Tags

, , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


దేశ వనరుల మీద తొలి హక్కుదారులు ముస్లింలని కాంగ్రెస్‌ చెప్పిందని, వారు చొరబాటుదారులు, కాంగ్రెస్‌ అధికారానికి వస్తే పుస్తెలతో సహా ఆస్తులన్నీ స్వాధీనం చేసుకొని వారికి పంచుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల సభల్లో ఆరోపించారు. ఎప్పుడో 2006లో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడారంటూ నరేంద్రమోడీ వేసిన నిందల గురించి మోడీ అలా మాట్లాడి ఉండాల్సింది కాదు అని అభిమానులే అంటున్నారు. అసలింతకీ అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ? దేవుడు నైవేద్యం తినడని పూజారికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి గురించి మోడీకి అర్ధమైందా ? ప్రతి ఎన్నికలో ఏదో ఒక అంశాన్ని సంచలనంగావిస్తే తప్ప జనానికి కిక్కు ఎక్కదని, ఓట్లు రాలవని ఈ ఎన్నికల్లో దీన్ని ఎంచుకున్నారా ? మతాల వారీ జనాలను చీలిస్తే తప్ప గట్టెక్కలేననే భయం పట్టుకుందా ?ఇలా పరిపరి ఆలోచనలు. నిజం గడపదాటేలోగా అబద్దం ఊరంతా చుట్టి వచ్చి ఎదురుగా నిలుస్తుందన్న లోకోక్తి తెలిసిందే. నరేంద్రమోడీ చెప్పిన అంశాల్లో నిజానిజాలేమిటి అని ఎందరు జనం లోతుల్లోకి వెళతారు. రాందేవ్‌ బాబా క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చానని చెప్పారు. ఇచ్చారు సరే అవి ఎంత పెద్దవో, ఏ పత్రికల్లో ఇచ్చారో వివరాలు ఇవ్వండని సుప్రీం కోర్టు ఆదేశించింది. అలాగే ప్రధాని చెప్పిన మాటల నిజానిజాల గురించి కూడా ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం కదలదు. అలా జరుగుతుందా ?


విశ్వగురువుగా తనను తాను భావించుకుంటున్న లేదా భజన సమాజం చిత్రిస్తున్నప్పటికీ మోడీ పచ్చి అవాస్తవాలు చెప్పారని కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలను నిర్ధారించుకొని ప్రచురించాయి. అసలు మోడీ ఏం చెప్పారు. ది క్వింట్‌ అనే పత్రిక వాస్తవాలను వెల్లడించింది.దాన్ని కాదని మోడీ చెప్పిందే నిజమని ఆధారాలతో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వానికి, బిజెపికి ఉందా ? రాజస్తాన్‌లోని బన్స్‌వారా ఎన్నికల సభలో మాట్లాడుతూ ” దేశ వనరుల మీద తొలి హక్కు ముస్లింలకే ఉందని అధికారంలో ఉండగా కాంగ్రెస్‌ చెప్పింది. దీని అర్ధం ఏమంటే సంపదలన్నింటినీ వారు సమీకరించి ఎవరికి పంచుతారు.ఎవరికి ఎక్కువ మంది పిల్లలుండే వారికి, అక్రమంగా చొరబడిన వారికి వారు పంచుతారు. కష్టపడి సంపాదించుకున్నదానిని చొరబాటుదారులకు ఇవ్వాలా? మీరు దీన్ని అంగీకరిస్తారా ? కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళిక చెప్పింది ఇదే. మన తల్లులు, సోదరిమణుల దగ్గర ఉన్న బంగారాన్ని లాక్కుంటారు, వాటిని లెక్కించి పంపిణీ చేస్తారు ” అని చెప్పారు.దీనికి ఆధారంగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన ప్రసంగాన్ని ఉటంకించారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో కమ్యూనిస్టులు అధికారానికి వస్తే మగవారిని సుత్తితో తల మీద మోది కొడవలితో గొంతు కోస్తారని, ఆడవారి మెడల మీద కాడి మోపి పొలాలు దున్నిస్తారంటూ కాంగ్రెస్‌ చేసిన తప్పుడు ప్రచారాన్ని మోడీ గుర్తుకు తెచ్చారు.


” వనరులను కోరే తొలి హక్కు ముస్లింలకే ఉండాలి: ప్రధాని ” అంటూ జాతీయ అభివృద్ది మండలి 52వ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చెప్పారంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక 2006 డిసెంబరు తొమ్మిదవ తేదీన తప్పుదారి పట్టించే శీర్షికతో ఒక వార్తను ప్రచురించింది. ఆ మరుసటి రోజే అది కావాలని చేసిన తప్పుడు భాష్యం, ఆధారాల్లేవంటూ ప్రధాని కార్యాలయం ఒక ఖండన ప్రకటన జారీ చేసింది. ప్రధాని మాట్లాడింది ఇది అంటూ ప్రసంగ పాఠాన్ని కూడా దానికి జత చేసింది.దాని ప్రకారం ” మన ఉమ్మడి ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. వ్యవసాయం, సాగునీరు, జలవనరులు,ఆరోగ్యం, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలకు అవసరమైన కీలక పెట్టుబడులు,దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతులు,మైనారిటీలు, మహిళలు, పిల్లల అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలతో పాటు ప్రజలందరికీ అత్యవసరమైన సాధారణ మౌలికవసతులు వీటిలో ఉన్నాయి.దళితులు, గిరిజనులకు ఉద్దేశించిన ఉప పథకాలను పునరుజ్జీవింప చేయాలి.మైనారిటీలు ప్రత్యేకించి ముస్లింలు అభివృద్ధి ఫలాలను సమంగా పొందేలా సాధికారత కల్పించేందుకు మనం కొత్త పధకాలను కనుగొనాల్సి ఉంది.వనరులను పొందే యోగ్యతను వెల్లడించే తొలి వారుగా ఉండాలి ” అని చెప్పారు.


దళితులు, గిరిజనుల ఉద్దరణకు ఉప ప్రణాళికలు ఉన్నట్లుగానే తమకూ ఉండాలని వెనుకబడిన తరగతులు, ముస్లింలూ ఎప్పటి నుంచో కోరుతున్నారు.మానవాభివృద్ధి సూచికలు, దారిద్య్ర వివరాలను చూసినప్పటికీ 2019లో మన దేశానికి సంబంధించి ఐరాస వెల్లడించిన వివరాల ప్రకారం 2018లో ప్రతి ఇద్దరు గిరిజనుల్లో ఒకరు, ప్రతి ముగ్గురు దళితులు, ముస్లిముల్లో ఒకరు పేదలుగా ఉన్నారని తేలింది.దేశ జనాభాలో 2011లెక్కల ప్రకారం 16.6శాతం దళితులు, 8.6శాతం గిరిజనులు, 14.2శాతం ముస్లింలు ఉన్నారు. మతాలు వేరు గావచ్చు తప్ప, పేదరికం, అన్ని రకాల వెనుకబాటులో వీరందరి పరిస్థితి ఒకే విధంగా ఉందని ప్రభుత్వ వివరాలే వెల్లడిస్తున్నాయి. ఇతర మైనారిటీలైన సిక్కులు, క్రైస్తవులు, జైనులు,బౌద్దులు ఇతరుల్లో పరిస్థితి ఇలా ఉందని ఎవరైనా చెప్పగలరా ? దేశంలో ఇప్పుడు 22 కోట్ల మంది పేదలున్నారని, వారందరినీ రానున్న పది సంవత్సరాల్లో ఉద్దరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికల ప్రణాళికలో చెప్పింది తప్ప మరొకటి కాదు.బిజెపి చెప్పే సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌లో ముస్లింలను మినహాయిస్తామని చెప్పగలదా ?


ఇక ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కని జనాభాను పెంచేస్తున్నారని, ముస్లిం మెజారిటీ దేశంగా మార్చనున్నారనే విద్వేష ప్రచారం ఎప్పటి నుంచో దేశంలో సాగుతోంది.ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ముస్లింల పాలన, తరువాత ఆంగ్లేయుల ఏలుబడి దేశంలో ప్రారంభమైంది. నిజానికి మెజారిటీగా మారేందుకు ఎక్కువ మంది పిల్లలను కన్నా, మతమార్పిడులు చేసినా ఎప్పుడో ముస్లిం, క్రైస్తవ దేశంగా మారి ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 79.8, ముస్లింలు 14.2శాతమే ఉన్నారు. పిల్లలను ఎక్కువగా కనటానికి కారణాల్లో దారిద్య్రం, విద్యలేమి వంటి అనేక అంశాలున్నాయి. కుటుంబ నియంత్రణ గురించి గడచిన ఆరున్నర దశాబ్దాలుగా ప్రచారం చేస్తున్నప్పటికీ హిందువుల్లో 54.4శాతం ఉండగా ముస్లింలలో 45.3శాతం ఉంది. సగటున ముస్లింలు 2.36, హిందువులు 1.94 మందిని కంటున్నట్లు తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది. రెండు మతాల వారి మధ్య పెద్ద తేడా ఏముంది. గణాంకాలను చూసినపుడు ముస్లింలలో జనాభా పెరుగుదల రేటు తగ్గుదల ఎక్కువగా ఉంది.1961-91 జనాభా పెరుగుదల రేటు వివరాలను చూసినపుడు మధ్యలో పెరిగినా, తగ్గినా హిందువుల్లో 20.7 నుంచి 22.7శాతం ఉండగా ముస్లింలలో 32.7 నుంచి 32.9శాతం ఉంది. తరువాత కాలంలో 2011 నాటికి హిందువుల్లో 16.7శాతం ఉండగా ముస్లింలలో 24.7శాతం ఉంది. తగ్గుదల రేటు ముస్లింలలో ఎక్కువగా ఉంది.


ఇక నరేంద్రమోడీ చేసిన ఎన్నికల ప్రసంగంపై అంతర్జాతీయ మీడియాలో దేశ పరువు తీసే విధంగా వార్తలు వచ్చాయి.గతంలో రాహులు గాంధీ విదేశాల్లో మోడీ విధానాల గురించి మాట్లాడి దేశ పరువు తీశారని విమర్శించిన బిజెపి ఇప్పుడు నరేంద్రమోడీ దేశంలో ఉండే చేసిన వ్యాఖ్యలు దేశపరువును ప్రశ్నార్ధకం చేసినందున ఏం చెబుతుంది ? ఫ్రాన్స్‌ 24 టీవీ, వెబ్‌సైట్‌ ” ఆశ్చర్యం కలిగించని అసహ్యకర ప్రసంగం ” అన్న శీర్షికతో వార్తను ప్రసారం చేసింది. ఈ ప్రసంగం తరువాత మోడీ మీద చర్య తీసుకోవాలని పదిహేడు వేల మంది పౌరులు ఎన్నికల కమిషన్‌కు పంపిన వినతి మీద సంతకాలు చేసినట్లు పేర్కొన్నది. గత పది సంవత్సరాలుగా భారత్‌లో ఎన్నికలను పరిశీలిస్తున్నవారికి మోడీ ప్రసంగం ఆశ్చర్యం కలిగించలేదని, తన పునాదిని పెంచుకొనేందుకు విద్వేష ప్రసంగాలు చేయటంలో జయప్రదమైనట్లు పేర్కొన్నది. తాజాగా చేసిన అసహ్యకర ప్రసంగం గత పదిసంవత్సరాలలో చేసిన ప్రచారానికి అనుగుణంగా ఉందని, ప్రపంచ వేదికల మీద చెప్పే మాటలకు పూర్తి విరుద్దంగా స్వదేశంలో ప్రసంగాలు చేస్తున్నట్లు ఒక విశ్లేషకుడు చెప్పిన మాటలను ఉటంకించింది..


” భారతీయ ముస్లింలను చొరబాటుదారులని మోడీ ఎందుకు వర్ణించారు ?ఎందుకంటే అతను అనగలడు ” అంటూ అమెరికాలోని ప్రముఖ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించిన వార్తకు శీర్షిక పెట్టింది.భారత్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న మైనారిటీ సామాజిక తరగతిని నిందిస్తూ సిగ్గులేకుండా ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడటానికి దేశంలో లేదా బయటా తన అధికారానికి ఆటంకాలు ఏర్పడతాయని ఆయనకు కనిపిస్తున్నట్లు స్పష్టం చేయటమే అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. దేశంలో అధికారం,హిందూ ధోరణలు లోతుగా నాటుకున్న తరువాత ఆర్థికంగా, దౌత్య పరంగా భారత ఎదుగుదలను అవకాశంగా తీసుకొని ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా పాత్ర పోషించేందుకు దృష్టిసారించారు. ఆ క్రమంలో ఎన్నికల్లో లబ్ది పొందేందుకు స్వంత పార్టీ చేస్తున్న మతపరమైన విభజిత కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కానీ స్వదేశంలో తన అధికారానికి కొన్ని ఆటంకాలు ఏర్పడినట్లు మోడీకి కనిపిస్తున్నదని సిగ్గులేని తనం స్పష్టం చేసింది.స్వదేశంలో నిఘా సంస్థలు(మీడియా, అధికారిక, అనధికారిక నిఘా) మొత్తంగా భారతీయ జనతా పార్టీకి అనువుగా మారాయి.చైనాను నిలువరించేందుకు గాను భారత్‌ను నిలబెట్టాలని చూస్తున్నకారణంగా దేశంలో నరేంద్రమోడీ ఏం చేస్తున్నారో చూడనిరాకరణ విదేశీ భాగస్వాముల్లో పెరుగుతున్నదని పేర్కొన్నది.ప్రతిపక్షాలను అణచివేయటం, మైనారిటీలను లక్ష్యం చేసుకుంటున్న కొన్ని మోడీ చర్యల గురించి ఢిల్లీలోని పశ్చిమదేశాల దౌత్యవేత్తలు ప్రయివేటు సంభాషణల్లో దాచుకోవటం లేదు. చైనా, వాణిజ్య ఒప్పందాల గురించి కేంద్రీకరించటం తప్ప గతంలో మాదిరి సానుకూలంగా లేనప్పటికీ బహిరంగంగా మాట్లాడకపోవటాన్ని మోడీ సొమ్ము చేసుకుంటున్నారని రాసింది. అనేక కారణాలతో ప్రపంచ రాజకీయాల్లో చైనాకు పోటీగా నిలబెట్టేందుకు తన జాతీయ ప్రయోజనాల రీత్యా అమెరికా ప్రభుత్వం నరేంద్రమోడీ గురించి బహిరంగంగా మాట్లాడటం లేదని అమెరికా విశ్లేషకుడు మార్కే అన్న మాటలను న్యూయార్క్‌ టైమ్స్‌ ఉటంకించింది.మోడీని విమర్శించటం అమెరికాలో ఉన్న భారత సంతతితో వివాదం తెచ్చుకోవటమే అవుతుందని, తమకు వ్యతిరేకంగా మారవచ్చని అమెరికా రాజకీయవేత్తలు భావిస్తున్నారని కూడా మార్కే అన్నాడు.మోడీ అంతర్గత రాజకీయాలతో తమ ప్రభుత్వం ఇబ్బంది పడుతున్నదని ఎంతకాలం పాటు భారత్‌ను విశ్వసిస్తుందన్నదే ప్రశ్న అని కూడా చెప్పాడు.

మోడీ ప్రసంగాల గురించి అంతర్జాతీయ ఎపి ఇచ్చిన వార్తను ప్రపంచ పత్రికలన్నీ ప్రచురించాయి, టీవీలలో చెప్పారు. మనదేశంలోని ముస్లింలు, హిందువులందరి జన్యువులు ఒకటేనని ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు గతంలో సెలవిచ్చారు.వసుధైక కుటుంబమని చెబుతారు.కుట్రతో విభజించారని అఖండ భారత్‌ను ఏర్పాటు చేస్తామని చెబుతారు. మరి నరేంద్రమోడీ ముస్లింలను చొరబాటుదారులని ఎలా వర్ణించారు? సాధారణ పరిస్థితుల్లో అక్రమంగా వచ్చిన వారిని అలా వర్ణిస్తారు, అంత్యరుద్దాలు, ఇతర విపత్తులు తలెత్తినపుడు వచ్చేవారిని చొరబాటుదారులు అంటారా ? శ్రీలంకలో ఉగ్రవాదుల దాడులు, ప్రభుత్వ ప్రతిదాడులు సమయంలో అనేక మంది అక్కడి తమిళులు మనదేశానికి ఆశ్రితులుగా వచ్చారు. వారిని చొరబాటుదారులుగా వర్ణించే ధైర్యం నరేంద్రమోడీకి ఉందా ? ఆ మాటకు వస్తే మన పూర్వీకులందరూ ఆఫ్రికా, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారే, రాజులు, రాజ్యాలు, సరిహద్దులు లేనపుడు జీవన పోరులో ఎక్కడో ఒక చోట స్థిరపడ్డారు. అంటే మోడీ భాష్యం ప్రకారం అందరూ చొరబాటుదారులే.