Tags

, , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి(63) ఆదివారం నాడు జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం చెందాడు. విదేశాంగ మంత్రి హుస్సేన్‌ అమీర్‌ అబ్దుల్లా మరో ఏడుగురు కూడా మరణించారు.వారిలో ముగ్గురు హెలికాప్టర్‌ సిబ్బంది, అధ్యక్షుడి భద్రతా విభాగ కమాండర్‌, తూర్పు అజర్‌బైజాన్‌లో ఖమేనీ ప్రతినిధి, తూర్పు అజర్‌బైజాన్‌ గవర్నర్‌ ఉన్నారు. సరిహద్దులో ఉన్న అజరైబైజాన్‌లో సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించిన విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డామ్‌ ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తుండగా పొగమంచు. వర్షంతో కూడిన వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ పర్యతాల్లో కూలిపోయింది. ఈ దుర్ఘటన వెనుక ఇజ్రాయెల్‌, అమెరికా హంతక గూఢచార సంస్థలు మొసాద్‌, సిఐఏ హస్తం ఉండవచ్చని సామాజిక మాధ్యమంలో అనేక మంది అనుమానాలను వెలిబుచ్చారు. మంగళవారం ఇది రాసిన సమయానికి ఇరాన్‌ ప్రభుత్వం నుంచి అలాంటి ఆరోపణలు రాలేదు. మన ప్రధాని నరేంద్రమోడీతో సహా అనేక దేశాల నేతలు సంతాపాలు ప్రకటించారు. ప్రస్తుతం దేశ సర్వాధినేతగా ఉన్న మతనాయకుడు అయాతుల్లా అలీ ఖమేనీ(85) వారసుడిగా రైసీ బాధ్యతలు చేపడతారని భావిస్తున్న తరుణంలో ఈ ఉదంతం జరిగింది. దీంతో అధ్యక్షుడు, ఖమేనీ వారసుడు ఎవరన్న చర్చ మొదలైంది.రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు మరణించినా, పదవి కాలం ముగిసినా 50రోజుల్లో కొత్త నేతను ఎన్నుకోవాలి. అప్పటివరకు ఉపాధ్యక్షులలో ప్రధమంగా ఉన్న మహమ్మద్‌ మొక్బర్‌ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలను చేపట్టాడు. జూన్‌ 28వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.


ఇబ్రహీం రైసి తీరుతెన్నులను చూసినపుడు రెండు ముఖాలు కనిపిస్తాయి.ఒకటి నిరంకుశ మతోన్మాదం, రెండవది తిరుగులేని సామ్రాజ్యవాద వ్యతిరేకత. మరణవార్త నిర్దారణ కాగానే ఇరాన్‌ మతవర్గాలలో దిగ్భ్రాంతి, దేశమంతటా సామాన్య జనంలో సంతోష ఛాయలు, ఊపిరి పీల్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. పాలక ప్రముఖులతో జరిపిన సమావేశంలో ఖమేనీ మాట్లాడుతూ ” దేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాజ్య వ్యవహారాల్లో ఎలాంటి అటంకాలు తలెత్తవు” అని చెప్పిన మాటలను బట్టి తన పునాదులు కదిలినట్లు, కుడి భుజాన్ని కోల్పోయిన భయం వాటి వెనుక ఉన్నట్లు స్పష్టమైందని ఒక అభిప్రాయం వెలువడింది.యువకుడిగా ఉన్నపుడే మత ఛాందసాన్ని వంటబట్టించుకున్న ఇబ్రహీం రైసి 1979లో ఇరాన్‌ ఇస్లామిక్‌ విప్లవం పేరుతో జరిగిన పరిణామాల్లో ఖమేనీ అనుచరుడిగా ఉన్నాడు.తరువాత మరింత సన్నిహితుడిగా, దేశ సర్వాధినేతను ఎంపిక చేసి, పర్యవేక్షణ చేసే నిపుణుల కమిటీలో 2006 నుంచి పనిచేశాడు. 2021లో దేశ అధ్యక్షుడిగా అంచెలంచెలుగా వీర విధేయుడిగా ఎదిగాడు.ఐరాస మానవహక్కుల సంస్థ అతని పాత్రను ఖండించగా అమెరికా ఆంక్షలు విధించింది. అనేక అక్రమాలు, అనేక మంది అభ్యర్థులను పోటీకి అనర్హులుగా చేసిన 2021 అధ్యక్ష ఎన్నికలలో అడ్డగోలు పద్దతిలో గెలిచాడనే విమర్శలు ఉన్నాయి. రైసీకి మతపెద్దలతో పాటు మిలిటరీ మద్దతు కూడా ఉన్న కారణంగానే ఎన్నిక సాధ్యమైందని చెబుతారు. ఆ ఎన్నికల్లో దేశ చరిత్రలోనే అత్యంత తక్కువగా 50శాతానికి లోపు ఓట్లు పోలయ్యాయి.


దైవ నిర్ణయం అంటూ మత నేత అయాతుల్లా అలీ ఖమేనీ ఆదేశాల మేరకు 1998లో 30వేల మందికి పైగా రాజకీయ ఖైదీలను ఉరితీశారు. వీరిలో అధికులు పీపుల్స్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందిన ప్రత్యర్ధులే ఉన్నారు. చరిత్రలో అత్యంత హీన నేరగాండ్లుగా నమోదైన వారి జాబితాలో చేరి ఈ మారణకాండకు బాధ్యులైన ముగ్గురిలో ఇబ్రహీం రైసీ ప్రముఖుడు. అందుకే అతన్ని ” టెహరాన్‌ కసాయి ” అని పిలిచారు. ఖమేనీ న్యాయమూర్తుల అధిపతిగా ఉన్న రైసీ 2019లో తలెత్తిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేతలుగా ఉన్న వారితో సహా తరువాత తన పదవీ కాలంలో మొత్తం పదిహేను వందల మందిని ఉరితీయించినట్లు, వారిలో తాను అధ్యక్షుడైన తరువాత 2022లో తలెత్తిన నిరసనల సమయంలో 750 మంది ఉన్నట్లు వార్తలు వవచ్చాయి. జైళ్లు, ఇతర నిర్బంధ శిబిరాలలో మధ్యయుగాలనాటి ఆటవిక పద్దతుల్లో వేలాది మందిని చిత్రహింసలకు గురిచేసినట్లు కూడా వెల్లడైంది. మితవాద మతశక్తులను సంతుష్టీకరించేందుకు అధ్యక్షుడిగా తీసుకున్న చర్యలు జనంలో తీవ్ర అసంతృప్తి, నిరసనలకు దారితీశాయి. ముఖ్యంగా నైతిక పోలీసులను రంగంలోకి దించి సమాజాన్ని మత గిరి నుంచి కదలకుండా చేసేందుకు చూశాడు. ఈ క్రమంలోనే మహషా అమీ అనే యువతిని పోలీసు కస్టడీలో చంపివేయటంతో గడచిన ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి.దాదాపు ఐదు వందల మంది నిరసనకారులను చంపివేశారంటే అణచివేత ఎంత క్రూరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.వందలాది మంది జాడ ఇప్పటికీ తెలియదు.వారిని కూడా చంపివేశారా, జైళ్లలో ఉంచారా అన్నది కూడా స్పష్టం కాలేదు.హిజాబ్‌ ధరించకుండా ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యవహరించిందనే ఆరోపణతో మహషా అమీని నైతిక పోలీసులు ఆమెకు నీతి పాఠాలు బోధించే పేరుతో ఒక చిత్ర హింసల శిబిరంలో ప్రాణాలు తీశారు. ఈ సందర్భంగా ఇబ్రహీం రైసి మతాధినేతకు చూపిన విధేయత కారణంగా ఖమేనీకి తగిన వారసుడు అతనే అనే అభిప్రాయం కలిగింది.


అజర్‌బైజాన్‌కు రైసి ప్రయాణించిన హెలికాప్టర్‌ దశాబ్దాల నాటి పాతదనే వార్తలు అక్కడి పరిస్థితికి అద్దం పడుతున్నది.ఆంక్షల కారణంగా దాని మరమ్మతులకు అవసరమైన విడిభాగాలు లేవని, ఆధునిక తరానికి చెందిన వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వచ్చిన వార్తలు నమ్మశక్యంగా లేవు. అమెరికా, ఇతర పశ్చిమదేశాల ఆంక్షలు, అసమర్ధత, అవినీతి కారణంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది, వాటిని పరిష్కరించటంలో పాలకులు విఫలమయ్యారు.దానిపై తలెత్తుతున్న నిరసనలను అణచివేస్తున్నారు.రైసి పదవిలోకి వచ్చే నాటికి 40శాతంపైగా ఉన్న ద్రవ్యోల్బణం 2022లో 45శాతం దాటింది. అది తరువాత క్రమంగా తగ్గుతున్నప్పటికీ 2029నాటికి 25శాతానికి పరిమితం అవుతుందని అంచనాలు వెలువడ్డాయి.అమెరికా బెదిరింపుల కారణంగా మన మిత్రదేశంగా ఉన్నప్పటికీ ఇరాన్నుంచి చమురు కొనుగోలు నిలిపివేశాము. అయితే చైనా భారీ ఎత్తున దిగుమతి చేసుకొని ఆదుకుంటున్నది. అంతర్జాతీయ రాజకీయాల్లో ఇబ్రహీం రైసి సామ్రాజ్యవాద వ్యతిరేకతలో తిరుగులేని వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది.ఇటీవలి సంవత్సరాలలో అమెరికా దాని కనుసన్నలలో నడిచే ఇతర సామ్రాజ్యవాద, వాటి అనుయాయిలకు వ్యతిరేకంగా చైనా, రష్యాలతో సంబంధాలను మరింతగా పటిష్టపరుచుకున్నాడు.ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు అవసరమైన డ్రోన్లు, మందుగుండు, ఇతర మిలిటరీ పరికరాలను రష్యాకు సరఫరా చేస్తున్నాడు. ఎమెన్‌ అంతర్యుద్ధంలో ఇరాన్‌ అనుకూల హౌతీ సాయుధులను అణచేందుకు అమెరికా తరఫున రంగంలోకి దిగిన సౌదీ అరేబియా సాగించిన దాడుల గురించి తెలిసిందే. అలాంటి సౌదీతో ఏడు సంవత్సరాల తరువాత చైనా మధ్యవర్తిత్వంలో 2023లో సాధారణ సంబంధాలను ఏర్పాటు చేసుకోవటం పశ్చిమాసియా పరిణామాల్లో ఎంతో కీలకమైనది. ఇంతేకాదు అమెరికా తొత్తుగా ఉన్న ఇజ్రాయెల్‌ను వ్యతిరేకించే దేశాలు, పలుచోట్ల ఉన్న సాయుధశక్తులకు భారీ ఎత్తున ఇరాన్‌ అన్ని విధాలుగా సాయం చేస్తున్నది.


పశ్చిమ దేశాల వ్యతిరేకతలో భాగంగానే ఆంక్షలు తమను మరింతగా దెబ్బతీస్తాయని తెలిసినప్పటికీ అణుబాంబుల తయారీకి అవసరమైన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. బాంబుల పరీక్షే తరువాయి అన్నట్లుగా పశ్చిమదేశాలు భావిస్తున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ 2023 అక్టోబరు ఏడు నుంచి ప్రారంభించిన మారణకాండకు వ్యతిరేకంగా ఇరాన్‌ తన వంతు పాత్రను పోషిస్తున్నది. ఇజ్రాయెల్‌-అమెరికాతో నేరుగా ఘర్షణకు తలపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది.సిరియాలోని తన రాయబార కార్యాలయంపై దాడిచేసి కీలకమైన వ్యక్తులను హత్య చేసి ఇజ్రాయెల్‌ ఎంతగా కవ్విస్తున్నప్పటికీ రెచ్చిపోకుండా అవసరమైతే తన సత్తా ఏమిటో చూడండి అన్నట్లుగా తొలిసారిగా పరిమిత డ్రోన్లు, క్షిపణుల దాడి జరిపింది. అది ఇజ్రాయెల్‌ రక్షణ కవచంలో ఉన్న లొసుగులను బయటపెట్టింది. తరువాత ఇజ్రాయెల్‌ ప్రతిదాడి జరిపినప్పటికీ సంయమనంతో ఉంది. రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడిగా మత నేత ఎవరిని ఎంపిక చేస్తాడు అన్నది సంతాపదినాలు, అంత్యక్రియలు ముగిసే గురువారం తరువాత వెల్లడి అవుతుంది. నూతన నేత ఎవరైనప్పటికీ అంతర్గత, అంతర్జాతీయ విధానాల్లో పెనుమార్పులు ఉండే అవకాశం ఇప్పటికైతే కనిపించటం లేదు. ఎంతకాలం ఇలా ఆంక్షలతో ఇబ్బంది పడతాం ఏదో విధంగా ఇరాన్‌ పశ్చిమదేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవాలనే లాబీకూడా అక్కడ బలంగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయితే ఇరాన్‌పట్ల అనుసరిస్తున్న వైఖరిలో పశ్చిమ దేశాల్లో ఎలాంటి సడలింపులు లేని కారణంగా బహిర్గతం కావటం లేదని చెప్పవచ్చు. ఇబ్రహీం రైసీ స్థానాన్ని సుప్రీం నేతగా ఉన్న అలీ ఖమేనీ కుమారుడు మొజ్‌తాబా స్వీకరిస్తాడని భావిస్తున్నారు.ఒకవేళ అదే జరిగితే గతంలో రాజరికానికి వ్యతిరేకంగా పోరాడిన ఇరానియన్లు వారసత్వ అధికారాన్ని సహిస్తారా, ప్రతిపక్షం పుంజుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.


అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప ఎవరు అధికారానికి వచ్చినా వర్తమాన స్థితే కొనసాగవచ్చు.ప్రకటించిన సమాచారం మేరకు జూన్‌ 28 శుక్రవారం నాడు అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి.నామినేషన్ల ప్రక్రియ మే 30 నుంచి జూన్‌ మూడువరకు జరుగుతుంది. పన్నెండవ తేదీ నుంచి 27 ఉదయం వరకు ప్రచారం చేసుకోవచ్చు.దీనితో పాటు సుప్రీం నేతను ఎన్నుకొనే 88 మంది సభ్యులుండే పార్లమెంటు లేదా మజ్లిస్‌ ఎన్నికలు కూడా జరుగుతాయి. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు, దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి ఎన్నికల ద్వారా మితవాద మతశక్తులను గద్దె దించటం సాధ్యంగాకపోవచ్చని చెప్పవచ్చు.నిరంకుశ,మిత, మతవాద శక్తుల తీరుతెన్నులను బట్టి ఒకసారి అధికారానికి వచ్చిన తరువాత భిన్నమైన భావాలను,శక్తులను అనుమతించటం ఎక్కడా జరగలేదు. అంతర్గత కుమ్ములాటలు లేదా తిరుగుబాట్ల ద్వారానే మార్పు సాధ్యమైంది.ఇరాన్‌ ఎన్నికల్లో జోక్యం చేసుకొనేందుకు అమెరికా పూనుకుంటుందా ? అంటే తగిన బలమైన ప్రత్యర్థి ముందుకు వస్తే కాదనలేము. రెండవది జో బైడెన్‌ పరిస్థితే అనుమానంగా ఉన్నపుడు తన దృష్టిని ఇటువైపు కేంద్రీకరిస్తాడా ? ఇజ్రాయెల్‌ విషయానికి వస్తే గాజా మారణకాండకు నేతృత్వం వహిస్తున్న నెతన్యాహు పరిస్థితి కూడా అగమ్యగోచరంగానే ఉంది.దురహంకార పులి ఎక్కిన అతడు గాజాలో హమస్‌ను అణచటంలో విఫలమైనట్లు ప్రత్యర్థులు ఇప్పటికే రెచ్చగొడుతున్నారు.రష్యా, చైనా విషయానికి వస్తే అవి మరొకదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం మనకు ఎక్కడా కానరాదు. ఇరాన్‌లో ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత అక్కడి పరిస్థితి, పరిణామాల గురించి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.