Tags

,

42 సంవత్సరాల తరువాత దర్యాప్తు

ప్రఖ్యాత చిలీ కవి, 1973లో మరణించిన పాబ్లో నెరూడా కాన్సర్‌ లేదా సహజమరణం పాలయ్యారని ఇంత వరకు అనుకుంటున్నది వాస్తవం కాదా? సాల్వెడార్‌ అలెండీని అంతమొందించిన నియంత పినోచెట్‌ నెరూడాను కూడా హత్య చేయించారా? తాజాగా వెలువడిన సమాచారం ప్రకారం ఇంకా నిర్ధారణ కానప్పటికీ అవుననే చెబుతున్నది. గతంలో బయటకు రాని ఒక పత్రంలోని సమాచారం కొత్త సమాచారాన్ని వెల్లడిస్తున్నది. బహుశాను నెరూడా హత్యకు గురై వుంటారని చిలీ ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.

ఎల్‌ పాయిస్‌ అనే ఒక పత్రిక ఆ పత్రాన్ని సంపాదించింది. దానిలోని అంశాలను నిర్ధారించాల్సిందిగా ప్రభుత్వ హోంశాఖను కోరింది. 1973లో నెరూమరణానికి మూడవ పక్షం కారణమై వుండవచ్చని ప్రభుత్వం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.నెరూడా మరణంపై లోతైన దర్యాప్తు ఫలితంగా ఆ పత్రం లభ్యమైనట్లు ఆ పత్రిక పేర్కొన్నది. పత్రం నిజమేనని, దర్యాప్తుచేస్తున్న బృందం వివాదాస్పద మరణంపై అంతిమ నిర్ణయానికి రావలసి వుందని ప్రభుత్వం పేర్కొన్నది. కమ్యూనిస్టు పార్టీ భాగస్వామిగా వున్న వామపక్ష ప్రభుత్వం 42 సంవత్సరాల తరువాత రాజకీయ కారణాలతో నెరూడాను హత్య చేసి వుంటారన్న వూహాగానాలు సంవత్సరాలుగా వెలువడుతుండటంతో ఈ ఏడాది ప్రారంభంలో నెరూడా హత్య కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించింది. ఇదే కారణాలతో 2013లో నెరూడా అవశేషాలను మరోసారి పరీక్షించింది.

కమ్యూనిస్టు, కవి అయిన నెరూడా నియంతల కుట్రకు బలైన చిలీ కమ్యూనిస్టు అధ్యక్షుడు సాల్వెడార్‌ అలెండీ మద్దతుదారు. అలెండీని చంపివేసిన కొద్ది వారాల తరువాత అనుమానాస్పద స్ధితిలో నెరూడా మరణించారు. 1924లో 19 సంవత్సరాల వయస్సులో ఆయన ప్రఖ్యాత ‘సాంగ్‌ ఆఫ్‌ డెస్‌ఫెయిర్‌’ ఇతర కవితలను రాశారు. సాహిత్యంలో ఆయనకు 1971లో నోబెల్‌ బహుమతి వచ్చింది. నెరూడా కమ్యూనిస్టు పార్టీ పార్లమెంట్‌ సభ్యుడిగా, మరణించే ముందు ఫ్రాన్స్‌లో చిలీ రాయబారిగా పనిచేశారు. 1948లో కమ్యూనిస్టుపార్టీపై నిషేధం విధించిన సమయంలో ఆయన కొంతకాలం అజ్ఞాతవాసం గడిపారు.