Tags

, , , , , , , , , ,


ఎం కోటేశ్వరరావు


ఇరుగు పొరుగుదేశాలతో వివాదాలు ఉన్నపుడు అధికారంలో ఉన్నవారు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.బిజెపి నేతలు, వారిని నడిపించే సంఘపరివార్‌ సంస్థలకు చెందిన వారు నిరంతరం తమకు అనుకూలంగా ఏదో ఒక వివాదాన్ని ముందుకు తీసుకువస్తున్నారు. ఉదాహరణకు గతంలో భారత్‌-శ్రీలంక మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కచ్చాతీవు దీవిని శ్రీలంకకు అప్పగించారు. దాన్ని డిఎంకె, కాంగ్రెస్‌ మీద వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు బిజెపి ఎన్నికల సందర్భంగా ముందుకు తెచ్చింది. ఆ దీవిని వెనక్కు తీసుకొనేందుకు పదేండ్ల పాటు అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ఏమైనా చేశారా ? పోనీ ఇప్పుడేదైనా కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారా అంటే అదీ లేదు. ఇదే నరేంద్రమోడీ అధికారానికి వచ్చిన తరువాత ఎవరివో నిర్ధారణగాని ప్రాంతాలపై బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకున్నారు. 2015లో కుదుర్చుకున్న అవగాహన మేరకు 17,160 ఎకరాల విస్తీర్ణం ఉన్న లంకలు, ప్రాంతాలను బంగ్లాదేశ్‌కు అప్పగించి,7,110 ఎకరాలను మనదేశం తీసుకున్నది. దీని గురించి మాత్రం బిజెపి, మోడీ మాట్లాడరు. కచ్చాతీవు గురించి తమను విమర్శించినందుకు కాంగ్రెస్‌ ఈ అంశాన్ని ప్రస్తావించి ఈ నిర్వాకం సంగతేమిటని నిలదీసింది. ఈ రెండు ఉదంతాలు చెబుతున్న పాఠమేమిటి ? ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ఇరుగు పొరుగుదేశాలతో ఇచ్చిపుచ్చుకొనే పద్దతిలో వివాదాలను పరిష్కారం చేసుకోవాలనే కదా ?


ఇక మరొక పొరుగుదేశమైన చైనా వ్యతిరేకతను కాషాయదళాలు రెచ్చగొడుతూనే ఉన్నప్పటికీ కీలక సమయాల్లో నరేంద్రమోడీ ఆచితూచి మాట్లాడుతున్నారు.కొత్తగా మన భూభాగాన్ని చైనా ఆక్రమించలేదు అని గాల్వన్‌ ఉదంత సమయంలో చేసిన ప్రకటన వాటిలో ఒకటి. తాజాగా అమెరికా పత్రిక న్యూస్‌వీక్‌తో మాట్లాడిన అంశాలు ఆలోచింపచేసేవిగా ఉన్నట్లు చైనా పత్రిక గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. రెండు దేశాల మధ్య సంబంధాల గురించి నరేంద్రమోడీ మృదుస్వరంతో మాట్లాడినట్లుందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్‌ ప్రారంభవాక్యాలతోనే తన విశ్లేషణ ప్రారంభించింది.మోడీ అశక్తత, పిరికితనం కనిపించిందని, గాల్వన్‌ ఉదంతంలో ప్రాణాలు అర్పించిన వారికి అవమానకరంగా ఉన్నట్లు కాంగ్రెస్‌ వర్ణించింది. ఇంతకీ నరేంద్రమోడీ ఏం చెప్పారు ? సరిహద్దుల్లో దీర్ఘకాలంగా సాగుతున్న పరిస్థితి మీద తక్షణమే మాట్లాడుకోవాల్సి ఉందని, తద్వారా రెండు దేశాల మధ్య ఉన్న అసాధారణతను వెనక్కు నెట్టవచ్చని, స్థిరమైన,శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలకే కాదు మొత్తం ప్రాంతానికి ముఖ్యమని నరేంద్రమోడీ చెప్పారు. దౌత్య రంగం, మిలిటరీ అధికారులు అప్పుడప్పుడూ రెండు దేశాల మధ్య సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్నిసార్లు మృదువుగా కొన్ని సార్లు కఠినంగా ఉన్నాయని, అయితే మోడీ నేరుగా చెప్పిన మాటలు ప్రత్యేకించి స్పష్టమైన వైఖరి వెల్లడించటం అసాధారణం, సమయాన్ని జాగ్రత్తగా ఎంచుకున్నారని, సానుకూల సంకేతాలు పంపారని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొన్నది. భారత్‌-చైనా సంబంధాలను బలహీనపరచాలని చూస్తున్న అమెరికాలో కొందరికి మోడీ మాటలు అంత వినసొంపుగా ఉండకపోవచ్చని కూడా చైనా పత్రిక పేర్కొన్నది.రెండు దేశాలను ఘర్షణ దిశగా తీసుకుపోవాలని అమెరికా చూస్తున్నదని కూడా చెప్పింది.


అరుణాచల్‌ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాలకు చైనా లిపిలో-టిబెటన్‌ పేర్లు ఖరారు చేస్తూ మూడవ జాబితాను ఇటీవల చైనా విడుదల చేసింది.అరుణాచల్‌ను టిబెట్‌లోని జాంగ్‌నాన్‌ ప్రాంతంగా చైనా పరిగణిస్తున్నది. ఒక దగ్గర స్విచ్‌ వేస్తే మరోదగ్గర లైటు వెలిగినట్లుగా అంతర్జాతీయ రాజకీయాల్లో దాదాపు అన్ని సందర్భాల్లో లైటు వెలగటమే కనిపిస్తుంది గానీ స్విచ్‌ ఎక్కడుంది, ఎవరు, ఎందుకు వేశారన్నది అంతగా తెలియదు. జపాన్‌ తదితర దేశాల ప్రతినిధులు పరిశీలకులుగా అమెరికా, ఇతరదేశాలతో కలసి పశ్చిమబెంగాల్లోని కలైకుండ వైమానిక స్థావరంలో ఏప్రిల్‌ 11-23వ తేదీలలో మనదేశం వైమానిక యుద్ధ విన్యాసాలు జరపటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు హెచ్చరిస్తూ అరుణాచల్‌ ప్రదేశ్‌లో పేర్ల జాబితాను చైనా విడుదల చేసిందని డిప్లొమాట్‌ పత్రిక సంపాదకులలో ఒకరైన సుధా రామచంద్రన్‌ పేర్కొన్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమ టిబెట్‌లో అంతర్భాగమని చైనా వాదిస్తున్నది. అందువల్లనే సందర్భం వచ్చినపుడల్లా తమ ప్రాంతమే అని చైనా బహిరంగంగా చెబుతున్నది.ఇప్పుడు జరుగుతున్న విన్యాసాలను చైనా తీవ్రంగా పరిగణిస్తున్నదని అంతర్జాతీయ మీడియాలో విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచంలో ఆధునిక యుద్ద విమానాలు, ఇతర వ్యవస్థలను రప్పించి తరంగశక్తి తొలి దశ పేరుతో ఆగస్టులో మరోసారి తొలిసారిగా విన్యాసాలు జరపనున్నారు. ఈ విన్యాసాలలో చైనా, రష్యాలను వ్యతిరేకించేదేశాలే భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికా, జర్మనీ,ఫ్రాన్స్‌,ఆస్ట్రేలియా తదితర దేశాల వైమానిక దళాలు పాల్గొంటాయి. సహజంగానే ఇలాంటి విన్యాసాలు తనను ఉద్దేశించి జరుపుతున్నట్లు భావించే ఏ దేశమైనా తనదైన శైలిలో స్పందిస్తుంది.


చైనా తాజాగా ప్రకటించిన 30 పేర్ల గురించి గతంలో మాదిరే మనదేశం స్పందించింది.మన ప్రాంతాలకు మరొక దేశం తన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వారి ప్రాంతాలవుతాయా, వాస్తవాలను మారుస్తాయా అంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.మనదేశంలో మీడియా మరోసారి తీవ్రంగా స్పందించింది. రేటింగ్స్‌ను పెంచుకొనేందుకు టీవీ ఛానళ్లు చూశాయి.రెండవ సారి 2017లో పేర్లు పెట్టిన వాటిలో రెండు నివాసిత ప్రాంతాలు, ఐదు పర్వతాలు, రెండు నదులు, మరో రెండు ప్రాంతాలు ఉన్నాయి. మరో 15 ప్రాంతాలకు 2021లో చైనా పేర్లు పెట్టింది.తమవి అని చెప్పుకుంటున్న వివాదాస్పద ప్రాంతాలకు ఏ దేశమైనా తన పేర్లు పెట్టుకోవటం కొత్తదేమీ కాదు. ప్రస్తుతం చైనా ఏలుబడిలో ఉన్న ఆక్సారు చిన్‌ ప్రాంతం ఉంది. అది మనదే అని మన ప్రభుత్వం చెబుతుంది. దాన్ని లడఖ్‌ ప్రాంతంలోని లే జిల్లాగా పిలుస్తారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ మీద ఉన్న వివాదం కూడా అలాంటిదే. దాన్ని చైనా వారు జింగ్‌నాన్‌ అనే పేరుతో వ్యవహరిస్తారు.మన పురాణాల్లో మానస సరోవరంగా పిలిచే సరస్సు చైనాలోని టిబెట్‌లో ఉంది. అక్కడ దాని పేరు మాపాంగ్‌ యంగ్‌.


రెండు దేశాల మధ్య లడఖ్‌, అరుణాచల్‌ ప్రాంతాలపై వివాదం ఉంది. దాన్ని బ్రిటీష్‌ వారు సృష్టించారు.మన దేశం బ్రిటీష్‌ వారి నుంచి 1947లో స్వాతంత్య్రం పొందింది. మనదేశం మాదిరి చైనాను బ్రిటన్‌ పూర్తిగా ఆక్రమించలేకపోయింది. వివిధ ప్రాంతాలలోని యుద్ధ ప్రభువులు బలంగా ఉండటంతో అమెరికాతో సహా ఐరోపా దేశాలన్నీ తమకు కావాల్సిన వాణిజ్యం మీద వివిధ ఒప్పందాలను చేసుకున్నాయి తప్ప వారి పాలనను రుద్దలేకపోయాయి. అయితే చైనా వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. నదులు, రేవులు, వాణిజ్యాలపై అనేక హక్కులను పొందారు. హంకాంగ్‌ దీవులను 99 సంవత్సరాలకు బ్రిటీష్‌ వారు కౌలుకు తీసుకున్నారు. అలాగే మకావో దీవులను పోర్సుగీసు వారు కౌలుకు తీసుకున్నారు. పేరుకు దేశం క్వింగ్‌ రాజరిక పాలనలో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీద అదుపులేదు. యుద్ద ప్రభువులు పెత్తనం చెలాయించేవారు. వారి మధ్య ఉన్న విబేధాలను విదేశాలు ఉపయోగించుకున్నాయి. ఈ నేపధ్యంలో ఎనిమిది దేశాల కూటమి క్వింగ్‌ వంశ రాజు మీద అనేక ఒప్పందాలను రుద్దింది.దేశాన్ని కుక్కలు చింపిన విస్తరిమాదిరి చేశారు. దాంతో దేశభక్తులు రాజరికాన్ని కూలదోసి రిపబ్లిక్‌ను ఏర్పాటు చేసేందుకు ఉద్యమం సాగించిన ఫలితంగా 1911లో చైనా రాజరికం నుంచి రిపబ్లిక్‌గా మారింది. మనకు జాతిపితగా మహాత్మాగాంధీ ఎలాగో చైనాలో సన్‌ ఏట్‌ సేన్‌ దానికి నాయకత్వం వహించాడు. అధికారం వచ్చిన తరువాత యుద్ధ ప్రభువులు కేంద్ర ప్రభుత్వ పెత్తనాన్ని అంగీకరించకుండా తిరుగుబాటు, కుట్రలకు పాల్పడ్డారు.1949లో కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తరువాతే ఒకే ప్రభుత్వ ఏలుబడిలోకి చైనా వచ్చింది. సామంత రాజ్యంగా ఉన్న టిబెట్‌ను రెచ్చగొట్టి స్వతంత్రదేశంగా మార్చి తమ స్థావరంగా చేసుకోవాలని చూసిన బ్రిటన్‌, తరువాత అమెరికా జరిపిన కుట్రల కారణంగా టిబెట్‌ పాలకుడిగా ఉన్న దలైలామా తిరుగుబాటు,మనదేశానికి పారిపోయి రావటం తెలిసిందే.


మన ప్రభుత్వ సాయంతో హిమచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాసంలో ఉన్న 88 సంవత్సరాల పద్నాలుగవ దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతం టిబెట్‌లో అంతర్భాగమే అని 2003లో చెప్పాడు. తరువాత వైఖరి మార్చుకున్నాడు.బ్రిటీష్‌ అధికారి మెక్‌మోహన్‌ గీసిన సరిహద్దు రేఖ ప్రకారం భారత్‌లో అంతర్భాగమే అని మాట మార్చాడు. మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా 1914లోనే బ్రిటన్‌-టిబెట్‌ గుర్తించాయనే వాదనను ముందుకు తెచ్చాడు. అయితే ఆ ఒప్పందాన్ని చైనా ప్రభుత్వం అంగీకరిస్తేనే అమల్లోకి వస్తుందనే అంశం ఉంది. సదరు ఒప్పందాన్ని చైనా గుర్తించలేదు. ఒక సామంత ప్రాంతానికి విదేశాలతో ఒప్పందం చేసుకొనే హక్కులేదు.ఆక్సారుచిన్‌ ప్రాంతాన్ని కూడా బ్రిటీష్‌ అధికారులు నిర్దిష్టంగా గుర్తించకపోవటంతో అది కూడా వివాదాస్పద ప్రాంతంగా మారింది. వారి గీతలు ఎలా ఉన్నప్పటికీ స్వాతంత్య్రం వచ్చేనాటికి అరుణాచల్‌ప్రదేశ్‌ మన పాలనలో, ఆక్సారుచిన్‌ చైనా ఏలుబడిలో ఉంది. మనం దీని గురించి అడిగితే వారు దాని సంగతేమిటని ప్రస్తావిస్తున్నారు.1962లో రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చినపుడు చైనా సైన్యాలు అరుణాచల్‌ను దాటి నేటి అసోంలోని తేజ్‌పూర్‌ వరకు వచ్చాయి. తరువాత వెనక్కుపోయి, వాస్తవాధీనరేఖకు అవతల గతంలో మాదిరే ఉన్నాయి. తమ మీద తిరుగుబాటు చేసిన దలైలామాకు మనదేశం ఆశ్రయం ఇవ్వటాన్ని చైనా వ్యతిరేకిస్తున్నది.2017లో దలైలామా అరుణాచల్‌ ప్రదేశ్‌లో వారం రోజుల పర్యటనను చైనా వ్యతిరేకించింది. అతడిని ఆపకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని చైనా పత్రికల్లో వార్తలు వచ్చాయి. దలైలామా పర్యటన తరువాత తొలిసారిగా కొన్ని ప్రాంతాలకు తమ పేర్లను చైనా ప్రకటించింది. ఆ తరువాతే 73రోజుల పాటు డోక్లామ్‌ ప్రతిష్ఠంభన కొనసాగింది.తరువాత 2021లో మరోసారి కొన్ని ప్రాంతాలకు పేర్లు ప్రకటించింది.


టిబెట్‌ను చైనా అంతర్భాగమని మనదేశం గుర్తించింది, కానీ అదే సమయంలో మానవతాకారణాలను సాకుగా చూపి తిరుగుబాటు చేసిన దలైలామాకు ఆశ్రయం కల్పించటం,ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అనుమతించింది. రెండు దేశాల మధ్య తెగని వివాదాల్లో ఇదొకటి.తమ వ్యతిరేకశక్తులకు భారత్‌ ఆశ్రయమిస్తున్నదని చైనా విమర్శిస్తున్నది.చైనాతో ఉన్న వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని అవిభక్త కమ్యూనిస్టు పార్టీలో ఉన్ననేతలు(తరువాత వారు సిపిఎంగా ఏర్పడ్డారు) కొందరు 1962లో కోరినందుకు వారిని దేశద్రోహులుగా, చైనా ఏజంట్లుగా చిత్రించి జైలుపాలు చేశారు. తరువాత అదే కాంగ్రెస్‌ పాలకులు చైనాతో వివాదాన్ని కొనసాగిస్తూనే సాధారణ సంబంధాలను నెలకొల్పుకున్నారు.వర్తమానంలో నరేంద్రమోడీ గత ప్రధానులెవరూ కలవనన్ని సార్లు చైనా నేతలతో భేటీలు జరిపి రికార్డు సృష్టించారు.గాల్వన్‌లోయ ఉదంతాలకు ముందు ఇరుదేశాల నేతలు కలసి ఉయ్యాలలూగటాన్ని ఊహాన్‌, మహాబలిపురం నగరాల్లో చూశాము.ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వెనుక భారత్‌ భుజం మీద తుపాకి పెట్టి అమెరికన్లు తమను కాల్చాలని చూస్తున్నట్లు చైనా అనుమానిస్తుండటం ఒక కారణం. అరుణాచల్‌ భారత్‌లో అంతర్భాగంగా తాము గుర్తిస్తున్నట్లు 2024 మార్చినెల తొమ్మిదవ తేదీన అమెరికా ఒక ప్రకటన చేసింది. వివాదాన్ని పెంచటానికి గాకపోతే ఇరుదేశాలకు సంబంధించిన అంశాల మీద దానికి సంబంధం ఏమిటి ? పాక్‌ ఆక్రమిత కాశ్మీరును భారత్‌ అంతర్భాగంగా గుర్తిస్తున్నట్లు అమెరికా ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. ఎందుకని ? అదే అమెరికా ఆడుతున్న రాజకీయం,అలా ప్రకటిస్తే పాకిస్తాన్‌ ఎక్కడ చైనాకు మరింత దగ్గర అవుతుందేమో అన్నదే దాని భయం.మన స్వతంత్ర విదేశాంగ విధానం ప్రకారం వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప అమెరికా వలలో చిక్కుకొని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దన్నదే అనేక మంది చెబుతున్నమాట.