Tags

, , , , ,


ఎం కోటేశ్వరరావు


తన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ముస్లింలకు రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. మాయని మచ్చగా ఉన్న అంటరాని తనం నిర్మూలన గురించి, దానికి కారణమైన సనాతన ధర్మం, మనువాదం గురించి మోడీ నోటి వెంట ఒక్క మాటా ఇంతవరకు రాకపోగా సనాతన ధర్మాన్ని కాపాడతామని వీర ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అన్న నోటితోనే ఒక సామాజిక తరగతికి రిజర్వేషన్లను అడ్డుకుంటానని ప్రతిజ్ఞ చేశారు నరేంద్రమోడీ. అనేక అంశాలలో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులతో సమంగా ముస్లింలు ఉన్నారని అనేక నివేదికలు స్పష్టం చేశాయి. కేవలం మతాన్ని చూపి వారిని సామాజిక న్యాయానికి దూరం చేయటం సమంజసమా ? తమకు నాలుగు వందలకు పైగా స్థానాలను ఇవ్వాలని బిజెపి చెప్పటం వెనుక రాజ్యాంగమార్పు, రిజర్వేషన్ల ఎత్తివేతకే అనే అనేక మంది భావిస్తున్నారు. దాని సెగ తగిలిన కారణంగానే ఒక వైపు ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వం అని చెబుతూనే ఇతరుల రిజర్వేషన్లు రద్దు చేయం అని బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు పదే పదే నమ్మబలుకుతున్నారు. తమతో చేతులు కలిపిన తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడు ముస్లిం రిజర్వేషన్లు అమలు జరుపుతానంటూ ప్రచారం చేస్తున్నారు. ఓట్ల కోసం బిజెపి సమర్ధిస్తున్నది. రిజర్వేషన్ల గురించి ఎవరేం మాట్లాడారో చూద్దాం.
బీహార్‌లో మరోమారు బిజెపి చంకనెక్కి ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్న నితీష్‌ కుమార్‌ గతంలో చెప్పిందేమిటి ?(2015 సెప్టెంబరు 23, ఇండియా డాట్‌కామ్‌, ఇండో ఆసియన్‌ న్యూస్‌ సర్వీసు) దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి రిజర్వేషన్లను తొలగించాలని కోరుకుంటున్నది. రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలని చెప్పటం వారి వ్యూహంలో భాగం.ఇది ప్రమాదకరం, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ విభాగం బిజెపి. ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ ఇప్పుడున్న రిజర్వేషన్‌ విధానం సరైంది కాదని ఇటీవల అన్నారని కూడా నితీష్‌ కుమార్‌ చెప్పారు. వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని జెడి(యు) సీనియర్‌ నేత ఉపేంద్ర కుష్వాహ (పిటిఐ వార్త, 2022 అక్టోబరు 16, బిజినెస్‌ స్టాండర్డ్‌) చెప్పారు. రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా బోధనా సిబ్బంది నియామకానికి యుజిసి జారీ చేసిన మార్గదర్శక సూత్రాలే దానికి నిదర్శనం అన్నారు.ఈ విధానం కింద నియమించిన 40 మందిలో ఒక్కరు కూడా వెనుకబడిన తరగతులకు చెందిన వారు లేరన్నారు.దొడ్డిదారిన ఆర్‌ఎస్‌ఎస్‌ అభిమానులను ప్రవేశపెట్టే కుట్ర ఉందన్నారు.ఇప్పుడు ఆ పార్టీ బిజెపి చంకనెక్కిన సంగతి తెలిసిందే. జెడియు నేతలు బిజెపికి వ్యతిరేకంగా ఉన్నపుడు అలాంటి మాటలుగాక మరోవిధంగా ఎలా మాట్లాడతారని కొందరు ప్రశ్నించవచ్చు. ఇప్పుడు అదే నేతలు మాట మార్చి రిజర్వేషన్లు కొనసాగుతాయని ఇప్పుడు చెబుతున్నారు, వాటినెందుకు నమ్మాలి ?


బిజెపి నేతలు ఉత్సవిగ్రహాలు. దాని మూల విరాట్టులు ఆర్‌ఎస్‌ఎస్‌ పెద్దలు గతంలో ఏం చెప్పారు ?కాషాయ దళాలు చెబుతున్న మాటల మీద రోజు రోజుకూ అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి ? ఇతర పార్టీల ప్రచారం వల్లనా లేక వారు చెప్పిన మాటలే అందుకు దోహదం చేస్తున్నాయా ? ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతవేత్త, సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ వైద్య జైపూర్‌ లిటరేచర్‌ ఫెస్టివల్‌లో మాట్లాడుతూ(2017 జనవరి 20, ఏఎన్‌ఐ వార్త, బిజినెస్‌ స్టాండర్డ్‌, ఎన్‌డిటివి) ఉద్యోగాలు, విద్యా సంస్థలలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు త్వరలో పోవాలి. అందరికీ సమాన అవకాశాలు కావాలి తప్ప భారత్‌లో రిజర్వేషన్లు అవసరం లేదని, అవి వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తాయని చెప్పారు. సమాజంలో ఘర్షణ సృష్టిస్తాయని అందువలన వాటి మీద పునరాలోచన చేయాలన్నారు. కావాల్సింది అందరికీ సమాన అవకాశాలు తప్ప రిజర్వేషన్లు కాదు, సామాజికంగా అవకాశాలు రాని వారిని రిజర్వేషన్లు రక్షిస్తాయి కానీ అందరికీ సమాన అవకాశాలు పొందాలి, అది జరిగేంత వరకు తమ పట్ల వ్యత్యాసం చూపుతున్నారని, వేరు చేయబడ్డామనే భావం కలిగే ముప్పు ఉంది అన్నారు. ఇలా మాట్లాడటంపై విమర్శలు తలెత్తటంతో వివక్ష కొనసాగినంత కాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే అని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు వివరణ ఇచ్చుకున్నారు. బాధ్యతల్లో పని చేశారు.


ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతి మోహన్‌ భగవత్‌ తమ పత్రికలు ఆర్గనైజర్‌, పాంచజన్యలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిజర్వేషన్‌ విధానంపై ” సామాజిక సమీక్ష ” జరపాలని చెప్పారు. దాని మీద వివాదం తలెత్తటంతో అబ్బే అలాంటిదేమీ లేదు నూటికి నూరు శాతం రిజర్వేషన్లను గౌరవిస్తున్నారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక ప్రకటన చేసింది.( ఇండియా టుడే, 2015 సెప్టెంబరు 23) తమ నేత భారత సమాజంలోని బలహీన వర్గాలందరికీ రిజర్వేషన్ల ఫలితాలు అందేలా ఆలోచించాలని కోరినట్లు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచార ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య ఒక ప్రకటన జారీ చేశారు.” వాటి మీద రాజకీయాలు చేయకుండా రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నట్లుగా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేసి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తి ఉండేది కాదు, ప్రారంభం నుంచి వాటిని రాజకీయం చేశారు ” అని మోహన్‌ భగవత్‌ చెప్పారు.రిజర్వేషన్‌ విధానాన్ని రాజకీయ అవసరాల కోసం వినియోగించుకోకుండా ఎవరికి అవసరం, ఎంతకాలం కొనసాగించాలి అనే దాన్ని పరిశీలించేందుకు పౌర సమాజ ప్రతినిధులతో రాజకీయరహిత కమిటీని ఏర్పాటు చేయాలని, వారు నిర్ణయించాలని కూడా భగవత్‌ చెప్పారు. దీనదయాల్‌ ఉపాధ్యాయ ప్రవచించిన సంపూర్ణ భావజాలానికి అనుగుణ్యంగానే భగవత్‌ మాట్లాడినట్లు ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకుడు ప్రఫుల్ల కేల్కర్‌ సమర్ధించారు. ఇలా మాట్లాడటం అడ్డుపడటం, ఎస్‌సి, ఎస్‌టి,వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లను బలహీనపరిచే యత్నమే అని జెడియు ప్రధాన కార్యదర్శి కెసి త్యాగి అన్నారు. సంఘపరివార్‌ నేతలు తమ మనసులోని భావాలను బయట పెట్టటం, దాని మీద స్పందనలు ఎలా వస్తాయో చూడటం, బిజెపికి నష్టం కలిగించేవిగా ఉంటే వాటి మీద వివరణ ఇవ్వటం ఒక ఎత్తుగడ తప్ప చిత్తశుద్ధి కాదు.


కులం అనేది ప్రస్తుతం ఏమాత్రం సంబంధం లేనిదిగా మారినందున ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థలలో దళితులు, గిరిజనులు, ఓబిసిలకు ఇచ్చిన రిజర్వేషన్లను వెంటనే ఎత్తివేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ సిద్దాంతవేత్త ఎంజి వైద్య (మన్మోహన్‌ వైద్య తండ్రి) చెప్పారు.(2015 ఆగస్టు 31 హిందూ పత్రిక) గుజరాత్‌లో పటేల్‌ సామాజిక తరగతి రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో హిందూ పత్రిక ప్రతినిధితో మాట్లాడుతూ ఇప్పుడు ఏ ఒక్క కులం కూడా వెనుకబడి లేనందున కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం లేదని,మహా అయితే ఎస్‌సి,ఎస్‌టిలకు రిజర్వేషన్లు కొనసాగించవచ్చనీ అవి కూడా కేవలం పది సంవత్సరాలు మాత్రమే ఉండాలని, తరువాత పూర్తిగా రద్దు చేయాలని వైద్య చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ఒక అగ్రనేత ఇలా మాట్లాడితే ఆ సంస్థ అధిపతి మోహన్‌ భగవత్‌ ఒక సందర్భంలో ఇలా అన్నారు.”వారిని(దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలవారి) రెండువేల సంవత్సరాల పాటు జంతువుల మాదిరి పరిగణించారు. అంత దీర్ఘకాలం వారు బాధలకు గురైనందున వారి లబ్దికోసం మరో రెండు వందల సంవత్సరాల పాటు ఇబ్బంది పడేందుకు జనాలు (ఇతర కులాలు) సిద్దపడాలి. అది అంతగా నేడు పైకి కనిపించకపోవచ్చు, కానీ సమాజంలో వారు ఇప్పటికీ వివక్షకు గురువుతున్నారు. ఇది కేవలం ఆర్థిక,రాజకీయ హక్కుల ప్రశ్న కాదు, ఇది సామాజిక సమానత్వ ప్రశ్న ” 2023 సెప్టెంబరు మొదటి వారంలో నాగపూర్‌లో అగర్వాల్‌ సామాజిక తరగతి విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్న ఒక హాస్టల్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్‌ ప్రసంగించారు.(సెప్టెంబరు ఆరవ తేదీ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఇతర అనేక పత్రికలు ఈ ఉపన్యాస వార్తలు ఇచ్చాయి)


ఓబిసి రిజర్వేషన్ల గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా చెప్పుకోవటం అవసరం.మండల్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను సమీక్షించాలని కోరిన వారు కొందరైతే కాషాయ దళాలు వాటిని పరోక్షంగా వ్యతిరేకించాయి. అందుకే ఆ రోజుల్లో మండల్‌కు పోటీగా కమండల్‌ అని పత్రికల్లో వర్ణన వచ్చింది.రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఎస్‌సి, ఎస్‌టిలకు రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి.తరువాత బిసిలకూ వాటిని వర్తింప చేయాలన్న డిమాండ్‌కు ముందుకు వచ్చింది. జనతా పార్టీ ప్రధానిగా మొరార్జీ దేశారు ఉన్న సమయంలో బీహార్‌ మాజీ సిఎం బిందేశ్వరీ ప్రసాద్‌ మండల్‌ నాయకత్వంలో ఒక కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఇందిరా గాంధీ తిరిగి అధికారానికి వచ్చిన తరువాత కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సులను సమర్పించారు. ఆమె దాన్ని పక్కన పడేశారు.తరువాత రాజీవ్‌ గాంధీ కూడా దాన్ని పట్టించుకోలేదు.విపి సింగ్‌ ప్రధాన మంత్రి అయిన తరువాత దుమ్ముదులిపి నివేదికను బయటకు తీశారు.రిజర్వేషన్ల వ్యతిరేకులు పెద్ద ఎత్తున రంగంలోకి వచ్చినప్పటికీ అమల్లోకి వచ్చింది. మండల్‌కు పోటీ బిజెపి కమండల్‌ అజెండాతో రామ జన్మభూమి వివాదాన్ని ముందుకు తెచ్చిందనే విమర్శలు ఆరోజుల్లో వెలువడ్డాయి. రిజర్వేషన్లపై 50శాతం పరిమితి ఉండటంతో అనేక మంది తమను ఓబిసి జాబితాలో చేర్చాలనే డిమాండ్లతో ముందుకు వచ్చారు.వారిని సంతుష్టీకరించేందుకు రిజర్వేషన్లపై సమీక్ష జరగాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు చెప్పారు.తరువాత ఇబిసి కోటాను ముందుకు తెచ్చారు.


రిజర్వేషన్లు రాజ్యాంగబద్దమే అయినప్పటికీ అవిశాశ్వతంగా ఉండాలని పేర్కొనలేదు. కనుకనే పది సంవత్సరాలకు ఒకసారి వాటి లక్ష్యం నెరవేరని కారణంగా పొడిగించుకుంటూ వస్తున్నారు. అనేక మంది తమకూ వర్తింప చేయాలని ఆందోళనలు చేస్తున్నారు.సమాజంలో ఆర్ధిక, విద్యా రంగాలలో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ కూడా ఉంది.మొత్తం రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులు ఉన్నందున ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే ఇప్పటికే ఉన్న వారికి అన్యాయం జరుగుతుందంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు చూస్తున్నారు.మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏమిటీ విడ్డూరం అనే వాదనను ముందుకు తెస్తున్నారు. ఇప్పుడు కల్పిస్తున్న రాజ్యాంగబద్ద రిజర్వేషన్లలో మత ప్రాతిపదిక లేదా ? మతాన్ని ఎవరైనా మార్చుకోవచ్చు, కులానికి అలాంటి అవకాశం లేదు. షెడ్యూలు కులాలు, తరగతులకు చెందిన వారు సిక్కు, బౌద్ద మతాల్లోకి మారితే వారిని దళితులుగానే భావిస్తూ రిజర్వేషన్లు వర్తింప చేస్తున్నారు. క్రైస్తవమతాన్ని స్వీకరిస్తే వారు బిసి రిజర్వేషన్లు పొందవచ్చు.అదే ఇస్లాంను స్వీకరిస్తే మతం మారినందున అసలు రిజర్వేషన్లే వర్తించవు.ఎందుకు అంటే ఇస్లాంలో కులం లేదు గనుక వివక్ష ఉండదు అన్నారు. సిక్కు, బౌద్దంలో కూడా కుల పట్టింపులేనప్పటికీ ఎందుకు వర్తింప చేస్తున్నారన్నదే ప్రశ్న. ఈ అంశంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నది. ఇస్లాంలో కులం లేకున్నా వెనుకబాటు తనం ఉంది కదా ? ఆ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వకూడదు ? ఓబిసి రిజర్వేషన్లు కల్పించినపుడు అది వర్తించని కులాల వారు తమ అవకాశాలను లాగివేశారని వ్యతిరేకించారు. ఇప్పుడు ముస్లింలను బిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పిస్తే మీ వాటా తగ్గిపోతుందంటూ వెనుకబడిన తరగతుల వారిని రెచ్చగొడుతున్నారు.నాడూ నేడూ దాని వెనుక ఉంది అసలు మొత్తంగా రిజర్వేషన్లను వ్యతిరేకించేవారి రాజకీయమే.


ఒక వైపు సామాజిక వివక్ష ఉన్నంత వరకు రిజర్వేషన్లను సమర్ధిస్తామని చెబుతున్న కాషాయ దళాలు ప్రపంచంలో ఏ నాకరిక సమాజంలోనూ లేని అంటరాన్ని తనాన్ని రుద్దిన సనాతనధర్మం, మనుస్మృతిని కాపాడాలని చెప్పటమే కాదు, తామే వాటి అసలైన పరిరక్షకులమని చెప్పుకొనేందుకు సిగ్గుపడటం లేదు. రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పదని చెప్పిన పెద్దలు. 1949 నవంబరు 30వ తేదీ ఆర్గనైజర్‌ పత్రిక సంపాదకీయంలో వెలిబుచ్చిన అభిప్రాయమే ఇప్పటికీ వారిలో ఉంది.” కానీ మన రాజ్యాంగంలో పురాతన భారత్‌లో అపూర్వమైన రాజ్యాంగ వృద్ది గురించిన ప్రస్తావనే లేదు. స్పార్టా లైకుర్‌గుస్‌ లేదా పర్షియా సోలోన్‌ కంటే ఎంతో ముందుగానే మనుస్మృతి లిఖితమైంది.ఈ రోజుకూ మనుస్మృతిలో మను రాసిన చట్టాలు ప్రపంచ వ్యాపితంగా ఆరాధించాలన్న ప్రేరేపణ ఇస్తాయి.వాటికి విధేయులై ఉండాలని, అనుగుణంగా నడుచుకోవాలనే భావాలను వ్యక్తం చేయిస్తాయి. కానీ మన రాజ్యాంగ పండితులకు దానిలో ఏమీ కనిపించలేదు.” ఆర్‌ఎస్‌ఎస్‌ అధిపతిగా పని చేసిన ఎంఎస్‌ గోల్వాల్కర్‌ ” హిందూ దేశం ఎందుకు ” అనే పుస్తకంలో ఇలా రాశారు.” ఒక వ్యక్తి ఎలాంటి అవగాహన లేకుండా తన ఇంటిలోని పిల్లలు, దొంగలకు సమాన హక్కులు, సంపదలను అందరికీ పంచినట్లుగా దురదృష్టం కొద్దీ మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఇచ్చారు. ” మేకలను మింగటానికి వెళితే భయపడే అవకాశం ఉన్నందున ఒక పులి మేకతోలు కప్పుకున్నదట. అదే మాదిరి ఇలాంటి భావజాలానికి కట్టుబడి ఉంటామని నిత్యం ప్రమాణాలు, పారాయణాలు చేస్తున్న వారే బిజెపి నేతలు. అందుకే వారు నాలుగువందల సీట్లు కావాలంటే తమ అజెండాను అమలు జరిపేందుకు చూస్తున్నారనే అనుమానాలు జనాల్లో పెరుగుతున్నాయి. బిజెపి, కాషాయదళం నిత్యం అంబేద్కర్‌ భజన చేస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్రమోడీ ఆ గుంపు వ్యక్తే. అంబేద్కర్‌ 1927 డిసెంబరు 25న బహిరంగంగా మనుస్మృతిని దగ్దం చేశారు.కుల అణచివేతను మనుస్మృతి వ్యవస్థీకృతం కావించింది. సమాజంలోని ఒక తరగతి అత్యధికులుగా ఉన్న వారి అణచివేత, దోపిడీని అది సమర్ధించింది. అగ్రకులం అని పిలిచే జనాలు అత్యధికులుగా ఉన్నవారి మీద వివక్ష చూపటాన్ని అది సమర్ధించింది అని అంబేద్కర్‌ చెప్పారు. అలాంటి మనువాదులే నేడు సనాతనం పేరుతో తిరిగి దాన్ని పునరుద్దరించాలని చూస్తున్నారు. తన బొందిలో ప్రాణం ఉండగా దాన్ని జరగనివ్వను అనే మాట నరేంద్రమోడీ నోట రాదేం. అణచివేత, వివక్ష, దోపిడీని సమర్ధిస్తున్నట్లా ?