Tags
#Anti China, Acheedin, BJP, Boycott china goods, China imports to India, cock and bull stories, Gujarat model, Narendra Modi Failures
ఎం కోటేశ్వరరావు
2025 మార్చి నెల నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల జిడిపి ఉండే విధంగా దేశాన్ని ముందుకు నడిపించే బాటను రూపొందించాలని ఐదేండ్ల నాడు నరేంద్ర మోడీ తన పరివారాన్ని ఆదేశించారు.ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబరు పదకొండవ తేదీన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఒక లక్ష కోట్ల డాలర్లు వ్యవసాయం-అనుబంధ రంగాల నుంచి, మరొక లక్ష కోట్ల డాలర్లు పారిశ్రామిక రంగం నుంచి, మూడు లక్షల కోట్ల డాలర్లు సేవా రంగం నుంచి వచ్చే విధంగా చూడాలని కోరారు. ఈ హడావుడి అంతా మరుసటి ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల కోసం అని వేరే చెప్పనవసరం లేదు. ఆచరణలో జరుగుతున్నదేమిటి ? 2026 మార్చి నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అని 2023 జనవరి 31న టైమ్స్ ఆఫ్ ఇండియా, 2028 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్లని కేఫ్ మ్యూచ్యువల్ డాట్‌కామ్ ఫిబ్రవరి22న, 2029నాటికి ఐదులక్షల కోట్ల డాలర్లని ఏప్రిల్ 20న ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక శీర్షికల ద్వారా తెలిపాయి. 2022-23 నాటికి 3.5లక్షల కోట్ల డాలర్లకు చేరతామని తరువాత ఏడు సంవత్సరాలలో ఏడు లక్షల కోట్లకు పెరుగుతామని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ జనవరి 12న విలేకర్లతో చెప్పారు.2022-23లో 3.3లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఏ అంచనాలను, ఎవరి మాట నమ్మాలి ? దేశాన్ని ఏ దారిలో మోడీ నడుపుతున్నారు ? అంకెలతో జనాన్ని ఎలా ఆడిస్తున్నారో కదా !
2021-22 ప్రకారం మన జిడిపిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 18.8, పారిశ్రామిక, సేవా రంగాల నుంచి 28.2, 53 శాతాల చొప్పున ఉందని చెబుతున్నారు.ఆ లెక్కన చూసుకుంటే 3.3లక్షల కోట్ల డాలర్లలో వరుసగా ఈ రంగాల నుంచి 62వేలు, 93వేల కోట్ల డాలర్లు, 1.79లక్షల కోట్ల డాలర్లు ఉంది. దేశమంతటా గుజరాత్ నమూనా అమలు చేసి అభివృద్ధి చేస్తానని మోడీ 2014లో నమ్మబలికారు. దాని ప్రకారమైతే సేవల నుంచి 37, పారిశ్రామిక రంగం 43, వ్యవసాయం నుంచి 20శాతం ఉండాలి కానీ, ఐదులక్షల కోట్ల డాలర్ల లక్ష్యంలో మాత్రం 50-25-25 శాతాలని నిర్దేశించారు. ఇదెలా జరిగింది, మోడీ సర్కార్‌కు వాస్తవాలు తెలియదా ? అసలు గుజరాత్ నమూనాతో మామూలు జనానికి ఒరిగేదేమీ లేదని మానవాభివృద్ధి సూచికలు వెల్లడించాయి, అది దేశం మొత్తానికి వర్తించదని తెలిసే ఓటర్లను తప్పుదోవపట్టించారా ? ఎవరికి వారు అవలోకించుకోవాలి.
ప్రపంచంలో మనది వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అన్నది అంకెల్లో నిజమే. అభివృద్ధి ఫలాలు ఎవరికి అన్నదే అసలు ప్రశ్న.2017-18లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ప్రకారం నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొడుతూ 6.1శాతం నిరుద్యోగులున్నట్లు తేలింది. ఎన్నికల్లో అది ప్రతికూల ఫలితాలనిస్తుందనే భయంతో మోడీ సర్కార్ దాన్ని తొక్కిపెట్టింది. అది లీకు కావటంతో సరైన లెక్కలతో జనం ముందుకు వస్తామని చెప్పింది, ఇంతవరకు రాలేదు. పకోడీల బండి పెట్టుకొన్నప్పటికీ అది ఉపాధి కల్పనే అని అచ్చే దిన్ ఫేం నరేంద్రమోడీ సెలవిచ్చిన సంగతి తెలిసిందే. బహుశా పకోడీలు, బజ్జీల బండ్ల లెక్కలు తేలలేదని అనుకోవాలి. 2016లో పెద్ద నోట్ల రద్దు అనే తెలివి తక్కువ పని కారణంగా తరువాత నిరుద్యోగం పెరిగిందని జనం ఎక్కడ అనుకుంటారోనని ఆ నివేదికను తొక్కిపెట్టారని అనుకుందాం. ఈ ఏడాది జనవరిలో 7.14శాతం ఉంటే ఏప్రిల్ నెలలో అది 8.11 శాతానికి పెరిగిందని సిఎంఐఇ సమాచారం వెల్లడించింది. అలాంటపుడు వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటే జనానికి ఒరిగేదేమిటి ? ఎంతగా మూసిపెడితే అంతగా పాచిపోతుందన్న సామెత తెలిసిందే. జరుగుతున్నది ఉపాధి రహిత వృద్ధి. అందుకే పాలకుల భజనకు తప్ప జనానికి పనికి రావటం లేదు. పోనీ పని చేసిన వారికి వేతనాలేమైనా పెరుగుతున్నట్లా అదీ లేదు. దేశంలో నిజవేతన పెరుగుదల 2014-15 నుంచి 2021-22 కాలంలో వ్యవసాయకార్మికులకు సగటున ఏటా 0.9, నిర్మాణ కార్మికులకు 0.2, ఇతర కార్మికులకు 0.3 శాతమని సాక్షాత్తూ రిజర్వుబాంకు అంకెలే చెప్పాయి.
జిఎస్‌టి వసూళ్లు పెరుగుదలను చూపి చూడండి మా ఘనత కారణంగానే జనం ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు అని చెబుతున్నారు. విదేశీ దిగుమతుల పెరుగుదల కూడా దేశంలో కొనుగోలు శక్తి పెరిగింది అనేందుకు నిదర్శనంగా చిత్రించేందుకు చూస్తున్నారు. గడచిన పన్నెండు సంవత్సరాల్లో దేశంలో పన్నుల వసూలు 303శాతం పెరిగింది. 2010 ఆర్ధిక సంవత్సరంలో రు.6.2లక్షల కోట్లు ఉంటే 2022 నాటికి అది 25.2లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో జడిపి మాత్రం 93 శాతం అంటే రు.76.5లక్షల కోట్ల నుంచి 147.4లక్షల కోట్లకు మాత్రమే చేరింది. పన్నుల బాదుడు పెరిగింది, సంపదల సృష్టి తగ్గింది. పెరిగినవి ధనికుల చేతుల్లో కేంద్రీకృతం అవుతున్నట్లు అందరికీ తెలిసిందే. పన్నుల వసూలు పెరుగుదల వెనుక అనేక అంశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగటం, దానికి అనుగుణంగా పన్ను మినహాయింపు పరిమితి పెరగక పోవటంతో అనేక మంది కొత్త వారు పన్ను పరిధిలోకి రావటం. జిఎస్‌టిలో పన్ను భారం పెంచటం, కొత్త వస్తువులను దాని పరిధిలోకి తేవటం, ధరల పెరుగుదలకు అనుగుణంగా జిఎస్‌టి కూడా పెరగటం వంటి అంశాలు దాని వెనుక ఉన్నాయి. ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక రంగం మనదని చెబుతున్నవారు దానికి అనుగుణంగా ఆ రంగం నుంచి పన్నులను ఎందుకు రాబట్టటం లేదు. ప్రపంచంలో పోటీ పడాలనే పేరుతో పన్ను రేటు గణనీయంగా తగ్గించారు. పోనీ అలా లబ్దిపొందిన కార్పొరేట్ సంస్థలు తిరిగి పెట్టుబడులు పెట్టి ఉపాధి కల్పిస్తున్నాయా, కల్పిస్తే నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నట్లు అంటే దానికి సమాధానం ఉండదు.
వార్షిక లావాదేవీలు రు.400 కోట్లు ఉన్న కంపెనీలకు పన్ను రేటును 25శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది. తాజాగా ఒక పరిశీలనలో 22శాతానికి అటూ ఇటూగా ఉన్నట్లు తేలింది. ఏదో ఒక పేరుతో ఇస్తున్న మినహాయింపులే దీనికి కారణం. 2017-18లో 27.6శాతంగా ఉన్న కార్పొరేట్ పన్ను శాతం 2019-20నాటికి 22.8శాతానికి తగ్గిందని బరోడా బాంక్ పరిశోధన నివేదిక వెల్లడించింది. తరువాత ఇంకా తగ్గి 22శాతానికి చేరుకుంది. అనేక మంది పాత సంస్థలను దివాలా తీయించి లేదా మూసివేసి వాటి బదులు కొత్త వాటిని ఏర్పాటు చేస్తే పదిహేనుశాతమే పన్ను చెల్లించాల్సి ఉంటుంది.ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఎగుమతుల ప్రోత్సాహం పేరుతో మనకు బదులు విదేశాల వారికి తక్కువ ధరలకు సరకులు అందించేందుకు అని తెలిసిందే. పోనీ ఇంతగా తగ్గించినా మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా పిలుపులను పట్టించుకున్నవారు లేరు. అది జరిగి ఉంటే ఎగుమతులు ఇబ్బడి ముబ్బడిగా ఎందుకు పెరగలేదు ?
తొమ్మిదేండ్ల మోడీ ఏలుబడిని చూసిన తరువాత మన విదేశీ వాణిజ్యలోటు పెరుగుతోంది తప్ప తరగటం లేదు.మరోవైపు అప్పులు పెరుగుతున్నాయి. ఎందుకు ఇంత అప్పు చేశారంటే గతంలో కాంగ్రెస్ చమురు దిగుమతుల కోసం చేసిన అప్పులు తీర్చేందుకని కొన్ని రోజులు పిట్టకతలు చెప్పారు. పోనీ వాటిని ఇంతవరకు తీర్చారా అంటే లేదు. చెల్లింపు గడువు ఇంకా ఉంది. తరువాత ఇంకేవో కతలు చెప్పారు. పాలకులుగా కాంగ్రెస్-బిజెపి ఎవరున్నా దొందూ దొందే ! కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో వెల్లడించినదాని ప్రకారం 2024 మార్చి నాటికి దేశ అప్పు 169.46లక్షల కోట్లకు చేరుతుంది. ఇంకా పెరగవచ్చు కూడా దీనిలో విదేశీ రుణం 5.22 లక్షల కోట్లు. దేశ జనాభా 140 కోట్లు అనుకుంటే మొత్తం తలసరి అప్పు లక్షా 21వేలు. ఇది మోడీ ప్రధాని పీఠం ఎక్కినపుడు రు.43వేలు.2014-15లో ఓఇసిడి దేశాల లెక్కింపు పద్దతి ప్రకారం మన దేశంలో నిఖర తలసరి జాతీయ రాబడి రు.72,805 కాగా 2022-23 నాటికి రు.98,118కి పెరిగింది. దీన్ని బట్టి మోడీని సమర్ధ ప్రధాని అనవచ్చా ! కొంతమంది వేద గణికులు చైనా విదేశీ అప్పు 2.64లక్షల కోట్లు, మనది 61,500 వేల కోట్లు మాత్రమే(2022 జూన్ నాటి లెక్కలు), చూశారా చైనా ఎప్పుడైనా రుణ భారంతో కూలిపోతుందని చంకలు కొట్టుకుంటారు. దున్నబోతే దూడల్లో మెయ్యబోతే ఎద్దుల్లో అన్నట్లుగా నరం లేని నాలికలతో ఏమైనా మాట్లాడవచ్చు. చైనా రుణం దాని జిడిపితో పోల్చితే 14.39 శాతం కాగా మనది 19.2శాతం ఉంది. అందువలన రుణంతోనే చైనా కూలితే మన తరువాతే అన్నది గ్రహించాలి. విదేశీ చెల్లింపుల్లో నిలకడ ఉండటం లేదు, లోటు కొనసాగుతోంది. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే మనవారి సంఖ్య తగ్గితే అది మరింత పెరుగుతుంది. విషమిస్తే మరోసారి ఐఎంఎఫ్ వద్దకు వెళ్లాల్సి ఉంటుంది.
మన దేశ వాణిజ్య ప్రధమ భాగస్వామిగా చైనాను నెట్టేసి అమెరికా ముందుకు వచ్చిందని ఒక లెక్క, కాదు అని మరొక లెక్క చెబుతోంది. ఎవరైతేనేం చైనాకు మనం సమర్పించుకొనేది ఏటేటా పెరుగుతోంది. రెండు దశాబ్దాల క్రితం పదవ స్థానంలో ఉన్న చైనా ఇప్పుడు ఒకటి, రెండు స్థానాల్లోకి వచ్చింది. విదేశాల నుంచి మన వలస కార్మికులు పంపుతున్న డాలర్లన్నీ చైనాకు సమర్పించుకుంటున్నార. ఒక దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయంటే ఆ మేరకు మన దేశంలో ఉపాధికి గండిపడుతున్నట్లే. అంతే కాదు, స్వదేశీ ఉత్పత్తులకు గిరాకీ తగ్గుతున్నట్లే, అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. చైనా నుంచి చౌక ధరలకు దిగుమతులు చేసుకున్న అమెరికా కార్పొరేట్లు లబ్ది పొందినట్లే, మన వారు కూడా లాభాలు పొందుతున్నారు. అందుకే దేశంలోని చైనా వ్యతిరేకులు ఎంత గగ్గోలు పెట్టినా నరేంద్రమోడీ ఖాతరు చేయకుండా దిగుమతులను అనుమతించి రికార్డులను బద్దలు కొడుతున్నారు. ఇదే ధోరణి కొనసాగితే చైనా వస్తు మార్కెట్‌గా మన దేశం మారే అవకాశం ఉంది. చైనా అంటే మనకు పడదు అనుకుంటే ఇతర దేశాల వస్తువులతో నింపుతారు. మొత్తంగా చూస్తే తొమ్మిదేండ్లలో దిగుమతులు, అప్పు తప్ప చెప్పుకొనేందుకు పెద్దగా ఏమీ కనిపించటం లేదు.
2021-22 ఏప్రిల్-జనవరి కాలంలో వస్తువుల దిగుమతి విలువ 494 బిలియన్ డాలర్లు కాగా అదే 2022-23 నాటికి 602బి.డాలర్లకు పెరిగింది. ఎందుకు అంటే దేశంలో కొనుగోలు శక్తిని పెంచాం అని బిజెపి నేతలు చెప్పారు. అంటే వారి చేతిలో మంత్ర దండం ఉందని అనుకుందాం, మరి అదే ఊపులో నిరుద్యోగాన్ని ఎందుకు తగ్గించలేదు, ఆత్మనిర్భరత, మరొక పేరుతో చేసిన హడావుడి ప్రకారం ఎగుమతులు ఎందుకు దిగుమతులను అధిగమించలేదు ? సేవా రంగ ఎగుమతుల పెరుగుదల కేంద్ర పాలకుల పరువును, వెంటనే మరోసారి ఐఎంఎఫ్ దగ్గర అప్పుకు పోకుండా కాపాడుతున్నాయి. అంకుర సంస్థల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంకురమైనా పాతదైనా దేశంలో ఉన్న పౌరుల ఆదాయాలను బట్టి ప్రభావితమౌతాయి. 2021, 22 సంవత్సరాల్లో అంకురాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇన్వెస్కో, బ్లాక్‌రాక్ సంస్థలు తాజాగా బైజు విలువను 22 నుంచి 11.5కు, స్విగ్గీ 10.7 నుంచి 5.5 బిలియన్ డాలర్లకు తగ్గించాయి. ఇవే కాదు ఓలా విలువ 35శాతం, ఇలా అనేక కంపెనీల విలువలను తగ్గిస్తూ సంపదల నిర్వహణ కంపెనీలు ప్రకటించాయి. ఈ కంపెనీలన్నీ సిబ్బంది తొలగింపు, ఖర్చుల్లో కోత, కస్టమర్లకు ఇచ్చే డిస్కౌంట్ల తగ్గింపు వంటి చర్యలకు పాల్పడ్డాయి.
మన దేశంలో మధ్య తరగతి భారీ ఎత్తున ఖర్చు చేయనున్నారనే అంచనాతో పాటు, చైనాలో అనేక కంపెనీల మీద విధిస్తున్న ఆంక్షల కారణంగా అవన్నీ మన దేశానికి వస్తున్నాయనే భ్రమను కల్పించారు. దీంతో వెంచర్ కాపిటల్ పెట్టుబడిదారులు ( వీరు ఎక్కడ ఎక్కువ లాభం ఉంటే అక్కడికి వెంటనే వెళ్లిపోతారు, ఒక దగ్గర స్థిరంగా ఉండరు.లాభాలు రాగానే తమ వాటాను అమ్మి వేరే వైపు వెళ్లిపోతారు. తెల్లవారే సరికి నడమంత్రపు సిరి కావాలి) మన దేశంలోని అంకుర సంస్థలకు భారీ ఎత్తున పెట్టుబడులను మళ్లించారు. వాటి విలువలను విపరీతంగా పెంచివేశారు. మార్కెట్‌ను స్వంతం చేసుకొనేందుకు ఈ కంపెనీలన్నీ ఆ రంగంలో పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాయి.బైజు సంస్థ క్రికెటర్ల జెర్సీల మీద పేరుకోసం పెద్ద మొత్తంలో చెల్లించింది, ఫీపా ప్రపంచ కప్‌ను స్పాన్సర్ చేసింది. స్విగ్గీ,డ్రీమ్ 11 వంటి సంస్థలు క్రికెట్ ఐపిఎల్‌కు ఖర్చు చేశాయి. ప్రకటనల కంపెనీ మాడిసన్ వెల్లడించిన సమాచారం ప్రకారం అగ్రశ్రేణి ప్రకటనదార్లు 50లో 15 అంకుర సంస్థలే ఉన్నాయి.వినియోగదారులు విస్తరించకపోవటంతో అనేక కంపెనీలు మూతలవైపు మళ్లాయి. స్విగ్గీ తన మాంస, ఇతర ఇంటి సరకుల సరఫరా నిలిపివేసింది. ఓలా కూడా ఆహార, ఇంటి సరకుల సరఫరా, మీషో ఇంటి సరకుల, అన్ అకాడమీ ప్రాధమిక, సెకండరీ స్కూల్ బిజినెస్‌ను మూసివేసింది.మన జనాలను డిస్కౌంట్లకు అలవాటు చేసిన తరువాత వాటిని ఇచ్చే వాటివైపు చూస్తారు తప్ప మిగతావాటిని పట్టించుకోరు. అదే కంపెనీల విస్తరణకు అడ్డంకిగా మారింది. ఆహారాన్ని అందించే జోమాటో తగిన గిరాకీల్లేక 225 పట్టణాల్లో సేవలను నిలిపివేసింది. కరోనా కారణంగా దేశంలో ఆన్‌లైన్ సేవలవైపు జనాలు మొగ్గారు అది అంతరించగానే వాటికి డిమాండ్ తగ్గింది. వెంచర్ కాపిటల్‌కు ఇబ్బందులు రావటానికి వడ్డీ రేట్ల పెరుగుదల కూడా ఒక కారణం. అనేక దేశాల్లో బాంకుల్లో డిపాజిట్లు చేసిన వారే ఎదురు ఎవడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఇది వెంచర్ కాపిటల్ సంస్థలకు ఎంతో కలసి వచ్చింది. డాలర్లన్నీ వాటివైపు ప్రవహించాయి. గతేడాది అమెరికా, ఇతర దేశాల్లో భారీగా పెరిగిన వడ్డీ రేట్లు ఈ సంస్థలకు తక్కువ వడ్డీలకే రుణాలు ఇచ్చే అవకాశాలను తగ్గించింది.
చైనాను దెబ్బతీసేందుకు అమెరికా, దాని మిత్ర దేశాలు అన్ని విధాలుగా చూస్తున్నాయి.వాణిజ్య సంబంధాలను తెంచుకోవటం వాటిలో ఒకటి.అలాంటి ప్రయత్నాలెన్ని చేసినప్పటికీ 2030వరకు ప్రపంచ వాణిజ్య వృద్ధిలో చైనా కీలకంగా ఉండనుందని లండన్ కేంద్రంగా ఉన్న స్టాండర్డ్ చార్టర్డ్ కంపెనీ తాజా నివేదికలో వెల్లడించింది. ఎగుమతుల వార్షిక వృద్ధి రేటు 4.7శాతం ఉంటుందని,2030 నాటికి మొత్తం విలువ 4.37లక్షల కోట్ల డాలర్లు ఉంటుందని పేర్కొన్నది. ఎగుమతుల్లో మెకానికల్, ఎలక్ట్రానిక్ వస్తువులు 52శాతం ఉంటాయన్నది. ఇదే సంస్థ మన దేశం గురించి వేసిన అంచనాలో 2021లో 401బి.డాలర్లుగా ఉన్న మన వస్తు ఎగుమతులు 2030 నాటికి 773 బి.డాలర్లకు పెరుగుతాయని చెప్పింది. అప్పటికి చైనా నుంచి మనం దిగుమతి చేసుకొనే వస్తువుల విలువ 212, ఎగుమతుల విలువ 49 బి. డాలర్లు ఉంటుందని కూడా చెప్పింది. ఇది ఊహలే తప్ప వాస్తవం కాదని మన సర్కార్ రుజువు చేస్తుందా ? ఇప్పటి వరకు నడచిన తీరును చూస్తే ఇంకా పెరిగేందుకే అవకాశం ఉంది.2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు మన దేశం చైనాతో జరిపిన వాణిజ్య లావాదేవీల విలువ 44.34 బిలియన్ డాలర్లుగా ఉందని చైనా కస్టమ్స్ శాఖ సమాచారం వెల్లడించింది. ఇదే ఏడాది మొత్తం కొనసాగితే 175బి. డాలర్ల రికార్డు నమోదు కావచ్చు.2022లో జరిగిన 135.98 బి.డాలర్లు ఇప్పటి వరకు ఒక రికార్డు. మన వాణిజ్యలోటు వంద బి.డాలర్లు దాటింది. మరోవైపు మోడీ సర్కార్ రూపొందించిన భారత విదేశీ వాణిజ్య విధాన పత్రం 2023లో 2030 నాటికి మన ఎగుమతులు రెండులక్షల కోట్ల డాలర్లకు చేరతాయని, వార్షిక వృద్ది రేటు 14.8శాతం ఉంటుందని పేర్కొన్నారు.మనల్ని నేల మీద నడిపించి అన్ని ఎగుమతులు చేస్తే అంతకంటే కావాల్సిందేముంది ? ఇది కూడా గుజరాత్ అభివృద్ధి నమూనా, అచ్చేదిన్, నల్లధనం రప్పింపు వంటి కతల జాబితాలో చేరుతుందా !