Tags

, , , , , , ,

Image result for donald trump attack on socialism

ఎం కోటేశ్వరరావు

వెనెజులాలో నికొలస్‌ మదురోను అంగీకరించం, ఈ విషయంలో వెనక్కు పోయేది లేదు, ప్రజాస్వామ్యం మినహా సోషలిజాన్ని మనం అంగీకరించేదిలేదు, మిలిటరీ జోక్యంతో సహా అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నాం, మదురో క్యూబా తొత్తు అంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిప్పులు చెరుగుతూ పిడుగులు కురిపించాడని ఒక పత్రిక సోమవారం నాటి ప్రసంగాన్ని వర్ణించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో స్ధిరపడిన వెనెజులా సంతతి, వలస పౌరుల నుద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. మదురోను వదలి వేసి పార్లమెంట్‌ నేత జువాన్‌ గువైడోకు మద్దతివ్వాలని పౌరులు, మిలిటరీని కోరాడు. అక్కడ సోషలిస్టు ప్రభుత్వం వున్న కారణంగానే పదిలక్షల శాతం ద్రవ్యోల్బణం, ఆకలితాండవిస్తున్నదని, ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్న దేశం దారిద్య్రంలో చిక్కుకున్నదని, కొలంబియాద్వారా పంపదలచిన ఆహార సాయాన్ని మిలిటరీ అడ్డుకుంటున్నదని ఆరోపించాడు. ఫ్లోరిడాలోని మియామీ అంతర్జాతీయ విశ్వవిద్యాలయలో భార్య, కుమార్తెతో సహా పాల్గన్న సభలో మదురో ప్రభుత్వంపై బెదిరింపులు, సోషలిస్టు వ్యతిరేక చిందులు వేస్తూ వూగిపోయాడు. వెనెజులా స్వయంప్రకటిత అధ్యక్షుడు గువైడో రాజకీయ భవిష్యత్‌, సోషలిజానికి వ్యతిరేకతను ట్రంప్‌ ఫ్లోరిడా పర్యటనలో వక్కాణించాడు. సోషలిజం, కమ్యూనిజాల భయానక చర్యలను ప్రత్యక్షంగా భరించిన వారు వాటికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి మరియు ప్రతి ఒక్క రాజకీయ ఖైదీకి, వ్యతిరేకత ప్రకటించిన ప్రతి ఒక్కరికి తాము ఘన స్వాగతం పలుకుతామన్నాడు. అమెరికా యువతలో పెరుగుతున్న సోషలిస్టు భావాల వ్యాప్తిని అరికట్టేందుకు వెనెజులాను బలిచేయాలన్న కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేము.

జనవరి 23న గువైడో వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నప్పటి నుంచి చట్టబద్దంగా ఎన్నికైన అధ్యక్షుడు నికోలస్‌ మదురోను అధ్యక్షుడిగా గుర్తించేందుకు నిరాకరించటమేగాక ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అమెరికా చేయని ప్రయత్నం లేదు.సాయం ముసుగులో మదురో వ్యతిరేకులకు ఆయుధాలను చేరవేస్తున్న వాహనాలను కొలంబియా సరిహద్దులో వెనెజులా మిలిటరీ పట్టుకున్న విషయం తెలిసినదే. రోనాల్డ్‌ రీగన్‌ 37 సంవత్సరాల క్రితం మార్క్సిజం, లెనినిజం చరిత్ర బూడిద కుప్పలో కలసినట్లు నోరుపారవేసుకున్నాడు. ఫిబ్రవరి ఐదున అనూహ్యంగా అమెరికన్‌ పార్లమెంట్‌ వుభయసభలనుద్ధేశించి చేసిన ప్రసంగంలో వెనెజులా పరిణామాలను ప్రస్తావించి సోషలిజంపై దండెత్తి అమెరికాలో అనుమతించేది లేదన్నాడు. పదమూడు రోజుల తరువాత మరోసారి మియామీలో అదేపని చేశాడు. గత నెల రోజుల్లో అమెరికా-వెనెజులా పరిణామాలను చూసినట్లయితే ట్రంప్‌ స్వయంగా చెప్పినట్లు మిలిటరీ జోక్యానికి ఆఖరి అస్త్రంగా తగిన అవకాశం, సాకుకోసం అమెరికా చూస్తున్నది.

ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిని వినియోగించుకొని అమెరికన్లు గనుక వెనెజులాపై సైనిక చర్యకు వుపక్రమిస్తే శాశ్వత సభ్యరాజ్యాలైన చైనా, రష్యా వీటో ఆయుధాన్ని ప్రయోగిస్తాయి. మదురో ప్రభుత్వాన్ని అమెరికాతో అంటగాకే కొన్ని మినహా ఆ రెండు దేశాలతో పాటు మన దేశంతో సహా అన్నీ గుర్తించాయి. ప్రపంచ రాజకీయాలు, ఆర్ధిక పరిణామాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. రష్యన్‌ క్షిపణులు, ఎయిర్‌ క్రాఫ్ట్‌ , ఇతర ఆయుధాలను కొనుగోలు చేసి దానికి బదులుగా చౌకధరకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది. అమెరికా బెదిరింపులను సహించేది లేదంటూ రష్యాతో కలసి సైనిక విన్యాసాలు చేస్తోంది. అవసరమైతే తమ జెట్‌ బాంబర్లు, యుద్ధనావలు బాసటగా నిలుస్తాయంటూ ఇటీవలి కాలంలో తరచుగా వెనెజులా తీరాలు, విమానాశ్రయాలకు రష్యా నౌకలు, జెట్‌లు వచ్చి ఆగివెళుతున్నాయి. గత పది సంవత్సరాలలో చైనా 70బిలియన్‌ డాలర్ల మేరకు వివిధ వెనెజులా పధకాలలో పెట్టుబడులు పెట్టింది. లాటిన్‌ అమెరికాలో ప్రధాన రాజకీయ మద్దతుదారుగా క్యూబా వుంది. అమెరికా కుట్రలను ఎదుర్కోవటంలో, చిత్తు చేయటంలో ఎంతో అనుభవం గడించిన క్యూబన్లు భద్రతా, మిలిటరీ సలహాదారులను సరఫరా చేయటమే గాక తమకు అందిన సమాచారాన్ని మదురో సర్కార్‌కు అందిస్తోంది. తన వద్ద వున్న వైద్యులు, నర్సులు, ఇంజనీర్లవంటి నిపుణులను పదిహేను వేల మందిని పంపింది. దీనికి ప్రతిగా చౌకధరలకు వెనెజులా చమురు సరఫరా చేస్తోంది.

చమురు విక్రయాలను అడ్డుకొంటూ అనేక సమస్యలను సృష్టిస్తున్న అమెరికా చర్యల కారణంగా వెనెజులాలో అనేక వస్తువులకు కొరత ఏర్పడింది. దీన్ని సాకుగా చూపి సోషలిస్టు మదురో పాలన కారణంగానే ఇలాంటి పరిస్ధితి అంటూ సోషలిజానికి లంకెపెట్టి డోనాల్డ్‌ ట్రంప్‌ ఒక పధకం ప్రకారం పెద్ద ఎత్తున సోషలిస్టు వ్యతిరేక ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. దానిలో భాగమే అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండబోదన్న ప్రకటనకు పార్లమెంట్‌ వుభయసభల ప్రసంగాన్ని ఎంచుకున్నాడు. అప్పటి నుంచి అమెరికా మీడియాలో సోషలిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సహజంగానే వక్రీకరణలు చోటు చేసుకుంటాయని వేరే చెప్పనవసరం లేదు. అమెరికా జనానికి ఇప్పటి వరకు అక్కడి మీడియా ద్వారా సోషలిజం గురించి వక్రీకరణలు, వైఫల్యం చెందినదిగానే సమాచారాన్ని మెదళ్లకు ఎక్కించారు. ఇప్పుడు సోషలిజం గురించి వివరించటానికి, పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చెప్పేవారికి మీడియాలో కాస్తయినా చోటివ్వకతప్పటం లేదు. అందువలన యువతరంలో సోషలిజం మీద ఆసక్తిని పెంచటానికి ఇది దోహదం చేసే అవకాశం వున్నందున ఒక విధంగా సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. మారిన పరిస్ధితుల్లో అమెరికాలో పెట్టుబడిదారీ విధాన వైఫల్యం గురించి చర్చ మొదలు కావటం విశేషం. నిజానికి నాలుగైదు వందల సంవత్సరాల పెట్టుబడిదారీ వ్యవస్ధ చరిత్రలో ఆ వర్గానికి చెందిన వారి నోటే దాని వైఫల్యం గురించి పదే పదే వినిపిస్తోంది. ఈ పూర్వరంగంలో సోషలిజంపై ట్రంప్‌ దాడి గురించి రాసిన విశ్లేషణలకు పెట్టిన కొన్ని శీర్షికలు ఇలా వున్నాయి.’ సోషలిజంపై ట్రంప్‌ దాడి పెట్టుబడిదారీ విధానానికి సాయపడదు : చికాగో ట్రిబ్యూన్‌ ‘ ‘ భయ పడాలనా? భయపడవద్దనా-డెమోక్రాట్‌ గజెట్‌’ ‘

చికాగో ట్రిబ్యూన్‌ విశ్లేషణలో కొన్ని అంశాల సారాంశం ఇలా వుంది. అమెరికాలో సోషలిజానికి ఎన్నడూ ఆదరణ లేదు, ఇరవయ్యవ శతాబ్దంలో పశ్చిమ దేశాలలో సోషలిస్టు పార్టీలు గణనీయమైన ఆదరణ పొందాయి, ఇక్కడ కొద్ది మందికే పరిమితమైంది.1932లో మహా మాంద్యం సమయంలో సోషలిస్టు పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఇక్కడ కేవలం రెండుశాతం ఓట్లు మాత్రమే పొందారు. అయితే ఆలశ్యంగా అవకాశాలు మెరుగయ్యాయి.2016లో డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్నికలలో బెర్నీశాండర్స్‌ 13 రాష్ట్రాలు, బృందాలలో మద్దతు సంపాదించారు.గతేడాది అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఇద్దరూ సోషలిస్టులమనే ముద్రను గర్వంగా తగిలించుకున్నారు.ఇప్పుడు అధ్య క్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అనే ప్రముఖ రాజకీయవేత్తను ంచి సోషలిస్టులు ఒక శక్తిని పొందారు. ‘ మన దేశం సోషలిజాన్ని అనుసరించాలనే కొత్త పిలుపులు మనల్ని మేలుకొల్పాయి. అమెరికా ఎన్నడూ సోషలిస్టు దేశంగా వుండదని ఈ రాత్రి మన సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నా ‘ అని ట్రంప్‌ చెప్పారు. ఇంతకంటే మెరుగ్గా పెట్టుబడిదారీ విధానాన్ని సమర్ధించేవారు అవసరం. సోషలిజంపై దాడి చేయటం ద్వారా ఓటర్లలో ప్రత్యేకించి యువ ఓటర్లలో ట్రంప్‌ చిన్నబోయారు. వామపక్షానికి పెద్ద బహుమతి ఇది, పెట్టుబడిదారీ విధాన అభిమానులకు సంకట స్ధితి కలిగించుతుంది. డెమోక్రాట్లు వుదారవాదులుగా మారటానికి వారేమీ కారల్‌ మార్క్స్‌తోవలో నడవటం లేదు. వారిలో కొందరికి ఆర్ధికాంశాల గ్రహణ శక్తి పట్టుతప్పింది, దాని ఇబ్బంది కలిగించే వాస్తవాలు జుగుప్స కలిగించటం ఒక పాక్షిక కారణం. స్వేచ్చామార్కెట్‌ను సమర్ధించే ఆ పార్టీ నేతలు కొన్ని సామాజిసమస్యలను పరిష్కరించలేకపోవటం కూడా ఒక కారణం. ఆచరణాత్మక పరిష్కారాలకు సిద్ధపడకుండా మితవాదులు మరింత కఠినమైన భావజాలానికి కట్టుబడి వుండటం కూడా పాక్షికంగా అందుకు తోడ్పడింది. బరాక్‌ ఒబామా ప్రతిపాదించిన ఆరోగ్య సంరక్షణ పధకానికి ఒక రిపబ్లికన్‌ కూడా ఓటువేయలేదు, అదొక సోషలిస్టు చర్యగా చూశారు.

భయపడాలనా ? భయపడకూడదనా అనే శీర్షికతో డెమోక్రాట్‌ గజెట్‌ వ్యాఖ్యను మంచి మనుషులు లేదా మంచి భావజాలం మీద బురద చల్లటానికి ప్రత్యేకించి ముద్రలు వేస్తారు, వాటిని తాను ద్వేషిస్తానంటూ రచయిత దానిని ప్రారంభించాడు. ఈ రోజు అమెరికా రాజకీయాల్లో కొంత మంది డెమోక్రాట్లు అవలంభించిన దాని ముద్ర సోషలిజం. వుదారవాదులను చూసి మితవాదులు భయపడేందుకు అదే పదాన్ని రిపబ్లికన్‌ పార్టీ వుపయోగిస్తోందని చెబుతూ మధ్యలో సోషలిజం, కమ్యూనిజం గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన తరువాత ముగింపులో చెప్పిన అంశాలు అమెరికా సమాజంలో జరుగుతున్న సోషలిజం-పెట్టుబడిదారీ విధానాల మంచి చెడ్డల మధన పూర్వరంగంలో ఎంతో ముఖ్యమైనవి.వివిధ సర్వేలు తేల్చిన సారం ఏమంటే ఈ భూమ్మీద సంతోషంగా వున్న జనం నివశిస్తున్న దేశాలు ఏవంటే సోషలిస్టు ప్రజాస్వామిక వ్యవస్ధలు కలిగినవే. కొన్ని ప్రభుత్వ విధానాలు మరియు కార్యక్రమాలు నాణ్యమైన జీవితానికి అవసరమైన లబ్దికి హామీ ఇచ్చేవి, అంటే అందుబాటులో ఆరోగ్య రక్షణ, వ్యక్తిగతంగా తగినంత సెలవు దొరకటం, అందుబాటులో గృహవసతి, స్వచ్చమైన పర్యావరణం వంటివి. అయితే ప్రజాప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్ధలలో కోరుకున్నంత వ్యక్తిగత ఆస్ధి లేదా సంపదలను ఎంచుకోవటానికి స్వేచ్చ వుంటుంది. ఈ దేశాలు మౌలికంగా పెట్టుబడిదారీ విధానం మరియు సోషలిజంతో మిళితమై ఎంతో ప్రభావంతంగా మరియు ఆకర్షణీయంగా వుంటాయి. మనం సోషలిజం గురించి భయపడనవసరం లేదు. దాని కొన్ని సంకల్పాలతో మానవాళి లబ్ది పొందిందని మనసారా మనం గుర్తించాలి. ఆ తరువాత ఆ భావజాలాన్ని మన స్వంత దేశంలో వృద్ధి పొందించటానికి మనం పూనుకోవాలి.

Image result for a big debate on socialism in US

న్యూయార్క్‌టైమ్స్‌, లాస్‌ ఏంజల్స్‌ టైమ్స్‌, వాషింగ్టన్‌ పోస్టు వంటి బడా కార్పొరేట్ల పత్రికలు ఈ చర్చను విస్మరించలేకపోయాయి. స్ధలాభావం రీత్యా అన్నింటి సారం అందించటం సాధ్యం కాదు. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికాలో జరుగుతున్న సోషలిస్టు మధనం గురించి శత్రువులు ముందే గ్రహించారు. ప్రపంచమంతటా కారల్‌మార్క్సు 200వ జయంతిని జరుపుకుంటున్న సమయంలో ఆయన భావజాలాన్ని అరికట్టే బాధ్యతను తలకెత్తుకున్నామని చెప్పుకొనే అమెరికా సర్కార్‌ 2018 అక్టోబరు 23న సోషలిజం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ ఒక పెద్ద పత్రాన్ని విడుదల చేసింది. అమెరికా గనుక సోషలిస్టు విధానాలను అమలు జరిపితే భవిష్యత్‌లో సంభవించబోయే నష్టాలను దానిలో ప్రస్తావించారంటే సోషలిజాన్ని కోరుకుంటున్న యువతను సూటిగా వ్యతిరేకించకుండా మరోమార్గంలో వారి మెదళ్లను చెడగొట్టే ప్రయత్నం తప్ప వేరు కాదు. వెనెజులాలో ప్రస్తుతం అధికారంలో వున్న వామపక్ష శక్తులు తప్ప అక్కడ అమలు జరుపుతున్నది కొన్ని సంక్షేమ పధకాలతో కూడిన ప్రజాపాలన తప్ప శాస్త్రీయ సోషలిస్టు సమాజ నిర్మాణం కాదు. అలాగే ఐరోపాలో నోర్డిక్‌ దేశాలుగా వున్న డెన్మార్క్‌, స్వీడన్‌, ఫిన్లండ్‌, ఐస్‌లాండ్‌, నార్వేలలో వున్న మెరుగైన సంక్షేమ పధకాలను చూపి నిజమైన సోషలిస్టు దేశాలుగా చిత్రిస్తూ ఆ పత్రంలో చర్చించారు. వెనెజులా సోషలిస్టు పధకాలను అమెరికాలో అమలు జరిపితే దీర్ఘకాలంలో కనీసం 40శాతం జిడిపి తగ్గిపోతుందని ఆ పత్రంలో పేర్కొన్నారు.నోర్డిక్‌ దేశాల విధానాలను అనుసరిస్తే అమెరికాలో జిడిపి కనీసం 19శాతం తగ్గిపోతుందని ఏడాదికి రెండు నుంచి ఐదువేల డాలర్లు అదనంగా పన్ను విధించాల్సి వుంటుందని, అమెరికాతో పోల్చితే ఈ దేశాల్లో జీవన ప్రమాణాలు పదిహేనుశాతం తక్కువగా వున్నాయని పేర్కొన్నారు. అమెరికాలోని సోషలిస్టులు కోరుతున్న విధంగా ఆరోగ్యఖర్చునున నోర్డిక్‌ దేశాలలో మాదిరి పూర్తిగా ప్రభుత్వమే భరిస్తే 2022నాటికి జిడిపి తొమ్మిదిశాతం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపటం ఎలా సాధ్యం కాదో వక్రీకరణలతో సోషలిజం గురించి తెలుసుకోకుండా జనాన్ని నివారించటం కూడా అంతే !