డారన్నది స్పష్టం. ఏ ఆధారం లేదా నిర్ధారణ ప్రకారం నక్సలైట్లో, మరో కారణంతోనే హత్యచేసినట్లు కొందరు చెప్పినట్లు ? హిందూత్వ సంస్ధలు, చడ్డీవాలాలకు(ఆర్‌ఎస్‌ఎస్) వ్యతిరేకంగా ఆమె వ్యవహరించకుండా వుంటే ఇది జరిగేది కాదని, ఆమె నా సోదరి వంటిది కానీ ఆమె రాతలను తాను అంగీకరించనని బిజెపి మాజీ మంత్రి జీవరాజ్ చేసిన ప్రకటనకు అర్ధం ఏమిటి? హిందుత్వ అంటే హిందూమతోన్మాదులకు పర్యాయపదంగా వాడుతున్న పదం తప్ప మొత్తం హిందువుల గురించి చెబుతున్నది కాదు. దానిని మొత్తానికి ఆపాదిస్తున్నారని చెప్పటం వక్రీకరణ. కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ వారిని హత్య చేసినపుడు ఎందుకు స్పందించరని ఆమాయకత్వం నటిస్తూ అడిగే ప్రశ్న ఒకటి. అక్కడ వారేమైనా తపస్సు చేసుకొనే మునుల్లా వున్నారా? పచ్చి గూండాల మాదిరి చేస్తున్న హత్యలు దాస్తే దాగేవా? ఎక్కడా లేనివిధంగా అక్కడే ఎందుకు హత్యకు గురవుతున్నారు అంటే కమ్యూనిస్టులను అడ్డుకొంటున్నందుకు అంటారు.పేరుకు సాంస్కృతిక సంస్ధ, కమ్యూనిస్టులు రాజ్యాంగబద్దంగా పనిచేస్తున్నారు, వారిని అడ్డుకోవాల్సిన కర్తవ్యం వారెందుకు భుజానవేసుకున్నట్లు? కమ్యూనిస్టుల మీద ఆర్‌ఎస్‌ఎస్‌వారు కత్తులు ఝళిపిస్తుంటే కమ్యూనిస్టులు గులాబీలు విసురుతారా ?
ఎవరేమన్నారు ?
కేంద్ర ప్రభుత్వ పరోక్ష మద్దతుతో మితవాద శక్తులు పెంచి పోషించిన విపరీత అసహన సంస్కృతికి మరో రుజువు గౌరీ లంకేష్ హత్య. నాలుగు హత్యలు ఒకే తీరునజరగటం అదే విధంగా వారి సారూప్యతను ఎవరూ చూడకుండా వుండలేరు. గోవింద పన్సారే ఒక కమ్యూనిస్టు, నరేంద్ర దబోల్కర్ ఒక హేతువాది, ఎంఎం కలుబుర్గి ఒక సంస్కరణవాది, గౌరీ లంకేష్ జంకు గొంకులేని ఒక జర్నలిస్టు, సామాజిక కార్యకర్త. భారత్‌లో మత ఫాసిస్టుల లక్ష్యం ఎవరో ఇది చూపుతున్నది. అయితే బెదిరింపులు లేదా హత్యలు స్ధిరచిత్తంతో వుండే వారి గళాలను, మార్పును కోరుకొనే వారిని నిలువరించలేవు. మన లౌకిక, సోషలిస్టు విలువలు, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను నులిపివేయాలని ప్రయత్నించే చీకటి శక్తులతో పోరాడాలనే మన నిర్ణయాన్ని ఇలాంటి ప్రతి పిరికి చర్య మరింత గట్టిపరుస్తుంది.
కె సచ్చిదానందన్
గౌరి హత్య ఒక వ్యక్తిని హత్య చేయటం కంటే పెద్దది, అది భావ ప్రకటనా స్వేచ్చ,విబేధించే హక్కు,ప్రజాస్వామిక పౌరసత్వాలపై జరిగిన దాడి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది భావజాలాల సంఘర్షణ. మా దారికి రాకపోతే నీ అంతం చూస్తామని చెప్పటమే ఈ హత్య. దేశ ప్రజాజీవనంలో ప్రముఖ పాత్రపోషించే మహిళలకు ఇదొక ప్రమాదకర హెచ్చరిక. ఆమెను తిరిగి తీసుకురాలేము కానీ విమర్శకులు, నిరసన వ్యక్తం చేసే వారిపై ప్రత్యక్ష హింసాకాండతో ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టాలని చూసే పాలకులకు ప్రతిఘటన,తిరస్కరణను రెట్టింపు చేస్తుంది.
అనన్య వాజ్‌పేయి
భారతీయ పౌరుల హత్యలను చూస్తూ వున్న మీరు ఏ దేశానికి చెందిన వారని కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలచుకున్నాను. ఈ రక్తపాతాన్ని ఆపుతారా లేక కొనసాగనిస్తారా? మీరు చర్య తీసుకొనేందుకు ఇంకా ఎన్ని శవాలు లేవాలి.ఈ దేశం మహాత్మాగాంధీది, ఆయన అంతేవాసులు, భావ ప్రకటనా స్వేచ్చకు హామీ ఇచ్చిన జవహర్‌లాల్ నెహ్రూది. చరిత్ర నుంచి వారి పేర్లను తుడిచి వేసే పనిలో మీరు తీరికలేకుండా వున్నారు, కానీ మీరు స్వేచ్చను హరించలేరు.
నయనతార సెహగల్
గౌరి దారుణ హత్యను బిజెపి ఖండిస్తున్నది. ఒక జర్నలిస్టు లేదా మావోయిస్టు మరియు నక్సలైట్ల హత్యలను ఖండించాల్సిందే, వాటికి వ్యతిరేకంగా గొంతెత్తి, గట్టిగా ఖండిస్తున్న నా వుదారవాద స్నేహితులందరూ కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్ లేదా కేరళలో బిజెపి కార్యకర్తలను అనేక మందిని హత్య చేస్తుంటే ఎందుకు మౌనంగా వుంటున్నారని ప్రశ్నిస్తున్నా?
రవి శంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
గౌరి హత్య వెనుక నక్సల్స్ హస్తం వుందని అనుమానిస్తున్నా. అది కావచ్చు, కాకపోనూ వచ్చు.ఆమె పూర్వరంగం దృష్ట్యా ఈ చర్య మితవాద వుగ్రవాదులదీ కావచ్చు లేదా మావోయిస్టులదీ కావచ్చు
ఇంద్రజిత్ లంకేష్( గౌరి సోదరుడు)
నక్సల్స్‌కు సంబంధం వుందని నేను అనుకోవటం లేదు. ఆమె భావజాలం మితవాదశక్తులకుతీవ్ర వ్యతిరేకమైనది కనుక వారి పనే అని నేను చెప్పదలచుకున్నాను. ఇది వ్యక్తిగతమైనది కాదని నాకు తెలుసు. ఇది మౌలికంగా ఒక ఆలోచనను హతమార్చటం. వారు ఒక ఆలోచన, ఒక వుద్యమాన్ని అంతం చేయాలని ఆలోచించారు.
కవితా లంకేష్( గౌరి సోదరి)
బెంగాల్‌లో హిందువులు మరియు కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ వారు వధించబడుతుంటే ఆమె, ఆమె వంటి ధైర్యవంతమైన జర్నలిజం ఎక్కడా కనపడలేదు. ఆ లం…పట్ల ఏ మాత్రం సానుభూతి లేకుండా శరీరాన్ని చీల్చివేసి, ఆపార్ట్‌మెంట్‌ను కూడా కూల్చివేసి వుండాల్సి వుంది.ఆమె, ఆమె వంటి జర్నలిస్టులనబడే సాగరిక ఘోష్, శోభాడే, అరుంధతీరాయ్, కార్యకర్తలు కవితా కృష్ణన్,షీలా రషీద్, వుమర్ ఖాలిద్, కన్నయ్య కుమార్ వంటి వారికి ఇదే తగినది, వారిని లేపేయాల్సిన జాబితాలో పైన పెట్టాలి.
జర్నలిస్టులు, కార్యకర్తల ముసుగులో వున్న జాతి వ్యతిరేకులకు గౌరీ లంకేష్ కాల్చివేత ఒక వుదాహరణగా చేద్దాం. ఇటువంటి హత్య చివరిదని భావించటం లేదు, జాతి వ్యతిరేకులందరినీ వరుసగా లేపేసే కార్యక్రమం వుండాలి
( రెండు ఫేసుబుక్ పోస్టులలో విక్రమాదిత్య రానా పేరుతో వున్న అంశాలివి.హిందూత్వ శక్తులు సామాజిక మాధ్యమంలో పెడుతున్న పోస్టుల సారాంశమిదే. అలాంటి వారిని, వారి పోస్టులను నరేంద్రమోడీ అనుసరిస్తున్నారు)

నువ్వు అనుసరించేవారెవరో చూస్తే నువ్వేంటో తెలుస్తుంది
తమ భావజాలంతో విబేధించే వారిపై ద్వేషం ఎలా వెళ్లగక్కుతున్నారో, ఎలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారో దిగువ వుదాహరణ చూస్తే అర్ధం చేసుకోవచ్చు. ‘అనేక మంది గౌరీ లంకేష్ గురించి వ్యతిరేకంగా సానుకూలంగా పోస్టులు పెట్టారు.నేను ఎన్నడూ గౌరీ లంకేష్‌ను కలుసుకోలేదు, ఆమె గురించి వినలేదు, ఈ ట్వీట్ చేసేంత వరకు నేను ఒక అనామకుడిని. కొంత మంది దీనికి రాజకీయ రంగు పులిమి వివాదాన్ని సృష్టించారు. ఇప్పుడు నాకు గుర్తు తెలియని ఫోన్లు వస్తున్నాయి, అభినందిస్తున్నవారు, నిందిస్తున్నవారూ వున్నారు ‘ అని చెప్పాడు సూరత్‌కు చెందిన 38 సంవత్సరాల బట్టల వ్యాపారి నిఖిల్ దధిచ్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అతనితో మాట్లాడి వార్త ప్రచురించింది) కొద్ది రోజుల క్రితం తన ట్విటర్ ఖాతా వివరాలలో ఇతర విషయాలతో పాటు ప్రధాని నరేంద్రమోడీ అనుసరించే గౌరవం పొందిన వ్యక్తిని అని రాసుకున్నాడు. గౌరీ గురించి ఏమీ తెలియకపోయినా కొంతమంది పెట్టిన పోస్టులను చూసి అతగాడు గుజరాతీలో పెట్టిన పోస్టులో ‘ ఒక లం…, ఒక కుక్క చచ్చింది, పందులు ముక్త కంఠంతో గోల చేస్తున్నాయి ‘ అని రాశాడు. ఇది ఒక సాధారణ ట్వీట్ అని కూడా ఎక్స్‌ప్రెస్ విలేకరితో చెప్పుకున్నాడు. పెళ్లాం, ఇద్దరు పిల్లలతో కుటుంబం వున్న ఒక వ్యక్తి సంస్కారం ఇది. ఒక వ్యక్తి గురించి తనకేమీ తెలియకపోయినా గుడ్డిగా తోటివారితో కలసి రాళ్లు వేసే ఇతగాడు ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుడు, రోజూ శాఖలకు వెళుతుంటాడట. ఇలాంటివి చూసినపుడు నువ్వు మనిషివా ఆర్‌ఎస్‌ఎస్ వాడిగా అని ప్రశ్నించటం సహజం. సంఘపరివార్ నుంచి ఒక సందేశం ఏదైనా వెలువడితే దాని మంచి చెడ్డలతో నిమిత్తం లేకుండా ప్రచారం చేయాలన్న ఆదేశం లేదా పధకం లేకపోతే ఇలాంటివి ఎందుకు జరుగుతాయన్న ప్రశ్న సహజంగానే తలెత్తుంది. ఏకత, శీలము అంటూ నేర్పేది, నేర్చుకుంటున్నది ఇలాంటివా? ఇంతటి ఘనకార్యం చేసిన ఇతగాడిని అనుసరించే వారు మూడు రోజుల్లో పెరిగారంటే దేశంలో ద్వేష పూరిత ధోరణులు ఎంత వేగంగా విస్తరిస్తున్నాయో అర్ధం చేసుకోవచ్చు.ఈ ఘనుడిని ప్రధాని నరేంద్రమోడీ అనుసరిస్తున్నాడని మీడియాలో గుప్పుమనటంతో తన వివరాల నుంచి ప్రధాని మోడీ అనుసరిస్తున్న గౌరవం పొందిన వాడిని అనే దానిని తొలగించి హిందూ జాతీయవాదని అని ప్రకటించుకున్నాడు. అంటే హిందూ జాతీయవాదులంటే ఎలాంటి వారో స్వయంగా ప్రకటించుకున్నాడు.
ఈ ఘనుడిని అనుసరించేవారిలో ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, వుత్తర గుజరాత్ బిజెపి మీడియా విభాగనేత పరాగ్ షేత్ కూడా వున్నారు. దధీచ్ ట్వీట్ గురించి అడిగిన ప్రశ్నకు పరాగ్ స్పందిస్తూ ‘ మీరు ట్వీట్ అనంతరం వెలువడిన వ్యాఖ్యలను దానికి జోడిస్తే అప్పుడు నేను అదొక అసహ్యకరమైన ట్వీట్ అని తీవ్రంగా ఖండించాలంటాను’ అన్నాడు. అయినప్పటికీ నేను ట్విటర్‌పై అతనిని అసుసరించటం మానుకోబోవటం లేదు. సామాజిక మీడియాలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనుసరించటం అంటే రెండోవారి ప్రవర్తనపై సర్టిఫికెట్ ఇచ్చినట్లు కాదు.సామాజిక మీడియాలో జరుగుతున్నదాని ప్రకారం ఒకసారి ఎవరైనా ఒకరిని అనుసరిస్తే తరువాత అనుసరించకపోవటం అంటూ వుండదు.’ అని సమర్ధించుకున్నాడు.
లాటిన్ అమెరికా అనుభవాలు
1970,80 దశకాలలో లాటిన్ అమెరికాలోని వామపక్ష భావజాలం, మానవహక్కుల వుద్యమకార్యకర్తలను పూర్తిగా నిర్మూలించేందుకు అమెరికా సిఐఏ ఆపరేషన్ కండోర్ పేరుతో పెద్ద హంతక కార్యక్రమాన్ని అమలు జరిపారు. ఒక అంచనా ప్రకారం చిన్న పెద్ద నాయకులు అలాంటి వారు 50 వేల మంది అదృశ్యం లేదా హత్యలకు గురయ్యారు. ఇప్పటికీ ఎన్నో వేల మంది విషయం విడిపడని రహస్యంగానే వుంది. ఒక్క అర్జెంటీనాలోనే అలాంటి వారు ఏడు నుంచి 30వేల మంది వరకు వున్నారని అంచనా. మన దేశంలో కూడా అదే దశకాలలో తలెత్తిన వామపక్ష వుగ్రవాదులను అణచేందుకు పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయించారు. అందుకు పాల్పడిన పోలీసులకు అవార్డులు, రివార్డులు ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు. ఇదొక భాగమైతే తమ చేతికి మట్టి అంటకుండా తమ భావజాల వ్యతిరేకులను అంతం చేయించేందుకు కిరాయి మూకలను వినియోగించిన అమెరికా సిఐఏ, ఇజ్రాయెల్ మొసాద్ పద్దతులను మన దేశంలో కూడా అమలు చేస్తున్నట్లు గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కొన్ని వుదంతాలు స్పష్టం చేశాయి. జర్నలిస్టుల హత్యలకు కూడా అదే పద్దతిని ఆయాశక్తులు అనుసరించినట్లు చెప్పవచ్చు. లాటిన్ అమెరికా దేశాల్లో ఇలాంటి హత్యలకు పాల్పడిన శక్తులు వాటిని పెంచి పోషించిన పాలకుల పేర్లను ప్రస్తావించటానికి కూడా మీడియా ముందుకు రాలేదు. అత్యధిక సందర్భాలలో నియంతల, సిఐఏ కధనాలకే ప్రాధాన్యత ఇచ్చి జనం ముందు పెట్టాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత లాటిన్ అమెరికాను తన పెరటి తోటగా మార్చుకొనేందుకు అమెరికా ఇంత దుర్మార్గానికి పాల్పడింది. ప్రస్తుతం మన దేశంలో తమ భావజాల వ్యతిరేకుల నోరు మూయించేందుకు మితవాద శక్తులు ప్రయత్నిస్తున్నాయి, వాటికి కేంద్రంలోని ప్రభుత్వమద్దతు వుందని ప్రతిపక్షాలు, అనేక మంది మేధావులు, సంస్ధలు విమర్శిస్తున్నాయి. అలాంటి వారిపై దాడులు, హత్యలు జరిగినపుడు పాలక పార్టీ లేదా దానికి మద్దతు ఇచ్చే సంస్ధల వాదనల తీరు వాటిని ఆ విమర్శలకు బలం చేకూర్చేవిగా వుంటున్నాయి. మీడియా మొత్తం మీద పాలకవర్గ ప్రయోజనాలకే తోడ్పడుతోంది. లాటిన్ అమెరికాలో అనేక దేశాలలో కమ్యూనిజం నుంచి రక్షించేందుకు తాము పూనుకున్నట్లు నియంతలు ప్రకటనలు చేశారు. ఇక్కడ కమ్యూనిస్టులు, అభ్యుదశక్తులు అంతపెద్ద శక్తిగా లేనందున అలాంటి ప్రకటనలు లేవుగానీ చాపకింద నీరులా తమ పని తాము చేస్తున్నారు.
Like this:
Like Loading...