Tags

, , , , ,

ఎంకెఆర్‌

‘ఒక భూతం ఐరోపాను తరుముతోంది, అదే కమ్యూనిస్టు భూతం’ అంటూ కారల్‌ మార్క్స్‌-ఫెడరిక్‌ ఎంగెల్స్‌లు 1848 ఫిబ్రవరిలో వెలువరించిన కమ్యూనిస్టు ప్రణాళిక ప్రారంభం అవుతుంది. అంటే కమ్యూనిస్టు ప్రణాళికకు ముందే కమ్యూనిజం గురించి ఐరోపా పాలకవర్గం భయపడటం ప్రారంభమైతే ఇప్పుడు అది ప్రపంచం వ్యాపితంగా పాలకవర్గాలను వణికిస్తోంది. కమ్యూనిజాన్ని భూస్తాపితం చేశాం, అదింక పైకి లేవదు అని పాతికేండ్ల క్రితం ప్రగల్బాలు పలికిన వారే తమ నీడను చూసి తామే భయపడుతున్నారు. సోషలిజం, కమ్యూనిజాల వ్యాప్తి నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు కంకణం కట్టుకొని బరిలోకి దిగామని జబ్బలు చరుచుకుంటున్న అమెరికాలోనే మూల మూలల నుంచి అవును నేను సోషలిస్టును అని సగర్వంగా రొమ్ము విరుచుకుంటూ ముందుకు వస్తున్న వారిని చూసి ఏం చేయాలో దిక్కుతోచటం లేదు. సోషలిజం, కమ్యూనిజం మంచిదే కానీ వాటిని అమలు జరిపే కమ్యూనిస్టులు ఈ రోజుల్లో లేరు అనే వారు ఎందరో అయితే అమెరికన్ల ప్రచార ప్రభావంతో ప్రపంచానికి కమ్యూనిజం పనికిరాదు అని చెప్పేవారు కూడా వున్నారు.

సెప్టెంబరు 18వ తేదీన జకర్తాలోని ఒక భవనంలో నిషేధిత కమ్యూనిస్టు పార్టీని పునరుద్ధరించేందుకు సభ జరుపుతున్నారంటూ వందలాది మంది కమ్యూనిస్టు వ్యతిరేకులు గుమికూడి దాడి చేసేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశారు. ఇంతకూ ఏమిటా సమావేశం ? ఐదు దశాబ్దాల క్రితం ఇండోనేషియా మిలిటరీ లక్షలాది మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను, అనుమానం వచ్చిన వారిని హత్య చేసింది. వారి కుటుంబవారసులు, మానవ హక్కుల కార్యకర్తలు నాటి హత్యాకాండ గురించి విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని, నేరస్థులను శిక్షించాలని చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి బాధిత కుటుంబాలకు న్యాయ సలహాలను అందచేసేందుకు జరుగుతున్న సమావేశమది. దాన్ని పాలకపార్టీ, మిలిటరీ కనుసన్నలలో పనిచేసే ఇస్లామిక్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పేరుతో వున్న శక్తులు కమ్యూనిస్టు పార్టీ పునరుద్ధరణ సభగా చిత్రించి దాడికి ప్రయత్నించాయి. వారిని పోలీసులు అరెస్టు చేసినప్పటికీ వుత్తుత్తి కేసులతో జరిపే ఒక తతంగం తప్ప వేరు కాదు.

కమ్యూనిస్టులను వూచకోత కోసి, పార్టీని సిషేధించి నామ రూపాలు లేకుండా చేసి ఐదు దశాబ్దాలు గడిచినా ఇండోనేషియా పాలకవర్గాన్ని కమ్యూనిస్టు బూచి వదలటం లేదు. ఎప్పుడు ఏ వైపు నుంచి కమ్యూనిస్టులు తిరిగి రంగంలోకి వస్తారో అన్న భయం వారిని నిదురపోనివ్వటం లేదు. అక్కడ పేరుకు పౌర పాలన అయినప్పటికీ పెత్తనమంతా వుక్కు పాదాలదే. అడుగడుగునా వారి పాద ముద్రలు కనిపిస్తుంటాయి. వీధుల్లో ఎవరైనా ఎర్రరంగు చొక్కా ధరించి కనిపిస్తే మ్యూనిస్టుకిందే లెక్క. మిలిటరీ పోలీసులు నిర్ధారించుకొని కానీ వదలరు. ‘కమ్యూనిస్టుల విద్రోహం’ పేరుతో నిర్మించిన ప్రచార సినిమా ప్రదర్శనలు ఈనెల 30న దేశమంతటా జరిగేట్లు చూడాలని మిలిటరీ ఆదేశాలిచ్చిందంటే అక్కడ వున్నది ఏ తరహా పాలనో అర్ధం చేసుకోవచ్చు. భారీ ఖర్చుతో కమ్యూనిస్టు వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు చాలా కాలం క్రితం నిర్మించిన ఆ సినిమాను ప్రతి ఏటా 30వ తేదీన టీవీలో ప్రసారం చేస్తారు. కమ్యూనిస్టులను హతమార్చేందుకు అమెరికా సిఐఏ భాగస్వామ్యంతో ఇండోనేషియా మిలిటరీ జరిపిన కుట్రలో భాగంగా 1965 సెప్టెంబరు 30న కొంతమంది మిలిటరీ అధికారులను హత్య చేసి వారిని తిరుగుబాటు చేసిన కమ్యూనిస్టులు చంపివేశారని ప్రచారం చేశారు. దాన్ని సాకుగా చూపి లక్షలాది మంది కమ్యూనిస్టులు, అభిమానులు, కమ్యూనిస్టులనే పేరుతో అనేక మంది చైనా జాతీయులను వూచకోత కోశారు.

వర్తమాన తరాలకు సరైన చరిత్రను తెలిపేందుకు ఆ సినిమాను విధిగా ప్రదర్శించేట్లు చూడాలని కోరిన మాట నిజమే అని సైనికాధికారులు నిర్ధారించారు. దానిలో కమ్యూనిస్టులు దేవుడిపై విశ్వాసం లేని దుష్టులని, అందుకే వారు సైనికాధికారులను చంపివేశారని, కనుక వారి మీద నిషేధం విధించటం సరైనదేనని చెప్పేందుకు ఆ చిత్రాన్ని నిర్మించారు.

నాటి హత్యా కాండ గురించి బహిరంగంగా చర్చించటాన్ని అధికారికంగా నిషేధించారు. సోమవారం నాటి సమావేశంలో బాధిత కుటుంబాలకు న్యాయ సహాయం అందచేసే అంశం గురించి చర్చించారు. అక్కడి నిబంధనంల ప్రకారం మూడు వందలు అంతకు మించి ఎక్కువ మంది గుమి కూడా సమావేశాలకు మాత్రమే అనుమతి తీసుకోవాలి. ఈ సమావేశానికి 50 మంది వరకు మాత్రమే హాజరయ్యారు. అయినపప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు వ్యతిరేకులు కూడా దాడికి పాల్పడ్డారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం డిమాండ్‌ చేస్తూ జరపతలపెట్టిన ఒక సమావేశాన్ని కూడా అంతకు ముందు జరగనివ్వలేదు. ప్రభత్వం ఎంతగా అణచివేతలకు పాల్పడుతున్నప్పటికీ అక్కడ వున్నది పౌర ప్రభుత్వం కనుక విధిలేని పరిస్ధితులలో పరిమితంగా అయినా కొంత చర్చకు అవకాశం కల్పించక తప్పటం లేదు. 2012,14 సంవత్సరాలలో హత్యాకాండపై రెండు డాక్యుమెంటరీ చిత్రాలను నిర్మించారు, 2016లో ప్రభుత్వమే బాధితులు, వారి కుటుంబాల అభిప్రాయాలను వినేందుకు రెండు రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సామూహికంగా ఖననం చేసినట్లు పేర్కొన్న ప్రాంతాలలో నిజానిజాలు తేల్చాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అది కంటితుడుపు చర్యగానే మిగిలి పోయింది. తాజా పరిణాలను చూసినపుడు దేశంలో భావ ప్రకటనా స్వేచ్చకు అవకాశం లేదని, నియంత సుహార్తో రోజులను గుర్తుకు తెస్తున్నారని ఇండోనేషియన్‌ ఇండిపెండెంట్‌ జర్నలిస్టుల అసోసియేషన్‌ ప్రతినిధి అరిఫ్‌ బంబానీ వ్యాఖ్యానించారు. గతేడాది కాలంలో జర్నలిస్టులపై దాడులు రెట్టింపయ్యాయని చెప్పారు.

మలేషియా ప్రచురణ సంస్ధ తకుల్‌ సెటాక్‌ జకర్తాలో గతేడాది అక్టోబరులో నిర్వహించిన ఒక పుస్తక ప్రదర్శనలో కమ్యూనిస్టు ప్రణాళిక పుస్తకం వుండటంపై మిలిటరీ, పోలీసు అధికారులు ఏడు గంటల పాటు నిర్వాహకులను ప్రశ్నించారు. మ్యూనిస్టు సాహిత్యం విక్రయించటాన్ని ఇండోనేషియాలో కమ్యూనిజాన్ని ప్రచారం చేయటంగా పరిగణించి శిక్షలు విధిస్తారు.

తూర్పు ఐరోపాలో సోషలిస్టు వ్యవస్ధలను కూల్చివేసిన తరువాత సోషలిస్టు, కమ్యూనిస్టు చిహ్నాలను కూడా జన జీవితం నుంచి తొలగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. సోషలిస్టు వ్యవస్ధకు ప్రత్యామ్నాయంగా తిరిగి పునరుద్ధరించిన పెట్టుబడిదారీ వ్యవస్ధ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నకొద్దీ దాని నుంచి దృష్టి మళ్లించేందుకు సైద్ధాంతిక దాడితో పాటు, గత చిహ్నాలను కూడా అంతర్ధానం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది వూహించని పరిణామం కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సందర్భంగా తూర్పు ఐరోపాలోని అల్బేనియాను తొలుత ఇటాలియన్‌ ఫాసిస్టులు, తరువాత నాజీలు అక్రమించేందుకు ప్రయత్నించారు. ఈ దాడిని ఎదుర్కొనేందుకు నడుం కట్టిన కమ్యూనిస్టుపార్టీ ఇతర జాతీయవాదులను కూడా ప్రతిఘటనలో భాగస్వాములను చేసేందుకు 1942 సెప్టెంబరు 16న ఒక సమావేశాన్ని పెజా అనే గ్రామంలోని మైస్లిం పెజా అనే వ్యక్తి ఇంట్లో జరిగింది. చరిత్రలో దానిని పెజా సమావేశం అని పిలిచారు.అల్బేనియా విముక్తిలో అదొక చారిత్రాత్మక ఘట్టం. దీనిని పురస్కరించుకొని ఈ ఏడాది ఆరోజున జరిగిన ఒక కార్యక్రమంలో పిల్లలు ఆ సమావేశంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమం గురించి విన్న ప్రతిపక్ష డెమోక్రటిక్‌ పార్టీ నేత లుజిమ్‌ భాషా గత కమ్యూనిస్టు ప్రభుత్వ చిహ్నాలన్నింటినీ నిషేధించాలని అందుకు గాను జర్మనీ, ఇతర దేశాలలో మాదిరి ఒక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్‌ చేశాడు. దేశంలో కొంత మంది ఇప్పటికీ ఎన్వెర్‌ హోక్సా, కమ్యూనిస్టు పాలన గురించి బెంగతో వున్నారని, ఈ జబ్బు నయం చేయటానికి పైపూతలు చాలవని పేర్కొన్నాడు. ప్రభుత్వ నిధులతో కమ్యూనిస్టుల హయాంలో జరిగిన నేరాల పరిశోధన పేరుతో ఏర్పాటు చేసిన సంస్ధ కమ్యూనిస్టుల పాలనలో నిర్మించిన సినిమాల ప్రదర్శన నిషేధం గురించి ఒక ముసాయిదా బిల్లు తయారు చేసే పనిలో వుంది. ఒక్కసారిగా అన్నింటిపై నిషేధం అంటే ఎదురుతన్నే అవకాశం వుందని అందువలన సినిమాకు ముందు దాని గురించి చెబుతూ పెద్ద ఆర్భాటాలు లేకుండా చూడాలని సంస్ధ నిర్వాహకుడు చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనలు బహిర్గతం కాగానే కమ్యూనిజంతో విబేధించే వారు కూడా గత చరిత్రను తుడిచి వేయటాన్ని అంగీకరించబోమని కొందరు పేర్కొన్నారు. గతేడాది జరిపిన ఒక సర్వేలో 42శాతం మంది కమ్యూనిస్టు నేత ఎన్వెర్‌ హోక్సా గురించి సానుకూలంగా స్పందించారు.

పూర్వపు సోషలిస్టు దేశాలలో కమ్యూనిస్టుచిహ్నాలను పూర్తిగా చెరిపివేయాలన్నది ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఆ పని చేస్తే ప్రస్తుతం అధికారంలో వున్న పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేకలక్షణాన్ని స్వయంగా బయట పెట్టుకున్నట్లు అవుతుందని తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తే యువతరంలో కమ్యూనిజం గురించి ఆసక్తి పెరిగే ప్రమాదం వుందన్న కోణం నుంచి పూర్తిగా చెరిపి వేయాలనటాన్ని వ్యతిరేకిస్తున్నారు కొందరు. తూర్పు ఐరోపా దేశాలన్నీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర కలిగినవే. కమ్యూనిస్టుపార్టీ చిహ్నాలను లేకుండా చేయటం అంటే ఆ ఘనచరిత్రను తుడిచి వేయటమే. వుక్రెయిన్‌లో 2015లో చేసిన రెండు చట్టాల ప్రకారం కమ్యూనిస్టు చిహ్నాలను నిషేధించటమే గాక, ఎవరైనా కమ్యూనిస్టు పాలకులు చేసిన పనులను నేరాలుగా ఎలా చెబుతారని ప్రశ్నించటాన్ని కూడా నేరంగా ఆ చట్టంలో పొందుపరిచారు. హంగరీలో 2000 సంవత్సరంలో కమ్యూనిస్టు, ఫాసిస్టు చిహ్నాలను నిషేధించటంపై కోర్టులలో అనేక సార్లు సవాలు చేసిన వుదంతాలున్నాయి.