Tags
ఎం కోటేశ్వరరావు
రావణుడి భార్య మండోదరి శాపానికి భయపడిన దేవతలు ఆమె నిత్య సుమంగళిగా వుండేందుకు గాను రావణుడి చితిని శాశ్వతంగా మండుతూనే వుండేట్లు ఏర్పాటు చేశారట. ఒక సమస్య ఎడతెగకుండా సాగుతూ వుంటే దాన్ని రావణకాష్టంతో మన పెద్దలు పోల్చారు. రావణుడిని తప్పుడు పద్దతుల్లో హతమార్చిన రాముడికి ఆలయాన్ని కడతా మంటున్న సంఘపరివార్, దానితో పోటీబడుతున్న ఇతర మతోన్మాద శక్తులు ఇప్పుడు రామాలయాన్ని కూడా అలాగే మార్చినట్లు ఈ పాటికే చాలా మందికి అర్ధం అయింది. ఆదివారం నాడు అయోధ్యలో రామాలయాగ్నికి విశ్వహిందూపరిషత్, శివసేన, ఇతరులు రానున్న రోజుల్లో మరింత ఆజ్యాన్ని పోస్తామని ప్రకటించారు.బాబరీ మసీదు స్ధల వివాదంపై సత్వరమే కోర్టు తీర్పు రాకుండా న్యాయమూర్తులను కాంగ్రెస్ బెదిరించిందంటూ ప్రధాని నరేంద్రమోడీ ఇదే సమయంలో ఎన్నికల సభల్లో ఆరోపించారు. వారికి అంత సీను వుంటే మూడు ముక్కలు చేసి ఒక ముక్కను ముస్లింలకు రెండు ముక్కలను హిందువులకు ఇవ్వాలని 2010లో తీర్పు చెప్పిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తులనే ప్రభావితం చేసి వుండేవారు ఏదీ దొరక్క ఆధారం లేని ఈ సాకును ప్రధాని ఎంచుకున్నారన్నది స్పష్టం. మరో విధంగా చెప్పాలంటే హిందూత్వశక్తులు ప్రకటించిన ఆందోళనకు మద్దతు తెలపటమే.
హిందూత్వ సంస్ధలు ప్రకటించినట్లుగా మరోసారి రామాలయ నిర్మాణాన్ని వుత్తరాదిన ముందుకు తెస్తున్నారు. దక్షిణాదిన శబరిమల అయ్యప్ప పేరుతో ఒక ఒక అరాచకాన్ని కొనసాగిస్తున్నారు. బిజెపి మతోన్మాదంతో కాంగ్రెస్ కూడా పోటీపడుతూ ఓట్ల కోసం రెండు సమస్యల్లోను మతాన్ని ముందుకు తెస్తోంది. మతోన్మాద బిజెపిని ఎదిరించాలంటే కాంగ్రెస్‌ను కలుపుకోవాలని సలహాలు ఇస్తున్న వారు ఒకసారి అవలోకనం చేసుకోవటం మంచిది. అయోధ్య, అయ్యప్ప రెండు ఆందోళనల నిర్వాహకులూ ఆర్‌ఎస్‌ఎస్ లేదా సంఘపరివార్ శక్తులే. గతంలోనూ తాజాగా శివసేన కూడా వారితో పోటీ పడుతోంది.ఆదివారం నాడు అయోధ్యలో నిర్వహించిన ధర్మ సభ సందర్భంగా రాష్ట్ర బిజెపి సర్కార్ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఆంక్షలను అమలు చేసింది. శివసేననేత వుద్దావ్ థాకరే నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.
దేశంలో మత లేదా మతోన్మాద శక్తులు అనుకున్నదొకటి, అవుతున్నదొకటి. వారు కోరుకున్నది ఒకటి వస్తున్న ఫలితం మరొకటి. శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి వయస్సుతో నిమిత్తం లేకుండా మహిళలందరికీ ప్రవేశం కల్పించాలన్న సుప్రీం కోర్టు తీర్పును ఒక వైపు వ్యతిరేకిస్తూ ఆలయ సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో కమ్యూనిస్టు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేస్తున్నారు. తమ ఆందోళన అసలు లక్ష్యం సిపిఎం నాయకత్వంలోని ప్రభుత్వాన్ని వ్యతిరేకించటమే అని బిజెపి నేత బాహాటంగా చెప్పాడు. అయోధ్య, శబరిమల రెండు చోట్లా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్నవారి గురించి జనం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం వుంది.
శబరిమల వుదంతంలో కోర్టు తీర్పు వచ్చేంతవరకు వేచి చూసి తాము అనుకున్నదానికి వ్యతిరేకంగా వచ్చే సరికి అయ్యప్పను వీధుల్లోకి లాగుతున్నారు. వయస్సులో వున్న ఆడవారు తనను చూడకూడదని అయ్యప్ప చెప్పటాన్ని తాము స్వయంగా విన్నామన్నట్లుగా మాట్లాడుతున్న వారు మరోవైపు అదే వయస్సులో వున్న మహిళలను ముందుకు తెచ్చి ఆందోళనలు చేయిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుతో నిమిత్తం లేకుండానే తాము కోరుకున్న విధంగా కేంద్రం ఒక చట్టాన్ని చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని రామమందిరం నిర్మించాలంటున్నారు. తాము కోరుకున్నది తప్ప కోర్టులు ఇచ్చిన తీర్పులను, ఇవ్వబోయే తీర్పులను కూడా తాము అంగీకరించేది లేదని రాజ్యాంగమూ, కోర్టులు, చట్టాలను తాము పట్టించుకొనేది లేదని ప్రకటించే వుగ్రవాద సంస్ధలకూ వీటికి తేడా ఏమిటో జనం ఆలోచించాలి.
పరిష్కారమైన శబరిమల కేసును తిరిగి వివాదంగా మార్చ చూస్తున్నది మతశక్తులు. తీర్పు రాక ముందే బాబరీ మసీదు స్ధల తీర్పు ఎలా వుండాలో నిర్దేశిస్తున్నారు. బాబరీమసీదు వివాదంలో సదరు స్ధలం ముస్లింలదే అని తీర్పు వచ్చే అవకాశం వుందని ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్ధలు భావిస్తున్నాయా? అందుకే ప్రత్యేక చట్టం చేసి భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాయా? కేంద్రంలో పూర్తి మెజారిటీ వున్న బిజెపి ప్రభుత్వం వుండగా నాలుగున్నర సంవత్సరాల పాటు వేచి వుండి ఆ డిమాండ్‌ను ఇప్పుడెందుకు ముందుకు తెచ్చినట్లు ? బాబరీ మసీదు స్థల వివాద కేసు తమకు అనుకూలంగా వస్తుందని భావించారా? స్ధల వివాద కేసులో వున్న అప్పీళ్లు జనవరిలో విచారణకు వస్తాయని, ఆ లోగా విచారించి తేల్చాల్సిన అత్యవసరమేమీ లేదని, వుత్తర ప్రదేశ్ ప్రభుత్వం, అఖిల భారత హిందూమహాసభ తదితరులు చేసిన వినతిని నవంబరు రెండవ వారంలో సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల లోపు ఆ కేసు తేలదని స్పష్టమై పోయింది. అసలింతకీ ఆ కేసు ఏమిటి? దాని మీద వచ్చే తీర్పు పర్యవసానాలేమిటి? అసలు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, ఆ స్ధలం పూర్తిగా తమదే అని త్వరలో రామాలయ నిర్మాణ తేదీని ప్రకటిస్తామని విశ్వహిందూ పరిషత్ నేతలు ప్రకటించారు. అంటే కరసేవ ముసుగులో బాబరీ మసీదును కూల్చివేసినట్లుగా యోగి సర్కార్ మద్దతుతో వివాదాస్పద స్ధలంలో రామాలయ నిర్మాణం చేపడతారా ?
సుప్రీం కోర్టులో నడుస్తున్న వివాదం ఆస్ధి పరమైనది. అయోధ్యలో వివాదాస్పద బాబరీ మసీదు స్దలాన్ని సేకరించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సవాలు చేసిన కేసులో ఇస్లాం మతావలంబనలో మసీదులు తప్పనిసరేమీ కాదని సుప్రీం కోర్టు 1994లో చెప్పింది.ఈ తీర్పును కూగా గమనంలోకి తీసుకొని 2010లో అలహాబాద్ హైకోర్టు 2.77 ఎకరాల బాబరీ మసీదు స్ధలాన్ని మూడు భాగాలుగా చేసి ఒక ముక్కను ముస్లింలకు, ఒక ముక్కను నిర్మోహీ అఖారాకు, మూడో ముక్కను రామాలయానికి ఇవ్వాలని చెప్పింది. ఆ తీర్పును ముస్లిం సంస్ధలు సవాలు చేశాయి. 1994 సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించాలన్న వినతిని ఇటీవల సుప్రీం కోర్టు 2-1 మెజారిటీతో తిరస్కరించింది. తీర్పు రాసిన ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తి అశోక్ భూషణ్ ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఆ తీర్పును పున:పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొనగా మరో న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ విబేధించి పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. 1994నాటి తీర్పు మతానికి సంబంధించింది కాదని భూసేకరణ సంబంధమైనదని ఇద్దరు న్యాయమూర్తులు చెప్పగా సమగ్ర పరిశీలన లేకుండానే నాటి తీర్పు ఇచ్చారని అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆ కేసులో చేసిన వ్యాఖ్యలు అలహాబాద్ హైకోర్టును ప్రభావితం చేశాయని అన్నారు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన 14 అప్పీళ్లను సుప్రీం కోర్టు విచారిస్తున్నది. సుప్రీం కోర్టు తీర్పును పున:పరిశీలించకుండా న్యాయమైన నిర్ణయానికి రాలేరని ముస్లిం సంస్ధల ప్రతినిధులు వాదిస్తున్నారు. ముందే చెప్పుకున్నట్లు ఈ ఏడాది సెప్టెంబరు 27న 1994నాటి తీర్పును పునర్విచారణకు తిరస్కరించిన సుప్రీం కోర్టు తమ విచారణ వాస్తవాలపైనే ఆధారపడి వుంటుందని, గత తీర్పు ఎలాంటి ప్రభావం చూపదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ విచారణను వేగంగా నిర్వహించాలని హిందూ సంస్ధలు చేసిన వినతిని నవంబరు 12న సుప్రీం కోర్టు తిరస్కరించింది. జనవరిలో చేపడతామని పేర్కొన్నది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు ముందే సుప్రీం కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వస్తుందని అనేక మంది ముఖ్యంగా హిందూ సంస్ధలు భావించాయి. ఈ కేసు విచారణ వచ్చే ఏడాది ఎన్నికల తరువాత జరపాలని గతేడాది డిసెంబరులో న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు.
ఈ పూర్వరంగంలో ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘపరివార్ సంస్ధలు, శివసేన రంగంలోకి దిగాయి. ఆదివారం నాటి ధర్మ సభ ఆఖరిదని తరువాత ఇంకెలాంటి సభలు వుండవని తదుపరి కార్యాచరణ రామాలయ నిర్మాణమే అని విశ్వహిందూపరిషత్ ప్రకటించింది. ప్రతి సారీ ఎన్నికల ముందు రామాలయ నిర్మా ణాన్ని లేవనెత్తి అక్కడే నిర్మిస్తామని చెబుతున్నారని ఎంతకాలమిలా జనాన్ని వెర్రి వెంగళప్పలను చేస్తారని శివసేన నేత వుద్దావ్ రెచ్చగొడుతున్నారు. ఇదంతా రానున్న ఎన్నికలను దృష్టిలో వుంచుకొని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందువలన ధర్మ సభ తరువాత ఈ శక్తులు ఎన్ని అధర్మాలకు, అరాచకాలకు పాల్పడతాయో చెప్పలేము. 1992 డిసెంబరు ఆరు నాటి బాబరీ మసీదు విధ్వంసం కేసులో అద్వానీ, మురళీమనోహర జోషి వంటి బిజెపి సీనియర్ నేతలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు.
ఓట్ల రాజకీయం గాకపోతే ఇంతకూ విశ్వహిందూపరిషత్, ఆర్‌ఎస్‌ఎస్ తదితర సంస్ధలు ఎవరికి వ్యతిరేకంగా ఎవరి మీద ఆందోళనలకు దిగుతున్నట్లు? అటు కేంద్రంలోనూ ఇటు అత్యధిక రాష్ట్రాలలోనూ బిజెపి అధికారంలో వుంది. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం చేయాలని ఆర్‌ఎస్‌ఎస్ కోరుతోంది. ఎవరు అడ్డుకున్నారు ?నెపాన్ని కోర్టులు, న్యాయమూర్తుల మీద, కాంగ్రెస్ మీద మోపే యత్నం తప్ప బాబరీ మసీదు వివాదంలో కోర్టు తీర్పులు చెల్లవు, ప్రభుత్వం చేసేదే అంతిమ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసినా అడ్డుకొనే శక్తి ప్రతిపక్ష పార్టీలకు లేదు. హిందూత్వ సంస్ధలు చేసే ఆందోళన దేశమంతటినీ మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ స్పందించకపోవటంలో ఆశ్చర్యం లేదు. నిద్రపోయే వారిని లేపగలం తప్ప నటించే వారిని లేపలేము. తన ప్రభుత్వ అన్ని రకాల వైఫల్యాల నుంచి జనం దృష్టిని మరల్చాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడవచ్చని అనేక మంది పరిశీలకులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.నేతల మాటల తూటాలను చూస్తే అవి ఎన్నికల్లో ఓట్లగాలం అన్నది స్పష్టం.
మతోన్మాద రాజకీయాల్లో బిజెపితో పోటీ పడుతున్న శివసేన నేత వుద్దావ్ ధాక్రే భార్య, కుమారుడితో సహా వచ్చి అయోధ్యలోని బాబరీమసీదు స్ధలంలోని వివాదాస్పద రాముడి విగ్రహాన్ని సందర్శించారు. మసీదు స్ధలంలో రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ తేవాలని కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రామాలయ నిర్మాణ అవకాశాలను చూస్తామంటున్నారు మీరు, గత నాలుగు సంవత్సరాలలో ఎన్నింటిని చూశారు, ఈ ప్రభుత్వం నిర్మాణం చేయకపోతే తరువాత ఎవరు చేస్తారు, ప్రభుత్వ ఏర్పాటు కాదు మందిరాన్ని త్వరగా నిర్మించాలి అని వుద్ధావ్ థాక్రే వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు ఆఖరి పార్లమెంటు సమావేశాలివే, అందువలన ఆర్డినెన్స్ తీసుకురండి, ఏమైనా చేయండి సాధ్యమైనంత త్వరలో ఆలయ నిర్మాణం చేయండి. నేను రామ్‌లాలా విగ్రహదర్శనానికి వెళితే ఒక జైల్లో ప్రార్ధనలకు వెళ్లినట్లుగా వుంది తప్ప మరొక విధంగా నాకు అనిపించలేదు. నాకు ఎలాంటి చాటు మాటు అజెండా లేదు, రామాలయాన్ని ఎపుడు కడతారని ఈదేశ హిందువులు అడుగుతున్నారు, ఎంతకాలం వేచి వుండాలి, కనుచూపు మేరలో మందిరం కనిపించటం లేదు,ఎప్పుడు దాన్ని చూస్తాము అని ధాకరే ప్రశ్నించారు. హిందువులింకేమాత్రం మౌనంగా వుండరు, కచ్చితంగా ఏ తేదీన నిర్మాణాన్ని ప్రారంభిస్తారో చెప్పండి, దాన్ని మీ నుంచి తెలుసుకొనేందుకే నేను ఇక్కడకు వచ్చాను అన్నారు. శివసేన అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బిజెపితో కలసి అధికారాన్ని పంచుకుంటోన్న విషయం తెలిసిందే.
రామాలయ ఆందోళనలో శివసేన పాత్ర లేదు, రామలాల విగ్రహాలను క్షణకాల సందర్శనకు వుద్ధావ్ ధాక్రేకు ఎలాంటి సమస్య లేదు, కానీ బాలాసాహెబ్ థాక్రే బతికి వుంటే వుద్ధావ్ చేస్తున్న వాటిని నిరోధించి వుండేవాడు, ధర్మసభ ఏర్పాటులోనూ శివసేనకు ఎలాంటి పాత్ర లేదు బాలాసాహెబ్ బతికి వుంటే విశ్వహిందూపరిషత్‌కే మద్దతు ఇచ్చి వుండేవాడు అని యుపి వుపముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించారు. రామాలయ సమస్యను శివసేన ఎలా హైజాక్ చేస్తుంది, వుత్తరాది వారి మీద దాడి చేసి వారిని వెళ్లగొట్టిన జనాలు వారు, మానవాళికి సేవచేయాలనే మానసిక స్ధితి కూడా లేని వారు రాముడిని ఎలా సేవించగలరు అని బిజెపి ఎంఎల్‌ఏ సురేంద్ర సింగ్ శివసేన నేత మీద విరుచుకుపడ్డారు. ఎన్నికలున్నందున ప్రతివారూ అయోధ్య వెళుతున్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా వుద్దావ్ థాక్రేను వెళ్లకుండా ఎవరు అడ్డుకున్నారు. ఒక వైపు వారు బిజెపి స్నేహితులు మరొకవైపు తాము రామాలయ నిర్మాణం పట్ల ఆసక్తితో వున్నామని, ప్రభుత్వంపై వత్తిడి తీసుకువస్తున్నట్లు చెబుతూ జనాన్ని వెర్రి వెంగళప్పలను చేయలేరు అని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.
కేసు సుప్రీం కోర్టులో వుంది. దాని తీర్పు కోసం వేచి చూడాలి లేదా ఏకాభిప్రాయాన్ని సాధించాలి, ప్రభుత్వానికి చాలా స్ధలం వుంది. సరయూ నదీ తీరంలో రామాలయాన్ని నిర్మించవచ్చు. వివాదాస్పద స్ధలం గురించి ఎలాంటి చర్చలు వద్దు అని ప్రగతిశీల సమాజవాది పార్టీ (లోహియా) నేత శివపాల్ యాదవ్ అన్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిదంటే నరేంద్రమోడీది అని చెబుతారు.182 మీటర్ల వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ రాజకీయాల్లో మోడీతో పోటీ పడుతున్న యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అంతకంటే పెద్దదైన 221 మీటర్ల రాముడి విగ్రహాన్ని నెలకొల్పి రికార్డును తన పేరుతో నెలకొల్పాలని చూస్తున్నారు. ఆదివారం ధర్మ సభకంటే ముందు ఒక రోజు హడావుడిగా విగ్రహ ప్రకటన చేయటం గమనించాల్సిన అంశం. విగ్రహాన్ని 50 మీటర్ల ఎత్తు దిమ్మె మీద ఏర్పాటు చేస్తారు. విగ్రహం 151 మీటర్లు కాగా మరో 20 మీటర్ల గొడుగు దాని మీద ఏర్పాటు చేస్తారు. దీన్ని ఎక్కడ, ఎంత ఖర్చుతో ఏర్పాటు చేస్తారో వివరాలు వెల్లడించలేదు.